నారి సారించిన నవల-29
రంగనాయకమ్మ-6
-కాత్యాయనీ విద్మహే
రంగనాయకమ్మ నవలల వస్తు నిర్వహణలో 70వ దశకం తెచ్చిన మార్పు కీలకమైనది. 1970 వరకు ఆమె వ్రాసిన నవలలు 20వ ఏట జరిగిన పెళ్లి కారణంగా జీవితంలో కలిగిన దుఃఖం నుండి వచ్చినవి. ( ఇంటర్వ్యూ , గమనం వార్షిక సంచిక 2001, ఏప్రిల్ , చూడు: మానవ సమాజం – నిన్న- నేడు- రేపూ 2008 , మూడవ ముద్రణ , పు; 333) పది పదకొండు ఏళ్ల దాంపత్య నరకం నుండి 1971 లో బయటపడిన రంగనాయకమ్మ (పైదే , పు: 341)ఆ దశకంలో తనను తాను నిలబెట్టుకొనటానికి ,నిలదొక్కుకొనటానికి చేసిన ప్రయత్నాలలో ఆసరాగా దొరికిన కొత్త స్నేహాలు, సాహిత్య వాతావరణం ఆమె దృష్టిని మార్క్సిజం వైపు మళ్లించాయి.ఆ దిశగా సాగిన అధ్యయనం స్త్రీ జీవితాన్ని కొత్తకోణం నుండి చూసి అవగాహన చేసుకొనే చైతన్యాన్ని ఇచ్చింది. దాని ప్రభావం ‘చుట్టాలు’ నవలతో ప్రారంభించి ‘జానకి విముక్తి’ నవలలో ప్రముఖంగా కనిపిస్తుంది.
1
చుట్టాలు నవల 1978 లో వ్రాయబడి 1979 జనవరి నుండి ప్రజాసాహితి పత్రికలో సీరియల్ గా వచ్చి అదే సంవత్సరం పుస్తకరూపం తీసుకున్నది. ఇంటి పని గురించిన చర్చ ఈ నవలేతి వృత్తంలో కీలకమైనది. వరలక్ష్మి రామ్మూర్తి భార్యాభర్తలు. వాళ్లకు పసిపిల్లవాడు. ఎదో ఒక పని మీద దాదాపు ప్రతివారం ఎవరో ఒకరు బంధువులమంటూ వచ్చి పోయే ఇల్లు వాళ్ళది. వచ్చిన వాళ్లకు వండి వార్చటం, సేవలు చేయటం , సౌకర్యాలు సమకూర్చటం ఇల్లాలి బాధ్యత అయి ఇంటి పని భారాన్ని ఎంత పెంచుతుందో అది ఎంత హింసాత్మకంగా ఉంటుందో ఉంటుందో చూపిన నవల ఇది.
అతిధి అభ్యాగతులను ఆదరించి సేవించటం గృహస్థ ధర్మం అని చాలాకాలంగా చెప్పబడుతూ వస్తున్నది. ఆ ధర్మానికి భంగం కలగకుండా జీవించాలన్న పట్టుదలతో సంపదలు కరిగి పోయి పతనమైన కుటుంబాలు లేకపోలేదు. వ్యక్తి సౌఖ్యానికి హాని కరమైన స్థాయిలో అతిథిమర్యాద ఆధునిక కాలంలో గర్హనీయం అయింది. కందుకూరి వీరేశలింగం పంతులు ఈ విధమైన సంప్రదాయాలు, తనకు మాలిన ధర్మాలు వదిలించుకొనవలసినవి అని రాజశేఖర చరిత్రలో రాజశేఖరుడి అనుభవ ముఖంగా చెప్పించాడు. వెనకాల ఒక ఎకరం పొలం ఉండి ఏడాదికి అయిదారు బస్తాల ధాన్యం ఇల్లు చేరకపోతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న రామ్మూర్తి ఈ బంధువుల తాకిడిని తట్టుకొనలేక పోయి ఉండేవాడని చుట్టాలు నవలచూచాయగా చెప్తూనే ఉంది. అయితే ఈ సమస్యను రామ్మూర్తి కి సంబంధించిన ఆర్ధిక కోణం నుండి కాక వరలక్ష్మి కి సంబంధించిన ఇంటిచాకిరి కోణం నుండి నిర్వహించటం రంగనాయకమ్మ ప్రత్యేకత.
తరచు చుట్టాలు వచ్చి రోజుల కొద్దీ ఉండిపోతుంటే పప్పు ఉప్పుల పాలు పెరుగుల కాయగూరల కోసం పెట్టాల్సిన వ్యయం పెరిగి యజమాని మీద భారంపడుతుందనేది పైకి తెలిసే సమస్య. కానీ చుట్టాలు వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లాలికి పెరిగే ఇంటిచాకిరి సంగతి ఎవరికీ తెలియనిది , పట్టనిది. పితృస్వామిక కుటుంబ సంస్కృతిలో ఇంటి పనితో మగవాడికి అసలు ప్రమేయం లేదు. అందువల్ల వరలక్ష్మికి పని ఒత్తిడిలో భర్త చేసే సహాయం కూడా ఉండదు. ఇంటిపనిని ఆడవాళ్ళ ఒంటరి బాధ్యతగా భావించటం అలవాటుచేసిన సంస్కృతి అతని చేత ‘మొగాళ్ళం బయట పదేసి గంటలు కష్టపడి ఇళ్ళకొస్తాం మళ్ళీ ఇంట్లో కూడా చాకిరీ చెయ్యాలా’ అన్న తిరుగులేని ప్రశ్నను వేయించి ఆమె నోరు నొక్కుతుంది. ఈ పరిస్థితులలో ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే దుఃఖం గొంతుకు ఎగ దట్టే స్థితిలో వుంటుంది వరలక్ష్మి .
రుచుల రుచుల వంటలు చేయించుకొని తిన్న చుట్టాలు, స్నానాలకు నీళ్లు తోడి పోయించుకొనటం దగ్గర నుండి ఎంగిలి కంచాలు కడిగించుకొన్న చుట్టాలు, బట్టలు ఉతికించుకొన్న చుట్టాలు, పసిపిల్లవాడితో తాను నేలమీద ఎలా పడుకొంటుందో అన్న ఇంగితమైనా లేక మంచాలు ఆక్రమించిన చుట్టాలు వరలక్ష్మిని ఎంత హింసించారో చుట్టాల ముందర తన మాటకు ఏగాని విలువకూడా ఇయ్యక చులకన చేసే భర్త, నోరెత్తకు ,నోర్ముయ్యి , నువ్వేమి తెచ్చి పెడుతున్నావా అని అవమానకరంగా మాట్లాడే భర్త అంతగానూ హింసించాడు. అది భౌతికంగా చేసే శారీరక హింస కాకపోవచ్చు. అనుక్షణం చేసే వ్యక్తిత్వ హననం. తనదగ్గర ఏమాత్రం చనువు లేకుండా చేసే అధికారం. ఈ హింసానుభవం ఆమె అంతరంగాన్ని దుఃఖమయం చేసింది. ఇలాంటి అనేకమంది వరలక్ష్ముల దుఃఖానికి విరుగుడు ఇంటి పని ఆడవాళ్లది మాత్రమే కాదు , ఆడామగా కలిసి చేసుకోవలసినది అన్న అవగాహన లో ఉంది. పనికి ఆడామగా తేడాలేదు , ఎవరైనా ఏ పని అయినా చేయవచ్చు అన్న తెలివిడిలో ఉంది. ఆ అవగాహనను , ఆ తెలివిడిని ఇయ్యటానికి ఈ నవలలో నారాయణ పాత్ర ప్రవేశ పెట్టబడింది.
నారాయణ రామ్మూర్తి కి చదువుల కాలం నాటి స్నేహితుడు. ప్రజా సంఘాలలో పనిచేస్తూ కళా సాంస్కృతిక రంగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆపని మీదనే వచ్చి రామ్మూర్తి ఇంట్లో దిగాడు.ప్రజాసంఘాలలో పనిచేయటం వల్ల ఇంట్లో ఆడవాళ్ళ పని పట్ల గౌరవం, వాళ్ల పని భారాన్ని తగ్గించాలన్న స్పృహ పెంచుకొనే క్రమశిక్షణ అతనికి అలవడింది. అందువల్లనే అతను వాళ్ళింట్లో ఉన్న ఆ రెండు రోజులలో తన స్నానానికి తానే నీళ్లు తోడుకోవటం కాక బిందెడు నీళ్లు తోడుకొచ్చి ఇంట్లో పెట్టటం, మర్నాడు ఉదయం తొట్టికి నీళ్లు తోడి పొయ్యటం,అన్నం తిన్న కంచం కడిగి తెచ్చిపెట్టటం, తనపక్క తానే వేసుకొనటం, పిల్లవాడు ఉయ్యాలలో దొడ్డికి పోతే తీసి వాడికి కడిగి స్నానం చేయించటం, ఉయ్యాలను విప్పి కడిగి ఎండకు పెట్టటం, పాడైన పక్క బట్టలను ఉతకటం వంటి పనులు అన్నీ అతి సహజంగా బాధ్యతగా చేయగలిగాడు అతను. మగవాళ్ళు స్త్రీల పట్ల అంత సున్నితంగా బాధ్యతగా ప్రవర్తించగలరని వరలక్ష్మికి అర్ధమైన సందర్భం అది.
ఇంటిపనులు, పెంట పనులు ఆడవాళ్ళవి అనుకొనే భర్తను, అతనిలాంటి మగవాళ్ళనే తన బంధువులలో చూస్తూ , మగవాళ్ళు పనులు చేయకూడనివాళ్లే అని తనను సమాధాన పరచుకొంటూ సర్దుకొని సంసారం చేస్తున్న వరలక్ష్మిలో గొప్ప కదలికకు నారాయణ రాక, ప్రవర్తన కారణం అయ్యాయి. అట్లాంటి సంస్కారం మగవాళ్ళలో ముఖ్యంగా తన భర్తలో అభివృద్ధి చెందటం గురించి ఆశ పడుతుంది. ఆ పరిణామానికి స్త్రీలవైపు నుండి కూడా మార్పు అవసరం అని నారాయణ ముఖంగా సూచించింది రచయిత్రి. అసంతృప్తులను, అభిప్రాయాలను లోలోపల కుక్కేసుకోని దుఃఖంలో కూరుకుపోవడం, నిరాశామయ జీవితం గడపటం కాదు చేయవలసినది. భర్త లక్ష్యపెట్టడని, వ్యతిరేకిస్తాడని తెలిసినా అసంతృప్తులను వెళ్ళగక్కాల్సిందే. అభిప్రాయాలు నిక్కచ్చిగా ప్రకటించాల్సిందే .. ఈ ఘర్షణ క్రమం మార్పుకు దారితీస్తుంది అని నారాయణ వరలక్ష్మికి జీవితం పట్ల ఒక నమ్మకాన్ని వాగ్దానం చేయటంతో ఈ నవల ముగుస్తుంది.
ఇంటిపని గురించిన ఈ వివేకం , కుటుంబంలో సమానత్వం, ప్రజాస్వామికీకరణ దిశగా జరగవలసిన మార్పు గురించిన హెచ్చరిక మార్క్సిజాన్ని ముఖ్యంగా లెనిన్ ను చదవటం వల్లనే సాధ్యమయ్యాయి. ఈ మార్కిస్టు అవగాహన సంపూర్ణ స్థాయిలో జానకివిముక్తి నవల ఇతివృత్తం లో భాగమైంది. “ స్త్రీల విముక్తి , పురుషాధిక్యతకు ఆధారంగా వున్న ఆస్తి హక్కుల్ని తీసి వెయ్యగల కమ్యూనిస్టు సమాజంలోనే సాధ్యం “ అని చెప్పటానికి ( గమనం , 335) వ్రాసిన నవల జానకి విముక్తి.
