భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)
-వసుధారాణి
నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం చేయించడం. ఇది సంపూర్ణ భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్రాదర్శనం లాంటిదే. ఈ పనిని తలపెట్టిన వీర వనిత డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ,పుస్తకము “ భారతీయ నవలాదర్శనం”. 60 విశిష్ట భారతీయనవలల పరిచయసంపుటి.
ఇదీ వరస అంటూ 12 రోమన్ అంకెలలో విభజించిన బెంగాలీ నుంచి తెలుగు వరకు 11 విభాగాలు, 12 వ భాగంగా అంగ్లనవలల పేర్లు చదివే సరికే నాకు చెమటలు పట్టాయి.ఒకింత ఆశ్చర్యం ,బోలెడంత ఉత్సుకత కూడా కలిగాయి.భారతీయ సాహిత్యం మీద వీరలక్ష్మి గారికి ఎంత ప్రేమ,ఇష్టం,గౌరవం ఉంటేకదా ఇంతటి బృహత్ కార్యానికి పూనుకున్నారు అనిపించింది.నవలలు చదవటం,వాటిలోని ఆత్మను పట్టుకోవడం,వాటిని మదింపు,కుదింపు చేసి అందించాలనుకోవటం .చాలా ధైర్యం కూడా కావాలి ఈ పని చేయటానికి , ఆవిడ వీరలక్ష్మీదేవి కదా ఈ భారతీయ నవలాదర్శనం సంకలనంతో సార్ధకనామధేయురాలు అయ్యారు నా దృష్టిలో.
మొదట నవల రవీంద్రనాధ్ టాగూర్ ‘ చోఖేర్ బాలి ‘ . విశ్వకవి చక్కని చిత్రము తో, సంక్షిప్త పరిచయంతో , కేవలము ఐదు పుటల్లో నవలా పరిచయం చేశారు.నేను ఈ నవలని ఇంతవరకు చదవలేదు కానీ ఈ నవలని గురించి ఏమైనా చెప్పవలసి వస్తే వీరలక్ష్మి గారు చేసిన ఈ పరిచయం ఆధారంగా చెప్పగలను అనిపిస్తుంది. నవల యొక్క ఉద్దేశ్యం,నవల సాగిన ఒరవడి,మొత్తం నవలలోని అంశాలు చాలా నేర్పుగా ,సుస్పష్టంగా అందించటమే కాక , టాగూర్ కంటే శరత్ ఎక్కువ హృదయవాది కనుక ఆయన అయితే మరింత సంవేదనాత్మకముగా చెప్పి ఉందురు అంటూ తన అభిప్రాయాన్ని కూడా సూటిగా చెప్పేస్తారు . చిన్న చోటులో ఇన్ని చెప్పటానికి ఎంతో నేర్పు ,చెప్పాలనుకున్న విషయం పాఠకులకు చేరాలన్న తపన నుంచి వస్తుందనుకుంటా.
బెంగాలీ సాహిత్యం పేరు ఎత్తగానే గుర్తొచ్చే పేరు శరత్ చంద్ర ఛటోపాధ్యాయ. వీరు రచించిన శేషప్రశ్న, గృహదహనం,విప్రదాసు మూడు నవలలని ఇందులో ఎంచుకున్నారు .శేషప్రశ్న నాకు చాలా నచ్చిన నవల. శరత్ కమలని వీరలక్ష్మి గారు అర్ధం చేసుకున్నతీరు ,మనకు పరిచయం చేసిన తీరు అమోఘం.
విభూతిభూషణ బందోపాధ్యాయ నవలలు వనవాసి,పథేర్ పాంచాలి, అపరాజిత ఈమూడు నవలలపై వీరలక్ష్మి గారు కాస్తతంత ప్రత్యేక మమకారం చూపారు అనిపించింది .ఎందుకంటే ఆవిడకి ఇష్టమైన అడవి గానం , జీవన సంగీతం కలిసి సాగే నవలలు ఇవి.వనవాసి గురించి చెపుతూ ఈ నవల చదవని వారికి ఈశ్వర దృష్టిలో ఒకానొక సౌందర్యానుభూతి నష్టమైపోయిందన్న మాటే అంటారు. నిజమే మిగిలిన నవలలు కూడా అలాగే ఉన్నాయి. సమరేశ్ బసు నవల శాంబుడు ,బీమల్ కర్ నవల సమయం కాని సమయం,బేబీ హాల్ దార్ ఆత్మకథ చీకటి వెలుగులు వరకు మొత్తం 10 బెంగాలీ నవలలని కరతలామలకం చేసి మనముందు ఉంచారు.
