కథా మధురం
రాధ మండువ
‘ప్రేమించడం స్త్రీ బలహీనత కాదు..’అని చాటి చెప్పిన కథ ‘అంతర్మధనం’
-ఆర్.దమయంతి
స్త్రీ – మగాణ్ని ఎందుకు ప్రేమిస్తుంది? అనే ప్రశ్నకు జవాబు దొరకొచ్చేమో! కానీ, ప్రేమించి ఎందుకు మోసపోతుంది? అనే ప్రశ్నకు మాత్రం..ఊహు. జవాబు వుండదు. జీవితం లో తిరిగి కోలుకోలేని ఆ అగాథ వ్యధ ఏమిటో ఆమెకి మాత్రమే తెలుస్తుంది.
ప్రేమ లో మోసపోవడం అనేది అన్నిరకాల బాధల్లాంటి బాధ కాదు. సన్నిహితుల ఓదార్పుతో ఊరడిల్లే నష్టం కాదిది. ఇంకా చెప్పాలీ అంటే, ప్రపంచ యుధ్ధం తర్వాత భీకర పరిస్థితిలా వుంటుంది ఆమె చుట్టూ పరచుకున్న విషాదం ..అంత భయానకం గా వుంటుంది. మరి అంతే కదా! తన ప్రపంచం అనుకున్నఅతనొక మోసగాడని తెలిసాక.. బ్రతుకు మరుభూమి కాక మరేమౌతుందని? – మనిషి మీద నమ్మకం, ప్రేమలో గెలుపు పోయాక, ఎవరికైనా జీవితం శూన్యమై మిగులుతుంది.
ప్రపంచాన్ని జయించగల శక్తి సామర్ధ్యాలు గల స్త్రీ – ఒక మగాణ్ణి ప్రేమించి ఇంత దారుణం గా ఎందుకు మోసపోతుంది? ఉన్నత చదువులు, హై క్వాలిఫికేషన్స్ ఎందుకని అడ్డుకోలేకపోతున్నాయి? అని ప్రశ్నిస్తారు. నిజానికి – చదువు అనేది – జీవన భృతికోసం ఉద్యోగం సంపాదించడంలో గల పోటీని తట్టుకోడానికి మాత్రమే పనికొస్తుంది కానీ, మోసపూరిత ప్రేమలను పసిగట్టడానికి కానీ, దాడుల్ని ఎదుర్కోడానికి బహుశా!వినియోగపడదేమో !
అదేంటో! విశ్వ వ్యాప్తం గా ఇన్ని రకాల భాషలున్నా, ‘ప్రేమ లో ఇలా మోసపోకండి..’ అని బోధించడానికి ఏ ఒక్క భాషలోనూ పాఠాలు లేవు. ఎందుకంటే ప్రేమ అనేది ఎవరిమీద ఎవరికి ఎప్పుడు ఎలా జనియిస్తుందో, ఎలా పెరిగి పెరిగి వికసిస్తుందో..వికటిస్తుందో.. ఎవరికీ తెలీని ఓ రహస్యం.
అయితే, ప్రేమించడం నేరమూ కాదు, బలహీనత అంతకంటేనూ కాదు. అందుకని, జీవితాన్ని బలిపెట్టడం సమంజసమూ కాదు. మరి పరిష్కారం ఏమిటి?
ప్రేమ పేరుతో మగాళ్ళు విసిరే మాయాజాలం చిక్కకుండా, పరిస్థితులు దారుణం గా మారకుండా స్త్రీలు తమ జీవితాలను మరో వెలుగు మలుపులోకి మలచుకోవడం చాలా అవసరం మరి అదెలా సాధ్యపడుతుంది?
అది తెలియాలంటే – నవ్యకథాశిల్పి శ్రీమతి రాధ మండువ గారి ‘అంతర్మథనం’ చదవి తెలుసుకోవాలి.
ఇంతకీ అసలు కథేమిటంటే :
పేరుకు తగినట్టే పౌర్ణమి అందగత్తె. ఒక సారి చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత అందం ఆమె సొంతం. చందమామ లాటి యువతి. కాని చందమామలో మచ్చ లానే..ఆమె లోనూ కొట్టొచ్చే లోపం ఒకటుంది. అదేమిటంటే – అవిటి కాలు. ఇంత అందాన్ని చూసి పరవశించే మగాళ్ళు ఆ కుంటి కాలు చూడగానే నీరుగారిపోతారు. ఆ సంగతి ఆమెకి బాగా తెలుసు. అందుకే ఆమెకి మగాళ్ల మీద ఎలాటి ఆశలూ వుండవు.
కానీ తను కొత్తగా చేరిన బాంక్ బ్రాంచ్ మానేజర్ మాత్రం అలా కాదు. ప్రత్యేకం. ‘నన్ను నన్ను గా ప్రేమిస్తున్నాడు ..’ అని నిర్ధారించుకున్నాకే ఆమె లో సన్నటి అలజడి మొదలౌతుంది. సరిగ్గా అప్పుడే ఆమెకో చేదు నిజం తెలుస్తుంది. అతను వివాహితుడనీ, ఇద్దరి పిల్లల తండ్రి కూడా అని. ఊహల ఊయలలో ఊరేగుతున్న ఆమె అమాంతం ఒక్కసారిగా జారి పడిపోయి, కూలబడిపోతుంది. వొద్దన్నా కన్నీళ్ళే..కలలు విరిగి, గుండె పగిలిన చప్పుడు ఎంత భయంకరం గా వుంటుందో!
అతనికి దూరంగా పారిపోలేని బలహీనత.. దగ్గరకి జరగలేలేని నిస్సహాయత ఇలా సంఘర్షణలో కొట్టుమిట్టాడుతుంటుంది. సరిగ్గా ఈ బలహీన క్షణాలు చాలు..ఏ మగాడికైనా ఆమెని తనకనుకూలంగా మార్చుకుని వాంఛని తీర్చుకోడానికి. అందుకే ఆమెని దువ్వుతాడు మాయ మాటలతో.
అవిటి తనం ఆమె శరీరానికే కానీ, కోర్కెలకు కాదు కదా..అతని మాటలూ సబబు గానే తోచాయి. నిజమని పూర్తిగా నమ్మింది. నమ్మించ గలిగిన వాడే మోసం చేయగలడు మరి.
ప్రేమ ఒక టాక్సిన్ లాటిది. ఒక బలమైన మోహాతి మోహపు క్షణం ఏమనిపిస్తుందంటే.. జీవితం ఏమైపోనీ, ఈ కొన్ని క్షణాలు చాలు..అనేంత ఉద్రేకోద్వేగాన్ని రగిలిస్తుంది.
అలాటి ఒకానొక ఉప్పెనలాటి భావోద్వేగ క్షణాల్లో ఆమె అతనికి ఒంటరిగా చిక్కుతుంది. వొదులుతాడా ? ఆ ఆవకాశాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆమెని పూర్తిగా ఆక్రమించే ప్రయత్నం లో..ఏమైందంటే..!!..
ఆ తర్వాత కథ ఏమైందీ తెలుసుకోవాలంటే ‘అంతర్మథనం ‘చదవాల్సిందే!
****
కథలో ని స్త్రీ పాత్రలు – స్వరూప స్వభావాలు :
పౌర్ణమి: ఈ కథలో ప్రథాన పాత్రధారిణి. కథానాయిక. తాను అందగత్తెనని ఆమెకు తెలుసు. కానీ ఆ అందం సామాన్యమైనది కాదు, సూదంటు రాయి అని ఎప్పుడు తెలుస్తుందంటే..తనని చూడగానే మగాళ్ళ కళ్ళు తన మీద అతుక్కుపోతున్నప్పుడు..ఆ కళ్ళల్లో ఆరాధన ఒక్క వెలుగ్గా వెలిగిపోతున్నప్పుడు..ఆమెకి చాలా గర్వమేసిపోతుంది. ‘ఆడదాన్నై పుట్టినందుకు ఈ ఒక్క విజయం చాలు ‘ అనుకునే చాలా మంది ఆడపిల్లలానే పౌర్ణమి కూడా. ఆమెకా క్షణం లో ఆకాశాన్ని జయించినంత ఆనందమేస్తుంది. కాని, మరుక్షణం లోనే అది విరిగిన కెరటమౌతుంది. – ఆమె కుంటిదని తెలిసిన క్షణానే వారి కళ్లల్లోని ఆరాధన పూర్తిగామాయమై పోయి, దాని స్థానే నిరాసక్త త, నిర్లిప్తతలతో నిండిపోతాయి. అది చూసినప్పుడు పట్టరాని అవమానంతో, సిగ్గుతో ఆమె తల కిందకి వాలిపోతుంది.
‘ అమ్మాయిలూ! మీ బాహ్యసౌందర్యాన్ని కంటే ఆత్మ సౌందర్యాన్ని ఆరాధించే మగాళ్ళని మాత్రమే నమ్మండి ‘ అనే నిజాన్ని చాటి చెబుతుంది పౌర్ణమి.
ఆమె అలా ఎన్నోసార్లు అవమానాలకు గురి అవుతుంది.
స్త్రీలు మానసికంగా ఎదుర్కొనే ఘోరావమానాలు ఎలా వుంటాయంటే..మొదట్లో కటిక చేదు మాత్ర లా మింగుడు పడవు! కానీ రోజూ వున్నవే అవైనప్పుడు..క్రమేణా ఆ చేదే అలవాటైపోతుంది. ఎంతలా అంటే, అసలు చేదు అన్నదే తెలీదన్నంత లా. పౌర్ణమి పరిస్థితి అంతే.
జీవితం ఒక అనుభవాల ప్రయోగ శాల. ఆమె ఎన్ని పాఠాలు నేర్చిందో! చివరికొక సత్యాన్ని అయితే కనుగొంది. తన జీవన పరిసమాప్తి కాలం లో ఆమెని ఆమె గా గా ప్రేమించే మగాడు అంటూ వుండడని!
‘Some people are severely lonely, all they can do is accept the single life as an example of being free and happy. ‘ అని అంటాడు ఓ రైటర్.
స్త్రీలకి తమ ఎబిలిటీస్ ఏమిటో పూర్తిగా తెలుసుకోగలరు. తమ స్థితిగతులను అర్ధం చేసుకుని ఆ దిశ గా ప్రయాణాన్ని సాగిస్తారు. అందుకే వాళ్ళు స్థిర మనస్కులు. పరిస్థితులకనుగుణం గా జీవితాన్ని మలచుకోగల సమర్ధులు. అందుకు నిదర్శనం గా పౌర్ణమి మన కళ్ళముందు నిలుస్తుంది.
పౌర్ణమి కలల రాణి కాదు. వెరీ ప్రాక్టికల్ ప ర్సన్ అని చెప్పాలి. అందుకే ఆమె ఏమని డిక్లేర్ చేస్తుందంటే..తనని పెళ్ళి చేసుకుంటానని ఎవరు ముందుకొచ్చినా , అతడు తన సంపాదనకి ఆశపడే కానీ తన మీద ప్రేమతో కాదని, గట్టిగా తేల్చి చెప్పేస్తుంది.
మనమూ వింటుంటాం అక్కడక్కడ.. ‘అమ్మాయి కి కాలు వంకరన్న మాటే కానీ రంభ లా వుంటుంది. పైగా యాభై వేల పై చిలుకు జీతం..బంగారం లాటి అవకాశం ఆలోచించుకో..’ అంటూ వరుణ్ణి ప్రలోభ పెడుతుంటారు..
‘సరే..’ అంటూ అయిష్టంగా నే ఒప్పుకోవచ్చు అతను. కానీ పౌర్ణమి మాత్రం కాంప్రమైజ్ కాదు. ‘నువ్వొద్దు.’ అని ఖచ్చితం గా చెప్పేయగల ధీరు రాలు. ఆత్మాభిమాని. ఆ మాత్రం క్లారిటీ లేకపోతే ఆడవాళ్ళు మనశ్శాంతిగా బ్రతకలేరని స్పష్టంగా నిర్ధారిస్తుంది పౌర్ణమి.
ఇష్టం లేని చోట ప్రేమ వుండదు. ప్రేమ లేని దాంపత్యమంత నరకం మరొకటి వుండదు అని ముందుగానే గ్రహించిన తెలివైన అమ్మాయి. ‘ఎలాగో అలా ఆ మూడు ముళ్ళు పడి, ఇద్దరు పిల్లలుపుడితే..చాలు జన్మలు ధన్యమైపోతాయి. శరీరాలకు ఏ అనుభూతులు లేకపోయినా..మనసులో ఎన్ని ద్వేషాలున్నా ‘కాపురం చేస్తోందా లేదా ? పిల్లలు పుట్టారా లేదా? అనే ఒకే ఒక్క పాయింట్ కావాలి లోకానికి.
ఇలాటి సూత్రానికి..అలాటి మంగళ సూత్రానికి తాను చచ్చేంత వ్యతిరేకినని గొప్ప ధైర్యం తో చాటిచెప్పిన ధీర వనిత పౌర్ణమి.
స్త్రీలు చదువుకునేది ఎందుకంటే అడుగడుగునా జీవితాన్ని విశ్లేషించుకుంటూ, ఆచి తూచి అడుగు ముందుకేయడానికే.. అనే కొటేషన్ కి అద్దం లా నిలుస్తుంది ఈ పాత్ర.
