రాళ్ళల్లో, ఇసుకల్లో
-కందేపి రాణి ప్రసాద్
శని, ఆదివారాలు శెలవులు వచ్చాయని పోయిన వారం ఏదైనా టూరు వెళదామన్నారు పిల్లలు. ఎక్కువ రోజుల వ్యవధి లేదు కాబట్టి దగ్గరగా వెళదామనుకున్నాం. ఈ మధ్య మద్రాసు చూడక చాలా రోజులయ్యింది. అంటే అసలు చూడక అని కాదు. S R M C లో జరిగే కన్ప్హరెన్స్ లు అటెండ్ అవుతూనే ఉన్నాం. సైట్ సీయింగ్ ప్రదేశాలు చూడట్లేదన్నమాట. అలా గతవారం లో చెన్నై వెళ్ళాము. ఫ్లైట్ దిగగానే ఎయిర్ పోర్టులో తమిళ సంప్రదాయ నృత్యమైన భరతనాట్య రీతుల్లో ఉన్నా చిత్రాల భంగిమలు కన్పించాయి. ఇంకా నటరాజ విగ్రహం, తమిళనాడు లోని చిదంబరానికి గుర్తుగా పెట్టారేమో! తమిళనాడు దేవాలయాలు ద్రవిడ రీతుల్లో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. పొడుగైన గోపురాలు, వాటి మధ్యలో రంగుల విగ్రహలుంటాయి. వాటి దగ్గర ఫోటోలు తీసుకొని హోటల్ స్ప్రింగ్ కు చేరాము. చెన్నై లో ఉన్న మూడు రోజులు మాకో ఇన్నోవా కారు, డ్రైవర్ ను కంపెనీ వాళ్ళు పంపించారు. డ్రైవర్ పేరు దురై పాండ్యన్. వాళ్ళు మొదలియార్ లట. “ ఏమీ రిజర్వేషన్ లేవమ్మా మేమిక్కడ oc వాళ్ళం. నాకు ఈ డ్రైవింగ్ ఆదాయం. పిల్లల ఫీజులకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. మాకేమీ డబ్బులు లేకపోయినా మేము oc వాళ్లగా ఉన్నాము” అన్నాడు డ్రైవరు. అగ్రకుల్లాల్లో ఉన్నా తక్కువ ఆదాయంలో ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు కదా అనిపించింది.
మేము దిగిన హోటల్ లో మధ్యాహ్నం బఫే తిన్నాం. మేం కూర్చున్న టేబుల్ మధ్యలో కుంపటి లాంటి పొయ్యి పెట్టాడు. దాని మీద పన్నీర్ కబాబ్స్, స్టార్టప్ పెట్టి వెళ్ళాడు మనం మిగతావి తింటూ చల్లబడి పోకుండా వేడి వేడిగా తినడానికన్నమాట. రాత్రికేమో ‘మురుగ ఇడ్లి’ అనే హోటల్ కు వెళ్ళాము. అక్కడేమో టేబుల్ మీద అరిటాకు పరిచి దానిమీదే ఇడ్లి పెట్టి సాంబారు పోస్తున్నాడు. మనకు సాంబారు కప్పుల్లో ఉంటుంది కదా! తర్వాత పొడి, నెయ్యి వేసి ఎక్స్ట్రాగా 20 రూ:: చార్జి చేశారు. ఇడ్లిలోకి పొడి, నెయ్యి ఫేమస్ అట. దోషక్కుడా సాంబారు దోశ మీద పోసేసి వెళుతున్నాడు. ఇది కూడా కొత్తగా ఉంది. మరో రోజు సంగీత అనే వెజ్ హోటల్ కు వెళ్ళాము. దాదాపు 40, 50 మంది హోటల్ లోపల ఖాళిలేక బయట ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లోనే ఇలాంటి పరిస్థితి అనుకున్నాను గానీ మద్రాసు లో కూడా ఇంతేనా. వారాంతపు శెలవుల్లో ఎవరూ ఇళ్ళలో తినడం లేదన్న మాట.