2
నిజానికి చుట్టాలు నవలకంటే ముందే ప్రారంభించిన నవల జానకి విముక్తి. ఇందులో మొదటి భాగం 1977 లో ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వచ్చింది. 1980 లో రెండవభాగంకూడా ఆంధ్రజ్యోతిలో సీరియల్ గానే వచ్చింది. కమ్యూనిజాన్ని గురించిన చర్చలు ఉన్నాయని సీరియల్ మధ్యలో ఆపివేయబడింది. ఆతరువాత 1981 లో మూడవభాగాన్ని కూడా వ్రాసి ప్రచురించింది. ఆ రకంగా జానకి విముక్తి నవల 1977 నుండి 1981 వరకు నాలుగేళ్ల కాలం మీద వ్రాయబడిన పెద్ద నవల.
జానకి విముక్తి నవలలో కథ ఒక నాటి రాత్రి సత్యం జానకి ఇంటికి రావటంతో ప్రారంభ మవుతుంది. జానకికి విశాలాక్షి ఉత్తరం వ్రాయటానికి ప్రారంభించటంతో నవల ముగుస్తుంది. ఈ రెండు సంఘటనలకు మధ్య జీవిత పరిణామాలకు పట్టిన కాలం ఎంత? ఈ నవలలో జీవితం ప్రధానంగా జానకిది. సత్యం శాంత జీవితం, శారదా విశాలాక్షుల జీవితం, ప్రభాకర్ జీవితం కూడా ఇందులో వున్నాయి. వర్తమాన జీవన స్థితిగతుల పట్ల విమర్శనాత్మకంగా ఉంటూ జీవితాన్ని ఆత్మగౌరవంతో, విలువలతో కూడినదిగా నిర్మించుకొనాలన్న తహతహలో ప్రవర్తిం చిన వాళ్ళే అంతా. ఆ క్రమంలో వాళ్ళంతా జానకి చైతన్య వికాసానికి ప్రేరకశక్తులైనారు. జానకి జీవిత పరిణామాలు వీళ్ళందరితోటి స్నేహసంబంధాల వల్ల అభివృద్ధికరంగా రూపొందాయి. జానకి జీవితమే ప్రధాన స్రవంతి. అందువల్ల జానకి జీవిత పరిణామాలు ఎంతకాలం మీద విస్తరించాయో గమనించాలి.
జానకి విముక్తి నవల మొదటిభాగంలో కథ అంతా 24 గంటల మీద నడిచింది. ఒకనాటిరాత్రి సత్యం జానకి ఇంటికి వచ్చాడు. మర్నాడు పగలు ఆమె తన కష్టసుఖాలు, సంసారంలో వేదనలు అన్నకు చెప్పుకొన్నది. ఆ సాయంత్రం సత్యం మూర్తి ఇంటికి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేసరికి జానకి భర్త వెంకట్రావు ఆమెను సాధిస్తూ వేధిస్తూ ఉన్నాడు. సత్యం ఆగ్రహం పట్టలేక వెంకట్రావుతో తగాదాపడి ఆ రాత్రే జానకిని తీసుకొని తన ఊరికి బయలుదేరాడు.
జానకి అన్నగారితో పుట్టింటికి వచ్చి మూడునెలలువుతుంది. వెంకట్రావు ఆమెను తిరిగి రమ్మని ఉత్తరం వ్రాశాడు. తరువాత పదిహేనురోజులకు స్వయంగా తానే వస్తాడు. జానకి వెంకట్రావుతో కలిసి విజయవాడకు బయలుదేరటంతో రెండవభాగం ప్రారంభమవుతుంది. వెంకట్రావుతో విసిగిపోయి అతనిని ధిక్కరించి జానకి తనంతట తాను అతనింటి గడప దాటటంతో రెండవభాగం ముగుస్తుంది. తనకు భర్తకు వున్నసంబంధాలను కొత్తగా అర్ధం చేసుకొనటానికి జానకి చేసిన ప్రయత్నం ఇందులో ప్రధానం. వెంకట్రావు మారకపోతాడా అన్న ఆశ అడుగంటి పోవటానికి ఇక్కడ పట్టిన సమయం నాలుగైదు నెలలు.
మూడవ భాగం కథ ఒకనాటి మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ముగియటం కూడా ఒకనాటి మధ్యాహ్నమే. మధ్యాహ్నానికి ఈ మధ్యాహ్నానికీ మధ్యకాలం రెండుమూడేళ్ళు, జానకి భర్తను వదిలి వచ్చేసరికి రెండునెలలు గర్భవతి. ఆమె ప్రసవించటానికి పట్టిన ఏడెనిమిది నెల్లకాలం, పిల్లవాడి ఆటపాటలు అల్లరి ప్రస్తావనలను బట్టి వాడికి రెండేళ్ళయినా వుండటానికి వీలుంది కనుక ఆ కాలం కలుపుకుంటే ఈ భాగంలో కథ స్థూలంగా మూడేళ్ళ కాలం మీద నడిచినట్లే. సత్యంతో మొదటిసారి వచ్చి పుట్టింట్లో వున్న దాదాపు నాలుగునెల్ల కాలాన్ని, భర్తతో తిరిగి వెళ్ళి గడిపిన దుర్భర సాంసారిక జీవితకాలం నాలుగైదు నెలలు కలుపుకొని చూస్తే మొత్తం మీద జానకి విముక్తి నవల కథ నాలుగేళ్ళ కాలం మీద విస్తరించిందనుకోవచ్చు.
కథా ప్రారంభానికి జానకికి పందొమ్మిదేళ్ళు. 16 ఏళ్ళకే ఆమెకు పెళ్ళయింది. మూడేళ్ళ సంసార జీవితం ఆమెను ఏ ఆనందాన్ని మిగల్చలేదు. సహనం వృధా అయింది. తనను తాను ఎంత కుదించుకొన్నా ఎదుటి మనిషికి సంతృప్తి లేదని అర్ధమయ్యే కొద్దీ అతని అధికారం ఆమెకు అసహ్యమైంది. అతనిని భరించలేక బయటకు వచ్చి ఒక ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిగానూ, సామాజిక జీవిగానూ ఎదగటానికి ఆమెకు పట్టినకాలం నాలుగేళ్ళు. చైతన్యం ఎదుగు దల ఒకనాడు ఆగిపోయేవి కావు. నిరంతరం జీవిత సంబంధంలో చైతన్యాన్ని పదునెక్కించు కొనటం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఈ నవల జీవితానికి ముగింపును చెప్పదు. జీవితం కొనసాగటాన్ని చెప్తుంది. విశాలాక్షి జానకికి ఉత్తరం వ్రాయటం ప్రారంభించటంగా నవలను ముగించటం దానినే సూచిస్తుంది.
జానకి జీవితంలో నాలుగేళ్ళ కాలం మీద వచ్చిన పరిణామాన్ని ఈ నవల చిత్రించింది. ఆ నాలుగేళ్ళు ఏ నిర్దిష్ట చారిత్రక క్రమంలో ఇముడుతాయో ఆ సూచన మాత్రం ఎక్కడాలేదు. రెండవ భాగంలో సత్యం జానకికి వ్రాసిన త్తరంలో నీ తారీఖు లేని ఉత్తరం అందిందంటూ “ఉత్తరాల్లో తారీఖులు వెయ్యటం మరచిపోతావెందుకు? లేకపోతే తారీఖుల పట్టింపు లేనంతగా కాలాతీతంగా ఆలోచిస్తున్నావా?” అని అడుగుతాడు. సత్యం వ్రాసిన ఆ ఉత్తరంలోనైనా తేదీ. సూచించబడితే ఈ నవల కథ ఏ చారిత్రక నవలలో ప్రవర్తించిందో అంచనావేసే అవకాశం ఉండేది. అయితే ఈ నవలలో ఒక చోట పరోక్షంగా ఇంద్రవెల్లి సంఘటన ప్రస్తావన వచ్చింది.
కమ్యూనిస్టు పార్టీలో గ్రూపుల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళు నిర్వహిస్తున్న ఉద్యమాల తీరుతెన్నులను విమర్శిస్తున్నట్లుగా సత్యం జానకితో మాట్లాడుతూ (మూడవభాగం) నువ్వు చెప్పే ఉద్యమాల్లో నాయకత్వం చేసిందేమిటి? ముఖ్యమంత్రిని మార్చాలనీ, కాల్పుల మీద కోర్టు విచారణ జరపాలనీ, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకీ నష్టపరిహారం ఇవ్వాలనీ, అదీ ఒక ఉద్యమంలో కమ్యూనిస్టులు నేర్పవలసింది అని అంటాడు. ఈ డిమాండ్లు 1981లో ఇంద్రవెల్లిలో గిరిజనులు చేసుకొనతలపెట్టిన సభను భగ్నం చేయటానికి పోలీసులు కాల్పులు జరిపి గిరిజనులను చంపి భయభ్రాంతులను చేసిన సందర్భంలో ముందుకు వచ్చాయి. నాలుగేళ్ళు కథాకాలం కనుక 1977లో జానకి విముక్తి నవల ప్రారంభమై ఇంద్రవెల్లి దుర్ఘటన జరిగిన కాలంతో కలుపుకొని ప్రవర్తించిందనుకోవాలి. 1977 నవలారచన ప్రారంభం కూడా. అయితే నవలలో ఎక్కడా ఆ కాలంలో, ఆ కాలంలోని తదితర చారిత్రక ఘటనలతో కథకు సంబంధం సమకూర్చబడలేదు.
అలాగే ఆ నవలలో కథ అంతా అయితే హైదరాబాదులో లేకపోతే విజయవాడలో ప్రవర్తించింది. విజయవాడలో జానకి కాపురం. జానకి పుట్టిల్లు హైదరాబాదు, నవల కథాక్రమాన్ని అనుసరించి చూస్తే జానకి జీవితంలోని నాలుగేళ్ళలో నాలుగైదు నెలలు మాత్రమే విజయవాడలో గడిపింది. మిగిలిన కాలమంతా హైదరాబాదులోనే. జానకి విముక్తి నవలాకాలం 1977లో మొదలై 1981 తరువాత కాలంలో ముగిస్తే ఆ కాలంలో హైదరాబాద్ లో స్త్రీ సమస్యకు సంబంధించిగానీ, వామపక్ష రాజకీయ ఉద్యమాలకు సంబంధించి గానీ, ప్రభుత్వ విధానాలకు సంబంధించి గానీ జరిగిన ఏ ఒక్క అంశమూ, ఏ చిన్న సంఘటనా ప్రస్తావనగానైనా నవల కథలోకి ప్రవేశించలేదు. అందువలన జానకి విముక్తి నవలకు నిర్ధిష్ట దేశకాలాల నేపథ్యం లేకుండాపోయింది.ఇది ఎక్కడైనా ఎప్పుడైనా జరగ గలిగిన జీవిత పరిణామంగా చూపించ బడింది. కనుకనే జానకి విముక్తిని భావాల నవల (Novel of Ideas) అంటే సరిపోతుంది. స్త్రీ సమస్యను చర్చకు పెట్టటంలోనూ, స్త్రీ పురుష సంబంధాలలో పెరగవలసిన ప్రజాస్వామిక సంస్కృతిని స్పష్టంగా సూచించటంలోనూ, ప్రజాస్వామికీకరించబడిన కుటుంబం నమూనాను ఇయ్యటం లోనూ జానకి విముక్తి నవల ఒక ప్రభావవంతమైన పాత్ర నిర్వహించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
3
స్త్రీలు గురించే స్త్రీలే వ్రాసిన దానిలో స్త్రీల అనుభవకోణం వుంటుంది. స్త్రీ సమస్య గురించి పురుషులు వ్రాసిన దానికన్నా సహజ వాస్తవికతకు అవి దగ్గరగా వుంటాయి. వ్రాసిన స్త్రీల అస్తిత్వ చైతన్యస్థాయిని అవగాహనా స్థాయిని, దృక్పథానికి వున్న పదునును బట్టి ఆయా రచనలు స్త్రీల జీవిత సమస్యలను మూలాల నుండి సమర్ధవంతంగా ప్రతిపాదించ గలుగు తాయి. చర్చించగలుగుతాయి. అందువల్లనే స్త్రీవాద ఉద్యమం ఇన్నాళ్ళ మౌనజీవిత చరిత్రకు స్వస్తిచెప్పి నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ స్త్రీలను తమ అనుభవాల గురించి మాట్లాడమని కోరింది. వ్యక్తిగతమనే నెపం మీదనో కుటుంబ మర్యాద, సామాజిక గౌరవం అనే పరిధులకు లోబడో స్త్రీలు స్వేచ్ఛగా బిగ్గరగా తమ అనుభవాలను తోటి స్త్రీలతో పంచుకొనే అవకాశాలు ఇన్నాళ్ళు లేకుండా పోయాయి. 1975 తరువాత ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలకు స్వీయ అనుభవాల అభిప్రాయాల ఆలోచనల వినిమయానికి అనుకూలమైన ఒక వాతావరణం రూపొందింది. ఆ నేపథ్యంలో రంగనాయకమ్మ జానకి విముక్తి నవల వ్రాసింది.
