కళాత్మక చలనచిత్రాలు- కొన్ని కథలు

-మంజుల జొన్నలగడ్డ

ముందుగా మనం కళాత్మక చలనచిత్రం అంటే ఏమిటో చూద్దాం. డబ్బులు సంపాదించే ఉద్దేశంలేకుండా తను చెప్పాలనుకునే విషయం తన శైలిలో చెపుతూ తీసే చిత్రం అని చెప్పవచ్చు. కళాత్మక చిత్రాలకు వ్యాపారత్మక చిత్రాలకు ఉండే ప్రేక్షకులు ఉండరు

తెలుగులో కళాత్మక చిత్రాల సంఖ్య తక్కువనే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు తెలుగులో కళాత్మక చిత్రాలు మాత్రమే తీసినవాళ్ళు ఇద్దరే. ఒకరు బి. నరసింగరావు, రెండు కె.ఎన్.టీ. శాస్త్రి. మిగిలిన దర్శకులు వ్యాపారత్మక చిత్రాలు కూడా తీశారు.

కళాత్మక చిత్రాలకు కధ ఉండలి అనే నిభంధన లేదు. కాని తెలుగులో కథలేని చిత్రాలు తక్కువే. తణికెళ్ళ భరణి లఘుచిత్రం సిరా, నీలకంఠ షో రెండు ఉదాహరణలు. కళత్మక చిత్రాలకి కావలిసినవి సంభాషణ, వాతావరణం, పాత్రల చిత్రీకరణ, కధనం. అవి నమ్మదగ్గట్టుగా ఉండాలి.

నేను ఇవాళ కొన్ని తెలుగు చిత్రాలగురించి మాట్లాడతాను. అవి దాసి, నిమజ్జనం, గ్రహణం, స్త్రీ, కే/ కంచరపాలెం.

బి. నరసింగ రావు తీసిన దాసి:

చిత్రం 1925లో తెలంగాణా నేపధ్యంలో సాగుతుంది. చిత్రం కమలి నెప్పి భరించలేక పెట్టే కేకలతో, ఏడుపుతో మొదలవుతుంది. కమలి దొరసాని తో అరణంగా వచ్చిన దాసి. ఆమె పనులు దొరసానిని చూసుకోవడం, దొరలని, వారి అతిధులని తృప్తి పరచడం, దొరకి ఎవరైన అమ్మాయి నచ్చితే అమ్మాయిని దొర దగ్గిరకి తీసుకు రావడం. ఆమెకి విషయంలోను స్వేచ్ఛ లేదు. నేపధ్యంలో కమలి గర్భం దాలుస్తుంది. కాని దొరసానికి పిల్లలు లేరు. అందుకని కమలిని గర్భం తీసివేయిస్తుంది. చిత్రంలో ఒకటి రెండు దృశ్యాలు దొర కౄరత్వం చూపేందుకు వున్నాయి. ఇంకా దొరలు నిజాం అధికారులకు లంచం ఇవ్వడం ఇంకొక దృశ్యం

కథలో ఎక్కడా సంక్లిష్టత లేదు. దర్శకుడి ఉద్దేశం తెలంగాణా దొరలు నిజాం కాలంలో చేసిన అత్యాచారాలు, గడిలోని ఒక బనిస జీవితం ఎలా ఉంటుందో చూపిచడం. అందులో అతను కృతాకృత్యుడయ్యడు. నరసింగ రావుకు గడి వాతావరణం బాగా తెలియడంతో అతను చిత్రాన్ని చాలా సహజంగా చిత్రీకరించాడు. చిత్రం చూడడానికి కొంచం కష్టంగానే ఉంటుంది

బి.ఎస్. నారాయణ తీసిన నిమజ్జనం:

చిత్రం మంజేరి ఈశ్వరన్ రాసిన కథ ఆధారంగా తీసినది. నాకు ఈయన రాసిన కథలు ఏవీ దొరకలేదు. ఈయన ఆంగ్లంలో రాసిన వారిలో ఆద్యులు