‘యవ్వన దశలో, అందునా అవిటి అమ్మాయికి ఇన్నేసి నిర్దేశక సూత్రాలకు అంతలా ఎలా కట్టుబడి వుందనే
‘ అని సందేహం కలగొచ్చు..కానీ ఆమె యవ్వనం లోకి అడుగుపెట్టినప్పట్నించి..ఇప్పటి దాకా ఎంతమంది మగాళ్ళ చూపులను, మాటలను, మనసులోని మతలబీ తనాలను (చవి) చూసిందో..చదివిందో! ఎన్ని సార్లు అవమానింపబడిందో అన్ని సార్లు అక్కడే కూలబడకుండా స్వయం శక్తితో..నిలబడిందో..!! ఎన్ని పుస్తకాలు చదివితే ఓ కొత్త వాక్య నిర్మాణం జరిగి దూరాన్ని చెరిపేసే వంతెన గా మారుతుందో! ఎన్ని ఉలి దెబ్బలకు శిల శిల్పం గా మారుతుందో.. ‘అలాగే ఈ పౌర్ణమి కూడా..’ అని అర్ధమౌతుంది పౌర్ణమిని చదివాకా!
అయితే, తన జీవితం లో అనుకోని మలుపుకొకటుందని కలలో కూడా ఆ కన్నె పిల్ల ఊహించలేదు. అసలా కళ్ళకి కలలుంటాయని కూడా తెలీని పౌర్ణమికి ఇప్పుడు కళ్ళ నిండా కలలే.
సన్నగా కోర్కెలు రాజుకోవడం, కునుకు పట్టని రాత్రిళ్ళు గడపడం అంటే ఏమిటో మెల్లమెల్లగా తెలిసొస్తాయని ఆమెకి అప్పటి దాకా తెలీదు. ఎప్పటి దాకా అంటె – తను కొత్త గా చేరిన బాంక్ లో బ్రాంచ్ మేనేజర్ శశిధర్ని చూసాక!
ఆమె అందం అతన్నిగాఢం గా ఆకర్షించిందని మొదటి చూపులోనే ఆమెకి తెలిసిపోయింది. శరీరాలను తడిమే మగాళ్ళ చూపులను స్త్రీలు చాలా సులువుగా చదివేయగలరు. ఎదుటి వాడు ఏ దృష్టి తో తనని చూస్తున్నాడన్న రహస్యాన్ని ఇట్టే కనిపెట్టేయగలరు. ఆ చాకచక్యం స్త్రీలకి మాత్రమే సొంతం. అది కాదు ఆమె సంబరపడిపోతున్న కారణం. తన కుంటితనం చూసాక కూడా అతని కళ్ళల్లో చెక్కుచెదరని అదే ఆరాధన కి ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది సంతోషంతో. ఈ ప్రపంచం లో ఏ ఆడదైనా – సముద్రమంత సంతోషం తో పరవశించిపోయే క్షణమంటూ ఒకటి వుంటుందంటే – అది ఖచ్చితం గా తొలి ప్రేమ లో పడిన మధురక్షణమే అని చెప్పాలి. అనే నిర్వచనానికి ఈ ప్రేమిక ఓ ఉదాహరణ.
అయితే పౌర్ణమి అతని ప్రేమలో అంత సులభం గా పడిపోలేదు. అతన్ని, అతని మాటల్ని, ముఖ్యంగా గా చూపుల్ని, నవ్వుల్ని, మర్యాదని..అబ్బో! చాలానే పరిశీలించింది. అన్నిట్లో నూ నెగ్గాడు. ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు. ‘నిన్ను నిన్ను గా ప్రేమిస్తున్నా ‘ అనే సందేశాన్ని అందుకున్నాకే ఆమె అతని పట్ల పూర్తిగా మొగ్గుతుంది. – ప్రేమ పుట్టాక, ఆవేశం తో కాకుండా, అర్ధవంతమైన పరిశీలనతో ముందడుగు వేయాలి..’ అనే జాగ్రత్త ని నేర్పుతుంది.
కన్నెపిల్ల ఊహల్లో – ప్రేమించిన వాని భోగభాగ్యాలు ఎంత అద్భుతం గా వుంటాయో వర్ణించి చెప్పేందుకు ఏ కావ్యాలూ లేవనిపిస్తుంది. మగాళ్ళకి ఈ సంగతి తెలీదు కానీ..కన్నెపిల్ల ఊహల్లో వరుడు కి ఏ స్థాయిలో పీట వేస్తారంటే ఆకాశమే హద్దు అన్నట్టు చెప్పాలి. మరి అదేం దౌర్భాగ్యమో.. ఆ స్థాయి నించి మెట్టు మెట్టు గా జారి జారి..చివరికి పాతాళం లో తేల్తున్నారు ( కొందరు ) మగాళ్ళు.
ఆమె ప్రస్తుతం అతని ప్రేమలో నిండా మునిగిపోయింది. ప్రేమ కాలం ఎంత అద్భుతం గా, సాగిపోతుందంటే తన పేరు సైతం తెలీదన్నంత మైకం లో రోజులు క్షణాల్లా గడిచిపోతుంటాయి. అమృతం తాగిన వాళ్ల లా వెర్రి ఆనందం లో నిత్యం తూగుతుంటారు ప్రేమికులు. అదోక అందమైన మైకం. లవ్ ఈజ్ లైక్ ఎ టాక్సిన్. ‘యూ ఆర్ మాజికల్..లిరికల్..బ్యూటిఫుల్..లవ్ ఈజ్ లైక్ ఎ లవ్ సాంగ్..’ అంటూ పాడుతోంది. తానొక దివ్య ఊహా ప్రపంచలో ఊగుతూ… !
సరిగ్గా అప్పుడే.. ఆమెకి అతని గురించిన అసలు నిజం తెలుస్తుంది. అతను పెళ్లైన వాడు అని. ఇద్దరు పిల్లలు కూడా అని.
వినంగానే షాక్ అవుతుంది. పాపం! ఆ లేత హృదయం వొణికిపోతుంది..ఇదేమిటి ఇంత పెద్ద బ్లండర్ చేసానూ అని.
ఆ! ఆ మాత్రం తెలుసుకోకుండానే ప్రేమించేస్తుందా? ఇకనైనా బుధ్ధి తెచ్చుకుంటుందా? చదువుకున్నది, అసిస్టెంట్ మానేజర్ ఉద్యోగాన్ని వెలగబెడుతోంది ఆ మాత్రం జ్ఞానం వుండదా? అని ఆడిపోసుకుంటుంది లోకం. కానీ, ఆడదాని చదువు, ఉద్యోగానుభవం, ఇంటెలిజెన్స్, వయసుతో నేర్చుకున్న అనుభవాలు అన్ని ఉఫ్ అంటూ ఎటు పోతాయో పోతాయి. ఎందుకంటే అతన్నిఅంత గొప్ప గా నమ్ముతుంది కాబట్టి.
వార్తల్లో చదువుతుంటాం. సైంటిస్ట్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, పోలీస్ ఉద్యోగినులు, ప్రేమలో మోసపోతున్నారో!
నిజానికి.. మగాణ్ణి అంత నిండుగా నమ్మడం కూడా స్త్రీ బలహీనతేమో!
సరిగ్గా ఈ బలమైన బలహీనతనే ఆధారం గా చేసుకుని ఆమె పై దాడి జరుపుతాడు. స్త్రీలపై జరిగే మోసాలు, దాడులు అన్నీ శారీరకమైనవే కానవసరం లేదు. మానసికం గా వంచించినా అది మోసమే. నేరమే.
ఒక వివాహితుడు, టీనేజ్ పిల్లలున్న శసిధర్ – ఏమీ ఎరగనట్టు..తాను ఫ్రెష్ అన్నట్టు..పౌర్ణమి ని ముగ్గులోకి లాగడం మోసం కాదా మరి? పెళ్ళైన విషయం దాచి ఐ లవ్యూ అంటూ ఆమెలో ఆశలు రేపడం తప్పు కాదా?
అయితే అతడు ఇదంతా తెలిసే చేసాడా? అసలు తనెలా ఇలా భ్రమలో పడింది..? అని పదే పదే తలపోస్తూ కుమిలిపోతుంది. ఎంతటి బలవంతుని సైతం బలహీనులుగా మారుస్తుంది ప్రేమ అనడానికి పౌర్ణమి ఓ గొప్ప ఉదాహరణ .
నిజానికి, ఇందులో ఆమె తప్పు లేదు. అతనే ఆమెని ఆకర్షణలోకి లాగుతాడు. తన చూపులతో..మాటలతో.. ఆప్యాయతనొలికించే పలకరింపులతో, చనువుగా ఏకవచనం లో పిలుస్తూ, ఆమె పై మత్తు జల్లాడు. ఆమెకిది తొలి ప్రేమ. అతనికీ కామోసు అనుకోవడం సహజమే. అతని అదృష్టమో, ఆమె దురదృష్టమో కానీ అతను తన వయసుకంటే పదేళ్ళ చిన్నవాడిలా కనిపిస్తాడు. చాలామంది మగాళ్ళ వయసు పైకి తేలదు. కొందరు మెయింటెయిన్ చేస్తారు. ఇదిగో ఇలా అమ్మయిల్ని పడేయడానికి అన్నట్టు..
నిజానికి ఆమె కుంటిదని ఆ జెంటిల్ మాన్ కీ తెలీక కాదు. ఆమెతో ఆ రిలేషన్ అదనం గా దక్కే సుఖం కాబట్టి ఆమెని ఎంచుకున్నాడు. అందుకు తన అందం, పదవి, హోదా లను ఎర గా వేశాడు. కాసింత మంచితనాన్నీ జోడించాడు.
ఈ కటిక నిజం తెలుసుకునే పరిస్థితిలో లేదు పౌర్ణమి. ఆడది ఎంత త్వరగా ప్రేమలో పడుతుందో..అంత ఆలస్యం గా మోసాన్ని గ్రహిస్తుంది. అంత కంటే ఆలస్యం గా బయట పడి కోలుకుంటుంది. కానీ జీవితాంతం ఈ చేదు అనుభవాన్ని మోస్తూనే వుంటుంది.
పెళ్ళైన వాడు ప్రేమ పేరుతో మరో అమ్మాయి జీవితం లోకి అడుగు పెట్టాడూ అంటే అతని ఉద్దేశం పెళ్ళి చేసుకోవడం మాత్రం కాదు. ఖచ్చితం గా ఫిజికల్ రిలేషన్షిప్ కోసమే.
ప్రేమించిన వాడు విలన్ అంటే ఆమె మనసు ముందు గా అంగీకరించదు. ఊహలోని చెలికానికీ – నిజం లోని మగానికి గల వ్యత్యాసం ఎంత అంటే..ఆకాశానికి..భూమికి మధ్య గలదూరమంత! ఆ నింగి నించి నేలకి దిగి రావడం అంటే మరి సమయం పడుతుంది కదూ!!
శశిధర్ ఆమె బాధని గ్రహిస్తాడు. ఓదారుస్తాడు. లవ్ యూ అంటాడు. ఆమె మనసు మెత్తపడుతుంది. పిచ్చిది మరో సారి భ్రమిస్తుంది. బాణం దెబ్బ తిన్న పక్షి ఎటూ కదలలేదని వేటగాడికి బాగా తెలుసు.
వలపు మాటలతో ఎలా లొంగదీసుకోవాలో కపట ప్రేమికులకి అదొక వెన్నతో పెట్టిన విద్య.
అతను మారీడ్ అయితే అవనీ గాక, అతని స్నేహాన్ని మాత్రం తాను వదులుకోలేనని పౌర్ణమి విలపిస్తుంది.
తొలిప్రేమ విఫలం లో ప్రియుని ఫోటోని హృదయం నించి తొలగించలేక ఆ స్త్రీ ఎంతటి దుర్భరావస్థకి గురి అవుతుందో!!
అది కాదు అసలు విషాదం. తన ని ఇంతగా ప్రాణం లా ప్రేమించే స్త్రీ మూర్తి ని చూసి గర్వపడాల్సిన మగాడు..కృతజ్ఞత స్థానానే కృతఘ్నుడిగా మారడం మరెంతైనా శోచనీయం!!
పసి వారికి మల్లేనే మనమూ అప్పుడప్పుడు దారి తప్పుతుంటాం. పూలుంటాయనుకున్న చోట పులులున్నప్పుడు బెదిరిపోకూడదు. చాకచక్యం గా బయటపడాలి. అదుపు తప్పిన మనసుని స్వాధీనపరచుకోవాలి.
ఎలా సాధ్యమైంది పౌర్ణమికి ఇదంతా? కేవలం ఓ చిన్న పరీక్ష తో అతని నిగ్గు తేల్చి, మేకవన్నె పులిని కనుగొంటుంది.
ఏమిటా పరీక్ష అనే ది సస్పెన్స్. నేనిక్కడ చెప్పడం లేదు. మీరు కథని పూర్తిగా చదవడం కోసం!
పౌర్ణమిని సౌందర్య వతిగా, అబల గా, ఆ తర్వాత అనుభవలాతో రాటు తేలిన ధైర్యవంతురాలిలా, అంతటి ధీరు రాలూ మనసు పారేసుకుని కలలు గన్న ప్రేమిక లా, మోసపోయానని గ్రహించి విలపించే విషాద మూర్తిగా, కథ చివరి వరకు కూడా తను ప్రేమించిన వ్యక్తి ని గౌరవించే హుందాపరురాలిగా, వజ్రాన్ని వజ్రం తోనే..అనే చందాన తెలివి గా బయట పడిన వివేకవంతురాలిలా పౌర్ణమి పాత్రని ఎంతో రసవత్తరం గా అద్భుతం గా మలిచారు రచయిత్రి.
*****
కథలో మరోపాత్ర – రచయిత్రి :
సహజం గా రచయిత్రుల రచనల్లో – స్త్రీ పాత్రలు ఓ ప్రత్యేకతని ఆపాదించుకునుంటాయి అని చెప్పడానికి రచయిత్రి మాధవి పాత్ర ఓ గీటు రాయిలా నిలుస్తుంది.
