నారి సారించిన నవల-28
రంగనాయకమ్మ-5
-కాత్యాయనీ విద్మహే
రంగనాయకమ్మ నవలలో 60 వ దశకపు మరోరెండు నవలలు ఇదే నా న్యాయం (1966) , అంధకారంలో (1969). ఇదే నా న్యాయం నవల యువ మాసపత్రిక లో సీరియల్ గా ప్రచురించబడి 1968 లో పుస్తకంగా ముద్రించబడింది. భార్యను ఎన్ని రకాలుగా నైనా హింసించడానికి మగవాడికి సర్వహక్కులు ఇచ్చిన కుటుంబం మీద విమర్శ ఇదే నా న్యాయం నవలలో ప్రధానమైన అంశం. శంకరం తన తల్లి కుటుంబ హింసకు, భర్త దౌష్ట్యానికి బలి కావడం చూచాడు. న్యాయవాద వృత్తిలో కుటుంబ హింసకు గురయ్యే స్త్రీలను కోర్టులో ఎంతోమందిని చూశాడు. సమాజంలో చుట్టుపక్కల నివసించే వాళ్ళలోనూ అలాంటి స్త్రీలు ఉన్నారు. ఆడపిల్లను కన్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అత్తింటివారు అందరూ మగవాడికి స్త్రీ జీవితాన్ని హింసామయం చేయడానికి ఉన్న ఈ అసహజ అమానవీయ హక్కుల అమలుకు అనుకూలంగా ప్రవర్తించడాన్ని శంకరం భరించలేకపోవడం నిరసించడం తిరస్కరించడం ఈ నవలలో కనిపిస్తాయి.
భర్తలు ఎన్ని కష్టాలు పెట్టినా తప్పంతా తనదే అన్నట్లు క్షమించమని వేడుకొంటూ పాదాల దగ్గర పడి ఉండటానికి సిద్ధపడే భార్యల హీన సంస్కారాలు రంగనాయకమ్మ కు సహించరానివి. అట్లాగే తల్లులను అంత హింసిస్తూ , పిల్లల బాల్యాన్ని నరకం చేసే తండ్రుల బాధ్యతారాహిత్యం భరించరానిది. తమను తిరస్కరించి స్వంత సుఖాలు చూసుకొంటూ తమ పట్ల అపచారం చేసిన భర్తలు, తండ్రులు భార్యలకైనా, పిల్లలకైనా క్షమించి ఆదరించవలసిన వాళ్ళు ఎప్పటికీ కాలేరు , కాకూడదు అన్నది రంగనాయకమ్మ నిశ్చితాభిప్రాయం. అందుకే ఈ నవలలో శంకరం తండ్రి అన్నీ కోల్పోయి చివరి దశలో తనదగ్గరకు వస్తే తన ఇంట్లో ఉండాటానికి వీల్లేదని నిర్ద్వంద్వం గా చెప్పాడు. అనాథలను, అన్నార్తులను ఆదుకొనే ఒక సంస్కారం కల మనిషిగా పోషణకు ఏర్పాటు చేస్తానని చెప్తూనే అది దానమో , విరాళమో తప్ప తండ్రి పట్ల బాధ్యతగా కొడుకు చేసే ఏర్పాటు మాత్రం కాదని స్పష్టం చేసాడు. ఇదే నా న్యాయం అని తండ్రి బాధ్యతారహిత ప్రవర్తనపై తన తీర్పు ప్రకటించాడు. ఇక ముందెప్పుడూ తండ్రి హోదాలో తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు.
