నడక దారిలో-9

-శీలా సుభద్రా దేవి

నా స్కూల్ ఫైనల్ చదువు పూర్తిఅయ్యేలోపున మా అన్నయ్య ఎమ్మే ఎమ్ ఫిల్ పూర్తి చేసి మహారాజా కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం లో చేరాడు.మా స్కూల్ లోనే పనిచేసే మా అన్నయ్య సహోద్యోగి ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారు కూడా పై చదువు పూర్తి చేసుకుని కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరారు.మా చిన్నన్నయ్య కూడా బీయిడీ పూర్తిచేసుకుని హైస్కూల్ లోనికి ప్రమోట్ అయ్యాడు.

ఇంత దూరం లో ఎందుకని పుత్సలవీధి చివర తూర్పు బలిజ వీథిలో ఇల్లు చూసుకుని మారిపోయాము.

            మా తాత గారి ఇంటి పేరైన  పుత్సలవీథి ఆ చివర నుండి ఈ చివరివరకూ దగ్గరా, దూరపు బంధువులే.మా అయిదుగురు మేనమామలూ,మా పెద్ద నాన్నగారు,వారి అమ్మాయి ఉండేది ఆ వీథి లోనే,ఆ వీథిలో రోడ్డుకి ఇరువైపులా నేత పని చేసేందుకు సరి అమర్చబడి ఉంటుండేది.కొన్ని ఇళ్ళల్లోంచి మగ్గం నేస్తున్న శబ్దం వినిపించేది.

             నేను స్కూల్ ఫైనల్ పాసయ్యానని తెలిసి మా పెదనాన్న గారు మా చిన్నన్నయ్య తో “మా మనవరాలు వచ్చింది.ఇక్కడ ఆంధ్రా మెట్రిక్ పరీక్ష కట్టింది.మీచెల్లిని  రేపు మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పు.” అన్నారు.

               ఇంతవరకూ ఆయనను ముఖాముఖి కలిసింది లేదు.మర్నాడు మొదటిసారి వెళ్ళాను.కుశల ప్రశ్నలు, నా అభిరుచులు,కాలేజీలో చేరిన విషయాలు అడిగారు ఆయన.అడిగిన వాటికి స్పష్టం గానూ, ముక్తసరిగా సమాధానం చెప్పి ఆయన మనవరాలి తో కాసేపు కబుర్లు చెప్పి, భోజనం చేసాను.

               తిరిగి ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరుతుంటే నాకు వాళ్ళు అమ్మాయి చేత చీర ఇప్పించారు.నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.ఎందుకంటే ఏనాడూ ఏ సందర్భం లోనూ ఇలా ఎవరి నుండీ బట్టలు తీసుకోలేదు.”ఎందుకండీ”అని వెనుకంజ వేస్తే “పరీక్షపాసయ్యావుకదా”అన్నారు పెద్దనాన్న గారు.పెద్దవారి మాటను కాదనలేక మరి మాట్లాడకుండా తీసుకుని ఇంటికి వచ్చేసాను.

           అంతకు ముందు ఉన్న కంటోన్మెంట్ లోని ఇల్లయితే కుమారీ తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ కి వెళ్ళే దాన్ని.ఇప్పుడు నేనొక్కదాన్నే  పుత్సలవీథిలో రోజూ నా వెనకే శల్యపరీక్ష చేస్తున్న ఎన్నెన్నో  చూపులబాణాలు నిలువెల్లా నన్ను గాయాలు చేస్తుంటే రోజూ అగ్నిప్రవేశం చేస్తున్న సీతలా అయిపోయేదాన్ని.

           అదే వీథి లో ఉన్న ఒక మామయ్య కూతురు ఆ ఏడాది బాలికల పాఠశాల లో ఆరో తరగతి లో చేరింది.ఆ స్కూలు మా కాలేజీ ఉన్న మాన్సాస్ ఆవరణలోనే ఉండేది.మరి ఆ పిల్ల కి తోడు కోసమేమో నన్ను పిలిచి మా రిక్షా లోనే కాలేజీకి వెళ్ళమని అన్నారు.సరే అని రోజూ వాళ్ళింటికి వెళ్ళి ఇద్దరం కలిసి రిక్షాలో వెళ్ళే వాళ్ళం.

           తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ అమ్మాయి వెళ్ళిపోయేది.నాకు ప్రాక్టికల్స్ ఉంటాయి కనుక ఒక సమయం అంటూ ఉండదు.అదీ గాక కాలేజీ అయిపోయిన తర్వాత మహారాజా సంగీత కళాశాలలో కర్నాటక గాత్ర సంగీతం  క్లాసులో చేరాను.అందువలన నేను ఇంటికి వెళ్ళటానికి ఆలస్యం అయ్యేది.

           ఒకరోజు ఎప్పటి లాగే మామయ్య వాళ్ళింటికి వెళ్ళి మామయ్య కూతురు నేనూ వాళ్ళ రిక్షాలో కాలేజీకి బయలుదేరాము.దారిలో “నువ్వు ఇంకా ఎన్నాళ్ళు చదువుతావు వదినా” అని ప్రశ్నించింది ఆపిల్ల.

         “పీయూసి అయ్యాక ఇంకా చాలా ఏళ్ళు చదవాలి.మూడేళ్ళ డిగ్రీ చేయాలి. టీచర్ అయ్యేటట్లైతే ట్రైనింగ్ చేయాలి.  తర్వాత ఉద్యోగం చేయాలి”.కలలో తేలి పోతూనే అన్నాను.

        ” ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటే పెళ్ళిళ్ళు అవ్వటం కష్టం అంట కదా?”అన్న ఆ పిల్ల మాట వినగానే దబ్బున కలలలోంచి ఇల పైకి పడినట్లైంది.

        “ఎవరన్నారు?”కొంచెం తీవ్రం గానే నాగొంతు ధ్వనించి నట్లుంది.ఆరవతరగతి చదువుతున్న ఆ అమ్మాయి “ఏమో అందరంటున్నారు “బిక్కమొఖం తో నెమ్మదిగా అంది.

        ఇంట్లో బహుశా నా చదువు గురించి జరిగిన చర్చ లో పెద్దవాళ్ళ మాటల్ని చిలకలా పలికిన ఆ పిల్ల వైపు జాలిగా చూసాను.” నీతో వస్తుంటే నాకు కాలేజీ లో క్లాసుకు లేటవుతుంది.రేపటి నుండి నేను విడిగా  ముందు వెళ్ళిపోతాను.నీతో రాను “అన్నాను.మరి వాళ్ళింటికి వెళ్ళలేదు.

        ఆ అమ్మాయి పదోతరగతి వరకైనా చదివిందో లేదో తెలియదు.తొందరగానే ఒక పనికిరాని వెధవకిచ్చి పెళ్ళిచేసారనీ,నలుగురినో ఐదుగురినో కని పిల్లలతో ఆర్థికంగా చాలా అవస్థలు పడిందనీ, ఇప్పుడు చిన్నచిన్న ఉద్యోగాలతో ఆడపిల్లలే కుటుంబాన్ని అందుకుంటున్నారని విన్నాను.

        ఆ రోజుల్లోనే మా ఇంకో పెదనాన్న కొడుకు వివాహానికి మా పెద్ద మామయ్య సుందరరావు గారితో కలిసి మానాన్నగారి జన్మస్థలం అయిన ధర్మవరం గ్రామానికి వెళ్ళాను.అక్కడే ఉన్న కొంత పొలం ఇంటిలో చిన్నపాటి  భాగం మా నాన్నగారి ఆస్తి ఉందట.

        పెళ్ళికి వచ్చిన మరో బంధువు నుండి కూడా మళ్ళీ ప్రశ్న ఎదుర్కొన్నాను.” కాలేజీలో చేరావట కదా? ఇంతకీ ఏం గ్రూప్ తీసుకున్నావు?” అని.నా సమాధానం విన్నాక ” ఏం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి?” అని వెటకారంగా మరో ప్రశ్న.

