నారి సారించిన నవల-26
రంగనాయకమ్మ-3
-కాత్యాయనీ విద్మహే
రంగనాయకమ్మ 1965 లో వ్రాసిన ‘రచయిత్రి’ , 1967 లో వ్రాసిన ‘కళఎందుకు’? నవలలు రెండూ పితృస్వామిక కుటుంబ సంబంధాలు సాహిత్య కళారంగాలలో స్త్రీల అభిరుచులకు, అభినివేశాలకు అవరోధం అవుతుండగా వాళ్ళెంత ఘర్షణకు లోనయ్యారో చిత్రించాయి.
1
రచయిత్రి నవల 1965 లో జయశ్రీ మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. తన రచనలకు తానే విమర్శకురాలై రంగనాయకమ్మ 1970 లలో కొత్త ముందుమాటలతో నవలల పునర్ముద్రణ ప్రారంభించింది. ఆ వరుసలో 1975 లో వేసిన రచయిత్రి నవల 4 వ ముద్రణకు పెద్ద ముందు మాట వ్రాసింది. దానితో సంతృప్తి పడలేక 2007 లో ఆ నవలను కొన్ని తీసి కొన్ని చేర్చి విజయ పాత్ర చైతన్యానికి పదును పెడుతూ తిరిగి వ్రాసి 2008లో ప్రచురించింది.
రచయిత్రి నవలలో రచయిత్రి విజయ. విజయ మోహన్ ల పెళ్లితో మొదలవుతుంది ఈ నవల. అప్పటికే ఆమె రచయిత్రి. అనురాధ అనే కలం పేరుతో వ్రాస్తున్నది కనుక ఆమె రచయిత్రి అని ప్రత్యేకంగా పెళ్లిచూపుల సమయంలో ఎవరూ తెలియపరచలేదు కనుక మోహన్ కు ఆ విషయం తెలియదు. కానీ ఆమె బిఎ చదివింది అన్నది మాత్రం అతనికి తెలుసు. తనతో సమానంగా చదివిన ఆమెను పెళ్లాడితే వచ్చే సమస్యల గురించి ఆలోచించి పెళ్ళికి జంకాడు. భర్త అధికుడు , భార్య అధీనురాలు అన్న ఒక పితృస్వామిక అధికార సూత్రం భావ ప్రపంచంలో ఇంకిపోయి జీవిత సంస్కృతిగా పరివర్తన చెందిన సమాజంలో మగవాళ్లయినా, ఆడవాళ్లయినా దానినే సహజ న్యాయం అనుకొంటారు. తనతో సమానంగా బిఎ చదివిన విజయ పెళ్లయ్యాక అన్నిటా సమానం అంటూ ఏమి సవాళ్లు విసురుతుందోనన్న సందేహం బాధిస్తుండగా విజయంతో పెళ్ళికి సందేహించాడు మోహన్. ఏవో సమాధానాలు చెప్పుకొని పెళ్ళయితే చేసుకొన్నాడు కానీ తరువాత ప్రతి సందర్భంలోనూ ఆమె తనను అధిగమించి పోకుండా హద్దులు గుర్తు చేస్తూనే వచ్చాడు. విజయ ఎమ్మె చదువుతానంటే అతను చూపిన మౌనం, నిర్లక్ష్యం అతని అయిష్ట సూచనలే. అది గ్రహించి విజయ అతనిలో మార్పు వస్తుందేమోనన్న ఆశతో తనంతట తానే చదువు ఆలోచనను ఒక ఏడాదికి వాయిదావేసుకోవలసి వచ్చింది.
మోహన్ కథలు చదువుతాడు. ఆ రకంగా అతను అనురాధ కథలకు పాఠకుడు. అభిమాని కూడా. కానీ ఆ అనురాధ తన భార్య విజయ అని తెలిసినప్పుడు ఆ అభిమానాన్ని పూర్వం లాగా చూపలేకపోయాడు. క్రమం గా ఆ అభిమానాన్ని చంపుకొంటూ ద్వేషం పెంచుకున్నాడు. ఎందువల్ల ఇలా జరిగింది ? స్త్రీకి భర్తకంటే భిన్నంగా సమాజంలో ప్రత్యేక వ్యక్తిత్వం , గుర్తింపు ఉండటాన్ని సహించలేని ఆధిక్యతా అహంభావాల పరిణామం ఇది. రచయిత్రిని అన్న ఆధిక్యతాభావం విజయ ఎక్కడ ప్రదర్శిస్తుందోనన్న అనుమానం , దానిని మొలకలోనే తుంచేయాలన్న ఆలోచన పురుష సహజ లక్షణాలుగా మోహన్ ప్రవర్తనను నిర్దేశించాయి. రచయిత్రి అయినా ఆడది ఆడదే … భార్య భార్యే అన్న నగ్న సత్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసి ఆ స్థానంలోనే ఆమెను నిలిపిఉంచాలన్న పంతం అతనిది. ఆమెకు సంబంధించిన నిర్ణయాలు ఏవైనా తాను తీసుకోవలసినదే కానీ తనకై తాను తీసుకొంటే అసహనం , అసంతృప్తి, అలక , సాధింపు. విజయ కథలు తండ్రో , అన్నో వ్రాసిపెట్టినవి అనుకొనటంలో ఆమె ఆధిక్యత అభావం అయింది కదా అన్న సంతృప్తి కూడా అతనికి లేకపోలేదు.
