అద్దంలో బొమ్మలు

(జంధ్యాల రఘుబాబు పుస్తక సమీక్ష)

-చందలూరి నారాయణరావు

కంటి ముందు దృశ్యాలను మనసులో చిత్రిక పట్టి అక్షరాకృతి ఇచ్చే ఓ గొప్ప ప్రక్రియలలో కధ ఒకటి.
ఇంటి నుండి ప్రపంచం దాకా,
రక్త సంబంధాలు నుండి మానవ సంబంధాలు దాకా ఒక మనిషి అనుభవంలో ఎదురైన ప్రతి సంఘటనలో ప్రతి పాత్రను లోతుగా పరిశీలించి  13 కథలతో ప్రముఖ రచయిత శ్రీ జంధ్యాల రఘుబాబు గారు వ్రాసిన పుస్తకమే
అద్దంలో బొమ్మలు”.ఈ పుస్తకాన్ని రాయలసీమ కథాసింగం స్వర్గీయ సింగమనేని నారాయణ గారికి అంకితమివ్వడం సముచితమైన గౌరవం.
   అనుభవంలోకి  వచ్చిన ఏ అంశాన్ని వదలక  ఓ ఉత్తమ ఆలోచను జోడించి సమస్యను ఎత్తి చూపడంలో ఒక కొత్తదారిని వెతుక్కొని, అదే స్థాయిలో ఓ ఉన్నతమైన ముగింపుతో కథకు పరిపుష్టం చేయడం ద్వారా పాఠకులలో ఓ ఆసక్తిని మరియు ఓ ఆలోచన రేకెత్తించి  సఫిలీకృతులయ్యారు జంధ్యాల గారు. ప్రతి కథలో సన్నివేశాలను గమనిస్తే చాలా సరళంగా ఉండటంతో పాటు కొన్ని చోట్ల ఆయన కలం కవిత్వపరిమళం కూడా గుప్పించింది.. ఏ కధను చదివినా ఓ పరిషత్ నాటికను చూసినట్లు భావన ఉంటుంది. సహజ ధోరణిలో చక్కని మాటలతో సాగే కథనం ఓ  ఆదర్శయానికి దారితీస్తూ  సమాజానికి ఓ ఆలోచనను అందించింది.ఈ అద్దంలో కనిపించే ప్రతి బొమ్మ లాంటి ప్రతి కధ అంతర్గతంగా విలువైన అంశాన్ని  కలిగిఉండటం విశేషం.నూరుశాతం సమాజానికి, కుటుంబానికి మరియు వ్యక్తుల ప్రవృత్తులకు అద్దంపట్టి, పాఠకులను చదివించి ఓ భావనను హృదయానికి హత్తుకునేలా చేయడం ద్వారా జంధ్యాల వారు అనుకున్న లక్ష్యాన్ని పొందారు. ఈ పుస్తకంలో
ఒక్కో కథను పరిశీలిస్తూ ముందుకు నడిచేకొద్ది ఈ విషయం సుస్పష్టమవుతుంది.