అంతే కాదు, న్యాయవ్యవస్థ పైన, చట్టబద్ధంగా మనుషులమధ్య అమలవుతున్న తరతమ్యాల పైన రంగనాయకమ్మ విమర్శ కూడా ఈ నవలలో ముఖ్యమైనదే. ఒక వ్యాపారి లక్షలకొద్దీ డబ్బు సంపాదిస్తుంటే అది చట్టబద్ధం అని , న్యాయం అని అనుకొంటూ అంటూ ఉండే సమాజంలో తినటానికి తిండిలేక నిరుపేద చేసే దొంగతనం అన్యాయం , నేరం అని చెప్పబడటంలోని అసంబద్ధతను గుర్తించమంటుంది రంగనాయకమ్మ. ఆడవాళ్ళ మీద పురుషుడి అధికారాన్ని స్థిరీకరించి స్త్రీల జీవితాన్ని పీడనకు గురిచేస్తున్న వ్యవస్థకు, డబ్బు సంపాదన పురుషుడి సామర్ధ్యంగా స్థిరీకరించి అంతరాలను సృష్టించి అనేకమందిని ఆకలి పీడనకు గురిచేస్తున్న వ్యవస్థకు ఉన్న సంబంధం గురించిన రంగనాయకమ్మ రాజకీయ అవగాహన ఈ నవలలో మొగ్గ విచ్చుకొనటం చూస్తాం.
యుద్ధకాలంలో బర్మాలో జరిగిన సంఘటనలు, అక్కడి నుండి స్వదేశానికి తిరిగి రావటంలో భారతీయులు పడిన పాట్లూ ఇవన్నీ చిత్రించబడినందువలన బలిపీఠం ‘నవల మాత్రమే కాక డాక్యుమెంటకీ కూడానూ‘ అన్నాడు కొడవటి కుటుంబరావు. బలిపీఠం నవల విషయంలో ఆయన చెప్పిన ‘డాక్యుమెంటరీ‘ అనే మాట అంధకారంలో నవలకు కూడా వర్తిస్తుంది. ఎందు కంటే నవలాకథ ప్రారంభమైనప్పుడు, ముగింపుకు వచ్చినప్పుడు కూడా దేశ స్వాతంత్య్ర దిన ప్రస్తావన వస్తుంది. ప్రారంభంలో వచ్చింది స్వాతంత్యానంతరపు ఇరవయ్యవ వార్షికోత్సవం అని వాచ్యం గానే చెప్పింది రచయిత్రి. అంటే 1967 నాటి స్వాతంత్య్రోత్సవం అనుకోవచ్చు. నవలేతి వృత్తం ముగింపుకొచ్చేసరికి స్వేచ్ఛా భారతి ఇరవై నాలుగేళ్ళు గడిపి ఇరవై ఐదో ఏడులోకి ప్రవేశించింది అనిచెప్పబడింది. అంటే అది 1972 కావాలి, 1967 నుండి 1972 వరకు అయిదేళ్ళ కాలం మీద ‘అంధకారంలో’ నవలలోని ఇతివృత్తం ప్రవర్తించిందన్నమాట.
నిజానికి రాజేశ్వరి తల్లి రాధ జీవితం ఇంకా పూర్వపుది. అది వివరంగానే ఇతివృత్తంలో భాగం అయింది. ఆ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం, ఆగస్టు విప్లవం ప్రస్తావనకు వచ్చాయి. రాధ మేనమామ ఆగస్టు విప్లవంలో పాల్గొని పోలీసు కాల్పులలో మరణించటం కథలో రాధకు ఎటువంటి సహాయం అందకుండా చేసిన ఘటన. రాధాజీవితంలో బాధాకరమైన మలుపుకు కారణమైన ఘటన అది. వలచి వచ్చిన రాముడి మరణంతో మూడునాళ్ళ ముచ్చటైన దాంపత్యం లో ఒక బిడ్డ తల్లి అయి రెండు ప్రాణాల పోషణకు మరొక దారిలేక రాధ పెద్ది రాజు ఆశ్రయంలోకి వచ్చిన తరువాతనే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు కథనం. ఆ రోజే రాధ కూతురు రాజేశ్వరికి అక్షరాభ్యాసం చేయించింది. చదువుకొని ఆ పిల్ల తన బతుకు తాను గౌరవంగా బతకాలన్న ఆకాంక్ష