బతుకు చిత్రం-13

– రావుల కిరణ్మయి

చాట్లో బియ్యం పోసుకొని చెరుగుతున్న జాజులమ్మ దగ్గరికి ముత్యం భార్య వచ్చి ..

నువ్వుండు ,నేను చెరిగి వంట పని కానిస్తగని , నాయన ఏమన్న ఎంగిలిపడి పోయిండా?లేకుంటే ఖాళీ కడుపుతోని పోయిండా ?అసలే పెద్దవయసాయే గాబరా గాబరా గాదు …!అని ఎంతో ప్రేమ ,గౌరవం ఉన్నట్టు ప్రేమ కురిపించుకుంట అడిగింది.

జాజులమ్మ కు ఒకింత ఆశ్చర్యం కలుగుతుండగా ,

లే …ఒదినే ..!అట్టి కడుపుతోని నేనెట్ల కాలు బయట వెట్టనిత్త .రాత్రి మిగిలిన అన్నం ల పొద్దుగాల్నే పుల్ల మజ్జిగ పోసి గట్టిగ కలిపిచ్చిన .తిని పోయిండు.

అయ్యో ..!సలన్నం,పుల్ల మజ్జిగనా ?ఇంకెన్ని రోజులు తీ !నాయన పొద్దు పొద్దు గాల్నే గాదు !రోజు ఏడి ఏడి బువ్వ ఏసుకొని కాలు మీద కాలేసుకొని నౌకర్లు,చాకర్ల తోని సేవలు చేయించుకొనే మంచి  రోజులు ముందటనే ఉన్నయ్ .

ఏందొదినే !రాంగ ..రాంగ …ఏమన్న పచ్చి జోస్యం చూపిచ్చుకచ్చిండ్రా ?నాయనకు రాజభోగం వడ్తదని చెప్పవడితివి?అని నవ్వింది జాజులమ్మ.

లే ..లే …జోస్యం ఎక్కడిది ?నీ వల్లే ..ఆ భోగం మీ నాయన కే గాదు అందరికి పట్టబోతాంది.అన్నది.ఎసరు పెడుతూ.

వదినె పోయి మీద పెట్టినట్టుగానే ఇంకేదో ఎసరు తమ ఇద్దరికీ పెట్టడానికే వచ్చారని జాజులమ్మ కు చూచాయగా అర్థమవ సాగింది.అందుకే లోలోపలే నవ్వుకుంది.

ఏమమ్మా ..!జాజులూ ఆనపకాయ తెమ్పేదా?నాయన తింటడా?పడిశం గిన అంటడా?అని అడిగింది.అన్జులు భార్య.

లేదొదినే..!ఏదైనా తింటడు గని నడిపన్నకే పడదు కదా!అన్నది.

ఏ ఆయనదేమున్నదమ్మా!ఎట్నో సదురుకుంటడు తీ!అని శివుడి భార్య ఆనపకాయ తెచ్చి పై పొట్టు అంతా గీకడం మొదలు పెట్టింది.

ఇట్లా ముగ్గురు వదినెలూ తన పట్లా,నాయన పట్లా ఎంతో ఆదరం చూపిస్తూ ఉండడం తో ఆమె లోని అనుమానం బలపడసాగింది.

ముగ్గురు అన్నలూ వాకిట్లో మంచం వేసుకొని సేదతీరుతూ,వదినలు వంటలో మునిగి ఉండడం తనొక్కతే ఖాళీగా కూర్చొని వారినే గమనిస్తూ ఆడబిడ్డ హోదా అంటే ఇలాగే ఉంటుంది కాబోలు.అని అనుకుంటూ అప్పుడే ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది అని కూడా అనుకుంది.

 ఇట్లా మధ్యాహ్నం భోజనాల సమయం కావడం తో,జాజులమ్మ అరటాకులను తను పెట్టిన చెట్ల నుండి తెచ్చి శుభ్రంగా కడిగి పెట్టింది.అలాగే కుండలోనూ నీళ్ళు నింపి అందరూ ఒకేసారి కూర్చొని తినేందుకు వీలుగా చాపలు పరిచింది.

ఏర్పాట్లు చూసి ,ముత్యం అన్నాడు ,చెల్లే..!మాకేంతొందర?నాయన రానీ .ముందు నువ్వు గిట్ల గూసున్ధువు రా..!ఎన్నొద్దులాయే..!నిన్ను గిట్ల తేట గ జూసి అన్నాడు.

