మిట్ట మధ్యాహ్నపు మరణం- 2

– గౌరీ కృపానందన్

“సిగ్గుగా ఉంది బాబూ.”

“నాకు తెలుసు కోవాలని ఉంది.

“కాస్త మెల్లగా మాట్లాడండీ.”

మాటల్లోనే తనను ఆక్రమించుకోబోతున్న అతని చేతులని గట్టిగా గిల్లింది.

“రాక్షసీ! నన్ను గిల్లుతావా?”

“సారీ!”

“ఫరవాలేదులే. నువ్వు గిల్లినా సుఖంగానే ఉంది.”

“అయ్యో! రక్తం వస్తోంది.”

“ఉండు. మీ నాన్నగారితో చెబుతాను. మీ అమ్మాయిని ముట్టుకున్నానో లేదో, ఎలా గిల్లింది చూడండీ అని.”

“ప్లీజ్! చెప్పకండి.”

“చెప్పి తీరతాను.”

“వద్దు వద్దు. “

“ఖచ్చితంగా చెప్పి తీరతాను.

ఎంత సంతోషకరమైన నటన!

“పోనీ ముట్టుకోవచ్చు. సరేనా?”

“అలారా దారికి.”

ఇంతవరకు వెలుతురు కూడా స్పర్శించని ఆమె శరీర భాగాలను అతను స్వేచ్చగా ఆక్రమించబోయాడు.

“ప్లీజ్! లైటు తీసేయండి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను.”

“ఏమయ్యింది?

“మనం హనీమూన్ కి వెళ్తున్నాం కదా. అక్కడ  తొలిసారిగా ప్రారంభిద్దాం. అంత వరకూ మాట్లాడుకుందాం సరేనా. మీకెంత జీతం వస్తుంది?”

“దీనికి ఇరవై వేలు. దానికి ఇరవై వేలు.”

అతను ఏమరుపాటుగా ఉన్న క్షణంలో గబాల్న లేచి లైట్ తీసేసింది.

“ఎక్కడ ఉన్నావు?”

“నేను అడిగిన వాటికి సమాధానం ఇస్తేనే దగ్గిరికి వస్తాను.”

“త్వరగా అడుగు మరి.”

“ఎన్ని గంటలకి ఆఫీసుకి వెళ్తారు?”

“పది గంటలకి.”

“ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారు?”

“పది రోజులు. రెండు రోజులు ముందే వేస్ట్ అయిపోయాయి.”

“రిసెప్షన్ కి ఎర్రగా పొడుగ్గా బాబ్డ్ హేర్ తో వచ్చిందే. మీకు షేక్ హేండ్ కూడా ఇచ్చిందే? ఆమె ఎవరూ?”

“స్టెనో!” అంటూ నవ్వాడు.

“అందంగా ఉంది కదూ.”

“ఇప్పుడు నా కళ్ళకి నువ్వు మాత్రమే అందంగా కనిపిస్తున్నావు. పెళ్లిలో ఎన్ని సార్లు నిన్నే చూసానో తెలుసా? ఇంకా పూర్తిగా చూడలేదనుకో.”

“నేను కూడా మిమ్మల్నే చూశాను.”

“ఎప్పుడూ?”

“మీరు చూడనప్పుడు.”

“ఏమనుకున్నావు?”

“ఏమీ అనుకోలేక పోయాను. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం?”

“మన హనీమూన్ రూట్… బెంగళూరు, కోయంబత్తూరు, కొడైకానల్! ఉమా! దగ్గిరికి రా.”

మెల్లగా దగ్గిరికి వెళ్లి కూర్చోగానే ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గిరికి తీసుకున్నాడు. అగ్నికి చేరువగా ఉన్నట్లు, ప్రళయంలో మునిగి పోతున్నట్లు, సుడిగాలిలో చిక్కుకున్నట్లు… రకరకాల భావ సమ్మేళనంలో మునుగుతూ తేలుతూ, క్రింది పెదవిని నొక్కి పట్టింది. వాళ్ళిద్దరికీ తొలి రాత్రి అది. 