ఆమెది. అప్పటికి రాజేశ్వరికి ఐదేళ్లు. అంటే 1942 లో పుట్టి ఉంటుంది. భారతదేశానికి దేశా నికి స్వతంత్రం రావటాన్ని చెప్పటంతో ఆగక రచయిత్రి దేశవిభజన, పాకిస్థాన్ నుండి భారతదేశానికి పెరిగిన కాందిశీకుల వెల్లువ కూడా ఇందులో ప్రస్తావించింది. మరణించే నాటికి ‘రాజేశ్వరి 29 ఏళ్ళ వృద్ధురాలు. సుమారు పన్నెండు సంవత్సరాలు శరీర వ్యాపారం చేసింది. అనేక సార్లు కడుపులు పోగొట్టుకుంది. అనేక వికృతమైన రోగాలు అనుభవించింది. అయిదారు సార్లు పోలీసు కేసుల్లో చిక్కుకున్నది’ అంటే కథ ముగిసిన కాలం 1942 కు 29 కలిపితే 1971-72 అన్నది స్పష్టం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్ళకు ఏళ్ళు గడుస్తున్నా, స్త్రీ సంక్షేమ పథకాలు రూపొందుతూ వున్నా స్త్రీల బ్రతుకులు మాత్రం ఇంటా బయటా కూడా విలువ లేనివిగా చేయబడటం, అంధకారంలోకి నెట్టివేయబడటం యథాతథంగా కొనసాగుతుండటాన్ని చూపించి ఇక చేయవలసినదేమిటి అన్న ప్రశ్నను పాఠకుల ఆలోచనకు వదిలింది రంగనాయకమ్మ. అదే సమయంలో రాజేశ్వరి తమ్ముడు వెంకట రమణ ఆలోచనలు ఆచరణ ల ద్వారా వీటన్నిటికీ పరిష్కారంగా తూర్పు కొండన ఉదయిస్తున్న నక్సల్బరీ వెలుగులవైపు చూడమని కూడా చెప్పింది. ఆ రకంగా ఈ నవల కూడా ఒక డాక్యుమెంటరీ స్వభావాన్ని సంతరించుకొన్నది.
ఈ నవల కాన్వాస్ కూడా పెద్దది. భిన్న ప్రాంతాల భిన్న వ్యక్తుల, భిన్న భిన్న జీవితాలను విభిన్న పరిస్థితుల నుండి శకలాలు శక లాలుగా దృశ్యమానం చేసింది. ఈ నవల రచనాకాలం 1969. జయశ్రీ మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. 1972 లో పుస్తక రూపంలో ప్రచురించబడింది. ఈ నవలలో కథ పల్లెల నుండి పట్టణాలకి, భూకామందుల ఇళ్ళ నుండి పట్టణ ఉన్నత మధ్య తరగతి ఇళ్ళకు, పైరు పచ్చల పరి శుభ్ర వాతావరణం నుండి ఏటి ఒడ్డు గుడిసెలకు, మురికి కాలవల పక్క ఇళ్ళకు ఇలా భిన్న వాతావరణాలలోకి మారుతూ ఉంటుంది. బ్రతుకు కోసం ఒళ్ళమ్ముకోవలసిన వాళ్ళ దగ్గర నుండి కోర్కెలను చంపుకొని, రోగాలను మోస్తూ బ్రతుకీడ్చే మధ్య తరగతి మహిళల వరకు, అధీనతకు అలవాటుపడి బ్రతికే ఆత్మవంచనా పరులు, అసహాయుల నుండి అధికారాన్ని ధిక్కరించి వ్యక్తిత్వంతో జీవితాన్ని నిర్మించుకొనే వాళ్ళ వరకు, కుల ధన పురుషాహంకారాలతో మిడిసిపడి ఎదుటివాళ్ళను గుర్తించని గౌరవించని వాళ్ళ దగ్గర నుండి అన్ని అహంకారాలను వదులుకొని మనుషులుగా బ్రతకటానికి సిద్ధమైన వాళ్ళ వరకు భిన్న స్థాయి ప్రవృత్తులు, చైతన్యం కలిగిన మనుషుల చుట్టూ ఈ నవలలో కథ మారుతూ, తిరుగుతూ ఉంటుంది. మొత్తం మీద జీవితం దృశ్యాలు దృశ్యాలుగా రూపు కడుతుంది.
