మెరుపులు- కొరతలు
అప్పు “డా. శైలకుమార్” కథ
– డా.కే.వి.రమణరావు
మానవసంబంధాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపైన రాసిన కథ ఇది. ఈ అంశంమీద చాలాకాలంగా కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు వస్తున్నా ఈ కథ చెప్పిన విధానం సరళంగా, సూటిగా ఉండి తన ప్రత్యేకతను నిలుపుకోవడమేకాక ఇవ్వదలుచుకున్న సందేశాన్ని ప్రతిభావంతంగా ఇస్తుంది.
కథంతా ఒక చిన్న సెట్టింగులో తిరుగుతుంది. క్లుప్తంగా కథ ఇది.
ఈ కథను ‘అన్న’ అని పిలవబడే ముఖ్యపాత్ర చెప్తుంది. ఒక ఆఫీసులో పనిచేస్తూ స్నేహంగా ఉంటున్న ఏడుగురు సహోద్యోగుల్లో (కల్పన అనే స్త్రీతో సహా) ఈ ‘అన్న’ ఒకరు. ఆ యేడుగురిలో ఒక ఉద్యోగి అయిన జగదీశ్ హఠాత్తుగా ఆరోజు అఫీసుకొస్తూ దారిలో చనిపోతాడు. మిగతా ఆరుగురిదగ్గరా అతను అధికమొత్తంలో అప్పు చేసివుంటాడు. అతని మరణవార్త తెలిసిన వెంటనే మిగతా ఆరుగురు జగదీశ్ ఇంటికి వెళ్లడానికి ‘అన్న’ దగ్గరికొస్తారు. వాళ్ల మొహాల్లో జగదీశ్ పోయినందుకు దుఖంకంటే అతనికి ఇచ్చిన అప్పు వస్తుందో రాదో అన్న ఆందోళన కనిపిస్తూంటుంది.
అందరూ జగదీశ్ ఇంటికెళ్లి అతని భౌతికకాయాన్ని చూసి బాధపడతారు. అదే సమయంలోనే జగదీశ్ కు ఆఫీసునుంచి రావాల్సిన తొమ్మిదిలక్షలు ఆ మరుసటిరోజే అతని అకౌంటులో పడబోతూందని కూడా వాళ్లకు తెలుస్తుంది. సహోద్యోగుల్లో కొందరు అప్పుడే జగదీశ్ భార్య భాగ్యమ్మను బాకీ సంగతి అడిగి ఆమెదగ్గర మాట తీసుకోవాలంటారు. అయితే ‘అన్న’, మరోవుద్యోగి సాయి వాళ్లను వారిస్తారు.
ఆ మరుసటిరోజు డబ్బు జగదీశ్ అకౌంట్లో జమ ఐయిందని తెలిసి సహోద్యోగులారుగురూ జగదీశ్ ఇంటికెళ్తారు. వీళ్లెందుకొచ్చారో గ్రహించిన భాగ్యమ్మ ‘డబ్బు బ్యాంకునుంచి తేవాలి. దాన్ని ఆయన కళ్లారా చూసుకోవాలి. ఆతరువాతే అందరికీ ఇస్తాను’ అని పదోరోజుదాకా ఆగమంటుంది. ఈలోపలే భాగ్యమ్మ అధికారికంగా జగదీశ్ భార్యగా ఆఫీసు రికార్డుల్లో లేదని తెలుస్తుంది. దాంతో వాళ్ల ఆందోళన మరింత పెరుగుతుంది.
పదోరోజు ఠంచనుగా జగదీశ్ ఇంటికి వెళ్లిన సహోద్యోగుల బృందానికి డబ్బంతా నోట్లరూపంలో జగదీశ్ ఫోటో ముందర బల్లమీద పెట్టి కనిపిస్తుంది. ఆతరువాత భాగ్యమ్మ ఆమెకేమీ మిగలకపోయినా అందరి బాకీ తీర్చేస్తుంది.
“అమ్మా అంతా ఇచ్చేస్తే నీకు ఎలా” అని సాయి బాధగా అడిగితే,
“నా ఒక్క పొట్టకు ఎంతకావాలన్నా అప్పు తీర్చకుండా పోయాడు అన్న చెడ్డపేరు ఆయనకు రాకపోతే చాలన్నా” అంటుంది గాద్గదికంగా. అందరూ షాక్ తింటారు. ఆమె ఎంతో ఎత్తుగా కనిపిస్తుంది, ‘సావిత్రి తన భర్త ప్రాణం కాపాడితే ఈమె భర్త కీర్తిని కాపాడింది’ అనుకుంటాడు అన్న.
బయటికి వచ్చాక సాయి ఒక్కడే డబ్బుతీసుకోలేదని తెలిసిన ‘అన్న’కు తనకు తాను చాలా చిన్నగా కనిపిస్తాడు. అదీ కథ.
“అన్నా ఆస్తి లేదు, ఆదాయం లేదు. అయినా భర్త అప్పుతీర్చడానికి అంత డబ్బును గడ్డిపరకలా చూసింది భాగ్యమ్మ. వయసులోవున్నా, సంపాదిస్తున్నా చనిపోయిన స్నేహితుడికోసం ఈమాత్రం వదులుకోలేనా” అంటాడు చివర్లో సాయి. ఇదే రచయిత తన కథద్వారా ఇచ్చిన సందేశంగా భావించవచ్చు.