నేచురోపతి సెంటర్లో తన రూం మేట్ తెలుగు అమ్మాయి అని తెలుసుకుని పొంగి పోతుంది ఈ రచయిత్రి. అంత గొప్ప భాషాభిమాని. ఒక తెలుగు వారు మరో తెలుగు వారికి ఆమడ దూరం గా మసిలే అల్పమనస్కులకి ఈ రచయిత్రి ఓ ఆదర్శం గా నిలుస్తుంది.
పౌర్ణమి అందం చూసి రచయిత్రి కూడా ముగ్ధురాలౌతుంది.
అంతలోనే అవిటి కాలు చూసి కూడా, చూడనట్టు ప్రవర్తించే సంస్కారాన్ని ఈ పాత్రలో చూస్తాం. అంతే కాదు తనని తాను విమర్శించుకునే ఆత్మ పరిశీలకు రాలు .
పౌర్ణమిని కళ్ళల్లో తెలీని నీలి దిగులు తెరలను రచయిత్రి మొదటి చూపులోనే పసిగట్టేస్తుంది. పరిశీలన రచయిత్రులకి మూలధనం వంటిది మరి.
పౌర్ణమి తన కథ చెబుతున్నప్పుడు రచయిత్రి ఎక్కడా అడ్డుకోదు. రచయిత్రి కి వుండాల్సిన మొదటి లక్షణం ఇది అని చెబుతుంది.
చెప్పిన కథం తా విన్నాక పౌర్ణమిని నిందించదు. బలహీనతలను ప్రశ్నించదు. ప్రతి రచయిత్రి లోనూ ఈ ఉదాత్త గుణం చోటు చేసుకుని వుండాలి. సాటి స్త్రీల మనో భావాలను, పరిస్థితుల్ను అర్ధం చేసుకోవడం లో రచయిత్రులు గొప్ప శాస్త్రవేత్తలు.
అంతే కాదు, పౌర్ణమి ని పూర్తి గా అర్ధం చేసుకుని, మంచి మాటలతో ఓదార్చుతుంది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తుంది. సమర్ధిస్తుంది.
తమ రచనల ద్వారా రైటర్స్ పాఠకులకి ఆంతరంగిక స్నేహితులు అవుతారు. చాలామంది తమ కష్టాలు రైటర్స్ కి చెప్పుకునేది ఎందుకంటే ..సమస్యకి పరిష్కారాన్ని సూచించగల సమర్ధులని. ఆ నమ్మకాన్ని ఈ రచయిత్రి బలపరుస్తూ, ఉత్తమ రచయిత్రి అనిపించుకుంది.
ప్రేమ లో ఘోరం గా మోసపోయిన స్త్రీలు.. పొరబాటు చేసామన్న పశ్చాత్తాపంతో దహించుకుపోతుంటారు. అలా టి పౌర్ణిమ కి కొండంత ధైర్యాన్నిస్తూ ‘ ప్రేమించడం నేరమూ కాదు, బలహీనతా కాదు ..’ అని ఊరడిస్తుంది.
రచయిత్రి తన మంచి మాటలతో, గాయపడిన వారిలో నూతన చైతన్యాన్ని నింపాలి అని నేర్పిన పాత్ర – ఈ రచయిత్రి పాత్ర.
తను రాసిన ఈ కథలో పౌర్ణమి కథానాయకు రాలు కాదు. ఆమె అంతరంగం ఈ కథలో హీరోయిన్. అందుకే అంతర్మధనం అని పేరుపెట్టారు.
రచయిత్రి కాబట్టి, పౌర్ణమి మనసుని బాగా చదివి అర్ధం చేసుకుని రాయగలిగారు అనుకుంటే పొరబడినట్టే. అంతే లోతైన పరిశీలన తో శశిధర్ పాత్రనికూడా తీర్చి దిద్దుతుంది రచయిత్రి.. తేట తెల్లమైన పౌర్ణమి గురించి రాయడం తేలిక. తేనె పూసిన కత్తి వంటి శశిధర్ ని చిత్రీకరించడం చాలా కష్టం.
రచయిత్రి కి మూడో కన్ను వుండాలి..అసలైన నిజాలను, ఇజాలను లోతుకల్లా శోధించి వెలికి తేవడానికి.
కొన్ని రచనలు సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ తో ఆసక్తి గా చదివిస్తాయి. కానీ అవన్నీ మన జీవితం లో నే వుంటాయి..అని చాటి చెపుతూ ఈ కథ రాసి అందించిన కథలోని రచయిత్రి పాత్రకి ఇవే మనందరి అభినందనలు.
***
‘కథా మధురం..’ కోసం కథ కావాలి అని అడగిన వెంటనే కథని పంపి, సహకరించిన రాధ మండువ గారికి నెచ్చెలి తరపున ధన్యవాదాలు .
ఫ్రెండ్స్! వచ్చేనెల మళ్లా కలుద్దాం మరో కథా మధురం తో..!
****
అంతర్మథనం
రచన: రాధ మండువ
“టోటల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది టాబ్లెట్స్ వేసుకుంటే మంచిదేమో – ఏమంటావు మాధవీ?” అంది మా ఫ్యామిలీ డాక్టరు.
ఈ అల్లోపతీ మందులు ఒకసారి వాడటం మొదలు పెడితే ఇక ఆపలేం కదా ఒకసారి నేచురోపతి సెంటర్ కి వెళ్ళి చూద్దాం అనుకుని సెంటర్ కి ఫోన్ చేసి ఇరవై రోజులకి రూమ్ బుక్ చేసుకున్నాను.
ఎకానమీ డబుల్ రూమ్ ఇచ్చారు నాకు. అంటే నాతో పాటు నా రూమ్ లో మరొకరు ఉంటారు. నాతో పాటు ఉండే ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ నుండే వచ్చిందనీ, ఆమె పేరు పౌర్ణమి అనీ రిసెప్షనిస్ట్ చెప్పగానే నాకు రిలీఫ్ కలిగింది హాయిగా బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చని.
నేను రూమ్ లోకి వెళ్ళేసరికి ఆవిడ పడుకున్నదల్లా లేచి “హలో” అంది. అబ్బ! ఎంతందంగా ఉంది!!? కళ్ళు తిప్పుకోలేకపోయాను. నేను కూడా “హల్లో” అంటూ విశాలమైన ఆవిడ కళ్ళల్లోకి చూశాను. నవ్వుతున్న ఆమె కళ్ళల్లో లోలోతుల్లో నీలినీడలు – ఎందుకో పాపం!
ఆవిడతో మాట్లాడుతూ బ్యాగ్ లో నుండి బట్టలు తీసి అలమరాలో సర్దుకున్నాను. ఆమె ఇక్కడకి రావడం ఇది మూడో సారిట. ఇక్కడ చేసే ట్రీట్ మెంట్స్ గురించి చెప్తూ ఆవిడ లేచి మోకాలు మీద చేయి పెట్టుకుని కుంటుతూ బాత్ రూమ్ లోకి వెళ్ళింది. – ఆమెకి పోలియో!!! – ఏదో మాట్లాడుతున్న నేను హతాశురాలినై పోయాను.
ఇంత అందమైన ఈమెకి పోలియోనా? మూసుకున్న బాత్ రూమ్ తలుపు వైపే చూస్తూ ఉండిపోయాను అలాగే చాలా సేపు. ఆమె కళ్ళల్లో కదలాడే దిగులు ఆమె కుంటిదవడం వల్లనా? – కాదు కాదు – అది కాదు – ఏదో బాధ. మనకెలా తెలుస్తుంది?
తలుపు చప్పుడయింది. చూపులు తిప్పుకుని అప్రయత్నంగా నా ల్యాప్ టాప్ తీసుకుని ఏదో టైప్ చేస్తున్నట్లు నటించాను. ఏమిటో ఈ మానవ బుద్ధి – ఇలాంటి వారిని మామూలుగా చూడనివ్వదు. అనవసరమైన సానుభూతి చూపిస్తూ కొందరు, ఎగతాళి చేస్తూ కొందరు, అవమానిస్తూ కొందరు వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపిస్తూనే ఉంటారు.
బాత్ రూమ్ లోంచి వస్తూ “ఏంటి టైప్ చేస్తున్నారు? ” అంది.
“ఓ! నా గురించి చెప్పలేదు కదూ! నేను కథలు రాస్తుంటాను. నిన్ననే ఓ కథ పూర్తయింది. దాన్ని టైప్ చేసి ఇ-మెయిల్ ద్వారా పత్రికలకి పంపుదామని” అన్నాను.
“కథలు రాస్తుంటారా! ” ఆనందం ఆమె కళ్ళల్లో. నేనేమీ మాట్లాడకుండా ఆమె వైపు చూశాను.
“నేను ఒక కథ చెప్తాను – నా కథ – నాలాంటి ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన కథ. నేను ఒక ప్రమాదం నుండి తప్పించుకుని వచ్చానని అనుకుంటున్నాను. మీకు చెప్పాలి. సాయంత్రం వరకు మనకు ట్రీట్ మెంట్స్ ఏమీ లేవుగా చెప్పనా” అంది.
చలించిపోతున్న ఆమె గొంతు ద్వారా ఆమె మనసులోని దు: ఖం నాకు అర్థం అవుతుంది. ఉద్వేగ తీవ్రతలో ఉన్న ఆమె ఇప్పుడు తన కథని చెప్తే దానిలో స్పష్టత ఉండదని నాకు తెలుసు.
“ప్రయాణం లో బాగా అలిసిపోయి ఉన్నాను. మీకేమీ అభ్యంతరం లేకపోతే డిన్నర్ తర్వాత చెప్పుకుందాం సరేనా” అన్నాను.
ఏడు గంటలకే డైనింగ్ హాల్ కి వెళ్ళి ఇద్దరం భోంచేసి వచ్చాం. ఆమె మాట్లాడటం మొదలు పెట్టింది నా అనుమతి తీసుకోకుండానే – నేను ఆమెని ఆపలేదు …..
అసిస్టెంట్ మానేజరుగా ప్రమోషన్, దాంతో పాటు ట్రాన్స్ ఫర్ ని తీసుకుని కొత్త బ్యాంక్ లోకి అడుగుబెట్టాను.
టేబుల్స్ శుభ్రం చేస్తున్న అటెండర్ నన్ను చూడగానే చేతిలో పని ఆపేసి విసురుగా నా దగ్గరకి వచ్చాడు. చేతిని నా మోకాలుకి ఆనించుకుని వంగి కుంటుతూ వచ్చే నన్ను చూస్తూ “ఇంకా ఎవరూ రాలేదమ్మా – ఇంకాసేపు ఆగాక రా” అన్నాడు.
నవ్వి నేనెవరో చెప్పగానే అతని ముఖంలో రంగులు మారాయి. గొంతులో మర్యాదొచ్చింది. “సారీ మేడం! రండి – ఇదే మీ సీటు” అంటూ నా సీటు చూపించాడు.
పల్లెలన్నింటికీ కలిపి సెంటర్ గా ఉండే ఆ బ్యాంక్ సదుపాయాలతో బాగుంది.
అక్కడకి దగ్గరగా ఉండే ఊళ్ళో అన్ని వసతులూ ఉన్న ఇల్లు కూడా దొరకడం తో నేను సంతోషంగా ఉన్నాను. ఆవరణ నిండా రకరకాల వృక్షాలతో ఉంది ఇల్లు. నా పడగ్గది కిటికీలో నుండి కనిపించే వేపచెట్టు ప్రక్కనే రేగిమాను వేపచెట్టు మెడ వంపులో ఎన్నాళ్ళ బట్టో రాసుకుని రాసుకుని సగం అయింది.
విరిగి పోతానని తెలిసీ ఈ రేగిమానుకెందుకింత పిచ్చి – తన కొమ్మలని మరో వైపుకి తిప్పి ఈ వేప చెట్టునుండి దూరంగా జరగొచ్చుగా. ఇంట్లో ఉన్నప్పుడు వాటిని చూస్తూ వాటిని గురించి ఆలోచించుకోవడం బాగుంది.
చార్జి తీసుకోకుండా పనేమీ చేయలేము కాబట్టి స్టాఫ్ కోసం ఎదురుచూస్తూ ఆలోచనల్లో పడ్డ నాకు అటెండర్ టీ తెచ్చి ఇచ్చాడు.
“ఇంకా ఎవరూ రాలేదే వెంకటరమణా” అని అంటుండగానే “అరుగోనమ్మా మేనేజర్ గారు వస్తున్నారు” అన్నాడు.
పొడవుగా, సన్నగా ఉన్న అతను హుందాగా నడుస్తూ నా టేబుల్ దగ్గరకు వచ్చాడు. నేను లేచి నిలబడి అతనికి నమస్కారం చేశాను. అతనికి ముందే తెలుసేమో నేను హాండీక్యాప్డ్ అని. నా కాళ్ళ వైపు చూస్తూ “నమస్కారం. కూర్చోండి పౌర్ణమి గారూ! మీరు ఇంత త్వరగా వచ్చేస్తారనుకోలేదు” అన్నాడు నవ్వుతూ.
“మొదటి రోజు కదండీ” అన్నాను. ఇంకేమనలో తెలియలేదు.
అతని చూపుల్లో నా పట్ల ఆరాధన. నాకిది మామూలే. నన్ను చూడగానే ఎంతో మంది మగవాళ్ళు కళ్ళు తిప్పుకోలేనట్లుండే నా అందాన్ని ఆరాధనగా చూస్తారు. నేను కుంటిదాన్ని అని గ్రహించగానే ఆ ఆరాధనంతా మాయమైపోతుంది. ఆ స్థానంలో కొంతమందికి జాలి వస్తే మరికొంతమందికి అనాసక్తి కలుగుతుంది. చెప్పుకోవలసిన విషయం ఏంటంటే చాలా మందికి నా మీద కోపం వస్తుంది. నేనేదో వారికి ఆశ కలిగించి దూరమైనట్లుగా ఓ రకమైన క్రోధం వాళ్ళ కళ్ళల్లో.
