కథన కుతూహలం -6
– అనిల్ రాయల్
వ్యాఖ్యానాలు vs గతమెరుపులు vs చట్రబద్ధాలు
నవలా రచయితకి ఉన్నది, కథా రచయితకి లేనిది ఏమిటి?
ప్రధాన పాత్రల జీవితాలని విస్తారంగా చిత్రీకరించే వెసులుబాటు నవలా రచయితకుంది, కథా రచయితకి లేదు. కథల నిడివి పూర్తిస్థాయి జీవితాల చిత్రీకరణకి అడ్డుపడుతుంది. అందువల్ల “కథ అను పదార్ధమును నిర్వచింపుడు” అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే “ప్రధాన పాత్ర జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ కీలక సంఘటన, దానికి దారి తీసిన పరిణామాల సమాహారం” అని చింపొచ్చు. సాధారణంగా కథల్లో ఒకే ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర జీవితంలోని కొద్ది రోజులు లేదా గంటల మీద మాత్రమే కథ కేంద్రీకరించబడుతుంది. పాత్ర నిర్మాణం కూడా ఆ మేరకే ఉంటుంది. ఏ కొద్ది కథల్నో మినహాయిస్తే ఎక్కువ శాతం కథలు ఇలాగే ఉంటాయి.
పై నిర్వచనాన్ని దృష్టిలో ఉంచుకుని – ఈ క్రింది కథాంశాన్ని కథగా మలిచే క్రమంలో ఏమేం అంశాలు పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం.
అనగనగా ఓ బాలుడు. చిన్నతనంలో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా వాడి బుర్రలో ఏవో ప్రశ్నలు మొలకెత్తాయి. వాటికి సమాధానాలు అన్వేషిస్తూండగానే దశాబ్దాలు దొర్లిపోయాయి. ఆ అన్వేషణే వాడి జీవితాన్ని రూపుదిద్దింది; పెద్దయ్యాక వాడు ఏమయ్యేదీ నిర్దేశించింది. ఆఖరుకి, నడివయసులో, అతనికి సమాధానాలు లభించాయి.
ఈ ఇతివృత్తంతో రెండు విధాలుగా కథ రాయొచ్చు.
మొదటి పద్ధతిలో – కథానాయకుడి బాల్యప్రాయంలో కథ మొదలు పెట్టి, సంఘటనలు జరిగిన కాలక్రమంలో (chronological order) చెప్పుకుంటూ పోవటం. అయితే ఇందులో రెండు సమస్యలున్నాయి.
1: ఎత్తు పల్లాలు, ఎటువంటి మలుపులూ లేని తిన్నని నున్నని రహదారిపై సాగే ప్రయాణంలా ఈ కథనం నడుస్తుంది. కథలో కొన్ని కీలకమైన వివరాలు తొక్కిపట్టి అదను చూసి బయటపెడితేనే పాఠకుడిలో ఉత్సుకత కలుగుతుంది, ఉత్కంఠ పుడుతుంది. లీనియర్ విధానంలో చెప్పే కథల్లో ఇలా వివరాలు తొక్కిపట్టే అవకాశం పెద్దగా ఉండకపోవటంతో అవి నీరసంగా సాగుతాయి.
- బాల్యం నుండి మొదలు పెట్టి కథానాయకుడు నడివయసుకి చేరేవరకూ చెప్పుకుంటూ పోతే కథ పొడుగు పెరిగిపోతుంది. అంతకంటే ముఖ్యంగా, అది మనం చెప్పుకున్న కథ నిర్వచనంలోకి ఇమడదు.
రెండో పద్ధతిలో – కథని ముగింపుకి వీలైనంత దగ్గర్లో మొదలుపెట్టాలి. అంటే, కథానాయకుడి ప్రశ్నలకి సమాధానాలు లభించబోయే దశలో అన్నమాట. ఆ తర్వాత సందర్భానుసారం నేపధ్యాన్ని విడమరుస్తూ పోవాలి. అలా సమాచారాన్ని తొక్కిపట్టటం వల్ల కథకి ఉత్కంఠ జతపడుతుంది. లీనియర్‌గా కాకుండా ముందువెనకలుగా, గతమెరుపులు మెరిపిస్తూ చెప్పటం వల్ల పొరలు పొరలుగా రూపుదిద్దుకుని, కథ లోతు పెరుగుతుంది. పాత్రల్ని లోతుగా చిత్రీకరించేంత నిడివి లేకపోవటం కథలకున్న పరిమితి అని మొదట్లో చెప్పుకున్నాం. ఆ లోటుని కొంతలో కొంత ఈ లోతుద్వారా పూడ్చేయొచ్చు.
