జీవన ప్రభాతం-కరుణకుమార కథలు

   -అనురాధ నాదెళ్ల

  ఈ నెల మనం మాట్లాడుకోబోతున్నది సమాజంలో తరతరాలుగా దోపిడీకి గురవుతున్న నిరుపేదల, నిస్సహాయుల గురించిన కథల పుస్తకం గురించి. ఎవరికీ అక్కరలేని, ఎవరికీ పట్టని వీరి జీవితాల్లోకి తొంగిచూసి వారిపట్ల సహానుభూతితో, అవగాహనతో రాయబడినవీ కథలు. 

‘’కరుణకుమార’’ పేరుతో కీ.శే. కందుకూరి అనంతంగారు దాదాపు డెభ్భై, ఎనభై సంవత్సరాల క్రితం రాసిన కథల సంపుటి ఈ ‘’కరుణకుమార కథలు’’. 

ఇందులో కథా వస్తువు ఇప్పటికీ సమాజంలో ఉన్నదే. గ్రామాల్లోని క్రింది స్థాయి ప్రజల అవిద్య, దారిద్ర్యం, అమాయకత్వం, వారు ధనికులు, గ్రామపెద్దలూ అయిన వారి చేతుల్లో అనుభవిస్తున్న పీడన మనందరికీ తెలుస్తూనే ఉంది.

ఇప్పటి సమాజంలో డబ్బు, కులం ఎంతగానో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నది కాదనలేని కఠోర సత్యం. ఇది కొత్త కాదు. ఈ అంశాలు తరం తర్వాత తరం మనుషుల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉన్నాయి.  మనుషులు పెద్ద, చిన్న కులాలుగా, పేదలుగా, ధనికులుగా ఎన్నెన్నో వర్గాలుగా చీలిపోయి ఉన్నారు. ధన బలం, కులం బలం ఉన్న వాళ్ల చేతుల్లో అవి లేనివాళ్లు పొందుతున్న అవమానం, దోపిడీ నిత్యం చూస్తున్నాం. 

ఈ పుస్తకంలో దోపిడికి గురవుతున్న నిస్సహాయ ప్రజల పట్ల రచయిత చూపిన ప్రేమ, కరుణ గొప్పవి. రచయిత ఉద్యోగరీత్యా గ్రామీణ పేదల జీవితాలను అతి దగ్గరగా చూసినవారు. వారిపైన జరిగే దుర్మార్గాలను కళ్లకు కట్టినట్టు చూబించారు. 

అనంతం గారు కీ.శే. ఉన్నవ లక్ష్మీనారాయణగారి నవల ‘’మాలపల్లి’’ ని చదివి ఉత్తేజితులయ్యారు. హరిజనోధ్ధరణ, గాంధీగారి అహింసా సిధ్ధాంతము, సహాయ నిరాకరణోద్యమం వీరిని ప్రభావితులను చేసాయి. ప్రతి సంవత్సరం జనవరి 30 వ తేదీన గాంధీగారి సంస్మరణగా ‘’హరిజనోధ్ధరణ దినం’’ పాటించేవారు. గ్రామ ప్రజల సౌభాగ్యమే దేశసౌభాగ్యమని నమ్మినవారు ఈ రచయిత. గ్రామ ప్రజల జీవితాన్ని ఇతివృత్తంగా ‘’చిన్నకథ’’ను సాహిత్యలోకానికి మొట్టమొదట పరిచయం చేసినవారీ రచయిత. ఈ వివరాలన్నీ వారి కుమారుడు శ్రీ ఉమాశంకర రావు గారు ముందుమాటలో తెలియజేసారు. 

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వారు ఈ కథలను 1984లో ప్రచురించారు.

కథల్లోకి వెళ్తే, ముందుగా ‘’కొత్త చెప్పులు’’ ఒక గ్రామంలోని మోతుబరి రైతు చిన్నపరెడ్డి కథ. అతను కులం బలంతోనూ, ధనబలంతోనూ తన మాటను గ్రామంలో చెల్లించుకుంటూ వస్తున్నవాడు. ఆదిగాడు గ్రామ మాదిగ పెద్ద. అతను కలరా వచ్చి చనిపోవటంతో అతని భార్య నరిసి, పిల్లలు చెయ్యగలిగిన పనులు చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నారు. 