“మీ ఫైళ్ళన్నీ నా క్యాబిన్ లో ఉన్నాయి చూస్తారా?” అన్నాడు అతను.
“అలాగే సర్!” అన్నాను అతని క్యాబిన్ వైపు నడుస్తూ.
“నా పేరు శశిధర్ అండీ పౌర్ణమి గారూ. శశీ అని పిలవండి. ఈ సర్ లు గిర్ లు నాకు పడవు” అన్నాడు తల తిప్పి నా వైపు చూస్తూ.
వంగి మోకాలు పట్టుకుని కుంటుతూ నడుస్తున్న నేను అతని కళ్ళల్లోకి చూశాను. అది నా కలవాటు. నేను కుంటుతున్నప్పుడు చూసే వారి కళ్ళల్లో ఏ భావం ఉందో తెలుసుకోవాలి కదా! ఆశ్చర్యం! అతని కళ్ళల్లో నా పట్ల మరింత ఆరాధన. తడబడిపోయి నా కళ్ళని అతని కళ్ళనుండి మరల్చుకున్నాను. నా గుండెలో ఏదో కొత్త భావం అలుముకుంది.
ఆ ఉదయమంతా అతని క్యాబిన్ లోనే కూర్చుని బ్యాంక్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాము. అక్కడకే స్టాఫ్ ని పిలిచి అందరికీ పరిచయం చేశాడు అతను. ఆ మధ్యాహ్నం అందరం కలిసి భోంచేశాక నా సీట్ కొచ్చి పనిలో పడిపోయాను.
2. అతని మాట తీరూ, అందరినీ ఆప్యాయంగా పలకరించడమూ చూస్తుంటే అతడు స్నేహమయి అని తెలుస్తోంది కాని నా పట్ల అతడు చూపిస్తున్న అభిమానం, నన్ను చూపులతో పలకరించే విధానంలో మాత్రం ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తోంది. చిత్రంగా అది నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. అతని సాన్నిధ్యంలో ఉండాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
మధ్యాహ్నం వచ్చే ఆ భోజనాల వేళ కోసం ఉదయం పూట సమయం నిదానంగా గడుస్తుందేమో అనిపిస్తుంది. అతను భోజనం హోటల్ నుండి తెప్పించుకుంటాడు. అవేమీ బాగుండవని అతనికిష్టమైన కూరలు చేసి తెచ్చిపెట్టడం, భోంచేస్తూ కబుర్లు చెప్పుకోవడం నాకు చాలా బాగుంది.
ఆరోజు మధ్యాహ్నం భోజనాళ వేళ అతని సెల్ మోగింది. “ఆ! చెప్పు హేమా! ఊ! సరే నువ్వు సాయంత్రం హాస్పిటల్ కి వచ్చేసెయ్. నేను నేరుగా హాస్పిటల్ కి వస్తా” అంటున్నాడు.
“ఏమయింది సార్?” అన్నాడు క్యాషియర్ రవి.
“మా అబ్బాయికి జ్వరంగా ఉందిట” అన్నాడు అతను.
“మీకు పెళ్ళయిందా” అన్నాను ఆశ్చర్యంగా. నా గొంతులో బాధతో కూడిన జీరని గుర్తించిన అతను నావైపు కుతూహలంగా చూశాడు. నేను నా కళ్ళను దాచుకున్నాను.
“అయ్యో! మేడమ్ – శశి సార్ కి ఇద్దరు పిల్లలు కూడా” అన్నాడు రవి.
“అవునా!! నేనేంటో నా లోకంలో నేనుంటాను. ఎవరి విషయాలూ తెలుసుకోను. నాకన్నీ తెలుసేమో అనుకుని నాకు ఎవరూ ఏం చెప్పరు” అని ముఖం మీదికి నవ్వు తెచ్చుకుని “ఏం చదువుతున్నారు పిల్లలు?” అన్నాను అతను వైపు చూస్తూ.
నా కళ్ళల్లో దేనికోసమో మరి వెతుకుతూ “అబ్బాయి సెవెంత్ క్లాస్, అమ్మాయి ఈ సంవత్సరం పది పరీక్షలు రాస్తోంది” అన్నాడు. నాకింకేమీ వినాలనిపించలేదు. చేతులు కడుక్కోవడానికి అన్నట్లుగా లేచి అక్కడ నుండి వచ్చేశాను.
మధ్యాహ్నం పనిలో నిలకడ లేకుండా పోయింది. బాగా తలనొప్పి వచ్చేసింది. పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా అతని గురించిన ఆలోచనలే.
ఎంత చిన్నవాడిలా ఉన్నాడు? పదో తరగతి చదివే కూతురుందంటే నమ్మ బుద్ధి కావడం లేదు. ఏం చేస్తుంది వాళ్ళావిడ. ఎక్కడైనా ఉద్యోగమా? భర్తకి క్యారియర్ ఎందుకు కట్టివ్వదు? రేపు పెందరాడే వెళ్ళి వెంకట రమణని అడగాలి అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను.
3. రోజు కంటే ముందే బ్యాంక్ కి వెళ్ళి వెంకట రమణని అడిగాను. నేరుగా అడగడానికి మొహమాటం. ‘ఎలా ఉందిట శశి సార్ వాళ్ళబ్బాయికి’ అంటూ మొదలుపెట్టి అన్ని వివరాలూ తెలుసుకున్నాను. వాళ్ళావిడ వేరే ఊళ్ళో మా బ్యాంక్ బ్రాంచిలోనే క్లర్క్ ట. ఆవిడ చాలా మంచిదనీ, ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారనీ చెప్పాడు.
విన్న నాకు చేదు తిన్నట్లుగా అయింది. ఆ రోజంతా అతని వైపు చూడాలనిపించలేదు. భోజనం గదికి కూడా నడిచే ఓపిక లేదని వంక చెప్పి నా టేబుల్ దగ్గరే భోంచేశాను. రెండు మూడు సార్లు బ్యాంక్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవలసి వచ్చినా నేను ముభావంగా సమాధానం ఇవ్వడం తో అతను నా వైపు వింతగా చూస్తూ “మీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా పౌర్ణమీ” అని అడిగాడు.
“ఆ! బాగానే ఉంది” అన్నాను కంప్యూటర్ వైపే చూస్తూ.
నా మనసు మూగగా ఏడుస్తోంది. ఏమిటిది? నేను అతని గురించి ఏదో ఆలోచించుకుని గాలిలో మేడలు కట్టుకోవడమేమిటి? తాపత్రయపడటమేమిటి? ఆలోచించే కొద్దీ నా మనస్సులో వచ్చే ఆలోచనల పట్ల నాకే రోత కలిగింది. కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు.
ఖర్చీఫ్ తో తుడుచుకుంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాను. చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుని వస్తూ వద్దనుకుంటూనే అతని క్యాబిన్ వైపు చూశాను. అద్దాల లో నుండి నన్నే చూస్తున్న అతన్ని చూసి తడపడటం నా తడి కాలు జారి కిందపడటం ఒకేసారి జరిగాయి.
పెద్దగా కేకేసి కూలబడ్డ నా దగ్గరకి అందరూ పరిగెత్తుకొచ్చారు. అవిటి కాలుకే దెబ్బ తగిలింది. వెంకటరమణ నన్ను పట్టుకుని లేపాడు. అతను కూడా నా మరో భుజాన్ని పట్టుకుని ఆసరా ఇస్తూ నన్ను నడిపించాడు. అతని భుజం మీద తల దాచుకోగానే కాలు నొప్పి, మనసులోని బాధతో సహా తగ్గినట్లు అనిపించింది. అతని కార్లోనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి కట్టు కట్టించి ఇంటి దగ్గర దిగబెట్టాడు. ధన్యవాదాలు చెప్పాను.
“మనలో మనకి థాంక్స్ ఎందుకురా – బాగా రెస్ట్ తీసుకో” అన్నాడు. వదలడం ఇష్టం లేనట్లుగా బాధపడుతూ వెళ్ళిపోయాడు.
మా అమ్మ నాకు సహాయానికి ఊరు నించి వచ్చింది. పనేమీ లేక ఒకటే ఆలోచనలు అతని గురించి. అతని గురించిన ఆలోచనలు ‘వద్దు’ అనుకుంటే దు:ఖం కలుగుతుంది. అతని తలపులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నా ఆనందానికి మరొక వ్యక్తి మీద అందులోనూ పెళ్ళయిన పరాయి వ్యక్తి మీద ఆధారపడుతున్నందువల్లనేమో మనశ్శాంతి లేకుండా పోయింది. నిద్ర మాత్ర వేసుకుని నిద్రలోకి జారిపోయాను.
సాయంత్రం ఆరవుతుండగా నా సెల్ మోగింది. చూస్తే అతని నంబరే. ఆత్రంగా తీశాను. “పౌర్ణమీ! ఎలా ఉన్నావ్?” అతని గొంతులో ఆరాధన నన్ను తాకింది. నాకు తెలియకుండానే నాలో ఉత్సాహపు అలలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి.
“బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మీ అబ్బాయి జ్వరం తగ్గిందా?” అన్నాను.
“పౌర్ణమీ ఎన్ని సార్లు ఫోన్ చేశానో! కనీసం వంద సార్లు చేసి ఉంటాను” అన్నాడు.
“బాగా నిద్ర పోయాను – సారీ. ఇంకా ఇంటికి వెళ్ళలేదా?” అని అడిగాను.
“పౌర్ణమీ! ఐ లైక్ యు. కాదు కాదు ఐ లవ్ యు” అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు. నాకు ఒక వైపు సంతోషంగా ఉంది. మరోవైపు మనసు అంతర్మధనానికి లోనవుతోంది.
“పౌర్ణమీ! పౌర్ణమీ – ఏమయింది? ఉన్నావా? వింటున్నావా?” అతని గొంతులో ఆందోళన.
“కాని మీరు …” ఆపేశాను. ‘పెళ్ళయిన వారు’ అని అనడానికి కూడా నాకు ఇష్టం లేకే ఆ వాక్యం ఆగిపోయింది.
ఎంత ఈర్ష్య నాకు? అతనికి ఎప్పుడో పెళ్ళయింది. అదెందుకు నా మనసు అంగీకరించలేకపోతుంది? నా మీద నాకే జాలేసింది. ఫోన్ పెట్టేయాలనిపిస్తోంది కాని పెట్టలేకపోతున్నాను.
“అవును పౌర్ణమీ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతగా అంటే నిన్ను నిన్నుగా నీ అవిటితనం గుర్తుకు రానంతగా – ఇదీ అని చెప్పలేను – నిర్మలమైన భావాన్ని మాటల్లో పెట్టలేను. పెళ్ళయిన నాకు నీ మీద కలిగినది ప్రేమా లేక ఆకర్షణా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాక అర్థం అయింది పౌర్ణమీ నీతో బాంధవ్యం ఏర్పరుచుకోకుండా ఉండలేనని.
నాకు పెళ్ళయిందని తెలిసినప్పటినుండీ నీ మానసిక స్థితిని నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకున్నాను కాబట్టే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని”
అతని మాటలు నా హృదయాన్ని రెండుగా చీలుస్తున్నాయి. నాకు ఏం జవాబు చెప్పాలో అర్థం కావడం లేదు. అతని విషయంలో స్పష్టత లేని నేను మాట్లాడటంలో – ముఖ్యంగా ఆ సమయంలో – అర్థం లేదనిపించింది. “తర్వాత మాట్లాడనా! అమ్మ వస్తోంది” అని ఫోన్ పెట్టేశాను.
4. ఏదో నిస్తేజం నన్ను ముంచేసింది. ఆలోచనలు – ఒకటే ఆలోచనలు. తెలియకుండానే నాలో వేడి నిట్టూర్పులు. ఎవరైనా నా పట్ల జాలి దయ చూపిస్తే కోపం. ఎవరి కళ్ళల్లోనైనా ఆరాధనో, కామపు వాంఛో చూసినపుడు మాత్రం పెళ్ళి చేసుకోవాలనీ, అన్ని సౌఖ్యాలు అనుభవించాలనీ అనిపిస్తుంది.
నా అవిటితనాన్ని చూసి నన్ను నన్నుగా కావాలనుకునేవారు ఎవరుంటారు? నా ఉద్యోగాన్నో, నాకున్న డబ్బునో చూసి నన్ను పెళ్ళి చేసుకుంటారు గాని అనే ఆలోచన వెంటనే పొంచి నన్ను వేటాడుతుంది.
ఇక ఆ ఆలోచన వచ్చిందంటే భయంతో నా మనసు మూగబోతుంది. అతడు ఫోన్ లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మనసు సంతోషంతో ఊగిసలాడింది. కాసేపటికే ఆ సంభాషణ పేలవమైనట్లుగా అనిపించింది. కాని నాలో ఏదో తృప్తి.
అవిటిదాన్ని కూడా ప్రేమించేవాళ్ళున్నారన్న ఆలోచన వల్ల కలిగిన తమకం అది. పెళ్ళి అయిన వాడు ప్రేమిస్తున్నానని చెప్తే సంతోషం దేనికి? అతడు భార్యాబిడ్దలని వదిలి నా కోసం రాలేడని తెలుస్తుందిగా. రాకపోయినా పర్వాలేదా?
అయినా ఇన్ని ఆలోచనలేంటి నాకు – అతడు నిర్మలమైన ప్రేమ అంటున్నాడుగా అదేంటో దాన్ని కూడా చూద్దాం అని అనుకోగానే నా మనసు తేలికపడింది.