బెంగాలీ నవలల తరవాత తెలుగు పాఠకులకు చేరువయిన సాహిత్యం కన్నడ సాహిత్యం. వీరలక్ష్మి గారు ఆరు కన్నడ నవలలని ఇందులో పరిచయం చేశారు. శివరామకారంత్ నవలలైన మరణానంతరం , మరల సేద్యానికి రెండు నవలలని పరిచయం చేసారు.మరణానంతరం నవల పరిచయం ఎంత బాగా సాగిందంటే నాకు ఆ నవల ఎక్కడైనా దొరకబుచ్చుకుని వెంటనే చదివేయాలని అనిపించింది.యశ్వంత అనే ఆయన పరిచయం కారంత్ జీవితంపై చూపిన ప్రభావము. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఏదైతే ఊకదంపుడుగా పదే పదే అనుకుంటున్నామో దానిని యశ్వంత్ జీవించి చూపారు . ఆయన మరణానంతరం కానీ కారంత్ కి ఆయన జీవనవిధానం గొప్పతనం తెలియదు.చివరిగా ఈ నవలని గురించి చెపుతూ ఒక మనిషి జీవితములో తీసుకున్నదానికన్నా ఇచ్చినది ఎంత ఎక్కువ ఉంటే ఆ జీవితం అంత ధన్యత చెందుతుంది అంటారు.ఇదీ భారతీయ నవలా దర్శన సారం అంటే .
మరల సేద్యానికి నేను చదివిన నవలే ఐతే వీరలక్ష్మి గారి పరిచయం ,నవల పై ఆమె అభిప్రాయం చదివాక చదివిన నవలన్నీ కూడా మళ్లీ చదవాల్సిందే ఆమె చూపు అప్పు తెచ్చుకుని అని అర్ధం అయ్యింది.
ఆనంతమూర్తి గారి సంస్కార ఇదివరలో చదివాను ఐతే స్త్రీల పరంగా వీరలక్ష్మి గారు ఇందులో లేవనెత్తిన అంశాలు , ప్రశ్నలు ఒక నవలని సహేతుకంగా ఎలా చదవాలో చెప్పాయి.
ఎస్. ఎల్ . భైరప్ప గారి దాటు, పర్వ నవలలు .దాటు నేను చదివాను ,చాలా మందే చదివి వుంటారు అనుకుంటాను .కానీ పర్వ చాలా కొత్తగా , విభినమైన ఆలోచనతో, విస్తృతమైన చర్చతో వచ్చినట్లుగా అనిపించింది ఈ పరిచయంతో. వీరలక్ష్మి గారు బహు ఓపికతో ఈ పరిచయం చేసారు. పాఠకులకి ప్రతిఒక్క గొప్ప నవలా చేరి తీరాలన్న ఆమె ఆకాంక్ష ఎన్నదగినది. ఈ కథలని పునర్నిర్మించటంలో భైరప్ప హృదయాన్ని,మేధను సమపాళ్లలో వెచ్చించాడు .స్త్రీ హృదయంతో స్పందించి రాసాడు అంటారు .
కన్నడ నవలలో చివరి నవలా పరిచయం డా.శాంతినాధ్ దేశాయ్ ముక్తి నవల.నమ్మిన విలువల్ని పాటించటంలో ముక్తిని పొందినవాడు శ్రీకాంత్. ఏ విలువల పట్లా గౌరవంలేక,జీవితాన్ని అనుభవించటమే ధ్యేయంగా పెట్టుకున్న కామినికి ముక్తి లేదు. ఈ నవల కూడా చదవాలి అనిపించే విధంగా ఉంది పరిచయం.