స్త్రీ కావటం కుటుంబంలో అసమానతలు, అధికారాలు అనుభవంలోకి రావటం, వాటిని గుర్తించి వేదన పడగలిగిన మానవీయ చైతన్యం వికసించటం – ఈ కారణాల వల్ల రంగనాయకమ్మ ప్రారంభ నవలల్లోనూ స్త్రీల అనుభవాలు, ఆలోచనలూ, అస్విత్వవేదనలూ కనబడతాయి.స్త్రీల జీవిత సమస్యలను మరింత స్పష్టంగా పదునుగా గుర్తించటం, వాటి మూలకారణాల గురించిన అవగాహనను కనపరచటం, పరిష్కారానికి సంబంధించిన సాంఘిక విప్లవ దృక్పథాన్ని ప్రతిపాదించటం జానకి విముక్తి నవలలో కనబడతాయి. తెలుగులో స్త్రీల గురించి సైద్ధాంతిక నైశిత్యంతో స్త్రీల కోణం నుండి వ్రాయబడిన తొలి నవల జానకి విముక్తి. ఈ నవలలో స్త్రీల సమస్యకు స్త్రీల కోణం అనేది రెండు స్థాయిలలో చూడాల్సిన అంశం. ఒకటి ఈ నవలలో పాత్రలుగా వచ్చే స్త్రీల కోణం ఏమిటి అనేది. రెండు రచయితగా రంగనాయకమ్మ కోణం ఏమిటి అనేది.
పాత్రల విషయం తీసుకుంటే ప్రధానంగా జానకి, విశాలాక్షి స్త్రీ సమస్య అంటే ఏమిటనుకొంటున్నారో చూడాలి. ఆ సమస్యకు వాళ్ళకు తెలిసిన పరిష్కారం ఏమిటో, దానిని ఆచరణలోకి తెచ్చుకోగలిగిన స్థితి వాళ్ళకు వుందో లేదో చూడాలి. ఎందుకంటే సమస్యలను నిజంగా ఎదుర్కొన్నది వాళ్ళు గనుక. ఆ తరువాత శాంత గురించి చూడాలి. శాంతస్థాయి సాంఘికంగా, ఆర్థికంగా చైతన్యపరంగా జానకి, విశాలాక్షి వంటి స్త్రీల కంటే మెరుగైనది. అందువల్ల స్త్రీ సమస్య గురించి ఆమె దృక్పథం కొంత భిన్నంగా విశిష్టంగా వుండటానికి వీలుంది.
జానకి విశాలాక్షి ఇరుగుపొరుగు ఇళ్ళవాళ్ళు. ఇద్దరికీ స్నేహం. సమానమైన అనుభవాలు, అభిప్రాయాలు కలిగిన వాళ్ళమధ్యనే స్నేహం ఏర్పడుతుంది. జానకి, విశాలాక్షి ఇద్దరూ కుటుంబంలో నోరు విప్పి మాట్లాడటానికే వీలులేని అసమ సంబంధాలలో జీవిస్తున్న వాళ్ళు. భర్తల మూర్ఖమైన అధికారానికి తలవొగ్గి బ్రతుకుతున్నవాళ్లు. వాళ్ళకు ఊరట, అంతరంగాలను విప్పిచెప్పుకొనే అవకాశం ఈ స్నేహబంధంలోనే సాధ్యమైంది. మూడు నెలలు పుట్టింట్లో వుండి మళ్ళీ భర్త వచ్చి పిలిచాడని అతని వెంట బయలుదేరిన జానకికి ఇంట్లోకి వెళ్ళగానే వచ్చి తనను పలకరించే విశాలాక్షి స్నేహం గుర్తొస్తుంది. వెళ్ళేటప్పటికి విశాలాక్షి వూళ్ళో లేకపోవటం పెద్ద దిగులు కలిగించింది జానకికి. కడుపులో మాటలు రెండు మాట్లాడుకొనటానికి విశాలాక్షి ఒక్కతే ఆమెకు ఆధారం అందువల్ల ఆమె లేకపోతే జానకికి పిచ్చెక్కినట్లే అవుతుంది. ఇదంతా చెప్పటం ఎందుకంటే కుటుంబంలో ఒంటరివాళ్ళుగా చేయబడిన స్త్రీల వేదనలకు తోటి స్త్రీలతో స్నేహమే ఒక ఉపశమనంగా వుంటుందన్న విషయం సూచించటానికే.
అత్త భర్తల సాధింపుల వేధింపుల దుర్భర కాపురంలో లోలోపల నలిగిపోతున్న జానకికి విశాలాక్షి రాక అమిత సంతోషం కలిగించింది. జానకి అనుభవాలు విని విశాలాక్షి ‘బుద్ధిరాదమ్మ వీళ్ళకి‘ అని ఆమె అత్తను భర్తను ఉద్దేశించి అంటూ జానకికి సానుభూతి ప్రకటించింది. విశాలాక్షి భర్త ఇల్లు బాధ్యతలు పట్టకుండా, పెళ్ళాం పిల్లలను గాలికి వదిలేసి తిరుగుతాడని జానకికి బాధ. వాళ్ళు ఒకరికొకరు సాయం. ఒకరికొకరు ధైర్యం. వాళ్ళకు ప్రమీల ఒక ‘ఆదర్శ నమూనా‘. ఈమె ఈ నవలలో ప్రత్యక్షంగా కనబడదు. విశాలాక్షి, జానకి సంభాషణలో ప్రసక్తికి వస్తుంటుంది. జానకి వాళ్ళ ఇంట మూడో వాటాలో వుండే ప్రమీల ఉద్యోగస్తురాలు.
బహిష్టు సమయంలో నెలనెలా ఆ మూడు రోజులు బయట కూర్చొనటం జానకికి ఇష్టం వుండదు. ఇంట్లోకి రావటానికి అత్త ఒప్పుకోదు. ఆ విషయమై జానకికి విశాలాక్షి మధ్య సంభాషణ నడుస్తుంది ఒకసారి. అవసరాల ఒత్తిడి, ప్రమీల బోధతో తాను బయట కూర్చొనటం మానేసానని విశాలాక్షి చెప్తుంది. తాను మానేస్తానని అన్నప్పుడు మా అక్కయ్యకు నచ్చదంటూ భర్త అభ్యంతర పెట్టిన విషయాన్ని, ఆ నాలుగు రోజులు ఇంటికేరానని బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకొని విశాలాక్షి “ఈ మొగాళ్ళకి వాళ్ళ అమ్మల యిష్టాలూ, అక్కల ఇష్టాలే పట్టింపుగానీ పెళ్ళాల యిష్టాలక్కర్లేదు” అని నిరసనగా అంటుంది. అనుభవం విశాలాక్షికి పోషణ కోసమే ఆడది మొగుడి దగ్గర పడివుంటుందన్న అవగాహనను ఇచ్చింది. భార్యాభర్తల మధ్య జీవితకాలపు స్నేహసంబంధం ఆమెకు ఎక్కడా కనబడకపోవటమే అందుకు కారణం.
భర్తల పీడింపును భార్యలు ఇంకా గ్రహించుకోలేదు. గ్రహించుకోకనే వాళ్ళతో కాపురాలు చేస్తున్నారని సత్యం జానకికి వ్రాసిన ఉత్తరంలో చదివి విశాలాక్షి అతనింకా చిన్నవాడు. కష్టసుఖాలేం తెలుసు అని భర్త సంగతి తెలిసినా ఏ ఆధారం లేకపోవటం వల్ల ఆడది ఎక్కడికీ పోలేకపోతున్నదని అంటుంది. సత్యానికి కష్టసుఖాలు తెలుసు. ఆడవాళ్ళ కష్టసుఖాలు కొంత అర్థం చేసుకోగలిగిన లక్షణం వుంది. కానీ లోతు నుండి తెలుసుకోలేడని అందుకతని అనుభవం చాలదని ఎంతయినా అతనిది పురుషానుభవమే కానీ స్త్రీ అనుభవం కాదని స్త్రీపట్ల సానుభూతే కాని స్వానుభవం లేనివాడని విశాలాక్షి మాటకు లోతయిన అర్థం ఉంది. స్త్రీ సమస్యలకన్నిటికీ భర్త మీద ఆధారపడి బ్రతకటం కారణమని విశాలాక్షికి తెలుసు. అందువల్లనే భర్త నుండి వచ్చే పీడనను ధిక్కరించి బయటపడగలిగిన సాహసం చేయలేకపోతున్నారని అంటుంది. విశాలాక్షి అనుభవం ఆడదానికి కాస్తో కూస్తో తనదైన సంపాదన వుండాలన్న అవగాహనను ఇచ్చింది. ఆర్థిక స్వావలంబనే వుంటే ఏ బాధ్యతాలేని మొగుడ్నితాను, కత్తుల బోనులాంటి సంసారాన్ని తన చెల్లెలు వదులుకోగలిగే వాళ్ళమన్నది ఆమె అభిప్రాయం.
జానకికి అర్థంకాని విషయాలు, అర్థం చేసుకొనటానికి భయపడే విషయాలు జానకి కంటే ఎక్కువగా పందొమ్మిదేళ్ళ సంసార జీవితానుభవం వున్న విశాలాక్షి ఇట్టే గ్రహిస్తుంది. భర్త శత్రువో, స్నేహితుడో గ్రహించుకోవాలని మూర్తి వ్రాశాడని జానకి చెప్తే విశాలాక్షి నిజమే మొగుళ్ళు యముళ్ళేననటం, మొగుడు శత్రువుగాక స్నేహితుడవుతాడా అనటం కటువుగా కనిపించినా కఠోర వాస్తవ జీవితానుభవం నుండి అలా తప్ప మరొకలాగా అనలేకపోయింది. ఆడదానికి తాను అనుకొన్న పని చేయటానికిగానీ, చేయకుండా వుండటానికి గానీ, భర్తల అధికారాన్ని పెత్తనాన్ని ధిక్కరించి బయటపడటానికి గానీ ఆర్ధిక స్వావలంబన లేకపోవటం ప్రధాన సమస్యగా విశాలాక్షి గుర్తించింది. ఉద్యోగం చేస్తున్న ప్రమీల స్వతంత్రంగా తన అభిప్రాయాలు ప్రకటించటంగానీ, నిర్ణయాలు తీసుకొనటంగానీ ఆర్థిక స్వావలంబన వల్లనే సాధ్యమైందని విశాలాక్షి నమ్మకం. విశాలాక్షికి భర్త నుండి ప్రేమ లభిస్తుందన్న ఆశలు భ్రమలు ఏమీ మిగల్చలేదు ఆమె పందొమ్మిదేళ్ళ వైవాహిక జీవితం. నలుగురి పిల్లలను పోషించటం ఎట్లా అనేదే ఆమె సమస్య పుట్టింటి సహాయం అంతో ఇంతో అప్పుడో ఇప్పుడో లభిస్తున్నా దానిని నమ్ముకొని పూర్తిగా అక్కడికి వెళ్ళలేదు. అందుకని ఆ భర్తనే పట్టుకొని వేళ్ళాడుతూ వుంది. విశాలాక్షి సమస్య, దానికి ఆమె ఆశించిన పరిష్కారం తెలుసు కనుకనే జానకి వెంకట్రావును వదలి అన్న దగ్గరకు వెళ్ళిపోయాక తాను ఇక ఎప్పటికీ మెడలో వుంచుకోదలచిన మంగళసూత్రాలు అమ్మి కుట్టుమిషన్ కొనుక్కొనమని విశాలాక్షికి పంపింది.