గతంలో జరిగిపోయిన సంఘటనలు చెప్పటానికి – ఆ విధంగా కథ లోతు పెంచటానికి – ప్రధానంగా రెండు మార్గాలున్నాయి: వ్యాఖ్యానం (exposition) మరియు ఫ్లాష్‌బాక్. గతించిన విషయాలు ‘చెబితే’ అది వ్యాఖ్యానం అవుతుంది. చాలా కథల్లో పాత్రలు గతానుభవాలో, ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలో నెమరేసుకోవటం కనిపిస్తుంది. ఇవన్నీ వ్యాఖ్యానం కోవలోకే వస్తాయి. చాలామట్టుకు కథల్లో గతాన్ని చెప్పటం ఇలాగే జరుగుతుంది. చాలామంది పాఠకులు (కొందరు కథకులు కూడా) ఇలా చెప్పటాన్నే ఫ్లాష్‌బాక్‌గా పొరబడతారు. ఫ్లాష్‌బ్యాక్ ద్వారా రచయిత గతంలో జరిగిపోయిన సంఘటనలు చెప్పడు; ‘చూపుతాడు’. వ్యాఖ్యానానికి, ఫ్లాష్‌బాక్‌కి ఉన్న ముఖ్యమైన తేడా అది.
వ్యాఖ్యాన పద్ధతిలో గడచిపోయిన కథ చెప్పటంలో ఓ వెసులుబాటుంది. ఇది సహజంగా అనిపిస్తుంది. నిజజీవితంలో ఎవరైనా గడచిన విషయాలు చెప్పాలంటే ఇలాగే చేస్తారు. కాబట్టి పాఠకులు వ్యాఖ్యానాన్ని అనుసరించటం తేలిక. అదే ఫ్లాష్‌బ్యాక్ విధానంలోకొచ్చేసరికి – గడచిపోయిన సంఘటనలు, సన్నివేశాలు పాఠకుడి కళ్లకి కట్టేలా ‘చూపాలి’. అంటే, ప్రస్తుతం నడుస్తున్న కథని కాసేపు ఆపేసి పాఠకుడిని గతంలోంకి లాక్కుపోవాలి. నిజజీవితంలో ఎవరూ ఇలా గతంలోకి ప్రయాణించటం జరగదు. కాబట్టి ఈ విధమైన కథనం పాఠకులని గందరగోళపరిచే అవకాశం ఉంది. ఈ కారణంవల్ల కొందరు కథకులు ఫ్లాష్‌బ్యాక్స్ వాడకాన్ని ఇష్టపడరు. అవి కథాగమనానికి అడ్డొస్తాయని వాళ్ల అభిప్రాయం. అందులో నిజం లేకపోలేదు. అంతమాత్రాన వాటికి ఆమడ దూరంలో ఉండాల్సిన అవసరమూ లేదు. ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే ఫ్లాష్‌బాక్స్ పండుతాయి. సరిగా రాస్తే ఇవి వ్యాఖ్యానం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.
– కథలోకి ఫ్లాష్‌బ్యాక్ ఊహించని చుట్టంలా ఉన్నట్లుండి ఊడిపడకూడదు. ప్రస్తుతం నడుస్తున్న కథలో ఓ బలీయమైన కారణమేదో గతాన్ని తట్టి లేపాలి. వర్తమానం నుండి గతానికి తరలటం అతి సహజంగా జరగాలే తప్ప బలవంతాన పాఠకుడి నెత్తిన రుద్దినట్లుండకూడదు. అలాగే, గతం నుండి వర్తమానానికి మరలటమూ అంతే సహజంగా ఉండాలి. నేపధ్యంలో చెప్పాల్సింది ఐపోయింది కాబట్టి, చెప్పటానికి ఇంకేమీ లేదు కాబట్టి తటాలున ఫ్లాష్‌బ్యాక్ ముగించేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కథనంలో కుదుపులొస్తాయి.
