వెనుతిరగని వెన్నెల(భాగం-26)
-డా|| కె.గీత
(ఆడియో ఇక్కడ వినండి)
వెనుతిరగని వెన్నెల(భాగం-26)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది.
***
మర్నాడు కాలేజీ నించి మధ్యలోనే బయటికొచ్చి ఊరికెళ్ళడానికి బస్సెక్కింది తన్మయి.
రాత్రంతా భయంతో నిద్ర సరిగా పట్టలేదేమో బస్సెక్కగానే కళ్లు మూతలు పడిపోయాయి.
ఇంటికి చేరుకునేసరికి రాత్రి భోజనాల వేళ అయ్యింది. అసలేవీ ఆలోచించే ఓపిక లేదు తన్మయికి. బేగు భుజానేసుకుని నీరసంగా బస్టాండు నించి ఇంటికి నడవసాగింది తన్మయి.
వీధి మొదలుకి చేరేసరికి బాబు ఏడుపు గట్టిగా వినబడసాగింది.
అది మృదుల్ గొంతులా వినబడేసరికి నడక వేగం హెచ్చించింది తన్మయి.
గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టగానే గట్టిగా ఏడుస్తున్న బాబుని భుజానేసుకుని సముదాయిస్తూ, అటూ ఇటూ తిరుగుతూన్న తండ్రి కనిపించేడు.
బాబు తన్మయిని చూడగానే ఒక్క ఉదుటున చేతుల్లోకి దుమికి ఇంకా గట్టిగా ఏడవసాగేడు.
తన్మయి అక్కడే అరుగు మీద బాబునెత్తుకుని చతికిలబడి గుండెలకు హత్తుకుంది.
తల్లి వెచ్చని స్పర్శకు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు కాస్సేపటికి.
“హమ్మయ్య, ఇందుకన్న మాట పేచీ“. అన్నాడు భానుమూర్తి.
“అమ్మ ఏదీ?” అంది తన్మయి లోపలకి నడుస్తూ.
“లోపల పడుకుంది. నాలుగు రోజుల్నించి మీ అమ్మకు ఒకటే జ్వరం. బాబుని నేనొక్కడినే సముదాయించుకొస్తున్నాను. మీ అమ్మచేతి గోరు ముద్దలు అలవాటయ్యి, నేను అన్నం తినిపిస్తుంటే సరిగా తినడంలేదు. అందుకేమో బాగా పేచీ పెడుతున్నాడు. ఇక నువ్వొచ్చేసేవుగా. మీ అమ్మకు తగ్గే వరకూ ఉండి వెళ్ళమ్మా.” అన్నాడు భాను మూర్తి తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ.
“లేదు నాన్నా, నేను మళ్లీ సోమవారం ఊరికి వెళ్లిపోవాలి. చాలా చదువుకోవలసినవి ఉన్నాయి. బాబుని నాతో తీసుకెళ్తాను. అమ్మకు తగ్గేక తీసుకొస్తాను మళ్లీ.” అంది తన్మయి.
“తీసుకెళ్లి ఎలా చూద్దామని? ఒంట్లో బావున్నా బాలేకపోయినా మాకు తప్పదుగా” విసుగ్గా అరిచింది జ్యోతి అంత జ్వరంలోనూ.
“అమ్మ అందని కాదు గానీ, నువ్వు కూడా శేఖర్ తో చెప్పకుండా ఎన్నాళ్లని మనగలవు?” ఆలోచించమ్మా అన్నాడు భాను మూర్తి.
తనకే తెలీని విషయాల్ని తల్లిదండ్రులకి ఎలా చెప్పి ఒప్పించాలో తెలియలేదు తన్మయికి.
“ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కొనసాగించాలి. పీ .ఎచ్. డీ చెయ్యాలన్న తన లక్ష్యాన్ని సాధించాలి.” అంతే తనకు తెలిసింది.
బాబుని దగ్గరకు హత్తుకుని కళ్ళు తుడుచుకుంది.
***
సోమవారం ఉదయానే తిరుగు బస్సెక్కింది తన్మయి.