        అంటే ఆడవాళ్ళు సైన్స్, లెక్కలు చదవకూడదా? లేకపోతే అవి చదివేటంత తెలివి తేటలు ఆడవాళ్ళకి ఉండవనా? నాకు అర్థం కాలేదు.బహుశా అందుకేనేమో కాలేజీలో MPC క్లాస్ లో పది లోపునే విద్యార్ధినులు ఉండేవాళ్ళం.ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను హైస్కూల్లో చదివేటప్పుడు ఒక్క మహిళా టీచరూ లేరు.ఇక మా మహిళా  కాలేజీ లో లెక్చరర్లు కూడా చాలావరకూ అగ్రవర్ణాలకు చెందిన వారూ,లేదా తమిళ, మళయాళీ వాళ్ళే.లెక్చరర్లే కాదు విద్యార్ధినులు కూడా అంతే.అప్పట్లోదళిత,బహుజన  బాలికలకు రిజర్వేషన్లు లేవా? ఏమో తెలియదు.కుటుంబ కట్టుబాట్లు వల్లనే  ఉన్నత విద్య చదువుకునే వారు కాదేమో.నిజానికి ఇప్పటికీ అటువంటి పరిస్థితులవలనే కొన్ని ప్రాంతాల్లో,కొన్ని దళిత, ఆదివాసీ కుటుంబాల్లో బాలికలకు విద్య ఎండమావి గానే ఉంది.

        అరవై ఏళ్ళ క్రితం పరిస్థితి అది అనుకోవాలేమో.ఈనాడు చాలా మంది ఆడపిల్లలు టెక్నికల్ చదువులు ఇక్కడే కాక దేశవిదేశాల్లోకి కూడా వెళ్ళి చదవటం చూస్తుంటే నాకు ఎంత అబ్బురంగా ఉంటుందో!

        తమాషా ఏమిటంటే అరవై ఏళ్ళ క్రితం లెక్కలు నీకు అంత బాగా వచ్చేమిటి అని వెటకారంగా అన్న వ్యక్తే ముఫ్ఫై ఏళ్ళకిందట నా కూతురునీ అలాగే ప్రశ్నించటం ఇంకా ఆశ్చర్యం.

        ఆ గ్రామంలో మరొక అనుభవం ఏమిటంటే పెళ్ళికి వచ్చినవారు చుట్టు పక్కల వాళ్ళూ నన్ను ఉమా అని పిలవటం నేను ఉమని కానంటే బుగ్గలు నొక్కుకుంటూ అచ్చం ఉమ లాగే ఉన్నావే అని బోల్డంత ఆశ్చర్యపోవటం ఇప్పటికీ గుర్తు.

        ఆ ఉమ అన్న అమ్మాయి మా నాన్నగారి దూరపు బంధువుల అమ్మాయి అచ్చంగా నా వయసే.ఆ అమ్మాయి కూడా ఈ విషయం తెలిసి నన్ను చూడటానికి కుతూహలంగా వచ్చింది.మా ఇద్దరినీ చూసిన వాళ్ళు కూడా ఎంత పోలిక ఉందో అంటూ ఆశ్చర్యపోయారు.డబుల్ ఏక్షన్ సినిమాలోలా మన లాంటి వ్యక్తి ని దగ్గర గా చూడటం గొప్ప అనుభవం కదా!

        పెళ్ళినుండి తిరిగి వచ్చాక కొంతకాలం మా ఇద్దరి మధ్యా ఉత్తరాలు నడిచి ఆగిపోయాయి.ఇప్పుడు ఆ ఉమా ఎక్కడ ఉందో ఏమో తెలియదు.ఒక్కొక్కప్పుడు గుర్తు వేస్తే ఈ వయసులో కూడా నాలాగే ఉందా,మారిందా అనుకుంటాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.