అర్ధాంగి
(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
– అలేఖ్య రవి కాంతి
“ఓసేయ్ శారద, ఎక్కడ చచ్చావే.. ? నడినెత్తి మీదికి సూర్యుడు వచ్చిన నీకింకా తెల్లారలేదా” … ? అంటూ కస్సుమన్నాడు గోపాలం.
ఏవండి, లేచారా..! ఇదిగో పెరట్లో ఉన్నానండి. పూలదండల తయారీ కోసం పూలుకోస్తున్నాను. మీరింకా లేవలేదనుకుని కాఫీ కలపలేదు. ఇప్పుడే పట్టుకొస్తా అంటూ గబగబ వంటింట్లోకెళ్ళి గుప్పుమనే కాఫీ వాసనతో పొగలుగక్కుతున్న కాఫీ కప్పు భర్తకి అందించి తిరిగి పూలు అల్లే పనిలో తలమునకలయ్యింది.
ఏంటే, ఇంత వేడి కాఫీ చల్లారే వరకు నేను తాగకుండా ఆగాలా.. ! త్వరగా చల్లార్చి పట్టుకురా, అంటూ హుకుం జారీ చేయడంతో పూలను పక్కనబెట్టి కాఫీని చల్లార్చి భర్తకందించి తిరిగి తన పనిలో మునిగిపోయింది శారద.
అవునే, ప్రతి రోజు చాలా పూలదండలు అల్లుతున్నావుగా.ఇంతకి ఎంత సంపాదిస్తున్నావేంటి అన్నాడు వెటకారంగా.
“రోజుకి రెండొందలండి” ! అంది సంతృప్తిగా నవ్వుతూ..
అబ్బో! నేను కొట్టులో ఒక పావుకిలో జీడిపప్పు అమ్మితే వచ్చేంత రొక్కం నీ రోజు వారి సంపాదన. ఇబోటి సంపాదనకే ఇంత గర్వమా..!అయిన ఆడదానివి, హాయిగా ఇంత తిని మొగుడికి సేవలు చేసుకుంటూ కూర్చోవచ్చుగా? మనకేమన్నా పిల్లాపీచా!.
‘నీది దమ్మిడి సంపాదన లేని వ్యాపారం. ఎలాంటి అవసరానికి కూడా అక్కరకు రాని రొక్కం’ అన్నాడు పురుషహాంకారంతో…
భర్త కరుకు మాటలు విని శారద చిన్నగా నవ్వుకుని ఊరుకుంది. తమ పెళ్ళినాటి నుంచి తనకు అలవాటైనవే . అతనికి మగాడనే అహంకారం, మొగుడనే అహంభావం మెండు. పిల్లలు పుడితే మారతాడులే అనుకునేది. పాపం, ఆ ఆశ ఎన్నడో ఆవిరైపోయ్యింది. చెట్లు, పూలతోనే తను అనుబంధం పెంచుకుంది. పూలదండలను కట్టి అమ్మగా వచ్చే ధనంలోనే తన ఆత్మాభిమానాన్ని వెత్తుక్కుంది.తన సంపాదనంతా అనాథాశ్రమాలకు విరాళాలుగాా అందించి సంతృప్తి పడుతుంది. తన కష్టసుఖాలను పెరటిలోని పూలచెట్లతో చెప్పుకుని వాటి చల్లని పరిమళాల తాకిడితో తన బాధనంత మరిచిపోయేది శారద.
ఒక రోజు గోపాలం కొట్టులో ఉండగా” ఏమోయ్ గోపాలం బాగున్నావా” ?అంటు అడుగుతూ వచ్చాడు రవీందర్…
రవీందర్ ని చూడగానే గోపాలానికి గొంతులో వెలక్కాయ అడ్డుపడ్డటయ్యింది..
‘బాగున్నాను డాక్టర్ గారు. ఇంతకి మీరెలా ఉన్నారు’.. ?
చాలా సంవత్సరాల తర్వాత కలిసారు. ఏంటీ విషయం, అన్నాడు కంగారుగా తన గతకాలపు గాయం గుమస్తా ముందు ఎక్కడ బయటపెడతాడోనని భయంగా…
నేను బాగున్నానోయ్. ఇంతకి నీ ఆరోగ్యం ఎలా ఉంది. శారదమ్మ నీతో ఉందా? అని ఇంకా ఎదో అనబోయాడు. వెంటనే తన మాటలకు కళ్ళెం వేస్తూ… ఓరేయ్ వెంకి, డాక్టర్ గారికి టీ పట్టుకురా అంటూ గుమస్తాను సాగనంపాడు గోపాలం.
శారద బాగానే ఉంది డాక్టర్ గారు. మీ రాకకు గల కారణం తెలుసుకోవచ్చా అని నసిగాడు మెల్లగా.
ఏమీ లేదోయ్, క్యాంపు పనిపై ఈ ఊరొచ్చాను. నువ్వు కనిపించేసరికి పలకరిద్దామని ఇటుగా వచ్చా. పద ఒకసారి శారదమ్మని కూడా కలుద్దాం అన్నాడు..
గోపాలం గుండెల్లో గుబులు మొదలైంది. వెంటనే అయ్యో…, రెండు రోజుల క్రితమే శారద వాళ్ళ పుట్టింటికి వెళ్లిందండి. వాళ్ళ అమ్మకు ఒంట్లో కాస్త నలతగా ఉందని అన్నాడు అపరాధిలా తన తలను కిందకి దించి.