కపాలేశ్వర దేవాలయం, పార్థ సారధి దేవాలయం చెన్నై లోని ప్రఖ్యాత ఆలయాలు. చాలా పురాతన ఆలయాలు. ఒక రోజంతా పట్టింది వీటిని చూడటానికి. కపాలేశ్వర ఆలయం చాలా పెద్దది. ఒక ద్వారం దాటగానే మరో ద్వారం వస్తున్నది. అలా మూడు నాలుగు ప్రధాన ద్వారాలు, ద్వారం దాటగానే గుడి కనిపిస్తున్నాయి లోపల్లోపలే నాలుగైదు గుళ్ళు ఉన్నాయి. ఈ గుడిని ‘ కర్పగంబల్ ’ అని పిలుస్తారట తమిళంలో కర్పగంబల్ అంటే కోరికలు తీర్చే చెట్టు దేవతా అని అర్థం. ఇవి దాదాపు 7 వ శతాబ్దంలో నిర్మించబడిన దేవాలయమట. ఇక్కడా పార్వతీ మాత శివుడిని ఒక నెమలి రూపంలో పూజించింది. అందువలన ఈ ప్రదేశం ‘ మైలాయి ‘ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. తమిళ బాషలో నెమలి ని అభివృద్ధి చెందింది. ఇక్కడి శివలింగం ‘ కపాలేశ్వర స్వామి ‘ గా పిలవబడుతున్నాడు. పార్వతీ దేవీ ‘ కర్పగంబల్ ‘ గా కొలవబడుతున్నది. తమిళ శైవ కవులైన నాయనార్లు చెప్పినదాని ప్రకారం పల్లవ రాజులూ ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తున్నది. ఈ దేవాలయ గోపురం 120 అడుగుల ఎత్తు ఉన్నది. ఉదయం నుంచీ సాయంత్రం వరకు ప్రతి రోజు ఎన్నో పూజలు జరుగుతూనే ఉంటాయి. సంవత్సరం మొత్తం మీద ఈ దేవాలయంలో జరిగే ప్రముఖ పండుగలు నాలుగింటిలో “ అరుబత్తి మూవల్ పండుగ “ విశిష్టమైనది. దేవాలయం బయట తమలపాకులతో అల్లిన మాలలు బహు చక్కగా ఉన్నాయి.
దేవాలయాలు చూశాక స్టేట్ మ్యూజియం కు వెళ్ళాము. లోపల చాల బ్లాకులున్నాయి. ఎక్కడా నుంచీ మొదలు పెడదాం అని చూస్తుండగా “ కన్నెమర పబ్లిక్ లైబ్రరీ” అని బోర్డు కనిపించింది. అరె ఇదేమిటి! ఈ లైబ్రరీ ఇక్కడా ఉంటుందా అని ఆశ్చర్యపోయి లోపలి వెళ్ళాము. వేల పుస్తకాలు బీరువాల్లో పొందిగ్గా అమరి ఉన్నాయి. ఆ పుస్తకాల మధ్యలో తిరుగుతూ చాల ఆనందపడ్డాం. పుస్తక రాజులతో ఫోటోలు తీసుకొని మురిసిపోయాం. తర్వాత చిల్డ్రన్ డిపార్ట్మెంట్ కు వెళ్లి అక్కడి పుస్తకాలను పరిశిలించము. నేను కోల్ కట లైబ్రరీ తర్వాత పెద్ద లైబ్రరీ ని చూడటం ఇదే.
మ్యూజియంలో ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు లేదు అనుకోవటానికి లేదు. చెక్కతో చేసిన శిల్పాల దగ్గర నుంచీ బంగారంతో తయారైన కత్తి పిడులు, మహారాణులు వాడిన ఆభరణాల దాకా అన్నీ ఉన్నాయి. గాజు ముక్కల్ని రకరకాల రంగుల్లో ముక్కలుగా కత్తిరించి వాటిని ఒక పద్ధతిలో అతికి కిటికీల దగ్గర, పైన వెంటిలేటర్ల దగ్గర అమర్చారు. వాటి వలన సూర్య కిరణాలు పడి రంగుల్లో పరావర్తనం చెంది గదంతా మిత వెలుగులు విరజిమ్ముతున్నాయి. వారు వాడిన పాత్రలు, కత్తులు, కృపానాలు, యుద్ద సమయంలో వేసుకునే ఇనుప దుస్తులు, కిరీటాలు, విరిగిపోయిన రతి శిల్పాలు ఒకటేమిటి ఎన్నో వస్తువులున్నాయి. వాటిని చూస్తుంటే ఆనందంతో కడుపు నిండి పోయింది కాకపోతే బిల్డింగంతా చెత్త దుమ్ము దుమారాలతో పేరుకుని పోయి ఉండటం కొంత అసౌకర్యానికి గురి చేసింది.
