మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

“ఓ… నేననలేదా? చెప్పలేదా? ఈ నాస్తికులింతే! ఈ కమ్యూనిస్టులింతే…” అని వాళ్ళలో వాళ్ళే ఆశ్చర్య పోయారు. నాతో “చూడు…. జంతువులు, చివరికి సింహాల లాంటి క్రూర మృగాలు సైతం తమ ప్రాణాల్నయినా పణంగా పెట్టి పిల్లల్ని కాపాడుకుంటాయి. నువు ఆ క్రూర జంతువులకన్నా కఠినాత్మురాలివి. హృదయం లేని దానివి” అని తిట్టి, కొట్టారు. అటూ ఇటూ తోశారు, గిల్లారు. “పిల్లల్ని కాపాడుకోని తల్లివి – నువ్వేం తల్లివి? అబ్బ ఎంత ఘోరం, ఎంత హీనం, ఎంత . నీచం! ఎంత క్రూరమైన దానివి నువ్వు” అంటూ ఒకావిడ వెళ్ళిపోయింది.

మరొకావిడ “చూడమ్మా ఇప్పుడు నువ్వు ఆవేశంలో, ఉద్రేకంలో ఉన్నావని నాకు తెలుసు. నువు ఎప్పుడు మనసు మార్చుకోదలచినా, నా తలుపులు నీకు తెరిచే ఉంటాయి” అని చెప్పి తన చిరునామా ఇచ్చి వెళ్ళిపోయింది.

అప్పుడు ఏజెంట్ నా దగ్గరికొచ్చి “ఎంత పని చేశావు? నేను నీకేదో మేలు చేద్దామనుకుంటే నువు నాకెంత కీడు చేశావో తెలుసునా? నీకోసం నేను ఉద్యోగం పణంగా పెట్టాను. ఐనా ఒకర్ని అనేదేముందిలే. దిగగూడని విషయాల్లో దిగడం నా బుద్ధి పొరపాటుగాని! నిన్ను ఇక్కడ ముక్కలు ముక్కలుగా కోసినా పాపంలేదు. కాని ఒక సంగతి గుర్తుంచుకో. ఏదో ఒక రోజు నీ భర్తకు ఈ సంగతి తెలుస్తుంది. నువు నీ పిల్లలను చేతులారా మృత్యువు నోటికి అందించావని ఆయనకు తెలుస్తుంది.” అని తిట్టి వెళ్ళిపోయాడు.

“ఏం చేశాను? నేనేం చేశాను? నేను చేసిందేమిటి? నా పిల్లల్ని నేనే చంపుకున్నానా? ఔనా? ఓరి దేవుడో ఔనా…?” అని నాకు నేనే తర్కించుకున్నాను.

ఇంతలో ఆ బ్రెజిలియన్ యువతి లేచివచ్చి నన్ను గట్టిగా కావలించుకుంది. దగ్గరికి తీసుకుని గట్టిగా హృదయానికి అదుముకుంది. నా దుఃఖం ఇక కట్టలు తెంచుకొని పారింది. అప్పుడావిడ నాతో “దొమితిలా – నువు ఇప్పుడు చేసిన పని నేనైతే చేసి ఉండేదాన్నే కాదు. నువ్వు అగ్ని పరీక్ష నెదుర్కున్నావు. అంత గొప్ప జనం తమ నాయకురాల్ని ఎంచుకోవడంలో ఎట్లా పొరపడ్డారా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతకు ముందుదాకా. కాని ఇప్పుడు మీ ప్రజలు నిన్ను ఎన్నుకోవడంలో ఎంత సరైన నిర్ణయం తీసుకున్నారో అర్థమవుతోంది” అంది. ఈ మాటలని ఆమె కూడా ఏడవడం మొదలెట్టింది. మేమిద్దరమూ అలా ఎంతో సేపు ఏడ్చాం. నాతో ఈ అగ్ని పరీక్షా సమయంలో ఉండడం తనకెంతో ఆనందంగా ఉందనీ, పిల్లల మరణాలకు ప్రతీకారం తీర్చుకోవడానికైనా నేను బతికి ఉండాలనీ చెప్పింది.

ఐతే ఇంతకూ జరిగిన సంగతేమిటో తెలుసా? నా పిల్లలను ఎప్పుడూ కనీసం అరెస్టు కూడా చేయలేదు.

