కొత్త అడుగులు – 27

 చిట్టి చిట్టి అడుగులతో లక్ష్మీశ్రీ

– శిలాలోలిత

లక్ష్మీ శ్రీ కి కవిత్వమంటే చాలా ఇష్టం.సాహిత్యం మనుష్యుల ప్రవర్తనలో,ఆలోచనా విధానాలలో ,మార్పును తీసుకు వస్తుందని నమ్ముతుంది.లక్ష్మీ శ్రీ అసలు పేరు లక్ష్మి మామిళ్లపల్లి. కలం పేరు లక్ష్మి శ్రీ. అమ్మ నాన్నలు సుజాత,రాఘవులు.ఆగస్టు 6,1976 లో పుట్టింది.ఖమ్మం జిల్లా వాసి. ఎమ్మెస్సీ బాటనీ,బి.ఎస్ ,ఎం.సి.జె (జర్నలిజం )ఇష్టంగా చేసింది. ఎం.పీ ఈవో గా వ్యవసాయరంగంలో కొంతకాలం, 10 టీవీ  లో న్యూస్ ఎడిటింగ్ లో కో ఆర్డినేటర్ గా చేసింది. ప్రస్తుతం సైన్స్ టీచర్ గా  ఖమ్మం లో పనిచేస్తుంది.

    “మట్టి వేళ్ళు” కవి కట్టా శ్రీనివాస్ సహచరుడు కావడంవల్ల ఆమెలో సాహిత్య అభిలాష మరింత పెరగడానికి దోహద పడింది. “రక్షిత సుమ” చిట్టి  కవయిత్రి లక్ష్మీ శ్రీ కూతురు.”నాందిపాట “అనే కవితా సంకలనం వేసింది.గతంలో రక్షిత గురించి నెచ్చెలి లో రాసాను కూడా. లక్ష్మీ శ్రీ అత్తగారు లీలావతమ్మ గారే తనకు తొలి వ్రాత అని తృప్తి గా చెప్పమన్నారు.

     ఇలాంటి ఇందరు సహృదయులు మధ్య కవిత్వం విరబూయ కుండా ఎలా  ఉంటుంది?పుస్తక పఠనం చిన్నప్పటినుండీ అలవాటే. వ్యాస రచనల లోనూ,వక్తృత్వం పోటీల్లోనూ బహుమతులు పొందడం, రాయడం ఆమెకెంతో సంతోషాన్ని మిగిల్చాయి. పలు పోటీల్లో లభిస్తున్న బహుమతులు ఆమెకెంతో ఉత్సాహాన్ని నింపాయి. 2001-02 లో “బనానా ట్రీ”అనే పుస్తకం లో హైకూ లు కూడా ప్రచురించారు.తనను ప్రశ్నించినప్పుడు  సాహిత్య వాతావరణం ఉండడం, మిత్రులతో సాహిత్య చర్చలు అవగాహనను విస్తృత పరిచాయంది.హైదరాబాద్ గోల్డెన్ త్రెష్ హాల్లో  జరిగే “కవి సంగమం”,కవితా సమావేశాలకు హాజరవడం వల్ల కవిత్వ గాఢత బాగా అర్థమయింది  అంది.  సరైన జీవన విధానం ఏర్పరచుకోవడానికి సాహిత్యం ఒక దిశానిర్దేశం చేసింది. కవి సంగమంలో,ఫేస్బుక్ లో, కవితలు చదవడం రాయడం ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా నంది.నా కవితలకు మొదటి లైన్ మా అత్త గారిదే అని మురిపెంగా చెప్పుకుంది. కాలేజీ మేగజైన్ల కోసం మొదటగా రాసిన కవితలు ఒక చిత్రాన్ని చ్చి కాప్షన్ రాయమనడం  

నాలో వున్న భావాలను అక్షరాలుగా ఉపయోగపడ్డాయి.రంగనాయకమ్మ, చలం రచనలు,శ్రీశ్రీ కవిత్వాన్ని చదవడం ఒక మంచి దృక్పథాన్ని చ్చిందని అంది. 

మనుషులలో అసమానతలకు స్పందనగా కవితలు డైరీలో రాసుకునే దానిని, మొదటగా,ఇప్పుడు మనసు స్పందించిన అంశాలను కవిత రాని  అందరితో పంచుకునే అవకాశాన్ని అంతర్జాలం కలిగించింది. కవిత్వం లో మొదటి పరిచయం సాహితీ స్రవంతి నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొనడం.అదే సమయం లో యాకుబ్సర్,శిలాలోలిత గార్ల పరిచయం ఏర్పడింది. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో తాను రాస్తున్న కవితల కు మంచి సూచనలు అక్కడి కవిత వాతావరణం కవి మిత్రుల కవితా శైలి తనను తాను మెరుగు పరుచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.  ఇదీ కొంత మేరకు ఆమె నేపధ్యం. ఇక ఆమె కవిత్వం లోకి ప్రయాణిస్తే “ప్రేమించలేదు” కవిత వేదనతో రాసింది. 