ఆమె రచయిత్రి అని తెలిసాక ఆమె ఇష్టపడక పోయినా ఆమెతో సంభాషణకు తనమిత్రులను ఇంటికి ఆహ్వానిస్తాడు. అలా పిలవటం అతని హృదయ వైశాల్యానికి, ఉదారతకు గుర్తు. అదే ఆమె తనతో మాట్లాడాలని వచ్చినవాళ్ళకోసం సమయం వెచ్చించటం సంసారం పట్టని లక్షణం. భర్తను లక్ష్యపెట్టని తనం. కథా వస్తువుగా దేనిని స్వీకరించాలో దేనిని తిరస్కరించాలో తాను నిర్ణయించటానికి ఉత్సాహపడతాడు. తన ఆఫీసు విషయాలు కథలుగా వ్రాయమంటాడు. సంసారంలో ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని అంగీకరించే సంస్కారం మగవాళ్ళకింకా రాలేదన్న వస్తువుతో ఆమె కథ వ్రాస్తే అది తనను తిట్టటంగా అనిపించింది. సంసారంలో అన్యోన్యత లేనప్పుడు స్త్రీ మనస్సు , శరీరం ఎంత వేదనకు గురి అవుతాయో , వేరేచోట ఆనందాన్ని వెతుక్కొనటానికి పడే ఘర్షణ ఎలాఉంటుందో ఇతివృత్తంగా చేసి కథ వ్రాస్తే అది సెక్స్ కథ అనిపించింది. తనకు అవమానకరమైనదని సాధించి పెట్టాడు. ఆమె అలాంటి కథలు వ్రాయకూడదు అని మొహం మీద చెప్పటానికి అతనికేమీ మొహమాటం లేదు. ఒక రచయిత్రి అయినా సరే కథావస్తువు కోసం , ఆ వస్తువు కు సంబంధించిన అధ్యయనానికి అవసరమైన పుస్తకాలకోసం, వ్రాసిన కథను , అభిమానులు వ్రాసిన ఉత్తరాలకు జవాబులను పోస్ట్ చెయ్యటం కోసం ఆమె తనమీద ఆధారపడి ఉండాలే కానీ మరెవరి సహాయమూ కోరకూడదు అన్నది అతని అభిప్రాయం. అది ఆమె పట్ల ప్రేమతోనో, ఆమె రచనావ్యాసంగం పట్ల గౌరవంతోనో, ఆమె పనులు తానే చేసి పెట్టాలన్న ఉత్సాహం వల్లనో అయితే సమస్యే లేదు. తన మీద ఆధారపడి ఉంటే చెయ్యకపోవటానికి తనకున్న అధికారాన్ని వాడుకోవచ్చునన్న పురుషాహంకారం వల్లనే సమస్య అంతా. ఆ అహంకారమే శాస్త్రీయ నృత్యం కేంద్రంగా నవల వ్రాయటానికి ఆలోచిస్తూ అన్నచేత భరత నాట్యం మీద పుస్తకం తెప్పించుకొంటే అక్కసుగా వ్యక్తమైంది. నాట్యకళాకారిణి జగన్మోహిని ఇంటికి పోయి మాట్లాడాలనుకొన్నప్పుడు, జగన్మోహినిని ప్రదర్శనకు వెళ్లాలని ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఏవో వంకలు పెట్టి ఎగ్గొట్టి ఆమె కూడా వెళ్లలేని పరిస్థితిని కల్పించాడు. పుట్టింటికి వెళ్ళటం, అక్కడ ఎన్నిరోజులు ఉండాలి అన్న దగ్గరనుండి మీటిగ్ లకు వెళ్లటం వరకు అన్నిటా భార్య భర్త అభిమతాన్నిఅనుసరించి తనను తాను కుదించుకొని, సర్దుబాటు చేసుకొని బ్రతకాల్సి రావటంలో స్త్రీ ఆత్మగౌరవం ఎంతగా భంగపడుతుందో , కనబడని హింసకు గురిఅవుతుందో విజయ అంతరంగ సంఘర్షణ ను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
రాత్రిపూట టేబిల్ లైట్ వెలుతురు అతని మీద పడి నిద్రాభంగం కాకుండా సర్దుకొని వ్రాసుకొనే విజయ దీపం వెలుగుకీ , కాగితాల చప్పుడికీ తనకు నిద్రపట్టదని అతనంటే అది ఆమె పట్ల రాత్రిపూట వ్రాయకూడదన్న నిషేధాజ్ఞ అయింది. రాత్రిపూట వ్రాయనులెండి అని చెప్పటంలో అతని మాటను మన్నించటం అన్న వినయలక్షణం కంటే గాయపడ్డ ఆత్మగౌరవ చేతనే వినబడుతుంది. అతను ఆఫీసుకు వెళ్ళినప్పుడు పగటి సమయంలో వ్రాసుకొనటం, రాత్రిళ్ళు కూడా వ్రాసుకొనవలసిన పని ఒత్తిడి ఉన్నప్పుడు వరండాలో చాప పరచుకొని క్రిందకూర్చుని ముందు బల్ల పెట్టుకొని వ్రాసుకొనటం – భర్త అప్రకటిత నిషేధాజ్ఞలపై విజయ ఉల్లంఘన చర్యలే. నిషేధాలను ధిక్కరించి విజయ తన సృజన కార్యకలాపం కొనసాగించటం మోహన్ ను ఎంత అసహనానికి గురిచేసిందంటే తెల్లవారుతుండగా ఇంకా ఏకాగ్రతతో వ్రాసుకొంటున్న భార్యను ఎంత