కథ 1930, 40లలో రాసి వుండవచ్చు. కథాకాలం చిత్రంలో ఎక్కడా చెప్పరు. శ్రీకాంత్, భారతి, శ్రీకాంత్ తండ్రి అస్తికలు గంగలో కలపడానికి బయలుదారుతారు. శ్రీకాంత్ సాంప్రదాయవాది. తండ్రి పోయేసరికి శ్రీకాంత్ దగ్గిర లేకపోవడంతో, అతనికి అపరాధభావన మొదలవుతుంది. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కొడుకుని ఇంటి దగ్గిర వదిలేసి, దంపతులిద్దరే బయలుదేరతారు. చిత్రం చాలా మటుకు కలక్రమేణా జరిగినా కొంచం గతంలోకి వెల్తుంది. శ్రీకాంత్ తండ్రి గురించి సంభాషణలు, అతని కర్మ, కొడుకుని ఇంటి దగ్గిరే వదిలన్న వాళ్ళ నిర్ణయం, చూస్తాము

బండి నడిపే గోవిందు భారతి మీద మనసు పడతాడు. దంపతులు నిద్ర పోతుండగా, బండి కింద కట్టిన అస్తికల కుండ ఒక చోట వదిలేస్తాడు. శ్రీకాంత్ కుండను వెతకడానికి వెళ్ళినపుడు భారతిని మానభంగం చేస్తాడు. భారతి ఎందుకు కుమిలి పోతోందో శ్రీకాంత్ కు అర్థం కాదు. కొడుకు మీద బెంగ అనుకుంటాడు. కాశీలో అస్తికలు నిమజ్జనం చేసింపుడు భారతి కూడ మునిగిపోతుంది. శ్రీకాంత్, అతని పురోహితుడు తిరిగి వచ్చినపుడు, భారతి మునిగిపోయిందన్న విషయం తెలిసిన గోవిందు అపరాధభావనతో కన్ను మూస్తాడు.

చిత్రం మేలొడ్రామా కొవలోకి వస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికి చిత్రం చాలా అలోచింపచేస్తుంది. భారతి తన బాధను చెప్పేందుకు సంభాషణలు లేవు. శారద నటనతోనే తన భావాలు వ్యక్తపరిచింది. ఆమె అత్మహత్యకు కారణం మన ఊహకే వదిలేసారు. కొంత వరుకు భర్త చాదస్తం కారణమనుకొవచ్చు. చిట్టచివరి దృశ్యంలో శ్రీకాంత్ గోవిందు కు తులసి తీర్థం పోస్తూసాంప్రదాయం కంటే మానవత్వం ముఖ్యంఅంటాడు. అతను నిజం తెలిసి ఉంటే బహుశా భార్యను వదుకులునేవాడు కాదేమో?!

ఇంద్రగంటి మోహనకృష్ణ గ్రహణం:

చిత్రం గుడిపాటి వేంకటాచలం దోషగుణం అధారంగా తీసిన చిత్రం. రాఘవరాం చాలా పేరున్న డాక్టర్. అతను ఒంటరిగా ఉంటాడు. ఆసుపత్రిలో ఒక రోగి తనని చూడడానికి వచ్చిన తల్లి మీద అరవడంతో అతను రోగి గురిచి ఆరా తీస్తాడు. రోగిది అతని ఊరే. రాఘవ్ అతని స్నేహితుడికి  రోగి తల్లి శారదాంబ కథ చెప్తాడు

కనకయ్య శారదాంబ ఇంట్లో వారాలు చేసుకునేవాడు.శారదాంబ భర్త నారాయణస్వామి.ఆవిడ కనకయ్యను చాలా ప్రేమగా చూసేదికనకయ్య కూడా అవిడకి చాలా పనులు చేసిపెట్టేవాడు. కనకయ్యకు ఒకరోజు జ్వరం వస్తుంది. ఊళ్ళో వైద్యుడు మందు ఇచ్చినప్పటికీ తగ్గదు. కనకయ్య తండ్రి ఒక దేవీ ఉపాసకుడిని తీసుకువస్తాడు. అతను కనకయ్యకు దోషగుణం అని చెప్తాడు. అది తనకంటే పెద్ద స్త్రీతో సంపర్కం పెట్టుకుంటే వచ్చే జబ్బు. దానికి విరుగుడు స్త్రీ తొడ నించి తీసిన రక్తంతో కళికం చేసి అతని కంట్లో పెట్టాలి. కనకయ్య శారదాంబ పేరే కలవరించడంతో, స్త్రీ శారదంబే అని కనకయ్య తలితండ్రులు అనుకుంటారు. పుకారు అందరి జీవితాలని నాశనం చేస్తుంది