కూతురి మనసులో దృఢమైన సంకల్పాన్ని కాదనలేక దగ్గరుండి బస్సెక్కించాడు భాను మూర్తి.
తల్లి ఒళ్లో కూచుని ఆనందంగా కేరింతలు కొట్టసాగేడు బాబు.
వేగంగా వెళ్తున్న బస్సు కిటికీ లోంచి వీస్తున్న చల్లని గాలి మనస్సులో రేగుతున్న ఆలోచనలని మళ్లించలేకపోతూంది.
“వెళ్తూనే శేఖర్ కి ఫోను చెయ్యాలి. బాబు తన దగ్గర ఉన్నంత వరకూ కాలేజీ కి వెళ్లడం కుదరదు కాబట్టి కాలేజీ అయ్యేక అందరినీ కలిసి నోట్సులు తీసుకుని చదువుకోవాలి…”
గేటు ముందు ఆటో దిగగానే ఎవరిదో స్కూటర్ ఉంది. అచ్చం శేఖర్ వాళ్ల పిన్ని భర్త స్కూటర్ లా ఉందది.
“శేఖర్ పిన్ని, బాబాయి వచ్చారా ? శేఖర్ వచ్చాడా ?” ఇంటి తాళం వేసినది వేసినట్లే ఉంది. “బహుశా: ఎవరిదో అయి ఉంటుంది లెమ్మ“ని సరిపెట్టుకుంది తన్మయి.
ఇంటికి వస్తూనే స్టవ్వు మీద కాస్త అన్నం పడేసి, బాబుకి స్నానం చేయించి తయారు చేసింది.
ఇంతలో ఇంటి వాళ్ల పనమ్మాయి వచ్చి ఇంటిగలావిడ పిలుస్తూందని చెప్పింది.
ఎప్పుడూ పిలవని ఆవిడకు తనతో పనేవిటో అనుకుంటూ మేడ మెట్లెక్కి పనమ్మాయి వెనుకే పైకెళ్లింది తన్మయి.
మేడ పైన పెంట్ హౌస్ హాల్ లోకి అడుగు పెట్టిన తన్మయి శేఖర్ ని, వాళ్ల పిన్నిని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. అందుకన్న మాట స్కూటర్ బయట ఉంది. కానీ ఇంట్లో కాకుండా ఇక్కడెందుకున్నారు?
శేఖర్ ని చూడగానే బాబు చటుక్కున చేతుల్లోంచి దుమికి అటు పరుగెత్తాడు. “నాన్నన్నాన్నా” అంటూ.
ఈ మధ్యే వాడికి చిన్న చిన్న మాటలు వచ్చేయి.
శేఖర్ వాణ్ణి ఒళ్ళో కూచో బెట్టు కున్నాడు.
వాళ్ల పక్కనే మరో రెండు కుర్చీల్లో ఇంటిగలావిడ, వాళ్లాయన కూర్చుని ఉన్నారు.
ఇంటిగలాయన వైపు చూడడానికి కూడా అసహ్యం వేసింది తన్మయికి.
“అసలు శేఖర్ ఎప్పుడొచ్చేడు? వీళ్లంతా ఇక్కడెందుకు సమావేశమయ్యేరు?” ఏవీ అర్థం కాని తన్మయి బిత్తర చూపులు చూసింది.
కూర్చోమన్నట్టు కుర్చీ చూపించింది ఇంటావిడ.
తన్మయి కూర్చోబోతూ శేఖర్ వైపు “ఏవిట“న్నట్టు చూసింది.
“ఎంతకు బరితెగించేవే, మొగుణ్ణి నాతో చెప్పకుండా ఇక్కడికి వచ్చేయడమే కాకుండా, మరొకడితో కాపురం పెట్టేసేవా?” హఠాత్తుగా గట్టిగా అరుస్తూ అన్నాడు శేఖర్.
అసలు తను ఏం మాట్లాడుతున్నాడో ఇంకా అర్థం కాని తన్మయి ముఖం చిట్లించి ప్రశ్నార్థకంగా చూసింది.