స్త్రీల స్వేచ్ఛకు, ఇష్టమైన వాళ్ళను పెళ్ళాడి దాంపత్యాలను చేయటానికి అవకాశయ్యని సమా జంలో, కుల అసమానతలున్న సమాజంలో, ఆస్తి సంబంధాలు ప్రధానమైన సమాజంలో, పురుపా ధిక్య సమాజంలో, మతం స్త్రీ పురుష సంబంధా లలో నిర్ణాయక పాత్ర వహించే సమాజంలో, దాంపత్య సంబంధాలు ఎంత అసహజంగా, అమానవీయంగా వుంటాయో చెప్పటమే కాదు, ఈ నవల ఆ అసహజ అమానవీయ దాంపత్యాలకు, వేశ్యా సమస్యకు వున్న సంబంధాన్ని కూడా చెప్పింది. మగవారి అధికారం, ఆధిక్యత, విలాస దృష్టి ఆరోగ్యకరమైన శృంగారానికి పెడమొహం పెట్టి బయటి సంబంధాలకు ఆర్రులు చాచేట్టు చేస్తున్నదని, దాంపత్య జీవితాలలో అది స్త్రీలకు హింసగా మారుతూ లోపల నుండి నాశన హేతువవుతున్నదని ఈ నవలలోని భిన్న సన్నివేశాలు, దృశ్యాలు ద్వారా నిరూపించింది రంగనాయకమ్మ.
తల్లి చేసుకొన్న కులాంతర వివాహం కారణంగా సంఘం మద్దతు కానీ, ఆర్థిక బలం కానీ లేక తండ్రి మరణానంతరం ఆ తల్లి దిక్కులేక బిడ్డ కోసం మరొక పురుషుడి అండన చేరితే తల్లి మరణానంతరం ఆ మగాడే ఎదిగిన ఆ బిడ్డ పై అత్యాచారం చేసాడు. ఆ బిడ్డ రాజేశ్వరి. అతని నుండి పారిపోయి బ్రతుకు తెరువుకు వేశ్య అయింది. రాజేశ్వరి విటుల కోసం సినిమా హాలు దగ్గర వెతుకులాడటం దగ్గర నవల ప్రారంభమవుతుంది. అనేక అనుభవాల తరువాత రాజేశ్వరి నాలుగేళ్ళ కూతురిని ఒంటరిగా వదిలి రక్తస్రావంతో మరణించటంతో ముగుస్తుంది. అంధకారంలో నవల కుటుంబానికి బయట వేశ్యల దుర్భర జీవితాన్ని చిత్రిస్తూ నే సమాంతరంగా కుటుంబాలలోని దుర్మార్గాన్ని ధనకుల ఆదిపత్య అహంకారాలను పురుషాధిక్య అహంకారాన్ని స్త్రీల ఆధీనతను, దైన్యాన్ని అణచివేతను మౌన రోదనలను, వేదనలను వెరసి మొత్తం మీద కుటుంబంలోని బీభత్సాన్ని చిత్రించింది.
ఈ క్రమంలో పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేని పెళ్ళిళ్లు , కులం,ధనం నిర్ణాయక పాత్ర వహించే పెళ్లిళ్లుస్త్రీల జీవితాన్ని ఎంత దుఃఖభాజనం చేస్తాయో రాధ జీవితం నమూనాగా నిరూపించింది రంగనాయకమ్మ. రాధ కు పాలేరు రాముడి పట్ల ఇష్టాన్ని , ప్రేమను కుల హీనుడు ధనహీనుడు అన్న కారణంతో తండ్రి వ్యతిరేకించటం వల్ల రాధ రాముడితో వెళ్లిపోవాల్సి వచ్చింది. అది తన కు పరువు నష్టంగా భావించాడు తండ్రి. పరువు కోసం పాతిక ఎకరాలు ఇచ్చి రెండవ కూతురిని రాధకు కుదుర్చుకున్న వరుడికి ఇచ్చి పెళ్లి చేసాడు ఆయన. ఆయనే తమ పెళ్ళికి అంగీకరించి ఉంటే ఇంటినుండి బయటకు రావలసిన అవసరం తనకు ఉండేది కాదుకదా అని , వచ్చిందన్న నెపంతో తనను బహిష్కరించిన తండ్రి చర్యకు వేదన పడుతూ అడుగుతుంది రాధ. తనకు ఒక ఇల్లు ఇచ్చి నాలుగెకరాల