రచయితవైనా అత్తగారు , తోడికోడలు లేచి పనులు చేసుకొంటుంటే మైమరచి ఏమిటా వ్రాతలు అని హుంకరించి మాట్లాడేటట్లు చేసింది. స్త్రీకి తనకు ఇష్టమైన పని చేసుకొనటానికి తన ఇంటనే సమయం స్థలం లేకపోవటం పెద్ద విషాదం. అది తన ఇల్లు కాకపోవటమే అందుకు కారణం. అది అత్తిల్లు. భర్త ఇల్లు. పుట్టిల్లు కూడా ఆమెది కాదు. ఇల్లు ఏదైనా అది మగవాడిది. మగవాళ్ల హక్కు. మగవాడి వికాసానికి సౌకర్యవంతంగా అమర్చబడి ఉంటుంది. ఆడవాళ్లకు ఏ ఇంట్లోనూ తనదైన గది ఉండదు. తన అభిరుచుల ప్రకారం జీవితాన్ని వికసింపచేసుకొనే అవకాశాలు ఉండవు. ఈ వివక్షా ప్రపంచం గురించే వర్జీనియా వూల్ఫ్ ‘ఏ రూమ్ అఫ్ వన్స్ ఓన్ ‘(1928 అక్టోబర్) లో చర్చించింది.
‘ రచయిత ఎదుర్కొనే సమస్యలేవో కొంతవరకు నాకు తెలుసు. ఇవి కాక రచయిత్రి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కొనవచ్చునని మీ నవల చదవటానికి ముందు నేను ఊహించనైనా లేదు.’ అని నార్ల వెంకటేశ్వర రావు అన్న మాటలను ( , 1969, సెప్టెంబర్ నాటి ద్వితీయ ముద్రణ కు అనుబంధంగా ఇయ్యబడిన 23-10-1966 నాటి నార్ల లేఖ ) బట్టి స్త్రీలు నవలా రచనారంగంలోకి రావటం వల్ల సాహిత్య లోకానికి కొత్త ముడిసరుకు జీవితపు గనులనుండి సమకూడుతున్న సందర్భాన్ని అర్ధం చేసుకోవచ్చు.
మగవాడి ఆధిక్యతా అధికారాలను ప్రశ్నించకుండా అహాన్ని సంతృప్తి పరుస్తూ జీవించగలిగిన భార్య వుంటే ఆ కుటుంబం స్వర్గం. అంటే స్త్రీల అధీనతలోనే సామాజిక ఆర్ధిక అస్వతంత్రత లోనే పురుషుడిదైన కుటుంబానికి సంబంధించిన సంతోషం ఉంటుందన్నమాట. పితృస్వామిక సమాజం తనకు సహజలక్షణంగా చేసిన అధీనతా జీవితానికి భిన్నంగా స్త్రీ సామాజిక సాంస్కృతిక రంగాలలో పనిచేస్తూ, ఆర్ధికంగా స్వతంత్రురాలైతే , స్వయం వ్యక్తిత్వంతో ప్రవర్తిస్తే అది పురుషాధిక్యతకు ఒక సవాల్. కుటుంబలో అశాంతికి , సంఘర్షణకు తక్షణ కారణం. రచయిత్రి నవల ఈ విధమైన కుటుంబాన్ని చిత్రించింది. స్త్రీల సృజనాత్మక ప్రతిభను నియంత్రించే అధికార వ్యవస్థగా కుటుంబం యొక్క దుష్ట పార్శ్వం ఇది. ఈ నవలలో సంఘర్షణ అంతా భార్యాభర్తలకు సంబంధించింది. అత్త, బావగారు , తోడికోడలు ఉన్నారు ఆ కుటుంబంలో . భర్తవైపు బంధువులు కావటం వల్ల వాళ్ళు విజయ మీద అధికార స్థానంలో ఉన్నవాళ్లే. అయినా అత్తా తోడికోడలు విజయ తో స్నేహ సంబంధాలలోనే ఉన్నారు. మనసు నొప్పించే మాట అత్తా నోట రాదు. మనసెరిగి మనసిచ్చి మాట్లాడుతుంది తోడికోడలు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే లోకోపవాదాన్ని తిప్పికొడుతూ పితృస్వామిక అధికార రాజకీయాలవల్ల కుటుంబంలో అత్త,కోడలు , తోడికోడళ్లు , ఆడపడుచులు గా విడదీయబడిన స్త్రీలు ఒకరిపట్ల ఒకరు స్నేహంగా జీవించటానికి ఉన్న అవకాశాన్ని వెలికితీసి చూపటం ఈ నవలలోని విశేషం. కుటుంబంలో నిజమైన పెత్తనం భర్త స్థానంలో ఉన్న పురుషుడిదే అయినా తెలిసో , తెలియకో స్త్రీలు అతని అధికారాన్ని తాము కూడా ఆమె మీద చలాయించటానికి చూస్తుంటారు. కానీ ఇది నిజమైన అధికారం కాదని కాస్తపాటి సంస్కారం ఉన్నా వదులుకొనటానికి వీలైందేనని రంగనాయకమ్మ నిరూపించింది. విజయ పెళ్లయి ఏడాది పూర్తికాకముందే మోహన్ పట్ల విసిగి పోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ కాలమైనా సహనం కూడదీసుకుని తాను అతనితో ఉండటానికి తోడికోడలు రుక్మిణి పంచిన స్నేహమే ఆలంబన అయిందని విజయ చెప్పుకొన్నదంటే దాని ఫలితమే.