అతని పిన్ని అందుకుని “నేను కళ్లారా చూసేను, కిందటి వారం ఒకడెవడో ఈవిడతో బాటూ ఇంట్లో ఉన్నాడు, వీళ్లిద్దరూ కలిసి పొద్దుపోయే వేళ షికారుకి కూడా వెళ్లేరు.” అంది.
తన్మయి, “ఛీ” అని గట్టిగా అరిచి, కళ్ల నీళ్ల పర్యంతమవుతూ “అన్యాయంగా మాట్లాడకండి” అంది.
“మా అక్క ఈవిణ్ణి కోడలుగా చేసుకున్నందుకు ఎంతో క్షోభననుభవిస్తన్నాది. ఇంతకు రెట్టింపు ఆస్తిపరులు మా వాడికి పిల్లనిస్తామని ముందు కొచ్చేరు, కానీ ఈ మహమ్మారిని చేసుకుంటానని ఇదుగో వీడే పట్టుబట్టేడు” అని చేతులు ఊపుతూ కొనసాగించింది అతని పిన్ని.
ఇంతలో ఇంటిగలాయన “ఈవిడ కోసం కుర్రాళ్లు వచ్చి పోవడం నేనూ చాలా సార్లు చూసేను. నా మీదా కన్నేసింది” అన్నాడు కసిగా.
“అబద్ధం, ఇతనే నా చెయ్యి పట్టుకున్నాడు” అతని వైపు అసహ్యంగా చూస్తూ గట్టిగా అరిచింది తన్మయి.
“అమ్మో, అమ్మో మా ఆయన మీదే అభాండాలు వేస్తూంది, మొగుడు వేరే ఊళ్లో ఉండగా, అతనికి చెప్పకుండా ఈవిడిక్కడుండవేవిటీ, ఇక్కడుండి ఈవిడ ఇష్టం వచ్చినట్లు తిరగడమే కాకుండా మా ఆయన మీద అభాండాలు వెయ్యడవేంటి? ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చెయ్యండి” అంది ఇంటిగలావిడ.
తన్మయికి కోపం నెత్తికెక్కింది. “మీలాంటి సంస్కారం లేని మనుషుల మధ్య ఉండాల్సిన అవసరం నాకు లేదు.” అని
శేఖర్ వైపు తిరిగి, “అసలేంటి నీ ఉద్దేశ్యం? నీకేవైనా సందేహాలుంటే నాతో మాట్లాడు, ఈ చెత్త పంచాయితీ ఏవిటి?” అంది విసురుగా.
ఈ గందరగోళం లో బిత్తరపోయి బాబు ఏడుపు లంకించుకుని శేఖర్ ఒళ్ళో నుంచి తల్లి వైపు దుమికి రాబోయి టేబుల్ మీదున్న నీళ్ల గ్లాసుని ఒంపేసేడు.
బదులుగా “చూసేరా? వీణ్ణి కూడా ఇలా పద్ధతి లేని ఎదవలా పెంచుతూంది.” అని తన్మయి వైపు ఈసడింపుగా చూస్తూ, “నీతో మాట్లాడే టైము అయిపోయిందే. ఇక మాట్లాడదల్చుకోలేదు. నీ అంతు తేలుస్తా” అన్నాడు శేఖర్.
ఒక్క ఉదుటున బాబుని చంకనెత్తుకుని తన్మయి, అందరి వైపూ వేలు చూపిస్తూ, “అయితే వినండి, మీకెవరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరంతా కలిసి గంగలో దూకండి.”
అని అక్కణ్ణించి గబగబా బయటికి వచ్చింది.
నడుస్తున్న తన్మయికి కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించి గుండె దడ దడా కొట్టుకోసాగింది. పాదాలలో ఓపిక లేనట్లయ్యింది.
అసలక్కడ ఏం జరుగుతూందో అర్థం కావడం లేదు మొదట.
