కొత్త అడుగులు – 26
రాబోయే కాలపు దిక్సూచి
భారతి కోడె
– శిలాలోలిత
భారతి కోడె రెండేళ్ళ నుంచీ కవిత్వం రాస్తోంది. గుంటూరు జిల్లాలో కృష్ణాతీరంలో వున్న రేపల్లె పట్టణం స్వస్థలం. బి.ఎస్.సి (ఎలక్ట్రానిక్స్), ఎం.బి.ఏ (ఫైనాన్స్) చేసింది. చదువు పూర్తయ్యకా కొన్నాళ్ళు లెక్చరర్‌గా పనిచేసింది. గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అమలుచేసి పేదరిక నిర్మూలనా ప్రాజెక్ట్ వెలుగులో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ గా, ఆ తర్వాత lively hood Associate గా పని చేసింది. ప్రస్తుతం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకు చెందిన ఫౌండేషన్‌లో పనిచేస్తోంది. సామాజిక సేవా రంగం పట్ల ఆసక్తితో దానికే వృత్తిగా ఎంచుకుంది. గతంలో స్వచ్ఛందసంస్థలోనూ పనిచేసింది. వివాహమయ్యాక హైదరాబాద్ లోనే నివాసమిప్పుడు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరిగి మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాలలోని మహిళలతో పనిచేసింది. ప్రస్తుతం మా ఫౌండేషన్ ద్వారా అమలు చేసే కార్యక్రమాలలో పాలుపంచుకుంటోంది.
రెండేళ్ళ నుండి కవిత్వం రాస్తున్నప్పటికీ, అంతకు ముందు ఎందుకు రాయలేదంటే కారణం తెలీదంది. సాహిత్యం పట్ల అభిరుచి చాలావుంది. బాగా చదివినప్పటికీ ఎప్పడూ రాయాలని అనిపించలేదంది. కవిత్వం గురించి మీరేమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు, “ఎదురుచూడని జీవన సందర్భం, మానవ సంబంధాలను అర్థంచేసుకోవడంలో మారిన దృష్టికోణం, రాసేందుకు ప్రేరణనిచ్చాయి. అనుకూలమైన సమయం, సరైన సందర్భం ఎదురైనప్పుడు కవిత దానికదే రాసుకుటుంది అనుకుంటాను. కవి ఒక సాధనం మాత్రమే.
వర్తమానపు లెన్స్ నుండి గతాన్ని పరిశీలించి చూడడం, దానిని విశ్లేషించడం అనేవి అప్పుడు ఎందుకలా జరిగింది? ఇప్పుడు జీవితం ఎందుకు లా వుంది? అని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడ్తాయి. అలా అర్థం చేసుకోని ప్రయత్నాన్ని, మానవ ప్రవృత్తులలోని వైరుధ్యాలను, సారూపత్యలనూ బలాలను, బలహీనతలను అక్షరాలలో రాసే ప్రయత్నం చేసారు. కవిత్వం రాసేందుకు పాటించాల్సిన నియమాలు, ఛందస్సులు, అలంకారాలు లాంటివి తెలియదు. నాకు తోచినటుల రాస్తూ పోతున్నా. నాలోపలి ప్రపంచంలో ఏమి జరుగుతంది. నా చుట్టూ వున్న ప్రపంచంలో ఏమి జరుగుతుంది. వాటిపట్ల నాకున్న అవగాహన ఏమిటి, నా అనుభూతలేమిటి. ఇవే నా కవిత్వ వస్తువులు. భావోద్వేగాలు వ్యక్తీకరణ మనషులందరికీ వుండే ప్రాథమిక అవసరం. వ్యకరించలేని భావాలు మనసులో బరువును పెంచుతాయి. అయితే ఆ వ్యక్తీకరణ వివిధ రూపాలలో వుంటుంది. సృజనాత్మకత అధికంగా వుండే వారిలో అది కళారూపం తీసుకుంటుంది.
నేను కూడా నా అనుభూతులను, అనుభవాలను, వాటినుండి నేర్చుకున్న పాఠాలను ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూనే వున్నాను. నేను పనిచేసేది అభివృద్ధి రంగంలో, పేద నిరుపేద వర్గాలలో కాబట్టి వాని నుండి నేర్చుకున్న అనుభవాలు, పాఠాలు కవిత్వరూపం తీసుకున్నాయి.
మనందరికీ రెండు రెండు ప్రపంచాలు వుంటాయని నమ్మకం. అందరం కలిసి ఒక సమూహంగా కట్టుబాట్లతో, నియమాలతో జీవించే బాహ్య ప్రపంచం మొదటిది. వీటికి దూరంగా తన స్వంత నియమాలతో తనదైన ఆలోచనలతో, వ్యక్తపరచని భావాలతో, మనలోపలదాగివుండే అంతఃప్రపంచం రెండవది. బాహ్య ప్రపంచం బాధపెట్టినప్పుడు అంతఃప్రపంచం సేదతీరుస్తుంది. అంతఃప్రపంచంలో అలజడి రేగినప్పుడు బాహ్య ప్రపంచం ఊరటనిస్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయమే జీవితమనేది నా ఎరుక. ఈ రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణలను, సర్దుబాట్లను వ్యక్తపరచేవే నా కవిత్వం అనుకుంటాను ” అంది.
సరే, ఈ నేపథ్యాన్నుంచి భారతి కవిత్వంలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టాను. ఆమె ఆమెలా కవిత్వంలో ప్రతిఫలించిన తీరు ఆశ్చర్యపరిచింది. జీవితాలను బుట్టల్నిపేనినట్లు పేనుతూపోయింది. దృఢంగా తయారుచేసింది.