రంగనాయకమ్మ నవలల్లో సాధారణంగా పుట్టింటి కుటుంబం సంస్కారవంతమై ఉంటుంది. రచయిత్రి నవలలోనూ అంతే. విజయ బిఎ చదవటమైనా, కథలు వ్రాయటమైనా ఆ సంస్కార ఫలితమే. విజయ పెళ్లిచూపులు , పెళ్లి సాంప్రదాయ పద్ధతిలోజరపటం, అత్తగారు అల్లుడిని గారూ , మీరు అని సంబోధించటం వంటి పరిమితులు ఉన్నా అన్న రచయితగా ఆమె ఏమి చదవాలో , ఎలా తనను తాను తీర్చి దిద్దుకోవాలో చెప్తూ రచనలవల్ల ఆమెకు వచ్చే ఆదాయం బ్యాంక్ అకవుంట్ తానే నిర్వహిస్తున్నా ఆమె మోహన్ తో తనకిక సరిపడదని వచ్చినప్పుడు , విడాకులు తీసుకొనటానికి నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు ఆమెకు లోకం గురించి చెప్పి భయపెట్టలేదు. మద్దతుగా నిలబడ్డారు. ఆ మేరకైనా కుటుంబాలు సంస్కారవంతం కావటాన్ని రంగనాయకమ్మ ఆశించింది.
గతానికి సంబంధించిన పురుషాధిక్యత అధికారాల బరువు కింద నలిగి నామరూపాలు లేకుండా నలిగి మిగిలిపోవటానికి అంగీకరించక పెనుగులాడిన విజయ తాను తానుగా నిలబడటానికి వైవాహిక బంధాన్ని వదులుకొనటానికి సిద్ధపడింది. తన సృజనాత్మక శక్తులను, ఆత్మగౌరవాన్ని భర్త దయాధర్మాలకోసం ఆహుతి చెయ్యటానికి ఇష్టపడకపోవటంలో భవిష్యత్తులో రూపొందబోయే స్వయంసిద్ధ మహిళకు వేరుబలం ఉన్నది. 2007 లో తిరిగి వ్రాయకముందు రచయిత్రి నవలలో మోహన్ లో ఈ విధమైన ఆధునిక మహిళకు సహచరుడు కాగలిగిన రేపటి పురుషుడు బీజప్రాయంలో ఉన్నాడు. కానీ తిరిగివ్రాసిన నవలలో మోహన్ విజయ కోసం తాను ఎంతగా మనిషిగా మారాల్సి ఉందో దానికి సంబంధించిన అంచనా లేని వాడు. అసమానతల అహంకారాల గతాన్ని జయించి నూతన ప్రజాస్వామిక మానవుడిగా అవతరించాలన్న ఆశయం, ఆకాంక్ష అతనిలో లేవు. అందువల్లనే విజయ కోసం ఆమె ఇంటికి వెళ్లి కూడా మునుపటికన్నా ఏ మాత్రం మెరుగ్గా ప్రవర్తించలేకపోయాడు. ఇలాంటి భర్తల నుండి విముక్తి లోనే స్త్రీల సాధికారత వాస్తవీకరించబడే అవకాశం ఉందని రంగనాయకమ్మ నమ్మకం.
2
రచయిత్రి నవలలో విజయ నాట్యకళకు జీవితాన్ని అంకితం చేసిన అక్కాచెల్లెళ్ల కథ నవలగా వ్రాయాలని తలపెట్టి నాట్యశాస్త్ర గ్రంధాలు తెప్పించుకొని చదవటం, జగన్మోహిని అనే నాట్యకళాకారిణితో సంభాషించటం చూస్తాం. ఆ నవల పూర్తయి ఆంధ్రప్రభలో సీరియల్ గా మొదలైనట్లు కూడా అందులో వుంది. జీవితాన్ని నాట్యకళకు అంకితం చేసిన ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ల కథే ‘కళ ఎందుకు’ నవల కు ఇతివృత్తం.1967 లో వ్రాసిన ఈ నవలకు 1965 నుండే రంగనాయకమ్మ ఆలోచన, అధ్యయనం ప్రారంభించిందని ఆ అనుభవాన్ని విజయదిగా చేసి రచయిత్రి నవలేతివృత్తంలో భాగం చేసిందని అనుకోవచ్చు.