బెంగాలీ,కన్నడ నవలా పరిచయాలను చదివిన తర్వాత వాడ్రేవు వీరలక్ష్మిదేవి గారు ఈ భారతీయ నవలాదర్శనం సంపుటిని ఎంత శ్రద్ధతో ,ప్రేమతో మన ముందుకు తీసుకు వచ్చారో తెలిసింది.
ఇక ఇక్కడి నుంచి చాలా వరకు నేను ఎక్కని గుమ్మాలూ, తొక్కని గడపలూ మొదలవుతాయి .వీరలక్ష్మీదేవి గారు మూడవ విభాగంలో ఏడు తమిళ నవలల పరిచయాన్ని చేశారు. తమిళ నవలలో మొదటగా రామస్వామి అయ్యర్ కృష్ణమూర్తి , కల్కి గా సుపరిచితం అయిన వీరి నవల కెరటాలు పరిచయం జరిగింది.1945 వ సంవత్సరం లో వచ్చిన ఈనవలకు ఆయన మరణానంతరం 1956 లో సాహిత్య ఎకాడమీ అవార్డు వచ్చింది. స్వాతంత్రానికి తరవాత దేశంలోని పరిస్థితులను వివరించిన నవల.స్వాతంత్రోద్యమంలో ఎవరూ స్పృశించని కోణాలు ఇందులో ఉంటాయి.1940,30 లలో భారతదేశం యువత ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో తెలిపే నవల.
పరిచయంలోనే నేను కొంచెం విస్తుపోయిన నవల జయకాంతన్ గారి కొన్ని సమయాల్లో కొందరు మనుషులు. నవలా నాయిక ఐన గంగ ,ఆవిడ పరిస్థితుల చుట్టూ తిరిగే నవల ఎవరు ,ఎప్పుడు ,ఎందుకు ,ఎలా ప్రవర్తిస్తారో ,క్షణికమైన , అనాలోచితముగా పనులు జీవితాలని ఎలా మార్చేస్తాయో,ఒకరితో ఒకరు సాలీడు గూడులా అల్లుకు పోయిన మానవ సంబంధాల వీడని చిక్కుముడుల నవల.పరిచయం చదువుతూంటేనే మనమూ ఆ సాలెగూడులో చిక్కుకు పోతాం.జయకాంతన్ గారు సమాజానికి సంధించిన ప్రశ్న గంగలో మార్పు.ఇప్పటీకీ అది శేషప్రశ్నలాగానే ఉంది.ఈ నవలకి పూర్తి న్యాయం చేయటం కోసం వీరలక్ష్మి గారు దీన్ని రెండు భాగాలుగా పరిచయం చేయటం వలన గంగలోని రెండు కోణాలను పరిచయంలోనే అద్భుతంగా చూపటానికి వీలైంది.నవల ముఖ్యఉద్దేశ్యం పరిచయంలోనే అందించటం భళా వీరలక్ష్మీదేవి గారు అనుకోక తప్పదు.
తర్వాత జయ కాంతన్ దే ఒక మనిషి…ఒకయిల్లు..ఒక ప్రపంచం నవలని పరిచయం చేసారు.ఇది కూడా ఆసక్తి దాయకంగా ఉంది.
తరవాతి నవల 1961 లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ము.వరదరాజన్ రచించిన మట్టిదీపం. ఈరోజుకీ యువతకు కావాల్సిన నవల. చదువు,సంస్కారం,అందం,తెలివితే టలు అన్నీ డబ్బుకు అమ్ముడు పోవటం. ఇత్తడి దీపం లాంటి చంద్రం,మట్టిదీపంలాంటి వేలయ్య ల కథ ఈ నవల. ఈ నవలను చాలా క్లుప్తముగా చెప్పినట్లు చెపుతూనే వీరలక్ష్మీ గారు నవల యొక్క లక్ష్యాన్ని పరిచయం ద్వారానే మనకు అందించేశారు.ఇది కదా మహోన్నత మైన ఉపాధ్యాయులు చేసే పని.