ఆ రోజు నుంచి నేను నిరాహార దీక్ష ప్రారంభించాను. వాళ్ళు పళ్ళాలనిండా తెచ్చి పెట్టిన తిండి నేను వేలైనా వేసి ముట్టకుండానే తిప్పి పంపించేశాను. “మీరు నా పిల్లల్ని చంపేశాక ‘ నేను బతికుండి ఏం చేయాలి. నన్ను కూడా చం పేయండి. నాకు విషం ఇవ్వండి…”

ఓ రోజు, బహుశా గురువారం అనుకుంటాను. నేను ఏజెంట్లు వాడుకునే తలుపు దగ్గర నిలబడి ఉన్నాను. నాకు వాకిట్లోంచి ఒక పాప కిలకిలలు వినిపించాయి. పైకి నిక్కిచూస్తే బైట ఒక స్త్రీ కూచొని కనబడింది. నేనావిడతో “ఏమమ్మా!’ అక్కడ నువు ఒక్కదానివే ఉన్నావా? ఆ పాప నీ పాపేనా? భలే ముద్దుగా ఉందమ్మా? నాకు కూడా అంత పాప ఉంది. మమ్మల్నిద్దర్నీ ఇక్కడ కొట్లో పడేశారు. నువు ఇక్కడి కెందుకొచ్చావు?” అని మాటలు కలిపాను.

“ఏం చెప్పను? వాళ్లు మా సైకిల్ ఎత్తుకుపోయారు. రేడియో ఎత్తుకుపోయారు. కనబడ్డ ప్రతిదీ ఎత్తుకుపోయారు. నేనిప్పుడు అవి తీసుకెళ్ళడానికి వచ్చాను గానీ నేను వచ్చేసరికే తాళం వేసుకుని వెళ్ళిపోయారు. నేనిక్కడ ఎదురుచూస్తూ కూచున్నాను. మధ్యాహ్నం రెండింటివరకు కూచోమన్నారు. నువు ఏం దొంగిలించావు? నిన్నెందుకు అక్కడేశారు” అని అడిగింది

“నేను దొంగను కానమ్మా? అది సరేగాని నీ భర్త ఎక్కడ పనిచేస్తాడు?”

“ఆయన ఒక ఫ్యాక్టరీ కార్మికుడు”

“అలాగా! చూడు చెల్లీ! నేను సైగ్లో-20 నుంచి వచ్చాను. వాళ్ళు నన్ను ఇక్కడ నిర్బంధించారు. నేను ఒక గని కార్మికుడి భార్యని. కార్మికులు ఒకరికొకరు తోడ్పడొద్దూ? నువు నీ భర్తకు ఓ చిన్న చీటి తీసుకెళ్లి ఇవ్వగలవా?”

నేను అప్పటికే ఒక సిగరెట్ కాగితం మీద ఉత్తరం రాసి పెట్టాను. పాప ఎప్పుడన్నా చాలా సేపు ఏడ్చినప్పుడు నా దగ్గర కాపలా ఉండే ఏజెంట్లు దాన్ని ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళేవారు. అక్కడ అది ఓ గదిలో నుంచి మరో గదిలోకి తిరుగుతూ ఉండేది. అదే ఏదో ఒక ఆఫీసు గదిలో నుంచి ఒక సిగరెట్ కాగితమూ, ఓ పాత బాల్ పాయింట్ పెన్నూ పట్టుకొచ్చి ఇచ్చింది. నేను జైల్లో ఉన్నాననీ, ఒక భయంకర పరిస్థితిలో నా పిల్లల్ని పోగొట్టుకున్నాననీ రాశాను. నేను చేసిన నేరమల్లా సాన్ జువాన్ హత్యాకాండను ఖండించడమేనని కూడా రాశాను. ఈ కారణం వల్లనే నా భర్త పోర్టోరికోకు ప్రవాసం పంపబడ్డాడనీ, నేనేమో లాపా లో డిఐసి చీకటికొట్లలో మగ్గిపోతున్నాననీ, ఇక నేను బతకడానికి ఏ ఆశాలేక నిరాహారదీక్ష వహిస్తున్నానని రాశాను. “బొలీవియన్ ప్రభుత్వం పాల్పడుతున్న మరొక ‘నేరాన్ని నేను తెలుపుతున్నాను. నా పట్ల, నా పిల్లలపట్ల ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని నేను బొలీవియన్ ప్రజలకు తెలపదలచుకున్నాను…” అని రాసి చివరకు సంతకం చేశాను.