రచన కన్నా స్త్రీల విషయంలో క్లిష్టతరమైన కళలు సంగీతనాట్యాలు. రచన ఒక మేరకు తనఇంట్లో తాను ఉండి చేసుకోగలిగిన పని. సంగీతనాట్యాలు ప్రజాసమూహాలమధ్య ప్రదర్శనకు ఉద్దేశించినవి. నాలుగు గోడలకు అవతల స్త్రీలకు జీవితాన్ని నిషేధించిన సమాజంలో స్త్రీలకు అవి నిషేధవిద్యలు. పురుషులను ఆకర్షించటానికి భోగం స్త్రీలు నేర్చుకొనే కళలు అని వాటికి పేరు.అటువంటి సంగీతనాట్య కళల అభ్యాసానికి స్త్రీలకు కుటుంబంలో ఉండే అవకాశాలు తక్కువ. అవకాశాలు దొరికినవాళ్లకు ఎదురయ్యే అవరోధాలు అనేకం. వాటిపై కేంద్రీకరించి వ్రాసిన నవల కళ ఎందుకు? ఇది 1968 లో ఆంధ్రజ్యోతి పత్రికలో సీరియల్ గా వచ్చింది అని 2007 నాటి ముద్రణ ముందుమాటలో రంగనాయకమ్మ చెప్పింది. కానీ దాని తొలిముద్రణ 1967 లోనే వచ్చింది. ( ముప్పాళ సీతారామస్వామి పబ్లికేషన్స్ ) ప్రియ సోదరీ అని సంబోధిస్తూ మధురగాయని భానుమతికి రంగనాయకమ్మ ఈ నవలను అంకితమిచ్చింది. 2007 వరకు మొత్తం నాలుగు ముద్రణలు పొందింది. 1975 నాటి ముద్రణకు ఆత్మవిమర్శనాత్మకమైన కొత్తముందుమాట వ్రాసింది. దానితో కూడా సంతృప్తి చెందక 2007 నాటికి విడిపోయిన మోహినీ సుధాకర్ లతో విడివిడిగా గోపాల్ మాట్లాడే అధ్యాయాలను తిరగ వ్రాసి ప్రచురించింది.
పద్మిని , మోహిని నృత్య ప్రదర్శనతో ప్రారంభించి అక్కాచెల్లెళ్ల నాట్యాన్ని అభినందిస్తూనే విమర్శించిన గోపాల్ పాత్రను ప్రవేశపెట్టి చిత్రకారుడు, సహృదయుడు అయినా గోపాల్ కు పద్మినికి మధ్య ఆకర్షణ , ప్రేమ లతో కథ నడిపి ఆ విషయంలో చెల్లెలు మొహినితో పద్మిని కి వచ్చిన ఘర్షణను చిత్రిస్తూ తాతయ్యకు చెప్పి అతనిని పెళ్లాడాలన్న నిర్ణయానికి వచ్చిన పద్మిని కొన్ని నాటకీయ పరిణామాల మధ్య గోపాల్ జాడ తెలియకపోవడంతో ఆందోళనపడి గర్భవతి అని తెలిసి దిగులుపడి పరువు మర్యాదల గురించి ఆలోచించి ఆత్మహత్య చేసుకొనటం ఈ నవలలో ప్రధానభాగం. చెల్లెలు జబ్బుపడిందని హఠాత్తుగా వెళ్ళిపోయి అక్కడ తాను జబ్బుపడి తేరుకొని పద్మిని కోసం వచ్చిన గోపాల్ కు ఇది పెద్ద దెబ్బ. సమాచారం ఇచ్చి పోలేకపోయిన తనకు పద్మిని విధించిన శిక్ష అని బాధ పడతాడు. మోహినికి గోపాల్ అర్ధమైంది అప్పుడే. అక్క భర్తగా అతనిని గౌరవిస్తుంది.
అక్క చనిపోయిన దుఃఖంలో ఉన్న తాతయ్యకు ఊరట కలుగుతుందని మోహిని కవి, భావుకుడు అయిన సుధాకర్ ప్రేమను ఆమోదించి పెళ్లి చేసుకొంటుంది. కానీ అతను నాట్య ప్రదర్శన శరీర ప్రదర్శనగా చెప్పి అభ్యంతర పెడితే అతనిని వదిలి వచ్చేసింది. గోపాల్ ఆమెతోను, సుధాకర్ తోనూ మాట్లాడి వాళ్ళ ఆలోచనలలోని అస్పష్టతలను , అసంబద్ధతలను వాళ్ళు తెలుసుకొనేట్లు సహాయపడతాడు. సుధాకర్ తను మారి నాట్యకళా కారిణిగా మోహినిని మొత్తంగా స్వీకరించగల పరిణితి సాధించటంతో నవల సుఖాంతం అవుతుంది.