నిజమేరా ..!అన్నా ..!ఇన్నొద్దులు ,సెల్లే ..అవ్వ తరువాత అవ్వయి మనల్ని చూసుకున్నది.గిప్పుడు సెల్లె లగ్గం జేసుకొని పోతే మనం వట్టిదేనే !ఇల్లంత చిన్న వోతది.

అరె ..!గట్ల ఎందుకయితది?ఎప్పుడంటే గప్పుడే సెల్లెను పుట్టింటికి తోలాల్నని అప్పగింతల నాడే బావ కు చెప్పుడే.మాట తీస్కునుడే.కాదు పోదు అంటే ,బావైనా సరే !ఈపు బాజా మోగించి మరీ సెల్లెను తెచ్చుకునుడే అన్నాడు శివుడు.

ఇలా ముగ్గురు అన్నదమ్ములూ పరాశికం గా నవ్వుకుంటూ ప్రేమ కురిపిస్తుండగా ,జాజులమ్మలో మరింత బలంగా వారు ఏదో ఆలోచనతోనే వ్వచ్చారని అర్థం అవుతుండగా,పైకి మాత్రం సంతోషంగానే కనిపించింది.

వీళ్ళిట్లా మాటలలో ఉండగా,పీరయ్య వచ్చాడు.ముగ్గురు కొడుకులూ నాయన చేతిల సంచి ఒగరు,కర్ర ఒగరు అందుకొని ఇంకొగరు కాళ్ళకు నీళ్ళు చెంబు తో తెచ్చి అందించగా నోట మాట రాక మౌనం గానే కాళ్ళు కడుక్కున్నాడు.

ఆయన కోసం ముత్యాలు భార్య టవలు,అన్జులు భార్య మంచినీళ్ళు ,శివుడి భార్య కూర్చోటానికి కుర్చీ తెచ్చి వేస్తుండగా,తన ఇంట్లో తన కోడళ్ళు,కొడుకులూ తనకే మర్యాదలు చేయడం కొత్తగా అనిపించి జాజులమ్మ వైపు ప్రశ్నార్థకం గా చూశాడు.

ఏంది?మావా?గిట్ల చిక్కిపోయినవ్ ?నీకేం రందే?ఒక్క ఆడిబిడ్డ లగ్గం ఎట్లని మనాది వెట్టుకుంటానవా? ఏంది? నీకేం దక్కువ?ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడండ్లు ఆరుగురు మనుమలు మనుమరాండ్రు ఉందనగా మారాజోలె బతికే రాత గల్లోనివి .అంటూ ముత్యం భార్య పీరయ్యను పలకరించింది.

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా అవాక్కవుతూ ఆమెనే బీరిపోయి చూస్తున్నాడు పీరయ్య.ఇంతలో పెద్ద కొడుకు ముత్యం కల్పించుకొని,

నాయ్నా…!నిన్ను చూత్తాంటే నీ కోడలు అన్నట్టు ఎట్లున్నవని కూడా అడుగబుద్ధైతలేదు.అట్ల పీక్కపోయి ఉన్నవ్ .నీ మనాది మా కెరుక కాబట్టే సెల్లెకు మంచి సంబంధం తీస్కోని నీ తోని మాట్లాడటానికే మేమంతా కలిసి వచ్చినం అన్నాడు.

ఔ..నాయన..!మాకు మాత్రం బాధ్యత లేదా !గందుకే మాటలు సెప్పక సేతలు సూపెట్టాల్ననుకొని ఇన్నోద్దులు మంచి సమ్మంధం కోసం ఎతికి ఎతికి దొరకవట్టుకొని అచ్చినం అన్నాడు అన్జులు.

ఔనే …!బాపూ …..!నువ్వు, సెల్లె మేము సెప్పింది ఇని ఊ….అంటే సాలు ఇగ అన్నీ మేమే దగ్గరుండి నడిపిచ్చి సెల్లెను అత్తోరింటికి తోలిత్తం అని శివుడు అన్నాడు.

ముగ్గురి మాటలు విన్న పీరయ్య,నెమ్మదిగా ,

ముందైతే అన్నాలు తిందురు పాండ్రి.ఎప్పుడనంగా అచ్చిండ్రో ఏందో..!అన్నాడు.

