కొత్త అడుగులు – 25

సముద్రపు తెల్లటి కెరటం – ఆమెకవిత్వం

బండి అనూరాధ

– శిలాలోలిత

అనురాధ ఇటీవల బాగారాస్తున్న కవయిత్రులలో ఒకరు. సుమారు 2000 లకు పైగా కవితలు రాసిందని వినగానే ఆశ్చర్యం వేసింది. ఒకటి, రెండు రాసిన వారి క్కూడా అత్యుత్తమ బహుమతులంటూ అందిస్తున్న ఈ కాలంలో ఇలా లెక్కపెట్టలేని సముద్రపు అలల్లా కవితలు రాయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ అంశం.

యం.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకుంది. చిన్నప్పటినుంచి తెలుగు నవలలు ఎక్కువగా చదివిందట. కవిత్వంపట్ల ఆసక్తి వుంది. ఆమె మాటల్లోనే కవిత్వమంటే ఆమె ఏమనుకుంటుందో విందాం. ‘‘కవిత్వమంటే చాలా ఇష్టం. ఏది కవిత్వం, ఎలా వ్రాస్తే కవిత్వమన్నదాని పట్ల ఎన్నెన్ని సమీకరణలు వున్నా నాకు తోచింది, నేను అనుకున్నదీ, ఫీల్ అయ్యింది మాత్రమే వ్రాసుకుంటూ వచ్చాను. బహుశా నా పదిహేడవ ఏట నుండి వ్రాస్తున్నాను.

ఒక సంతోషం కావొచ్చు, దుఃఖం కావొచ్చు, వోర్చుకోలేని నొప్పి, అయిన గాయాలు… మానవ జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు విజయాలు… ఇలా ఏదైనా భావోద్వేగమూ అక్షరాల్లో అందంగా అమర్చుకుంటూ పోతే కవిత్వమవుతుందని నమ్మతాను నేను. నన్ను నేను వ్యక్తపరచుకునేందుకు, నా అంతరంగాన్ని ఆవిష్కరించుకునేందుకు నేను కవిత్వాన్ని ఆశ్రయించాను. నాకు ఇంతకుమించి మరోమార్గం కనిపించలేదు. మనుషులతో తక్కువ, అక్షరాలతో ఎక్కువ మాట్లాడతాను నేను. మనుషులను నమ్మడం కంటే అక్షరాన్ని నమ్మడం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది నా వరకూ… అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది.

భావగాఢత వున్న పదాలే ఎక్కువ ఆమె కవిత్వంలో, ఒక శూన్యం చుట్టూ తిరుగుతూ తిరుగుతూ అలిసిపోయిన తనంతో మళ్ళీ చిగురించాలన్న వెతుకులాటతో కవిత్వముంటుంది. సైకాలజీ అంటే వున్న ఇష్టం కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది.

అనురాధ తండ్రి ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. వాళ్ళ అమ్మమ్మ వాళ్లింట్లో గన్నవరం దగ్గర కేసరపల్లి పుట్టి పెరిగింది. ప్రస్తుతం విజయవాడలో రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ, సమర్థవంతంగా నిర్వహిస్తోంది. చాలావరకు ఈమె కవితలన్ని మోనోలాగ్ లా వుంటాయి ప్రశ్నించేతత్వం, ఎదుర్కొనే దైర్యంతో కవితలుంటాయి.

2000 లకు పైగా రాసిన ఈమె ఇప్పటి వరకు పుస్తకం వెయ్యకపోవడం, చాలా బాధాకరం. ఎంతో, ఎన్నెన్నో సాధించిన స్త్రీలు సైతం, తమ గురించి తాము ఇలా పట్టించుకోరన్న విషయం విచారించతగ్గది. కవితలకి పేర్లు పెట్టడంతోనూ ప్రతిభను చూపించింది. ఎక్కువగా ఇంగ్లీష్ పేర్లు కన్పించాయి. విదేశాల్లో వుండటం ఒక కారణమో! ఇంగ్లీషు పట్ల మమకారమో తెలీదు. కానీ అవి కూడా అర్థవంతంగానే వున్నాయి. చాలా వరకు తన పెయిన్ రిలీఫ్ కవిత్వముంటుంది. 2017 నుండి ‘కవి సంగమం’ లో పోస్ట్ లు పెడ్తోంది.

ఒక చోట అంటుంది కదా!

మిగులపడిన సూర్యుడి అవస్త

నాది

అస్తమించినా మానను

ఉదయించకా మానను

వెన్నెల్ని కని పారిపోలేని చంద్రుడి

తపన నాది

చీకటి గంధాలను మెడకు

పూసుకు తిరిగే

అమావాస్య తత్వంనాది

మరి, నువ్వు ఏమిటనే

ఆదిమ ప్రశ్న, నేను వెయ్యలేను.

