పాదుకా పట్టాభిషేకం
-పద్మ సత్తిరాజు
పేరుకే మనం ఆకాశంలో సగం
మనకంటూ ఒక అస్తిత్వానికి మాత్రం తగం
మనువు మన జీవిత పరమార్థాన్ని శాసిస్తాడు
మనువు మన జీవిత గమనాన్నీ గమ్యాన్నీ మార్చేస్తుంది
పని పంచుకోమని అడిగితే మండిపడుతుంది సంఘం
ఎందుకంటే మరి కార్యేషు దాసి నియమానికి భంగం
కరణేషు మంత్రి పదవి ఇచ్చారని పొంగిపోకేం
ఫలితం తేడా వస్తే నింద మనకే
ఇక భోజ్యేషు మాతకు జరగగల అతి పెద్ద మేలు
వంకలు పెట్టకుండా ఉంటే
కంచం విసిరెయ్యకుండా తింటే
అదే పదివేలు
అమ్మయ్య ఈరోజు పనంతా చేసేశా అనుకుంటే కుదరదు మరి
శయనేషు రంభగా సహకారం తప్పనిసరి
కళ్ళాపి చల్లుతున్నా కాంచనమాలలా కనబడాలి
అంట్లు తోముతూ కూడా అలియా భట్ లా అగుపించాలి
బట్టలుతుకుతుంటే బార్బీ డాల్ స్ఫురించాలి
ఇంకా చెప్పాలంటే
ఏడుస్తున్నప్పుడు కూడా ఏంజెలీనా జోలీ లా ఉండాలి
అప్పుడు కదా రూపేచ లక్ష్మి ఎపిసోడ్ పండాలి
జీతం భత్యం లేని కొలువు
ఆదివారం కూడా దొరకదు సెలవు
సమాజం గుర్తించదు
లేబర్ యాక్ట్ వర్తించదు
సేవకు బహుమతి లేదు
రాజీనామాకు అనుమతి లేదు
నిరంతరం బాధ్యతల హడావుడి
ఐనా నిత్యం చివాట్లు సరేసరి
బంధువుల్లా తరచు కన్నీళ్ళు వస్తుంటాయ్
అడపాదడపా చెంపలూ వాస్తుంటాయ్
ఆశలు ఆవిరైనా సరే
గుండె ముక్కలైనా సరే
చిరునవ్వు పోకూడదు
కోపం రాకూడదు
ఓర్చుకోవాలి, ఇది రోజూ తగిలే గాయం
అదిగో, నీకు క్షమయా ధరిత్రి బిరుదు ఖాయం
యత్రనార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః
అంటూ తొడిగిన మంచు కిరీటం
కరుగుతూ
కరుగుతూ
కరుగుతూ
కరుగుతూ
చెవిలో చెప్తోంది
న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని
ఆకాశంలో సగం
స్వాతంత్ర్యానికి తగం
ఎందుకో పాపం
*****
పద్మ సత్తిరాజు కవి, రచయిత. నివాసం ఢిల్లీ.