మా చిన్న చెల్లెలు
-ఆరి సీతారామయ్య
ఉదయాన్నే హాస్పిటల్ కు పోవడానికి తయారవుతున్నగాయత్రికి ఫోనొచ్చింది.
“చిన్నమ్మమ్మా, ఏంటీ పొద్దుటే ఫోన్ చేశావు? బాగున్నావా?”
“నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లాడాలి. వచ్చేటప్పుడు దోవలో కూరగాయలేవైనా కొనుక్కురా,” అంది ఆమె.
“సరే, ఏం తీసుకురమ్మంటావు?”
“ఏవైనా సరే, నీకు ఇష్టమైనవి తెచ్చుకో, మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం? రాత్రికి ఉండి పొద్దుటే పోదువుగాన్లే. రేపెటూ సెలవేగదా,” అంది చిన్నమ్మమ్మ జయలక్ష్మి.
సాయంత్రం బజార్లో దొండకాయలూ, తోటకూరా, నాలుగు అరటికాయలూ కొనుక్కుని గాంధీ నగర్ లో ఉన్న జయలక్ష్మి ఇంటికి చేరింది గాయత్రి. వస్తూనే, “చిన్నమ్మమ్మా, నువ్వెందుకూ ఒక్కదానివే ఇంతదూరాన ఉండటం, వచ్చి మాతో ఉండరాదూ?” అంది, కూరగాయలు టేబుల్ మీద పెడుతూ. జయలక్ష్మి నవ్వి వూరుకుంది. ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళమ్మమ్మ రాజ్యలక్ష్మి చనిపోయినప్పటనుంచీ ఈ పిల్లలు తనని వాళ్ళతో వచ్చి ఉండమని అడుగుతూనే ఉన్నారు. కానీ తనకు బాగా అలవాటైన తన ఇల్లు వదిలేసి వెళ్ళాలనిపించడం లేదు.
ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ సీసా తీసుకుని వచ్చి జయలక్ష్మి పక్కనే కూర్చుంది గాయత్రి. “ఏంటి చిన్నమ్మమ్మా, ఏదో మాట్లాడాలన్నావు?”
ముందు దొండకాయకూర చేద్దామా, అరటికాయకూర చేద్దామా అని ఆలోచిస్తూ, ఆమెవైపు చూడకుండానే మృదువుగానే అడిగింది జయలక్ష్మి. “నువ్వు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లోపెట్టుకున్నావని విన్నాను. నిజమేనా?”
“అవును, నిజమే,” అంది గాయత్రి. ఆ అమ్మాయి గురించి చెప్పడం ఎక్కడ మొదలుపెట్టాలా అని ఆలోచిస్తూ.
“ఎవరా అమ్మాయి?”
“మా చెల్లెలే. నాన్న రెండో భార్య కూతురు,” అంది గాయత్రి, క్లుప్తంగా.
“అలాగానా? అతనికి మీరుగాక ఇంకా బిడ్డలున్నారని నాకు తెలియదే.”
“మాకూ తెలియదు. పోయిన ఏడో తేదీన నీకు ఫోన్ చేశాం గుర్తుందా? ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మీ నాన్న చనిపోయాడు, అంత్యక్రియలకు రమ్మని చెప్పారని. ఆ ఫోన్ చేసింది ఈ అమ్మాయే. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలిసింది, అమ్మను వదిలేసి నాన్న ఒకావిడతో వెళ్ళిపోయాడే, ఆమె ఒక బిడ్డను కని మూడు సంవత్సరాల తర్వాత చనిపోయిందట. తర్వాత నాన్న మళ్ళా పెళ్ళిచేసుకున్నాడట. ఆ మూడో భార్య గురించి నాకు పెద్దగా తెలియదు గాని, ఆమెకు ఏవో సమస్యలున్నట్లున్నాయి. చివరి రోజుల్లో నాన్నకు సపర్యలు చేసింది రెండో భార్య కూతురే. చనిపోయాడని మాకు ఫోన్ చేసింది కూడా ఆ అమ్మాయే.”