పొలం ఇస్తే తాను రాముడు గౌరవంగా బతికేవాళ్ళం కదా అన్నది ఆమె ప్రశ్న. ఆస్తులు ఉండి తమమాటకు లోబడి పెళ్లిచేసుకోలేదు అన్న ఒకే ఒక కారణంతో పిల్లలపట్ల కఠినంగా ప్రవర్తించే తండ్రుల వైఖరిపైన , వాళ్ళను నడిపించే వ్యవస్థ పట్ల అభిశంస ఆమె మాటల్లో వినబడుతుంది. రాధ పట్ల తండ్రి నిరాకరణ ఆమె జీవితాన్నే కాదు ఆమె కూతురి జీవితాన్ని, మనుమరాలి జీవితాన్ని కూడా ధ్వంసం చేశాయి. స్త్రీలకు స్వతంత్రంగా బతకటానికి అవకాశం లేకుండా చేసిన స్వంత ఆస్తి వ్యవస్థ, మగవాడి అధికారం అమలవుతున్న కుటుంబ వ్యవస్థ స్త్రీకి ఉదరపోషణకు శరీరం అమ్ముకొని బతకటం తప్ప మరే మార్గమూ మిగల్చక పోవటంలోని దుర్మార్గాన్ని చర్చకు పెట్టింది ఈ నవల.
కులం, ధనం లేదని రాధ పెళ్లి రాముడితో చేయటానికి నిరాకరించి ఆమెను ఒంటరిని చేసి తరతరాల స్త్రీల జీవితాన్ని దుఃఖభాజనం చేసిన తండ్రి కులము , ధనమూ గల వరుడికి పరువు నిలబెట్టుకొనటానికి పాతిక ఎకరాలు ఇచ్చి చిన్నకూతురికి చేసిన పెళ్లి కూడా ఆమె జీవితాన్ని దుఃఖభాజనం చేయటమే చూస్తాం. అత్త ఆడబడుచుల సాధింపులు, అనుక్షణం అక్క లేచిపోయిందని ఎత్తిపొడవటం, భర్త నిర్లక్ష్యం, ఇంటికి , చివరకు కన్నకొడుకుకు తనను పరాయీకరిస్తుంటే భరించలేక పుట్టింటికి వచ్చిన చిన్నకూతురిని మళ్ళీ అదే పరువు కోసం అత్తింటికి తరమకుండా ఉండలేకపోయాడు ఆ తండ్రి. ఆ బాధలు , అవమానాలు భరించగల సహనం చచ్చి ఆమె ఆత్మహత్యకు తెగించింది.
ద్వంద్వ విలువల లైంగిక నీతి ఈ నవలలో పదేపదే పలు కోణాల నుండి చర్చకు వచ్చింది. తనకు ఇష్టమైన వాడితో కలిసి జీవించటానికి రాధ వెళ్ళటం లేచిపోవటంగా హీనం చేసి మాట్లాడగలవాళ్ళకు కుటుంబంలో వితంతు స్త్రీలు ఏర్పరచుకొనే లైంగిక సంబంధాలు, చేయించుకునే గర్భస్రావాలు అనైతికమైనవి అనిపించకపోవటం ఒక వైరుధ్యం. సభ్య సమాజ మర్యాదారాములైన పురుషోత్తములందరూ వేశ్యలముందు నిస్సిగ్గుగా తమ నగ్న స్వభావం బయటపెట్టే వాళ్లే కానీ స్వీయ పవిత్రత గురించి గర్వంగా, వేశ్యల పతిత జీవితం గురించి సానుభూతిగా మాట్లాడగలరు. వేశ్యలను ఉద్ధరించటానికి అవతారమెత్తిన సంస్కర్తల పోజూ పెట్టగలరు. ఉంచుకొని ఉపకారం చేస్తామనగలరు. రాజేశ్వరికి తటస్థపడిన అలాంటి ఒక అరవైఏళ్ళఅయన పెళ్లి ప్రసక్తి ఎత్తితే సానిదానితో పెళ్లా అని తీసి పారేసాడు. సానులు మనుషులు కారాండీ అని రాజేశ్వరి వేసిన ప్రశ్నకు ‘దేవుడే పుట్టించాడు మిమ్మల్ని ఇలాగ’ అన్నది ఆయన సమాధానం. స్త్రీలు భార్యలుగానో, సానులుగానో పురుషుల అనుభవం కోసమే పుట్టారన్న పితృస్వామిక పురుష సమాజ నీతి ప్రచారంలోకి తెచ్చిన సంస్కృతి ఇది.