తర్వాత రోజు బ్యాంక్ కి వెళ్ళాలనిపించి లేచి ఆటో అబ్బాయికి ఫోన్ చేసి తయారయ్యాను. “ఎలా వెళతావే డాక్టర్ రెస్ట్ ఇవ్వమన్నారుగా కాలికి” అంది అమ్మ.
“రెస్ట్ కాక నేనేం నడుస్తున్నానమ్మా? ఈ అవిటితనం వచ్చినప్పటినుండీ కాళ్ళకి రెస్టేగా” అన్నాను అసహనంగా. అమ్మ ఏమీ మాట్లాడలేదు.
నన్ను చూసి అందరూ నా చుట్టూ మూగారు. ‘రెస్ట్ తీసుకోకుండా ఎందుకండీ రావడం’ అన్నారు. అతని కళ్ళల్లో స్పష్టంగా సంతోషం – దాచుకుందామన్నా దాచుకోలేకపోతున్నాడు.
నేనేమీ ఆలోచనలు పెట్టుకోకుండా పనిలో లీనమయ్యాను.
సాయంత్రం ఇంటికి బయలు దేరుతున్న నా దగ్గరకి వచ్చి “పౌర్ణమీ మీకేమీ అభ్యంతరం లేకపోతే నేను మీ ఆటోలో వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసి ఆటో తీసికెళతాను. నా కారు సర్వీసింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు” అన్నాడు.
నా ఎదురుగ్గానే సర్వీసింగ్ వాళ్ళకి ఫోన్ చేసి కారు బ్యాంక్ దగ్గ్గరుంది తీసికెళ్ళమని చెప్పాడు. కారు తాళాలు వెంకటరమణకిచ్చి సర్వీసింగ్ వాళ్ళు వస్తే ఇవ్వమని నా ఆటో ఎక్కాడు.
“మా ఇంటికి వెళదాం పౌర్ణమీ. ఈరోజు మా ఇంట్లోనే నీకు డిన్నర్. మా ఆవిడ ఊరెళ్ళింది సో డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేయాలి” అన్నాడు నవ్వుతూ. అతని కళ్ళల్లో ఈసారి ఆరాధనతో కూడిన సంతోషం. అందరిలో ఉన్నప్పుడు నన్ను ‘మీరు’ అనడం ఒంటరిగా ఉన్నప్పుడు ‘నువ్వు’ అనడం గమనించాను.
మీ ఇంటికి వద్దులెండి అని చెప్పాలనిపించలేదు. మర్యాదల వలలో ఇరుక్కుపోయి కాదు – నాకే అతని సంగతి తెలుసుకోవాలని కాంక్ష.
ఆటోను లోపల వరండా మెట్ల దగ్గర ఆపించి నన్ను నడిపిస్తూ లోపలకి తీసికెళ్ళాడు. ఇల్లు చాలా బావుంది. నీట్ గా ఎక్కడవి అక్కడ సర్ది ఉన్నాయి. ఆమె చాలా సౌందర్యాభిలాషి అని సర్దిన తీరు చూస్తుంటే తెలుస్తుంది. నన్ను సోఫాలో కూర్చోమని లోపలకి వెళ్ళి రెండు గ్లాసులనిండా మామిడి రసం తెచ్చాడు. లుంగీలోకి మారిన అతను నాకు కొత్తగా ఉన్నాడు.
“తీసుకో పౌర్ణమీ” అంటూ చనువుగా నా ప్రక్కన కూర్చున్నాడు. హఠాత్తుగా నా ముఖాన్ని దగ్గరకి తీసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత మైకం నన్ను చుట్టేసింది. నేనేమీ పదహారేళ్ళ యవ్వనం లో లేను. అయినా ఏమిటిది? ఏ అనుభవం కోసం నేనింత మత్తులో పడుతున్నానో ఆ మత్తు వదిలాక పర్యవసానం – మన చర్యలు మన జీవితాలనే కాదు అవతలి వారి జీవితాలనీ అశాంతి పాలు చేస్తాయి. విదుల్చుకుని లేచాను. నడవలేక క్రింద కూలబడ్డ నన్ను లేవదీయకుండా అతనూ సోఫాలోంచి క్రిందకు నా ప్రక్కకు జారాడు.
అతని వైపు చూస్తే – అతని కళ్ళల్లోని ఆరాధనని చూస్తే – నేనేమవుతానో నాకు తెలుసు. అతన్ని తోసేసి గుమ్మం వైపు చూస్తూ ‘శీనూ, శీనూ’ అని పెద్దగా అరిచాను.
“ఆ! మేడమ్ వస్తున్నా” అన్నాడు వరండాలోనే కూర్చుని ఉన్న శీను. అతను హడావుడిగా లేచి నన్ను లేపి నిలబెట్టి ఏదో పనున్నట్లు గదిలోకి వెళ్ళిపోయాడు.
లోపలకి వచ్చిన శీనుతో “ఇక వెళదాం శీనూ” అన్నాను.
“ఉండండి ఒక్క నిమిషం” అంటూ అతను కుంకుమ భరిణతో వచ్చాడు. “తీసుకుని బొట్టు పెట్టుకోండి. మా ఆవిడ ఉంటే ఇవన్నీ చేసేది” అన్నాడు.
ఆటో డ్రైవర్ కి అనుమానం కలగకుండా అతను చేస్తున్న ఈ చర్యలకి నాకు అసహ్యం వేసింది. కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకున్నాను. వాళ్ళిద్దరి సాయంతో ఆటోలో కూర్చున్నాను.
ఈసారి అతని పట్టులో అసహనం. అతనికి కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పాలనిపించలేదు. అతనే ‘బై’ అని చెయ్యి ఊపుతున్నాడు.
యాంత్రికం గా చెయ్యి ఊపుతూ శ్రీను వైపు చూశాను. శ్రీను ఆటో స్టార్ట్ చేశాడు.
5. అమ్మ ఊరు వెళ్ళింది. అమ్మ లేకపోతే నాన్నకి ఇబ్బంది. “మామయ్యని చేసుకోవడం గురించి ఆలోచించమ్మా! వాడు నిన్ను చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు కాదనడం బాగాలేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో! ” అంది అమ్మ వెళుతూ.
రోజులు గడుస్తున్నాయి. అతని చూపుల్లో నా పట్ల ఆరాధన ఏ మాత్రమూ చెక్కు చెదరలేదు. నేను ఆ ప్రవాహపు వడిలో జారి పోకూడదని నిలదొక్కుకొని నిలబడి ఉన్నాను. కాని నాలో ఏదో అశాంతి. ‘నాది’ అంటూ నాకేదో ఉండాలనే తపన.
కళ్ళు కనపడనీయకుండా చేసే అతని ఆరాధనా జిలుగు నన్ను ముంచేయకముందే ఏదో చేయాలి. ట్రాన్స్ ఫర్ కి పెట్టుకున్నా ఉపయోగం లేదని నాకు తెలుసు. వాంఛ కలగనే కూడదు – కలిగాక వ్యవస్థ మీద తిరుగుబాటు చేయడానికి దానికి అన్ని హక్కులున్నట్లు అది ప్రవర్తిస్తుంది. మనసు లోతుల్లో ఉండే మంచి చెడ్డలనే సున్నిత ప్రకంపనలు దానికి అందవు.
“పౌర్ణమీ! మీ అమ్మగారు ఊర్లో ఎలా ఉన్నారు?” అంటూ నా సీట్ దగ్గరగా వచ్చి “సాయంత్రం మీ ఇంటికి రానా?” అన్నాడు.
నీలి రంగు షర్ట్, నలుపు ప్యాంట్ లో చాలా అందంగా ఉన్నాడతను. ఆరాధన కళ్ళనిండా నింపుకుని అడుగుతున్న అతన్ని కాదనడానికి మాటలు రావసలు. నవ్వి ఊరుకున్నాను.
సాయంత్రం ఆటో వైపుకి నడుస్తున్న నన్ను చూస్తూ “ఖచ్చితంగా 7 గంటలకి మీ ఇంట్లో ఉంటాను” అన్నాడు.
ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీనుని బస్టాండ్ కి తీసికెళ్ళమన్నాను. బస్సెక్కి నాలుగు రోజులు శలవు చీటీ రాసి శ్రీను చేతికిచ్చి బ్యాంక్ లో ఇచ్చేయమన్నాను.
కందిరీగల్లా ముసురుకుంటున్న ఆలోచనలు నాలో – ఎందుకని నేను అతనికి ‘ఇవన్నీ నాకిష్టం లేదు’ అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాను? అతని స్నేహం, అతడి కళ్లల్లో నా పట్ల కనిపిస్తున్న ఆరాధన నాకు తియ్యని అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ తమకంలో నా అవిటితనాన్ని – నన్ను నిత్యమూ బాధించే ఈ లోటుని మర్చిపోగలుగుతున్నాను. అవన్నీ పోతాయని భయమా?
అయినా ఇదేమిటి ఇతడు – నిర్మలమైన స్నేహం అంటూ ఎందుకు నన్ను కాంక్షిస్తున్నాడు? ఏమో నాలో కూడా అతని పట్ల ఉన్న మోహాన్ని గుర్తించాడేమో!
అతనితో శారీరకంగా సంతృప్తి పడిన ఈ కాంక్ష ఊరుకుంటుందా? జీవితాన్ని బీటలుగా చీల్చదా? నేను అతని ఆరాధనని శంకిస్తున్నానేమో – నాతో జీవితాంతమూ తోడుగా ఉండేంత ప్రేమ అతను నా పట్ల పెంచుకున్నాడేమో – ఊహు అతని ప్రవర్తన అలా లేదే. తెలుసుకోవడం ఎంత సేపు…… ఒక్క ఫోన్ కాల్ చాలదూ???
బ్యాగ్ లోంచి సెల్ తీశాను. ఆన్ చేయగానే 26 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ‘ఎక్కడున్నావు పౌర్ణమీ’ అంటూ మెసేజ్. అతనికి డయల్ చేశాను.
“ఎక్కడున్నావ్? ” ఆతృత అతని కంఠంలో.
“మీరూ? ” అన్నాను.
“మీ ఇంటి దగ్గరే – ఎక్కడున్నావ్ చెప్పూ” అన్నాడు.
“బస్టాండ్ లో ఉన్నాను. మా ఊరికి వెళుతున్నా. నాకు పెళ్ళి మామయ్యతో ఫిక్స్ చేస్తున్నారట ఈరోజు. త్వరగా రమ్మని అమ్మ ఆర్డర్. మీకు చెప్దామనుకుంటే ఇక్కడ సిగ్నల్ దొరకడం లేదు” అన్నాను.
ఈ చిన్న అబద్దం నా అంతర్మధనాన్ని తొలగించి శాంతిని ప్రసాదిస్తుందనే ఆశ నాలో.
“పెళ్ళా! పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు – నా జీవితం ఇలా ఒంటరిగా గడిచిపోవలసిందే అన్నావుగా. ఇదేంటి సడన్ గా ఈ నిర్ణయం? నిజమేనా? జోక్ కాదు కదా” అతని గొంతులో కోపం నాకు స్పష్టంగా తెలుస్తోంది.
“లేదండీ! నిజమే చెప్తున్నాను. మామయ్యని ఒప్పించినట్లుంది మా అమ్మ” అన్నాను.
“ఏం మాట్లాడుతున్నావ్? నిన్ను నిన్నుగా ఎవరు చేసుకుంటారు? నీ డబ్బు కోసమో, నీ ఉద్యోగాన్ని చూసో ఒప్పుకొని ఉంటాడు. అలాంటి వాడు నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలడు? ఆలోచించుకోవా?” ఆగాడు నా సమాధానం కోసం అన్నట్లుగా. నేనేమీ బదులివ్వలేదు.
“పౌర్ణమీ! ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను కారణం కాదు కదా! ” అతని గొంతులో మార్దవం నా మౌనాన్ని వీడేట్లు చేసింది.
“శశి గారూ, నాకు వయసు వచ్చినప్పటినుండీ నన్ను నన్నుగా ఎవరైనా ప్రేమిస్తారనే నమ్మకం ఏర్పడింది. అది ఎందుకు కలిగిందో నేను చెప్పలేను. అప్పటినుండీ మగవాళ్ళని గమనిస్తున్నాను. నా అందాన్ని చూసిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆరాధన నా అవిటితనం చూడగానే ఆరిపోయేది.
కాని మీరు నన్ను నన్నుగా ఆరాధించారు నాకు తెలుసు. మీ మంచి మనసు చూసి మిమ్మల్ని నేను కోరుకున్నాను. నా కల నిజమవుతున్నదని అలవికాని ఆనందాన్ని పొందాను. కాని మీకు పెళ్ళి అయిందని తెలిశాక మీనుంచి నేను కోరుకుంటున్నది మీ స్నేహాన్ని మాత్రమే” ఆగాను. అతనేమీ మాట్లాడలేదు.
“ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం అంటారా – నిజమే మిమ్మల్ని చూశాకే నాకూ ఓ తోడు – రాత్రి పూట ఉలిక్కిపడి లేస్తే నా వెన్ను తట్టి నన్ను కౌగలించుకునే తోడు కావాలనే కోరిక మాత్రం ఖచ్చితంగా మీ వల్లే కలిగింది. అది మీరు ఇవ్వలేరని తెలుసు – అసలు మిమ్మల్ని అలా చూడటమే తప్పు – అందుకే… మామయ్యని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను” అన్నాను.
“నీ మనసులో ఏముందో నాకు చెప్పాలి కదా పౌర్ణమీ. నీకు భయంగా ఉందని చెబితే ఆరోజు రాత్రికి నేను రానా … ఇంట్లో ఏదో చెప్పి….”