తన మీద గొడవ పెట్టాలనుకుంటే ఇంట్లో కాకుండా ఇక్కడెందుకు వీళ్లందరి ముందూ పంచాయితీ పెట్టేడో తెలియడం లేదు.
వీళ్లందరికీ తన మీద ఇంత కక్ష ఏవిటో? ఒకరి మాటలు అర్థమయే లోగా మరొకళ్లు తన మీద నిందలేస్తున్నారు.
ఇంట్లోకొచ్చి తలుపు గడియ పెట్టుకుంది. మంచమ్మీద బోర్లా పడుకుని కుమిలి కుమిలి ఏడవ సాగింది.
ఎంత అవమానం! ఎంత అవమానం!! వాళ్లందరి ముందూ తనని ఒక కేరెక్టర్ లేని మనిషిగా నిలబెట్టేడు శేఖర్. ఇంతకంటే చావడం మేలు.
దు:ఖంతో ఏవేవో మాట్లాడుతూ పొగిలి పొగిలి ఏడవ సాగింది తన్మయి.
తనేం పాపం చేసింది! ఇంత అవమానం తర్వాత తను సమాజంలో తలెత్తుకుని బతక గలదా?
ఒక పక్కనుంచి బాబు కూడా బాగా ఏడుస్తున్నాడు ఏం జరుగుతూందో తెలీక.
చావాలని అనిపించేక, ఎలా చావాలా అని మనసు ఆలోచించడం మొదలుపెట్టింది. అంతలో పక్కనే బేలగా చూస్తున్న బాబు కనిపించేడు.
కాస్సేపట్లో దు:ఖం నించి తేరుకుని కళ్లు తుడుచుకుని స్థిమితంగా ఆలోచించసాగింది తన్మయి.
చావాలంటే ఎలాగైనా చావొచ్చు. బతకాలంటేనే ఏం చెయ్యాలో ఆలోచించాలి.
ఒక్కసారిగా తల విదిలించుకుంది. బాబు బాధ్యత తనని చావకుండా వెనక్కి లాగుతూంది
ఒక కాగితం తీసి రెండు భాగాలుగా గీసింది. బతికితే, చచ్చిపోతే – లాభనష్టాలు రాయడం మొదలు పెట్టింది.
బతకడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం, ఒక ప్రాణిని పెంచి పెద్ద చేసి, గొప్ప వాణ్ణి చెయ్యగలగడం, కనీసం కుసంస్కారుడైన తండ్రిలా కాకుండా మంచి వాడిగా పెంచడం.
చచ్చిపోతే ఈ పిల్లాడు తల్లి సంరక్షణకు దూరమై నానా ఇబ్బందులూ పడడమే కాకుండా తిరిగి తండ్రిలాంటి కుసంస్కారుడే అవుతాడు. అలాగని తనతో బాటూ పిల్లవాణ్ణి చంపే కౄరత్వం తనలో లేదు.
మొదటి పాయింటు దగ్గరే తన్మయి బతకాలని నిర్ణయించుకుంది. తాను బతకడమే కాదు, బాబుని ప్రయోజకుణ్ణి చెయ్యాలి.
బాబుని ఒళ్లోకి తీసుకుని తల నిమిరింది.
“ఏమీ కాలేదు నాన్నా, భయ పడకు, అమ్మ ఉందిగా. ఎలాంటి పరిస్థితుల్నయినా తట్టుకుని నిలబడతాను, తప్పులు చెయ్యనప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు.” అంది వాడి తల మీద చెయ్యి పెట్టి.
ముఖం కడుక్కుని వచ్చి అన్నం తినిపించి, నిద్ర పుచ్చింది.
బాబు పక్కనే పడుకుని కళ్లు మూసుకుంది. ఎంత కాదనుకున్నా, అలా అందరి ముందూ శేఖర్ తనని అవమానించడం తట్టుకోలేక మళ్లీ దు:ఖం తన్నుకురాసాగింది.
కాస్సేపట్లో శేఖర్ వచ్చిన అలికిడి అయినా వెనక్కు తిరిగి చూడకుండా ఇంకాస్త గట్టి గా కళ్లు మూసుకుంది.
