మారెమ్మల శోకం
-జూపాక సుభద్ర
సీత , రామున్ని సిటెం గూడా యిడువక అడవికి అడుగిడిoది
సావిత్రి సత్య వంతుని సాయిత కోసం
ఎముని ఎంటబడి ఎదిరించింది
ద్రౌపది ఒంటరి మంటల మొసాడక పతులతో పాదచారియై పయనమైంది
దమయంతి దాపు కోసమే
కారడివికి నలునితో నడిచింది
లక్ష్మీదేవయితే , విష్ణువు గుండెల
గుంజ పాతి అడ్డ బిటాయించింది
పార్వతమ్మ శంకరయ్య శరీరాన్ని
సగం బడ పకడ్బందీగా పట్టా చేస్కున్నది
సరస్వతమ్మ బ్రహ్మ నోటిని కుటీరంగ
కోట గట్టుకున్నది
గంగా దేవమ్మ శివుని నెత్తిమీదనే
మెత్తేసుకున్నది
గీళ్లంతా మొగల నీడ లేకుండా
నెగుల లేని విహంగీలు.
గిసొంటి వాసాలు, ఆవాసాలు
గోడలు, గోదాములు గూడెపాడోల్లకు యేడున్నయి
పోషమ్మతో పొందుకొచ్చిన సుందరాంగుడు
మైసమ్మ మనసు పడ్డ మారాజు
ఎల్లమ్మ ను కళ్లల్లో నింపుకున్న కాంతుడు
ఉప్పలమ్మ, ఊరడమ్మ వుప్పుసలను ఒప్పినొడు
నూకాలమ్మ ,గంగానమ్మ ,పోలేరమ్మ ల ముద్దు తీర్సిన పొద్దోడు
చరిత్ర పొలిమేర్లను పొతంబెట్టినా
తోడు తొవ్వలు కానరాని
కటిక చీకటి కాంతి పుంతలు.
ఈ అవ్వల మహా బలాలు,తలాలు
వూరు, వాడలకు వూడిగం జేసిన
ఉత్పత్తి శక్తి యుక్తులు.
పల్లె పచ్చలకు బతుకు వెచ్చలకు
‘పొలి’ బలిగంపలు
సెరువుకు నీటి కరువు
దరి చేరనియ్యని నీళ్ళమేటలు
ఊరంచులకు కంచలైన కావల్లు
కాలాన్ని కాటేసే ‘కరోనా ఎవ్వతివే’
అంటే ,.,.ఎగిరిపడ్డ మహిలా మంటలు పెదవుల్ని కొరుక్కున్న ఫెమినిస్టులు ‘కరోనా మహమ్మారి’ అని వాడుకగా వల్లించినా మౌనాల చెల్లింపులే
పెయిల పొక్కులు పొటమరిస్తే
‘అమ్మ తట్టు’ ‘అమ్మోరు పోసింద’ని అమ్మ తల్లుల్ని బద్నామ్ చేసినా
బైసు గాదు, ఏ జెండర్ కుండలు మండయి .
ఆదిశక్తి కి ఆశ జూపి బుదుగరిచ్చి బూడిది జేసిన త్రిమూర్ఖం
అంకమ్మ అతారెలను, జ్ఞాన కంటిని
కాజేసినోడు ముక్కంటిగా మొక్కులoదు కుంటoడు.
ఆ మహా బలశాలుల ముందు
మనలేని సతుకులు
దండి మొండి జబ్బులకి జమానతు గా
‘ మహమ్మారి ‘ అనే నిందల నిప్పులు,
నిద్ర బోనియ్యని హీన ముద్రలు.
పేగుల్ని పెగ లేసే శోకాలు
గీ మకిలి లోకం
మనసు తట్టేనా……
******