జానకి సమస్య భర్త ప్రేమ. భర్త నుండి ఆమె ఆశించేది కాస్త ప్రేమ. కాస్త మెప్పు. ఇంటికోసం ఆమె ఎంత సమయమైనా వెచ్చించగలదు. ఎంత చాకిరీ అయినా చేయగలదు. కానీ ఆమె ఆశించనవేమీ లభించవు. తన అందం, తన సంతోషం, తన శుభ్రత అతనిని ఆకర్షించవు. తననెప్పుడూ అదుపులో పెట్టి తన మీద అధికారం చలాయించి తనను అవమానపరచి దుఃఖపరిస్తే కానీ అతనికి భర్త పదవిని సక్రమంగా నిర్వర్తించానన్న సంతృప్తి లేదు. ఇది అనుభవంలో క్రమంగా గ్రహించింది జానకి. కొంచెం కొంచెం ప్రశ్నించటం కొంచెం కొంచెం ధిక్కరించటం జానకి నేరుస్తున్నప్పటి నుండి అతనికి ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందే మోనన్న భయం కలిగింది. జానకి గర్భవతి అని తెలియటంతో ఆ భయం తొలగిపోయింది. పిల్లల కోసమైనా జానకి తనను విడిచి వెళ్ళలేదన్న ధైర్యం వచ్చింది. తన అధికారం యధాప్రకారం సాగించవచ్చునని నమ్మకం చిక్కింది. ఇది గ్రహించలిగిన తెలివితేటలు జానకిలో వికసించటం మొదలైంది కనుకనే ఆమెకు ఆ గర్భం ఏ మాత్రం సంతోషం. కలిగించలేదు. అబద్ధాలాడటం, అవమానపరచటం, కొట్టటం, అవసరాల కోసం ప్రేమ నటించటం, స్త్రీల పట్ల తేలికతనం, పరస్త్రీలతో సంబంధాలు – ఇన్ని దుర్గుణాలు వున్న భర్తతో కలిసి బ్రతకటమే ఒక సమస్య అయి అతని నుండి విడిపోయి రావటమే దానికి సరియైన పరిష్కారంగా జానకి భావించింది. అన్న చెప్పాడని కాదు ఆమె భర్తను వదిలేసింది. వదిలెయ్యవలసినంత దుర్మార్గుడతను అని అనేక అనుభవాల తరువాత దృఢపరచుకొనే ఆమె ఆ పనిచేసింది.
విశాలాక్షి, జానకి దృష్టికోణాలు అస్తిత్వంలో వున్న వ్యవస్థలోని దుర్మార్గాన్ని గుర్తించేంత చురుకైనవి. పాత వ్యవస్థతో సంఘర్షించే పరిధికి విస్తరించినవి. జానకి ఒకడుగు ముందుకు వేసి కొత్తజీవితాన్ని నిర్మించుకొనే దృక్పథాన్ని అభివృద్ధి పరచుకొన్నది. తండ్రితో నిమిత్తం లేకుండా సంతానాన్ని తల్లిగా సర్వహక్కులతో కనిపెంచే గుండె దిటువునూ, స్వాభిమాన సంపదనూ అభివృద్ధి పరచుకొనటం, ప్రభాకర్ తో సహజీవనానికి సిద్ధపడటం, తాను పనిచేసే చోట శ్రామికవర్గం పక్షాన నిలబడి పని హక్కులకోసం పోరాడే తెగువను పెంచుకొనటం ఇవన్నీ స్త్రీగా జీవితంపట్ల, సమాజ జీవితంలో పాత్రపట్ల పెరిగిన అవగాహనను సంబంధించినవే.
శాంత దృష్టికోణం అభివృద్ధికరమైన, ప్రజాస్వామికమైన, హక్కుల చైతన్యం కల నూతన మానవ సంబంధాల సమాజ నిర్మాణానికి నేలను చదునుచేసుకుంటూ చక్కని రహదారిని నిర్మించుకొంటూ ముందుకు సాగిపోయే ఆచరణ కార్యక్రమానికి సంబంధించినది. లా చదువు, న్యాయవాదిగా వృత్తి నిర్వహణ, ఆమెలో హక్కుల చైతన్యాన్ని, స్వతంత్ర జీవనాభిలాషను అభివృద్ధి పరిచాయనుకోవచ్చు. మంచి సాహిత్యాన్ని చదవటం, ప్రజాస్వామిక భావాలు కలిగిన సీనియర్ దగ్గర పనిచేయటం, ఉష స్నేహం, సత్యంతో చర్చలు అన్నీ ఆమెలో కొత్తజీవితాన్ని నిర్మించుకొనే చొరవను పెంచాయి. అందుకోసమే ఆమె పాత సమాజంతో ఘర్షణ పడవలసి వచ్చింది. కానీ పాత సమాజం పట్ల ఆమెకు ఎలాంటి భ్రమలు లేవు.
శాంత సంఘర్షణ పెళ్ళికి సంబంధించింది. ఇన్నేళ్ళు వచ్చి లాయరుగా వృత్తి జీవితాన్ని ఏర్పరచుకొన్న తాను అక్కయ్యలు, అమ్మమ్మలు, నాన్నలు తెచ్చే సంబంధాలు చూచి పెళ్ళి చేసుకోలేనని చెప్పటంతో ఆ ఘర్షణకు తెరలేచింది. శాంతవి ఖచ్చితమైన అభిప్రాయాలు, నిర్ణయాలే కనుక వూగిసలాటకు తావేలేదు. ఒకసారి తన నిర్ణయం ప్రకటించాక ఆమెకిక సంఘర్షణ లేనేలేదు. అట్లాగే పెళ్ళి అనే పేరు మీద జరిగే ఏ రకమైన, ఏ రూపంలో వున్న తంతునైనా అంగీకరించనని ప్రకటించింది శాంత. అది ఆమె రెండవ తిరుగుబాటు. ఒక ఆదివారం బయలుదేరి సత్యం ఇంటికి తన బట్టలతో పుస్తకాలతో వచ్చెయ్యటంతో ఆమె నూతన జీవిత నిర్మాణానికి ప్రారంభం జరిగింది. అత్త, ఆడపడచు అనే అధికార సంబంధాలు లేని అచ్చమైన మానవసంబంధాల, సమస్థాయి వ్యక్తుల సంబంధాల జీవితాన్ని ఆచరణ సాధ్యం చేసుకొన్నది. భర్త అధికారానికి లోబడి అస్వతంత్రంగా జీవించే కాలంలో విశాలాక్షితోపాటు జానకికి కూడా ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా ప్రవర్తించగలిగిన ప్రమీల ఆదర్శ నమూనా అయితే స్వతంత్రమూ స్వేచ్ఛాయుతమూ అయిన జీవితాన్ని నిర్మించుకొనేందుకు చేస్తున్న ప్రస్థానంలో జానకికి శాంత ఆదర్శ నమూనా అయింది.
స్త్రీల అనుభవాలను కోర్టు కేసుల ద్వారా దగ్గరగా పరిశీలిస్తూ స్త్రీగా స్పందించే శాంత భార్యభర్తలు విడిపోయినప్పుడు పిల్లలపై తండ్రి హక్కును ఆమోదించే కోర్టుల వ్యవహారాలలో పిల్లల కోసం తల్లులు పడే తపనను ఆరాటాన్ని స్వానుభవంగా చేసుకోగలిగింది. తన ఆత్మగౌరవాన్ని హీనపరచుకొనే స్థాయికి తల్లి దిగజారటానికి పిల్లలే కారణమవుతున్నప్పుడు ఆ పిల్లలను కనకుండా వుండటానికి స్త్రీకి సంపూర్ణమైన హక్కు వుందని ఆమె భావించింది. తనకు పిల్లలు వద్దని సత్యానికి చెప్పింది. స్త్రీల కోణం నుండి చూచినపుడు కనాల్సిన స్త్రీకే పిల్లల్ని కనాలా వద్దా అన్న నిర్ణయాధికారం వుండాలి అనే సహజ న్యాయాన్ని గుర్తించాడు కనుకనే సత్యం శాంత అభిప్రాయాన్ని గౌరవించాడు.
స్త్రీల అనుభవాల భిన్నభిన్నంగా వుంటాయి. అనుభవాల నుండి అవసరాల నుండి అవకాశాలను బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జ్ఞానచైతన్యాలను బట్టి కొన్ని నిర్ధారణలకు వస్తుంటారు. తమ సమస్యలను గుర్తిస్తుంటారు. విముక్తి మార్గాలను ఎంచు కొంటుంటారు. ఆ క్రమాన్ని నిరాటంకంగా కొనసాగనిస్తూ వాళ్ళ జ్ఞానచైతన్యాలు సరియైన మార్గంలో వికసించేటట్లు తోడ్పటమే సమాజంలో ఎవరైనా చేయవలసినది. స్త్రీల సమస్యల పట్ల రచయితగా రంగనాయకమ్మ కోణం అది. ఇవి నీ సమస్యలని స్త్రీలకు బోధపరచటం కానీ వీటికి ఇది పరిష్కారమని తామే నిర్ణయించి వాళ్ళను అందులోకి లాగటం కానీ సమాజంలో ఎవరూ చేయకూడదు. అది స్త్రీల నిజమైన వికాసానికి, శాశ్వతమైన అభివృద్ధికి దోహదం చేయదు.
స్త్రీల సమస్యపట్ల రంగనాయకమ్మ కోణం ఇది కనుకనే చెల్లెలిని దుర్మార్గుడైన భర్త నుండి కాపాడాలన్న సత్యం అత్యుత్సాహానికి ఎప్పుడూ మూర్తి పాత్రచేత కళ్లెం వేయిస్తూనే వచ్చింది. జానకి తనంతతాను తన సంసారంలోని దుర్భరత్వాన్ని గుర్తించే వరకూ ఆమె ఆ దుర్భరత్వాన్ని గుర్తించేందుకు వీలయిన స్నేహమూ, ప్రేరణ అందియ్యవలసినదే కానీ అంతకుమించి ముందుకు పోరాదని మూర్తి సత్యానికి చెప్తూ వచ్చాడు. కార్మికుల సంసిద్ధత లేకుండా నాయకత్వం సమ్మెకు పిలుపు ఇవ్వటం కానీ, ప్రజల సంసిద్ధత లేకుండా నాయకత్వం విప్లవోద్యమాన్ని వేగవంతం చేయటం కానీ ఎలా అభిలషణీయాలు కావో బాధితులైన స్త్రీలు తమ బాధలు స్వరూప స్వభావాలు గుర్తెరిగే వరకు వాళ్ళకు సంబంధించి వాళ్ళపట్ల ఎంత ప్రేమ కలవాళ్ళయినా ఏ నిర్ణయమూ తీసుకొనటం అఖిలషణీయం కాదంటాడు మూర్తి . మూర్తివాదనతో సమ్మతించాడు కనుకనే సత్యం ఆ తరువాత జానకిలో ఆలోచనలను,ప్రశ్నలను రేకెత్తించే ఆత్మగౌరవ చైతన్యాన్ని కలిగించే పుస్తకాలిచ్చి చదివించాడు. ఉత్తరాలు వ్రాసి నైతిక ధైర్యాన్నిచ్చాడు. తనంతటతాను భర్త అధికారం నుండి పెత్తనం నుండి జానకి బయటపడేవరకు ఎదురుచూశాడు. ఆ తరువాత ఆమె సంతోషానికి వికాసానికి తాను చేయవలసినదంతా చేశాడు.