జయలక్ష్మి ముభావంగా మౌనంగా ఉండిపోయింది కొంతసేపు. అరటి కాయలను సింక్ దగ్గరకు తీసుకుపోయి కడుక్కొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా తరుగుతూ, “నువ్వు తీసుకొచ్చింది ఆ అమ్మాయినా?” అని అడిగింది.
“అవును చిన్నమ్మమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవ్వరూలేరు. ఆ అమ్మాయి మమ్మల్ని ఏమీ అడగలేదు. అంత్యక్రియలు తనే చేసింది. మేం వస్తామని అనుకోలేదనుకుంటాను. తిరుగు ప్రయాణం రోజు, వచ్చినందుకు మాకు కృతజ్నతలు చెప్పి వెళ్ళబోతుంటే, నేనే అడిగాను తన గురించి. ఆ అమ్మాయికి పదిహేను సంవత్సరాలు. హైస్కూల్లో చదువుతుంది. తనకెవ్వరూ లేరు. ఆ అమ్మాయి మా చెల్లెలేకదా? పెద్ద కూతురుగా చివరి రోజుల్లో నాన్నకు నేను చెయ్యాల్సిన పనులు ఆ అమ్మాయి చేసింది. మా ముగ్గురికీ ఏవో ఉద్యోగాలున్నాయి. తిండికి లోటులేదు. పెద్ద ఇల్లుంది. నేనే మాతో వచ్చి ఉండమన్నాను. పల్లవి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు పల్లవి. మా అడ్రెస్ ఇచ్చి నీకు ఇష్టమైనప్పుడు మా దగ్గరకు రావచ్చు అని చెప్పాను. పోయిన వారం వచ్చింది.”
జయలక్ష్మి కొంచెంసేపు ఈ విషయాలన్నీ జీర్ణించుకుంటున్నట్లు ఉండిపోయి, “అయితే ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అనుకుంటున్నావా?” అని అడిగింది.
“అవును. తల్లిలేకుండా పెరిగింది. హాయిగా ఉండాల్సిన చిన్న వయసులో నాన్నకు సేవలు చేస్తూ గడిపింది. ఇప్పుడు వచ్చి వారం రోజులయింది కదా. ఇంటి పన్లన్నీ తనే చేస్తానంటుంది. ఏదన్నా అడిగితేగాని మాట్లాడదు. ఆ అమ్మాయిని చూస్తుంటే పాపం ఎన్ని కష్టాలు పడ్డదో అనిపిస్తుంది.”
“సరే, అమ్మాయి మంచిదే. కానీ ఆ అమ్మాయిని పెంచడం నీ బాధ్యత అని నువ్వెందుకనుకుంటున్నావు? ఇద్దరు చెల్లెళ్ళను పెంచావు చాలదా?”
“అలా అంటావేం చిన్నమ్మమ్మా? మేము కాకపోతే ఆ అమ్మాయికి ఇంకెవరున్నారు?”
“ఉన్నారా లేరా అని కాదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? నీకు లేకుండా పోయిన బాల్యం ఆ అమ్మాయికికూడా లేకుండా పోయిందని నువ్వు విచారిస్తున్నావు. మీ అమ్మా నాన్నలు పనికిమాలిన వాళ్ళు కావటంతో చిన్నప్పుడే బాధ్యతలు నీ మీద పడ్డాయి. ఆ అమ్మాయిక్కూడా నీలాగే చిన్నతనంలోనే బరువైన బాధ్యతలు మొయ్యాల్సొచ్చింది. ఆ అమ్మాయిలో నువ్వు నిన్ను చూసుకుంటున్నావు. కానీ పదిహేను సంవత్సరాల అమ్మాయిని పెంచడం ఎంత బాధ్యతతో కూడిన వ్యవహారమో తెలుసు కదా? నువ్వు ఇంకా పెళ్ళిచేసుకోలేదు. పెళ్ళికావాల్సిన చెల్లెళ్ళు ఇంకా ఇద్దరున్నారు. ఇప్పుడు ఇంకొక చెల్లెలా?” అందామె.