ఈ ముచ్చటిని నువ్వు,సెల్లే ఒప్పుకుంటే మాకు కడుపునిండినట్టే.అప్పుడు ఇంకింత తుర్తిగ తినచ్చు అందరం.ఏమంటవ్?సెల్లే అన్నాడు ముత్యం జాజులమ్మను చూస్కుంటూ.

సల్లకచ్చి ముంత దాచినట్టు ఇంకెందుకయ్య నాన్చుడు.ఊరిచ్చుడు అసలు విషయం చెప్పరాదు అన్నది ముత్యం భార్య.

మరే…!అన్నారు మిగతా వారందరూ.

జాజులమ్మ ఏమీ మాట్లాడకుండా తండ్రినే చూస్తుండి పోయింది.తననే చూస్తున్న జాజులమ్మను గమనించి నేను మీకో ఇషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అనబోతుండగా..

ముత్యం మొదలు పెట్టాడు.మేము పని చేసే కాడికి దగ్గరలో మెయిన్ సిటీల ఒక పెద్ద దొరోరు ఉన్నడట.ఆయనకు లెక్కలేనంత ఆస్తిపాస్తులు సుతం ఉన్నాయంట.ఎంతంటే…అటేడు తరాలు ఇటేడు తరాలు కూసోని తినుకుంట వత్తాంటే గూడ ఒడుత్తలెవ్వట.అట్టాంటి పెద్ద మనిషికి ఇద్దరు పిల్లలు,మనుమలు ,మనుమరాండ్రు  సుతం ఉన్నరట.ఏ బదర బందీలు లెవ్వట.పిల్లలు గూడ ఔటాప్ ల ఉన్నరట.పాపం భార్య ఈ మద్ధల్నే సచ్చిపోయిందట.అప్పటినుండి తిండికి వండుకోను తిప్పలైతాందట. మనాదికే ఈ మద్దెల్నే కొద్దిల పచ్చవాతం గూడ అచ్చిందట గని కోలుకున్నడట .ఇగ అప్పట్నుండి ఒక్కనివి ఉండద్దు,ఒక పనిమనిషిని పెడతం అని పిల్లలు అన్నరట గని ,పైసలిత్తే చేసెటోల్లు ఎన్ని రోజులు నమ్మికని ,ఈయ్నె ఎవలన్న మంచి పొల్ల దొరుకుతే పెండ్లి చేసుకొని ఆమె కు ఇంత ఆస్తి గూడ రాసిత్తనని అంటాండట.ఇంక వాల్లోళ్ళు ఎవరన్న ఉన్న గూడ సాయం జేత్తా అంటాండట. మా మేస్త్రీ కి ఈ ముచ్చట తెల్వంగనే,ఎగిలివారంగనే సక్కగా నా దగ్గరికే అచ్చి,

గిట్ల గిట్ల సంగతి,మీ సెల్లె ఉన్నదంటివి గదా!పైసా కట్నం అక్కరలేదు.తంతే బూరల గంపల వడ్డట్టే పో..!రేపోద్దుగుంజామ్కల్ల ఇంటికి వొయి మీ నాయ్నకు ,సెల్లెకు సెవులేసిరా ..పో ..!ఒక్క దెబ్బకు మీ అందరి బతుకులు తెల్లగైతయ్ !ఇంతకన్న మంచి సంబంధం ఎర్రటెండల సూర్యునికి ఎదురుంగ నిలవడి తలకిందుల తపస్సు చేసినా రాదని చెప్పడం తో తమ్ములిద్ధరినీ ఇచారించుకొని ఇట్లచ్చినం.మన తాహతుకు ఇంతకంటే పైసా నయంగా గూడ వేరేటిది తేలేం.ఏమంటవ్ ?అన్నట్టుగా ఆగాడు.  