                  తెలుగు భాషను ప్రాణంగా భావించే ఓ ఆంగ్లోపాధ్యాయుడు వందల మందికి చక్కని విద్యాబోధనతో పాటు మాతృభాషలో ఉన్నత విలువలను భోధిస్తూ, తన జీవితంలో పాటిస్తూ సాగించిన జీవితం గొప్పది.చివరకు పదవీవిరమణ నాటికి తను సంపాదించిన డబ్బుకు పిల్లలను వారసులుగా, తన జీవితకాలంలో కొన్న పుస్తకాలను గొప్ప ఆస్తిగా భావించి తన వద్ద చదువుకున్న పిల్లలనే వాటికి వారసులుగా భావించి, తను ఎప్పుడైనా ఆ పుస్తకాలను చదవాలని ఉంటే నేనే మీ వద్దకు ఓ వస్తాను అని చెప్పే రాఘవాచారి పాత్ర ద్వారా సమాజానికి ఓ ఆదర్శయాన్ని పరిచయం చేస్తూ ” నవవారసత్వం” అనే  కధ ఇచ్చిన చక్కని సందేశం గొప్పది.యూరోపియన్ దేశాలలో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే  ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం, పుస్తకాల పేర్లను ఇండ్లకు, వీధులకు, బస్,రైలు స్టేషన్లుకు పెట్టుకొని పుస్తకాన్ని నెత్తిన పెట్టుకొని మోయడం జరుగుతుంది.ఈ కథ ఉద్దేశ్యం కూడా అదే.పుస్తకాలను ఆస్తిగా భావించి వాటిని వారసులను ప్రకటించడం ఓ గొప్ప భావన.
మరో కథలో తన ముద్దుల కూతురు “సునిధి” పుట్టిన రోజుకి  ఓ గొప్ప కానుక ఇవ్వాలని భావించిన మహేష్ చేసిన
ఆలోచనే ” బహుమతి” కధ. ఇందులో తాను ఇచ్చే పుట్టినరోజు కానుక ప్రతేక్షంగా తన కూతురుతో పాటు పరోక్షంగా ఎంతోమందికి ఉపయోగపడాలి అన్న మహేష్ ఆలోచన ఓ కొత్తదనంతో పాటు గొప్పదనం. తన కూతురుకు తెలియకుండానే శ్రీశైలంలో ఓ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లడం,  తన కూతునికి పరిచయం చేసి పుట్టినరోజు దీవెనలందుకోవడం అంతటా జరిగేదే.కానీ అక్కడకు వచ్చేముందే  ఆశ్రమంలో “ఈశ్వర్” అనే వక్తితో మాట్లాడిన తరువాత “ఒక వక్తికి తొడులా, నీడలా నిలచి మనసును సంతోషపెట్టేది పుస్తకమని ,అది వారికి ఇష్టమైన అంశమని తెలిసి ,ముందుగా ఎవరికి చెప్పకుండా అందరికీ ఒక్కో పుస్తకాన్ని తన కూతురు చేత ఇప్పించడం జరుగుతుంది.ఇదే తన కూతురుకు ఇచ్చే కానుకగా పేర్కొనడం విశేషం ఎక్కడ. ప్రతేక్షంగా నాన్న ఇచ్చిన గొప్ప కానుకను మురిసిన సునిధి తన జీవితంలోనూ ఇలాంటి మంచి పనులు చేయదానికి ఇది ఓ పునాది అని చెప్పవచ్చు.
అలాగే మధ్యతరగతి గృహిణి కోరికలకు, లేనిపోని హంగులకు గురయ్యే మనసును ఫలితంగా అనుభవించే ఆర్థిక బాధలకు అర్ధంపట్టే కథ ” కారు దిద్దిన కాపురం” .ఇందులో సుధ జీవితంలో కారు కొనాలన్న బలమైన కోరికను వెలుబుచ్చే క్రమంలో ఇబ్బంది పడ్డ భర్త మనోజ్ తన ఫ్రెండ్ సునీల్ కారును
తెచ్చి సొంతగా కారు కొన్నట్లు నమ్మించి
కేవలం పది రోజుల్లో కారు వల్ల ఓ మధ్యతరగతికి వచ్చే కష్టాలను ఆమె గమనించి మనకు కారు అనవసరం అని తెలియడం సుధ ఆలోచనా శక్తికి ఉదాహరణ.ఈ కథలో ఏ వస్తువైన అవసరమైన స్థితిలో మనిషి ఆలోచించాలి.లేనిచో సుధలా ప్రతివారు బాధపడ వలిసివస్తుంది అన్నదే సందేశం ఇక్కడ.

   ఉదయం నుండి సాయంత్రం దాకా ఇంటిపనులతో సతమతమగుచు ,అందరికి సేవచేస్తూ బాధ్యతను పలు రూపాల్లో జీవితమంతా మోసే అరుణకు ఓ కొత్త వస్తువును తెచ్చి సంతోషపెట్టాలని చూసిన భర్త శేఖరును మెచ్చుకుంటూనే, ఇంట్లో ఏ వస్తువు తెచ్చినా ఆ వస్తువు వెనుక దాగిన రహస్యం అది ఇచ్చే సౌకర్యం త్వరితగతిన లభించడం ఎవరికి?.ఇందులో వంటగదిలోకి కొత్తగా వచ్చిన నాలుగు బర్నర్ స్టవ్ వలన ఇల్లాలకి సుఖం అని అనిపించినా, దాని ముసుగులో దాగిన సుఖాలన్ని ఎవరివి? అన్న ఓ ప్రశ్నతో ముగిసిన కథతో  ఓ సెటైర్ లాంటి సందేశం ఇచ్చింది.