స్త్రీలు వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి చెందితే సరిపోదు. అది స్త్రీలందరికీ స్వేచ్ఛా యుతమైన, స్వతంత్రమైన జీవితాన్ని ఇయ్యగలిగేదిగా ఉన్నతస్థాయికి పరిణితి చెందాలి. అందుకు పీడకులయిన పురుషుల స్వేచ్ఛను, పితృస్వామిక అధికారశక్తులను నియంత్రించే నూతన సమాజం ఏర్పడాలి. ఆ నూతన సమాజం కమ్యూనిస్టు సమాజంలోనే సాధ్యమవుతుంది. ఆ నమ్మకాన్ని మూర్తి సత్యం తదితరులలో గాఢంగానే నాటాడు. కమ్యూనిస్టు దేశాలలో స్త్రీల సమస్యలు పరిష్కరింపబడే తీరును గురించి శాంత, సత్యం, జానకి, సుందరమ్మ కలసి కూర్చొని మాట్లాడుకొంటారు. స్త్రీలపై పీడన విషయంలో కమ్యూనిస్టు దేశాల కోర్టులు అవలంబిస్తున్న విధానాన్ని ఒక కేసు వివరాలను చదివి వినిపించటం వల్ల తెలుసుకున్న సుందరమ్మ కూడా మనదేశానికి అలాంటి కోర్టులు ఎప్పుడు వస్తాయని ఆసక్తిగా ప్రశ్నిస్తుంది. ఆ రకంగా స్త్రీ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ఇయ్యగలిగిన ప్రజాస్వామిక దృక్పథం కమ్యూనిస్టు సమాజాలలోనే సాధ్యమవుతుందన్నది రంగనాయకమ్మ కోణం.
స్త్రీల అనుభవకోణం, కమ్యూనిస్టు సిద్ధాంత అవగాహన కలిసినప్పుడు పీడ్యపీడక సంబం ధాలులేని సమసమాజ నిర్మాణంలో భాగంగా స్త్రీలపై పురుషుల పీడనకు, పితృస్వామిక పెత్తం దారీతనికి అవకాశం లేని నూతన మానవ సంబంధాలు ఏర్పడతాయని అందుకు స్త్రీలు, పురుషులు స్వీయచైతన్యాన్ని అభివృద్ధి పరచుకొంటూ సంసిద్ధులు కావాలని రంగనాయకమ్మ ఈ నవల ద్వారా సూచించింది.
4
స్త్రీల సమస్యలు – అవి కుటుంబ హింసకు, ఆర్థిక అణచివేతకు, అస్వతంత్రకు, అభద్ర తకు సంబంధించినవి ఏవైనా అన్నిటికి మూలం పితృస్వామ్యంలో వుంది. పితృస్వామ్యం అంటే తండ్రి వైపు నుండి హక్కులు, అధికారాలు అమలయ్యే సమాజం. పితృస్వామ్యానికి అచ్చమైన పరిపూర్ణమైన ప్రతినిధి వ్యవస్థ కుటుంబం. స్త్రీల మీద పురుషులు అధికారాన్ని, చిన్నవాళ్ళ మీద పెద్దల అధికారాన్ని స్థిరీకరించిన వ్యవస్థ అది. ఈ అధికార లక్షణం కుటుంబం బయట వున్న అన్ని సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలకు కూడా విస్తరించింది.
కుటుంబం అంటే భార్యభర్తలు, పిల్లలు – వాళ్ళ ప్రేమానురాగాలతో నిండిన విడదీయరాని బంధంతో కూడిన వ్యవస్థ అని ఒక విశ్వాసం. అందువల్లనే ఏ సంస్థలోనైనా సహోద్యోగుల మధ్య సత్సంబంధాలు వున్నాయని చెప్పటానికి మేమంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి వుంటామని చెప్తుంటారు. కానీ వాస్తవానికి కుటుంబం ఆ రకంగా లేదు. అసమ సంబంధాలు కుటుంబంలో మనుషుల మధ్య స్నేహ సౌహార్ద్రతలను అభావం చేస్తున్నాయి. ముఖ్యంగా 1975 తరువాత స్త్రీల సమస్యలకు మూలమైన పితృస్వామిక వ్యవస్థ గురించిన అవగాహన ప్రపంచ వ్యాపితంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో స్త్రీలకు కుటుంబం ఒక నియంత్రణా వ్యవస్థగా అర్ధం కావటం మొదలైంది. ‘లింగవివక్ష‘ అక్కడే ప్రారంభమై విశ్వరూపం, వికృతరూపం ధరిస్తున్నదని తెలియవచ్చింది. దానితో కుటుంబం నుండి విముక్తి అనేది స్త్రీవాదంలో ఒక నినాదమైంది. కుటుంబం నుండి విముక్తి అనేమాట కుటుంబ విధ్వంసంగా, స్త్రీల విశృంఖల స్వేచ్ఛగా అర్ధమై సమాజం గగ్గోలు పడింది. అటువంటి ప్రారంభ దశల్లోనే అస్తిత్వంలో వున్న కుటుంబ స్వరూప స్వభావాలను చిత్రిస్తూ రంగనాయకమ్మ ఈ నవలలో ఇటువంటి కుటుంబాన్ని నిలుపుకొనాలని ఎవరైనా వాంఛిస్తారా? అన్న ప్రశ్నను మనమీదకు వదిలింది. ఇంతగా మానవ విలువలు ధ్వంసమైన కుటుంబం పతనంకాక తప్పదన్న హెచ్చరికను చేసింది. అంతటితో ఆగక భవిష్యత్తులో నిర్మించుకొనవలసిన నమూనాను కూడా అందించింది.
అస్తిత్వంలో వున్న కుటుంబ దుర్లక్షణాలన్నీ మూర్తీభవించిన కుటుంబం వెంకట్రావుది. కుటుంబాల్లో స్త్రీ మీద భర్తకు సంపూర్ణమైన హక్కు అధికారం సంక్రమిస్తాయి. స్త్రీల ఇష్టాలకు తావులేదిక్కడ. బహిష్టు సమయంలో ఆ మూడు రోజులు బయట కూర్చోవటం జానకికి ఇష్టం లేదు. అది వెంకట్రావుకు ఇష్టం లేదు కనుక జానకి తన ఇష్టాన్ని లోలోపలే అణచుకొని బయట కూర్చోనవలసిందే. జానకి అన్నకు ఉత్తరాలు వ్రాసుకొనటం అతనికి ఇష్టం ఉండదు. అతనికి తెలియకుండా చాటుగానైనా వ్రాసుకొనాలి. అలా ఎక్కువకాలం చేయలేక చివరికి ఉత్తరాలు వ్రాయటమే మానేసింది జానకి, “భర్తని అధికారిగా చేసే సమాజమే ఆ భర్త సంబంధీకులందర్నీ ఆ స్త్రీ మీదే అధికారులుగా చేస్తోంది” అని మూర్తి చేత చెప్పించింది . రంగనాయకమ్మ. (మొదటి భాగం ) అందువల్లనే జానకికి భర్త సాధింపులు, వేధింపులతోపాటు అత్తసాధింపులు వేధింపులు కూడా భరించవలసినవే అయినాయి.
భార్య అంటే చాకిరీకి నిర్దేశించబడిన వస్తువు. తెల్లవారుఝామున డ్యూటీకి వెళ్ళే భర్తకు కాఫీ కాచి యివ్వటం దగ్గర నుంచి పనిముగించుకొని వచ్చాక ఏ కొరతా లేకుండా వండి వడ్డించేంతవరకు సవాలక్ష పనులు. ఉదయాన్నే కాఫీ కాచి యివ్వలేదని ఒకసారి, పాలలో తోడు పెట్టటం మరిచిపోయి భోజనంలోకి పెరుగు లేకుండా చేసిందని ఒకసారి వెంకట్రావు, అతని తల్లి కూడా జానకిని వేధించిన తీరు, సాధించిన తీరు ఆమెనొక పనియంత్రంగా చూడటాన్నే సూచిస్తుంది. పాలూ, కాఫీ డికాషను అక్కడే వున్నాయి కాస్తవెచ్చ బెట్టుకొని తాగకూడదా అన్నందుకు జానకికి లభించినవి చెంపదెబ్బలు. ఏం కొట్టావా అని సత్యం నిలదీస్తే నా యిష్టం నా పెళ్ళాన్ని నేను కొట్టుకొంటానన్నది వెంకట్రావు జవాబు. భార్యలను హింసించటానికి భర్తలకు సర్వాధికారాలిచ్చింది కుటుంబం.
భర్తకు భార్య చదువుకొనాలన్న కోరికను, ఆర్థిక స్వాతంత్య్రాభిలాషను అణచివేసే హక్కు వుంది. స్త్రీలు చదువుకొని ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లయితే మొగుడెందుకూ ఇంక అంటాడు వెంకట్రావు. స్త్రీలు తాము కాళ్ళమీద తాము నిలబడకుండా మొగుడి మీద ఆధారపడివుండాలి. ఆధారపడి వుంది కదా. అని ఆమెను ఎంత లోకువ చేయటానికైనా అవకాశం ఆ రకంగా మిగుల్చుకొంటాడన్న మాట అతను. భర్త అన్న వాడికి తన శరీరం మీద సర్వహక్కులూ వున్నాయన్న – భావనను స్త్రీలో పెంచి పోషిస్తుంది కుటుంబం. తన ఇష్టం, ఉత్సాహం, హక్కుల గురించిన కనీస స్పృహ కూడా వాళ్ళకు కలగనీయదు. అత్త ఇంట్లో లేదని అబద్ధం చెప్పి తనను పుట్టినింటి నుండి తిరిగి తీసుకొచ్చాడన్న కోపంలో దుఃఖంలో ఉండి వుత్సాహమే లేని మానసికస్థితిలో జానకి అతనితో శారీరక సంబంధానికి ఇష్టపడదు. కానీ అతని కోరికను తాను తిరస్కరించటం గురించి అపరాధభావంతో బాధపడుతూ రెండవసారి అతని ఆహ్వానానికి ఏ అభ్యంతరమూ లేకుండా లొంగిపోతుంది. అంటే కుటుంబంలో స్త్రీలైంగికత స్త్రీ ఇష్టానికి సంబంధించినది కాదు, భర్త హక్కు అన్న భావన ఎంత బలంగా వేరూనుకున్నదో అర్థం చేసుకోవచ్చు. స్త్రీ శరీరానికి, స్త్రీ లైంగికాసక్తులకు స్త్రీని పరాయికరించిన అధికార వ్యవస్థ అస్తిత్వంలో వున్న కుటుంబం.
