జ్ఞాపకాల సందడి-31

-డి.కామేశ్వరి 

ఆరోజుల్లో అంటే మా కాలంలో అమ్మలు, అమ్మమ్మలు ఎంత సులువుగా పదిమందిని కని  పెంచేవారు! ఏడాదికి ఒకరిని మహా అయితే ఏణ్ణర్ధానికి ఒకరిని కని పడేసేవారు. కడుపులో పిల్ల, చంకలో ఎడ పిల్లతో కోడి పిల్లల్లా ఉండేవారు.

నొప్పులు మొదలవగానే పురిటి గది  తలుపులు తీసి, తుడిపించి, కడిగించి, నులక మంచం వాల్చి పక్క తయారు చేయించడం. ఉన్నవాళ్లలో పెద్దకుర్రాడిని మంత్రసానిని పిలుచుకు రమ్మని తోలడం. వాడు పరిగెత్తి వెళ్లి పిలుచుకురావడం .అపుడు ఈ ఆసుపత్రులు అవి ఏమి లేకుండానే శుభ్రంగా పదిమందిని కన్నారు. పాతరోజుల్లో ఎరుకలసాని  పురుళ్ళు పోసేది. ఆవిడగారు వచ్చేసరికి నీళ్లు అవీ రెడీ చేసి పెట్టేవారు. చేతులుకడుక్కుని తలుపులు మూసి నెప్పులు యెంత అందుకున్నాయి అని చూసి చెప్పేది అంటే ఇపుడు డైలాషిన్. ఎంత వన్ఫింగెరా టు  ఫింగర అని చూసి ఎంత ఇంకో అరగంట లో పండంటి బిడ్డ పుట్టేస్తాడు అనేది. ఎప్పుడు పుట్టేస్తాడు అనడం తప్ప ఆడపిల్ల ఊసువుండేదికాదు. పుట్టేవరకు అరగంట, రెండుగంటలయినా అరగంటనే చెప్పి పురిటాలికి ధైర్యం చెపుతూ, ఈ కబురు ఆ కబురు చెపుతూ మధ్య మధ్య కసురుతూ. అలా ఊపిరి వెన్నక్కిలాగటమెందుకు ముందుకు లాగాలి ,బిడ్డని తొందరగా కనాలని లేదా నీకు తొందర లేకపోయినా నాకుంది ఇంటికెళ్లి మొగుడివండిపెట్టాలి అని కసురుతూ.. ఊ..అలా తొయ్యి ముందుకు.. అయ్యో పిల్లకి బలమేలేదు. ఏడాదికి ఒకరిని మొగుడు ముండా కొడుకు  కనేస్తే  పిల్లకి ఓపిక ఉండద్దూ. రానీ, ఈసారి గడ్డిపెడతా అని మొగుడిని తిడుతూ ఆఖరికి బిడ్డ ఏడిచే వరకు నోరు వాగుతూవుండేది. “అమ్మయ్య” అనుకుని ఇంట్లో పెద్దవాళ్ళు బొడ్డు కోయించి వేడివేడి నీళ్లు అందిస్తే బిడ్డకి స్నానం చేయించి తుడిచి పొత్తిళ్ళలో పడుకోబెట్టేది తల్లి పక్కలో. పడుకో బెట్టడంతో దాని పని అయిపోయేది. పాతచీర, రెండు రూపాయలు పుచ్చుకు పోయేది. అంతసులువుగా అయిపోయేవి అప్పట్టి  పురుళ్ళు .

ఇప్పుడో. ……ముప్పయికి పెళ్లి చేసుకోవడం, ప్లానింగ్లు చేసుకు కనడం అనేసరికి ఓ పట్టాన ప్రెగ్నెన్సీ రాదు.  ‘మీరు ప్లానింగ్ చేసుకు కందామనుకోవడం మీచేతులో పనా’ అని తిప్పలుపెట్టి ఎప్పుడో రాసి పెట్టినపుడు వస్తుంది ఆ ముహూర్తం. “అమ్మయ్య” అనుకుని కంఫర్మ్ చేసుకోడానికి డాక్టరు దగ్గరకు పరుగులు మొదలు. అప్పటినించి టెన్షన్లు. నిలిచేవరకు జాగ్రత్తలు,  కనడానికి ప్రిపరేషన్లు. ముందే ఉయ్యాల, బట్టలు,  బొమ్మలు తయారు. నొప్పులు నాలుగు రాకముందే డాక్టర్ సిజారియాన్ అనడం వీళ్ళు తల ఆడించడం.  బిడ్డ బయటపడడం. ఇంక చూడాలి ఆ అపురూపాలు.  ఇది ఇప్పటి వరస.

ఇదివరకు ఏం తిని పెరిగారో  ఎలా పెరిగారో చిన్నప్పుడు. వాళ్లలో వాళ్ళు ఆటలాడుకుంటూ, దెబ్బలాడుకుంటూ, వీధిబడుల్లో చదువుకుంటూ పెరిగి ఇంజనీర్లు, లాయరులయ్యారు.  తల్లితండ్రులు ఇంతమందికి కాస్తో కూస్తో ఆస్తులు ఇచ్చారు. ఏమిటో కాలం ఎంతమారింది! తండ్రులకి పిల్లాడేం చదువుతున్నదీ కూడా గుర్తుండేది కాదు . ఇప్పుడో………. ఒకటో క్లాస్ పిల్లాడికి లక్షల్లో  ఫీజు. ఆ ముద్దు గారాబం, ఆ అపురూప పెంపకాలు చూస్తుంటే ఆ కాలం వాళ్ళకి వింత .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.