ఈ నవలలో పద్మినీ మోహినీ నాట్యకళా శిక్షితులు. తాత వాళ్లకు ఆ శిక్షణ ఇప్పిస్తున్నాడు. అంతకన్నా శ్రద్ధగా వాళ్ళు నిబద్దులై నేర్చుకొంటున్నారు. తాతగారి ఆసక్తికి, మనుమరాళ్ళ అభినివేశానికి సాధారణ కేంద్రం ఆయన కూతురు , వాళ్ళ తల్లి. పద్మినీ మోహినీ ప్రదర్శన ముగించుకుని ఇంటికి వెళ్ళాక భోజనాలు చేస్తూ నాట్యప్రదర్శన విశేషాలు ముచ్చటించుకొనే వేళ ఆమె ప్రస్తావన వస్తుంది. కూతురి గురించిన గతం ఆయన చెప్తుంటే వాళ్ళు విన్నారు. అమ్మకథ తాతయ్య చెప్పటం వాళ్లకు ఇదే మొదలు కాదు. చిన్నప్పటినుండి కొన్ని వందల సార్లు విన్నారు. అయినా ఎప్పటికప్పుడు వింటూనే ఉంటారు. ఇంతకూ ఏమిటామే కథ ?
పద్మినీ మోహినుల తాతపేరు బలరామయ్య. ఆయన కళాప్రియుడు. ఆయన ఒక్కగానొక్క కూతురు కళా బాల. నాట్యకళ పట్ల మక్కువతో కూతురికి నేర్పించాలను కొన్నాడు. అయినింటి ఆడపిల్లకు నాట్యం నేర్పటం ధర్మం కాదు అని భార్య పోరుపెడుతున్నా బాల్యంలోనే గురువును పెట్టి నృత్యంలో శిక్షణ ఇప్పించాడు. రంగస్థల ప్రదర్శనకు అర్హత సంపాదించాక నాట్య ప్రదర్శనలు ఇచ్చే పిల్లను పెళ్లిచేసుకొనటానికి ఎవరూ ముందుకురారు అన్న భార్య మాటలు ఆయనను వాస్తవంలోకి తెచ్చాయి. నాట్యం చేసే అవకాశంలేక కూతురు , చేయించలేని అశక్తతో తండ్రి దిగులుపడి కృంగిపోతుంటే సంగీతం చెప్పించండి ఫరవాలేదు అని సలహా ఇచ్చింది భార్య. వీణా వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించిన కూతురు పెళ్లి అయి వీణతో సహా అత్తవారింటికి వెళ్ళింది. నెలరోజుల తరువాత కూతురిని చూడ బోయిన తండ్రికి వీణ పెట్టె సామాన్ల గదిలో పెట్టారని, కోడలు వీణావాయించటం అత్తగారికి ఇష్టం లేదని తెలిసింది. భర్తకూడా తల్లి ఇష్టప్రకారం నడచుకోమని హితం చెప్పాడు. సామాన్ల గదిలోని వీణను తమ గదిలోకి తెచ్చుకొనటానికి కూడా అతను ఇష్టపడలేదు. వీణావాయించుకొంటూ గొంతెత్తి పాడలేని కూతురి కన్నీళ్లు చూసి కరిగిపోయిన తండ్రి కూతురి పాట విని తీరాలని ధైర్యం చేసి వీణను తెచ్చుకొని పాడమని కోరాడు.
ఆమె పాడుతుంటే కళా బాల అత్తగారు అయిష్టత సూచించే ముఖకవళికలతో తలుపుతీసుకొని వచ్చి నిలబడితే నేనే పాడమన్నాను అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు ఆడపిల్ల తండ్రిగా. కోడలి పాటవల్ల పోయే పరువు ప్రతిష్టల గురించి ఆమె ఆరోపణల పర్వం సాగుతుంటే అత్తింటి కోడలికి ఇంటిపనులూ , పెనిమిటి సేవా తప్పితే ఆటపాటలు పనికిరావని ఖచ్చితంగా చెప్తుంటే ‘సంగీతం పాడితే మీకపకీర్తి వస్తుందనుకొంటే ఇక కళ వీణె వాయించదు అని కూతురి పక్షాన తాను వాగ్దానం చేసి వచ్చాడు. తండ్రి చేసిన వాగ్దానంతో గుండె బద్దలైన కళ పాడుకొనటానికి కాక చూసుకొనటానికైనా వీణను తనగదిలోనే ఉండనియ్యమని అత్తగారిని వేడుకొని సంతృప్తి పడవలసి వచ్చింది. పురిటికి పుట్టింటికి వెళ్ళేటప్పుడు తన వెంట వీణ తీసుకువెళదామనుకొన్న ఆమె కోరికను అక్కడికి పోయి మళ్ళీ వాయించటం మొదలుపెడతావ్ .. మానేసినదానివి మానేసి నట్లు ఉండు అని నిర్దాక్షిణ్యంగా కత్తిరించారు. సంసారం కోసం సంగీతాన్ని వదిలేసుకొన్న కళ లోలోపలే కుమిలి పోయింది.