తనేమి అనుకుందో, కలగందో, ఊహించిందో, ఉండాలనుకుందో, మారాలనుకుందో, మార్చాలనుకుందో అన్నింటినీ అక్షరసాయంతో తయారుచేసింది. ముట్టకుంటేగానీ నొప్పి తెలీదు. ఎవరికి వారికే గాయంలోతు రక్తసిక్తమయమూ తెలుస్తాయి. చాలా సరళమైన పదాలతో, తననుకున్నది తాను ఎంతో నిర్భీతితో నిస్సంకోచంగా చెప్పింది కవిత్వంలో.
మనుషుల గురించి ఓ చోట రాస్తుందిలా…
‘మెరుపు మెరిసినప్పుడల్లా
మరింత చీకటిలోకి
ముడుచుకుపోయారు
మనుషులు
కాసిని పూలను చూస్తూ
నరకపు దారిలో నడిచిపోయారు
వారికోసం మూడు ముసుగులు
తయారుచేసాను
శాంతం, సహనం, సంతోషం
వాటిపేర్లు.’
ఇంకొక చోట –
‘మూడొంతులు నీరువున్న
దేహాలను
మోసుకుంటూ తిరిగే ఆత్మలే
తెలుసు నాలుగొంతులూ నీరే వున్న
దేహాల
భాషకు తెలియలేదు
దప్పిక తీర్చాలని
పంచభూతాలను ఆవాహన
చేసాను
ఇప్పుడు అగ్నిమాత్రమే మిగిలి
శరీరాన్ని కాల్చివేసింది’
వివరణా, విశ్లేషణ అవసరంలేకుండానే కవిత్వమిలా సాగిపోతుంటుంది.
గొంతులు కోసి
హృదయాలను పెళ్ళగించి
పదును తేలిన
కత్తి అంచుమీద
నత్తగుల్ల భారంగా నడుస్తుంది.
చేతిపై వాలి
చెవిని తాకిన
తూనీగ ఒకటి
గాంధర్వ లోకపుగానాన్ని
వినిపించిపోయింది.
When its wings flapped,
I realized
That every departure has a
Song!
తెరలు కట్టిన మౌనాల మధ్య
భారంగానో దిగులుగానో
రోజులు గడుస్తుంటాయి.
ప్రకృతన్నా, పక్షులన్నా, సెలయేళ్ళన్నా, సముద్రమన్నా, వెన్నెలన్నా
వెలుతురన్నా ప్రాణపదం ఈ కవయిత్రికి.
చిత్రవిచిత్రంగా పలకడం ఈమె ప్రత్యేకత.
‘అలలు చెదరగానే
వెన్నెల వొలికి పోయిందని
యేరు దుఃఖించింది కానీ
ఆ వెన్నెల కాక దానిని
ఓదార్చిందెవరు? అంటుంది.
ఒక విధంగా చూస్తే చాలామటుకు ఈమె కవిత్వదేహం ప్రశ్నలతో నిండిపోయిందనిపించింది.
‘కాకమ్మ కథలే అని కొట్టి
పారేస్తారే కానీ
కథలుగాకాక మనుషులుగా
మిగిలిందెవరు?’
మరోచోట –
‘నొప్పి గురించి తెలుసా
అది అంతా కన్నీళ్ళలోకో
కవిత్వంలోకో వంపుకోవడం
కుదరదు’
నిస్పృహ ఆక్రమించుకున్నప్పుడు ఇలా పలవరించింది-
‘తెరలు కట్టిన మౌనాలమధ్య
భారంగానో దిగులుగానో
రోజులు గడుస్తుంటాయి
తడిబారిన కళ్ళలో
ఎవరూపాడని పాటలను
రాసుకుంటూ పోతున్నాడొక కవి’
భారతి కవిత్వంలోకి ప్రయాణం ఎగతెగని ప్రయాణమే.
ప్రస్తుతానికి సెలవుచెబ్తూ, మంచి కవిత్వాన్ని చదివిన అనుభూతితో చివరగా `
I walked on the words to
reach his world
But it’s just a life time long.
మున్ముందు మరింత లోతైన కవిత్వాన్ని ఆమెనుంచి ఆశిస్తూ, ఎదురుచూస్తున్నాను.
*****
Thank you Vijetha
వాహ్ … మొదట మా భారతి గారి మరో కోణాన్ని సున్నితంగా ఆవిష్కరించిన మీకు హృదయపూర్వక శుభాభినందనలు మరియు కృతజ్ఞతలు.
దేహాలను మోసుకెళ్తున్న ఆత్మల గురించి ప్రస్తావన ఒక్కటి చాలేమో వారి అంతరంగమథనం ఏ స్థాయిలో జరుగుతోందో తెలియడానికి…
ఆ పదాల పొహళింపు చాల బాగుంది.
కవయిత్రి కాలంనుండి మరిన్ని అమృతధారలు కురవాలని ఆశిస్తూ …
Poetry is Divine … కాబట్టి… ఆ దైవానుగ్రహం మరింతగా వారికి కలగాలని కోరుకుంటున్నాను.
Thank you Sai garu
Very promising poet 💐
విభిన్నమైన వ్యక్తీకరణ…Very unique in its way😍😍
Thank you Jhansi garu
చాలా చక్కటి పరిచయం మేడం, భారతి గారికి అభినందనలు
Thank you Lakshmi garu
so happy to see u in nechheli akka
భారతి గారి కవిత్వం లో కొత్తదనం ఉంటుంది. తన పరిచయం కవితా వాక్యాలు చాలా బావున్నాయి అమ్మ అభినందనలు భారతి గారు
Thank you