“వద్దు వద్దు మీరు అలా మాట్లాడొద్దు” అంటూ ఫోన్ పెట్టేశాను. అసహ్యంతో శరీరం వణికింది. నన్ను ఎక్కడికో ఈడ్చుకెళ్ళాలని రింగవుతున్న ఫోన్ ని అభావంగా చూస్తుండిపోయాను తప్ప ఎత్తలేదు.
***
“మాధవి గారూ, మామయ్యని పెళ్ళి చేసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాని మామయ్యని చేసుకుంటున్నానని అతనితో చెప్పడం మాత్రం చాలా మంచిదయింది.
ఎందుకో ఆ సమయంలో నాకు మా ఆవరణలోని వేపచెట్టు మెడ వంపులో రాసుకుపోతున్న రేగి చెట్టు కళ్ళముందు కదలాడింది. ‘ఊరి నుంచి రాగానే కర్రల సాయంతో రేగి చెట్టుని నిటారుగా నిలబెట్టించాలి’ అని అనుకున్నాను.
రేగి చెట్టునైతే నిలబెట్టగలను కాని ఇతని ఆరాధనా జిలుగులో నుండి బయటకి రావాడానికి నాకెన్ని రోజులు పడుతుందో ? ” – ఆమె స్వరం లో ఆవేదన నన్ను మౌనంలోకి నెట్టేసింది. నేనేమీ మాట్లాడలేదు. ఆమె వివేకాన్ని మెచ్చుకుంటూ ఆమె నైరాశ్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.
“అతనితో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఊరికి వెళ్ళాలనిపించలేదు. ఒంటరిగా ఉండాలనిపించి ఇటు వచ్చాను. నా స్థితి నాకు తెలిసీ నేనూ ప్రేమింపబడాలనే ఆతృత చూశారా నన్నెంత వేదనకి గురి చేస్తుందో” అంది నీళ్ళు నిండిన కళ్ళెత్తి నా వైపు చూస్తూ.
“ప్రేమించటానికి, ప్రేమించబడాలని కోరుకోవడానికి అర్హత అనర్హతలు ఉంటాయంటారా పౌర్ణమీ – ఎందుకు అలా అనుకుంటారు? మీరు చాలా వివేకంగా ప్రవర్తించారు. వివేకంతో, విచక్షణా జ్ఞానంతో మనం ఉండాలని తెలియచేస్తున్న మీ కథని అందరూ తెలుసుకోవాలి – రాస్తాను పౌర్ణమి గారూ – ఇప్పుడే రాసి పత్రికకి పంపుతాను.
ఇంకో విషయం ‘ఎన్నాళ్ళు పడుతుందో ఈ జిలుగు నుండి బయటపడటానికి’ అని మీరంటున్నారు. నిర్మలమైన భావనతో వచ్చినదే ఈ బరువు. ఇది మీలో చైతన్యాన్ని కలగచేస్తుందే తప్ప మిమ్మల్ని నీలినీడల వెనక్కి తోసేయదు” అన్నాను.
నా మాటలకి ఆమె విశాల నయనాలు మరింత విశాలమై ఒక్కసారిగా వెలిగాయి.
******
ఇది చాలా మంచి కథ. మీకు బాగా నచ్చుతుంది దమయంతి గారూ
అంతర్మథనం – రాధ మండువ

ఇక ఆ ఆలోచన వచ్చిందంటే భయంతో నా మనసు మూగబోతుంది. అతడు ఫోన్ లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మనసు సంతోషంతో ఊగిసలాడింది. కాసేపటికే ఆ సంభాషణ పేలవమైనట్లుగా అనిపించింది. కాని నాలో ఏదో తృప్తి. అవిటిదాన్ని కూడా ప్రేమించేవాళ్ళున్నారన్న ఆలోచన వల్ల కలిగిన తమకం అది. పెళ్ళి అయిన వాడు ప్రేమిస్తున్నానని చెప్తే సంతోషం దేనికి? అతడు భార్యాబిడ్దలని వదిలి నా కోసం రాలేడని తెలుస్తుందిగా. రాకపోయినా పర్వాలేదా? అయినా ఇన్ని ఆలోచనలేంటి నాకు – అతడు నిర్మలమైన ప్రేమ అంటున్నాడుగా అదేంటో దాన్ని కూడా చూద్దాం అని అనుకోగానే నా మనసు తేలికపడింది.
తర్వాత రోజు బ్యాంక్ కి వెళ్ళాలనిపించి లేచి ఆటో అబ్బాయికి ఫోన్ చేసి తయారయ్యాను. “ఎలా వెళతావే డాక్టర్ రెస్ట్ ఇవ్వమన్నారుగా కాలికి” అంది అమ్మ.
“రెస్ట్ కాక నేనేం నడుస్తున్నానమ్మా? ఈ అవిటితనం వచ్చినప్పటినుండీ కాళ్ళకి రెస్టేగా” అన్నాను అసహనంగా. అమ్మ ఏమీ మాట్లాడలేదు.
నన్ను చూసి అందరూ నా చుట్టూ మూగారు. ‘రెస్ట్ తీసుకోకుండా ఎందుకండీ రావడం’ అన్నారు. అతని కళ్ళల్లో స్పష్టంగా సంతోషం – దాచుకుందామన్నా దాచుకోలేకపోతున్నాడు.
నేనేమీ ఆలోచనలు పెట్టుకోకుండా పనిలో లీనమయ్యాను.
సాయంత్రం ఇంటికి బయలు దేరుతున్న నా దగ్గరకి వచ్చి “పౌర్ణమీ మీకేమీ అభ్యంతరం లేకపోతే నేను మీ ఆటోలో వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసి ఆటో తీసికెళతాను. నా కారు సర్వీసింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు” అన్నాడు.
నా ఎదురుగ్గానే సర్వీసింగ్ వాళ్ళకి ఫోన్ చేసి కారు బ్యాంక్ దగ్గ్గరుంది తీసికెళ్ళమని చెప్పాడు. కారు తాళాలు వెంకటరమణకిచ్చి సర్వీసింగ్ వాళ్ళు వస్తే ఇవ్వమని నా ఆటో ఎక్కాడు.
“మా ఇంటికి వెళదాం పౌర్ణమీ. ఈరోజు మా ఇంట్లోనే నీకు డిన్నర్. మా ఆవిడ ఊరెళ్ళింది సో డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేయాలి” అన్నాడు నవ్వుతూ. అతని కళ్ళల్లో ఈసారి ఆరాధనతో కూడిన సంతోషం. అందరిలో ఉన్నప్పుడు నన్ను ‘మీరు’ అనడం ఒంటరిగా ఉన్నప్పుడు ‘నువ్వు’ అనడం గమనించాను.
మీ ఇంటికి వద్దులెండి అని చెప్పాలనిపించలేదు. మర్యాదల వలలో ఇరుక్కుపోయి కాదు – నాకే అతని సంగతి తెలుసుకోవాలని కాంక్ష.
ఆటోను లోపల వరండా మెట్ల దగ్గర ఆపించి నన్ను నడిపిస్తూ లోపలకి తీసికెళ్ళాడు. ఇల్లు చాలా బావుంది. నీట్ గా ఎక్కడవి అక్కడ సర్ది ఉన్నాయి. ఆమె చాలా సౌందర్యాభిలాషి అని సర్దిన తీరు చూస్తుంటే తెలుస్తుంది. నన్ను సోఫాలో కూర్చోమని లోపలకి వెళ్ళి రెండు గ్లాసులనిండా మామిడి రసం తెచ్చాడు. లుంగీలోకి మారిన అతను నాకు కొత్తగా ఉన్నాడు.
“తీసుకో పౌర్ణమీ” అంటూ చనువుగా నా ప్రక్కన కూర్చున్నాడు. హఠాత్తుగా నా ముఖాన్ని దగ్గరకి తీసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత మైకం నన్ను చుట్టేసింది. నేనేమీ పదహారేళ్ళ యవ్వనం లో లేను. అయినా ఏమిటిది? ఏ అనుభవం కోసం నేనింత మత్తులో పడుతున్నానో ఆ మత్తు వదిలాక పర్యవసానం – మన చర్యలు మన జీవితాలనే కాదు అవతలి వారి జీవితాలనీ అశాంతి పాలు చేస్తాయి. విదుల్చుకుని లేచాను. నడవలేక క్రింద కూలబడ్డ నన్ను లేవదీయకుండా అతనూ సోఫాలోంచి క్రిందకు నా ప్రక్కకు జారాడు.
అతని వైపు చూస్తే – అతని కళ్ళల్లోని ఆరాధనని చూస్తే – నేనేమవుతానో నాకు తెలుసు. అతన్ని తోసేసి గుమ్మం వైపు చూస్తూ ‘శీనూ, శీనూ’ అని పెద్దగా అరిచాను.
“ఆ! మేడమ్ వస్తున్నా” అన్నాడు వరండాలోనే కూర్చుని ఉన్న శీను. అతను హడావుడిగా లేచి నన్ను లేపి నిలబెట్టి ఏదో పనున్నట్లు గదిలోకి వెళ్ళిపోయాడు.
లోపలకి వచ్చిన శీనుతో “ఇక వెళదాం శీనూ” అన్నాను.
“ఉండండి ఒక్క నిమిషం” అంటూ అతను కుంకుమ భరిణతో వచ్చాడు. “తీసుకుని బొట్టు పెట్టుకోండి. మా ఆవిడ ఉంటే ఇవన్నీ చేసేది” అన్నాడు.
ఆటో డ్రైవర్ కి అనుమానం కలగకుండా అతను చేస్తున్న ఈ చర్యలకి నాకు అసహ్యం వేసింది. కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకున్నాను. వాళ్ళిద్దరి సాయంతో ఆటోలో కూర్చున్నాను.
ఈసారి అతని పట్టులో అసహనం. అతనికి కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పాలనిపించలేదు. అతనే ‘బై’ అని చెయ్యి ఊపుతున్నాడు.
యాంత్రికం గా చెయ్యి ఊపుతూ శ్రీను వైపు చూశాను. శ్రీను ఆటో స్టార్ట్ చేశాడు.
5. అమ్మ ఊరు వెళ్ళింది. అమ్మ లేకపోతే నాన్నకి ఇబ్బంది. “మామయ్యని చేసుకోవడం గురించి ఆలోచించమ్మా! వాడు నిన్ను చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు కాదనడం బాగాలేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో! ” అంది అమ్మ వెళుతూ.
రోజులు గడుస్తున్నాయి. అతని చూపుల్లో నా పట్ల ఆరాధన ఏ మాత్రమూ చెక్కు చెదరలేదు. నేను ఆ ప్రవాహపు వడిలో జారి పోకూడదని నిలదొక్కుకొని నిలబడి ఉన్నాను. కాని నాలో ఏదో అశాంతి. ‘నాది’ అంటూ నాకేదో ఉండాలనే తపన.
కళ్ళు కనపడనీయకుండా చేసే అతని ఆరాధనా జిలుగు నన్ను ముంచేయకముందే ఏదో చేయాలి. ట్రాన్స్ ఫర్ కి పెట్టుకున్నా ఉపయోగం లేదని నాకు తెలుసు. వాంఛ కలగనే కూడదు – కలిగాక వ్యవస్థ మీద తిరుగుబాటు చేయడానికి దానికి అన్ని హక్కులున్నట్లు అది ప్రవర్తిస్తుంది. మనసు లోతుల్లో ఉండే మంచి చెడ్డలనే సున్నిత ప్రకంపనలు దానికి అందవు.
“పౌర్ణమీ! మీ అమ్మగారు ఊర్లో ఎలా ఉన్నారు?” అంటూ నా సీట్ దగ్గరగా వచ్చి “సాయంత్రం మీ ఇంటికి రానా?” అన్నాడు.
నీలి రంగు షర్ట్, నలుపు ప్యాంట్ లో చాలా అందంగా ఉన్నాడతను. ఆరాధన కళ్ళనిండా నింపుకుని అడుగుతున్న అతన్ని కాదనడానికి మాటలు రావసలు. నవ్వి ఊరుకున్నాను.
సాయంత్రం ఆటో వైపుకి నడుస్తున్న నన్ను చూస్తూ “ఖచ్చితంగా 7 గంటలకి మీ ఇంట్లో ఉంటాను” అన్నాడు.
ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీనుని బస్టాండ్ కి తీసికెళ్ళమన్నాను. బస్సెక్కి నాలుగు రోజులు శలవు చీటీ రాసి శ్రీను చేతికిచ్చి బ్యాంక్ లో ఇచ్చేయమన్నాను.
కందిరీగల్లా ముసురుకుంటున్న ఆలోచనలు నాలో – ఎందుకని నేను అతనికి ‘ఇవన్నీ నాకిష్టం లేదు’ అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాను? అతని స్నేహం, అతడి కళ్లల్లో నా పట్ల కనిపిస్తున్న ఆరాధన నాకు తియ్యని అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ తమకంలో నా అవిటితనాన్ని – నన్ను నిత్యమూ బాధించే ఈ లోటుని మర్చిపోగలుగుతున్నాను. అవన్నీ పోతాయని భయమా?
అయినా ఇదేమిటి ఇతడు – నిర్మలమైన స్నేహం అంటూ ఎందుకు నన్ను కాంక్షిస్తున్నాడు? ఏమో నాలో కూడా అతని పట్ల ఉన్న మోహాన్ని గుర్తించాడేమో!
