కాళరాత్రి-5
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
చెకోస్లోవేకియా భూభాగం వద్ద కస్‌చా అనే ఊరిలో బండి ఆగింది. అప్పటికి గానీ మాకు హంగరీలో ఉండబోవటం లేదనేది తెలిసి వచ్చింది. ఒక జర్మన్ ఆఫీసరు ఒక హంగరీ ఆఫీసర్ని వెంటబెట్టుకుని తలుపు తెరచి లోనికి వచ్చాడు. హంగరీ ఆఫీసరు అతను చెప్పేది అనువదించి మాకు చెపుతున్నాడు.
ఈ క్షణం నుండి మీరు జర్మన్ ఆర్మీ ఆధీనంలో ఉంటారు. మీ దగ్గర బంగారం, వెండి, నగలు ఉంటే యిక్కడ అప్పగించాలి ఎవరైనా దాచితే చావే గతి. ఎవరికైనా సుస్తీ చేస్తే హాస్పిటల్ కారు వాళ్ళకి చెప్పాలి.
హంగరీ ఆఫీసరు ఒక బుట్టలోకి జనం దగ్గర ఉన్న విలువైన వస్తువులు పోగు చేశాడు.
జర్మన్ ఆఫీసరు అన్నాడు. మీరు మొత్తం 80 మంది ఉన్నారు. ఈ కారులో ఎవరైనా మిస్ అయితే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము!
వాళ్ళిద్దరూ దిగిపోయారు.
మేము పీకలదాకా కష్టాల్లో మునిగిపోయాం. కారు ద్వారాల్లాగా మా భవిష్యత్తు మూసుకుపోయింది. ప్రపంచంతో సంబంధం తెగిపోయింది కారులో బంధింపబడగానే.
మాతో ఒకామె ఉన్నది. పేరు మిసెస్ షాచ్‌టర్ ` ఆమెకు 50 ఏళ్ళుంటాయి. ఆమె భర్త, ఇద్దరు పెద్ద కొడుకులు ముందు బ్యాచ్‌లో వెళ్ళిపోయారు. పదేళ్ళ కొడుకు ఆమెతోనే ఉన్నాడు. వారితో విడిపోవటం ఆమెను పూర్తిగా దెబ్బతీసింది.
ఆమె మా యింటికి వస్తూ ఉండేది. మొదటి ప్రయాణం రోజంతా మూలుగుతూ ఉన్నది. తనని తన వారినుండి ఎందుకు విడదీశారు అని ఏడుస్తూ, అరుస్తూ ఉన్నది. ఆమెను బాగా ఎరుగుదును. ఆమె భర్త భక్తుడు, ఎప్పుడూ చదువుతూ ఉండేవాడు. ఆమె కుటుంబాన్ని పోషించేది.
ఇప్పుడామెకు మతి పోయింది.
మూడోరోజు ` మంటలు, నాకు మంటలు కనిపిస్తున్నాయి. అని ఆమె అరుపులతో అందరం ఉలిక్కిపడ్డాం. కిటికీ వైపు చూపుతూ అరుస్తూనే ఉన్నది. నిప్పు, మంటలు, నా మీద దయదలచండి అంటూ కేకలు, అరుపులు. మాకు వెన్నులో వణుకు పుట్టింది. ఎన్నో విధాల ప్రయత్నించాం ఆమెను ఊరుకోబెట్టటానికి. మీ భర్తా, బిడ్డలు మిమ్మల్ని కలుస్తారు అని ఎంత ఓదార్పు మాటలు చెప్పినా ఆమె దయ్యం పట్టినదానిలా కేకలు బొబ్బలూ ఆపలేదు.
ఆమెను ఓదార్చే ప్రయత్నంలో మమ్మల్ని మేము ఓదార్చుకుంటున్నాము. ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తున్నాము.
ఆమెకు దాహంగా ఉంది. తట్టుకోలేక మంటలు మంటలు అని అరుస్తున్నదన్నారు కొందరు.
