యాత్రాగీతం
నా కళ్లతో అమెరికా
అలాస్కా
-డా||కె.గీత
భాగం-16
కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్
సీవార్డ్ తీరంలో మాకోసమే నిలిచి ఉన్న కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ని చివరి నిమిషంలో ఎక్కగలిగేం.
నిజానికి అప్పటికే విట్టియార్ తీరం నుండి గ్లేసియర్లని ఒకసారి చూసేసినందువల్ల ఈ ట్రిప్పులో పెద్దగా చూసేవి ఏమీ ఉండవేమో అని భావించినా సీవార్డ్ తీరం ప్రధానంగా అలాస్కా తీర ప్రాంతపు పక్షుల అభయారణ్యం.
ఇక్కడ చూసే స్థానిక పక్షులు మరెక్కడా కనిపించవు. అలాస్కా లో ప్రత్యేకించి సీవార్డ్ తీరంలో కనబడే “పఫిన్” పక్షులు, త్రోవ పొడవునా చిన్న చిన్న ద్వీపాల్లో గూళ్లు కట్టుకుని నివసిస్తున్న అనేక రకాల ఇతర అందమైన పక్షుల్ని ఇక్కడ చూడొచ్చు.
కానీ పిల్లలు అప్పటికే వారం పాటు అలిసిపోయినందువల్ల క్రూజ్ లో చాలా భాగం నిద్రపోతూనే ఉన్నారు. ఇక అస్సలు తినడం మానేసి పూర్తిగా డీలా పడిపోయిన సిరి పరిస్థితి చెప్పనవసరం లేదు.
ఇక ఫియోర్డ్ (Fjord) అంటే ఎత్తైన మంచు శిఖరాల మధ్య లోనికి చొచ్చుకొచ్చిన సముద్ర ప్రవాహపు అఖాతం.
కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ దాదాపు 670 వేల ఎకరాల మేర విస్తరించి ఉంది. ఇందులో అమెరికాలోకెల్లా అతిపెద్దవైన గడ్డకట్టిన మంచు భూభాగాలు, ఎత్తైన శిఖరాల మధ్య విస్తరించి ఉన్న 38 హిమానీ నదాలు, అఖాత సముద్ర ప్రవాహాలు (ఫియోర్డ్స్) ఉన్నాయి. ఈ తీరమంతా కెనాయ్ ద్వీపకల్పంలో భాగంగా ఉంది.
అటువంటి అఖాత సముద్ర ప్రవాహంలో ప్రయాణించడమే ఒళ్ళు గగుర్పొడిచే విషయం.
దాదాపు పదకొండున్నర గంటల ప్రాంతంలో క్రూజ్ బయలుదేరింది. మా నిర్దేశిత టేబుళ్ల దగ్గర కూర్చోగానే మధ్యాహ్న భోజనం సిద్ధమై వచ్చింది.
తీరం అందేటట్టు సాగుతున్న పెద్ద పడవ ప్రయాణంలో పడవ అంచుల్ని ఒరుసుకుని ఎగిసి పడుతున్న అలల మధ్య తూగుటుయ్యాలలా సాగింది మా ప్రయాణం.
త్రోవలో తీరం వెంబడి వరసగా సముద్రంలోంచి పొడుచుకొచ్చిన కత్తుల్లా చిన్న చిన్న ద్వీపాలు ఎన్నో ఉన్నాయి.
రాతి తోరణాలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ద్వీపాల మీద వందల పక్షులు గూళ్లు కట్టుకుని రొదరొదగా వాటి ప్రపంచంలోకి చొచ్చుకొచ్చిన వింత జీవులన్నట్టు మా వైపు చూడసాగేయి.
ఒక ద్వీపం నిండా సముద్రం లో అదేపనిగా ఈత కొట్టడం వల్ల అలసటతో భారీ శరీరాల్ని రాళ్ళ మీద ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఆరబెట్టుకుంటున్న సీల్ చేపలు.
మరో ద్వీపం నిండా కువకువలాడుతూ నీళ్ల కంటే ధగ ధగా మెరిసే నల్లటి మేనిఛాయతో, తెల్లటి పొట్టతో, నారింజరంగు ముక్కు, అదేరంగు బాతు కాళ్లతో ముద్దొచ్చే పఫిన్ పక్షులు.
చూడడానికి రెండు వైపులా రెండు కళ్లూ చాలని మంచు శిఖరాల, హిమానీ నదాల పర్వత శ్రేణులు.
ఒక గొప్ప అద్భుతమైన, అందమైన ప్రయాణం అది.
ఇక అక్కడ అన్నిటికంటే పెద్దదైన బేర్ గ్లేసియర్ దగ్గరకి వెళ్లి పడవని ఆపగానే హృదయం ఆగి కొట్టుకునే గొప్ప నిశ్శబ్దం ఆవరిస్తుంది. తరతరాలుగా అంతరాంతరాల్లో కొద్దికొద్దిగా ప్రవహిస్తూ మనకోసమే సముద్రంలోకి వయ్యారంగా జాలువారుతున్న హిమానీ నదం అక్కడక్కడా లేత నీలిరంగు అద్దుకుని ఎదుట ప్రత్యక్షమయ్యినపుడు మనసు పరవశమై ఆనందతాండవం చేస్తుంది.
పడవ వెనక్కి తిప్పగానే ఈ ప్రయాణంలో చివరిసారి దగ్గరనించి చూస్తున్న గ్లేసియర్ అదేనని అర్థం కావడంతో మనసంతా బెంగ ఆవరించింది.
గ్లేసియర్ దగ్గిరికి వెళ్ళగానే సముద్రంలోకి పెళ్లలుగా విరిగిపడి నీళ్లలో వెన్నముద్దల్లా తేలుతున్న మంచుని తోడి తీసి అడిగినవారికి డ్రింకుల్లో వేసి ఇవ్వసాగేరు.
అక్కడక్కడా పళ్లేల్లో పెట్టి ప్రదర్శనకు కూడా ఉంచేరు.
ఒకవైపంతా నిద్రలో జోగిన పిల్లలు కూడా గ్లేసియర్ దగ్గరికి వచ్చేసరికి హుషారుగా పై డెక్ మీదికి పరుగుతీసేరు.
అవును మరి, ఎన్నిసార్లు చూసినా తనివితీరని అద్భుతం హిమానీ నదం.
మరో రెండుగంటల్లో తిరిగి సీవార్డ్ తీరానికి చేరుకున్నా అందమైన ఆ దృశ్యం అలా మదిలో ప్రత్యక్షమవుతూనే ఉంది.
ఆ క్రూజ్ లో ప్రయాణం చేసినందుకు గాను మాకు ఇరవై డాలర్ల విలువ చేసే కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ వాటర్ గ్లోబు ఒకటి బహుమతిగా ఇచ్చారు.
అపురూపమైన ఆ బహుమతిని ఇంటివరకు తెచ్చుకోవడానికి వీలుపడదని అప్పుడు తెలియలేదు.
****
(ఇంకా ఉంది)
👌