కథన కుతూహలం -5
– అనిల్ రాయల్
తిరగరాత
మీరో పేరాగ్రాఫ్ రాశారు. తర్వాత దాన్ని చదువుకున్నారు. అద్భుతంగా అనిపించింది. అంతకన్నా గొప్పగా మరెవరూ రాయలేరనిపించింది. అప్పుడు మీరేం చేయాలి?
ఆ పేరాగ్రాఫ్ని కొట్టిపారేసి మళ్లీ రాయటం మొదలుపెట్టాలి.
గొప్పగా రాయాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన సుగుణం – తాను రాసిన వాక్యాలతో మొట్టమొదటిసారే ప్రేమలో పడకుండా ఉండగలిగే నిగ్రహం.
***
‘ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ వంటి కళాఖండాల సృష్టికర్త ఆస్కార్ వైల్డ్ని ఓ రోజు మధ్యాహ్న భోజన సమయంలో పలకరించిన స్నేహితుడు “మిత్రమా, ఈ ఉదయమంతా ఏం చేశావు?” అన్నాడట.
“కష్టపడి పనిచేశాను,” అని బదులిచ్చాడు ఆస్కార్ వైల్డ్.
“అయితే చాలా పేజీలు రాసేసి ఉంటావేం?” స్నేహితుడి తిరుగు ప్రశ్న.
“లేదు,” అన్నాడు వైల్డ్. “కథ మధ్యలో ఓ చోట ఒక కామా పెట్టాను”
అదే సాయంత్రం డిన్నర్ సమయంలో ఆ స్నేహితుడు మళ్లీ తారసపడ్డాడు.
“ఏం మిత్రమా. మధ్యాహ్నమంతా ఏం చేశావేమిటి?”
“మరింత కష్టపడి పని చేశాను”
“అవునా. కథలో మరో కామా ఇరికించావా?,” స్నేహితుడి వ్యంగ్యం.
“లేదు. ఉదయం పెట్టిన కామా తొలగించాను”
***
పై పిట్టకథ అతిశయోక్తిలా అనిపించొచ్చు కానీ దాని వెనకో గొప్ప సాహితీ సత్యం ఉంది. చరిత్రలో ప్రసిద్ధి చెందిన రచయితలు చాలామందిలో ఉన్న సారూప్యత: తమ రచనల్ని శ్రద్ధగా తీర్చిదిద్దటం. కొందరు దీన్నే ‘చెక్కటం’ అనీ అంటారు. అచ్చ టెల్గూలో చెప్పాలంటే ‘గివింగ్ ఫైన్ టచెస్’ అన్న మాట. సాహిత్యానికే కాదు – శిల్పాలకైనా, వర్ణచిత్రాలకైనా మరి ఏ ఇతర కళా రూపానికైనా ఈ చెక్కుడు ఎనలేని అందాన్నిస్తుంది. ఇది మీర్రాసే కథలకీ వర్తిస్తుంది. మీరు చేయాల్సిన పనల్లా మీ కథని కనీసం రెండు మూడు సార్లు తిరగరాయటం. కూరకి తిరగమోత ఎలాగో, కథకి తిరగరాయటం అలా.
అన్నట్లు – ‘చెక్కుడు’ అనే మాట వింటే కొందరు (తెలుగు) కథకులు, విమర్శకులు ఉలిక్కిపడటం నేను గమనించాను. చెక్కటం అంటే కథ ఆత్మని దెబ్బతీయటం అనీ, ఇంకోటనీ ఏవో వాదనలూ విన్నాను. వ్యక్తిగతంగా నేను ఇటువంటి వాదనల్ని కొట్టిపారేస్తాను. కథలోకి ఆత్మ ఎక్కడినుండో రెక్కలుకట్టుకుని ఎగురుకుంటూ వచ్చి తిష్టవేసుక్కూర్చోదు. అది కథకుడు పొదగాల్సిన పదార్ధం. చెక్కటం, సానబెట్టటం, మెరుగులు దిద్దటం – పేరేదైనా – ఆ ప్రక్రియ పొదిగే క్రమంలో ఓ భాగం. బహుశా చెక్కటం అంటే ‘నగిషీలు చెక్కటం’ అన్న అర్ధంలో తీసుకుని వాళ్లు పొరబడి ఉండొచ్చు. కథకి మెరుగులు దిద్దటం అంటే దానికి భాషాలంకారాలు జతచేయటమొక్కటే కాదు, అనవసరమైన చోట అలంకారాలు, పదాల పటాటోపాలు తొలగించటం, పునరుక్తులు పరిహరించటం, కథలోంచి కొవ్వు కరిగించటం కూడా. ఇవన్నీ చేయాలంటే మీ కథని ఒకటికి రెండుసార్లు తిరగరాయటం తప్పనిసరి.