నారాయణస్వామి కొట్టి మరీ శారదాంబ రక్తం తీస్తాడు. కనకయ్యకి నయమవుతుంది. శారదాంబ ఇంటినించి వెళ్ళిపోతుంది

రాఘవే కనకయ్య. నయమయిన కొన్ని రోజులకు అతను మామయ్య ఇంటికివెళ్ళి అక్కడ చదువుకుంటాడు

మూల కథకీ చిత్రం కథకి పెద్దగా తేడా లేదు. చిత్రంలో శారదాంబ, కనకయ్యల మధ్య అనుబంధాన్ని చూపేటందుకు చాలా సన్నివేశాలున్నయి. నారాయణస్వామి కి చిత్రంలో కొంచం పెద్ద పాత్రే ఉంది. కనకయ్య కుటుంబం ఎలా నాశనం అయ్యిందో కథలో ఉంది కాని చిత్రంలో లేదు. చిత్రనికి అయువుపట్టు సంభాషణలు, వాతావరణం. ఇది బ్రాహ్మణ సంస్కృతి మీద వచ్చిన అత్త్యుత్తమ చిత్రం అని నా అభిప్రాయం.  

కే.ఎస్. సేతుమాధవన్ స్త్రీ:

చిత్రం పాలగుమ్మి పద్మరాజు రాసిన పడవ ప్రయాణం ఆధారంగా తీసినది. రంగి రాజమండ్రి లో లాంచి దిగడంతో ప్రారంభమవుతుంది. పద్దాలు విడుదల రోజే. పద్దాలు రంగి వచ్చేసరికే వెళ్ళిపోతాడు. రంగి పద్దాలుని వెతికి పట్టుకుంటుంది. పద్దాలు ఇంతకు ముందు నాటకాలలో వేషాలు వేసేవాడు. నాటకాలకి ప్రజాదరణ తగ్గిపోవడంతో అతను దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. రంగి జమీందారు ఇంట్లో నాటకం వెయ్యడనికి పద్దాలుని ఒప్పిస్తుంది. పద్దాలుకి ఇంకొక ప్రియురాలు కూడా ఉంటుంది. మధ్యాహ్నం ప్రియురాలి దగ్గిరకి వెల్తాడు. రంగి అక్కడికి వచ్చి, పద్దాలుని తిట్టి తన్ని తీసుకుపోతుంది. రాత్రి నాటకం సరిగ్గా జరగదు

పద్దాలు రంగిని దొంగతనం చెయ్యడానికి ఒప్పిస్తాడు. వాళ్ళు పడవ ఎక్కుతారు. దారి మధ్యలో పద్దాలు కొంత సరుకు దొంగిలించి పడవ దిగిపోతాడు. ఇక్కడ మనకి రంగి కథ తెలుస్తుంది. గతంలో పద్దాలు నాటకం ఆడడానికి రంగి వాళ్ళ ఊరు వచ్చినపుడు రంగి పద్దాలుతో ప్రేమలో పడుతుంది. పద్దాలుతో పారిపోయి వచ్చేస్తుంది. పద్దాలు చాలా గడసరి. ప్రియురాలి కి రంగి నగ కావలని వస్తాడు. రంగి ఒప్పుకోకపొతే ఆమె గుడిసెకి నిప్పుపెడతాడు. తనని కాపాడిన ఇరుగు పొరుగు పద్దాలు మీద కేసు పెడితే, రంగి అబద్ధమాడి పద్దాలుని రక్షిస్తుంది. పద్దాలు ఎన్ని చేసినా రంగి కి అతను బాగుపడతాడనే నమ్ముతుంది.

