రాగో

భాగం-16

– సాధన 

రుషి టైం చూసుకున్నాడు. అప్పుడే రెండు దాటింది. ఇంకా డోలు, డోబి, లెబుడుతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం నుండి ఇక్కడే ఉండి మీటింగ్ సైతం జరిగి, జనాలు పోయాక అదే జాగలో ఉండడం సరియైంది గాదు. స్థలం మార్చాలి. పక్కూరుకు పోతే ఇక్కడ మాట, ముచ్చట పూర్తి గాకుండా పోతుంది. బాగా పొద్దుపోయి చేరితే ఆ ఊళ్ళో దళానికి రాత్రి భోజనం కూడ ఇబ్బంది కావచ్చు.

ముందుగా కొందర్ని పంపడమే మంచిదనే నిర్ణయానికొచ్చాడు రుషి. గాండోను కేకేసి పక్కకు తీసుకెళ్ళాడు. గిరిజ, కర్ప, ఫకీరాలను తీసుకొని మడి కొండ పోవాలని చెప్పాడు.

“కిట్లు తీసుకోండి కామ్రేడ్స్ పోదాం, గాండో దాదవాళ్ళు వేరే పని మీద పోతారు” అంటూ తన దళ సభ్యులందరిని పురమాయిస్తూనే వచ్చి డోలు భుజం మీద చేయి వేశాడు రుషి. తన జేబులో కుక్కుకున్న కరపత్రాలను తీసి చూడసాగాడు.

ఎదురుగా భూమ్యల్ సన్నో వచ్చి నిలబడింది రుషి చూడనేలేదు.

“దాదా! అందులో ఏముంది? జెర చదివి చెప్పురాదా! నువు అవి జేబులో పెడితే అందర్లో అడగద్దనే మళ్ళి మల్లొచ్చినా” అంటూ కరపత్రాల్లోని అసలు విషయం తెలుసుకోవాలని ఆతృతగా అడిగాడు సన్నో.

“చూసిన దాదా! మనమంటే గిట్టని పోలీసోల్లే వేసి ఉంటరు. ఇది చూడడం ఈ ఇరవై రోజుల్లోనూ ఇవాళ మూడోసారి. ఏం లేదు దాదా దీంట్లో. మనం లంగ లం దొంగలం అని ఉంది – ఊళ్ళో కొస్తే గెదమాలి. బువ్వ పెట్టవద్దు. ఇదే దాదా, వాళ్ళు రాసింది” అంటూ క్లుప్తంగా ముగించి డోలను తీసుకుని పక్కకెళ్ళాడు.

‘థూ! లంజకొడుకులు. దొంగే దొంగన్నట్టుంది” అంటూ తుపుక్కున ఉమ్మేశాడు సన్నో.

“డోలు దాదా! సన్నోను ఊరి దిక్కు పడగొట్టి మీరు ముగ్గురూ విడివిడిగా ఎవరికీ అనుమానం రాకుండా ‘పేనుకస’ (నీటితోగు) దిక్కు రాండ్రి. మేం ముందు పోతం.” అని చెప్పి, వచ్చి వెంటనే తన కిట్టు వేసుకున్నాడు. అప్పటికే కిట్లు వేసుకొని రడీగా ఉన్న గాండో వచ్చి రుషికి చేయి కలిపి ‘లాల్ సలాం’ చెప్పగానే మిగతా ఎనిమిది మందీ వరుసగా లైన్లో నిలబడ్డారు. విడిపోతున్న నలుగురూ అందరికీ ‘లాల్ సలాం’ చెప్పి బయల్దేరారు. రుషి బేచి కూడ వెంటనే కొత్త డెన్‌కు బయలుదేరారు.

వర్షాకాలం కనుక నడకకు ఇబ్బంది కావడం లేదు. మబ్బు తెరల చాటు వచ్చే పల్చటి ఎండ వెచ్చ వెచ్చగా ఉంది. పచ్చని అడవి నీడ చల్లగా నడిచే వారికి గొడుగు పట్టినట్టే ఉండి గాలి లేకున్నా హాయిగానే ఉంది. ఇగురు పెట్టని పొరక లేదు. పేనుకస వచ్చింది.