వేశ్య అనగానే నీతిమాలిన వాళ్ళు అన్న పద్ధతిలో మాట్లాడటంలోని తప్పును కృష్ణారావు పాత్ర ముఖంగా ఎత్తిచూపింది ఈ నవల. వేశ్యలు ఎందుకు అవుతున్నారో, ఎవరివల్ల అవుతున్నారో ఆలోచించకుండా శరీరాన్ని అమ్ముకొనేవాళ్ళుగానో,సమాజాన్ని చెడు మార్గాలకు ఈడుస్తున్న వాళ్ళుగానో ఈసడించుకొనటం సరైంది కాదంటాడు కృష్ణారావు. వేశ్యలను అవినీతిపరులు అని ఏవగించుకొనేవాళ్ళు అవినీతి తో నిండిపోయిన ధనిక అధికారవర్గాల ఉద్యోగవర్గాల, భిన్న ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఎంతగా ఏవగించుకోవాలో ఆలోచించమని కూడా అంటాడు. వేశ్య కుటుంబం బయట ఉన్నది. కౌటుంబిక నీతి ఆమెకు వర్తించేది కాదు. కానీ కుటుంబంలో ఉంటూ వైవాహికేతర సంబంధాలలోకి వెళ్లే పురుషులే అసలైన అవినీతి పరులు అన్న అభిప్రాయం నవల అంతటా ధ్వనిస్తూనే ఉంటుంది.
శారీరక న్యాయం స్త్రీకి ఒకరకంగా పురుషులకు మరొకరకంగా నిర్వచించబడటంలోని ద్వంద్వ విలువల దుర్మార్గాన్ని వైవాహికేతర సంబంధాలలోకి వెళ్తున్న పురుషుల కుటుంబాలను కూడా సమాంతరంగా చూపిస్తూ నిరూపించిన నవల ‘అంధకారంలో’. ఈ నవలలో ఒక కుటుంబం కాదు అనేక కుటుంబాలు ఉన్నాయి. ఆస్తులకు అంతస్తులకు కులగోత్రాల కు ప్రాధాన్యతనిచ్చి పెళ్లి విషయంలో ఆడపిల్ల స్వతంత్ర నిర్ణయాన్ని ఆమోదించలేని పితృస్వామిక పెత్తందారి కుటుంబాల ప్రతినిధి రాధ తండ్రి వెంకట నరసయ్య భార్య చనిపోయాక పెళ్ళయితే చేసుకోలేదు కానీ వూళ్ళో ఇల్లు కట్టించి ఒక స్త్రీని తన అనుభవం కోసమే పోషించాడు. రాముడి మరణం తరువాత రాధ బతుకు తెరువు మార్గంగా ఏ పెద్దిరాజు పోషణలోకి వెళ్లిందో ఆయనకు ఇంట్లో వంశాన్ని కొనసాగించే పిల్లల్ని కనిపించటానికి భార్య ఉంది. ఆమె పేరు మహాలక్ష్మమ్మ. భర్త దురహంకారం, నిర్లక్ష్యం కారణంగా తన కోరికలు చంపుకుంటూ ఆ దుఃఖం బయటకి పొక్కకుండా తనను తాను పూజలు వ్రతాలు మొదలైనవాటితో క్షణం తీరిక లేని వ్యావృతిలో పడేసుకుని ఆత్మవంచన తో మౌన వేదన తో కాలం గడుపుతూ భర్త రాధను తెచ్చి పెట్టుకొనటానికి స్వచ్ఛందంగా ఆమోదించవలసిన నిర్బంధ పాతివ్రత్యం కింద నలిగిపోయిన మనిషి. రాధను తెచ్చి పోషిస్తూ ఆమె కు ఒక కొడుకును కూడా కన్న పెద్దమనిషి రాధ చనిపోయాక ఆమె కూతురు రాజేశ్వరిపై తనవల్ల పుట్టలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఆత్యాచారం చేసాడు. అంత వాంఛా లంపటుడైన మనిషి భార్యకు శరీరం ఉంటుంది అనుభవాన్నికోరుతుంది అన్న విషయాన్ని సౌకర్యవంతంగా మరిచిపోయాడు. శారీరక వాంఛలు లేనట్లుగా స్త్రీలు ఉండటాన్ని ఉత్తమయిల్లాలి లక్షణంగా చెప్పుకొని మురిసిపోయిన ఆయన తాను ఉత్తమ గృహస్థుగా ఉండాలన్న ఇంగితం కోల్పోవటం లోనే ఉన్నది అసలు అవినీతి. మహాలక్ష్మమ్మ భర్త వల్ల తీరని కోరికలను చాటుమాటుగా తీర్చుకొనే దశకు పోయిందంటే అది దాని ఫలమే.
