విజయవాటిక-4

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

దేవాలయంలో పూజాదులు పూర్తి చేసుకొని అర్చకస్వామి ఇచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించి దేవాలయం బయటకు వచ్చాడు శ్రీకరుడు. అతని మనసులో మల్లిక తలపులు చుట్టుముడుతుండగా, ఆమెను నదీ తీరంలో కలవాలని చాలా తొందరగా ఉంది. 

దేవాలయ ప్రాంగణంలో అతని కోసము ఒక వార్తాహరుడు ఎదురుచూస్తున్నాడు. దేవాలయ మండపం బయటకు వచ్చిన శ్రీకరుని ముందుకు వచ్చి వినయంగా నమస్కరించాడతను.

“ప్రభూ! మహాదేవవర్మ ప్రభువులు తమను తక్షణము, ఉన్నపళంగా రమ్మనమని సెలవిచ్చారు!” అన్నాడతను.

“దేనికో….” మనసులో మాట బయటకే వచ్చేసింది శ్రీకరునికి.

“నాకు తెలియదు ప్రభూ!” అన్నాడతను వినయంగా.

శ్రీకరుడు నవ్వి తలవూపి, అశ్వాన్ని అధిరోహించి, రాజభవనం వైపు సాగాడు. మల్లికను కలవాలన్న మాట వాయిదా వేసాడు. 

 

***

మహాదేవవర్మ కొద్దిగ హడావిడిగా ఉన్నాడు.  శ్రీకరుడు అక్కడికి చేరేసరికే ప్రయాణ సన్నాహాలలో ఉన్నాడు మహాదేవుడు.

“నన్ను రమ్మనమని ప్రభువులెక్కడికో బయలుదేరారు…” అన్నాడు శ్రీకరుడు అక్కడికి చేరుతూ.

“మనం తక్షణము రాజధానికి రావాలని ప్రభువుల ఆజ్ఞ. మనము బయలుదేరుతున్నాము…” అన్నాడు మహాదేవవర్మ.

ఇద్దరూ అశ్వాలను అధిరోహించారు. 

అప్పటికే అంతరంగికులు, కొద్దిపాటి సైన్యం సిద్ధంగా ఉన్నారు. వారిరువురి ముందు వెనకల ఆ పరివారం సర్దుకుంది. నిముషాలలో వేగం సంతరించుకున్న అశ్వాలు విజయవాటిక వైపు పరుగులు తీశాయి. దాదాపు ఘడియ కాలం తరువాత వారంతా విజయవాటిక రాజప్రసాదం చేరుకున్నారు. 

వారికి అక్కడ కొంత పరివారం ఎదురొచ్చి స్వాగతం చెబుతూ భవనం లోపలికి తీసుకుపోయారు. 

లోపల అప్పటికే అక్కడ కొందరు మంత్రులు, మహారాజు శ్రీ.శ్రీ. మాధవవర్మ సమావేశంలో ఉన్నారు. 

రాజకుమారుడు, శ్రీకరుడు వెళ్ళి మాధవవర్మకు పాదాలంటి నమస్కరించారు. మహారాజు ఎంతో ఆదరంగా వారిని అక్కున చేర్చుకున్నాడు. 

వారి యోగక్షేమాలు విచారించాడు. వారి శ్రీపర్వత యాత్ర విషయాలు అడిగి తెలుసుకున్నాడాయన.

తరువాత శ్రీకరునితో “కారా! నీ ఇంద్రపురి విశేషాలేమిటి? పూజ్య గురుదేవులు క్షేమమా? ఘటికలో విద్యా సత్సంఘాలు సమంగా జరుగుతున్నవా? మా చిన్నాన్న గారి విశేషాలేమిటి? రాజమాతను కలుసుకున్నావా?” అంటూ ప్రశ్నించాడు.

“మహాప్రభూ! శ్రీపర్వత స్వామి కృపన సర్వం క్షేమము. గురుదేవులు తమకు ఆసీస్సులు తెలిపారు. తమరు తలపెట్టిన యాగం సక్రమమంగా జరగగలదని దీవించారు. ఆనాటికి రాజధానికి రాగలమని కూడా సెలవిచ్చారు. ఇంద్రపురిలో ఎల్లరూ క్షేమము. చిన్నాన్నగారు మీకు దీవెనలు తెలిపారు. రాజమాతకు ఆరోగ్య కారణాల వలన కలవలేదు వారిని. చిన్నాన్నగారు యాగసమయానికి రాజధాని చేరుకుంటామని చెప్పమన్నారు…” అన్నాడు వినయంగా. 