కందస్వామి రచించిన విచారణ కమీషన్ వీరలక్ష్మీ గారి మనసును అంతగా చూరగొన్నట్లు లేదు ,కారణాలు అనువాదం అంత బాగా లేకపోవటం,కథనం సాగిన తీరు పాఠకులను తికమక చేసే విధంగా ఉండటం .ఐనా ఈ నవలని ఈ దర్శనీయ పుస్తకములో ఉంచటానికి కారణం నాకు ఒకటే కనిపించింది.సామాన్యుని జీవితం ప్రభుత్వాలకు ఎంత అలుసుగా ఉంటుంది.సమాజం ,వ్యవస్థ ఎటువంటి డొల్లతనాలతో ఉంది అని చెప్పే నవలగా దీనిని వీరలక్ష్మి తీసుకోవటం జరిగిందనుకుంటాను.
పార్థసారథి గారి సమాజం కోరల్లో ,రాజంకృష్ణన్ గారి నారు-నీరు. కూడా రెండు విభినమైన అంశాలతో ,విలువలతో నడిచిన నవలలు రెండూ చదవాలి అనిపించేలా పరిచయం చేసారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు.
ఐతే తమిళ సాహిత్యములో ఇంకా మంచి రచయితలు,రచనలు ఉన్నాయి .శివశంకరి గారి నవలలు ,అలాగే అర్ధనారీశ్వరుడు లాంటి నవలలు తెలుగు అనువాదంలో లభిస్తున్నాయి.
మలయాళ నవలా దర్శనం ఈ విభాగాన్ని నేను కొంచెం ఎక్కువ ఉత్సాహంతో మొదలు పెట్టాను.మొదటి కారణం మలయాళీలు ఎక్కువ క్రియేటివ్ అని నా అభిప్రాయం. రెండవది వారి నవలలు నేను ఇంతవరకూ చదివి ఉండక పోవటం. నా ఉత్సాహానికి ఊతం ఇస్తూ వీరలక్ష్మి గారు మొదటి నవల తక్కలి శివశంకర పిళ్ళై గారి నవల మెట్టుకు పై మెట్టు నవల గురించి ఇలా వ్రాసారు” ఈ నవల చదవటం ఒక బుద్ధివికాసానికి సంబంధించిన అనుభవం.అనేక విషయాల పట్ల మనకు గల జ్ఞానం అవగాహనగా మార్చగల అనుభవం అది.” అంటారు.500 పేజీల నవలని సరిగ్గా రెండున్నర రోజుల్లో చదివేసారట ఆవిడ.అవగాహనతో కూడిన వేగం అది నాకు చాలా అబ్బురంగా అనిపించింది.నవలలోని కథ సంగతి అటుంచితే వీరలక్ష్మి గారు ఒక స్టేట్మెంట్ లాంటి వాక్యంతో ఈ నవల సారాంశాన్ని అందించారు ఆవిడ అసమాన ప్రతిభకు ఈ వాక్యం తార్కాణం చూడండి. కెరీరిస్టులుగా ఎడగటంలో మామూలు మనుషులు మానవత్వానికి ఎలా క్రమక్రమంగా దూరమవుతూ మితిమీరిన స్వార్ధపరులుగా మారాతారో ఈ నవలద్వారా మనం గ్రహిస్తాం.మెట్టుకు పై మెట్టు నవల మన బుద్దిని నిశితం చేస్తుంది. మొత్తం నవలని చెప్పేసినట్లే అనిపించింది ఈ వాక్యాల్లో.పరిచయం చదివినాక నాకు.
పి. కేశవ దేవ్ నవల అద్దం,తక్కాళి శివశంకర్ పిళ్ళై నవల కూలి గింజలు . రెండూ కార్మిక, రైతు కూలీ జీవితాలను , వారి కష్టాలను,తిరుగుబాట్లను తెలిపే నవలలు.కూలి గింజలు నవల రైతు కూలీల జీవనం కాబట్టి అనుకుంటా, రైతు బిడ్డనైన నాకు ఈ నవలా పరిచయం కంట తడి తెప్పించింది. ఈ నవలా పరిచయాన్ని వీరలక్ష్మి గారు కూడా మిగిలిన నవలా పరిచయాలకు భిన్నంగా కథని అందించటానికి కేటాయించారు.అందువలన పరిచయమే నవలని చదివిన అనుభూతిని ఇచ్చి గుండెని బరువెత్తించింది. ఆనాటి రైతు పోరాటాలని గుర్తుచేసింది.