అతనితో శారీరకంగా సంతృప్తి పడిన ఈ కాంక్ష ఊరుకుంటుందా? జీవితాన్ని బీటలుగా చీల్చదా? నేను అతని ఆరాధనని శంకిస్తున్నానేమో – నాతో జీవితాంతమూ తోడుగా ఉండేంత ప్రేమ అతను నా పట్ల పెంచుకున్నాడేమో – ఊహు అతని ప్రవర్తన అలా లేదే. తెలుసుకోవడం ఎంత సేపు…… ఒక్క ఫోన్ కాల్ చాలదూ???
బ్యాగ్ లోంచి సెల్ తీశాను. ఆన్ చేయగానే 26 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ‘ఎక్కడున్నావు పౌర్ణమీ’ అంటూ మెసేజ్. అతనికి డయల్ చేశాను.
“ఎక్కడున్నావ్? ” ఆతృత అతని కంఠంలో.
“మీరూ? ” అన్నాను.
“మీ ఇంటి దగ్గరే – ఎక్కడున్నావ్ చెప్పూ” అన్నాడు.
“బస్టాండ్ లో ఉన్నాను. మా ఊరికి వెళుతున్నా. నాకు పెళ్ళి మామయ్యతో ఫిక్స్ చేస్తున్నారట ఈరోజు. త్వరగా రమ్మని అమ్మ ఆర్డర్. మీకు చెప్దామనుకుంటే ఇక్కడ సిగ్నల్ దొరకడం లేదు” అన్నాను.
ఈ చిన్న అబద్దం నా అంతర్మధనాన్ని తొలగించి శాంతిని ప్రసాదిస్తుందనే ఆశ నాలో.
“పెళ్ళా! పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు – నా జీవితం ఇలా ఒంటరిగా గడిచిపోవలసిందే అన్నావుగా. ఇదేంటి సడన్ గా ఈ నిర్ణయం? నిజమేనా? జోక్ కాదు కదా” అతని గొంతులో కోపం నాకు స్పష్టంగా తెలుస్తోంది.
“లేదండీ! నిజమే చెప్తున్నాను. మామయ్యని ఒప్పించినట్లుంది మా అమ్మ” అన్నాను.
“ఏం మాట్లాడుతున్నావ్? నిన్ను నిన్నుగా ఎవరు చేసుకుంటారు? నీ డబ్బు కోసమో, నీ ఉద్యోగాన్ని చూసో ఒప్పుకొని ఉంటాడు. అలాంటి వాడు నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలడు? ఆలోచించుకోవా?” ఆగాడు నా సమాధానం కోసం అన్నట్లుగా. నేనేమీ బదులివ్వలేదు.
“పౌర్ణమీ! ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను కారణం కాదు కదా! ” అతని గొంతులో మార్దవం నా మౌనాన్ని వీడేట్లు చేసింది.
“శశి గారూ, నాకు వయసు వచ్చినప్పటినుండీ నన్ను నన్నుగా ఎవరైనా ప్రేమిస్తారనే నమ్మకం ఏర్పడింది. అది ఎందుకు కలిగిందో నేను చెప్పలేను. అప్పటినుండీ మగవాళ్ళని గమనిస్తున్నాను. నా అందాన్ని చూసిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆరాధన నా అవిటితనం చూడగానే ఆరిపోయేది.
కాని మీరు నన్ను నన్నుగా ఆరాధించారు నాకు తెలుసు. మీ మంచి మనసు చూసి మిమ్మల్ని నేను కోరుకున్నాను. నా కల నిజమవుతున్నదని అలవికాని ఆనందాన్ని పొందాను. కాని మీకు పెళ్ళి అయిందని తెలిశాక మీనుంచి నేను కోరుకుంటున్నది మీ స్నేహాన్ని మాత్రమే” ఆగాను. అతనేమీ మాట్లాడలేదు.
“ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం అంటారా – నిజమే మిమ్మల్ని చూశాకే నాకూ ఓ తోడు – రాత్రి పూట ఉలిక్కిపడి లేస్తే నా వెన్ను తట్టి నన్ను కౌగలించుకునే తోడు కావాలనే కోరిక మాత్రం ఖచ్చితంగా మీ వల్లే కలిగింది. అది మీరు ఇవ్వలేరని తెలుసు – అసలు మిమ్మల్ని అలా చూడటమే తప్పు – అందుకే మామయ్యని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను” అన్నాను.
“నీ మనసులో ఏముందో నాకు చెప్పాలి కదా పౌర్ణమీ. నీకు భయంగా ఉందని చెబితే ఆరోజు రాత్రికి నేను రానా … ఇంట్లో ఏదో చెప్పి….”
“వద్దు వద్దు మీరు అలా మాట్లాడొద్దు” అంటూ ఫోన్ పెట్టేశాను. అసహ్యంతో శరీరం వణికింది. నన్ను ఎక్కడికో ఈడ్చుకెళ్ళాలని రింగవుతున్న ఫోన్ ని అభావంగా చూస్తుండిపోయాను తప్ప ఎత్తలేదు.
***
“మాధవి గారూ, మామయ్యని పెళ్ళి చేసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాని మామయ్యని చేసుకుంటున్నానని అతనితో చెప్పడం మాత్రం చాలా మంచిదయింది.
ఎందుకో ఆ సమయంలో నాకు మా ఆవరణలోని వేపచెట్టు మెడ వంపులో రాసుకుపోతున్న రేగి చెట్టు కళ్ళముందు కదలాడింది. ‘ఊరి నుంచి రాగానే కర్రల సాయంతో రేగి చెట్టుని నిటారుగా నిలబెట్టించాలి’ అని అనుకున్నాను.
రేగి చెట్టునైతే నిలబెట్టగలను కాని ఇతని ఆరాధనా జిలుగులో నుండి బయటకి రావాడానికి నాకెన్ని రోజులు పడుతుందో ? ” – ఆమె స్వరం లో ఆవేదన నన్ను మౌనంలోకి నెట్టేసింది. నేనేమీ మాట్లాడలేదు. ఆమె వివేకాన్ని మెచ్చుకుంటూ ఆమె నైరాశ్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.
“అతనితో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఊరికి వెళ్ళాలనిపించలేదు. ఒంటరిగా ఉండాలనిపించి ఇటు వచ్చాను. నా స్థితి నాకు తెలిసీ నేనూ ప్రేమింపబడాలనే ఆతృత చూశారా నన్నెంత వేదనకి గురి చేస్తుందో” అంది నీళ్ళు నిండిన కళ్ళెత్తి నా వైపు చూస్తూ.
“ప్రేమించటానికి, ప్రేమించబడాలని కోరుకోవడానికి అర్హత అనర్హతలు ఉంటాయంటారా పౌర్ణమీ – ఎందుకు అలా అనుకుంటారు? మీరు చాలా వివేకంగా ప్రవర్తించారు. వివేకంతో, విచక్షణా జ్ఞానంతో మనం ఉండాలని తెలియచేస్తున్న మీ కథని అందరూ తెలుసుకోవాలి – రాస్తాను పౌర్ణమి గారూ – ఇప్పుడే రాసి పత్రికకి పంపుతాను.
ఇంకో విషయం ‘ఎన్నాళ్ళు పడుతుందో ఈ జిలుగు నుండి బయటపడటానికి’ అని మీరంటున్నారు. నిర్మలమైన భావనతో వచ్చినదే ఈ బరువు. ఇది మీలో చైతన్యాన్ని కలగచేస్తుందే తప్ప మిమ్మల్ని నీలినీడల వెనక్కి తోసేయదు” అన్నాను.
నా మాటలకి ఆమె విశాల నయనాలు మరింత విశాలమై ఒక్కసారిగా వెలిగాయి.
******
బహుమతి పొందిన కథలు :
- శ్రీ పిళ్ళారిశెట్టి కృష్ణారావు గారి స్మారక బహుమతి పొందిన కథ – భీష్మ. రచన : ప్రియ టేకి.
బహుమతి కి అన్ని విధాలా అర్హమైన కథ అని ఒప్పుకుని తీరాలి. కథ క్లుప్తం గా ఏమిటంటే – వృధాప్యం లో తనని ప్రేమించే పిల్లలు వున్నా, ఆ ప్రేమ ని అందుకోలేని ఎందరో అభాగ్యుల గురించి వ్యధ చెందే ఓ ఉన్నత మనస్కుని కథ. ఎంతమంది వుంటారు ఇలా పరుల బాధల గురించి ఆలోచించి, సేవ కై పరుగులిడేవారు? మంచి కథని అందించిన రచయిత్రి కి హృదయ పూర్వక అభినందనలు.
రైల్ నడుపుతున్న డ్రైవర్ గారు కూడా రూట్ మర్చిపోవచ్చు. మరి ఎట్లా వెళ్ళాలి? అని డౌట్ వేసి అడుగుతున్నాడు. ఎవర్ని? హహా నేను చెప్పను. మీరే తెలుసుకోండి బాచి గారి కార్టూన్ చూసి.
తర్వాత మరో బహుమతి పొందిన కథ –
శ్రీమతి జలగడుగుల పార్వతీ కుమారి గారి గురువులు గారి స్మారక బహుమతి పొందిన కథ – అప్పు చేసి పప్పు కూడు. రచన – శ్రీ శ్రీనాథ్ పాకల్.
మొగుడూపెళ్ళా ల మధ్య కలతలు రాకుండా వుండాలంటే ఇద్దరిమధ్య ప్రేమ ఒక్కటుంటే సరిపోదు. అవగాహన కూడా వుండాలి. ఎందులో అంటే డబ్బు విషయం లో. ఆర్ధికపరమైన విషయాలలో ఇద్దరూ ఒక్క మాట మీదుంటేనే కాపురం నడుస్తుంది. లేదంటే అంతే ఏమౌతుంది జీవితం? ప్రశ్నకి ధీటైన జవాబు గా నిలిస్తుందీ కథ. కలిసి నడిచిన ఏడడుగుల బంధానికి, విడిపోయి వేశే తప్పటడుగుల అగాధానికి మధ్య తేడాని ఎంతో హృద్యం గా దృశ్యీకరించిన రచయితకు అభినందనలు.
శ్రీమతి వల్లభజోశ్యుల రాజేశ్వరమ్మ సాంబమూర్తి గార్ల స్మారక బహుమతి పొందిన కథ – మురళి గారి అబ్బాయి. రచన శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. ఆడపిల్లలలపై జరుగుతున్న అత్యాచారాలు పేపర్లో చదివి వ్యధ చెందే ఆ తండ్రికి తన పిల్లలెలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటాడు. ఆడపిల్లల కి వస్త్రధారణ విషయం లో స్వేచ్చ ఎంతవరకు అవసరమో, మగపిల్లలకి సాటి ఆడపిల్లల పట్ల సత్ప్రవర్తన ఎంత ప్రాముఖ్యమో నేటి సమాజంలో చెప్పారు రచయిత్రి. మంచి సందేశాత్మక కథని అందించిన రచయిత్రికి అభినందనలు.
శ్రీమతి ముదునూరు వసంతకుమారి రామమూర్తి రాజు గారి స్మారక బహుమతి పొందిన కథ – నీ ప్రేమకై. రచన – శ్రీమతి కిరణ్ విభావరి. కథేమిటంటే – పెళ్లయినా కానీ, మరచిపోలేని ప్రియుణ్ని కలవడానికి వెళ్తుంది. కానీ అతని అవమాకరమైన మాటలు, ప్రవర్తన ఆమెని బాధిస్తాయి. కాదు. మేల్కొల్పుతాయి. అంతటితో అతనిమీద విరక్తి కలుగుతుంది. అక్కణ్నించి కదలి వచ్చేస్తుంది గొప్ప మెలకువతో. కానీ అది అబద్ధం. మరి అసలు నిజం ఏమిటన్నది కథ చదివితే తెలుస్తుంది.
శ్రీమతి ప్రమీలా రాణి గారు ఎంతో పదిలంగా అల్లిన రెయిన్ బో రిబ్బన్ ఓ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ముఖ్యం గా కాట్ లవర్స్ కి మరింత ప్రీతికరం గా నిలుస్తుంది.
డా.సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కతలు సిరీస్ లో ‘ఎండవేళా కొంప గుండవాటలు – తల్లి తండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో వుంచడం, తప్పు చేస్తే కోప్పడటం సహజమే కానీ, చేస్తున్న మంచి పనుల్ని కూడా నేరాలు గా భావించి నిందించడం..బాధగానే వుంటుంది. ఈ కథలో వర్ణించిన దృశ్యాలన్నీ మనింట్లో జరుగుతున్నంత సహజం గా వుండి, పాఠకుల మనసుని హత్తుకుంటాయి. ఎండ వేళ చల్లని సాయంత్రపు చిరు గాలి చుట్టుకున్న భావన కలిగింది. అసలు సిసలైన తెలుగు కథకి మల్లెపూవు లాటి సంతకం. – ఈ ఇల్లేరమ్మ కతలు.
ఒక పూల వ్యాపారి తన అప్పుతీర్చలేని అసహాయతని వివరిస్తూ..అందుకు ఫేస్బుక్, వాట్సప్ లే కారణమని పేర్కొంటాడు. ఏమిటా కారణం అన్నడి రవూఫ్ కార్టూన్ చూస్తే తెలుస్తుంది.
శ్రీమతి శాంతి కృష్ణ గారు నిర్వహిస్తున్న దాచాలంటే దాగవులే శీర్షికన శ్రీ ప్రమోద్ ఆనంద్ రచించిన గుండెచప్పుళ్ళు కవితా సంపుటిని పరిచయం చేసారు.
తొలితరం మహిళా రచయిత్రులు శీర్షికన శ్రీమతి శేషూఅప్పారావు గారు – విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రులైన కృష్ణాజమ్మా, రంగాజమ్మ (క్రీ.శ. 1633 -1674 కాలం నాటి) కవయిత్రులను పరిచయం చేసారు.