మేము చాలా భయపడ్డాము. ఆమె పిచ్చి మా అందరికీ సోకినట్లున్నది. కొందరు యువకులు ఆమెను పట్టి నోటికి పట్టీ వేసి బిగించారు. కొంత ప్రశాంతత లభించింది. బండి పోతూనే ఉన్నది. మేము కునికి పాట్లు పడుతూ ఉన్నాము.
కొంత సేపటికి కట్లు పీకేసి ‘చూడండి మంటలు’ అని అరవసాగింది. కొందరు ఆమెను కొట్టి నోరు మూయించారు.
ఉదయానికల్లా ఆమె అరవటం మానేసింది. రోజంతా నిశ్శబ్దంగా పడిఉన్నది. సాయంత్రం మరల అవే అరుపులు, కేకలు. అక్కడ మంటలు చూడండి అంటూ కిటికీ నుండి దూరంగా చూపిస్తున్నది. గాలిలేదు, వేడి, దాహం, వాసన అన్నిటితో ఊపిరి సలపటం లేదు. ఇంకా కొన్నాళ్ళు ఆమెతో ఉంటే మేమూ అరుస్తామేమొ అనిపించింది. ఏదో స్టేషన్ దగ్గర పడుతున్నది. కిటికీగుండా ఆష్‌విట్స్ అని చదివారెవరో. మేమెవ్వరం ఆ పేరు ఎప్పుడూ విని ఉండలేదు.
ఇక రైలుబండి కదలలేదు. మధ్యాహ్నం దాటిన తరువాత కార్ల డోర్లు తెరుచుకున్నాయి. నీళ్ళు తెచ్చుకోనిచ్చారు. నీళ్ళు తెచ్చిన వాళ్ళు ఇదే ఆఖరు మజిలీ అని తెలుసుకు వచ్చారు. అలా తెలుసుకోవటానికి ఒక వ్యక్తి తన గోల్డ్‌వాచ్ ఇవ్వవలసి వచ్చింది చెప్పిన వ్యక్తికి. మేము ఇక్కడ దిగాలి దగ్గరలోఒక లేబర్ క్యాంపు ఉన్నది. అక్కడ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. యువకులు ఫ్యాక్టరీలలో పనిచేయాలి. పెద్దవాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు పొలాలలో పనిచేయాలి.
మాకు కొంత ఊరట అనిపించింది. ధైర్యం వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము.
మిసెస్ షాచ్‌టర్ నిస్త్రాణంగా పడి ఉన్నది. తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆమెకు తెలియటం లేదు. ఆమె కొడుకు తల్లిని తన చిన్న చేతులతో తడుతూ ఉన్నాడు. సాయంకాలం అవుతున్నది. ఇంతో అంతో మిగుల్చుకున్న రొట్టె తిన్నాం. రాత్రి పదింటికి కాస్త కునుకు తీద్దామని ఉపక్రమిస్తుండగా ఆమె ‘మంటలు’ అంటూ అరవసాగింది. కిటికీ నుంచి చూస్తే కటిక చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. కొందరామెను కొట్టి నోరు మూయించారు.
మా గార్డు జర్మన్ ఆఫీసరుతో మాట్లాడి ఆమెను ఆరోగ్య కారుకు తరలించమని చెప్పాడు.
త్వరలోనే ఆ పని చేస్తామన్నాడు ఆఫీసరు. మరల బండి నెమ్మదిగా కదిలింది. దూరంగా ముళ్ళ కంచె కనిపించింది. అదే క్యాంప్‌సైట్ అనుకున్నాము.
ఆమెను దాదాపు మరచిపోతుండగా ‘యూదులారా చూడండి మంటలు’ అని అరిచింది. బండి ఆగింది. ఈసారి మేమూ మంటలు చూశాం. ఎత్తు చిమ్నీ నుండి నల్లటి పొగలు ఆకాశానికి ఎగిసి పోవటం చూశాము. ఆమె నిస్త్రాణగా ఒక మూలకు పడిపోయింది.