           “నేను పోరాడవాలిసినది ఒక్కొకరితో కాదు మొత్తం సమాజంతో అని విషయం.నా పుట్టుక నన్ను జీవితాంతం వేయటాడితుందని తెలుసుకున్న నాకు ఇక దానితో సహజీవనం చేయడమొక్కటే మార్గమని ఆర్డయినది” అని శుభాకర్ అనే ఓ దళితుడు ఆవేదనే “టు లేట్” కధ. ఎన్నో ఏళ్లుగా ఈ స్వతంత్ర దేశంలో ఎప్పుడూ పచ్చగా ఉండే ఓ చేదు నిజం కులం.ఫలితంగా పలురూపాల్లో మనిషిని మనసికమైన వేదనకు గురిచేసే చిరంజీవి వివక్ష. ఓ అద్దె ఇంటికోసం ఎంత తిరిగినా
ఇల్లు దొరకనీయని కులాన్ని ఏమి చేయాలి? అన్న ప్రశ్న శుభాకర్ జీవితంలో
చేదు నిజలతో, గాయాలతో సంఘంలో ఈ దుస్థితితో సహజీవనం చేయాలన్న అనివార్యమైన పరిస్థితి నిజంగా ఈ దేశానికి ఓ పెద్ద లోపమే. అప్పటి వరకు రాఘవశర్మ గారిట్లో అద్దెకు ఉంటున్న శుభాకర్ పిల్లల చదువులు కోసం ఇల్లు మారవలసి వచ్చింది.ఇంత కాలం ఎంతో అభిమానంతో కలిసిమెలిసి ఉన్న రాఘవశర్మ గారి స్నేహం ఆదర్శం.కానీ ఇప్పుడు అలాంటి ఇల్లు, అలాంటి మనసులు కోసం ఎంత వెదికినా దొరకని స్థితికి జీవితంలో ఓ అనుభవమే.ఇలా కొనసాగే కథలో శుభకర్ కు వచ్చిన ఓ గొప్ప ఆలోచన ఈ సమాజానికి ఓ చెంపదెబ్బ.ఎంత తిరిగినా తన కులాన్ని చూసి ఇల్లు ఇవ్వడం లేదని, తాను ఇంతకు ముందు ఏ ఇంట్లో ఉన్నానో, వారితో ఎలా మెలిగామో అన్ని వివరాలను ఓ ఉత్తరంగా వ్రాసి అందరికి పంచడం ఓ చిత్రమైన ఆలోచన.ఈ కథ లో ఈ ప్రక్రియ ద్వారా తన నిజాయితితో పాటు,కులం పేరుతో మనుషుల మధ్య దూరాన్ని ప్రశించిన ఆ ఉత్తరం వెంకట్రావు లాంటి వక్తిని ” ఇల్లు ఏ కులం వారికైనా అద్దెకివ్వబడును” అని టు లెట్ బోర్డ్ పెట్టించడం ఓ మార్పుకు ఉదాహరణ.
ఈ మార్పులే దేశానికి అత్యసరమైన  చికిత్సలు.ఇవే రేపటి రోజులు పట్ల నమ్మకాన్ని పెంచే శుభప్రదాలు.రాఘవశర్మ,వెంకట్రావు లాంటి వక్తులే ఈ సంఘానికి అవసరమగు విలువైన ఆస్తులు.
       ఊరిలో ఎవరు చనిపోయినా, తన సొంత “మనిషి” పోయినట్లుగా ఏడ్చే ఈశ్వర్ తన జీవితంలో జరిగిన విషాదాన్ని ఎక్కడా చూసినా ఓ బంధువుగా బాధడటం అందరికి సొంత మనిషిలా భావించె కధ ” అందరి బంధువు”.

   జీవితంలో విధి వసాత్తు బంధాన్ని కోల్పోయి సంఘంలో పిచ్చివాడిగా ఉన్న
నారాయణ ఖేమాన్ను ఇంటికి తెచ్చి
సాధారణంగా కనిపిస్తూ అసాధారణమైన రచనాశక్తిని ,ప్రతిభను గుర్తించి, అతని రచనలను పత్రికలకు పంపుతూవాడిలో ఉన్న భవనాశక్తి వృదాకాకుండా ఎన్నో రచనలు చేయించి  అందరికి ఓ రచయితను పరిచయం చేయడమే ” ఇదీ ఒక కథే”.
       ఇలా విభిన్నమైన మనసులను పాత్రలుగా తీసుకుని పలురకలుగా కథను అల్లుతూ, చక్కని ఆదర్శం, సందేశాన్ని ఇచ్చేవే “అద్దంలో బొమ్మలు”.
సాధారణ పాఠకులకు సహితం ఓ మంచి నడకను నిచ్చి, సులభంగా అర్ధమయ్యే విధంగా సమస్యను ఎత్తిచూపి,ఆలోచన కలిగేలా చక్కని కథలను అందించారు జంధ్యాల రఘుబాబు గారు.ప్రతి కథలో కుటుంబాన్ని , విలువలను, బంధాలని, గౌరవంగా భావిస్తూ,దీనిపరంగా ముందుగా వ్యక్తిలో మార్పు రావాలని,తరువాత సంఘంలో మార్పు రావాలని ప్రతి కధకు ప్రాణంపోశారు.
అతి సౌకర్యవంతమైన భాషలో, అంత్యంత సులభ శైలిలో పండిన  కధను ప్రతివాడు చదివి ఆనందాన్ని మరియు ఆదర్శంగా ఆలోచించడం జరుగుతుంది.అలాగే ఏ కథను తాకిన అందులో కుటుంబనేపధ్యం మనసును అంటి, మనిషి నైజాలను అద్దంపడుతుంది.ముఖ్యంగా ఇప్పుడిప్పుడే రచనలు చేసి కొత్త కలాలకు, ప్రాథమిక స్ధాయిలో విద్యార్థులకు, కొద్ధి నిడివి గల ఓ మంచి కధల పుస్తకం “అద్దంలో బొమ్మలు”..ఆ బొమ్మలతో పాటు కొన్ని కధలలో తమని తాము చూసుకునే సందర్భాలు ఎదురవ్వడం ఈ కథల పుస్తకం ప్రత్యేకత.ఇలాంటి కథలు వ్రాసిన ఉత్తమ రచయితగా జంధ్యాల రఘుబాబు గారు మరెన్నో రచనలను వినూత్నరీతీలో తేవాలని ఆశిద్దాం……

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.