ఆ తరువాత వాళ్ళిద్దరికీ ఇంకో రాత్రి మాత్రమే మిగిలింది.

*****

మర్నాడు ఉదయం అందరూ లేవక ముందే గదిలో నుంచి వచ్చేసింది ఉమ.

హాల్లో వచ్చిన బంధువులంతా అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నారు. నిన్న తను అతను మాట్లాడినదంతా వీళ్ళకి వినిపించి ఉంటుందేమో.

వంటింట్లో అత్తగారు కాఫీ తయారు చేస్తున్నదల్లా తలెత్తి చూసింది.

“లేచావా ఉమా! ఎప్పుడూ త్వరగా లేవడం అలవాటా? ముఖం కడుక్కుని రా. కాఫీ తాగుదువు గాని.”

“కాఫీ నేను కలపనా అత్తయ్యా?”

“ఉండనీ. ఊరుకు వెళ్ళి వచ్చిన తరువాత బాధ్యతలన్నీ తీసుకుందువు గాని. ఇదిగో ఈ కాఫీ తీసుకువెళ్ళి హాల్లో మీ మామగారు ఉంటారు. ఆయనకి ఇచ్చి రా. నాలుగున్నరకే నిద్ర లేచేసారు. అప్పట్నించే ఎదురు చూస్తున్నారు.”

కాఫీ గ్లాసు తీసుకుని వెళ్ళ బోయింది. 

“మొదటి సారిగా మామగారికి కాఫీ ఇవ్వ బోతున్నావు. ఒక సారి కాళ్ళకు దణ్ణం పెట్టుకుని ఇవ్వు.”

“అలాగే అత్తయ్యా! మీకు కూడా దణ్ణం పెట్టుకుంటాను.”

“నాకెందుకమ్మా?” కాళ్ళకి దణ్ణం పెట్టుకున్న ఉమని భుజాలు పట్టి లేవదీస్తూ, “దీర్ఘ సుమంగళిగా ఉండు” అని ఆశీర్వదించింది.

హాల్లో ఇంకా చీకటిగానే ఉంది. తల వెనక చేతులు కట్టుకుని కూర్చున్న మామగారిని చూసింది.

“మామయ్యా! కాఫీ.”

“ఎవరూ? కొత్తగా ఉందే?”

“నేను … ఉమని.”

“నువ్వా అమ్మా. ఇంత త్వరగా లేచేసావా?”

“దణ్ణం పెట్టుకుంటాను మామయ్యా.”

“ఇవన్నీ ఎందుకు? అరెరే… దీర్ఘాయుష్మాన్ భవ” కాఫీ తాగుతూ ఆయన అన్నారు. “నువ్వు చాలా అదృష్టమంతురాలివి తల్లీ. మూర్తి చాలా మంచి అబ్బాయి. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. బాగా చదివాడు. మంచి ఉద్యోగం తానే సంపాదించుకున్నాడు. అతని జాతకంలో అమెరికాకి వెళ్ళే యోగం కూడా ఉంది. మీ ఇంట్లో జాతకాల పట్టింపు ఉందా?”

“అంతగా లేదండీ.”

“ఉమా! ఉమా!”

“అత్తయ్య పిలుస్తున్నారు. వస్తాను.”

“వెళ్లిరా తల్లీ.”

“ఏమిటత్తయ్యా? పిలిచారా?

అత్తగారి ప్రక్కన కాస్త వయసు మళ్ళిన ముత్తైదువ కూర్చుంది. 

“ మీ మామగారి పెద్దక్కయ్య. ఆవిడకీ దణ్ణం పెట్టుకో.”

“ఎందుకే? ఆ అమ్మాయిని శ్రమ పెడుతున్నావు?”

“ఉండనీయండి. మీరు ఈ ఇంటికి పెద్ద ముత్తైదువ కదా.” అంటూ అత్తయ్య కాళ్ళకి దండం పెట్టింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.