మా కథ
రచన: దొమితిలా చుంగారా
అనువాదం: ఎన్. వేణుగోపాల్
బయటి నుంచి ఏజెంట్లు “అంత క్రూరంగా ప్రవర్తించకమ్మా! కనీసం పాపకైనా తినడానికేమైనా పెట్టు. పాపను ఏడవనివ్వకు” అని బతిమిలాడుతుండే వాళ్ళు.
“ఏమీ పెట్టను. మీరు నా మిగతా పిల్లల మీద జాలి చూపించారా? అలాగే నేనూ దీనిమీద జాలితలవను. అంటే నేను మీరు చేయదలచుకున్న పని చేస్తున్నానన్నమాట. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి” అని నేను అంటుండే దాన్ని.
అలా వాళ్ళు మాటి మాటికీ వచ్చి తలుపు విరగొడతామని కూడ బెదిరించారు. కాని వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. గదికి ఉన్న తలుపు అది ఒక్కటే. అది చాల దృఢంగా లోహంతో చేసి ఉండింది. లోపలి నుంచి గడియ గట్టిగా బిగించుకుని శనివారం దాకా నన్ను నేను ఆ కొట్లో నిర్బంధించుకున్నాను.
శనివారం మధ్యాహ్నం ఏజెంట్లు వచ్చి “నువు విడుదలవుతున్నావు. ఉత్తర్వులొచ్చాయి. ఇకనైనా తలుపు తెరువు” అన్నారు.
“ఓహో! ఇది ఇంకో ఎత్తు అన్నమాట నాకిప్పుడు విడుదల అవసరమేమీ లేదు…”
“మేం నిజమే చెపుతున్నాం. నిన్నూ, నీ భర్తను విడుదల చెయ్యమని ఉత్తర్వొచ్చింది” అని వాళ్లు తలుపు కింది నుంచి ఓ కాగితం లోపలికి తోశారు. ఆ కాగితంలో ‘అంతరంగిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ప్రకారం దొమితిలా ద చుంగారా విడుదల చేయబడుతున్నది’ వగైరా, వగైరా అని రాసి ఉంది.
ఓ వైపు నేను దాన్ని నమ్మలేకపోయాను. మరోవైపు నాకే అది నమ్మబుద్ధి వేసింది. అలాగే పాప చనిపోబోతున్నదనే భయంలో నాకు నేనే “నీ బిడ్డ చనిపోబోతోంది. మిగిలిన పిల్లల చావులు నిజమా అబద్దమా కచ్చితంగా తెలియదు”. అని తర్కించుకున్నాను. ఎన్నెన్నో విషయాలు తలపోశాను. చివరికి ‘సాధించడానికైనా పోగొట్టుకోవడానికైనా నాకేం ఉంది? కనీసం ఇప్పుడు విడుదలైతే పాపను కాపాడుకునే అవకాశం ఉంది’ అనుకున్నాను. కాని ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు గుండెను ఎవరో నొక్కేసినంత బాధయింది. ఇది మరొక మోసమైనా కావచ్చుననిపించింది.
నేనిక తలుపు తెరవగానే వాళ్ళు “కానీ, కానీ! తయారుకా! నీ సామాన్లు సర్దుకో!” అన్నారు.
“సర్దుకోవడానికేమున్నాయి? నాకేమీలేవు”
“సరే – ఐతే ఇలాగే బయల్దేరు”
వాళ్లు తలుపు తెరిచేసరికి నాకు బైట వేలాది మంది జనం కనబడ్డారు! తలుపు దగ్గరే ఒక యువకుడు నిలబడి “ఆ గని కార్మిక స్త్రీ ఎక్కడ? హంతకులారా? ఏం చేశారామెను? డి.ఐ.సి. వెధవల్లారా – మీకు మగవాళ్ళను ఏమీ అనే దమ్ములేదు. కనుకనే స్త్రీల మీదా, పిల్లల మీదా మీ ప్రతాపం చూపుతున్నారు” అని అరుస్తున్నాడు.