మరునాడు మహాబలిపురం బయల్దేరాం. మహాబలిపురం కు పోయే దారిలో ‘నస్సా మ్యూజియం’ చూశాము. అందులో సముద్రంలో సంచరించే జీవుల కర్పరాలతో ఏర్పాటు చేసిన ఎగ్సిబిషన్స్ ఉన్నాయి. సిస్టార్లు, ఆక్టోపస్ లు, జెల్లీ ఫిష్ లు, సీహార్స్ లు, సీ యాంటిమెన్లు, గవ్వలు, ఆల్చిప్పలు వంటి ఎన్నో రకాల సముద్ర జీవులున్నాయి. చేపల్లోని రకరకాల ఆకారాలు, రంగుల్లో ఎంతో ముద్దోస్తూ తొట్టెల్లో కనువిందు చేస్తున్నాయి. కేవలం వాటి ప్రదర్శనే కాకుండా ఆయా జంతువుల ప్రత్యేక లక్షణాలు వివరాలు రాసి ఉన్నాయక్కడ. నేను చదివింది జంతు శాస్త్రమే కాబట్టి నాకొక్క సారి కాలేజి రోజుల్లోకి వెల్లినట్లనిపించింది. ఇలా ప్రత్యక్షంగా చూసి చదువుకుని ఉంటే చాల బాగా పరీక్షల్లో గుర్తుండేవి కదా అనిపించింది. ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఇంకా కొత్త రకాల షెల్స్ కనిపిస్తున్నాయి. సముద్ర అంతర్భాగంలో ఇన్ని రకాల జలచారలున్నాయా అని చాల ఆశ్చర్యమేసింది. ఒక స్టార్ ఫిష్ ను, చేతిలో పెట్టాడు అక్కడున్నతను చాలా మెల్లగా కదులుతోంది అది. అక్కడ కొంత మంది చేపలతో మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటున్నారు. టబ్ లో చేపల్ని వేసి మన కాళ్ళను పెట్టమంటారు. అది మొత్తం కాళ్ళను చుట్టు ముడుతున్నాయి. కళ్ళ మీద ఉండే డెడ్ స్కిన్ ను అవి కోరికేస్తాయి. అలా కాళ్ళకు పెడిక్యూర్ అవుతుంది. మేమయితే టైం లేదని చేయించు కోలేదు.
అక్కడి నుండి మహాబలిపురం కట్టడాల్లోకి వెళ్ళాము. దీనిని ‘ మామళ్ళపురం ‘ అంటారు. ఇది చెంగల్పట్టు జిల్లలో ఉంది. మేము దాదాపు పదిహేనేళ్ళయింది. మహాబలిపురం చూసి ఇప్పుడు కొద్దిగా మారింది. చుట్టూ ప్రహరీ గోడలు వెలిశాయి. పాండవుల పంచరధాలు, శివుడు, పార్వతీ గుడులు, ఆవు దూడ శిల్పాలు, ఏనుగుల గుంపు, శ్రీ కృష్ణుని వెన్నముద్ద మొదలైనవి ఎన్నో చూశాము.
పల్లవ రాజైన మహామల్ల పేరు మీదుగా ఈ మామల్ల పురం అని పేరు వచ్చింది. రధాలు, మండపాలు, ఓపెన్ ఎయిర్ రాక్ రిలిఫ్స్ మరియు దుర్గ, విష్ణు, శివుడు, కృష్ణుడు వంటి దేవుళ్ళ గుడులు రాళ్ళతో చెక్కబడ్డాయి. ఏడవ శతాబ్దంలో ప్రాచుర్యం పొందిన పోర్టు సిటిలలో మామళ్ళ పురం ఒకటి. 1827 లో బ్రిటిష్ వారు దీని చుట్టుపక్కల ఉరిని అభివృద్ధి చేశారు. పెద్ద కొండల్ని, బండ రాళ్ళని అధ్బుతమైన శిల్పాలుగా, మలిచారు ఆనాటి మహాశిల్పులు. పల్లవ రాజులూ కట్టించిన శిల్పకళా రీతులకు ఉదాహరణగా కాంచీపురంలోని కైలసనాధ ఆలయాన్ని మరియు మహాబలిపురం లోని తీర ప్రాంతపు దేవాలయం మరియు పంచ రధాలను చెప్పుకోవచ్చు.మహాబలిపురం లోని స్మారక సమూహాల శీలా తోరనల్లో పంచ పాండవ గుహలయాలను ప్రముఖంగా పేర్కొనవచ్చు. విశ్వకర్మ స్తపతులు నిర్మించిన పురాతన గుహలయాల్లో దీనిని ప్రత్యేకంగా గుర్తించవచ్చు. 1984 లో ఈ మండపాలను గుహలను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించింది. సింహ స్తంభాలున్నఈ పంచ పాండవ వరండాలు పల్లవ రాజుల యొక్క క్లిష్టమైన శిల్పకళకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
బాలరాజు కధ సినిమాలోని కె వి మహదేవన్ స్వరపర్చిన మహాబలిపురం! మహాబలిపురం! అనే పాట గుర్తు వచ్చింది మాకు ఆ గుహల్లో తిరుగుతున్నపుడు గోవర్ధనగిరి నెత్తుట, మహి షాసుర మర్థనం, వంటి పురాణ అంశాలను ఈ రాళ్ళపై చెక్కినారు. ఆనాటి శిల్ప విశ్వకర్మల కళా చాతుర్యాన్ని ఎంత పోడిగినా తక్కువే. నేను భారతీయ శిల్పకళ అనే పేరుతో పిల్లల కోసం కొన్ని చార్టులను తయారు చేశాను. వాటిలో కిటికీలను,ద్వారాలను, గోపురాలను, మండపాలను దేనికవి విడదీసి, రెండు మూడు ఆలయాలు శిల్పాల మధ్య పోలికలు, తేడాలు వివరిస్తూ తయారు చేశాను. ఇంటి కెళ్లాక వీటిని కూడా అలా తయారు చేయాలనీ నిశ్చయించుకున్నాను. నేను శిల్పకళ మాత్రమే కాదు ప్రఖ్యాత రాజమందిరాలు కోతలు ఉన్నా పొటోలు వాటి వివరాలు కలిపి కూడా చార్టులు తయారు చేసి మా ఆసుపత్రి మొదటి అంతస్తులో ప్రదర్శనకు ఉంచాను.