మేము చీకటిలో కనిపించే మంటలు చూస్తున్నాము. ఏదో దుర్వాసన మా ముక్కు పుటాలను చీలుస్తూ వచ్చింది. బండి డోర్లు తెరుచుకున్నాయి. నల్లటి ప్యాంటు, చారల జాకెట్లు ధరించి వింత గొలుపుతున్న జీవాలు లోనకు వచ్చాయి. లాఠీలతో విచక్షణ లేకుండా అందరినీ కొడుతూ దిగండి త్వరగా అని కేకలేస్తున్నారు. మీ సంచులు బండిలోనే వదిలి దిగండి అన్నారు. మేమందరం కిందికి దూకాము. తల్లి చేయి పట్టుకుని పసివాడలానే ఉన్నాడు. మా ముందు మంటలు, ఒళ్ళు కాలుతున్న కౌరు కంపు. అర్ధరాత్రి అయి ఉంటుంది. మేము బిర్కెనా చేరాము.
మేము తెచ్చుకున్న వస్తువులతో పాటు మా భ్రమలు గూడా బండిలోనే వదిలాము.
మేము నడుస్తుంటే ఎస్.ఎస్. (నాజీ రక్షకభటులు)లు తుపాకులు మా వైపు గురిపెట్టి ప్రతి కొన్ని గజాల దూరంలో నిలబడ్డారు.
మగవాళ్ళు ఎడమవైపుకు, ఆడవాళ్ళు కుడివైపుకూ పదండి అని ఎస్.ఎస్ అరిచాడు.
అతను అన్నది కొద్ది పదాలే కాని అదే సమయంలో అమ్మ నుండి విడిపోయాను. నాన్న నా చేయి గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఒక్క ఆలోచనకు గానీ, ఒక్క మాటకు గాని తావులేకుండా పోయిన క్షణాలవి. అమ్మ, అక్కలూ, చెల్లి వెళ్ళడం చూశాను. జిపోరా అమ్మ చేయి పట్టుకుని నడుస్తున్నది. అమ్మ చెల్లి జుట్టు సవరిస్తున్నది. వాళ్ళు దూరంగా వెళ్ళటం చూశాను. నేను, నాన్న చేయి పట్టుకుని, మిగతా మగవారి వైపుకు నడిచాను. జిపోరాను ఆఖరిసారి చూడటం అని నాకప్పుడు తెలియలేదు. నాన్న నన్ను నడిపించుకు పోయాడు.
నాన్నను పోగొట్టుకోలేను. ఆయన చేయి గట్టిగా పట్టుకున్నాను. ఆ ఆలోచన ఒక్కటే నాలో మిగిలింది. ఒంటరిగా ఉండను అనుకున్నాను.
ఎస్. ఎస్. ఐదుగురు చొప్పున లైను కట్టండి అని అరిచాడు.
ఓ అబ్బాయి నీ వయసు ఎంత అని నన్ను అడిగాడు. అక్కడ ఉండేవాడే అతను. 15 అన్నాను. కాదు నీకు 18 ఏళ్ళు అన్నాడతను. 15 ఏళ్ళే అన్నాను. ‘అరె ఫూల్’ నే చెప్పింది విను అన్నాడు.
నాన్న వయసు అడిగితే 50 అన్నాడు. అతను కొంత చిరాకుగా ‘నీకు 40, వాడికి 18’ అన్నాడు.
ఇంకొకడు మమ్మల్ని తిట్టుతూ ‘‘మీరు ఎందుకు వచ్చారురా యిక్కడికి’’ అన్నాడు.
మాలో ఒకతను ధైర్యం చేసి` ‘‘మాకై మేము రాలేదు, మమ్మల్ని తీసుకు వచ్చారు’’ అన్నాడు.
అతన్ని చంపేసేలా చూసి ‘‘నోరు మూసుకో ముక్కల కింద నరుకుతా, యిక్కడికి వచ్చే బదులు ఉరేసుకు చావవలసింది మీరంతా. ఇక్కడ ఆష్‌విట్స్‌లో 1944లో మీ గతేమవుతుందో తెలుసా!’’ అన్నాడు.