ఎం.టి వాసుదేవనాయర్ సమిష్టి కుటుంబం నవల ఒక ఆర్ట్ పీస్ లాంటి నవల అంటూ పరిచయం చేసిన తీరు బాగుంది.ఒకానొక ఒంటరి స్త్రీ ,ఆమెని ఆదుకున్న సంస్కార వంతమైన పురుషుడుగా తన తల్లి,శంకర్ నాయర్ ,అప్పుణీ్ కి అర్ధం కావటం.తిరస్కరించబడిన ఇంటికి తిరిగి తన తల్లిని తీసుకు రావటం .నవల చాలా ఉదాత్తముగా ఉన్నట్లు గా అనిపించింది వీరలక్ష్మిగారి పరిచయముతో. విభిన్నమైన ఈ నవలని చదవాలి అని ఉత్సుకత కూడా కలిగింది. వీరలక్ష్మిగారి భారతీయ నవలాదర్శనం లక్ష్యం కూడా అదే కదా.
అగ్నిసాక్షి నవల లలితంబికా అంతర్జనం రచన.ఆవిడ రాసిన ఒకే ఒక నవల ఇది అని ఆవిడ పరిచయంలో వ్రాసారు.అయితే కేరళలో కల నబూద్రి వ్యవస్థ లో కల మొత్తం జీవితాన్ని ఈ ఒక్క నవలలోనే చూపించారు అనిపించింది. వీరలక్ష్మి గారి కోణంలో ఈ నవలలోని వ్యక్తులందరూ గాఢముగా ప్రేమించటం తెలిసిన వారు ,కానీ దురాచారాల వలన సుఖాలను త్యాగం చేసి జీవితం లో నలిగిపోయారు అని తేల్చి చెప్పేసారు. లలితాంబికా అంతర్జనం ఈ ప్రేమ దుఃఖాల గాఢత అంతా ఆమె హృదయంలోదేనని చెప్పారు అంటూ వీరలక్ష్మి గారు ఈ నవలా పరిచయాన్ని ఒక గొప్ప వ్యాఖ్యతో ముగిస్తారు.నవల పూర్తి చేశాక హృదయం ఒకేసారి బరువు,తేలికగా అవుతుంది .ఇదొక విశిష్టానుభవం అని.నాకు మాత్రం బరువు ఒకటే అనుభవం అయ్యింది.తేలికవ్వాలంటే నవల చదవాలేమో మరి.
సేతు మాధవన్ నవల పాండవపురం,జమీలా ఆత్మకథ ఈ రెండు నవలలూ కూడా ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి.జమీలా ఆత్మకథ పరిచయం నుంచి బయటికి రావటానికే నాకు కొంత సమయం పట్టింది.నవల చదివితే ఇంకా బాగుంటుంది అనిపించింది.
నేను ఎక్కని గడపలైన ఈ తమిళ, మలయాళీ నవలల పరిచయాలు నాకు ఓ కొత్తలోకాన్ని చూపాయి. చేయి పట్టి నడిపించిన మార్గదర్శి వీరలక్ష్మీదేవి గారు.
తమిళం,మలయాళం తర్వాత వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారితో నా సాహితీప్రయాణం మరాఠీ క్షేత్రానికి దారితీసింది. మరాఠీ మన తెలుగు రాష్ట్రాలకు చేరువలో ఉన్న మరో భాష. మరాఠీ అనగానే నాకు కృష్ణమ్మ జన్మస్థానం మహాబలేశ్వర్ గుర్తుకు వస్తుంది.అలాగే కొల్హాపూర్ ప్రత్యేకత కలిగిన ప్రాంత ముగా కట్టుబొట్టుతో సహా .మరాఠీ సీమలో నాటకాలు కూడా ప్రసిద్ధి చెందినవి.ముఖ్యంగా గ్రామీణ జీవనవిధానం, వ్యవసాయ క్షేత్రాలలో మన తెలుగు నేలకు, మరాఠీ నేలకు చాలా సారూప్యతలు ఉన్నాయి అనిపిస్తుంది.