గోపాలం, ఏ మాటకామాట, నిజంగా నువ్వు అద్రుష్టవంతుడివి. నీకు పిల్లలు పుట్టరని తెలిసిన ఆ తల్లి నీతో కలిసే ఉంది చూడు. ఎంత మంది భార్యాభర్తలు అలా ఉంటారు చెప్పు..!?. తమ శరీరంలో ఏ తప్పు లేకున్నా బిడ్డల పై మమకారం చంపుకుని ఆందరి సూటిపోటి మాటలు భరిస్తూ…!. ఆమెకు నిజంగా మొక్కాలి. ఇక వస్తా అంటూ వెళ్లిపోయాడు.
గోపాలం మనసులో వేల ప్రశ్నల విస్పోటం జరుగుతుంది. శారదకు నా లోపం గురించి ముందే తెలుసా..! అయ్యో.., తప్పు నాలోనే ఉందని తెలిసి కూడా నేను నా లోటు కప్పిపుచ్చుకునేందుకు తన పై గొడ్రాలని ముద్ర వేసిన పల్లెత్తు మాట కూడా అనలేదే….!.. ఎందుకు? అంటూ మధనపడ్డాడు..
సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం ముందు ఎదురు చూస్తూ నిలబడింది శారద.
ఏవండి, ఈ రోజు ఇంత ఆలస్యమయ్యిందేం. గిరాకీ చాలా ఉందా..
సరే, త్వరగా కాళ్లు చేతులు కడుక్కురండి కాస్త ఎంగిలి పడుదురుగానీ అంటూ లోనికి వెళ్ళబోతుంటే భర్త చేయి తనని ఆపడంతో వెనుదిరిగింది..
‘నన్ను క్షమించు శారద’.
నీ మంచి మనసును అర్థం చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలు నీ తప్పు లేకున్నా నా తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిన్ను నిందించాను అంటూ అపరాధ భావంతో తలదించుకున్నాడు..
గోపాలం మాటలకు శారద అయోమయంలో పడింది. మీరు దేని గురించి అంటున్నారు? అంది సందిగ్ధంగా…!
శారద, ఈ రోజు డాక్టర్ రవీందర్ నన్ను కలిసాడు. నీకు నా గురించి మొత్తం తెలుసని చెప్పేసరికి సిగ్గుతో చచ్చిపోయాననుకో. “నా లోపం గురించి తెలిసిన ఎందుకు నన్ను వదిలేయలేదు? ఎందుకు నాతోపాటు, చుట్టుపక్కల వారితో కూడా గొడ్రాలనే నిందను మోస్తూ భరిస్తున్నావు? ఎందుకు నన్ను నిలదేయలేదు “అంటూ ఏడవసాగాడు..
శారద చిన్నగా నవ్వి.., ఏవండి, మీతో ముడిపడింది నా దేహం కాదు నా మనసు. ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక లోపం ఉంటుంది. అంతమాత్రానా మనల్ని మనం ప్రేమించడం మానలేముగా.మీరంటే నేను. మీలో లోపముంటే నాకు ఉన్నట్టేగా.
అనుకోకుండా ఒక రోజు బీరువా సర్దుతుంటే మీ రీపోర్ట్స్ కనిపించాయి. డాక్టర్ గారిని కలిస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. ఆ రోజే నిర్ణయించుకున్న నాకు పిల్లలు లేకున్నా పర్వాలేదని. నేను భార్యాభర్తల బంధం జన్మజన్మల అనుబంధం అని నమ్ముతాను. ఒక స్త్రీగా నాకు తల్లవ్వాలని కోరుకుంటుంది. బిడ్డ అంటే మనం జన్మనిచ్చే వారే కాదండి మనం జన్మాంతం కలిసుండే వారు కూడా ఓ విధంగా బిడ్డలే. మీలోనే నా బిడ్డని చూసుకుంటున్నాను. మీకు ఆకలైతే అమ్మలా గోరుముద్దలు పెట్టడం, మిమ్మల్ని పసిపాపలా కనిపెట్టుకునుండడం చాలు ఈ జీవితానికి అంటూ భర్త కన్నీళ్ళను తుడిచింది .
భార్య మాటలు విన్నాక గోపాలం తనెంత అద్రుష్టవంతుడో తెలుసుకున్నాడు..
“శారద, అర్థాంగి అంటే భర్త అడుగుజాడల్లో నడిచే మరమనిషి అనుకున్న కానీ భర్త అంతరంగాన్ని అర్థం చేసుకునే సగభాగమని నేడే గ్రహించా. నిజంగా అర్థాంగి అంటే అమ్మ తరువాత అమ్మ అని నిరూపించావు నిప్పులాంటి నిజాలని నీ కడుపులో దాచుకుని. నన్ను మన్నించు”, అంటూ తన పొత్తిలలో పసిపాపలా తలవాల్చాడు..
*****
నా పేరు అలేఖ్య రవికాంతి. నాకు చిన్నపటి నుంచి కథలు, కవితలు రాయడమంటే ఇష్టం..ఆ ఇష్టం ఇప్పుడు నా ఊపిరిగా మారింది. ఇప్పటి వరకు ౩౦౦ పైగా కవితలు, 100 కు పైగా కథలు, సూక్తులు రాసాను. చాలా సార్లు వివిధ పోటీల్లో విజేతగా నిలిచాను. ఇప్పుడు ఇంకా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాను.చేరుకోవాల్సిన గమ్యం ముందుంది.