కుటుంబంలో భార్య అంటే ఇంటికి కావలసిన సమస్త చాకిరీ అవిశ్రాంతంగా చేసి పెట్టే యంత్రం మాత్రమే కాదు. భర్త కోసం పుట్టింటి నుండి ఎప్పుడుపడితే అప్పుడు అడిగినంత కట్నకానుకలు సమకూర్చిపెట్టే వనరు కూడా. పెళ్ళిలో జానకి తండ్రి పెడతానని పెట్టలేకపోయిన వెండి కంచం గురించిన సాధింపు దానిని సూచించేదే. జానకి జీవితం మీద జానకికి ఏ అధికారమూ లేదన్న విషయానికి పరీక్షలకు చదువుకొందామని ఆసక్తి వున్నా, అన్న దానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నా భర్తను అడగకుండా, భర్త అనుమతి లేకుండా ఆ పని చేయటానికి వీలులేని స్థితిలో వుండటమే గుర్తు. ఇంట్లో పనులన్నీ చేసుకొన్నాకే చదువు కొంటానని అతని దయకు, అనుమతికి దేబిరించి దెబ్బలు తిని భంగపడటంలోనే స్త్రీల జీవిత పరాధీనత వ్యక్తమవుతుంది. పరీక్షల కోసమే కాదు జానకి ఏ మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి కూడా చదువుకొనటానికి వీల్లేదు. ఆమె ఏమీ చదువుతున్నదా అని ఆరాలు తీయటం, రాత్రిళ్ళు చదువుకొంటుంటే కరెంటు ఖర్చు అవుతున్నదని యాగీచేయటం, ఆమె చదువుతున్న పుస్తకాలను చింపిపోగులు పెట్టటం, ఎందుకు చదివావని సాధించటం ఇవన్నీ కుటుంబంలో స్త్రీ జ్ఞానచైతన్యాలు వికసించకుండా తీసుకునే జాగ్రత్త యొక్క అత్యంత నికృష్ట వ్యక్తీకరణ రూపాలు.
బహిష్టు సమయంలో బయట కూర్చొనటం ఇష్టంలేని జానకి తన అభిప్రాయాన్ని భర్త, అత్త గుర్తించి ఆమోదించటం లేదని నిరసనగా అన్నం తిననని కూర్చొంటుంది. ఎందుకు తినవని నిలదీస్తూ తినమని ఒత్తిడి పెట్టే వెంకట్రావును నా తిండి గురించి కూడా మీ పెత్తనమేనా అని ప్రశ్నిస్తుంది. ఇది అధికార ధిక్కారంగా భావించి వెంకట్రావు ఆమెను చెంప మీద నుంచి కొడుతాడు. అన్నం తినకపోతే తన ఇంట్లో వుండటానికి వీల్లేదని ఎక్కడికి పోతావో పొమ్మని బెదిరిస్తాడు. పెళ్ళయిన దగ్గర నుండి స్త్రీ తన శ్రమనంతా ఏ ఇంటిని చక్కదిద్దటానికి ధారపోస్తున్నదో ఆ ఇల్లు ఎప్పటికీ ఆమెది కాని ఒక సామాజిక దుస్థితిని ఇది ప్రతిబింబిస్తుంది.
స్త్రీ కుటుంబంలో భర్త మీద ఆధారపడి జీవించే మనిషి గనుక స్వతంత్రించి ఆమె పొరుగింటి వాళ్ళకు అప్పులియ్యటానికి కూడా వీలులేదు. జానకి విశాలాక్షికి కందిపప్పు ఇయ్యటాన్ని అత్త అభ్యంతర పెట్టటం, విశాలాక్షి కొడుకుకు ఒంట్లో బాగా లేనప్పుడు ఆర్ధిక సహాయం చేయటం, తోడుగా డాక్టరు దగ్గరకు వెళ్ళటం ఇవన్నీ వెంకట్రావుకు అతని తల్లికీ అభ్యంతరకరం కావటం ఆమెను నిలదీసి యాగీ చేయటానికి కారణం అయ్యాయి. చాలా సందర్భాలలో అత్త పోలీసు స్థానంలోనూ భర్త న్యాయాధిపతి స్థానంలో నిలబడి జీవితాల మీద తీర్పులు ఇస్తుంటారు. వెంకట్రావు తల్లి కోడలు ఎక్కడ నించుంది. ఎవరితో మాట్లాడింది. ఏం చేసిందీ నిఘా వేసి చూస్తుంది. న్యాయాధిపతిగా విచారణ, నేరారోపణ, నిందితురాలి వాదనకు జవాబు చెప్పలేని తికమకతో చెంపదెబ్బనే తీర్చుగా శిక్షను అమలు చెయ్యటం అతని పద్ధతి. ఎంత అల్పుడైన మొగవాడైనా పాత కుటుంబ వ్యవస్థలో భార్య జీవితం మీద పెత్తందారై పీల్చుకు తినటానికి అలవాటుపడతాడన్న విషయాన్ని గట్టిగా నిరూపించింది ఈ నవలేతివృత్తం.
జానకి ఇష్టాలను, జానకి శుభ్రతను, జానకి పనిపాటలు శక్తిని, జానకి తల్లిదండ్రులను అన్నను, స్నేహితులను, జానకి ప్రేమను, జానకి కోపాన్ని, జానకి నిరసనలను, జానకి శరీరాన్ని సమస్తాన్ని నిర్లక్ష్యం చేసి, అవహేళన చేసి అవమానపరచి హింసించే కుటుంబం చివరికి జానకికి వదులుకోవలసే వచ్చింది. నిజానికి జానకి ఆ కుటుంబాన్ని పట్టుకొని నిలబడటానికి తన జీవశక్తులన్నింటిని కూడగట్టుకొని ప్రయత్నించింది. వెంకట్రావు దగాకోరుతనం ఎప్పటికప్పుడు తెలుస్తున్నా అతనిలో ఏదో మంచి అనేది తన కోసం నిలిచే వుందని నమ్ముతూ అతను తన పట్ల కాస్త దయగా ప్రవర్తిస్తే చాలుననుకొని ఎప్పటికప్పుడు అతనిని క్షమిస్తూనే వుంది. అటువంటి జానకికి కుటుంబాన్ని విడిచి వెళ్ళటం అనివార్యం చేసినవాళ్ళు అత్త భర్త మాత్రమే.
స్త్రీలు కుటుంబాన్ని ధిక్కరించటానికి స్త్రీల ఉద్దేశ్యమే కారణం కాదు. కుటుంబ యజమానులమనుకొనేవాళ్ళ అధికార దురహంకారం, ఆధిపత్య స్వభావం అధికృత హింస తరచు కారణమవుతుంటాయి. వాటి నుండి పురుషులు, పురుషుల ప్రయోజనాలు కోసం సాటి స్త్రీలతో వైరుధ్యంలోకి వచ్చే – పురుషాధికారంలో భాగస్వాములైన – అత్త ఆడబిడ్డవంటి బంధువులు తమ తమ అధికార దుర్మార్గ స్వభావం నుండి విముక్తయితే స్త్రీ కుటుంబం నుండి విముక్తిని ఆశించదు. కుటుంబంలో మనుషులు పితృస్వామిక అధికార స్వభావాన్ని వదులుకొనే కొద్దీ ఆ కుటుంబం సమస్థాయి మనుషుల సంబంధాల కూడలిగా స్నేహసౌహార్ధ భావాలకు, ఆచరణకు నిలయంగా మారుతుంది. అంటే కుటుంబం మాయం కాదు. కుటుంబం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకొని ప్రజాస్వామికీకరించబడుతుంది. పాత కుటుంబాల స్థానంలో ఈ ప్రజాస్వామిక సంబంధాల కుటుంబాన్ని ఊహించింది రంగనాయకమ్మ. సత్యం కుటుంబాన్ని ఆ ఊహ ప్రాతిపదికగానే నిర్మించింది. సత్యం కుటుంబం అంటే దానికతను యజమాని అని చెప్పటం కాదు. సత్యం తదితరులు కలిసివున్న కుటుంబాన్ని గుర్తించి చెప్పటానికే వాడిన సంకేతం మాత్రమే అది. సత్యం చొరవతో ఆ కుటుంబం ప్రజాస్వామికీకరించబడిందని ఉద్దేశ్యం.
ఇంటిపని ఆడవాళ్ళది అన్న భావన నుండి బయటపడి పురుషులు ఇంటిపని చేయటం ప్రారంభించటం కొత్త కుటుంబ నిర్మాణంలో ఒకభాగం. సత్యం పెద్ద వయసులో వున్న తల్లిని ఇబ్బందిపెట్టకూడదని తాను ఇంటిపని ఇష్టంగా చేయటం మొదలుపెట్టాడు. అత్తింట్లో పెద్ద కష్టం నుండి బయటపడి వచ్చిన చెల్లెలు జానకికి శారీరక మానసిక విశ్రాంతినివ్వాలని తాను ఇంటి పనిచేస్తాడు. అన్నం వండుతాడు. టీలు, కాఫీలు పెడతాడు. బియ్యం చెరుగుతాడు. వంటిల్లు సర్దుతాడు. ఇలా ఏపనైనా చేస్తాడు. నేర్చుకుంటే అన్నీ మగాళ్ళకు కూడా వచ్చే పనులేనన్న చైతన్యం పెంచుకుంటాడు.
తల్లి దగ్గర, చెల్లిలి దగ్గర బాగున్న పురుషులందరూ భర్తలుగా భార్యలతో స్థాయి స్నేహసంబంధాలతో వుంటారన్న నియమం ఏదీలేదు. కానీ సత్యం శాంతతో కూడా అదే పద్ధతిలో ప్రవర్తించటం అభ్యాసం చేశాడు. భార్యను తక్కువగా చూసే ఏ రకమైన వ్యక్తీకరణనైనా పసికట్టెయ్యగల నిశిత పరిశీలన అతనికి అలవడిందంటే అతను భార్యాభర్తల సంబంధం ఎంత సమస్థాయి సంబంధంగా వుండాలో వూహించుకొన్నాడన్నమాటే. ఒక ఆడమనిషి మగమనిషి పదినిమిషాలు కలిసి వుండటం చూస్తే వాళ్ళు భార్యాభర్తలు అవునో కాదో చెప్పెయ్యవచ్చంటాడు సత్యం. నీ మొహం అనో, ఏడిశావ్ లెద్దూ అనో అనకుండా భార్యతో భర్త పదినిమిషాలు కూడా మాట్లాడలేడని పరిశీలనలో అతను అర్థం చేసుకున్నాడు. చేసుకొన్నాడంటే తనను తాను సంప్రదాయ భర్త నమూనా నుండి విముక్తం చేసుకొనే ప్రయత్నం ప్రారంభించాడనే అర్థం.
శాంత సత్యం కాపురంలో బంధుత్వ సంబంధాల పిలుపులను మానుకోవడం. కుటుంబాన్ని ప్రజాస్వామికీకరించుకునే క్రమంలో జరిగింది. శాంతను ఒదినా అన్ని పిలుద్దామనుకుంటూనే పూర్వంలాగే శాంతగారూ అని పిలుస్తుంటుంది జానకి. శాంత తమ్ముడు హరికి సత్యం అంతకుపూర్వం నుండి పరిచయమే అయినా శాంత సత్యాల కాపురం మొదలయ్యాక సత్యాన్ని బావగారూ అని సంబోధిస్తే అతనిని వారించాడు సత్యం. శాంత సుందరమ్మ గారిని కూడా అత్తగారూ అని పిలవదు. సుందరమ్మగారూ అని పేరు పెట్టేసంబోధించి పిలుస్తుంది. ఆమె కది ఇష్టం కాకపోతే ఎలా అని అంటే అత్త అని పిలవటం తనకు ఇష్టం లేదు కనుక పేరుతో పిలవటం మానేసినా ఏమండీ అని మాత్రమే సంబోధించగలనంటుంది శాంత. ఒదిన, బావ, అత్త ఇవి సహజ సంబంధాలు కావు, సాంఘిక సంబంధాలు. సాంఘిక సంబంధాలలో అధికార సంబంధాలు కలిసిపోతాయి. భార్య భర్తను ఏమండీ అని మన్నించి పిలవటం మొదలైనవన్నీ భర్త అత్త ఆడబిడ్డల అధికారాన్ని గుర్తించి చెప్పేవి. ఆ అధికారానికి లోబడి జీవించటాన్ని స్త్రీకి మప్పేవి. స్త్రీ వైపు పురుషులకు మప్పేవి. ఈ అధికార ఆధీన సంబంధాల కుటుంబ వ్యవస్థను మార్చుకొనదలచిన కొత్తతరానికి ప్రతినిధులుగా సత్యం, శాంత అల్లుడు అనే హోదాను, పిలుపును, బావగారూ అనే మన్నింపును, కోడలు అనే స్థాయిని అంగీకరించటానికి, గుర్తు పెట్టుకొని ప్రవర్తించటానికి ప్రయత్నపూర్వకంగా విముఖులైనారు.