ఈ మరాఠీ నవలల విభాగంలో మొదటగా వ్యంకటేష్ మాడ్గూళ్కర్ రచించిన,1971 లో కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు పొందిన బన్ గర్ వాడీ నవలని వీరలక్ష్మి గారు ఎంచుకున్నారు.ఒక మారుమూల పల్లెటూరుకు ఆరుకోసుల దూరం నుంచి ఆ వూరిలోని పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉండటం కోసం నడిచి వచ్చిన ఓ యువకుడి కథ. ఆ యువకుడు చివరికి ఆవూరిలో ఎటువంటి ముఖ్యభూమికగా మారతాడు అన్న కథే ఈ నవల. మొత్తం ఇతివృత్తం అంతా ఆకలి,పేదరికం,మెట్ట వ్యవసాయం ,వారి అమాయక ,శ్రమ జీవనం వీటితోనే నడుస్తుంది.విక్టోరియా రాణి జడవేసుకున్న బొమ్మ ఉన్న వెండి రూపాయి నాణెం జడ రూపాయి సంఘటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నవల విశ్లేషణలో క్లుప్తతను పాటిస్తూనే వీరలక్ష్మి గారు ముఖ్యమైన అంశాలని పొందుపరచటంలో చాలా శ్రద్ధను చూపారు.
తరవాత హరినారాయణ ఆప్టే నవల” నేను”.మొదటగా విద్య,ఆ తరువాత సాహిత్యం ఒక పేద,విపరీత వాతావరణంలో పెరిగిన యువకుడి పై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి.ఆ ప్రభావం అతనిని,అతని సోదరిని సమాజసేవ వైపు ఎలా నడిపిస్తుంది.హరిభావూ ఆత్మకథగా చెప్పబడిన నవల.వీరలక్ష్మిగారి మాటలలో ఈ నవల చదవాల్సిన ఆవశ్యక్త ,ప్రాముఖ్యత తెలిసిపోతుంది ఇలా :- “దాదాపు 90 ఏళ్లక్రితం మరాఠీ భాషలో వచ్చిన నవల.ఈ నవల చదువుతున్నంతసేపూ కందుకూరి వీరేశలింగంగారు,రాజశేఖర చరిత్ర నవలే గుర్తొస్తూనే ఉన్నాయి.నవలా నిర్మాణంలో తేడా ఉంది కానీ వస్తువూ ,రచయిత ఆశయము ఒకటిగానే ఉన్నాయి.” అని. సమకాలీన సాహిత్యంలో ఆయాసమాజల్లోఉన్న సమ్యక్ సమస్యల పట్ల రచయితల స్పందన ఒకేలా ఉంటుంది అని తెలుస్తుంది ఈ నవల వలన.ఇప్పటికీ కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండటం వలన ఇన్ని ఏళ్ల తరవాతకూడా ఇటువంటి నవలలు కొత్త కాగితపు వాసన వస్తూ మనల్ని చదివిస్తాయి.పరిచయం చేసిన వీరలక్ష్మిగారికి ధన్యవాదములు.
విష్ణు సఖరాం ఖాండేకర్ వ్రాసిన యయాతి .యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలుగులోకి అనువాదం చేశారు.ఈ నవలను నేను ఇంతకు ముందు చదివాను , అయితే వీరలక్ష్మిగారి మహోన్నతమైన దృక్కోణం తో కూడిన ఈ విశ్లేషణ చదివాక మళ్ళా తప్పక చదవాలని అర్ధం అయ్యింది. 500 వందల పేజీలున్న ఈ నవలను సంక్షిప్తంగా పరిచయం చేయటం కష్టం అంటూనే, ఆవిడ జీవితం తాలూకు మోహాలు, లోభాలు, స్వార్ధాలు,వాటినుంచి ఎంతోకొంత విముక్తి కావటానికి ఉన్న మార్గాలు రచయిత మలిచిన తీరు బాగుంది అంటూ మనల్ని నవల తన దృష్టితో చదివేలా ప్రేరేపిస్తారు. మరోసారి యయాతి నవల అంటూ శర్మిష్ఠ, దేవయాని,యయాతి అంతరంగాలను,వారి చుట్టూ ఏర్పడిన రంగాన్ని బహుచక్కగా విశ్లేషించారు.