చిన్నపరెడ్డి తన చెప్పుల్లో ఒకటి కుక్క కొరికెయ్యటంతో కొత్త చెప్పులు తయారుచెయ్యమని నరిసికి పురమాయిస్తాడు. వారం రోజులు గడువు అడుగుతుంది నరిసి. వారం గడిచినా చెప్పులు తేలేదన్న కోపంతో ఉన్న చిన్నపరెడ్డి దగ్గరకి ఆ మధ్యాహ్నం నరిసి కొత్తచెప్పులను తీసుకొస్తుంది. ఆలస్యానికి కారణమడిగినపుడు కొత్తచెప్పులు కరవకుండా వాటికి ఆముదం పూసే ప్రయత్నంలో తన దగ్గర ఆముదం కొనేందుకు డబ్బు లేకపోయిందనీ, కోమటికొట్లో బతిమాలి ఆముదం చుక్క తెచ్చి చెప్పులకు పట్టించి తెచ్చేసరికి ఆలస్యమయిందని ఆమె చెబుతుంది. 

ఆగ్రహించిన చిన్నపరెడ్డి చేతిలోని కర్రతో ఆమె మెడ మీద బలంగా కొడతాడు. ఆ దెబ్బకి ఆమె ఆ క్షణానే చనిపోతుంది. ఆమెను తాను చంపినట్టు ఎవరూ చూడకుండా ఇంటి లోపల దాచిపెట్టి ఆ రాత్రి ఆమె శవాన్ని ఊరి బయట చెరువులో పడేయిస్తాడు. ఆమె పిల్లలు అనాథలవుతారు.

ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. కొత్తచెప్పులు చిన్నపరెడ్డి కాళ్లని కరుస్తాయి. ఆ పుళ్లను ముందు కొంత నిర్లక్ష్యం చేసి దాన్ని పెద్ద పుండుగా చేసుకుంటాడు. ఈలోపు ఇంట్లో ఉన్న బలమైన ఎద్దు అకస్మాత్తుగా చనిపోతుంది. దానిని బయట పడేసేందుకు మాదిగలకు కబురు పెట్టినా ఎవ్వరూ రారు. అప్పటికే మాదిగవాడలో నరిసి చావుకి కారణం తెలిసిపోతుంది. వారు కక్ష కట్టి తమకు జరిగిన అన్యాయానికి గ్రామపెద్దలకు శిక్ష వెయ్యాలని సంకల్పించుకుంటారు. చివరికి ఎద్దు శరీరం కుళ్లిన స్థితిలో గ్రామంలోని అగ్రకులాల వారితో సహా మిగిలిన వారు కూడా తలో చెయ్యి వేసి ఎద్దుని పూడ్చి పెడతారు. 

చిన్నపరెడ్డి కాలిపై గాయం మరింత పెరుగుతూ ఉంటుంది. ఆఖరికి లేవలేని స్థితిలో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ కాలు తీసివెయ్యవలసిన పరిస్థితి గురించి డాక్టర్ చెబుతాడు. మధుమేహంతో ఉన్న చిన్నపరెడ్డికి ఎలాటి మత్తు ఇవ్వకుండానే కాలు తీసే ప్రయత్నంలో ఆ బాధలో చిన్నపరెడ్డికి నరిసి ముఖం వికారపు నవ్వుతో కనిపిస్తుంది. చిన్నపరెడ్డి చనిపోతాడు. 

ఈ కథ చదువుతున్నప్పుడు శ్రీ చింతకింది శ్రీనివాసరావు గారు రాసిన ‘’దాలప్ప తీర్థం’’ కథ గుర్తు రాక మానదు. అక్కడా అట్టడుగు వర్గపు జనం తమకు జరిగిన అన్యాయానికి ప్రతిగా గ్రామం పట్ల నిరశనను మూకుమ్మడిగా ప్రకటిస్తారు.

‘’పోలయ్య’’ కథలో పోలయ్య అనే మాల కులస్థుడు ఒక వైదీకి బ్రాహ్మణుడు వెంకటశాస్త్రికి అర్థరాత్రి సమయంలో రైల్వే స్టేషను నుంచి గ్రామానికి బండి కడతాడు. అదీ వెంకటశాస్త్రి బలవంతం మీద. శాస్త్రి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు దేశాటన చేసి వస్తాడు. అస్పృశ్యతా నివారణ లాటి ఉద్యమాల పట్ల తీవ్ర నిరసన ఉన్నవాడాయన. పంచములు హిందూ మతం వదిలి ఇతర మతాలను ఆశ్రయిస్తున్నారని విని సంతోషిస్తాడు.