నాకుగా నిలవడానికి

తెగిపడిన క్షణాలన్నీ

కళను కోల్పోయిన నక్షత్రాలు

అనురాధ కవిత్వంలో లోతైన భావాలను తేలికగా చెప్పే నైపుణ్యం వుంది. పదాడంబరాలు ఆమెకు నచ్చవు. నగిషీలు చెక్కడం అసలే రావు. పటాటోపాలు తెలియవు. కీర్తి కాంక్షల పరుగు పందెంలో పాల్గోదు. తన బ్రోకెన్ హార్ట్ కు అక్షరం నెత్తుటి సరఫరానిస్తుందని నమ్ముతుంది. కనులు తడిసినా, మనసు చిట్లినా, బాధ గుచ్చినా, అక్షరమే ఆమెను సేదతీరుస్తుంది. సముద్రతీరంలో నిలబడితే అలలు పరిగెత్తుకొచ్చి, కాళ్లను తడిపి, కాలికింది ఇసుకలాంటి బాధలు జారిపోతాయని చెప్పే తత్వంలా, ఆమె మనసు గాయపడిన మరుక్షణం అక్షరమే సేదతీరుస్తుందట. నిజంగా స్త్రీలంతా తమని తాము ఇలా స్పష్టంగా చూసుకోగలిగే, చూపించగలిగే రోజులొచ్చి, చాలా చాలా సమస్యలకు ముగింపు పలకాలన్నదే ఆశ.

“మండుతున్న కట్టెల్లో

నువ్వో కాలే కట్టె

నేనో ఖాళీ కట్టె” 

దూరమైన సహచరుని జ్ఞాపకాల్లో చిలికిన అక్షరాలివి. (మరణచ్ఛాయ)

చాలామంచి కవితలున్నాయి. బాధాగ్ని రేణువులున్నాయి. ఆరని, తీరని వేదనా శకలాలున్నాయి. ఎదుర్కొని గెలిచే తత్త్వమూ వుంది. బతుకు పట్ల గొప్ప ఆశ, నమ్మకం వున్నాయి. సాహిత్యం తనకు తోడుగా నిలిచే నెచ్చెలి అని భావిస్తోంది.

అనురాధ కవిత్వం ఆషామాషీగా చదివి పక్కన పడేసేది కాదు. లోతుగా, సీరియస్గా అర్థం చేసుకోవాలన్న నిజాన్ని కలిగివుంది. ఎందరెందరో స్త్రీల అంతరంగాల్ని, పెయిన్ ని, నిశ్శబ్ద హింసల్ని భరిస్తున్న మూగకథల్నీ అక్షర ముఖంలో దాచిపెట్టింది. ఆమె 17 ఏళ్ళ వయస్సులో రాసిన కవిత ఇప్పటి కవితలా అన్పించడం వెనుక పెనువిషాదముంది. ఒక చిత్రకారుడు రంగుల్లో బతుకుని ఒలకిస్తే, ఈమె బతుకు బొమ్మల్ని సమాజ రంగస్థలంపై స్పష్టంగా చూపించింది. వాడీ, వేడీ వున్న నెత్తురొలుకుతున్న అక్షరాలివన్నీ, ఈ మధ్యకాలంలో నన్నెంతో కదిలించే, కన్నీళ్ళొలికించిన కవిత్వమిది. ఎంతరాసినా తక్కువే. మీరు మీరుగా రైలుపట్టాల్లాంటి ఆమె అక్షరాలవెంట పరుగుపెట్టండి. సమాంతర రేఖల పయనం కనిపిస్తుంది.

నాకు బాగా నచ్చిన కొన్ని కవితల పేర్లు, గాలిపటం, ఆశ్చర్యం, బదులు, అన్ నోన్ వాయిస్, నీరాజనం, హార్ట్ బీట్, పేపర్ బోట్స్, నేను… నా అంతఃశోకం, అంతర్లోచనం, ఆఖరున… సౌండ్ ఆఫ్ పోయమ్, కాలచక్రం, విభ్రమ విస్మయ క్షణాలు, కథలాంటి కవిత, అలికిరు స్వప్నం, ఇలా ఎన్నో.

నేనంతా మొన్నలను

భుజాలకెత్తుకుని నిన్నలని

దాటిస్తూ ఈ రోజుని ఊరడిస్తూ

రేపటికై కలలుకనే అల్పజీవిని

……………….

ప్రేమిస్తాను మొన్నగాయాలను

ప్రేమిస్తాను నిన్న లేపనాలను

కలకంటాను

ఈ రోజు శ్వాసలో రేపటి ఆశని

మలుపు తిప్పాలనే వుంటుంది

కథని

స్త్రీల జీవితాల్లో మార్పును తీసుకురాగలిగేది స్త్రీలేనని సహజీవన సౌందర్యం ఎరిగిన వాళ్లు మాత్రమే జీవన కళ తెలిసిన వాళ్ళనీ ఆమె నమ్మకం.

*****

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.