చిత్రలిపి

అగమ్య గమ్యం !

-మన్నెం శారద

ఆ అడవిదారిలో  ఎందుకు అడుగులువేసానో  
నాకయితే తెలియదు కానీ ……
ఇంత పత్రి తెచ్చాను   
వినాయక చవితని !
 
పాములూ తేళ్ళుంటాయి,,,వళ్లు తెలియదా 
 
అంటూనే తీసుకుని  పూజ చేసింది అమ్మ !
 
మళ్ళీ అటెనడిచాను  మరేదో కావాలని ….
బయలంతా  పసుపు పారబోసినట్లు
 
విరబూసిన తంగేడు పూలని చూసి 
మనసు మురిసి  వడినిండా కోసుకుని వచ్చి 
వరండా లో పోసాను 
 
పిచ్చిపూలన్నీ కోసుకొస్తావ్  ,పనిలేదు నీకంటూ 
పచ్చదనాన్నంతా ఊడ్చేసింది అక్క !
 
పెదనాన్నతో నర్సి పట్నం పోయి 
అడవిలోదూరి  సెలయేటిలో చేపలు పడుతూనే 
ఇదేం పనని  కోప్పడి ఎత్తుకు పోయాడు  ఆర్దర్లీ !
 
సీలేరు .చింతపల్లి నన్ను మోహపెట్టి 
లోపలికంటా తీసుకుపోయాయి కానీ 
అందుకోవాల్సిందేదో  అందనే లేదు .
 
మళ్ళీ మళ్ళీ అటుకేసే నడుస్తున్న నన్ను చూసి 
కొందరు ముందేమీ దారిలేదంటూ  మూతులు విరిచారు .
 
వెనక్కుతిరుగంటూ సైగలు చేశారు 
చీకటి మూసుకొస్తున్నది !
అడవి చిక్కబడుతున్నది 
 
అక్కడే కూలబడ్డాను  కాసేపు !
ఏదో ఉందని  మనసు చెబుతోంది పదే పదే …..
 
అడుగులు ముందుకే సాగాయి 
వెలుగేదో గోచరించింది !
వెలిసిందొక ఆలయం …
 
గమ్యమేదో సాక్షాత్కరించింది
  వెనుకేదో అడుగులసవ్వడి !
 
నలుగురు నా వెనుక  !
బాట ఇప్పుడు విశాలమయ్యింది . ! 
 
!ముందు నేను …… దివ్వెను వెలిగించి దారి చూపిస్తూ ………

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.