యుద్ధం ఒక గుండె కోత-11

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

కొత్త మిలీనియం ఉత్సవాల పచ్చదనం

ప్రజల ఆలోచనల్లో ఇంకా వసివాడనేలేదు

కొత్తగా విచ్చుకొన్న చిగురాశలు

రక్తచందనమైపోయాయి అప్పుడే

మిలీనియం బేబీని కన్న తల్లి

పేగు పచ్చిదనం ఇంకా తగ్గనేలేదు

అప్పుడే తెగిన పేగు కనుకొలకులకు గుచ్చుకొని

చూపు విలవిలా కొట్టుకుంటూనే ఉంది

మానవ నిర్మిత మహాసౌధాలు కూలిన దృశ్యం

కంటిపాపలో తాజాగా కదుల్తూనే ఉంది

కానీ –

భవితవ్యం రూపుదిద్దిన ఆశాసౌధాలు

కన్నవారి గుండెల్లో కుప్పకూలిన దృశ్యం

వడలిపోయిన రెటీనామీద నిశ్చలన దృశ్యాలైపోయాయి

ఊపిరిని చేదుకొంటూ

దృశ్యాదృశ్యమానమై

ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కొట్టుకుంటూనే ఉన్నాయి

ఒక జీవితకాలపు విషాద స్మృతిగీతాలై

నరాల నిండా ప్రవహిస్తూనే ఉన్నాయి

అసంకల్పిత ప్రతీకార చర్యలు శరీరమంతటా

మాతృత్వ మమకారాల్ని మేల్కొల్పి

విశ్వమంతటా బాష్పాభిషేకాలు చేస్తూనే ఉన్నాయి!

మాటల్ని నియంత్రించాలనుకొన్న కళ్ళు

కొత్త భాషను నేర్చుకొంటాయి

గాయాలు మానుపట్టకముందే

గన్నులు నిప్పుల్ని కక్కడం మొదలెడతాయి

ఆకాశాన్ని ఆక్రమించిన రాబందులు

బ్రహ్మాండం నిండా విన్యాసాలు చేస్తూ

బాంబుల్ని పొదగాలని చూస్తాయి

పెనుదుఃఖం మోయలేక

అసహాయతల్లులు గాంధారులైపోతారు

మెదడు పొరలనిండా మౌనాన్ని అతికించుకొని

జ్వలిత ప్రకంపనాల్ని శృతిచేస్తూ

కంఠంలోనే బంధించేయాలని చూస్తారు

*   *   *

మానవత్వాన్ని బోధించాల్సిన మతం

మదపుటేనుగును ఎక్కి పరుగులు తీస్తున్నదేమిటో!

మనుషుల్ని ఒక దగ్గరకు చేర్చి

అలసిన హృదయాలకు మంచిగంధం పూతలు పూసి

సేదతీర్చాల్సిన మతం

పుర్రెలకు పైశాచికత్వాన్ని మలాము చేస్తున్నదెందుకో!

మూర్ఖత్వాన్ని హృదయవనం నిండా పెంచి

మతిని గతి తప్పించే మత్తుని అలవాటు చేసి

రక్తపిపాసులుగా మార్చి ప్రపంచంమీద వదుల్తున్నదెందుకో!

నిజానికి తప్పు మతంది కాదు

ఆధిపత్యం కోసం పోరు జరుపుతున్నవీ

క్రిందు మీదవుతూ కలబడుతున్నవీ మతాలు కావు

మతాన్ని మత్తు పదార్థంగా వాడుకొంటూ

స్వలాభాలు పొందుతున్న మానవుడిది తప్పు

మతగ్రంథాల పవిత్ర ప్రవచనాలను

తమకనుకూలంగా పునర్నిర్వచించి

మానవత్వానికి మరణశాసనాలు రాస్తున్నవాళ్ళది తప్పు

జీవితానికి సాధికారత కల్పించి

ఆత్మకు మెరుగు పెట్టాల్సిన మతం

పచ్చని బతుకుల్ని మాడ్చేసే

విషజ్వాలగా మారిపోతోంది!

మూఢాంధులకు వెలుగుచూపుని

అందించలేక మతమే మలిగిపోతోంది!!

జీవిత దారానికి రెండు కొసలు జనన మరణాలు

సుఖదుఃఖాల్నీ, అనుభూతుల్నీ

గిలిగింతల్నీ

రంగురంగుల పూలమాలగా కూర్చి గుచ్చి

జీవన విధానానికి నియమబద్ధుల్ని చేస్తూ

గమ్యానికి చేర్చాల్సినది సన్మతం

సాధనాలు లక్ష్యాల్ని చూపుతాయి

దారిని వెతుక్కొనేలా చేసి

నడక సుగమం చేసుకొనే

నైతిక బాధ్యతను నేర్పేది మతం

ఇలా పశువులుగా మారమని వీళ్ళకి

ఏ మతం బోధించింది?

సాటివారిని నిర్ధాక్షిణ్యంగా నరికిపారేయమని

ఏ మతం పొదిలోని మారణాయుధాలకి పదును పెట్టింది?

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.