మాకు నిజంగా తెలియదు. మాకెవరూ చెప్పలేదు.
‘‘మీకేమీ తెలియదు గదా! అక్కడ చిమ్నీ కనిపిస్తున్నదా? మంటలు కనిపిస్తున్నాయా? మిమ్మల్ని అక్కడికి తీసుకుపోయి కాల్చి బూడిద చేస్తారు!’’ అన్నాడు.
మేము భయంతో శిలలయ్యాము. ఇంత భయంకరమైనది జరగబోతున్నదా? మాలో కొందరు గుసగుసలాడటం విన్నాను. ‘మనం ఎదురు తిరగాలి, కబేళాలు జంతువుల్ని చంపినట్లు వీళ్ళు మనల్ని చంపగూడదు.
మాలో కొందరి దగ్గర చాకులున్నాయి. ‘‘మనం గార్డుల మీద తిరగబడదాము’’ అంటున్నారు వారు.
‘ఆష్‌విట్స్’ ఉన్నదని ప్రపంచానికి తెలియాలి. తప్పించు కోవటానికి వీలుగా దీని సంగతి అందరికీ తెలియాలి. అని వాళ్ళు అంటుంటే పెద్దవాళ్ళు అడ్డుపడి తమ పిల్లలను ‘‘తెలివి తక్కువ పనులు చేయకండి’’ అని వారించారు.
‘‘మన మెడల మీద కత్తులు రెడీగా ఉన్నా మనం ఆశ వీడకూడదు. మన పెద్దలు మనకదే చెప్పారు’’ అన్నారు వాళ్ళు.
అలా ఎదురు తిరిగే ప్రయత్నం ఆగిపోయింది. ముందుకు నడిచాము. దారి మధ్యలో డా॥ మెంజలీ నిలబడి ఉన్నాడు. ఎస్. ఎస్. ఆఫీసరు అతి క్రూరుడు. చేతిలో లాఠీలతో చుట్టూ ఆఫీసర్లు నిలబడి ఉన్నారు.
అతని ముందుకు రావటం నా వంతయింది. నా వయసు అడిగాడు. 18 అన్నాను. నా గొంతులో వణుకు నాకు తెలుస్తున్నది. ‘‘నీ ఆరోగ్యం బాగున్నదా?’’ అవును అన్నాను. ఏం పని చేస్తున్నావని అడిగితే విద్యార్థిని అని చెప్పాలని ఉన్నా ‘రైతు’ ని అన్నాను. ఈ సంభాషణ కొన్ని సెకండ్లలో ముగిసినా నాకు కొన్ని యుగాలుగా అనిపించింది.
ఎడమవైపుకు లాఠీ చూపించాడు. నాన్నను కుడివైపుకు గాని పంపిస్తున్నాడా అని సందేహం వచ్చి చూశాను. అలా జరిగితే నేను కుడివైపుకు పరుగెత్తేవాడిని.
మాకప్పుడు తెలియదు ` ఎడమవైపు మంచిదా కుడివైపు మంచిదా అని? ఎటు వెళితే జైలు, ఎటు వెళితే మరణమో తెలియదు మాకు. నాన్న పక్కనే ఉన్నాను. సంతోషించాను. ముందుకు నడిచాము.
మరో వ్యక్తి వచ్చి ‘సంతోషమేనా’ అంటే ‘అవును’ అని మాలో ఎవరో బదులిచ్చారు.
‘‘పిచ్చివాళ్ళలారా మీరు చావు వైపుకు పోతున్నారు’’ అని అంటే అతను నిజము చెబుతున్నాడనిపించింది. దగ్గరలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏదో కాలుతూ ఉన్నది అందులో. ఇంతలో ఒక ట్రక్కు వచ్చి ఆగింది. అందులో నుంచి పిల్లలను ఎత్తి మంటలలోకి విసరటం నా కళ్ళతో నేను చూశాను. (నాకప్పటి నుండి నిద్ర కరువయింది).
*****
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.