ఉదయపు దేహం 

సాయంత్రానికి నిర్జీవంగా 

ఒక్కసారిగా కుప్పకూలితే 

ఫలితం జీవిత కాలపు శోకం 

అమ్మ.. అనే పిలుపుకు దూరం 

తల్లుల్లారా మనల్ని మనం ప్రేమించుకుందాం 

జీవితాన్ని జీవిత కాలం జీవిద్దాం

మనదైన లోకానికి 

జీవిత కాలం ఆశాదీపమౌదాం 

అయినా వారికి ఆసరా అవుదాం

బతుకుదాం బతుకునిద్దాం  

ప్రేమించుదాం  ప్రేమను పంచుదాం.  సరిగ్గా ఏడాది క్రితం రాసిన కవిత ఇది. 

అతిధి మా రాణీ – దూరమైపోతున్న ప్రకృతినీ పిచుకలు ప్రేమించే చిట్టి పిచుక పై రాసిన కవిత ఇది. మనకు దూరమైపోతున్న విలువల్ని ప్రశ్నించిన కవిత. 

నీ కోసం – కవితలో చుట్టూ మనం  రోజూ చూస్తున్న మామూలు విషయాల గురించి అపురూపంగా రాయడం ఈమె ప్రత్యేకత. 

“మంచు దుప్పటి 

తొలగిన 

నారింజ  ఎర్రని బంతిగా 

నిను చూడటం 

ఇంకా బాగుంది” –

చిన్న చిన్న విషయాలు కూడా మెత్తటి మనసున్న కవికి ఎలా కనిపిస్తాయో చెప్పిన సహజ కవిత. 

తల్లిని గురించి రాసిన అద్భుతమైన కవిత “ప్రేమ బందీ”.ఈ భూమ్మీద వేకువల్ని చూడగలుగుతున్నామంటే అది అమ్మ వల్లే నంటుంది. ఒక స్టేట్మెంట్  ల చిన్న చిన్న మాటల్తోనే  తేల్చేసిందిలా. అమ్మ దేవత కాదు,జీవిత కాలపు ప్రేమ బందీ. గోరుముద్దలు పంచిన ఆమెకు కావలసినది చిటికెడు ఆప్యాయత కలిపిన పిడికెడు అన్నం ముద్ద-అనడం లో దుఃఖపు తెర కమ్ముకుంటుంది పఠితుల్ని. “ముసిరిన ఆకాశం” కూడా మనసును హత్తుకునే కవిత.మానవ సంబంధాల విలువలను తెలియ చెబుతుంది. నిన్న,నేడు,రేపు లలో,అవే కళ్ళు కవిత లో వ్యక్తీకరించిన రీతి బాగుంది. సామాన్యమైన వాక్యాలను తీసుకుని అసామాన్యంగా కవితానల్లడం ఈమె ప్రత్యేకత. 

పిల్లల కవిత్వాన్ని గురించీ,రాబోయే రోజుల్లో సైతం,వాళ్లకు ధైర్య కవచమై ఎలా నిలబడాలో చెప్పిన కవిత అవేకళ్ళు. మనహొళె కూడా అలా ఆలోచనల్ని రేకెత్తించే కవితే. 

మారే ఋతువులు 

చలన శీలతకు రుజువులు. 

ఉరుకుల పరుగుల గమనంలో 

ముందూ వెనక చూడని మనిషి 

పరిగెడుతూ పరిగెడుతూ 

బురదలో పడి 

ఊపిరాడక తీరిగ్గా విలపిస్తున్నాడు 

తిరిగిరాని ప్రాణాలని కాపాడేదెవరని-  ఆలోచించిన కొద్దీ అసంఖ్యాకమైన అర్ధాలిందులో వున్నాయి.ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మొక్కలాంటిది లక్ష్మీశ్రీ కవిత్వం.దానికి తగినంత నీరు పోసుకునేందుకే విస్తృత అధ్యయనం చేస్తుంది.

తనను తాను నిలబెట్టుకునే  పడుతుంది. ఆమెకు రాయాల్సిన,రాయాలన్న అంశాలు చాలా వున్నాయి. అవన్నీ రాయాలి కూడా.చిన్న చిన్న మాటల్లోనే భావ గాఢతను నింపిన ఈమె కవిత్వాన్ని అందరం పలకరిద్దాం.కవిత్వ సృజనలో ఆమె చూపుతున్న ప్రతిభను గౌరవిద్దాం.    

*****

Please follow and like us:

3 thoughts on “కొత్త అడుగులు-27 లక్ష్మి శ్రీ”

  1. నా కవిత్వాన్ని ప్రోత్సహిస్తున్న సహృదయులు శిలాలోలిత మేడం కు, కొత్త అడుగులతో మీ అందరినీ ఇలా పలుకరించే అవకాశం కలుగజేసిన నెచ్చెలి గీతా మాధవి మేడం కు ధన్యవాదాలు, నమస్సులు.

    1. నెచ్చెలి ద్వారా మిమ్మల్ని పరిచయం చెయ్యడం చాలా సంతోషం లక్ష్మి గారూ! నెచ్చెలికి కవిత్వం రాయండి. editor@neccheli.com

Leave a Reply

Your email address will not be published.