జ్ఞాపకాల సందడి-29
-డి.కామేశ్వరి
భోజ్యేషు మాత, శయనేషు రంభ అని పెద్దలు ఏనాడో చెప్పారు. అదేమాటలు నసీరుద్దీన్షా ఏదో సినిమాలో, ఆద్మీ జో బి కర్త హాయి పేట్ కె లియే ఔర్ పేటికే నిచ్ కె లిఏ కర్తా అని చెప్పాడు. అంచేత మొగుడిని వశ పర్చుకోడానికి అమ్మాయిలు ఈ సూత్రం ఫాలో అవాలి. అంటే మొగుడు కాస్త బాగా వుంటే అబ్బా చూడగానే ఎంత నచ్చేసారో పడిపోయాను. అంటే ఉబ్బి పోని మొగుడుంటాడా. అదేబాగులేనివాడు అంటే చదువుసంధ్య ఉండి ..మంచి ఉద్యోగం వున్నవాడు వస్తే అందం తింటామా ఇవేళ వుంటుంది రేపు పోతుంది. సంపాదించి పెళ్ళాన్ని ప్రేమగా చూసుకునే వాడు కావాలి అంటే పొంగిపోని వాడుంటాడా?
మొదట మీరు సరెండర్ అయిపోండి. అంటే అతను ఏమన్నా ఎదురు వాదించకండి. ఏమి తెలియని అమాయకురాలిగా కనిపించాలి. మీ చదువు వుద్యోగం అహం అన్నీ మర్చిపోండి.
వీధి చివర కూరల కొట్లో పచ్చిమిరపకాయలు తెచ్చుకోవాలన్నా నాకు భయంబాబు మీరు లేకుండా వెళ్లడానికి. సరదాగా నడిచి వెళ్లి వద్దాం అనండి. పాపం అమాయకురాలు తానులేనిది గడుపుకోవడంరాదు అనుకుంటే రేపు అన్ని బజారు పనులు అంట కట్టచ్చు. జిడ్డు మొహంతో నలిగిన నైటీ, ఓ షార్ట్ వేసుకు తిరక్కుండా కాస్త సుబ్బరంగా ఇంట్లో తిరగండి. ఆకర్షించండి. మాటకి ఎదురు చెప్పి వాదించకండి.
కొన్నాళ్ళు ఇష్టం లేని పనులు చేస్తున్నా సహించండి. దగ్గర కూర్చుని ఇద్దరూ భోజనం చేస్తూ కొసరి కొసరి వడ్డించండి. సగటు మగాడు అయితే ఒక మంచి మంచి అభిప్రాయానికి వచ్చేస్తాడు. అతని ఇగో చల్లపడిపోతుంది.
తరువాత నెమ్మదిగా అంటే ఒక్కసారి కాకుండా అతన్ని మీ మాట వినేట్టు చేసుకోవడంలో మీ తెలివి చూపించాలి. ఒక్కటి మర్చిపోకండి. మగాడికి ఇగో ఉంటుంది. అందరిముందు అనకుండా ఇద్దరూ వున్నప్పుడు పెట్టాల్సిన గడ్డి పెట్టాలి మీకు నచ్చనిదేదన్నా ఉంటే. అప్పుడు తనలో తప్పు గ్రహించి నోరు మూసుకుంటాడు. అందరిలో అంటే పౌరుషం పొడుచుకు వస్తూ ఉంటుంది మీకయినా.
మా అక్క ఎప్పుడూ నన్ను అనేది నీవెందుకు గయ్యిమని లేస్తావు. అతనేమన్నా అంటే అప్పుడు ఉరుకో. తరువాత వంటరిగా వున్నపుడు చెప్పాల్సినవి అను అనేది. నేను గయ్యిమన్నపుడు, వాదించినపుడు నిజంగా మనం మొగుడయినా పెళ్లామైనా అలాటి సంయమనం పాటించగలిగితే ఈ భార్య భార్యల తగవులు డైవోర్సుల వరకు వెళ్లవు. మా కాలంలో మొగుడేదన్నా అంటే సహించి పడి ఉండడం, ఇద్దరు అరుచుకోవడం, ఇంకా గట్టిగా అంటే ఏడవడం .
ఇప్పు డు ఆడవారు ఆర్ధిక స్వతంత్రం ఉందని ఎదురు తిరిగినా పిల్లలుంటే వారు నలిగిపోతారు. విడిపోతే అన్నివిధాలా బాధపడేది ఆడదే. అటు పిల్లలు తండ్రి కోసం అడిగి తల్లినే దోషిగా చూస్తారు.
అందుచేత అమ్మాయిలకి చదువు ,ఉద్యోగం వున్నంతమాత్రాన సరిపోదు. తెలివిగా తగ్గాల్సినపుడు తగ్గి, ఇవ్వాల్సినపుడు ఇవ్వాలి.
భర్త ఈగోతో ఆడద్దు. ఇదంతా మాములు భర్తల గురించి. సాడిస్టులు, దేనికి లొంగని మూర్ఖుల గురించి కాదు.
ఈ తెలివి నీకు ఇప్పుడు వచ్చిందా అని అడగొద్దు. మాకు చిన్నతనం లో పెళ్లిళ్లు. ఇంత పరిజ్ఞానం లేదు. ఆర్ధిక స్వతంత్రం లేదు. అన్నీవున్న మీరు తెలివితో నడుచుకోండి. సంసారాలు పాడుచేసుకోవద్దు.
*****