కనీసం ఆవిడకైనా తెలుస్తుంది గదా అని నేనావిడకు మొత్తం విషయమంతా వివరించి చెప్పాను. నా ఉత్తరాన్ని అచ్చువేయించమని చెప్పాను. “అమ్మో! అదెట్లా వీలవుతుంది. నువు నాకు కష్టాలు తెచ్చేట్టున్నావే!” అందామె.

“దయచేసి ఈ ఒక్కపనీ చెయ్యి. నా పాప ముఖం చూసి ఐనా కనికరం వహించు. ఈ ఉత్తరం ముక్క తీసుకెళ్ళి నీ భర్తకివ్వు. ఆయన అచ్చువేయిస్తే మంచిదే. వేయించకపోతే… సరే – ఏం చేస్తాం? అలాంటప్పుడు ఈ చీటీ తీసుకెళ్లి యూనివర్సిటీలో ఇమ్మను. కనీసం అక్కడి వాళ్ళకైనా నేనీ జైల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు నేనిక్కడున్నట్టు ఎవరికీ తెలియదు.” నేనావిడను బతిమిలాడాను. ఏడ్చాను, ఇప్పటికీ ఆవిడెవరో, ఆవిడ భర్తెవరో తెలియదు.

“ఒకవేళ వాళ్ళు నన్ను పట్టుకుంటే, నన్ను శిక్షిస్తే?” అని ఆవిడ అడిగింది.

“నాకైతే నువ్వెవరో తెలియదు. నాకు నీ ముఖం కనబడడం లేదు. నీకూ నా ముఖం కనబడడంలేదు. నా కోసం నువ్వీ చీటీ తీసుకెళ్ళావని ఎవరికి తెలుస్తుంది? నా కోసం ఈ ఒక్కపని చెయ్యి. ఇక ఆఫీసు తెరిచే సమయం అవుతోంది మరి” అన్నాను.

“సరే, ఇలాగివ్వు” అని ఆవిడ ఆ చీటీ తీసుకుంది.

“దాచుకో, అదెలాగూ చిన్నగానే ఉందిలే!”

అలా అయిష్టంగానే ఆవిడ ఆ చీటీ తీసుకుంది. కాని, పాపం, ఆ చీటీ తీసుకెళ్ళి భర్తకు ఇచ్చినట్టుంది. మొత్తానికి ఆ చీటీ యూనివర్సిటీకి చేరింది. నేనక్కడ కొట్లో ఉన్నానని అందరికీ తెలిసిపోయింది.

శుక్రవారం వేకువజామున్నే డి.ఐ.సి. ఉన్నతాధికారి ఒకడు నా దగ్గరికొచ్చి నన్ను తంతూ:

12 November 2020

“ఆ చీటీ బైటికెవరు తీసుకెళ్ళారు? ఎవరు రాసి పెట్టారు?” అని గుచ్చి గుచ్చి అడిగాడు.

నన్ను వాడు చితగొట్టాడు. “బైటికెళ్ళి తెలుసుకో – కావలిస్తే పరిశోధించుకో – నీ ఉద్యోగం అదే గదా? నీకు డబ్బులిచ్చేది అందుకే గదా? నీ పని తెలుసుకోవడమేగా. పరిశోధించడమేగా? నేనేమీ నీ ఏజెంటును కాదు…” అని నేను జవాబిచ్చాను.

అప్పుడు వాడు నా వెంట్రుకలు పట్టి లాగాడు. నన్ను ఇంకో కొట్టులో, చిన్న గదిలో పడేశాడు. అక్కడ నన్ను ఒంటరిగా పడేశారు. ఆ కొట్టు తలుపు తెరవడానికి, మూయడానికీ లోపలి నుంచి ఓ ఇనుపకడ్డీ ఉంది. నా కూతురు ఆకలితో అరిచి గీ పెట్టినా నేను తలుపు తెరవలేదు. “మనకిప్పుడు ఆకలి దప్పులు లేవమ్మా, నా తల్లీ, మనం ఇప్పుడు ఇక్కడ చచ్చిపోబోతున్నాం…” అనేదాన్ని.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.