పీరయ్య విషయం అంతా విని,

ముత్యం…!సెల్లెకు ఈ పాటికే లగ్గం ఖాయమై వరపూజ,పూలుపండ్లు,లగ్గం కోటు ఎస్కునుడు గిట్ల అన్ని అయిపోయినయ్రా.వచ్చే నెలల్నే లగ్గం.ఆ పని మీదనే తిరుగుతాన.మీ జాడ కనుక్కొమ్మని,ఏడున్నారని,ఏన్నన్న కనవడుతే గిట్ల గిట్ల సంగతని కూడ ఎరుక జెయ్యుండ్రని చెప్పుకుంటత్తాన.ఇంతలకే మీరు పిల్సినట్టే అత్తె గట్నే ఎవరన్న మత్లావ్ జెప్తే అచ్చిండ్రనుకునే సప్పుడు జేత్త లేనయితి.ప్లగాడు మన కులం గాదు గని బుద్ధిమంతుడే.కాకుంటే కొంచెం తాగుడున్నదట.ఆళ్ళ తల్లి జెప్పింది.ఇన్నొద్దులు తాడు బొంగురం లేకున్డుండి తాగిండు గని ఇగ లగ్గమైతే ఎందుకు తాగుతడు అని సుతం అన్నది.లగ్గం ఖర్చులు పైసా లేకుండా ఊరి జనాలే శ్రీరామనవమి నాడు రాములోరి కళ్యాణం తో పాటే జరిపిస్తున్నరు.మన జాజులమ్మ అద్రుట్టం కాకుంటే ఇంత మంచిగ జరుగుతదా?ఇగ అన్నీ మరసి పోయి లగ్గం అయిన్దాంక ఉండి తలో చెయ్యేసి సెల్లెను అత్తగారింటికి సాగదోలి పొండ్రి కొడుకా!అన్నాడు చెప్పడం ముగిస్తూ.

అంటే కులగానోనికి,తాగుబోతోనికి ఇచ్చి చేత్తే అదేం బాగుంటదని నీ ఆలోచన?దానికి మాత్రం ఆసలుండవా?మంచి బట్ట కట్టాల్నని,మంచి తిండి తినాల్నని,మంచి ఇంట్ల ఉండాల్నని?బురదల పుట్టిన తామర పువ్వు మన జాజులమ్మ.దానికి మహారాణి రాజ భోగం వట్టవోతాంటే అడ్డుగాలేత్తానవెందుకునాయ్నా?మేము తెచ్చినోన్ని చేసుకుంటే మన తలరాతలు మారి అందరం బాగుపడ్తం.ఏ జనుమల పున్నెమో దవుడు గిట్ల అవకాశం ఇచ్చిండు.దీన్ని కాదనుకునుడు లచ్చిం దేవి ఇంట్లకత్తాంటే వద్దని తడికె అడ్డం పెట్టుకున్నట్ట్టే.అన్నాడు ఆవేశంగా.

అంటే అరవై ఏండ్లు నిండి అన్ని దగ్గరవడ్దోడు సుత నీ కళ్ళకు నయం గనే అగుపిత్తాండు గని లగ్గం గానోడు,ఈడూ జోడు కుదిరినోడేమో అక్కరకు రానోనిలెక్క కండ్లవడుతాండ?కులం కులం అంటానవ్,కులం దేముంది? గుణం మంచిగుండాలె గని.అన్నాడు పీరయ్య అంతే ఆవేశంగా.

కులం జెడ్డా ఫలం దక్కాలంటున్న.నేను దెచ్చినాయనైతే కులం గూడ ఘనమే.పైసలు గూడ దండిగున్నయ్.పొల్లగాండ్లు కావాల్నంటే ఎవలనన్న దత్తు గూడ తెచ్చుకొమ్మంటాండు.వాళ్లెవలో ఎందుకు?నాబిడ్డను,అంజులుగాని బిడ్డను ఇద్దరిని దత్తుకిత్తే మా కట్టం గూడ బాత్తది.పొల్లగాండ్లకు,సెల్లె కు ఒగలికొగలికి మంచిగుంటది.బైటోల్లయితే పంచాయిదులయితయ్ గని మన రక్తం మనకు మంచిగ ఇముడుతది.అందుకని గుడ్డిగనే వద్దని కొట్టిపారెయ్యక జరా సెల్లే,నువ్వు సోసుండ్రి అన్నాడు ఈసారి చాలా నెమ్మదిగా.