– కథ మొదలెట్టీ పెట్టగానే పాఠకుల ముఖాన రింగులరాట్నం తిప్పేసి ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఈడ్చుకుపోకూడదు. వాళ్లు కాస్త కుదురుకునే సమయమీయాలి. సాధారణంగా, ఫ్లాష్‌బ్యాక్‌ని ఎంత ఆలస్యంగా మొదలు పెడితే అంత ప్రభావశీలంగా వస్తుంది.
– ఫ్లాష్‌బ్యాక్ ఎప్పుడు ముగించాలనేదీ ముఖ్యమే. ఫ్లాష్‌బ్యాక్ పూర్తైన వెంటనే రెండు మూడు వాక్యాల్లోనే కథ పూర్తైపోకూడదు. అలాగే, గతమెరుపుల ముందు అసలు కథ వెలవెలపోకూడదు. ఫ్లాష్‌బ్యాక్ అనేది ఉపకథ మాత్రమే. అది గొప్పగా ఉండటం ముఖ్యమే కానీ, అది ప్రధాన కథని మింగేయకూడదు. అసలు కథ పిసరంతే ఉండి ఫ్లాష్‌బ్యాక్ దృశ్యాలే ప్రధానమయ్యాయంటే, ఫ్లాష్‌బ్యాకే అసలు కథన్న మాట. అప్పుడు దాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లా కాకుండా ప్రధాన కథలానే చెబితే మెరుగు.
– కథనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి మారటమూ, తిరిగి అందులోనుండి బయటకు రావటమూ పాఠకుడు తేలిగ్గా గమనించేలా ఉండాలి. లేకపోతే వాళ్ల బుర్ర తిరుగుతుంది.
– ఒక ఫ్లాష్‌బాక్‌లో మరో ఫ్లాష్‌బ్యాక్ విప్పే ప్రయోగానికి వీలైతే దూరంగా ఉండండి.
ఈ వ్యాసం మొదట్లో ఉదాహరణగా రాసిన ఇతివృత్తం నా తొలికథ ‘నాగరికథ’కి ఆధారం (goo.gl/H3lAsq). అది నేను ఫ్లాష్‌బాక్ వాడిన ఒకే ఒక కథ. అందులో పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవటం మీరు గమనించొచ్చు. ఆ కథలో ఒక ఫ్లాష్‌బ్యాక్‌లో మరో ఫ్లాష్‌బ్యాక్ చెప్పాల్సిన అవసరం పడింది. అలాచేస్తే పాఠకులు గందరగోళానికి గురయ్యే అవకాశముంది కాబట్టి మొదటి గతాన్ని ఫ్లాష్‌బ్యాక్ రూపంలోనూ, దానిలోపలి గతాన్ని వ్యాఖ్యానం రూపంలోనూ చెప్పేసి నెట్టుకొచ్చాను. ఆ కథకి మొదటి డ్రాఫ్ట్ రాశాక తిరిగి చదివితే ఏదో లోపం కనబడింది. మరోమారు చదివాక కానీ అదేంటో అర్ధం కాలేదు: ఆ కథలో ఫ్లాష్‌బ్యాక్ మెరుపులు ఎక్కువైపోయాయి, పతాక సన్నివేశాలు తేలిపోయాయి. ఆ లోపం సరిచేయటానికి కథ ముగింపుని తిరగరాయాల్సొచ్చింది. ‘నాగరికథ’ ఆఖర్లో ఉండే ట్విస్ట్ అలా వచ్చిచేరింది.
ముక్తాయింపు:
కొన్ని కథల్లో మొదట్లో రెండు పేరాగ్రాఫులు, చివర్లో మరో రెండు పేరాగ్రాఫులు వర్తమానంలోనూ; మిగిలిందంతా ఫ్లాష్‌బ్యాక్‌గానూ నడవటం మీరు గమనించే ఉంటారు. సాధారణంగా ఇలాంటి కథల్లో ఆ మొదలు, చివర కలిపి కథ నిడివి పెంచటం తప్ప ప్రత్యేక ప్రయోజనమేమీ ఉండదు. ఇక్కడ ‘రెండు పేరాగ్రాఫులు’ అనే నిడివి కారణంగా అవి అనవసరమైనవిగా నేను తీర్మానించటంలేదని గ్రహించగలరు. పాఠకుడు కథలో కుదురుకోకముందే ఫ్లాష్‌బ్యాక్ మొదలైపోవటం, అది పూర్తైన వెంటనే కథ కూడా ఐపోవటం – ఈ రెండూ మాత్రమే నేనిక్కడ ఎత్తిచూపదలచుకున్నది.