విశ్లేషణ చదివినాక కొంచెం ఆగి , నన్ను నేను సంబాళించుకుని రాయటానికి ఉపక్రమిస్తున్న నవల లక్ష్మణ్ గయక్వాడ్ ఆత్మకథ ఊచల్యా . దేవుడికన్నా దాఖలా పత్రము,భారత్ బ్లేడు ఎక్కువైన దొంగతనాలు చేసే తెగకి చెందిన లక్ష్మణ్ గాథ ఈ నవల .నేను ఇంతకు ముందు మరీ ఇంత పేదరిక పరిస్థితులను తెలిపే నవలలను చదివి ఉండలేదు.దుఃఖము,మానవ సమాజము మీద ఆక్రోశము ఒక్కసారిగా కలిగాయి .వీరలక్ష్మి గారు కూడా ఎటువంటి మెరుగులు లేకుండా సూటిగా ,స్పష్టంగా లక్ష్మణ్ గాధని చక్కని విశ్లేషణతో ఇచ్చారు.పుస్తకాల మీద పెన్నుతో రాస్తారని తెలియని లక్ష్మణ్ తండ్రి పుస్తకాన్ని నల్లగా చేశావ్ అని కొడుకును కొట్టటం లోనే వారి వెనుకబాటు తెలుస్తుంది.నెలల తరబడి స్నానం చేయకపోవటం,ఆహార లేమి ,అపరిశుభ్రవాతావరణం ,ఇలాంటి పరిస్థితులలో కూడా లక్ష్మణ్ తండ్రి కొడుకును చదివించాలి అనుకోవటం.దుఃఖం,వారిలో వస్తున్నఎంతో కొంత మార్పుకు సంతోషమూ కలిగిస్తుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఈ నవలని తప్పక చదవాలి అనిపించేలా వీరలక్ష్మిదేవిగారు సమీక్షించారు.
నసీమా హురోజక్ ఆత్మకథ చక్రాల కుర్చీ నవలతో మరాఠీ నవలా విభాగాన్ని ముగించారు వీరలక్ష్మి గారు.ఈ నవల తనని చేరిన తరువాత చదవకుండా చాలా రోజులు అల్మారా లో ఉంచేసుకోవటం పట్ల ,చదివిన తరువాత సిగ్గుపడటమే కాక నన్ను నేను క్షమించుకో లేకపోయాను అని వీరలక్ష్మిదేవి గారు చెప్పుకోవటం వెనుక పాఠకులకి కూడా ఇది ఒక హెచ్చరిక అనిపించింది నాకు.సాహిత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మనకి విలువైనవి ,తెలుసుకోవలసినవి చేరకుండా పోతాయి. ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే నవల ఇది.నసీమా హురోజక్ పదహారు సంవత్సరాల వయసులో చక్రాల కుర్చీకి అంకితమైన అమ్మాయి .దుఃఖంతో,బాధతో ఆత్మహత్య దాకా వెళ్లి తనని తాను మెరుగుపరుచుకుని ఇవాళ భారతదేశములోనే అతిపెద్ద వికలాంగ పునరావాస సంస్థను నడిపే దిశగా ఎదగడం ఈ చక్రాల కుర్చీ.
మొత్తం మరాఠీ నవలలు అన్నీ ఒక్క యయాతి తప్ప జీవితాన్ని అతి దగ్గరగా యదార్ధంగా చూపినవే వీరలక్ష్మిగారి విశ్లేషణతో సంక్లిష్టమైన ఈ నవలలు సులభంగా అర్ధం చేసుకోవచ్చు ఇపుడు చదివితే.