“మంచిది. మన ఈ అత్యవసరమైన సమావేశానికి కారణము, మనము జయించిన కళింగులు మళ్ళీ మన మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారని మన వేగుల నుంచి అవసరమైన కబురు వచ్చింది. ఈ విషయములో మీ అందరితో చర్చించటం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం…” వివరంగా చెప్పాడు మహారాజు.

కొద్ది సేపు మంత్రులు మంత్రాగము చర్చించారు. కళింగులను ఎలా అణగదొక్కాలా అన్నదే అందులో ముఖ్య విషయం. దక్షిణాపథాన విష్ణకుండినుల సామ్రాజ్యానికి, సార్వభౌమత్వానికి సవాలుగా నిలచిన రాజ్యాలు పల్లవులు, కళింగులు. మహా యోధులైన చోళులు దిగువ దక్షిణమున ప్రాబల్యం సంతరించుకొని పల్లవులను అణగదొక్కారు. ఇటువైపు విష్ణకుండినులు, అటు చోళులు విజృంబించినందున పల్లవులు బలహీనపడ్డారు. కళింగులు మాత్రం అవకాశం కోసం ఎదురుచూడటం మానలేదు. 

విష్ణకుండినులలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన రెండవమాధవవర్మ తదనంతరం దేవవర్మ రాజ్యానికి వచ్చాడు. ఆయన పాలనాకాలం అత్యంత అల్పం, బలహీనం కూడా. ఆ సమయంలో కళింగకు అనంతవర్మ రాజ్యం చేస్తున్నాడు. ఆయన కూడా పల్లవుల దండయాత్రలో రాజ్యం పోగొట్టుకొని, తిరిగి పుంజుకున్నాడు. నేటి మన మహారాజు మూడవమాధవవర్మ బలమైన రాజుగా తయారై తిరిగి పల్లవుల మీద విజయం సాధించాడు. కళింగ అనంతవర్మ కూడా బలమైన శత్రువుగా ఎదుగుతున్నాడు. పూర్వం జరిగిన యుద్ధం వారి మనసు నుంచి చెరగలేదు. వారు ఎలాగైనా మాధవవర్మను జయించాలన్న సంకల్పంలో ఉండి ఉండవచ్చని విష్ణుకుండిన మహారాజుకు అనుమానం. కాబట్టి, కళింగ అనంతవర్మను, ఎల్లప్పుడూ అతని సైన్యం కదలికలను, గమనిస్తూ ఉండే చారులు ఉన్నారు మాధవవర్మ మహారాజుకు. వారు అందించిన సమాచారం ఈ అత్యవసర సమావేశానికి కారణమైంది. 

సైన్యాన్ని అప్రమత్తం చెయ్యాలని, బలగాలను పెంచాలని నిర్ణయించాడు మహారాజు. 

సమావేశం ముగిసింది. 

కుమారుని, శ్రీకరుని తోడుగా మహారాజు అంతరంగిక మందిరానికి నడిచాడు. 

మందిరం బయట వారికి విందు ఏర్పాట్లు చేశారు పరిచారికలు. 

శరత్కాల అష్టమి వెన్నెల నేలంతా పరుచుకుంది. తోట నుంచి రాధామాధవాలు, మల్లెలు, సంపెంగలు వికసించి సహజ సువాసనలు విరజిమ్ముతున్నాయి. తెల్లని మెత్తల మధ్య, మధుర సంగీతాన్ని ఆస్వాదిస్తూ మహారాజు పుత్రునితో, శ్రీకరునితో కలిసి విందు భోజనం చేశాడు. 

“కుమారా! నీ మనస్సుకు ఏమి తోస్తోంది ఈ కళింగుల గురించి?” అడిగాడాయన పుత్రుని ఆలోచన తెలుసుకోవాలని.

“మనము యుద్ధానికి సన్నద్ధమవుదాం నాయనగారు…”  మహాదేవుడు వీరత్వము తొణికిసలాడుతుండగా అన్నాడు.