బండి ప్రయాణంలో పోలయ్య మాల కులస్థుడని అర్థం చేసుకుంటాడు. తనలాటి సనాతనవాది ఆ బండిలో ప్రయాణించి మైల పడిపోయినట్టు తలచి, ఆగ్రహంతో ఇల్లు చేరేక పోలయ్యకి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. 

తెలవారుతూనే గ్రామం చేరి, ఊరిపెద్ద చెంచునాయుణ్ణి పిలిపించి పోలయ్య తన వంటి వైదీకి పండితుడికి బండి కట్టి తప్పు చేసాడని, తగిన శిక్ష వెయ్యమని చెబుతాడు. కాళ్లు చేతులు కట్టేసి పోలయ్యకు శిక్ష వేసే క్రమంలో అతను చటుక్కున తాను క్రైస్తవ మతస్థుడినని చెబుతాడు. మాలలు హిందూ మతం వదలటం అనేది ఈ సనాతన ధర్మాన్ని ఆచరించేవారికి ఇష్టమైన పని అన్న ఆలోచన పోలయ్యకు తోస్తుంది. అంతో ఇంతో చదువు, లోకజ్ఞానం ఉన్న పోలయ్య చిన్న అబధ్ధంతో ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు. అగ్ర కులాలు మిగిలిన కులాలవారి మీద చూపే దౌర్జన్యం ఈ కథలో స్పష్టంగా చూడవచ్చు.

‘’పశువుల కొఠం’’ కథలో రొబ్బయ్య, పెంచెలి ఒకరినొకరు ఇష్టపడతారు. రొబ్బయ్య ఒక ఆంగ్లేయాధికారి దగ్గర గుర్రపు శాలలో పనివాడు. తమ పెళ్లికి గుర్రం మీద ఊళ్లో ఊరేగింపుగా వెళ్లాలని, దానికి తనను అభిమానించే తన యజమాని సమ్మతించాడని రొబ్బయ్య పెంచెలితో చెబుతాడు. ఊళ్లో మోతుబరి రాయుడు పెంచెలిపై మోహం పెంచుకుంటాడు. ఆమెను స్వంతం చేసుకుందుకు అనేక ఉపాయాలు పన్నుతాడు. కానీ పెంచెలి అతన్ని నిరాకరిస్తుంది. తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ఒక మాలవాడి కూతురు తనను కాదన్నదన్న కోపంతో ఆమెపై లేనిపోని నిందలేసి రొబ్బయ్య మనసు విరిగిపోయేలా చేస్తాడు. ఒక తక్కువ కులం వాడు పెళ్లిలో గుర్రం పైన ఊరేగింపుగా వెళ్లటానికి వీల్లేదన్న రాయుడి మాటకి ఊరు ఊరంతా సమర్థన తెలుపుతుంది.  

పెంచెలి తమ పెళ్లి సమయంలో గుర్రంపై ఊరేగింపు విషయంగా గ్రామమంతా రకరకాలుగా మాట్లాడుతోందని, ఏదో ప్రమాదం రాబోతోందని గ్రహించి రొబ్బయ్యతో మాట్లాడేందుకు వెళ్తుంది. అప్పటికే రొబ్బయ్య ఊళ్లో వాళ్ల మాటలకి మనసు విరిగి పెంచెలిని అవమానించి ఊరు విడిచి వెళ్లిపోతాడు. పెంచెలి మనసు చెదిరి పిచ్చిదవుతుంది. 

గ్రామాల్లో ధనబలంతో తాము ఏదైనా చెయ్యగలమన్న అహంకారంతో బడుగు జీవితాలని అతలాకుతలం చేసే దుర్మార్గపు పెద్దలను ఈ కథల్లో చూస్తాం. ఇలాటి పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదన్నది ఎవరూ కాదనలేనిది. ప్రపంచం ముందుకెళ్తుందో, వెనక్కి నడుస్తోందో స్పష్టం చేసే మానవ ప్రవృత్తి!

