కపివరుండిట్లనియే…. 

-ఆర్టిస్ట్ అన్వర్ 

చిన్నప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే దేవుడని అసలు తెలీనే తేలీదు. ఆంజనేయుడు నా బాల్య కాలపు హీరో. మా సూపర్మాన్ ,డూపర్మాన్ , స్పైడర్మాన్, బ్యాట్మన్, హీమాన్, అదీ ఇదీ ఇత్యాది … నాకు ఒక్క ముక్కరాదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది హనుమాన్ చాలీసా వచ్చి ఉండేది , చిన్నప్పుడు దయ్యాలకు భూతాలకు భయపడేవాణ్ణి కాదు కావున హనుమాన్ చాలీసా నేర్చుకోవాల్సిన అవసరం అనిపించలా. నాకు లేదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది మెడలో కసాపురం ఆంజనేయ స్వామి వెండి బిళ్ల ఉండేది. ఆబ్బా అటువంటి బిళ్ళ ఒకటి నా మెడలో ఉండి ఉంటే నేను నా బాల్యంలో తక్కువ మందిని తన్నడం ఎక్కువై, ఎక్కువమందితో తన్నించుకోడం తక్కువై ఉండేవాణ్ణి. ఇటువంటివి చెప్పుకోలేం కానీ ఆంజనేయ స్వామి అంటే బహు అడ్మైరింగా ఉండేది. ఎవరూ చూడనప్పుడు ఇంట్లో అద్దం ముందు నిలబడి నోట్లో గాలి పొంగించి కొతిమొహం పెట్టే వాణ్ణి. ఇప్పుడూ అప్పుడప్పుడూ పెడతా. నాకు బాపు గారన్నా బహు అడ్మైరింగే కదా అయన మోహం స్వామి వారిలానే ఉంది కదాని ఎప్పుడూ ఒక అనుమానమే! కానీ అడగలా! అడిగి ఉంటే కరిచేవాడే. చిన్నప్పుడు అద్దం చిన్నది. మొహం ఒకటే కనపడేది కాబట్టి చెల్తా రహాతాథా . ఇప్పుడు ఇంట్లో అద్దం పెద్దది. ఆకారం మొత్తం కనబడుతుంది, చూసుకుంటే ఈ జన్మకు ఆర్జా జనార్దనరావు. దారా సింగ్ లో సగం కూడా కాదు పైగా అలా మూతి పొంగిస్తే హనుమంతుడిలా కాదు కానీ ఖచ్చితంగా ఉరాంగుటాన్ లా మాత్రం ఉంటున్నా. మూతినిండా గాలి నింపుకుని అలా చాలా సేపు ఉండలేం నోరు భలే నొప్పి పుడుతుంది. అందుకని ఒకటి కనిపెట్టా. చెట్టయ్య అంగట్లో టాంబ గోలీలు రెండు కొని నోట్లో పై పెదవి మీద ఇరికించుకుంటే, ఇంగ నిజం ఆంజనేయ స్వామి కూడా మనల్ని కొట్టలేడు. మనకే ఫస్ట్ ప్రైజ్. వంటిట్లో దాల్ ఘోట్నీ అంటే మీకు పప్పు గుత్తి అని తెలుసు. అది నా ప్రాణానికి గద తప్ప మరేం కాదు. చొక్కా విప్పి దాన్ని భుజం పైన పెట్టుకుని తిరుగుతుంటే ఆ రోజులే మరి రావు. షాపుల్లొ చీరలు చుట్టి పెట్టే అట్టతో కిరీటం చేయడం నేర్చుకున్నా కానీ తోక ఎలా చుట్టాలో మాత్రం నాకు చేతకాలా. దసరా వేషగాల్లు వచ్చినపుడు నా కన్నంతా హనుమంతుడి తోకమీదే ఉండేది. తిరగబడ్డ ’క” అక్షరం లా అది అంత స్టిప్ గా ఎలా నిలబడేదో అర్థం అయ్యేది కాదు. వీధుల్లో ఎగిరి ఎగిరి పడి గస తీరుచుకోను గోడ పక్కని నిలబడి ఆంజనేయుడి వేషం గారు బీడి తాగుతుంటే విచిత్రంగా తొచేది. 

మొన్న మా భార్గవి గారి ఊరికి పోయినపుడు ఒక సైడున ఆయమ్మా లావణ్య ఉన్నారు మరో సైడున గోడమీద రెందు కోతులు ఉన్నాయి. ఇక నా కెమెరా కన్ను ఎటు చూసేదో కొత్తగా చెప్పనక్కరలేదుగా. ఒకసారి మా ఊళ్ళొ ఒక కొతులమ్మే ఆయన దగ్గర ఒక కోతి కూడా కొనుక్కున్నాం