బీరువా తలుపులు దబదబా తీయడం, మూయడం, వంటింట్లోకెళ్లి సామాన్లు విసిరి కొట్టడం వంటివి వినిపిస్తున్నా స్థాణువులా అలాగే గోడ వైపు తిరిగి పడుకుంది.
దాదాపు గంట తర్వాత వీధి తలుపు విసురుగా వేసి శేఖర్ బయటకు వెళ్లిపోవడం వింది.
అతను వెళ్ళేక మరో గంట చలనం లేకుండా పడుకుంది.
అసలు ఆలోచించే ఓపిక కూడా లేదు.
ఏం జరుగుతూందో, అసలీ రాద్ధాంతం అంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి.
కావాలని పెళ్లి చేసుకుని, ఏనాడూ సంతోషమనేది మిగనివ్వకుండా చేస్తున్నది అతను. తన మానాన తను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తి స్తూ బాధ్యతా రాహిత్యంగా నడుచుకుంటున్నది అతను.
తిరిగి తన మీద నింద వెయ్యడమూ, పైగా ఎందుకూ కొరగాని ఇంటిగలవాళ్ల ముందు పంచాయితీ పెట్టడమూ.
ఎందుకిదంతా జరుగుతూంది?తను ఏం తప్పు చేసింది? చదువుకోవాలన్న ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకోవడం తప్పా? ఈ మాత్రం చదువు మీద నైనా దృష్టి మరల్చుకుని ఉండకపోతే నరకప్రాయమైన తన బతుక్కి చావు తప్ప మరో శరణ్యం ఉందా?
కళ్లు మూసుకుని “అజ్ఞాత మిత్రమా! నన్ను రక్షించు. నా చిన్నారి బాబుని సంరక్షించుకునే ధైర్యాన్ని నాకివ్వు.” అని పదే పదే అనుకోసాగింది.
పొద్దుట్నించీ ఏవీ తినకో ఏమో గానీ కడుపులో బాగా తిప్పుతూంది.
నెమ్మదిగా వెనక్కి తిరిగి ఎదురుగా కనబడ్డ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది.
బీరువాలో శేఖర్ వస్తువులున్న సొరుగులన్నీ ఖాళీగా ఉన్నాయి. లాకర్ లో ఉన్న బంగారం వస్తువులు, డబ్బులు, బ్యాంకు పాసుపుస్తకాలు అన్నీ మాయమైపోయాయి.ఇంట్లో అతని బట్టలు, బూట్లు ఇతరత్రా అతని సామగ్రి ఏవీ లేవు. తనవనే వస్తువులు చేతికందినంత వరకూ అన్నీ తీసుకుని వెళ్లిపోయాడు శేఖర్.
ఒక్కసారిగా మరింత నీరసంతో గోడకి జేరబడి కూర్చుండి పోయింది.
మోకాళ్లలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
జరుగుతున్న పరిణామాలకి ఏడుపు ఆపుకుందామనుకున్నా తెలీకుండా తన్నుకు వస్తూనే ఉంది.
తల్లి ఏడుపు వినబడి బాబు మంచమ్మీంచి దిగి వచ్చి బేలగా ఒళ్లో తలదాచుకున్నాడు.
వాడి తలంతా తన్మయి కన్నీళ్లతో తడిసిపోతూంది.
“చూడురా, నాన్నా, మీ నాన్న ఏం చేసాడో” అంది వెక్కుతూ. వాడికి అర్థం కాక పోయినా చిన్ని చేతుల్తో కళ్లు తుడిచాడు.
“నాన్నాన్నాన్నా” అంటూ రెండు చేతులూ చాచి బయటకు నడవసాగేడు.
తన్మయి ఒక్క ఉదుటున బయటకు పరుగెత్తి వాడిని గుమ్మం దగ్గిర పట్టుకుంది.
ఇక లాభం లేదు. ఇంటికి ఫోను చేసి చెప్పవలసిందే.