ఈ బాధ్యతల భారం గాయత్రికి తెలియని విషయం కాదు. కాని, ఎవ్వరూ లేని చెల్లెలిని అలా ఎలా వదిలేస్తుంది? పైగా ఆ అమ్మాయి ఎంత బాధ్యతగా చివరి రోజుల్లో నాన్నను చూసుకుంది!
గాయత్రి లేచి తోటకూర ఆకుని సింకులో శుభ్రంగా కడుగుతూ అక్కడే కొంచెంసేపు నిలబడింది.
జయలక్ష్మి కూడా అరటికాయ ముక్కల గిన్నెను తీసుకుని స్టౌ దగ్గరకు వచ్చి గాయత్రి భుజం మీద చెయ్యి వేసి, “వయసుతోపాటు రావాల్సిన తెలివి మీ అమ్మకు రాలేదు. నీకేమే వయసుకు మించిన తెలివీ మంచితనం ఇచ్చాడు భగవంతుడు,” అంది.
పల్లవి చీరాల వచ్చి దాదాపు మూడు నెల్లయింది. సులభంగానే అక్కలతో కలిసిపోయింది. హైస్కూలునుంచి రాగానే బట్టలుతకటమో, వంటచెయ్యడమో, ఇల్లు శుభ్రం చెయ్యడమో, బయట దొడ్లో పూలమొక్కలకూ కూరగాయల పాదులకూ నీళ్ళుపొయ్యడమో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. పెద్దక్క గాయత్రి అంటే గౌరవం, కొంచెం భయం కూడా. గాయత్రి అక్క కంటే, అమ్మలాంటిది అనే అభిప్రాయం ఏర్పడింది పల్లవికి. రెండో అక్క శివాని ఒక బాంక్ లో పనిచేస్తుంది. అక్కడ తనతో పనిచేసే ఒకతనంటే ఇష్టం లాగుంది. వీలు దొరికినప్పుడల్లా అతని మంచితనం గురించి చెప్తూ ఉంటుంది. చిన్నక్క వాసంతి పల్లవి కంటే మూడు సంవత్సరాలు పెద్దది. వాగుడుకాయ. టౌన్లో ఒక చెప్పులషాపులో పనిచేస్తుంది. తన బాయ్ ఫ్రండ్ కూడా తనలాగే వాగుడుకాయ. సాయంత్రం ఎప్పుడన్నా ఇంటికి వస్తాడు. అందరికీ కబుర్లు చెప్తాడు. ప్రస్తుతం ఉద్యోగం ఏదీ ఉన్నట్లు లేదు.
వాసంతితో మాట్లాడటం సులభంగా ఉండేది పల్లవికి. ఇద్దరి మధ్యా వయసులో పెద్ద తేడా లేదు. గాయత్రితో మాట్లాడటం అంటే కొంచెం భయంగా ఉండేది. కానీ తొందరలోనే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తండ్రి ఇల్లు వదలిపోయేటప్పటికి గాయత్రికి ఇప్పుడు పల్లవికున్న వయసు. ఆరోజుల్లో ఆయనకు సాయంత్రం సముద్రపు ఒద్దున నడవడం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. తనకు కూడా సముద్రం అంటే ఇష్టం అవడంవల్ల ఎప్పుడూ నాన్నతో వెళ్ళేది గాయత్రి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఆయనకు నడవడం అంటే ఇష్టంగా ఉండేదని చెప్పింది పల్లవి. నాన్న బయటకు వెళ్ళినప్పుడు పల్లవి వెంటవెళ్ళేది. తండ్రితో గడిపిన సమయం గురించి మాట్లాడుకుంటూ, ఆ జ్నాపకాలు పంచుకుంటూ పల్లవీ గాయత్రీ కొంత దగ్గరయ్యారు.
ఒక సాయంత్రం తన ఫ్రండ్ తో సినిమాకి వెళ్ళడానికి తొందర తొందరగా రెడీ అయి ఇంట్లోంచి బయటకు పరుగెట్టిన శివాని రబ్బర్ బంతిలాగా తిరిగి ఇంట్లోకొచ్చి పెద్దగా అరిచింది, “అమ్మా, చిన్నమ్మమ్మా వస్తున్నారే గాయత్రీ!”