అలా అక్కడ చేరిన జనమందరూ డి.ఐ.సి. వాళ్ళను అవమానించడం మొదలెట్టారు. వాళ్ళంతా నన్ను చూడగానే “అదిగో, వచ్చేసింది, ఆవిడే, ఆవిడ్ని విడుదల చేశారు” అని సంతోషంగా కేరింతలు కొట్టారు. అప్పుడా యువకుడే నా దగ్గరి కొచ్చి “నువు ఒంటరివి కావు. ఈ జనమంతా నీ వాళ్ళే. ఇవిగో ఇవి చూడు” అంటూ నాకో కరపత్రాల కట్ట ఇచ్చాడు. నేనది అక్కడే చదివాను. దాంట్లో బారియెంటోస్ ప్రభుత్వం జనం మీద జరుపుతున్న దమనకాండని గురించి రాశారు. ప్రభుత్వం స్త్రీలపై కూడా అత్యాచారాలు చేస్తున్నదని రాసి ఉదాహరణకు జైలు నుంచి ఒక స్త్రీ రాసిన ఉత్తరం చూడడండి అని నా ఉత్తరం అచ్చు వేశారు. అక్కడ చేరిన ఎంతో మంది జనం ఇలాంటి కరపత్రాల్ని నాకు ఇచ్చారు. అలా నా చేతికి వందల కరపత్రాలు వచ్చి చేరాయి. వాట్లో కొన్ని కమ్యూనిస్టు పార్టీ వేసింది. మరికొన్ని యూనివర్సిటీ వాళ్ళు వేశారు. ఇతరులు వేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అన్నిట్లోనూ నా ఉత్తరం మాత్రం ఉంది.
నేనవి చదువుతుండగానే డి.ఐ.సి. వాళ్ళు నన్నొక ట్రక్కులోకి ఎక్కించారు. వాళ్ళు నా దగ్గరున్న కరపత్రాలన్నీ గుంజుకున్నారు. వాళ్లు నన్ను జైలు నుంచైతే బయటికి తీసుకొచ్చారు గాని, నిజంగా విడుదల చేశారా లేదా అని నేను అనుమానిస్తూనే ఉన్నాను. డి.ఐ.సి. భవనం నుంచి బయటికి తీసుకొచ్చాక మళ్ళీ ఎటు తీసుకెళ్తున్నారో నాకర్థం కాలేదు. నేను ట్రక్కులోకి ఎక్కగానే అది కదిలింది. జనం హోరెత్తే నినాదాలిచ్చారు.
ఆ ఊళ్ళో నాకు చుట్టాలుగాని, తెలిసిన వాళ్ళుగాని ఎవరైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వదులుతామని, చిరునామా చెప్పమని వాళ్ళు నన్ను అడిగారు. నేనుండేది సైగ్లో-20 గని కార్మిక శిబిరంలోనేనని, నేను పోవలసింది కూడా అక్కడికేనని చెప్పాను.
“సరే – ఐతే నువు వెళ్ళిపోవచ్చు” అన్నారు.
“మరి నేనెట్లో ప్రయాణం చెయ్యాలి?” అని అడిగాను. అప్పుడు నా దగ్గర డబ్బేమీలేదు.
వాళ్ళు అప్పుడు ఎక్కడికో వెళ్ళి కొంత డబ్బు తెచ్చి నాకు సైగ్లో-20కి టికెట్ కొనిచ్చి, ఒక ఏజెంట్ ను తోడు పంపించారు.