మగవాడిదీ అతని తల్లిదండ్రులది అయిన కుటుంబం లో తనకంటూ స్థానం లేక పరాయిగా, చాకిరీ చేసే మనిషిగా జీవిస్తూ కష్టంలో ఉన్న అక్కను ఆదరించి అన్నం పెట్టి ఆశ్రయం ఈయగల అవకాశాలు ఏవీ లేని శకుంతల వంటి స్త్రీలకు కుటుంబాలు శత్రు శిబిరాలే.
భార్య అంటే వాంఛలు తీర్చే శరీరంగా తప్ప చూడలేని రామ్మూర్తి మొగాణ్ణి ఎలా సుఖపెట్టాలో తెలియని ఆడది అంటూ భార్యను ఈసడించుకొంటూ వేశ్యల దగ్గరకు వెళ్లగలడు. అతనితో కాపురంలో పిల్లల్ని కంటూ, పెంచుతూ, ఇంటి చాకిరీ తో సతమతమవుతూ, దయా ధర్మభిక్షగా భర్త తెచ్చి ఇచ్చే జీతంతో కుటుంబ అవసరాలు తీర్చలేక ఇబ్బంది పడుతూ, అవమాన పడుతూ, ఆందోళన పడుతూ మానసిక వైక్లబ్యాలకు గురవుతూ బ్రతికటం భార్య సుందరమ్మ వంతు కావటం చూడవచ్చు. ఒకవైపు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉన్న భార్యను నిర్లక్ష్యం చేసి శరీర సుఖాన్ని కొనుక్కునే మగవాళ్లకు మరొకవైపు పెళ్లికి ముందు కూడా భార్య పురుషుడి గురించి ఆలోచించి ప్రేమించి ఉండకూడదని అలాంటి స్త్రీలు శీలవంతులు కారని నమ్మే మగవాళ్లకు నిలయమైన కుటుంబాలు-ఇలా ఎన్నో కుటుంబాలు ఈ నవలలో కనబడుతాయి.
ఈ విధంగా పితృస్వామిక కుటుంబ సంస్కృతిలో ఒకపురుషుడికి ఒక స్త్రీ , ఒక స్త్రీకి ఒక పురుషుడు అన్న సూత్రం ప్రాతిపదికగా ఏర్పడిన దాంపత్య సంబంధాలు పురుషుడి వైపు నుండి ఉల్లంఘనకు గురయ్యే క్రమంలో రూపొందిన ద్వంద్వ లైంగిక విలువలు ఇంటా బయట స్త్రీల బ్రతుకులను శాసిస్తున్న వైఖరిని, దుఃఖ భాజనం చేస్తున్న తీరును ఇతివృత్తంగా చేసి రంగనాయకమ్మ వ్రాసిన అంధకారంలో నవల దీనిని స్త్రీపురుషుల సమానత ప్రాతిపదిక కొత్తగా నిర్మించుకొనటం గురించి హెచ్చరిస్తూ లలిత రామచంద్రం దంపతులను ఒక నమూనాగా సూచిస్తుంది.
( ఇంకా ఉంది)
*****
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.