జానకి ఈ పాత వాసనల నుండి ఇంకా బయటపడలేక ఒదిన గారి ఎంగిలి కంచం తీయటానికి సందేహించి వదిలేసినపుడు సత్యం స్వభావాలనూ బట్టి స్నేహాన్నిబట్టి మనుషులకు విలువ ఇవ్వాలి కానీ బంధుత్వ అధికార సంబంధాలనుబట్టి కాదని చెప్పి జానకిలో మిగిలివున్న పాత భావాల తుక్కును వదలగొట్టాడు. శాంత సత్యం చనువుగా, స్నేహంగా చేసే సహజీవనం, ఒకరి కోపాన్ని ఒకరు సహనంతో భరించటం, ఒకరిపట్ల ఒకరు దయతో, క్షమతో, సహనంతో వుండటం చూసేకొద్దీ జానకికి భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన కొత్త విలువలు అనేకం అర్ధం కాసాగాయి.
శాంత ఇంటిపని చేయాలన్న ఆలోచన సత్యానికి అసలు వుండదు. ఎవరి పనుల మీద వారు బయటకు పోవటం, ఎవరికి వీలయితే వారు ఇంటిపని, వంటపని చూచుకొనటం అతి సహజంగా జరిగిపోతుంటాయి. ఆ ఇంట్లో ఎవరు ఎవరికి పని అధికారంతో చెప్పినట్లుండదు. అట్లాగే జానకికి పిల్లవాడు పుట్టాక మామూలు కుటుంబాలలో లాగా పిల్లల పెంపకం కేవలం తల్లికి సంబంధించిన వ్యవహారంగానో, ఆడవాళ్ళకు సంబంధించిన విషయంగానో ఉండక పోవడటం కూడా ఆ కుటుంబం స్వభావంలో వచ్చిన మార్పును సూచిస్తుంది. పిల్లాడికి నీళ్ళు పోయటం, దొడ్డికి వెళితే కడగటం వరకు అన్ని పనులు చేయటానికి సంతోషంగా సిద్ధమవుతుంటాడు. సత్యం. సత్యం పురుషుడిగా తనకు పితృస్వామిక సమాజం ఇచ్చిన సర్వాధికారాలను వదులుకొనే క్రమంలో అధికారానికి చిహ్నమైన మొగాడన్న మాటను కూడా ఒక వెక్కిరింతగానే స్వీకరించాడు.అందుకే తల్లి జానకి కొడుకు అల్లరి గురించి చెప్తూ ‘పిల్లలకు మొగాళ్ళ భయం వుండాలి సత్యం!‘ అని హెచ్చరించినప్పుడు అవును, మొగాళ్ళ భయం వుండాలి అని తల్లిని ఆమోదిస్తున్నట్లే మాట్లాడి మనింట్లో అందరం ఆడవాళ్ళమైపోతిమి అని విచారాన్ని వ్యక్తం చేశాడు. మగవాడిగా తన అధికార లక్షణాలను వదులుకొన్నాడు గనుక తాను మగవాడన్న మాటకు తగనని అతని అభిప్రాయం. అధికార లక్షణానికి చిహ్నమైన మగాడన్న మాటతో తనను తాను చూచుకొనటం, తనను తాను వ్యక్తీకరించుకొనటం అతనికి ఇష్టం లేదు. అందుకే పిల్లవాడికి బుద్ధి చెప్పటానికి మనింట్లో అందరం ఆడవాళ్ళమై పోతిమి అని తనను ఆడవాళ్ళతో కలుపుకొనటమే గౌరవకరంగా భావించి చెప్పాడు సత్యం. ఆ రకంగా మగవాళ్ళు అధికార స్వభావాన్ని, ఆడవాళ్ళు ఆధీనతా లక్షణాన్ని వదిలేసుకొనే ప్రయత్నంలో నిర్మించుకునే సహజీవన సౌందర్యం కుటుంబం రూపురేఖలనే మారుస్తుందని అలాంటి కుటుంబాల కోసమే వీడిత స్త్రీల వేదనా, పోరాటము అని సమర్థవంతంగా ఈ నవలేతి వృత్తంలో నిరూపించింది . రంగనాయకమ్మ.
5
జన్మల జన్మల బంధం, పవిత్ర బంధం, పాతివ్రత్యబంధం, ధర్మార్ధ కామమోక్ష సాధనకు ఆలంబనమైన కుటుంబ బంధం అంటూ స్త్రీ పురుష సంబంధాన్ని స్వర్గమర్త్యాలకు ముడివేస్తూ కీర్తించే సాంస్కృతిక భావజాలం ధర్మసూత్రాల రూపంలో, ఇతిహాస కథాజ్ఞాన రూపాలలో విస్తృతంగా సృష్టించబడింది. పుట్టినప్పటి నుండి ఆడపిల్లలను స్త్రీలుగా, మగపిల్లలను పురుషులుగా తయారుచేసే వివక్షా సంస్కృతి అందులోని హింసను పైకి కనబడనీయని మాయా స్వభావంతో తనపని తాను చేసుకొని పోతుంటుంది. అధికారం తమ సహజ లక్షణంగా పురుషులు, అధీనత తమ సహజ లక్షణంగా స్త్రీలు ఆమోదించి, ఆ వలయాలలోనే పరిభ్రమిస్తుంటారు. ఇది మొత్తంగా స్త్రీల వ్యక్తిత్వ వికాసానికి అవరోధం కనుక స్త్రీలకు హానికరమైంది. పురుషులను సహజ మానవీయ విలువల నుండి దూరం చేస్తుంది కనుక ఆ మేరకు వాళ్ళకు కూడా హానికరమైందే. జానకి విముక్తి నవల స్త్రీలకు అత్యంత హానికరమైన స్త్రీ పురుష సంబంధాలను విమర్శకు పెట్టింది. స్త్రీలు చైతన్యవంతులయి తమ అధీనతను గురించిన స్పృహను పొందితే అది స్త్రీ విముక్తికి మొదటి మెట్టవుతుంది. బానిసకు బానిసనన్న గ్రహింపు కలగటమే బానిస విముక్తికి మొదటి మెట్టన్న లెనిన్ మాట ఇక్కడ పూర్తిగా వర్తిస్తుంది. అందువల్లనే రంగనాయకమ్మ ఈ నవలలో స్త్రీ ఎంత బానిసత్వంలో వుందో, ఎంత అధికారాన్ని భరిస్తున్నదో స్త్రీలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇతివృత్తాన్నిమలిచింది.
నీళ్ళతొట్లు రుద్దికడగటం, ఇళ్ళు బూజులు దులిపి కడగటం, బట్టలుతికి గంజి పెట్టి ఆరెయ్యటం, వంట చెయ్యటం ఇలాంటి సవాలక్ష పనులతో నిరంతరం ఇంటి చాకిరినీ చేస్తూ అత్త, భర్తల అదిరింపులు, బెదిరింపులు, సాధింపులు భరిస్తూ భర్తచేత దెబ్బలు తింటూ అవమానపడుతూ, దుఃఖపడుతూ, అతను కోరినప్పుడల్లా వాంఛా పరితృప్తికి దేహాన్ని అర్పిస్తూ, చదువుకొనటానికి గానీ, పరీక్షలకు కట్టటానికి గానీ, అవసరానికి పక్కింటివాళ్ళకి అప్పు ఇయ్యటానికిగానీ, వాళ్ళ కష్టంలో పాలుపంచుకొనటానికిగానీ స్వతంత్రం లేక ఎంతటి బానిసత్వంలో జానకి, పోషణ బాధ్యత వహించిన భర్త చేసే అధికారం క్రింద విశాలాక్షి ఎలా మగ్గిపోయారో చూపించింది. విశాలాక్షి చెల్లెలు సుశీలను ఆమె భర్త అక్కచెల్లెళ్ళ ఇంటికి, పుట్టింటికీ కూడా పంపక ఎంత హింసిస్తాడో, ఆమె మీద తన సంపూర్ణాధికారాన్ని ఇంట్లోనైనా వీధిలోనైనా ఎలా చూపించుకొంటాడో చెప్పింది. భార్య అందాన్ని భరించలేక పాడుచేసే భర్తని, అలాంటి భర్తని గత్యంతరం లేక భరిస్తూ సంసారం చేసే పార్వతిని,భర్తకు ఇష్టంలేని ఉద్యోగ జీవితాన్ని వదులుకొనటానికి సిద్ధపడే శకుంతలను, సంధ్యను చూపించింది. ఆ ఇంటా ఈ ఇంటా పనిపాటలు చేసుకుంటూ పిల్లల్ని, భర్తను కూడా పోషించే నర్సమ్మ మీద భర్త చేసే పెత్తనం, దౌర్జన్యం చూపించింది. తాను ప్రేమించి పెళ్ళాడానని తన జీవితం ఎంతో బాగుందని అనుకొనే హేమ జీవితంలో ఆమెకే తెలియని కనిపించని హింస ఎంత వుందో సూచించింది. ఇన్ని ఉదంతాల ద్వారా, ఇందరు స్త్రీల జీవితానుభవాల ద్వారా స్త్రీల జీవితం బానిసత్వంలో వుందన్న విషయాన్ని, భర్త యజమాని భార్య బానిసగా జీవిస్తున్న దాంపత్య జీవిత విషాదాన్ని నిరూపించింది. అయినా ఈ అవగాహనను మరింత స్పష్టంగా స్త్రీలకు కలిగించాలన్న తపనతో సత్యంచేత స్త్రీకి బానిసకు వున్న పోలికను చూపించే ఒక పట్టికను తయారుచేయించి తల్లికి, చెల్లెలికి చూపించి వివరించినట్లుగా ఒక సన్నివేశాన్ని కల్పించింది.
కూతురు కాపురం వదిలివేసి వచ్చిందని బాధపడుతున్న సుందరమ్మతో తర్కిస్తూ – సత్యం స్త్రీల జీవితం ఆమె అనుకొంటున్నట్లు సుఖంగా ఏమీలేదని అర్ధం చేయించటానికి బానిసలకు స్త్రీలకు వున్న పోలికలు చూపిస్తూ ఆ పట్టిక తయారుచేశాడు. 1. బానిసల బతుకులు యజమానుల దయాదాక్షిణ్యాలపైనా స్త్రీల బతుకులు పురుషులు దయాదాక్షిణ్యాల పైనా ఆధారపడి వుంటాయి. 2. బానిసలు, స్త్రీలు కూడా స్వతంత్ర వ్యక్తులు కారు. 3. బానిసలకు, స్త్రీలకు స్వంత ఇంటి పేర్లుండవు. 4. బానిసలకు, స్త్రీలకు పిల్లల మీద హక్కులుండవు. 5. బానిసలకు, స్త్రీలకు తమ శరీరాల మీద తమకే హక్కులుండవు. వాటిని యజమానులు సేవకు, కోర్కెలు తీర్చటానికి తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వినియోగించాల్సిందే. 6. బానిసలు, స్త్రీలు యజమానుల భర్తల కోపాన్ని, శారీరక దౌర్జన్యాలకు భరించాలి. 7. ఇద్దరికీ ఓటు హక్కులేదు. స్త్రీ తన ఓటు హక్కును భర్త ఆజ్ఞనుబట్టే వినియోగించాలి. 8. బానిసలు, స్త్రీలు నిరంతరం శ్రమ చేస్తూ వుండవలసినవాళ్ళే. 9. బానిసలకు, స్త్రీలకు ఆర్థిక సాంఘిక రాజకీయ రంగాలలో యజమానులతో, భర్తలతోపాటు సమానత్వమనేదీలేదు. 10. బానిసలకు, స్త్రీలకు వినయవిధేయతలు బోధిస్తాయి ధర్మశాస్త్రాలు, 11. బానిసకైనా, స్త్రీకైనా యజమానిని, భర్తను వదిలిపోవటం తగనిది, నేరం. అలా చేసినవాళ్ళకి సమాజంలో గౌరవం వుండదు.