నా దృష్టిలో ఇదెంత ముఖ్యమైనదంటే – రచనకి సంబంధిన రహస్యాన్నొకదాన్ని చెప్పమంటే, నేనైతే “తిరగరాయటం” అనే చెబుతాను. కొందరు కథకులు “మేము మొదటిసారి ఏది రాస్తే అదే ఫైనల్” అని గొప్పగా చెబుతారు. వీరిలోంచి ఎన్నిసార్లు తిరగరాసినా మెరుగుపడని కథలు రాసేవారిని తీసేస్తే, మిగిలిన వారు చెప్పేదాంట్లో నిజానిజాలు వారికే ఎరుక. తిరగరాయటం అనేది తనకు అలవాటు లేని పనిగా షేక్స్పియర్ సైతం చెప్పుకునేవాడు. అందువల్లే ఆయన రచనల్లో చాలాచోట్ల ‘నస’ కనిపిస్తుందని బెన్ జాన్సన్ అనేవాడు. (బెన్ జాన్సన్ అంటే పరుగు వీరుడు కాదు. ఈ బెన్ జాన్సన్ వేరే. ఈయన షేక్స్పియర్ సమకాలీకుడు; ఆంగ్ల సాహిత్యానికి సంబంధించినంతవరకూ షేక్స్పియర్కి సరితూగే నాటక రచయిత, కవి, మరియు విమర్శకుడు).
నేను ‘కథాయణం’, ‘కథన కుతూహలం’ రెండు శీర్షికల్లోనూ కలిపి డజను దాకా అంశాలపై విపులంగా రాశాను. వాటన్నిట్లోనూ అతి తేలిగ్గా పాటించగలిగేది ఈ తిరగరాసే కార్యక్రమం. దీనికి కావలసిందల్లా కొంచెం సహనం, కాస్త సమయం. ఆ రెండిటికీ మించి, ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అనే సామెత మీకు వర్తించకుండా ఉండటం. కథ రాసిన వెంటనే దాన్ని ఆవేశంగా ఏ పత్రిక్కో పంపించేయకుండా దాన్ని తిరగరాసి చూడండి. తేడా మీకే కనిపిస్తుంది. ఆ పని చేయటం ద్వారా, మీ కథ ప్రచురణకి ఎంపికయ్యే అవకాశాన్ని పెంచుకుని మీకు మీరే ఉపకారం చేసుకున్నవారవుతారు. అయితే తిరగరాయటం ఎంత ముఖ్యమో, మరీ ఎక్కువసార్లు తిరగరాయకుండా ఉండటమూ అంతే ముఖ్యం. మొదటి రెండు మూడు సార్లలో లేని మెరుగుదల ఆ తర్వాత వచ్చే అవకాశాలు దాదాపు శూన్యం. దాని వల్ల మీ సమయం వృధా కావటం తప్ప వచ్చేదేమీ లేదు.
చివరగా – ‘If you got it right the first time, then you are an anomaly’ అనేది సాఫ్ట్వేర్ రంగంలో ప్రముఖ నానుడి. మీరు అలాంటి విపరీత మానవులైనా, లేక షేక్స్పియర్ అంతటి వారైనా మీ కథని తిరగరాయనవసరం లేదు. నాలాంటి మామూలు కథకుడైతే మాత్రం ఆ పని తప్పదు.
*****
(సారంగ, తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపు లలో ప్రచురితం-)
అనిల్ ఎస్. రాయల్ నివాసముండేది శాన్ ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంలో. 2009లో ‘నాగరికథ’తో మొదలు పెట్టి 2021లో ‘Annie’ (ఆంగ్ల కథ) వరకూ పదకొండు కథలు రాశారు. అడపాదడపా మాత్రమే రాస్తుండే వీరి కథలు ఎక్కువగా సైన్స్, సస్పెన్స్ మేళవింపుతో నడుస్తుంటాయి. అనిల్ ఇతర కథల్లో కొన్ని: ‘రీబూట్’, ‘ప్రళయం’, ‘శిక్ష’, ”రాక్షస గీతం”.