ఇక్కడి నుంచీ శ్రీకృష్ణుని వెన్నముద్ద దగ్గరకు వెళ్ళాము. ఒక పెద్ద రాతి గుండం కొండ మీద పడిపోయినట్లుగా ఉంటుంది. దీనికే ‘ కృష్ణుని వెన్నముద్ద ‘ అని పేరు. కొద్దిగా మాత్రమే కొండకు అతుక్కొని ఉంటుంది ఈ రాతిగుండు. ఆ రాతి గుండును నెడుతున్నట్లుగా ఫోజులిచ్చి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు జనం. తర్వాత ఆ రాతి గుండు దగ్గర నుంచి కింది దాకా కొండ మీద నుంచీ జారుతూ ఆనందిస్తున్నారు చిన్నా పెద్దా తేడా లేకుండా. ఆ కాలంలోని ప్రజలు ఇంతంత దూరాలు ఎలా నడిచేవారనే సందేహం పట్టి పిడుస్తోంది.
ఇక్కడ నుండి సముద్ర తీర ప్రాంతంలోని గుడికి వెళ్ళాము. దేవాలయం చుట్టూ పక్కలంతా షాపులున్నాయి. ఆవరణ మొత్తం 3,4 కి. మీలు ఉండవచ్చు. దారి పొడువునా చిన్న చిన్న లైట్లు నేల మీద అమర్చారు. తప్ప పెద్ద వెలుతురేం లేదు. దేవాలయం ఉన్నా ప్రాంతమే వెలుగులో ఉంచారు. చుట్టూ అవరనంత చీకటిగా ఉంటుంది. అందువల్ల కి. మీ ల దూరం నుంచే ఆలయం అధ్బుతంగా కనిపిస్తుంది. ఈ మధ్యే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, చైనా ప్రధాని జింపింగ్ ఇక్కడా కలుసుకోవటం వలన మహాబలిపురం వార్తల్లో కొచ్చింది. కాలి నడకలో వెళుతుంటే చీకటి వల్ల పక్కనే సముద్రమున్న విషయం కనిపించట్లేదు కానీ సముద్రం మీద నుంచీ వీచే చల్లని గాలి, సముద్ర హోరు వలన గుడి తీరంలో ఉన్నదని తెలుస్తున్నది. ఇసుక మధ్యలో అధ్బుత కట్టడం అపూర్వంగా నిలబడి ఆనాటి శిల్పుల ప్రావీణ్యన్నీ ఎత్తి చూపినట్లుగా రాజసంగా ఉన్నది. ఎన్నో పొటోలు తీసుకున్నాం. అంత దూరం నడిచిన శ్రమ, అలసట ఆ కట్టడాన్ని చూశాక మాయమై పోయింది. గవ్వలతో చేసిన అనేక కళా ఖండాలు అన్నింటినీ కోనేయమని మనసుని తొందర పెడుతున్నాయి. గవ్వల కర్టెన్ ఒకటి, గవ్వల శాండ్లియర్ ఒకటి కొనుక్కొని వెనుదిరిగాం. మహాబలిపురం నుంచీ మద్రాసు వస్తుంటే యూనివర్సల్ స్టూడియో, దక్షిణ చిత్ర వంటి అనేక ఎమ్యూజ్ మెంట్ పార్కులు కనిపించాయి. వాటినింకోసారి చూద్దాములే అనుకుంటూ కారులో కళ్ళు మూసుకుని నిద్ర పోయాం. తిరిగి తిరిగి పడిన శారీరక శ్రమతో పాటు అధ్బుత శీలా సంపద చూసి మనసూ నిండి పోయింది.
****
(సమాప్తం)
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.