అయితే, కొన్ని రకాల కథలు ఇలా రాయాల్సిన అవసరం పడొచ్చు. వర్తమానంలో కథ మొదలు పెట్టి, వెంటనే గతంలోకి జారుకుని, చివర్లో అందులోనుండి బయటికొచ్చేయటం. ఇందులో కథంతా గతంలోనే జరుగుతుంది. వర్తమానంలో జరిగేదానికి ఆ గతపు గాధతో ఏదో లంకె ఉంటుంది. దీన్ని framing the story అంటారు. దీన్ని ‘కథని చట్రబద్ధం చేయటం’ అని మనం తెనిగిద్దాం. ఇది ఫ్లాష్‌బ్యాక్ విధానం కిందకి రాదు. ఈ చట్రబద్ధీకరించటం అనేది పురాణాలంత పాత టెక్నిక్. ఒకసారి మహాభారతాన్ని గుర్తుచేసుకోండి.
****
ఈ వ్యాసాల్లో నా సొంతవే కాకుండా ఇతరుల కథలనీ ఉదహరించమని హితుల, సన్నిహితుల సూచన. ఆ పని చేయలేకపోవటానికి పలు కారణాలున్నాయి. తెలుగులో గొప్ప కథలు లెక్కలేనన్ని వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. కానీ వాటిలో నా అభిరుచికి సరిపడేవి తక్కువ. క్రైమ్, థ్రిల్లర్, డిటెక్టివ్, ఫాంటసీ, హారర్ వగైరా ‘లొల్లాయి’ కథలకే నా ఆసక్తి పరిమితం. ఆ తరహా కథలు – అందునా నాణ్యమైనవి – తెలుగులో దాదాపుగా రావటం లేదు. అస్థిత్వ వాదాల కథల్లాంటి ‘భారమైన’ సాహిత్యానిదే ప్రస్తుతం హవా. అటువంటివి నేను దాదాపుగా చదవను. అడపాదడపా చదివినా వాటిని ఇలాంటి వ్యాసాల సందర్భంగా తవ్వి తీసి ఉటంకించేస్థాయిలో గుర్తుపెట్టుకోలేను. అరుదుగా ఏ కథనైనా గుర్తంచుకున్నా, ఉదహరించాలనుకున్నప్పుడు అది చేతికి అందుబాటులో ఉండకపోవచ్చు – దాని కాపీ నా దగ్గర లేకపోవచ్చు. నా కథలైతే నాకెప్పుడూ అందుబాటులోనే ఉంటాయి కదా. అన్నిటికన్నా ముఖ్యంగా – నా కథల్లో ఎక్కడ ఏది ఎందుకు రాశాననే దానిపైన నాకు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఆ విశేషాలు ప్రస్తావించటం తేలిక. ఇతరుల కథల విషయంలో అంత సాధికారికంగా వ్యాఖ్యానించే అవకాశం నాకు లేదు. అదీ సంగతి.
*****
(సారంగ, తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపు లలో ప్రచురితం-)
అనిల్ ఎస్. రాయల్ నివాసముండేది శాన్ ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంలో. 2009లో ‘నాగరికథ’తో మొదలు పెట్టి 2021లో ‘Annie’ (ఆంగ్ల కథ) వరకూ పదకొండు కథలు రాశారు. అడపాదడపా మాత్రమే రాస్తుండే వీరి కథలు ఎక్కువగా సైన్స్, సస్పెన్స్ మేళవింపుతో నడుస్తుంటాయి. అనిల్ ఇతర కథల్లో కొన్ని: ‘రీబూట్’, ‘ప్రళయం’, ‘శిక్ష’, ”రాక్షస గీతం”.