వాహనం కదలడానికి ముందు వాళ్ళు నాకో సంగతి చెప్పారు. సాన్ జువాన్ హత్యాకాండ జరిపింది “లింకన్ – మరిలో – కాస్ట్రో గ్రూప్” అని వాళ్ళ పరిశోధనలో తేలిందట. ఆ గ్రూప్ మార్క్సిస్టు దృక్పథంలో యువజనులకు రాజకీయ దృక్పథాన్ని కలిగించాలనే ఉద్దేశంతో గని కేంద్రాలలో ఏర్పడ్డ సంస్థ. ఆ సంస్థకు చెందిన యువకులే కొందరు లెఫ్టినెంట్లను, మరికొందరు యువ సైనికులను చంపారని రుజువైందని డిఐసి వాళ్ళు చెప్పారు. కార్మికులు కూడా . ఈ విషయం నమ్ముతున్నారనీ, ఈ నాయకుల తలలు తెంచాలని వాళ్ళు అంటున్నారనీ డిఐసి వాళ్లు చెప్పారు. ఈ తెంచవలసిన తలల జాబితాలో నా తల కూడా ఉందట! సైగ్లో-20 కార్మికులు మమ్మల్ని ఉరితీయడానికి సిద్ధంగా ఉన్నారట. వాళ్ళు అలా నేను భయపడిపోయే సంగతులెన్నో చెప్పారు.
మేం ఒరురో చేరేసరికి అర్థరాత్రి దాటింది. ప్రయాణీకులందరూ దిగిపోయారు. అప్పుడు సైగ్లో-20 కి వెళ్ళే సౌకర్యం. లేకపోవడంతో మేం ఆ రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒరురోలో ఎవరన్నా పరిచయస్తులున్నారా అని నాతో పాటు ఉన్న ఏజెంట్ అడిగాడు. నాకెవరూ తెలియదన్నాను. నేను బస్ లోనే ఉండిపోయాను. ఏజెంట్ వెనుక కెళ్ళి దుప్పటి పరుచుకొని పడుకున్నాడు. నేను సీట్లో కూచునే కునికిపాట్లు పడడం మొదలెట్టాను.
బస్ లోనే ఉండిపోయిన ఒక స్త్రీ ఓ గంటయ్యాక కిందికి దిగింది. ఏజెంటులో ఏమీ చలనం లేకపోవడం చూసి నేను కిందికి దిగాను. నాకున్న సామానల్లా పాప ఒక్కతే కావడంతో దాన్నెత్తుకొని వడివడిగా మా నాన్న వాళ్ళింటికి పరుగెత్తుకెళ్లాను.
నేను ఇల్లుచేరి తలుపుతట్టే సమయానికి కన్నీళ్ళు కుండపోతగా కురుస్తున్నాయి. మా నాన్న ఇంట్లో లేడు. మా సవతి తల్లినన్ను కూచొని సేదదీర్చుకోమంది. నన్ను జైల్లో పెట్టిన సంగతి పత్రికల్లో చదివి చూసిరావడానికని నాన్న సైగ్లో-20కి వెళ్లాడట. మా మారుటమ్మ “పత్రికల్లో నీ పేరొచ్చిందిగాదూ? అరెస్ట్ అయ్యావని తెలిసింది. తర్వాతేం జరుగుతుంది? సరే – ఏదేమైనా ఇక్కడకొచ్చి మంచి పనిచేశావు” అని ఓదార్చింది.
నేనక్కడ ఒకరోజు ఉన్నాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక “ఇక నువు వెల్గొచ్చు ననుకుంటాను” అని మా మారుటమ్మ చెప్పింది. ఆవిడక్కూడ పిల్లలేమయ్యారో తెలియదు. వాళ్ళెక్కడో తప్పిపోయి ఉంటారని ఆవిడ అనుకుంటోంది. ఇద్దరమూ కొంత సేపు పిల్లల్ని తలచుకొని, వాళ్ళ ఆటపాటలు జ్ఞాపకం చేసుకొని ఏడ్చాం. సాన్ జువాన్ హత్యాకాండకు బాధ్యులం మేమేననే కోపంతో అక్కడి గని కార్మికులు మమ్మల్ని చంపదలచుకున్నారట అని కూడా నేను మా మారుటమ్మకి చెప్పాను.
*****