ఇంట్లో అక్కడక్కడా దాచుకున్న డబ్బులు లెక్క చూసుకుంది. వంద రూపాయల వరకూ ఉన్నాయి. అంతే.
అప్పటికే పొద్దు పోతూంది. ఇల్లు తాళం వేసి బాబుని చంకనేసుకుని ఫోను బూత్ దగ్గిరికి వచ్చింది.
పొద్దుట్నించీ ఒక్కతే మోస్తున్న బాధా భారమంతా తండ్రికి ఫోను చెయ్యగానే పెల్లుబికింది.
“నాన్న గారూ!” గొంతు పూడుకు పోతూండగా భాను మూర్తికి జరిగినదంతా వివరించింది.
“గాభరా పడకమ్మా, అల్లుడు ఎక్కడికీ వెళ్లుండడు, వాళ్ల తాతగారి ఇంట్లో ఉండి ఉంటాడు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అధైర్య పడకు.” అన్నాడు భాను మూర్తి.
జ్యోతి వెంటనే ఫోను లాక్కుని, “అందుకే నేను నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పేను. ఒక్కదానివీ అక్కడుండొద్దని. విన్నావా? అయినా అసలు అలా వీధికెక్కి రచ్చ చేస్తున్నపుడే మాకు ఫోను చెయ్యకపోయావా?” ఏం ఊరుకూంటామనుకుంటున్నాడా? నాన్న గారు ఇప్పుడే వస్తున్నారు. నాకు వొంట్లో బావుంటే నేనూ వచ్చేదాన్ని. ఏడవకమ్మా, నువ్వస్సలు ఏడవొద్దు” అని, అట్నించి తన్మయి ఏడుపు విని గట్టిగా గద్దించింది.
ఇంటికి తిరిగొస్తూండగా గేటు దగ్గిర నిలబడి ఒళ్లంతా దెబ్బలతో కరుణ ఎదురయ్యాడు.
అతని నుదుటి మీద ఎవరో బలంగా కొట్టినట్లు చర్మం చీరుకు పోయి రక్తం కారుతూంది.
ఒళ్లంతా బురద కొట్టుకుపోయి, చొక్కా చినిగి వేళ్లాడుతూంది.
“అదేవిటి, మీకేమైంది కరుణా!” అంది గాభరాగా తన్మయి.
“మీ ఆయన నిర్వాకం” అన్నాడు ఈసడింపుగా తుపుక్కున రోడ్డు మీద ఉమ్మేస్తూ.
“ఇందాకా నేను లైబ్రరీ లోంచి బయటికొచ్చి యూనివర్శీటీ నుంచి బస్టాండు దగ్గరకు నడుస్తూండగా, నలుగురు మనుషుల్ని వెనకేసుకొచ్చి చితక్కొట్టేడు మీ ఆయన.
అసలు నేనేం చేసేనని అడిగితే, నోర్మూసుకుని ఖాళీ కాగితాల మీద సంతకాలు, వేలిముద్రలు వెయ్యమని పట్టుకెళ్లేడు.” అన్నాడు దు:ఖం నిండిన కళ్లతో.
తన్మయి రెండు చేతులూ జోడించి అతనికి నమస్కారం పెట్టి, “క్షమించండి, ఇక ఈ దరిదాపులకు కూడా రాకండి.” అని ఏడుస్తూ లోపలికి పరుగెత్తింది.
గుండె వేగంగా కొట్టుకోసాగింది.
వేటికేదీ అర్థం కాకుండా అయిపోయాయి.
ఛీ, తన వల్ల కరుణ కూడా బాధలు పడాల్సి వస్తూంది.
ఇక అతన్ని తలెత్తి చూడగలదా?
అసలు వైద్యానికి కూడా డబ్బులు ఉండి ఉండవు. పాపం.
“అయ్యో, ఖర్మ” అని నెత్తి కొట్టుకుంది.
ఇవన్నీ చూసి బాబు కింక పెట్టి ఏడ్వసాగేడు.