శ్రీకరునితో “కారా! నీవేమంటావు?” అన్నాడాయన. శ్రీకరునిపై గొప్ప నమ్మకం కూడా ఉంది ఆయనకు. 

“ప్రభూ! యుద్ధానికి సన్నద్ధమే, కాని మరొక ఉపాయం తోస్తున్నది…” అన్నాడు శ్రీకరుడు

“ఏమది?”

“మనము ఎన్నిమార్లు యుద్ధంలో కళింగులను గెలిచినా, వారు మరల మరల మన పై కత్తి దూస్తారు. అలా కాక మనము తమ పితృపితామహుల దారిలో ప్రయాణించటం ఉత్తమమని నాకు తోస్తున్నది. చిన్నవాణ్ణి, కాబట్టి, మీకు సలహా చెప్పగలవాణ్ణి కాదు. కానీ, మీరు ఈ విషయం ఆలోచించమని మనవి…” అన్నాడు నెమ్మదిగా.

మహారాజు సాలోచనగా, దీర్ఘంగా చూశాడు శ్రీకరుడ్ని. అటుపై మహాదేవుని చూస్తూ “మనము ఈ విషయం తప్పక ఆలోచించవలసినదే!” అన్నాడు. ఆయన అలా అంటున్నప్పుడు చిరునవ్వు పెదవులపై వచ్చింది. 

మహాదేవుడు శ్రీకరుణ్ని చూసి “మంచి మిత్రుడివే… ఏమి సలహాలు మహానుభావా!” అన్నాడు చురుకుగా…

“మరి ఇది రాజనీతిలో భాగమేగా మిత్రమా! మనము కౌటిల్యుని చదివాముగా!” అన్నాడు నవ్వు దాచుకుంటూ శ్రీకరుడు. 

అప్పటి వరకూ ఎంతో గంభీరంగా ఉన్న వాతావరణం తేలికైంది. 

మాధవవర్మ పితృపితామహులైన రెండవ మాధవవర్మ ఎందరినో జయించి రాజ్యం సుస్థిరం చేసుకున్నాడు. ఆనాడు ఆయనకు బలమైన శత్రువులు వాకాటకరాజులు. విష్ణుకుండిన రాజు వాకాటక రాజును గెలిచినా వారు తిరిగి యద్ధానికి వచ్చే ప్రమాదం తగ్గలేదు. అందుకని రెండవమాధవవర్మ ఆ యుద్ధానంతరం వాకాటక యువరాణిని వివాహం చేసుకున్నాడు. దానితో దక్షిణాపథమంతా విష్ణుకుండినుల ఏలుబడిలోకి వచ్చింది. వాకాటకరాజుల నుంచి యుద్ధ భయం తొలిగింది. 

శ్రీకరుడు అదే విషయం మాహారాజుకు నేడు గుర్తుచేశాడు. కళింగులను పూర్వమే గెలిచినా, కళింగ అనంతవర్మ విష్ణుకుండినుల మీద విజయం సాధించే వరకూ నిద్రపోడు. ఆయన బలమైన రాజుగా తయారై ‘దేవరాష్ట్రప్రభువు’ అన్న బిరుదు కూడా తీసుకున్నాడు, ఈ మధ్యనే. విష్ణుకుండినులకు పక్కలో బల్లెంలా తయారవుతున్నాడు.

అతని నుంచి ఈ నిరంతర యుద్ధ భయం తొలగించుకోవాలంటే వారితో వియ్యం ఉత్తమం. బలమైన విష్ణకుండినులతో సంబంధం కళింగులు కాదనరు. రాజులు, రాజ్యాల మధ్య వివాహం రాజనీతిలో అత్యంత ముఖ్యమైనది. అది విష్ణుకుండినుల కంటే ఎవరికి బాగా తెలుసు? 

మహారాజు ఆ సాయంత్రం పుత్రులతో గడిపి, విశాంత్రి మందిరానికి వెళ్ళిపోయాడు. యువరాజును, శ్రీకరుని ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పి, మరునాడు ఉదయం మంత్రులతో సమావేశంలో కలవమని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. 