అక్కా చెల్లెళ్ళు ముగ్గురూ పరుగెత్తుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చారు. పల్లవి తలుపు వెనక నిలబడింది. వీళ్ళను ఇదివరకు ఆ అమ్మాయి చూడలేదు.
అమ్మ మూడు సంవత్సరాలప్పుడు వదిలేసివెళ్ళిన వాసంతికి ఆమె రూపురేఖలు ఎలావుంటాయో తెలియదు. ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎంతో అందంగా, హుందాగా కనిపించింది. దాని బుగ్గలు నిమిరి, “నువ్వు వాసంతివి కదూ, ముద్దుగా ఉన్నావు,” అంది శారద. శివానిని దగ్గరకు తీసుకుని తలమీద ముద్దుపెట్టింది. గాయత్రి ముందుకు రాలేదు. చెల్లెళ్ళ వెనుక నిలబడి ఉంది. ఆమెకు ఎదురుగా నిలబడి, “బాగున్నావా?” అంది శారద. గంభీరంగా అలాగే మాట్లాడకుండా నిలబడింది గాయత్రి. ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి ఇంట్లోకి నడిచింది శారద.
హాల్లోకి వచ్చి ఒక్కసారి చుట్టూ చూసింది శారద. పదిహేను సంవత్సరాల నాడు వదిలేసి వెళ్ళిన ఇల్లు. పెద్దగా మారలేదు.
ఐదుగురూ హాల్లో కూర్చున్నారు. అక్కచెల్లెళ్ళకు ఎన్ని ప్రశ్నలో. మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి పోయావు? ఇప్పుడెక్కడుంటున్నావు? ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా? ఇప్పుడెందుకొచ్చావు? కానీ, అడిగే ధైర్యం లేదు, చనువూ లేదు. వాళ్ళకి ఇప్పుడామె పరాయి మనిషి.
తన పూర్వ చరిత్ర గురించి మాట్లాడే ధైర్యం ఆమెకూ లేదు. ఇప్పుడు సంజాయిషీలు చెప్పి ప్రయోజనం కూడాలేదు. వాళ్ళకు తన అవసరం లేదిప్పుడు. తను లేకపోయినా, ఆమె బతికున్నన్నాళ్ళూ అమ్మ మనుమరాళ్ళను బాగానే పెంచింది. అదృష్ట వశాత్తూ పిల్లలు బాగానే పెరిగి పెద్దవాళ్లయ్యారు.
ఏవో పైపై మాటలూ, ఉద్యోగాలూ, తోటలో మొక్కలూ ఇలాంటి విషయాల మీద సాగింది వాళ్ళ సంభాషణ.
సడెన్‌గా ఏవొక్కరివైపూ కాకుండా ఎదురుగా కూర్చున్న కూతుళ్ళ వైపు చూస్తూ, “ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను,” అంది శారద.
“ఏ ఇల్లు?” అడిగింది గాయత్రి.
“ఈ ఇల్లే.”
“ఈ ఇల్లు అమ్మటానికి నువ్వెవ్వరూ? పదిహేను సంవత్సరాలుగా ఈ ఇంటిని చూసుకుంది మేము. ఇంటి చుట్టూ శుభ్రం చేసింది మేము. దొడ్లో మొక్కలకు నీళ్ళు పోసింది మేము. ఇప్పుడొచ్చి ఇల్లు నీదైనట్లు మాట్లాడ్డానికి సిగ్గులేదూ?
“ముగ్గురు బిడ్డల్నొదిలేసి నీ దోవ నువ్వు పోయావు. అమ్మమ్మ లేకపోతే మేం ఏమైపోయేవాళ్ళం? పాపం అంత వయసులో ఎన్ని కష్టాలుపడిందామె మాకోసం! ఆమె పోయినప్పుడుకూడా రాలేదు నువ్వు. నీకు తల్లీ అక్కర్లేదు, బిడ్డలూ అక్కర్లేదు. నువ్వసలు మనిషివేనా?” ఇన్నాళ్ళూ దాచుకున్న కోపాన్నంతా ఒక్కసారిగా వెళ్ళగక్కింది గాయత్రి.