కసిదీరా వాణ్ణి వీపు మీద బాదసాగింది. దెబ్బల బాధకు తాళలేక తల్లి దగ్గరకు వస్తూంటే భయపడి వంటింట్లో స్టవ్వు గట్టు కిందకు వెళ్లి కూచుని వెక్క సాగేడు బాబు.
తన్మయి పిచ్చిదానిలా గోడ కేసి నెత్తి గట్టిగా బాదుకోసాగింది.
బాగా నొప్పి తెలుస్తూన్నా, “తనకీ శిక్ష పడవల్సిందే, అతన్ని పెళ్లి చేసుకున్నందుకు తను ఇలా అనుభవించాల్సిందే”. అని తనకు తెలీ కుండానే గట్టిగా అరుస్తూ రక్తం వచ్చేంత వరకూ తల కొట్టుకుంది.
కాస్సేపట్లో హఠాత్తుగా కళ్లు బైర్లు కమ్ముతూండగా పక్కకు చలనం లేకుండా పడిపోయింది.
చివరి క్షణం లో కళ్లు మూతలు పడిపోతూండగా, “బాబూ… మృదుల్” అని మాత్రం అరవడం గుర్తు ఉంది.
***
కళ్ల మీద నీళ్లు పడిన చల్లదనానికి మెలకువ వచ్చి చూసే సరికి పక్కన కరుణ కూచుని ఉన్నాడు.
ఒక్క ఉదుటున లేచి కూచుంది.
“అదేవిటి, మిమ్మల్ని రావొద్దని చెప్పేనుగా” అంది నీరసంగా.
“ఇందాకా, మీరు బాగా ఏడుస్తూండడం చూసి, ఏం అఘాయిత్యం చేసుకుంటారోనని మళ్లీ వెనక్కి వచ్చేను. మీరు కళ్లు తిరిగి పడిపోయి ఉన్నారు. బాబు మీ పక్కని నేల మీద పడుకుని ఉన్నాడు. భలే భయం వేసిందండీ.” అన్నాడు గాభరాగా.
” నన్ను క్షమించండి. నా వల్ల అనవసరంగా…” అని గొణిగింది తన్మయి.
“ఛా, అలా అనకండి. నాకు మీమీద కోపం లేదు. అసలు ఏం జరుగుతూంది? అతను నా మీద దాడి చేసేంత తప్పు ఏం జరిగింది? అసలు పోలీసు రిపోర్టు ఇద్దామనుకున్నాను. కానీ అనవసరంగా మీ పేరు పైకి రావడం ఇష్టం లేదు నాకు. అదీగాక నా ఆర్థిక పరిస్థితి మీకు తెలిసిందేగా. రిపోర్టులంటూ తిరిగే ధనం, ఓపికా రెండూ లేవు.” అన్నాడు.
తన్మయి మెల్లగా గొంతు సవరించుకుంది.
మొదటినించి జరిగిన కథను రెప్ప వాల్చకుండా విన్నాడు కరుణ.
చివరికి నిట్టూర్చి,”నాకేం చెప్పాలో పాలు పోవడం లేదు. నా గురించి వదిలేయండి. నేను కేవలం మిత్రుణ్ణి మాత్రమే మీ జీవితంలో. సగటు భర్తగా అతను మీ ఉన్నతాశయాల్ని భరించలేక పోతున్నాడు. ఇక మీరే సమాధానపడక తప్పదు. నా చేత సంతకాలు పెట్టించుకున్న కాగితాల వల్ల మీకే నష్టమూ కలగ కూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సామరస్యంగా సమస్యలు పరిష్కారం చేసుకోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. పిచ్చి పనులు చేసి పిల్లాణ్ణి అనాధని చెయ్యకండి.” అని లేచాడు.
కరుణ బయటికి వెళ్తూ ఉండగానే ఇంటిగలావిడ వచ్చి గుమ్మం దగ్గిర నిలబడింది.
తన్మయి విసుగ్గా “ఏవిటి?” అంది. పొద్దుటి ఈవిడ ధోరణికి పరమ అసహ్యంగా ఉంది అసలే.
