తిక్క కుదిరింది
(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-చెంగల్వల కామేశ్వరి
ఫెళ్లున పెళ్లిఅయింది. అగ్రహారంలో శోత్రీయ కుటుంబంలో పెళ్లి కదా! మూడురోజుల పెళ్లిలో ముప్పయి మందికొచ్చిన అలకలు తీరుస్తూ అలకపానుపు దగ్గరకొచ్చింది సీన్
అన్నట్లు (ఇది ఇప్పటి పెళ్లి కాదండోయ్!
ఓ ఏభయ్యేళ్ల క్రితం పెళ్లి ) పెళ్లి కుమారుడు సుస్టుగా పలహారాలన్నీ ముందుగానే తెప్పించుకుని తిని మరీ అలకపానుపు ఎక్కాడు
ఇంత సరదా వేడుకలో పెళ్లికొడుకు పెళ్లికూతురి అందచందాలు చూసుకోవాలి సిగ్గులొలికే నవ వధువు ఎరుపెక్కిన చెక్కిళ్ల కాంతులు కి పరవశించిపోవాలి. చిరునవ్వులతో చిత్తాన్ని దోచాలి ఈ ప్రపంచంలో ఉన్నవారందరినీ కాదని ఒకరికొకరు వరించుకున్నారని కొంచెమయినా పొంగిపోవాలా !అబ్బే! అదేంలే్దు సరికదా! మొహం మాడుచెక్జలా పెట్టుకుని అలక అంటే మౌనం అని కాక ధుమధుమలాడుతూ గొంతెమ్మ కోరికలతో వేగిపోతున్నాడు.
ఈ వరుణ్ణి చూస్తే వధువు జ్యోతి కి కూడా ఒళ్లు మండిపోతోంది. అప్పటికి రెండుగంటలయ్యింది పక్కనే నేరం చేసిన వారిలా కన్యాదాతలు వారి బంధువులు చేతులు కట్టుకుని నిల్చున్నారు. ఎవరికి వీలయినట్లు వారు, వరసలవారీగా బ్రతిమాలుతున్నారు వాళ్లెవరి భోజనాలు కాలే్దు.అది తెలిసీ కూడా తనక్కావాల్సిన మోటార్ సైకిల్ కావాల్సిందే! అని భీష్మించుకున్న వరుడు ఆనంద్ దగ్గరకి పిల్లాడి మేనమామ వచ్చి “ఒరే ఇంకలేవరా! పండక్కి ఇస్తారుటలే! మోటార్ సైకిల్! ఇప్పుడు కానుక గా నీకు ఖరీదయిన రేడియో ఇస్తున్బారు హాయిగా రైలు లో కొత్తపెళ్లాం కొత్తరేడియో తో వెళ్లొచ్వు” అన్నాక పెళ్లికుమారుడి మొహంలో ఆనందం చిందులేసింది. అది చూసి నవవధువుజ్యోతి మొహం తిప్పుకుంది. తమ ముగ్గురి పెళ్లిళ్లకే పొలమంతా అమ్మేసాడు. ఇల్లు కరిణీకం తప్ప మరేది లే్దు ఈయనకి మోటార్ బైక్ ఇస్తే బావలూరుకుంటారా! తమ్ముళ్లకి ఏం మిగులుతుంది. అయినా బావలు ఇలా లేరు. తమింట్లఞొ బాగా కలిసిపోయారు. ఈయనేంటో ఇప్పుడే ‘జామాతా దశమగ్రహా! అన్నట్లు నిరూపిస్తున్నాడు. ఎందుకో ఆపిల్లకి మొగుడి మీద మోజు కన్నా వెగటు పుట్టింది లోలోన
“కార్యం “నాడుకూడా చిందులేసాడు. గదికి అలంకరణ సరిగ్గా చేయలేదని, తనకిష్టమయినస్వీట్స్ ఏమీలేవని రుసరుసలాడుతుంటే చివరికి బ్రాహ్మడే ఏంటండీ! చక్కని చుక్కలాంటి అమ్మాయి భార్యగా దొరికింది. సంతోషంగా కాపురం చేసుకుంటే మంచిపిల్లలు పుడతారు. అంత కోపం పనికిరాదు. అమ్మాయి భయపడుతుంది. “అని సర్ది చెప్పాడు.
ఎలాగో మూడునిద్రలు అయి రైలు ఎక్కారు నవదంపతులు ఆనంద్ మాత్రం నిముషనిముషానికి టెక్కు ప్రదర్శిస్తూ అందరూ తన కొత్తల్లుడి దర్పాన్ని అందరూ గుర్తించాలన్న అహంకారం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అత్తమామలు బంధువులు వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవాలని ముందురోజే వెళ్లారు.
రైలెక్కి దగ్గరనుండి ఆ రేడియో తీసిమ్మన్నాడు. పెద్ద సౌండ్ తో తను పాడేస్తూ, కామెంట్స్ చేస్తూ కాసేపు విన్నాడు. మరి కాసేపటికి రేడియో కి సిగ్నల్స్ అందక ఊరికే సౌండ్ తప్ప మరేదీ రాక చిరుబుర్రులు మొదలెట్టాడు.
. అందరూ ఈ ఆసక్తిగా చూస్తున్నారు ఈ “కొత్త జంట”ని అదో ముచ్చట కదా! స్టేషన్ లు బర బరా త్రిప్పి వినిపించటంలేదని ‘ “ఎంత ఏడుస్తూ ఇచ్చాడో నీ బాబు” ఆయన మొహంలాగే ఉంది ఈ రేడియో అన్నాడు. ఆ మాటకి జ్యోతి బిత్తరపోయింది.