నాకన్నా మా తమ్ముడు గొప్పవాడు. మాకు సున్తీ చేశెటప్పుడు మనసులో ధైర్యాన్ని నమ్ముకుని కళ్ళు మూసుకున్నా కానీ మా తమ్ముడు మాత్రం నా పక్క టేబుల్ మీద డాక్టర్ దగ్గరికి రాగానే “భజరంగ్ బలికి జై! ” అని ఒక పెడబొబ్బ ఇచ్చాడు. ఆంజనేయ స్వామి ఆ పళంగా అర్జునుడి రథం పైనుండి పారిపొయి వచ్చి మా నూనెపల్లె పెద్దాసుపత్రి టాపు పై వాలి మమ్మల్ని భద్రంగా చూసుకున్నాడు. చిన్నప్పుడు రోజుల్లో చందమామ, జేజెమ్మ కథల్లో ఆంజనేయుల వారు శారీరక శక్తికి, స్వామి భక్తికి, ధైర్యానికి, దనుజమర్దనానికి  చిహ్నమయితే. పెద్దయి ఆర్టిస్ట్ నయ్యాక, బౌద్ద కథా వాగ్మయంలో, చీనాదేశపు పిట్ట కథల బొమ్మల్లో, వారి సెల్యులాయుడ్ సినిమా తెర మీద ’మంకీ కింగ్” పరిచయం అయ్యాడు. మన దగ్గర స్వామి ఆయుధం గద అయితే అక్కడ ఆ కోతి రాజు ఒక పొడవాటి చే కర్ర చేపట్టి కరాటే కుంగుఫూ జూడొ విన్యాసాల తో గిరికీలు కొడ్తుంటాడు . అట్టి ఆ చీనీయ కథల్లో ఒక వింత కథ లో అచ్చం మన భీముడి గర్వం హనుమంతులవారు ఎలా అణగదీస్తాడో అంత కన్నా అన్యాయంగా ఉన్న ఈ కథ చెబుతా. ఈ మహబలశాలి కోతి ఒకసారి స్వర్గానికి వెడుతుంది. అక్కడ  సహజంగా తన కోతల్లరి సాగిస్తుంటే దీనితో వేగలేక. దాని బలానికి ఆగలేక అక్కడివారు బుద్దుడిని రప్పిస్తారు. బుద్దుడు చిరునవ్వుతో కోతితో వో పందెం వేస్తాడు. ఈ కోతి కనక తన అరచేతిని దాటి అవతలికి దూకగలిగితే, కోతికి స్వర్గంలో శాశ్వతంగా ఒక సింహాసనం లభిస్తుందని , ఒక తను కనుక అట్లా చెయ్యలేకపోతే కోతి రాజు గమ్మున భూలోకానికి వెళ్ళి కొన్ని యుగాలు తపస్సు చెయ్యాల్సివుంటుందని పందెపు హెచ్చరిక . అందుకు ఆ కోతి ’ఓ యెస్సని ’ అంగీకరించి తన బలమంతా ఉపయోగించి బుద్దుడి అరచేతిపై దూకుతూ దూకుతూ  పోతుంది. అలా చాలా దూరం వెళ్ళాకా ఆకాశంలోకి పొడుచుకుని తేలిన ఐదు స్తంభాలు కనబడతాయి. ఇక అది స్వర్గానికి అంతం అనుకుని, తాను అంతదూరం దూకి వచ్చినందుకు నిదర్శనంగా ఒక స్తంభంపై తన తొక మీది వెండ్రుకతో “మహా బలశాలి, అవిక్రమపరాక్రముడు అయిన నేను ఇటు వొచ్చాడని ఇట్లు చేవ్రాలు” అని వ్రాసి తిరిగి బుద్దుని దగ్గరికొచ్చి, తాను పందెం గెలిచాను కావున ఆ సింహానం ఇప్పించమని కొరుతుంది. బుద్దుడు తన వేలు పైకెత్తి దాని మీద వాసివున్న అక్షరాలను చూపించి బుద్దాస్ స్మైలిస్తాడు. వినయశీలి. మర్యాదస్తుడు,   మన మంత్రి హనుమంతుడెక్కడా? ఈ అహంకారి చైనా కోతి రాజెక్కడా?ఈ బౌద్ధ కథ ఏమీ బాగాలా! దీని నీతీ అతకలా! అందుకే మనం చైనా వాడి గోడ నీడలో పుట్టలా. హాయిగా మా ఊరి రామాలయం గోపురం, ఆ వెనుక కొబ్బరి చెట్ల చాయలో గొలీగుండ్లు, బొంగరాలు ఆడుకుంటూ దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పల్ని కొతులతో పాటు కొరుక్కుంటూ, ముందు పళ్ళతో పెరుక్కుంటూ పెరిగాం.

 పెరుగుతూ పెరుగుతూ రాన్రాను పిల్లలు పెద్దలయిపోయి పెద్దలు గాడిదలయ్యి పోయి తెలివి బలిసి, ఎక్కడెక్కడి కన్నాలో కనిపెట్టి లేదా కొత్తవి పెట్టి ఆ ఆంజిని, ఆ ఒక గొప్ప విద్యార్థిని, ఆ ఒక తెంపరిని, ఆ సింగిల్ పేరెంట్ చైల్డ్ ని, ఆ మంత్రిని, ఆ దూతని, ఆ సుందరున్ని, మార్నింగ్ బ్రేకాఫాస్ట్ క్రింద సూర్యున్నే మింగబోయిన ఆకలి పిలగాడ్ని మొత్తానికి విలన్ని చేశారు, రంగులను, నీటిను , పూలను, పక్షులను, కొండని , నదిని, చెట్టును, మొక్కల్ని…. తమ మతంలో, తమ జాతిలో,తమ వర్ణంలో, తమ భావాదారిద్రాల్లో భాగం చేసుకున్నట్లు ఈ నరవానరుడి కి కూడా మతం అంటగట్టి, గోత్రం తగిలించి, లేని పోని కథలను అతికించేసి కోతిని దేవుణ్ణి చేసేసి మనుషులు మళ్ళీ కొతులయిపోయారు. అయితే ఈ కొత్త కోతులు బాగాలేవు, అసలు మంచివి కావు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.