పరాయి మగవాడు డాక్టారైనా సరే అతని నీడను భార్య మీద పడనియ్యను అన్న భర్త మూర్ఖత్వానికి సరైన సమయానికి తగిన వైద్యం అందక కవలలను కని మరణించింది కళ. కూతురి మరణం వల్ల కలిగిన దుఃఖంతో ఆరోగ్యం క్షీణించి భార్య చనిపోవటంతో ఒంటరివాడైనా మనుమరాళ్ళ పెంపకపు బాధ్యత ఇచ్చిన బలంతో నిలబడ్డాడు బలరామయ్య. ‘ అందరి ఆడపిల్లల్లానే తన మనుమరాళ్ళకు కూడా పెళ్లిళ్లు చేసి అత్తింటి కాపురాలకు అంకితం చెయ్యాలన్న ఆలోచన భయంకరంగా తోచి’ వాళ్ళను తీసుకొని నగరానికి వచ్చాడు. కాలేజీ చదువులు ఒక వైపు నాట్యకళ మరొకవైపు వాళ్లకు చెప్పించాడు. వాళ్ళు గొప్ప కళాకారిణులుగా ఎదగాలన్న ఆశ ఆయనది.
ఈ నేపథ్యంలో మోహినికి పెళ్లి అంటే విముఖత ఏర్పడింది. పద్మిని గోపాల్ పట్ల చూపిస్తున్న ఆసక్తి పెళ్లివరకు వెళుతుంటే భరించలేకపోయింది. పెళ్లిమాట ఎత్తితే అసహ్యం ముంచుకురావటంలేదూ అని నిలదీసింది. మగవాళ్ల అధికారాన్ని తలచుకొంటే మనస్సు మండిపోవటంలేదా అని ప్రశ్నిస్తూ మొగుడి మూర్ఖత్వానికి బలైన తల్లి జీవితాన్ని గుర్తు చేసింది. ఒకప్పుడు పెళ్లి గురించి వాళ్ళిద్దరిమధ్య చర్చజరిగింది. సమస్యలన్నీ పెళ్ళిమూలాన్నే అని మోహిని పెళ్లిని తిరస్కరిస్తే పద్మిని సమస్య మూలం పెళ్లికాదు. మనుషుల్లో మూర్ఖత్వం అని అభిప్రాయపడుతుంది. మనుషుల్లో మూర్ఖత్వం తప్పనప్పుడు సమస్యలు రేపే పెళ్ళికి విలువనియ్యటం అర్ధంలేనిపని అని ‘మనం పెళ్లిచేసుకోవద్దు’ అంటూ మోహిని పద్మినిని ఒప్పించే ప్రయత్నం చేసింది. ఇద్దరూ అది గుర్తుచేసుకున్నారు. కానీ పద్మిని అది మరీ పసితనపు నిర్ణయమేమో అంటుంది. స్త్రీల ఆత్మహత్యలకు, జీవచ్ఛవాలవలె చేసేకాపురాలకు పెళ్లిళ్లు కారణం అవుతున్నా మొత్తంగా పెళ్లిని మానటం దానికి పరిష్కారం కాలేదు అని పద్మిని వాదన. పెళ్ళికి కళకు వైరుధ్యం ఉండదనే ఆమె నమ్మకం. గోపాల్ మంచితనం , కళా హృదయం పై నమ్మకం అది. అలాంటి పద్మిని గోపాల్ కనబడకపోయేసరికి, గోపాల్ ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు వస్తాడో తెలియకపోయేసరికి నిస్పృహకు లోనై , ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకొన్నది. పెళ్లిళ్లు సంసారాలు ఉంటూ కూడా కళా రాధనకు అంకితం కావచ్చు అనే అభిప్రాయం కల గోపాల్ కు దానిని నిరూపించుకొనే అవకాశమే లేకపోయింది.
గోపాల్ కలిసి మాట్లాడటం వల్లనో , అక్క మీద అతనికి ఉన్న ప్రేమ ,అందులోని నిజాయితీ అర్ధం కావటం వల్లనో పెళ్లి పట్ల మోహిని హృదయం కొంత మెత్తబడింది. వియన్నా ట్రిప్ లో పరిచయం అయి తాను పాడిన రాధ హృదయం పాటను అభిమానించి చెప్పిన సుధాకర్ మళ్ళీ స్వదేశంలో తటస్థపడి పరిచయం పెరిగి తన గాన కళను అతను, అతని కవిత్వ కళను తాను అభిమానించి ఆనందించగలిగిన స్థితి వచ్చాక అతని ప్రేమను అంగీకరించకుండా ఉండలేకపోయింది. వీణావాదన ప్రియుడు అయిన సుధాకర్ సంగీతంతో తేనె నదులు సృష్టించగల వైణికురాలు మోహిని దాంపత్యం మధురం గా సాగుతున్న వేళ మోహిని నాట్య ప్రదర్శన సుధాకర్ కు సమస్య కావటం సంఘర్షణకు కారణం అయింది.