కథాక్రమం అంతా ఎక్కువగా సంభాషణలరూపంలో మిగతా చిన్న చిన్న వివరణలు, వర్ణనలతో నడుస్తుంది. కథంతా చనిపోయిన వ్యక్తియొక్క ఆరుగురు సహోద్యోగుల చుట్టూ తిరుగుతుంది. అనవసరమైనవేవీ కనిపించవు. చేయితిరిగిన రచయిత కాబట్టి బరువైన వాతావరణాన్ని అలవోకగా తీసుకొచ్చారు.
మానవ సంబంధాలను డబ్బు ఎలా మారుస్తుందన్నది రచయిత చాలా సహజంగా చూపించారు. కథ మొదట్లో జగదీశ్ చనిపోయింతర్వాత అతనికి అప్పిచ్చిన సహోద్యోగులకు దుఖం బదులు తమ డబ్బురాదేమోనన్న ఆందోళన కలుగుతుంది. పదో రోజు ఎవరిడబ్బువారికి అందగానే ‘అందరిలోనూ ఆనందంకన్నా బాధే ఎక్కువైంది’ అని ఆందోళన పోయాక వాళ్లలో లోపలున్న బాధ వెలికివచ్చిన సంగతి రచయిత ప్రస్తావిస్తారు.
ఒకవ్యక్తి చనిపోతే వేరే ఆసరాలేకుండా అతనిమీదే ఆధారపడి బతుకుతున్నవారికి ఆందోళన కలగడం సహజం. కాని ఇక్కడ ఆందోళన చెందినవారందరూ వయసులో ఉండి, ఉద్యోగాల్లోవుండి సంపాదిస్తున్నవారు, మరొకరికి అప్పు ఇచ్చే స్థోమతగలిగిన వారు. మానవత్వం కనపడాల్సిన చోట దానికి వ్యతిరేకంగా డబ్బు కలగజేసే ఇలాంటి ప్రభావాన్ని ఫోకస్ చెయ్యడమే రచయిత ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.
కుదురుగా రాసిన ఈ కథలోకూడా విమర్శకోసం వెతికితే కొన్ని చిన్నచిన్న లోపాల్లాంటివి కనబడతాయి. ఉదాహరణకు జగదీశ్ కి అంత భారీగా సహోద్యోగులదగ్గర అప్పుచేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయం రచయిత ప్రస్తావించలేదు. వాళ్లు అతనికి సహోద్యోగులేకాబట్టి అతని ఆర్థికవ్యవహారాలు వాళ్లకు తెలిసేవుండాలి. రచయిత ఈ వివరాలు కథకు అవసరంలేదని భావించివుండొచ్చు. అలాగే భాగ్యమ్మ జగదీశ్ ఫోటోముందు చనిపోయాక అతను చూడాలని నోట్లకట్టలు పరిచిపెట్టడం పాఠకులకు కొంత వింతగా కనిపించవచ్చు. ఐతే భాగ్యమ్మ చదువుకోనిమనిషి. అప్పటి ఆమె మానసిక స్థితిలో అలా చేసివుండడానికి అవకాశముంది.
కథలో కథాసంవిధానం, సమగ్రత, క్లుప్తత (బ్రెవిటి) ఆరంభ ముగింపులు, పాత్రలు, భాష అన్నీ సంప్రదాయ శిల్పంలో చక్కగా అమరాయి. వర్ణనలు పెద్దగా లేకపోయినా పాత్రల భావోద్వేగాలను రచయిత చిన్న చిన్న సూచనలద్వారా సమర్థవంతంగా చూపారు.
ఉదాహరణకు ఒకచోట;
“పదండి వెళ్దాం బైకు స్టాండు తీయబోతూ” అన్నాను.
“అన్నా” అంది కల్పన బైకు హ్యాండిల్ పట్టుకుని
ఇక్కడ కల్పన బయలుదేరుతున్న బైకు హ్యాండిల్ పట్టుకోవడం కాకతాళీయం కాదు. అప్పటి ఆమె ఆందోళనను వాస్తవికంగా చూపించడం.
మరో చోట మరణంగురించి ముఖ్యపాత్ర ఇలా అనుకుంటుంది. ‘జీవితం, రుణం అన్నీ తెంచుకు వెళ్లిపోవడం మరణం. ఆవక్తికి సంబంధించినవన్నీ ఉంటాయి. వ్యక్తి ఉండడు. అదే చిత్రం. అతను వాడిన పెన్ను, కుర్చీ, బైకు, రావలిసిన డబ్బూ అన్నీ ఉన్నాయి. అతను లేడు. ఎప్పటికీ కనిపించడు.’
భాగ్యమ్మ తప్ప పాత్రలన్నీ చదువుకుని ఉద్యోగం చేసే పాత్రలు కాబట్టి వాటి భాషలో వైవిధ్యం చూపించాల్సిన అవసరం లేకపోయింది. పాత్రల హావాభావాలు సహజంగా చూపించడానికి రచయిత శ్రద్ధ తీసుకున్న విషయం తెలుస్తుంది. కథంతా ఒకేరకమైన నిరసన ధ్వనిని తీసుకురావడంలో రచయిత నేర్పు కనపడుతుంది.
సీరియస్ అంశంమీద రాసిన కథ అయినా కథంతా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్ద్రమైన విషయాన్ని పొడిగా చూపించాల్సివచ్చినా ఆర్ద్రత ఎక్కడా దెబ్బతినకుండా కథను నడిపించిన రచయిత డా శైలకుమార్ గారు అభినందనీయులు.
*****