వెళ్తున్న కరుణ వైపు వ్యంగ్యమైన చూపొకటి విసిరి, “మీ ఆయన ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని చెప్పేడు. ఎల్లుండి ఒకటో తారీఖు. ఈ నెల అద్దె నిన్ను అడిగి తీసుకోమన్నాడు. ఎప్పుడు ఖాళీ చేస్తావో చెప్తే, మేం ఎవరికయినా ఇచ్చుకుంటాం” అని వెళ్లిపోయింది.
తన్మయికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.
ఒకదానిమీదొకటి సమస్యలు. ఇప్పటికిప్పుడు ఇంటికి అద్దె కట్టడమంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి?
భానుమూర్తి ఉదయానికి వస్తాడు. డబ్బులు తండ్రిని అడగడానికి మొహం చెల్లడం లేదు తన్మయికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేట్లు లేదు.
నేల మీద చతికిలబడింది మరింత నీరసంగా. తండ్రి వచ్చేంతవరకూ అలాగే కూచూంది.
తెల్లారుతుండగా భానుమూర్తి వస్తూనే, లోతుకు పోయిన కళ్ళతో ఉన్న కూతుర్ని చూసి కళ్లనీళ్ల పర్యంతమయ్యేడు.
“బాధపడకమ్మా, శేఖర్ వాళ్ల తాత గారింట్లో ఉండి ఉంటాడు. పిలుచుకొస్తాను. నేను మాట్లాడతాను.” అని ధైర్యం చెప్పి వెళ్ళేడు.
సాయంత్రం తిరిగొచ్చి, ఊర్లో చుట్టాలిళ్ల లో అన్ని చోట్లా వాకబు చేసేను. ఎక్కడా లేడమ్మా, మీ అత్తయ్యకు ఫోను చేసేను. అక్కడికి కూడా రాలేదట. నెల్లూరు వెళ్లి ఉంటాడు.
“కోపంలో వెళ్లిపోయి ఉంటాడు గానీ, నిన్నూ, బాబునీ వొదిలి అతను మాత్రం ఎలా ఉంటాడు?” అన్నాడు.
తన్మయి, ఏవీ ఆలోచించలేక, ఎండిపోయిన కళ్లతో, నీరసించిపోయిన తలని ఊపింది.
“ఒకటో తారీఖు రేపే. సర్లే, ముందు మనం ఈ సామాన్లవీ తీసుకుని మనింటికి వెళ్లిపోదాం. తర్వాత స్థిమితంగా ఆలోచిద్దాం” అన్నాడు.
తండ్రి ఇంటి వాళ్లకి తన జేబులో ఉన్న డబ్బులేవో ఇచ్చి ప్రాధేయపడడం గుమ్మం దగ్గర్నించి చూసి, సిగ్గుతో చితికిపోయింది తన్మయి.
చివరికి మళ్లీ తల్లిదండ్రులకి భారమై తిరిగి వెళ్తూంది.
సామాన్లు సర్దు తూండగా ఎక్కడ లేని వైరాగ్యం కలిగింది.
ఈ ఇల్లు నాది, ఈ గట్టు నాది అనుకుంటూ తుడిచిన చోటనే తుడుచుకుని అద్దంలా ఉంచుకున్న గదుల్ని, పుస్తకాల సొరుగుల్నీ, కిటికీ కర్టెన్లనీ చూసుకుని,
“వైవాహిక జీవితం గురించి ఎన్ని కలలు కన్నాను! ” అని బాధపడింది.
సామాన్లని గోనె సంచుల్లోకి ఎక్కిస్తూ మొదటి జీవిత సత్యం అర్థం చేసుకుంది. “ఈ సామాన్లు, ఈ వంట గదీ, ఈ పుస్తకాల సొరుగూ, ఈ కిటికీ కర్టెన్లు ఏవీ శాశ్వతం కావు. తాత్కాలిక అవసరాలకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే. వస్తువుల మీద ఎప్పుడూ ప్రేమ పెంచుకోకూడదు.”
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.