ఆ తోగులో నీళ్ళు ఎపుడూ పారుతూనే ఉంటయి. చినుకు పడేదాక ఆ తోగు బక్కి (ఎండి) పోకుండా పారుతుంది. పూనుగు చెట్లు, కానుగు చెట్లు, బుడ్డదరిమి చెట్లు దగ్గర దగ్గరగా ఉండి తీగదారి పొదలు ఒకదానికొకటి అల్లుకుని అక్కడ ఎపుడూ నీడ చిక్కగా ఉంటుంది. ఎండాకాలంలో అయితే బుడ్డదరిమి కాయలు తింటానికి జంతువులు వస్తాయని షికారుకి వచ్చే వాళ్ళ బెడద ఉంటుంది. వర్షాకాలం అయితే ఆ తోగు ఊసు పట్టేవాళ్ళే ఉండరు. ఆ తోగు తలంపుకే ఉన్న పెద్ద మామిడి చెట్టుకు యెన్ని పెత్తేరీగా తేనె తుట్టెలుంటాయో లెక్క పెట్టలేము. వాటిని రెచ్చగొట్టే కొంటె పనులు చేస్తే నిలవనివ్వకుండా తరుముతాయి. అందుకే వాటి జోలికి పోకుండా యెవరి మానాన వారు అక్కడ ఆశ్రయం తీసుకుంటారు.

ముందు చేరిన డుంగ, జైనిలు పూసుగుచెట్టు కింద ఆగి కమాండర్ చేరే వరకు యెదురు చూస్తున్నారు.

“ఇక్కడే ఉందాం కామ్రేడ్స్. ఊరి దాదలు వస్తరు వారితో మాట్లాడినాంక మడికొండ పోదాం” అంటూ కిట్టు దించేసరికి డోలు దాదా రానే వచ్చాడు.

తొందరగా పని ముగించుకోవాలి. టైం చాలదు అనుకుంటూ రుషి వెంటనే జైనిని సెంట్రీకి పంపి డోలును తీసుకొని వంద గజాల దూరంలో కూచున్నడు.

“డోలు దాదా వాళ్ళిద్దరు ఏరి?” – రుషి.

“వస్తరు దాద. వాళ్ళకు జెర తిరుగుడైతది” – డోలు.

“మంచిదే దాద. వాళ్ళు వచ్చేవరకు మనం గ్రామరక్షక దళం సంగతి మాట్లాడుకుందాం. ఆ రిపోర్టు చెప్పు దాద” అంటూ మొదలుపెట్టాడు రుషి.

“ఇంగో” – అని డోలు గ్రామరక్షక దళం ఊసెత్తుకున్నాడు. “ఈ వాన కాలం మా పని ఎటమటమే అయితుంది దాద. అయినా వీలున్నప్పుడల్లా అడవిలో కలుస్తున్నాం. మాట్లాడుకుంటున్నాం. డ్రిల్లు ఎక్సర్ సైజులు చేస్తున్నాం దాదా. నేను కొనుక్కొచ్చిన మందు తడిసిపోయి ఎంత ఆరబెట్టి కొట్టినా బర్మార్లు పేలుడే లేదు దాద. మా దళం ఏడుగురం ఒక్క తీరోల్లమే ఉన్నం దాదా. ఊళ్లి పోరగాండ్లకు ఎగురుడు, దునుకుడు, ఫైరింగ్ నేర్పుతునే ఉన్నం దాద! మేం పోయే పనులన్నిటికీ ఎంటేసుకుపోతున్నం దాదా” అంటూ డోలు చెప్పాడు.

“నువు పోంగ నేను తుపాకి మందిస్తా. ఇది మంచిది. తడవలేదు. మరువకుండా తీసుకో. మరి మీకు రెండే బర్మార్లు గదా. మిగతా అయిదుగురు ఏం పట్టుకుంటరు. బరిశలు అనుకున్నాం కదా! ఆ పనేమయ్యింది” రుషి.

“మాట్లాడిన దాదా. కానీ ఇంకా ఆలస్యమయితుంది దాదా!”

ఇంతలో లెబుడు, డోలు వచ్చి చేరారు.

సెల్ సమావేశం ప్రారంభించనున్నట్లు “ఇవాళ మనం చర్చించాల్సినవి ఏమిటి డోలు” అంటూ రుషి మొదలు పెట్టాడు.

“ఆకుల రిపోర్టు, రివాజుల గురించి పెద్దలు పట్టీ మొత్తం మీద పెట్టుకుంటున్న మీటింగ్, ఊళ్ళో సంఘం పని. ఇవే ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇంకేమున్నాయి లెబుడు” అంటూ ఎజండా వివరించాడు డోలు.

“మీ సెల్లు పని పద్ధతులు, విమర్శ, ఆత్మవిమర్శ కూడా ఉండాలి కదా” అని గుర్తు చేశాడు రుషి.

“ఔ, ఔ.” అన్నారు లెబుడు, డోలు ఒకేసారి.

“ఆకుల రిపోర్టుతో మొదలెడదాం” అని రుషి అనగానే డోలు ప్రారంభించాడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.