తల్లి చనిపోయిన విషయం నిన్న పిన్ని చెప్పిందకా శారదకు తెలియదు. కొంచెం సేపు తలవంచుకుని మౌనంగా ఉండిపోయిందామె. ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని నొక్కింది జయలక్ష్మి. భావోద్రేకం కొంచెం తగ్గిన తర్వాత, “మీ నాన్న నన్నూ మిమ్మల్నీ వదిలేసి ఆవిడతో లేచిపోయి….. నాకీ వూళ్ళో తలెత్తుకు తిరగడం వీలుకాకుండా చేశాడు,” అని మాత్రం అంది శారద.
“ఆయనొక పనికిమాలిన వాడు, నువ్వు అంతకంటే ఏమీ తక్కువ కాదు. ఏదో మీ చావు మీరు చచ్చారు. ఈ ఇల్లు మాత్రం నీది కాదు, మాది. ఇల్లు అమ్మే అధికారం నీకు లేదు,” అంది గాయత్రి.
శారద చేతిని మళ్ళా నొక్కిపట్టుకుంది జయలక్ష్మి.
“సరే, నీ ఇష్టం. ఎపార్ట్మెంట్లు కట్టుకునేవాళ్ళు అడిగితే మీక్కూడా ఎపార్ట్మెంట్లయితే సులభంగా ఉంటుందేమో అనుకున్నాను. కొంత డబ్బిస్తామన్నారు. మూడు ఎపార్ట్మెంట్లు కూడా ఇస్తామని అన్నారు. సరే మీ ఇష్టం,” అంది శారద.
“మాకు వాళ్ళ ఎపార్ట్‌మెంట్లు అవసరం లేదు. ఇక్కడయితే అందరం కలిసుంటాం. పైగా, ఇప్పుడు మేము ముగ్గురం కాదు, నలుగురం,” అని “పల్లవీ” అని పిలిచింది గాయత్రి.
తలుపు వెనుక నుంచి వచ్చి గాయత్రి పక్కన నుంచుంది పల్లవి.
“ఈ అమ్మాయి నాన్న రెండోభార్య కూతురు,” అని పరిచయం చేసింది.
పల్లవి రెండుచేతులు జోడించి తల వంచి నమస్కారం చేసింది.
“పిన్ని చెప్పింది నిన్న,” అని, పల్లవిని దగ్గరకు రమ్మని పిలిచి, ఆ అమ్మాయి తల నిమిరింది శారద.
ఒక గంటసేపు ఉండి పిన్నితో వెళ్ళిపోయిందామె. వెళ్తూ తనకూతుళ్ళకూ పల్లవికీ తీసుకొచ్చిన డ్రెస్సులు ఇచ్చిపోయింది.
ఆమె వెళ్ళిపోగానే, “నువ్వెప్పుడూ అంతేనే గాయత్రీ, నీకు ఆమంటే ఎప్పుడూ కోపమే. కొంచెం బాగా మాట్లాడితే నీదేం పోయేది?” అని తప్పుపట్టింది వాసంతి.
“నీకంత ఇష్టంగా ఉంటే ఆమెతో వెళ్ళు, నేనేమీ బలవంతం చెయ్యడం లేదు నిన్ను ఉండమని,” అంది గాయత్రి.
“ఎందుకే అక్కని అలా అంటావు. ఆమె వదిలేసిపోతే మనల్ని సాకింది అక్కేగదా? అక్కకు ఆమాత్రం కోపం రాదా? అక్కా అమ్మమ్మా నీకు ఎలాంటి లోటూ రాకుండా పెంచారు. అందువల్ల నీకు తల్లిలేని లోటంటే ఏంటో తెలియదు. సంతోషంగా ఉండాల్సిన రోజుల్లో అక్కమీద ఎంత బాధ్యత పడిందో నీకేం తెలుసు?” అని జాడించింది శివాని.