అవునే నాయ్నా!నువ్వు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్టు మొండి జెయ్యకు.ఎతుక్కుంటచ్చిన తలరాతని నువ్వే పాడు జెయ్యకు అని అంజులు అనగా,

ఔనే బాపూ !అంతేనే !అన్నలు చెప్పింది నూటికి నూరు పాళ్ళు సత్తెమేనే,మనం ఈ గుడిసెలకెళ్ళి బైటవడి దర్జాగా భవంతులల్ల బతుకొచ్చు .అని వంత  పాడాడు శివుడు.

మామా..!నీకు మాత్రం జాజులమ్మ సుఖం గ ఉండాల్నని లేదా ఏంది?మా కంటె ఎక్కువ పావురం గల్లోనివి.ఎన్ని లగ్గాలు పీటల మీదికచ్చినంక గూడ ఎత్తి పోతలెవ్వు.ఇది గూడ అంతే అనుకుందం.ఇంక ఏమిట్లకు ఏం గానేలేదు గదా!అని ముత్యం భార్య చెప్పుడు మొదలు వెట్టింది.

జాజులమ్మను చూశాడు పీరయ్య.ఆ పాటికే కళ్ళ నిండా నీరు నిండి టప టప కన్నీళ్ళు వడుస్తుండగా పైట కొంగు తో అదిమి పెడుతూ కనిపించింది.

పీరయ్య,చటుక్కున ఉన్న చోటు నుండి లేచి జాజులు దగ్గరికెళ్ళి,

తలపై చెయ్యి వేసి,బిడ్డా…అని దగ్గరకు తీసుకోంగానే భోరుమని ఏడ్వడం మొదలుపెట్టింది.

బిడ్డా…!ఎందుకింత బాధ.నీకు నచ్చనిది నేనేమి చెయ్య.నాకు ఆ ముసలోనికి ఇచ్చి చేసుడు సుతారము ఇష్టం లేదు.ఎన్కట ఎప్పుడో కన్యాశుల్కమని గిట్నే ఆడి పొల్లగాండ్లను ముసలోళ్ళు కొనుక పొయ్యేదట.గదే యాదికత్తాంది.అన్నల ముచ్చట ఇంటాంటే.అప్పుడు గురజాడ అప్పారావు,ఈరేశలింగమని ఇంక పెద్ద పెద్దోళ్ళంత తప్పని మానిపించిండ్రట.గీ ముచ్చట అంత అయ్యగారు చెప్పంగ ఇన్న ఓపారి.గసొంటిది మల్ల నేను ముందటేత్తనా బిడ్డ?వల్ల…వల్ల …ఏడవకు అని ఓదార్చసాగాడు.

నాయ్నా…!సెల్లె కు మేము జెప్పిందే ఇష్టమై నీ తోని జెప్పడానికి భయపడి ఇంత దూరమచ్చినంక కాదంటే ఇజ్జతు పోతదని,నువ్వు తట్టుకోలేవని ఏడుస్తుండచ్చు.అన్నాడు అంజులు.

నిజమే గదా తల్లీ!మేమంతా లేమా?నాయనకు నచ్చజెప్ప.నువ్వు మేము జూసినాయననే జేసుకున్ధువు తీ!అని అన్జులు భార్య అన్నది.

అవునా!బిడ్డా !నువ్వు గదానికే ఏడుస్తానవా?జెప్పు అని అడిగిండు పీరయ్య.

అంతసేపు ఆగకుండా ఏడుస్తున్న జాజులమ్మ కొంత నిమ్మలానికి వచ్చి,కళ్ళు తుడుచుకుంటూ..

లే..లే… బాపూ..!లే..కాటికి కాలు జాపుకున్నోడు గూడ ఆడి పిల్లంటే ఇంత చులకన గ సూడవట్టే గదా !కుక్కకు బొక్క ఆస జూపినట్టు నా అన్నలకు బతుకు దెరువు ఆస జూపెట్టి నన్ను కొనుక్కోవాలని ఉపాయం జేసే గదా!నాకంటే అయ్యవు నువ్వుండి మంచీ చెడ్డా ఇచారిత్తానవ్!ఎవలు లేనోల్లయితే తలరాతని జేసుకునుడే గదా!ఇంకెప్పుడు బాపూ..!ఆడివిల్లలు బాగుపడేది.అన్నలసొంటో ల్లు మారేది?అంత సినిమా రీలు లెక్క తిరిగి ఏడుపచ్చిందే.అన్నది ధైర్యంగా.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.