హిందీ నవలల విభగములో భగవతీ చరణ్ వర్మ నవల చిత్రలేఖ అపూర్వమైన విజయం సాధించిన మనోహరమైన నవల ,ఇప్పటికి 15 ముద్రణలు పొందిన నవల అంటూ వీరలక్ష్మిదేవి గారు చిన్నపిల్లలకు తాయిలం చూపినట్లుగా చూపించి .నవలలోకి మనల్ని లాగి ,ఒక చారిత్రక నేపధ్యములో వ్రాయబడిన మానసికవిశ్లేషణకు, మనుషుల ప్రవర్తన ,పరివర్తనలకు సంభందించిన నవలను మనకు పరిచయం చేసారు. ఆవిడ మాటల్లోనే చూడండి నవల యొక్క సారాంశం :- “ ప్రతీ సన్నివేశములోనూ, ప్రతీ సంఘటన దగ్గరా పాత్రల ప్రవర్తన చూసి మనం మంచి చెడులు నిర్ణయం చెయ్యబోతాం. కానీ సాధ్యపడదు.చివరకు ఇతరుల జీవితాలలోని మంచిచెడుల నిర్ణయం చేసే పని వ్యర్ధమని మనం గ్రహించుకునేలా చేయటమే రచయిత ఉద్దేశ్యం అని అర్ధమవుతుంది .” అంటూ కొన్ని వాక్యాలలో వీరలక్ష్మీదేవిగారు చెప్పేయటం నన్ను అబ్బుర పరిచింది .అంటే మనకి నవలని ఎలా చూడాలో ,అందులో నుండి ఏమి తీసుకోవాలో నేర్పడం.
యశ్ పాల్ నవల మనిషి రూపాలు, పద్మభూషణ్ విష్ణు ప్రభాకర్ నవల అర్ధనారీశ్వరుడు ఈ రెండు నవలలూ చాలా జటిలమైన మానవ సంబంధాలను చర్చించిన నవలలు వీటిలోని సమస్యలు,పరిష్కారాలూ సామాన్య జీవనంలో మనం ఊహించలేనివి.ఈరెండు నవలలో విభిన్న మైన ,విస్తృతమైన పాత్రల వలన మరింత జటిలంగా అనిపిస్తాయి.అయితే వీరలక్ష్మీదేవిగారు అవి ఎందువలన గొప్ప నవలలు అయ్యాయో కూడా చెపుతూ సాగించిన విశ్లేషణ ఆవిడ అపారమైన సాహితీ అనుభవాన్ని,సాహిత్యం పట్ల ఆవిడకు గల గౌరవాన్ని తెలుపుతుంది.
ఆ గోడకు ఒక కిటికీ ఉండేది ! వినోద్ కుమార్ శుక్ల రచించిన 1999 లో కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు లభించిన నవల. ఒక సాధారణమైన కథకి మేజికల్ రియాలిజం వీరలక్ష్మి గారి మాటలో మాంత్రిక వాస్తవికత నింపిన కథ .కొంత కొత్తగానూ, మరికొంత అవాస్తవికత నుంచి వాస్తవికతని చూపిన వింత ప్రయోగం గానూ అనిపించింది.కొన్ని వర్ణనలు చదువుతున్నప్పుడు ఉత్తర భారత దేశంలోని మధ్యతరగతి జీవితం చిత్రరూపంలో కబడుతుంది. మొత్తం మీద మరాఠీ,హిందీ నవలల దర్శనంతో వీరలక్ష్మి గారు నన్ను మహారాష్ట్రలోని పల్లెటూర్లకు,ఉత్తర భారత దేశంలోని చిన్న పట్టణాలకు తీసుకెళ్లినట్లు అనిపించింది.అంటే ఆవిడ ఆశించిన సాహిత్య ప్రయోజనం నెరవేరినట్లే మరి. మరి కొన్ని భాషలతో,మరి కొన్ని నవలలతో వీరలక్ష్మీదేవిగారితో కలిసి మళ్లీ ఇంకో వ్యాసం తో మీ ముందువుంటాను.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
అమ్మ గారు మీరు ఇ నవలాలోక పుస్తకాలలో
ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని కోరుకుంటూ మీ దుర్గారావు
థాంక్యూ దుర్గారావ్ 🙋