“తెలుసులేవే. కానీ అది అంతా అమ్మ తప్పేనా? ఆ దరిద్రపుది పెళ్ళై, ముగ్గురు బిడ్డలున్నవాడిని వల్లో వేసుకుని తీసుకుపోయింది. మరి అమ్మకు కష్టంకదా? పాపం, ఎంత బాధపడిందో!” అంది వాసంతి.
పల్లవి తన గదిలో ఉందేమో, అంతా వినపడుతుందేమో అని సంకోచిస్తూ, “తప్పంతా పరాయివాళ్ళమీద నెడితే ఎలాగే? నాన్నకు బుద్ధుండొద్దూ? ముగ్గురు బిడ్డలున్నవాడు ఇంకొకావిడతో సంబంధం పెట్టుకోవడమేంటీ?” అంది శివాని.
“అవును ఆయన బుద్ధిలేనివాడే. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడంతప్పే. మరిప్పుడు అక్క చేస్తుందేమిటీ? దాని ఫ్రండ్ కి పెళ్ళయింది కదా? మరి ఇన్ని తప్పులుపట్టే అక్క అతనితో స్నేహం చెయ్యటం తప్పుకదా?” అని గాయత్రి వైపు చూసింది వాసంతి.
గాయత్రి చివాలున అక్కడనుంచి లేచి తన రూమ్ కి వెళ్ళిపోయింది. తలుపు వెనకనుంచి అంతా వింటున్న పల్లవి తన గదిలోకి వెళ్ళిపోయింది.
రెండుమూడు రోజులు ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. నిజానికి మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నం చేశారేమో.
ఒక రాత్రి భోజనాల తర్వాత పల్లవి గదిలోకి వచ్చింది గాయత్రి. మంచం మీద ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. శారద వచ్చిపోయింతర్వాత ఇద్దరూ ఏకాంతంగా కలవడం ఇదే మొదటి సారి. తలవంచుకుని కూర్చున్న పల్లవి కళ్ళవెంట నీళ్ళు రావడం గమనించింది గాయత్రి.
“ఎందుకు పల్లవీ, నువ్వెందుకూ ఏడుస్తున్నావు?”
“మీ అందరికీ నావల్లే కదక్కా ఇన్ని కష్టాలు. నేను పుట్టకపోతే మీరందరూ బాగుండేవాళ్ళు కదూ?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందా అమ్మాయి.
“అదేంటి పిచ్చి పిల్లా. ఇందులో నీ తప్పేముందీ. మా నాన్నా, మీ అమ్మా వెళ్ళిపోయినప్పటికి నువ్వింకా పుట్టలేదుకదా? ఇందులో నీ తప్పు ఏముందీ?”
“మా అమ్మే కదా అక్కా మీ కుటుంబాన్ని నాశనం చేసింది.”
పల్లవిని దగ్గిరకు తీసుకుని తల నిమిరింది గాయత్రి.
“చానాళ్ళు నేనూ అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకొవడం లేదు.”
తలపైకెత్తి గాయత్రి కళ్ళల్లోకి చూసింది పల్లవి.
పల్లవి చేతులను తన చేతుల్లోకి తీసుకుని, “మీ అమ్మకు ఆరోజుల్లో ఏవో ఇబ్బందులుండేవి. ఆమెకు నాన్న సహాయం చేస్తూ దగ్గరయ్యాడు. మా అమ్మ వాళ్ళను అనుమానిస్తూ నాన్నను దూరం చేసుకుంది. ఇందులో అందరి ప్రవర్తనలో లోపాలున్నయ్. తప్పంతా మీ అమ్మది అనడం సరైంది కాదు,” అంది గాయత్రి.
“కానీ, నాన్న అప్పటికే పెళ్ళైనవాడు కదా. మా అమ్మ…..”
“పల్లవీ, మొన్న వాసంతి అన్న మాటలు విన్నావుగా నువ్వు. అక్క చేస్తుంది కూడా తప్పేగదా అంది గుర్తుందా?”