ఈ రకంగా ఇన్ని పోలికలను చూపించటం ద్వారా రంగనాయకమ్మ స్త్రీలు ఈ సమాజంలో ఎంత వివక్షతకు గురి అవుతున్నారో, స్వేచ్ఛ, స్వతంత్రత , హక్కులు లేని జీవితాన్ని ఎలా జీవిస్తున్నారో తెలియ జేసింది. తాను బానిసనన్న విషయం అనుభవం నుండి తెలుసుకొంటూ ఈలాంటి అధ్యయనాల నుండి ధృవపరచుకొంటూ వుంటే స్త్రీలు ఆ బానిస సంకెళ్ళ నుండి విముక్తికి ప్రయత్నించే నూతన చైతన్యాన్ని అభివృద్ధి పరచుకొంటారు. జానకి ఈ రకమైన చైతన్యాన్ని అభివృద్ధిపరచుకొంది. శాంత అక్క హేమలాంటివాళ్ళు ఈ వాస్తవాన్ని గుర్తించటానికే నిరాకరిస్తూ అదే సుఖమని అందులో మునిగి తేలుతుంటారు. అలాంటి స్త్రీల పట్ల వ్యతిరేకత, ఏటికి ఎదురీదినట్లుగా అస్తిత్వంలో వున్న వివక్షాపూరిత విలువలతో, సంస్కృతి తో సంఘర్షిస్తూ స్వతంత్రులుగా ఎదగటానికి ప్రయత్నించే స్త్రీలపట్ల గౌరవం జానకి విముక్తి నవలలో స్పష్టంగా కనబడుతుంది.
కుటుంబంలో స్త్రీ పురుష సంబంధాలలో, పునరుత్పత్తి విషయంలో, పిల్లల పెంపకం, ఇంటిపని మొదలైన విషయాలలో సామాజిక జ్ఞానరంగాలలో స్త్రీ ఎదుర్కొంటున్న అణచివేతను దానికి మూలకారణాలను గుర్తించి స్త్రీ విముక్తికి కొత్త మార్గాలను, అన్వేషించే పని ప్రారంభమై కొనసాగుతున్న సామాజిక నేపథ్యం నుండి జానకి విముక్తి నవల వచ్చింది. కుటుంబంలో భార్యగా, స్త్రీ వరకట్నం వంటి ఆర్థిక సమస్యకు, ఎడతెగని ఇంటిచాకిరికి, ఇష్టంగాకాక అధికారానికి లోబడి మొక్కుబడిగా శరీరాలను అర్పించుకొనటానికి, పిల్లల్ని కనిపెంచటానికి, ఒంటరిగా వాళ్ళ బాధ్యతలు మోయటానికి, బలి అవుతున్న విధానాన్ని రకరకాల స్త్రీల జీవితాల ద్వారా చూపించింది. ఈ క్రమంలో రంగనాయకమ్మ స్త్రీ అణచివేతకు పితృస్వామ్యం కారణమని సరిగ్గా గుర్తించి చెప్పింది .
పితృస్వామ్యం పురుషుడికి వారసత్వంగా సంక్రమించే ఆస్తిహక్కు తోటి, ఉత్పత్తి రంగం పురుషుడిదిగా, పునరుత్పత్తి విధులు స్త్రీవిగా చేయబడి పురుషుడి జీవితాన్ని సామాజిక రంగానికి విస్తరింపచేసి స్త్రీ జీవితాన్ని కుటుంబానికి కుదించివేసిన శ్రమ విభజనతోటి ముడిపడి వున్నది. పునాది అయిన స్వంత ఆస్తిని రద్దుచేయటం ద్వారా స్త్రీ సమస్యకు మూలంగా వున్న పితృస్వామ్యాన్ని కూడా తొలగించటానికి వీలవుతుంది. ఆ అవగాహనతోనే రంగనాయకమ్మ ఈ నవలలో స్త్రీ సమస్యను కమ్యూనిస్టు సమాజ నిర్మాణంతో అనుసంధించే చర్చించింది. మూర్తి సత్యం మధ్య జరిగిన చర్చలు, కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమైనప్పుడు ఆ సమాజాలు స్త్రీల సమస్యను చర్చించి పరిష్కరించే తీరును గురించి సత్యం జానకిలాంటి వాళ్ళు కన్నకలలు, శాంత వినిపించిన వాస్తవ జీవితానుభవంలోని విడాకుల కేసు వంటివి అందుకు మంచి సాక్ష్యాలు.
అయితే స్వంత ఆస్తిలేని కమ్యూనిస్టు సమాజ స్థాపన దీర్ఘకాలికమైంది. శ్రామికవర్గ రాజ్యాధికార పర్యంతం అది కొనసాగుతుంది. దానికోసం జరిగే ప్రయత్నాలు జరుపుతుండగానే, పునాది మార్పుకు సంబంధించిన ఉద్యమాలు నిర్మించ బడుతుండగానే ఉపరితలంలో తదనుగుణమైన భావజాలాన్ని ప్రోది చేయవలసి ఉంటుంది. స్త్రీ సమస్య ప్రస్తుత అంశం కనుక దానికి కారణమైన పితృస్వామ్య భావజలాన్ని తొలగిస్తూ స్త్రీ పురుష సమానతా సంస్కృతిని నిర్మించుకునే పని చేసుకుంటూ పోవాలి. రంగనాయకమ్మ ఈ నవలలో చేసింది ఆ పనే.
వంటపని ఆడవాళ్ళే చేయాలా అన్న ప్రశ్నను స్టడీసర్కిల్ మిత్రుల మధ్య చర్చకు తేవటం, ఆడపనిగా మగపనిగా విభక్తమైన శ్రమవిభజన క్రమంలోని అంతరాన్ని ఎలా తగ్గించవచ్చునో సత్యం, ప్రభాకర్ మొదలైన వాళ్ళ ఆచరణల ద్వారా చూపించటం, వంట చేయటం ఇల్లు సర్దటం మాత్రమే కాదు పిల్లవాడికి ముడ్డికడగటం వరకూ మగవాడైనా చేయదగిన పనులేనని సూచించటం, శాంత ద్వారా స్త్రీల గర్భంపై స్త్రీల హక్కును ప్రతిపాదించటం, ఆ హక్కులను గౌరవించే సంస్కార స్థాయికి పురుషులు ఎదగటాన్ని సత్యం పాత్ర ద్వారా చూపించటం, సంతానంపై తల్లిహక్కును జానకి జీవితం ద్వారా స్థిరీకరించటం – ఇవన్నీ పితృస్వామ్య భావజాలాన్ని రద్దుచేసే స్త్రీ పురుష సమానతా సంస్కృతి నిర్మాణానికి సంబంధించినవి. అంతేకాదు రాజకీయాలు, సాహిత్యం, సామాజిక విజ్ఞానం మొదలైనవన్నీ స్త్రీలకు సంబంధించినవి కావన్న స్థితి నుండి అవి స్త్రీ పురుషులిద్దరూ పంచుకొనవలసివేనన్న సంస్కారాన్ని అభివృద్ధి చేసుకొనటం వరకు మనుషులు ఎదగటాన్ని ఆశించి సత్యం ఇంట్లో అటువంటి వాతావరణాన్ని సృష్టించి చూపింది ఈ నవల. అందువల్లనే జానకి విముక్తి మంచి ఆలోచనా ప్రేరకమైన నవల కాగలిగింది.
6
జానకి విముక్తి నవల తరువాత పధ్నాలుగు ఏళ్లకు వ్రాసిన ప్రేమకన్నా మధురమైనది (1995) నవలలో ఇద్దరు స్నేహితురాళ్లు పాత్రలుగా స్త్రీపురుషుల పరిణత వ్యక్తిత్వాలకన్నా పెళ్లిళ్లకు కులం, ధనం , వధూవరుల వంటి రంగు , అందచందాలు , విద్యా ఉద్యోగ హోదాలు మొదలైనవాటిని ప్రతిపాదికలుగా అనుకొంటూ లోకం ఎంత తప్పుడు మార్గంలో నడిచిపోతున్నదో విమర్శకు పెట్టింది రంగనాయకమ్మ. భార్యల పట్ల నిబద్ధతలేని మగవాళ్ల చాంచల్యాన్ని ప్రధాన అంశంగా చేసి స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అన్న భావన మాటున ఎంత నటనకు అవకాశం ఉందో చూపించి వంచనాప్రధానమైన సంబంధాల పట్ల స్త్రీలు తీసుకోవలసిన వైఖరి గురించిన హెచ్చరికగా ఈ నవల లోని వస్తువును నిర్వహించింది రంగనాయకమ్మ. పిల్లల పట్ల బాధ్యతలేకుండా జీవించే తల్లిదండ్రుల అకృత్యాల పట్ల నిరసనగా దొంగ తల్లిదండ్రులు ఉన్నారు జాగ్రత్త అనే నవలను వ్రాసింది. 2011లో వ్రాసిన కళ్ళు తెరిచిన సీత లో ఒక స్త్రీ యదార్ద గాధను నమోదు చేసింది. జీవితంలో పెళ్లి వేడుక అనుకొని వాటికి భ్రమసే యువతరం, అమ్మల కోసం , నాన్నల కోసం , చేసుకోబోయేవాడికోసం , అతని తల్లి కోసం ఈ చిన్నసంప్రదాయాన్ని ఆమోదిస్తే పోయేది ఏముంది అనుకొంటూ ఆదర్శాలను, ఆత్మగౌరవాన్ని వదిలేసుకొంటూ పోయే యువతులు, ఉద్యోగాల కోసం దేశాలు వదిలిపోయినా పురుషాధికారాన్ని వదుల్చుకోలేకపోతున్న యువకులు దాంపత్యాన్ని అర్ధం చేసుకొనే తీరులో ఎన్ని అపశ్రుతులు ఉంటాయో ఈ అనుభవం కథనం ద్వారా చూపించింది రంగనాయకమ్మ. అపశ్రుతి దొర్లింది అని తెలిశాక అయినా జీవితాన్ని శృతిచేసుకొనటానికి స్త్రీలు సంసిద్ధులు కావాలని హెచ్చరిస్తుంది. ఏది వ్రాసినా స్త్రీ జీవితాలను శాశించే సామాజిక దుష్ట శక్తులను గురించి ఎరుక కలుగచేయటం, ఆత్మగౌరవ చైతన్యంతో సమానతా సూత్రం ప్రాతిపదికగా సంప్రదాయంలోని తుక్కును అంతా వదిలించుకొంటూ నూతన జీవిత నిర్మాణానికి వాళ్ళను సంసిద్ధం చేయటం రంగనాయకమ్మ నవలా దృక్పథం.
స్పార్టకస్ , టామ్ మామ ఇల్లు , స్వేచ్ఛాపథం నవలలను తెలుగువాళ్ళకు సరళంగా పరిచయం చేయటం కూడా రంగనాయకమ్మ నవలాసాహిత్య ప్రస్థానంలో భాగమే.
( ఇంకా ఉంది)
*****
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.