మూల కధలో పద్దాలులో ఒక్క మంచి లక్షణం కూడా లేదు. కాని చిత్రంలో పద్దాలు మంచి నటుడు. అతనికి రంగి అంటే ఇష్టమే. కాకపోతే అతనికి ఇతర కాలక్షేపాలు కూడా ఉన్నాయి. రంగి ఒక గృహహింసకి అలవాటు పడిపోయిన మహిళ. సేతుమాధవన్ రంగిని ఒక మంచి వ్యక్తిత్వంగల స్త్రీలా మలిచారు. రంగి పద్దాలుని మార్చుకోవాలి అనే తపన గల మనిషిగా మార్చేరు.

వెంకటేష్ మహా కేరాఫ్ కంచరపాలెం: 

మిగిలిన చిత్రాలతో పోలిస్తే ఇది చాలా భిన్న చిత్రం

చిత్రం కంచరపాలెంలో పొద్దున్నే జరిగే దృశ్యాలతో ప్రారంభమవుతుంది. రాజు కంచరపాలెం నివాసి. ఒక ఆఫీసులో అటెండెంట్ గా పని చేస్తూ ఉంటాడు. ఆఫిసులో రోహిణి ట్రాన్స్ఫర్ అయి వస్తుంది. సుందరం హై స్కూల్ కుర్రవాడు. అతని తండ్రి మూగవాడు. మట్టి బొమ్మలు చెయ్యడం అతని వృత్తి. సుందరానికి అతనితొటే చదువుతున్న సునీత అంటే ఇష్టం. ఆమెతో మాట్లాడడాలంటే భయం. జోసెఫ్ ఒక వ్యాయామశాలలో పనిచేస్తాడు. అతనికి తన యజమాని చెప్పినవాళ్ళని కొట్టడం ఒక పని. అతనికి భార్గవితో పరిచయం అవుతుంది. గెడ్డం ఒక లిక్కర్ స్టోర్ లో పని చేస్తాడు. అక్కడికి మద్యం కొనడానికి వచ్చే సలీమా అంటే ఇష్టం.

రోహిణికి రాజుకి మధ్య స్నేహం ఏర్పడుతుంది. సుందరం సునీత కూడా స్నేహితులవుతారు. సుందరం తండ్రికి ఒక పెద్ద వినాయకుడి బొమ్మ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. భర్గవి జోసెఫ్కి పరిచయం పెరుగుతుంది. సలీమ ఒక వేశ్య, అది గడ్డంకు తెలియదు

రోహిణి రాజుని పెళ్ళి చేసుకుందామనుకుంటుంది. సుందరం సునీతను స్కూల్లో పాట పాడడానికి ప్రోత్సహిస్తాడు. భార్గవి, జోసెఫ్ ప్రేమించుకుంటారు. గెడ్డంకు సలీమా వేశ్య అని తెలుస్తుంది కాని అతనికి అభ్యంతరం ఉండదు.

సునీత పాటలు పాడడం, ఆమె స్నేహాలు ఇష్టంలేని సునీత తండ్రి ఆమెను ఢిల్లీ పంపించేస్తాడు. సుందరం కోపంతో వినాయకుడి విగ్రహం నాశనం చేస్తాడు. దానితో అతని తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు.

భర్గవి తండ్రి బలవంతం మీద వేరొకరితో పెళ్ళికి ఒప్పుకుంటుంది. గెడ్డం, సలీమా పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు. కాని సలీమా హత్యకి గురవుతుంది

రోహిణి అన్న తన పెళ్ళికి ఒప్పుకోడు. రోహిణి తన కూతురు, రాజు సహాయంతో ఇంటి నించి వెళ్ళిపోయి కంచరపాలెం నివాసుల సహాయంతో రాజు పెళ్ళి చేసుకుంటుంది. అప్పుడు మనకి తెలుస్తుంది నాలుగు కధలూ రాజువే నని.

చిత్రంలో విశాఖపట్నం ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. 80లొ, 90లొ, 2000లో, 2010లో విశాఖపట్నం చిత్రంలో చూపించినట్టుగానే ఉండేది. నాలుగు కథలు చాలా చక్కగా కలిసాయి.   

మానకి కళాత్మక చిత్రాలంటే వామపక్ష ఇత్రాలనే అపోహ ఉంది. కళాత్మక చిత్రాలు జీవితంలో, ప్రపంచంలో అన్ని కోణాలను చూపించగలవు

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.