తన తండ్రి అంటే ఆ పరగణాలో పెద్ద పేరు ఎక్కడికెళ్లినా ఎంతో గౌరవమర్యాదలు ఇస్తారు. అలాంటిది పెళ్లయి రెండురోజులయినా కాలేదు. ఇంతమాటంటాడా! అనుకునేసరికి కళ్లనీళ్లు తిరిగాయి.
అది చూసి ఏం! అప్పుడే ఏడ్పు మొహమా! మీ నాన్న పోలికే నీది ! ఏడుస్తుంటే మీ నాన్నలాగే ఉన్నావు. ఇచ్చేదేదో మంచిది ఇచ్వి చావొచ్వుగా ఈ డొక్కు రేడియో తగలెట్టి మోసం చేసాడు మీనాన్న ఈ చచ్చుసలహా మీ అమిచ్చిందేమో! రేపు వ్రతానికొస్తాడుగా ఆయన మొహాన్నే కొడతాను. అనంటుంటే ” రైలు లో రేడియో రాదు. ‘ ట” మా అత్త చెప్పింది . అయినా నచ్చకపోతే ఇచ్చేద్దాము. కాని ,మా నాన్నని అమ్మని ఎందుకంటున్నారు? అనంటూ కళ్లనీళ్ల పర్యంతమయింది జ్యోతి.
ఆ మాట వినగానే ” ఏంటే ఎదురు సమాధానాలు నువ్వు సరిగ్గా లేకపోతే నిన్నూ ఇచ్చేస్తాను నోర్మూసుకుని ఉండు! అని హుంకరిస్తున్న భర్త ని చూస్తే భయబ్రాంతురాలయి మవునంగా ఉండిపీయింది. అతని చేతలెంత మోటో!” మాటలంతకంటే మోటని! జ్యోతికి అర్ధమయిపోయింది.
ఇంక అతని అడ్డూ అదుపు లేని వాగ్ధోరణికి , మాటిమాటికి జ్యోతి ని నియంత్రించాలనే పద్దతికి పక్క సీట్ల లో ఉన్నవారు మనసులోనే జాలిపడ్డారు జ్యోతిని చూసి. ఇలాంటి వాడితో ఈ పిల్ల ఎలా వేగుతుందో ! అనుకున్నారు. మరో గంటకి రైలు దిగారు. వీళ్లు దిగి సామాన్లు దింపుకొన్నారో లేదో రైలుకదిలిపోయింది.
” హమ్మయ్య!మా గుడివాడ వచ్చేసాము.
పద! నువ్బు నీ పెట్టె పట్టుకో! నేను నా పెట్టె పట్టుకుంటాను. అనంటూ “అరరే! రేడియో ఏది? అని వెతికాడు.
జ్యోతి కూడా చూసింది రేడియో లే్దు. ఆనంద్ మొహం ఇంకా మాడి” అయ్యో రైలు లోనే ఉండిపోయింది పై బెర్తు మీద పెట్టాను. నువ్వయినా గుర్తు చేయవా! మా మామగారిచ్చిన బహుమతి మా స్నేహితులకు చూపిద్దాము. ఇంకా మనం మా డాబా మీదెక్కినపుడు చక్కగా పాటలు వినొచ్చు అ నుకున్నాను.పోయింది. అని వాపోతున్న ఆనంద్ మాటకి “పోనీండి వెధవ రేడియో !పోతే పోయింది. అయినా మీకెలాగు అది నచ్చలే్దు కదా! మీకిష్టమయిన బ్రాండ్ రేడియో మీరే కొనుక్కోండి”. అని మామూలుగా అన్న భార్య మాటకి తేలు కుట్టిన దొంగలా గతుక్కుమన్నాడు. మరేమి అనలేక “పద! అని ముందుకి దారి తీసాడు. భర్తని అనుసరిస్తూ
“మా బాగా అయింది. తిక్కకుదిరింది. తనకి గుర్తున్నా కావాలనే తీసుకురాలేదు. మర్చిపోతే మర్చిపోనీ అనుకుంది. లేకపోతే ఆ రేడియో ముందెట్టుకుని జీవితాంతం దెప్పి దెప్పి చంపేలా ఉన్నాడు ఆ వస్తువులు నయం నిరాదరిస్తే ఎలాగో అలా దూరమవుతాయి. ఆదరించినా, నిరాదరించినా వదలకుండా వెంటొచ్చేది నాలాటి ఇల్లాళ్లే ! అనుకుంది జ్యోతి
****
చెంగల్వల శివప్రసాద్ గారి గృహిణిగా, ప్రవృత్తిరీత్యా రచయిత్రిగా… వందకు పైగా కథలు వ్రాసి, మూడు వందలకు పైగా వ్యాసరచనలు, వందకు పైగా కవితలు, రెండు కథా సంపుటాలు, “చెప్పుకుంటే కథలెన్నో! గుండెల్లో గోదారి”, కాఫీ విత్ కామేశ్వరి, గోదారి ఘుమఘుమలు అనే వంటల పుస్తకం రచియించారు. రేడియో నాటికలు నాలుగు,పది కథానికలు బ్రాడ్ కాస్ట్ అయ్యాయి. ఒక నాటకం దూరదర్శన్ లో టెలికాస్ట్ అయింది. సమాజసేవకు 5 , రచయిత్రిగా 4 అవార్డులు అందుకుని, పలు సాహిత్య సంస్థల పురస్కారాలు పొందారు.