శ్రీమతి గిరిజ పీసపాటి గారి ఉద్యోగపర్వం..లో బాస్ మీద అలిగిన ఉద్యోగిని అమాయకత్వం, బాస్ క్షమా గుణం చదువరులని కదిలిస్తాయి.
ఆపాత కథనాలు శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారి ‘తంసోమా జ్యోతిర్గమయ ‘ కథని పరిచయం చేసారు శ్రీ శ్యామసుందర రావు అంబడిపూడి.
భావ కవిత రమ్యలోక పితామహుడైన రాయప్రోలు అంటూ రాయప్రోలు గారి కవితా వైభవాన్ని కడు రమ్యం గా వివరించారు శ్రీమతి ఇందిర భైరి.
స్త్రీల పై జరుగుతున్న అన్యాయాలకు సమ న్యాయం జరగడం లేదంటూ తన వేదనని వ్యక్త పరుస్తూ అందుకు సాక్ష్యం గా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన టేకు లక్ష్మి అచ్యాచార దుర్ఘటనని కళ్లముందుంచారు రచయిత్రి – శ్రీమతి మెహజబీన్ తన కథ విందువా నా కథ విందువా శీర్షికన. ఆలోచించదగిన విషయమే!
అందమైన అనువాదాలు శీర్షికన పంజాబ్ నవలా రచయిత్రి డాక్టర్ దిలీప్ కౌర్ తివానా గారి యహ్ హమారా జీవన్ అనే నవలకి శ్రీ వేమరాజు భానుమూర్తి గారి తెలుగు అనువాదమైన ఇది మన జీవితం నవలను పరిచయం చేస్తూ విశదీకరించారు. జ్వలిత గారి విశ్లేషణ చాలా బావుంది.
శ్రీమతి తటవర్తి రాజేశ్వరి గారి జ్యోతిశ్శాస్త్రం లో రాహు దశ గురించి చాలా ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ముఖ్యం గా కుజ నక్షత్రం లో పుట్టిన వారు చదివి తెలుసుకోదగిన విషయాలున్నాయి.
డా బెల్లంకొండ నాగేశ్వర రవు గారి ‘ఆకాశ వీధిలో..’ శీర్షికన ప్రముఖ కళాకారులు శ్రీ విన్నకోట రామన్న పంతులు గారి గురించి ఎన్నో గొప్ప గొప్ప విశేషాలను అందించారు. ధన్యవాదాలు. ఆ మహా కళాకారునికి ఇవే మన పుష్పాంజలులు.
శ్రీమతి బిందుమాధవి మద్దూరి గారి ‘చందమామ కాపురం..’
సైన్స్ కబుర్లలో పగటిపూట చంద్ర బింబం కనిపిస్తుందా అనే వాదోపవాదాల మధ్య వెలిగిన విజ్ఞాన దీపాం. మీరూ దర్శించండి.
తొలి తెలుగు నాటక కర్త, సినీ గేయ రచయిత అయిన శ్రీ చందాల కేశవ దాసు గారి చిత్రం శ్రీ పొన్నాడ మూర్తి గారి చిత్ర లేఖనంలో జీవం పోసుకుని మూర్తిమంతమైంది.
శ్రీమతి చెల్లూరి కామేశ్వరి గారి బంజారా పడుచు చిత్రం వర్ణాతి వర్ణం గా వుంది.
శ్రీ చంద్ర సేఖర రావు బేతపూడి ‘చిత్రం – పద్యం’ ప్రయోగం బావుంది.
ఆనాటి భారతం ఈనాటికి సత్యమై నిలుస్తుందనడంలో ఎలాటి అసత్యం లేదంటూ సాక్ష్యాధారాలను అందిస్తున్నారు డా.వై. కృష్ణ కుమారి గారు.
శ్రీమతి వసంతలక్ష్మి అయ్యగారి నిత్య వసంతం నూతన శీర్షికారంభ సందర్భం గా స్వాగతం పలుకుదాం. ఇటు హాస్యంతో బాటు అటు అవగాహన ని కలిగించే రచనలకు శ్రీకారం ఈ గుండెటాకు. రచయిత్రికి కి అభినందనలు.
చక్కని గిలి లో కార్టూన్స్ అన్నీ చక్కిలిగిలిగింతల నవ్వుల్నే పూయించాయి బాచి గారు అందుకోంది తెలుగు తల్లి పాఠకుల నవ్వుల పూల అభినందనలు.
టొరొంటో తెలుగు ఎఫ్ ఎం ప్రోగ్రాంస్ వింటున్నారా? ఆదివారాలు ఉ.10 నిండి 10.30 వరకు.
శ్రీ కె.ఎస్.రావ్ గారు సుడుఒకు అంకెల దాడి ని మెదడుతో ఎదుర్కోండి. ఇందులో గారడీ లేదు. వున్నదంతా మేధ కి పదును పెట్టే కిటుకు మాత్రమే. మనసుకి ఆనందం. మెదడుకి ఉత్సాహం. తప్పకుండా పాల్గొనండి.
జై తెలుగుతల్లి కెనడా!
*****
నా పేరు రాధ.
M.A.Telugu, M.Ed. చేసాను.
మదనపల్లి దగ్గరున్న రిషీవ్యాలీ స్కూల్లో పిల్లలకి తెలుగు చెప్తాను, కథలు చెప్తాను, కథలు రాయిస్తాను, రాస్తాను. రిషీవ్యాలీలోనే కాక చుట్టుప్రక్కల ఉన్న పిల్లలకి కూడా అన్ని రకాలుగా, నాకు చేతనైనంతగా సహాయం చేస్తాను.
రచయిత్రి గా నా గురించి :
* నేను 2013 నుండి కథలు రాస్తున్నాను. ఇలా ఇప్పటి వరకూ రాసినవి – (ఆంధ్రజ్యోతి, విపుల, పాలపిట్ట, ఆంధ్రభూమి, సాక్షి, నవతెలంగాణా, భూమిక, చినుకు, తెలుగువెలుగు, సారంగ, కౌముది, కినిగె, ఈమాట, వాకిలి లో ప్రచురించబడ్డాయి)
* పెద్దవాళ్ళ కోసం, పిల్లల కోసం కథలు ఇంకా జానపద కథలు (అనుసరణ, అనుసృజన, అనువాదం), పిట్ట కథలు, కవితలు, సమీక్షలు, మా అక్క మనవరాలు సహస్ర మాటలని ‘గుజ్జెనగూళ్ళు’ రాశాను.
ఇక ఫేస్ బుక్ పోస్టులు రాస్తూనే ఉంటాను. 🙂
* ‘ప్రపంచ ప్రసిద్ధ జానపదకథలు’ – జానపదకథలను పుస్తకంగా ప్రచురించారు విశాలాంధ్ర వాళ్ళు. వాళ్ళే పెద్దల కథలని (ఆకాశమల్లి కథల సంపుటం) పిల్లల కథలని (పిల్లలు – బొమ్మలు ) ప్రచురించారు. “ఈ క్షణం” అనే పేరుతో – కవితాసంపుటిని ఫ్రెండ్స్ పబ్లికేషన్స్ వాళ్లు ప్రచురించారు.
చదవడం ఇష్టం :
* నేను చాలా చిన్నప్పటి నుంచే – ఐదవ తరగతి నుంచే పిల్లల కథలు చదివేదాన్ని. ఆ తర్వాత మా ఊళ్ళో నాగేశ్వరమ్మక్క, శేషమ్మక్క, విశాలక్క అందరూ మా వీధి వాళ్ళు ఒక్కొక్కరూ ఓ పత్రికని, నవలలని (అద్దెకి) ఒంగోల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న నా చేత తెప్పించుకునే వారు. వాటిని వస్తూ వస్తూ బస్ లోనే చదివేసే దాన్ని. అయితే అన్ని కథలు, నవలలు చదివినా ఏ రచయితనీ చూడలేదు. వాళ్ళంటే ఏదో చాలా గొప్పవాళ్ళని ఊహించుకునే వయసు అది.
నా పెళ్ళయ్యాక మద్రాసులో ఉన్నప్పుడు మా ప్రక్కింటి తమిళావిడ కథలు రాస్తుందని తెలిసింది. ఆ తమిళ రచయిత్రిని చూడగానే నాకూ కథలు రాయాలనిపించి నాలుగైదు కథలు రాసి పత్రికలకి పంపాను.
తర్వాత ఇరవై ఏళ్ళ పాటు నేను కథారచన జోలికి పోలేదు. రిషీవ్యాలీ వచ్చాక ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు నా రచనలకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి.
కథలు ఎందుకు రాయాలి అంటే :
ఈ లోకానికి మనం ప్రయాణీకులుగా వచ్చాం. సహ ప్రయాణీకులలోని వివిధ భావాలనీ, వైరుధ్య భంగిమలనీ పట్టుకోగలుగుతున్నాం. మంచి చెడుల రూపాలనీ వాటి ప్రభావాల్నీ చూడగలుగుతున్నాం. వాటిని అక్షరాలుగా తీర్చి దిద్దగలిగే సామర్ధ్యాన్ని పెంపొదించుకున్నాం. ఇక రాయకపోవడానికి అడ్డేమిటి అనుకోగానే కలం కదిలింది. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత నిశితంగా పరిశీలించడం మొదలయింది.
రచయిత్రి గా కనుగొన్నదేమిటంటే :
స్త్రీ పురుషుల భావోద్యేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత – స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను “ఆకాశమల్లి” అనే కథలో చూపగలిగాను. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది – ఆత్మవిశ్వాసం, ఆత్మబలం అని కూడా ఆ కథ ద్వారా చెప్పాను.
రైటర్ కి ‘నిబద్ధత’ అవసరం : అభిమానుల అభినందనలు అందుకుంటూ.. పాఠకులతో మాట్లాడుతుంటే – రచనలు చేసేటప్పుడు రచయితకి ముఖ్యంగా కావలసినది ‘నిబద్ధత’ అని తెలిసింది. మనం రాసే ప్రతి వాక్యానికీ మనది కాని మరో దృష్టికోణం ఉంటుందని దాన్ని రచయితలు తమ తలలు వంచి మరీ చూడాలని అర్థమైంది.
జీవితమంటేనే అనుభవం.
అనుభవాలని ఆవిష్కరించడానికి, సృజించడానికి రచయితలు పిల్లల్లా మారి తమ చుట్టూ గమనించాలంటాను నేను. వాళ్ళు దేన్నైనా ఎంత ఆసక్తిగా, ఏకాగ్రతగా గమనిస్తారో చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంటుంది.
అలాగే నాకున్న మరో అదృష్టం – ఎప్పుడూ పిల్లలతో గడపగలిగే అవకాశం ఉండటం. ఈ పిల్లల సహాయంతోనే రాసిన మరో కథ “మనసుకు తొడుగేది”
నాకు తాత్తి్వక కథలంటే ఇష్టం.
అలాంటి కథలు రాసే ఆర్.ఎస్. సుదర్శనం, వసుంధరాదేవి, జలంధర, శ్రీవల్లీ రాధికలు రాసిన కథలు చదివీ, హై సొసైటీ వాళ్ళని దగ్గరగా చూస్తుంటాను.
పల్లెలో పెరిగాను, చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతలు నెత్తిన పడ్డాయి కాబట్టి ఆ అనుభవాలతో రాసిన కథలు “మాన్యత” (విపుల), “చందమామోళ్ళవ్వ” (ఆటా బహుమతి లభించిన కథ), “చందమామ బిస్కత్తు” (ఫేస్ బుక్ కథ గ్రూప్ బహుమతి లభించిన కథ).
చుట్ఙు ప్రక్కల ఊళ్ళల్లోని యువకులని, యువతులని గమనించి రాసిన కథలు నాలుగైదు ఉన్నాయి.
స్కూళ్ళు మూసేయడం ఎంత అమానుషం? సీమాంధ్ర – తెలంగాణా బంద్ అప్పుడు స్కూళ్ళు మూసేయడం వల్ల ఇక్కడ ఉన్న పల్లె పిల్లల దుస్తితి చూసి రాసిన కథలు గొప్ప ఆదరణ పొందాయి
కథ టెక్నిక్ తో రాయాలి : కథకి చదివించే గుణం కావాలి కాబట్టి మనం కథకి కావలసిన టెక్నిక్ ని తెలుసుకుని రాయాలి. దాని కోసం మనం మన పాత రచయితలు వేసిన నిచ్చెనలు ఎక్కాలి. ఆ పఠనం వల్ల రచయితలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడే మనలో ఉన్న ముడిరూపానికి మెరుగులు దిద్దుకోగలిగే పరిజ్ఞానం కలుగుతుంది.
రచయితకు సామాజిక బాధ్యత వుంటుంది :
కథలు రాసి సామాజిక పరిస్థితుల్ని మార్చడం అనేది భ్రమ అంటారు కొంతమంది. కావొచ్చు కాని “రాయడమంటే సామాజిక బాధ్యత” అని రచయిత తెలుసుకోవాలి. మనం రాసిన రాతలకి మనమే జవాబుదారీ అని గ్రహించిన రచయిత వ్యక్తిగా ఎదుగుతాడు. కథ అనేది ముసుగులని
తొలగించాలి తప్ప ముసుగులని తొడుక్కోకూడదని గ్రహిస్తాడు.
*****
ఆర్.దమయంతి
పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడమూ మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశంవుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.
కథ కాని కథ, ఈ కథ ఎందుకు నచ్చిందంటే, నేను చదివిన కథ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు.
ప్రస్తుతం ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.
వీక్షణం (బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ0, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ ) వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.
రచయిత్రి ప్రస్తుతం – నార్త్ కరొలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.