మోహిని తన భార్య, ఆమె గానం , నాట్యం అన్నీ తనకోసమే అనుకొంటాడు. పెళ్లి అయి భర్త ఉండి , అందువల్ల సమాజంలో ఉన్నతస్థానంలో ఉండి సామాన్యురాలివలె పదిమంది ఎదుటా ఆమె నాట్యం చేయటం ఏమిటి అన్నది అతని అభ్యంతరం. కావాలంటే గురువులను పెట్టి నాట్య కళలో ఆమెకు మెళుకువలు నేర్పించటానికి ఇంకా నాట్యమందిరం నిర్మించి ఇయ్యటానికి అతను సిద్ధమే. కానీ ఆమె పదిమంది ఆనందంకోసం దానిని ప్రదర్శించటం భరించలేడు. నాట్యకళ అంటే దేహాల ప్రదర్శన అన్న అతని అవగాహన కు ఆమె దిగ్భ్రాంతి చెందింది. కళ దైవంకోసం, కళకళ కోసం అనేవాళ్లుకూడా ప్రదర్శనలు అక్కరలేదనరు, ఇక కళలు జీవిత వికాసం కోసం అని నమ్మే తాను ప్రదర్శన ను ఎట్లా కాదనుకొంటుంది? అదేవిషయాన్ని అతనితో స్పష్టంగా చెప్పింది. కళలు స్వంత ఆనందానికే అయితే నీ కోసం మాత్రం నేనెందుకు పాడాలి? ఆడాలి ? అని ప్రశ్నించింది. భార్య అంటే భర్తకోసం కళలు కూడా ప్రదర్శించవలసిన వ్యక్తి అని నీ ఉద్దేశమా అని నిలదీసింది.
తొలినుండి కళ లోని అలౌకికానందానికి పరిమితమైన వ్యక్తిత్వం కాదు మోహినిది. ఆధునిక సామాజిక భావోద్వేగాలు నాటంలోకి పరివర్తింపచేసే కొత్తప్రయోగాల ఆకాంక్ష ఆమెది. కిన్నెరసాని పాటలకు, ఎంకిపాటలకు నృత్యాన్ని కంపోజ్ చేయాలని గురువును పదేపదే కోరింది. ఆయన చేసిన దానిని తాను అభినయించింది. కళలకు ఉండవలసిన సామాజిక ప్రయోజనం గురించిన వ్యగ్రత ఆమెలో నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. గోపాల్ తో చిత్రకళ గురించి మాట్లాడేటప్పుడు, సుధాకర్ తో కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు ఆమె ఆ ప్రశ్న వేస్తూనే వచ్చింది. సుధాకర్ కవి కావటం వల్ల భవిష్యత్తులో తన నాట్యానికి కొత్త వస్తువులు పొందగలనని కూడా అనుకొన్నది. కళలను ప్రజల సంపదగా భావించింది కనుకనే నాట్యకళను ఎవరితో పంచుకోకుండా భర్తకొక్కడికే స్వంతం చేయలేనని ఖచ్చితంగా చెప్పగలిగింది. తనమీద , తన కళాభిరుచులమీద ఏ నిషేధాలు లేని తాతగారి లోగిలికి తిరిగి వెళ్ళింది.
ఈ ఎడబాటు వాళ్ళిద్దరినీ ఏమిచేసింది ? ఆమె నాట్యకళా సాధన , శోధన కొనసాగాయి. సాంఘిక చైతన్యాన్ని కలిగించే నాట్యప్రయోగాలు చేసింది. అతని ప్రేమ ఆమె ను లోపలి నుండి వేధిస్తూనే ఉంది. ఆమె కళ తనకే స్వంతం అనుకొన్న అతను ఆమె ఎడబాటులో తనతప్పు తెలుసుకొన్నాడు. ఆమెకు తెలియచేయాలని కూడా అనుకొన్నాడు. ఉత్తరాలు కూడా వ్రాసాడు. కానీ నేను నిజంగా మారానా ? ఈ మార్పు మాటలకు పరిమితం కాకుండా తన ఆచరణలో రుజువు చేసుకోగలనా అనే సందేహాల మధ్య వాటిని ఆమెకు పంపే సాహసం చేయలేకపోయాడు. గోపాల్ వచ్చి ఆ స్తబ్దతను బద్దలుకొట్టి చలనానికి కారకుడయ్యాడు. తాను మారానన్నది తనకు తానే రుజువు చేసుకొని నమ్మకం కలిగించుకొనటానికి ముందుగా ఆమె ప్రదర్శన ఒకటి చూడాలనుకొన్నాడు. గోపాల్ సహాయంతో చూసాడు. ఆ ప్రదర్శనలో మోహిని ని తనకు స్వంతమైన ఒక శరీరం గా కాక అద్భుతమైన కళామూర్తిగా ఆరాధనతో, తన్మయత్వంతో చూడగలిగాడు. ఇక అతనికి ఆమెతో జీవించటం గురించిన సందేహాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఆశయాలు , అభిరుచులు కలిగిన మనిషిగా మోహిని ని గుర్తించి కలిసి జీవించటానికి సుముఖుడయ్యాడు. సామాజిక సాంస్కృతిక కళారంగాలలో తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకొంటూ ఎదుగుతున్న స్త్రీలకు తగిన సహచరులుగా మగవాళ్ళు లోపలినుండి ఎన్ని భ్రమలను వదుల్చుకొంటూ ఎంత ప్రక్షాళనం కావలసి ఉంటుందో సుధాకర్ లో ఒక గుణాత్మక పరిణామాన్ని చూపిస్తూ సూచించింది రంగనాయకమ్మ.
( ఇంకా ఉంది)
*****
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.