‘’కయ్య కాలువ’’ కథలో కొండదు నిరుపేదవాడైన మాల కులస్థుడు. ప్రభుత్వం ఒక చిన్న భూమి వనరును అతనికి పట్టా ఇస్తుంది. ఆ చిన్న కయ్యను తన భూమిలో కలుపుకోవాలని ధనికురాలైన లక్ష్మమ్మ ఆలోచన చేస్తుంది. ఆమె బిడ్డలు లేని వితంతువు. తన చెల్లెలి కొడుకు రామిరెడ్డి ఆమె ఆస్తి భవిష్యత్తులో తనదేనన్న ఆశతో ఉంటాడు. దానికోసం లక్ష్మమ్మ కి అనుకూలంగా ఉంటాడు. కొండడి భూమిని ఆక్రమించుకుందుకు లక్ష్మమ్మ వేసిన ఎత్తును సమర్థిస్తాడు. కరణం బసవయ్యతో మాట్లాడి కొండడి పొలానికి నీరు అందే మార్గం లేకుండా చేస్తాడు. 

లక్ష్మమ్మ పొలంలోని ధాన్యాన్ని కొండడు దొంగిలించాడని కేసుపెట్టి, అతని ఇంటిని ధ్వంసం చేస్తారు. లక్ష్మమ్మ అధికారం, డబ్బు ముందు తాను నిలవలేనని తెలిసీ అనేకసార్లు ఆమె చేసే ఆగడాలను న్యాయంగా, సహనంగా ఎదుర్కొంటూ వస్తాడు. కానీ చివరికి తనపై దొంగతనం మోపటం, కష్టపడి పండించుకున్న పంటను అగ్నికి ఆహుతి చేయటంతో నిస్సహాయంగా కుప్పకూలిపోతాడు కొండడు. 

ఎలాటి ఆధారం లేని ఒక పేదవాని జీవితం పైన జరిపిన ఈ దౌర్జన్యం చదువుతుంటే కన్నీరు రాకమానదు. ఈ జీవితాలను ఎవరు ఉద్ధరిస్తారు? ఇలాటివారికి జీవించగలిగే ఉపాయమేం ఉంది?

‘’మొక్కుబడి’’ కథలో వెంకురెడ్డి, అతని భార్య లేకలేక కలిగిన తమ సంతానం బాలయ్య క్షేమం కోసం అంకమ్మ తల్లికి మొక్కుకుంటారు. మొక్కు తీర్చేందుకు ఇంట్లోనే మేకలను పెంచుతారు. బాలయ్యతో పాటు ఆ ఇంట పెరిగిన ఒక మేక పట్ల బాలయ్యకు అమితమైన ప్రేమ. బాలయ్యకు పది సంవత్సరాలు వచ్చాక మొక్కు తీర్చుకుందుకు వెంకురెడ్డి కుటుంబం అంకమ్మతల్లి తిరణాలకు వెళ్తారు. బాలయ్యకు తను ప్రేమగా పెంచుకునే మేకను బలి ఇవ్వబోతున్నారని తెలియదు. 

మొక్కుబడుల సమయంలో అక్కడ జరుగుతున్న హింస, రక్త ప్రవాహం ఆ పిల్లవాడిలో అమితమైన భయాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. తమ వంతు వచ్చాక మేకను బలి ఇవ్వబోతుండగా బాధతో తల్లి చెయ్యి విదుల్చుకుని ముందుకు పరుగెట్టి మేకకు అడ్దంగా నిలబడబోతాడు. కానీ అప్పటికే కత్తివేటు మేక మెడ మీద పడబోతున్నదల్లా బాలయ్య మెడ మీద పడుతుంది. 

ఇలాటి మొక్కుబడులు ప్రత్యక్షంగా చూసిన రచయిత ఈ కథను చాలా విపులంగా రాసారు. మూఢ నమ్మకాలను, ఇలాటి మొక్కుబడులను ఆయన ఖండించారు. 

‘’సేవాధర్మం’’ కథలో హాతీసింగు ఆర్మీ ఆఫీసరు. యుధ్ధభూమి నుంచి స్వంత ఊరు వచ్చి తన కొడుకు భారతదేశ స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై దానికొరకు పనిచేస్తున్నాడని భార్య ద్వారా వింటాడు. పెద్ద చదువు, అది అందించే హోదాలో కొడుకును ఊహిస్తున్న హాతీసింగు కొడుకు వైఖరికి దిగులు పడతాడు. కొడుకు తీరు తన ఉద్యోగానికి కూడా ముప్పని తెలుసు. 