ఆయన వెళ్ళగానే మహాదేవవర్మ శ్రీకరునితో

“కళింగ యువరాణి గురించి నీకెలా తెలిసింది?” అడిగాడు

“అదేమి ప్రశ్న మిత్రమా? నేను తమ అంతరంగికుణ్ని. మీకు ఏది మంచిదో సదా ఆలోచించే వాణ్ని. పైపెచ్చు, మీ చారుల విభాగపు అధిపతిగా అది నా బాధ్యత…” అన్నా, చిలిపితనం అతని నవ్వును దాచలేకపోయింది. 

“యుద్ధం చెయ్యమంటే పెళ్ళి సంబంధాలు చూస్తున్నావు…నీ హృదయమెవరో జవరాలు దోచినట్లున్నది…” అన్నాడు మహాదేవుడు.

“నేను మీ క్షేమము వాంఛిస్తుంటే, మీరు నన్ను పరిహాసాలాడుతున్నారు…” చిలిపిగా అంటున్న అతనికి కళ్ళ ముందు మల్లిక కదలాడింది.

“బాగు! బాగు! మనము వీరులము, యుద్ధమే ఉత్తమం!” అన్నాడు గుంభనంగా, మహాదేవవర్మ.

“అవునవును…ప్రేమ యుద్ధము ఉత్తమం, నేటి కాలంలో!” శ్రీకరుడు ఉడికిస్తూ అన్నాడు.

“నాకు కాదు, ముందు నీకు వివాహం చెయ్యమని నాయనగారికి రేపు నే చెబుతా!” 

“సరే…మీ మాట కాదనులే!”

“ఓహో! అయితే ఎవరినో వరించావన్నమాట. ఎవరో ఆ అలివేణి.. మాకు చూపుతావా…” 

“మీకు కాక ఎవరికి చెప్పగలను? ఆ సమయం వచ్చినప్పుడు చూపుతాను. ప్రస్తుతం ఎదో అలా అలా చూపులతో గడుపుతున్నా…”

“అదీ.. పాపమీ రాచకార్యాల మధ్య వెన్నెల నీకు విరహం పెంచుతోంది. నాయనగారితో కుదరదని చెప్పి వెళ్ళి  చూసిరా నీ ప్రియురాలిని…” మరింతగా ఎక్కిరిస్తున్నాడు మహాదేవవర్మ. 

శ్రీకరునికి నవ్వు పెదవులపై నుంచి కళ్ళ లోకి ప్రాకింది. ఆ వెన్నెల, ఆ సంగీతము, విందు, తోట నుంచి వస్తున్న సువాసనలు… కృష్ణా నదిపై నుంచి వస్తున్న చల్లటి గాలి అతనికి మత్తు కలిగించాయి. 

మిత్రులిద్దరూ ఆ రాత్రి అలా ముచ్చటిస్తూ ఎప్పటికో నిద్రపోయారు. 

***

కళింగ దేశం – రాజపురి – మహారాజు మందిరం – శరత్కాలం
“జయము జయము… 
వీర సూర పరాక్రమ ధీరా!
ఆశ్రిత శిష్ట జనపాలక, 
దేవరాష్ట్ర ప్రభు బిరుదాంకితా! 
కరుణా పరిపాలకా!
కళింగరాజ్యాధిపతీ!
శ్రీ శ్రీ శ్రీ అనంతవర్మ మహారాజు…
జయీభవ! విజయీభవ!!”