తల ఊపింది పల్లవి
“మీ అమ్మను తప్పు పట్టడం సులభం. కానీ…ఒక మనిషి పరిచయం అవుతాడు. ఆ మనిషి మంచితనం, పనితనం, సభ్యతా, అందరికీ అతను ఇచ్చే గౌరవం నీకు ఇష్టం అవుతాయి. ఆ మనిషి మీద గౌరవం ఏర్పడుతుంది. మనసులో అతనితో ఏవో తెలియని సంబంధాలు బలపడతాయి. కాని అతనికి పెళ్ళయిందని తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ముందు పెళ్ళయిందో లేదో కనుక్కుని, కానివారికే దగ్గిరవాలా? అలా చేస్తే అదేదో వ్యాపారం లాగా ఉండదూ?”
పల్లవి ఏమీ సమాధానం చెప్పలేదు.
“మా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ భరద్వాజ్ అంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య స్నేహం ఏర్పడ్డాక చాలా కాలానికి నాకు అతని వ్యక్తిగత విషయాలు తెలిశాయి. అతనికి పెళ్ళయి దాదాపు పదేళ్ళయింది. మొదటి రెండు మూడేళ్ళు బాగానే ఉండేవాళ్ళట. ఆ తర్వాత క్రమంగా ఒకరికొకరు దూరం అవుతూ వచ్చారు. వాళ్ళ మనస్తత్వాలు వేరు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా వాళ్ళ మధ్య సఖ్యత అయితే లేదు. అతనికి పెళ్ళి అయింది కాబట్టి నేను అతన్ని దూరంగా ఉంచాలా? స్నేహాన్ని తెంపేసెయ్యాలా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. మీ అమ్మ కూడా ఇలాంటి సందిగ్ధంలో పడి ఉంటుంది. మనం పెళ్ళిచేసుకుందాం అని చాలా సార్లు అడిగాడు భరద్వాజ్. నేను ఇంతవరకూ ఒప్పుకోలేదు. నాకు బాధ్యతలున్నాయనీ, నేను పెళ్ళిచేసుకోలేననీ చెప్తూ వచ్చాను. కానీ పెళ్ళయింది కాబట్టి అతనికి జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా బ్రతికే హక్కు లేదా? ఇష్టంలేని మనిషితోనే జీవితం గడపాలా? అతనితో స్నేహం చెయ్యడం తప్పా? పెళ్ళికి ఒప్పుకోకపోవడం తప్పా? ఏమో. అన్నీ ప్రశ్నలే. సంతృప్తికరమైన సమాధానాలే లేవు.”
పల్లవి ఏమీ మాట్లాడలేదు.
పల్లవి తల నిమురుతూ, “ప్రశ్నల దగ్గరే ఆగిపోయాన్నేను. మీ అమ్మ ధైర్యం చేసి ఒక బాటను ఎంచుకుంది. ఇంత మంచి అమ్మాయిని మాకిచ్చి వెళ్ళిపోయింది,” అని పల్లవి తల మీద ముద్దు పెట్టి తన గదికి వెళ్ళిపోయింది గాయత్రి.
ఈ కథకు ఆధారం ప్రఖ్యాత జపాన్ రచయిత్రి అకిమి యోషిడ రాసిన ఉమిమాచి డయరీ. కథను ప్రఖ్యాత దర్శకుడు హిరొకజు కొరేడ “Our Little Sister” పేరుతో సినిమాగా రూపొందించాడు.
****
వృత్తి: ఒక్లాండ్ యూనివర్సిటీ (మిషిగన్) లో బయోమెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్. 35-40 కథలు రాశాను. రెండు కథా సంపుటాలు వచ్చాయి: గట్టు తెగిన చెరువు, కేన్యా టు కేన్యా. కొన్ని అనువాదాలు చేశాను: వోల్గా, చంద్రలత, విమల గారి కథలు. సైన్స్ గురించి తెలుగులో వ్యాసాలు రాయడం ఈ మధ్యే మొదలు పెట్టాను.