ఇంతలోనే, ఊళ్లో ఉద్యమకారులను నియంత్రించేందుకు జరిపిన పోలీసు కాల్పుల్లో కొడుకు తీవ్రంగా గాయపడ్డాడన్న వార్త వింటాడు. ఆసుపత్రిలో కొడుకు ప్రమాద స్థితిలో ఉన్నాడని చెప్పిన డాక్టర్ అంతలోనే అతను మరణించాడన్న వార్తను తెలియజేస్తాడు. అదే సమయంలో హాతీసింగుకు ప్రభుత్వం నుంచి ఒక లేఖ అందుతుంది. స్వాతంత్రోద్యమంలో పనిచేస్తున్న అతని కొడుకుతో సంబంధం వదులుకోవలసిందని, లేని పక్షంలో ఉద్యోగంలోంచి తొలగిస్తామని దాని సారాంశం. కొడుకుతో సంబంధం శాశ్వతంగా పోగొట్టుకున్న హాతీసింగు నిరుత్తరుడవుతాడు.

‘’జాకీ’’ కథ జాకీ అనే పేరున్న ఒక కుక్క కథ. ఒక జమిందారుగారికి కుక్కల పట్ల ప్రీతి. ఆయన అపురూపంగా పెంచుకుంటున్న జాకీ ఒక పేద పిల్లవాడిని కరిచి, అతని మరణానికి కారణం అవుతుంది. ఆ తర్వాత జాకీకూడా అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోతుంది. దుఃఖంలో మునిగిపోయిన జమిందారు జాకీ కి ఒక స్మారక చిహ్నాన్ని కట్టించాలని ఆలోచిస్తాడు. 

తన దీవాన్ ని పిలిపించి సలహా అడుగుతాడు. ఆయన ఆ స్మారక చిహ్నానికి అయ్యే ఖర్చులో అధికభాగం ప్రజల నుంచి వసూలు చేద్దామన్న సలహా ఇచ్చి, ఆ పనికి తానే స్వయంగా పూనుకుంటాడు. జమిందారు అనుమతితో గ్రామాలన్నీ తిరిగి సమస్యలలో కూరుకుపోయి ఉన్న ప్రజల నుంచి బలవంతంగా చందాలను వసూలు చేస్తాడు. వారి సమస్యలను పరిష్కరిస్తామని చెబుతాడు. వసూలైన దానిలో కొంత తన స్వంత ఖాతాలో వేసుకుంటాడు. తీరా చందాలిచ్చిన ప్రజలకి జమిందారు నుంచి వారి సమస్యలను వారే పరిష్కరించుకోవటం మేలన్న సలహా అందుతుంది. ఇది నేటి రాజకీయ వాతావరణాన్ని గుర్తు చెయ్యక మానదు.

ఈ కథలన్నీ మన చుట్టూ జరుగుతున్నవే. పీడనకి, దోపిడీకి స్థలకాలాదులు హద్దులు పెట్టలేవన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.

కథలు చదువుతుంటే మనసు దుఃఖంతో గడ్డకట్టుకుపోతుంది. ఇలాటి వారి జీవితాలను మనముందుకు తెచ్చిన రచయితకి ఎంతటి మానవత్వపు విలువలున్నవో అవగాహనకొస్తుంది. ఈ కథలన్నీ 1936 – 50 మధ్యకాలంలో రచించినవంటే ఆశ్చర్యం వెయ్యకమానదు.

విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్ వారు ఈ పుస్తకం తీసుకురావటంలో అప్పటి సార్వత్రక విశ్వవిద్యాలయం తెలుగు భాషా రీడరు డా. శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారు ఎంతో సహాయం చేసారని ముందుమాటలో తెలిపారు. కథలన్నీ సేకరించి అందించినవారు విశ్వనాథరెడ్డిగారే.

****

Please follow and like us:

2 thoughts on “జీవన ప్రభాతం-కరుణకుమార కథలు (సమీక్ష)”

  1. కొత్త చెప్పులు కధ బావుంది. It proves the saying “wickedness will never go unpunished”…Review gave a vivid picture of the village and the atrocities committed by the so called Upper Class. Hope such scenario doesn’t exist in even in the interior parts of India.

Leave a Reply

Your email address will not be published.