వందిమాగధుల స్తోత్రం చేస్తుండగా కళింగాధీసుడు మందిరంలోకి అడుగు పెట్టాడు. 
అప్పటికే అక్కడ వారి మంత్రులు, సైన్యాధక్షుడు ఉన్నారు. అనంతవర్మ రాగానే వారు గౌరవంగా లేచి నిలబడి ప్రభువుకు స్వాగతం పలికారు. 
ప్రభువులు మందిరంలోనికి వచ్చాక తలుపులు మూయబడినాయి.  అది రహస్య సమావేశం.
అనంతవర్మ అందరి యోగక్షేమాలు అడిగాడు. అనంతరం వారి సమావేశ ముఖ్య విషయానికి వచ్చారు.
“మన ప్రక్కనే ఉన్న ఈ మాధవవర్మను మనము వదిలి పెట్టకూడదు. ఆయన వద్ద మన రాజ్య భాగం ఉంది. అది తిరిగి సంపాదించే వరకూ నాకు నిద్ర పట్టదు…” అనంతవర్మ ఆ మాటలంటున్నప్పుడు, ఆయన కళ్ళ ఎర్రజీఱలు మిగిలిన వారు స్పష్టంగా చూశారు.
ప్రధానమంత్రి గొంతు సవరించుకొని “ అవును ప్రభూ! సమయము కోసము ఎదురు చూద్దాం. వారి ఏమరపాటు మనము వాడుకుందాం…” అన్నాడు. 
అనంతవర్మ సైన్యాధక్షునితో “మన సైన్యాన్ని మనము నెమ్మది లెక్కన పెంచుకుందాము. ఎలాంటి హడావిడి బయటకు కనపడకుండా! మళ్ళీ హడావిడి చేస్తే వారు గమనిస్తారు…” అన్నాడు. 
అందరూ అవునన్నట్లుగా తలలు ఊపారు. 
“మన ఈ సమావేశము రహస్యంగా ఉంచండి. బయటకు పొక్కకూడదు…” అన్నాడు మంత్రివర్యులు. 
ఈ సమావేశములో నిర్ణయించుకున్న నిర్ణయాలు విష్ణుకుండిన మాహారాజు మాధవవర్మకు మరుసటి రోజుకు అందచెయ్యబడ్డాయి. 
అది ఆయనను అప్రమత్తం చేసింది..

***

ఎంత ఆలస్యంగా నిద్రించినా ఉదయమే లేవటం శ్రీకరుని అలవాటు. 

అతను ఉదయం కొంత సేపు కర్రసాము, కొంత సేపు కుస్తీపట్లు సాధన చేస్తాడు. వంటికి నూనె రాసుకొని అభ్యంగస్నానాంతరం, పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేస్తాడు. తన ప్రియమైన అశ్వం వలుకను తీసుకొని కొంతసేపు విహారాని వెడుతాడు. లేదంటే నది ఒడ్డున తిరుగుతాడు. 

చారులకు మాత్రమే తెలిసన కొన్ని రహస్య ప్రదేశాలలో ఏం జరుగుతోందో తెలుసుకుంటాడు. తాను ప్రతి దినం అన్నీ స్వయంగా చుసుకుంటాడు, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంటారు. 

అలా తిరుగుతూ నగర రక్షకులు ఎలా ఉన్నారో విచారిస్తాడు. వారి కార్యాలయాలకు హఠాత్తుగా వెళ్ళి వారి పనితీరు చూసి వస్తాడు. శ్రీకరుడు నియమించిన చారులు వివిధ వేషాలలో, వివిధ ప్రదేశాలలో ఉంటారు. వారు పంపే సందేశాలు కూడా చాలా రహస్యంగా ఉంటుంది. 

ఒకరోజు ఉదయం దేవాలయ ప్రాంగళంలో దేవునికి ముడుపులు అమ్మే కొట్టు వద్ద ముడుపులు బేరం చేస్తున్నాడు. ఆ ముడుపులు అమ్మే అతను ఒక వేగు. అతను శ్రీకరునికి చాలా సమాచారం అంద చేసాడా రోజు. 

“ఈ ముడుపులు దండ స్వామికి సమర్పించాలి…బాగున్నవి, ఇవి ఎక్కడ్నుంచి తెప్పించావు…” అడిగాడు శ్రీకరుడు.

“ఇవి ఉత్తరం వైపు నుంచి వచ్చాయి దేవరా! మనకు ఇవి అలభ్యములు. మన దేశ ప్రజలకు ప్రత్యేకంగా ఉండాలని తెప్పించాను. కాని చూడండి, రెండు పువ్వలిందులో మొగ్గలుగానే ఉన్నాయి. ఇంకా పుష్పించ సమయం ఉన్నది…”

“ఎంత కాలము పడుతుందో?”

“రెండ్నాలు పట్టవచ్చు…”

“పర్వాలేదు వాటిని తీసివేసి ఇవ్వు…”

“సరే దేవరా…” అతను ముడుపుల దండ ఇచ్చాడు.

శ్రీకరుడు కోవెలలోకి నడిచాడు. ఆ వేగుకు అందవలసిన ఆజ్ఞ అందింది. ఉత్తరం వైపున రాజ్య విద్రోహకరమైన ఇద్దరు శత్రువులు కన్ను వేశారు. వారిని తొలగించమని ఆజ్ఞ ఇచ్చి శ్రీకరుడు సాగిపోయాడు.  

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.