కథా మధురం  

విడాకుల సమస్యకి కొత్త పరిష్కారం సూచించిన  ఓ స్త్రీ కథ

 ‘జింబో’ (రాజేందర్) గారి ‘ఆమె కోరిక ‘ ! 

-ఆర్.దమయంతి

‘ If divorce is like death, then is not the perpetuation of divorce a kind of murder? ‘

   Anthony Marais

డైవోర్స్! 

వైవాహిక జీవితం లో   సామాన్య స్త్రీల నుంచి సెలెబ్రెటీ వుమెన్ వరకు ఎదుర్కొంటున్న  ప్రధానమైన సమస్యలలో ఇప్పుడు ‘విడాకులు..’  కూడా వచ్చి చేరింది.  

ఒకప్పుడు కథల్లో కనిపించేది. . సినిమాల్లో  విడాకుల సన్నివేశాలు కంట తడిపెట్టించేవి.  మనసంతా బరువైపోయేది. మళ్ళా ఆ జంటని కలిపి సినిమా సుఖాంతం చేస్తేనే కానీ ప్రేక్షకుల గుండెలు  ఆనందంతో నిండేవి కావు. విడిపోవడం  మరి అంత బరువైన సంఘటన.

కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.  కథ తిరగబడింది. నిజ జీవితం లో సయితం డైవోర్స్ చాలా సామాన్యమైన విషయం గా మారిపోయింది. పెళ్ళి అయిన జంట కడ దాకా కలిసి బ్రతుకుతారన్న గారంటీ..విశ్వాసం రాన్రాను అడుగంటిపోతోంది. ‘ టేకిటీజీ’  అంటూ తరచూ ఓ ప్రముఖ సెలెబ్రిటీ చెబుతుంటాడు. 

 ఎంత తేలిక గా తీసుకుందామనుకున్నా, విడాకులు అనే పదం వింటానికే  చేదుగా వుంటుంది!! ఇక మోసే వారికెంత మరణ యాతనో కదూ?    .  

అందుకే మొగుడిలో ఎన్ని లోపాలు వున్నా సరే..  ఇల్లాళ్ళు భరిస్తారే తప్ప తెగతెంపులకు తొందరపడరు. కారణాలనేకం.   పిల్లల కోసమో..ఆస్తుల కోసమో..ఒంటరిగా బ్రతకలేని అధైర్యమో.. బేలతనమో కారణాలుగా నిలుస్తాయి.  

కానీ ఈ కథ లో ఈ ఇల్లాలి కథ మాత్రం చాలా విచిత్రం! వైవిధ్యమైన విషాదం..గెలుపు కాని ఓటమో..ఓడిపోక నిలిచిన విజయమో..తెలీని చిత్రమైన కథ. ఆసక్తి ని రేకిత్తిస్తుంది. ఆలోచించమని మనవి చేస్తుంది –  ‘ఆమె కోరిక’! 

అసలు కథ ఏమిటంటే : 

ఆ మొగుడూ పెళ్ళాలు  గత 25 సంవత్సరాలుగా వేరుగా వుంటున్నారు.  ఆ  భర్త విడాకుల కోసం కేసు వేసి,  అయిదేళ్ళైపోయింది.  భార్య దాన్ని వ్యతిరేకిస్తోంది.  మరి ఆమె  ఎందుకు వ్యతిరేకిస్తుందీ? – ఇదొక కక్ష సాధింపు చర్య.  ‘అతన్ని సాధించడానికి తప్ప కారణం ఏముంటుంది?’ జడ్జ్ గారు  కూడా అదే భావిస్తారు.

అందుకే ఆ కేసు కి తుది తీర్పు చెప్పేయడానికి నిర్ణయించుకుంటారు. 

భర్త తరపు న్యాయవాది వాదన విన్నాక జడ్జ్ గారికి అనిపిస్తుంది. ఇంక ఆమె తరఫు వినేందుకేం వుంది అని? 

కానీ చిత్రం! ఆమె తన లాయర్ ద్వారా తన వాదన వినాల్సిందిగా మనవి చేస్తుంది. అది వాదన కాదు. అమె గళం…వాయిస్..ఒక స్త్రీ హృదయ ఘోష!!  ముగింపుగా తన మనసులోని కొత్త ఆకాంక్షని వ్యక్త పరుస్తుంది.

విన్న జడ్జ్ గారు ఆలోచనలో పడతారు..   

ఆమె కోరిక ఏమిటన్న పాయింటే ఈ కథకి ప్రాణం అని చెప్పాలి. ఇదొక వినూత్న  కథాంశం! గొప్ప సందేశాత్మకం  కూడా!!

ఫ్రెండ్స్! తప్పక చదవండి. 

******

కథలోని ప్రధాన స్త్రీ పాత్ర ‘భార్య ‘ గురించి :

ఈమె సాంప్రదాయ స్త్రీ అయితే భర్త వొద్దంటున్నా అతని పాదాల దగ్గరే పడుండాలి. ఆధునిక స్త్రీ ఐతే డైవోర్స్ తీసుకుని బయట పడాలి. కానీ ఈ రెండిటికీ వ్యతిరేకి అయిన ఈ భార్య పాత్ర చాలా ఆసక్తికరం గా అగుపిస్తుంది.  

వివాహ బంధం శాశ్వత సంబంధం కాదు : …అని పరోక్షం గా చెప్పిన పాత్ర. పెళ్ళై ఎన్నేళ్ళు కాపురం చేసినా, పిల్లల తల్లి అయినా నిశ్చింత  లేని బ్రతుకులైపోతున్నాయి ఈ నాటి స్త్రీలకి. 

  ఈ కథలో ఈ భార్య కూడా అతనితోనే జీవితం అని నమ్ముతుంది.  రెండేళ్ళకి తల్లి అవుతుంది.  ప్రసవానికి పుట్టింటికెళ్తుంది.

అసలు ప్రసవం తర్వాత స్త్రీల పరిస్థితి ఎలా వుంటుందో చాలా మంది కి తెలీదు. ఒక్ తెలీని డిప్రెషన్ కి లోనయి వుంటుంది. ప్రసవ వేదన, పునర్జన్మెత్తిన ఘటన, పచ్చిపుండు లాటి వొళ్ళు, వొళ్ళో పసివాని రోదన..పాలు పట్టడం లో ఇబ్బందులు..తొలికా ంపు లో తల్లిదనపు తీయదనం కంటే కుట్ల బాధల తీపే అధికం గా వుంటుంది. అలాటి సమయాలలో భర్త ఓదార్పు, కన్సర్న్స్ ఆ ఇల్లాలి ఎంత అవసరమంటే..ఆమె కి అవే గొప్ప వూరట ని కలిగిస్తాయి. మామూలు మనిషిని చేస్తాయి. కానీ, దురదృష్టం ఏమిటంటే..ఆడపిల్లని కన్నావు అంటూ నో, మగపిల్లాణ్ణి కనలేదనో ఈసడింపులతో సాధింపులతో ఆమెని మరింత గా నిరాశనిస్పృహల లోయలోకి తోసేయడం..కొండంత విషాదం!   ఇలాటి దుర్భర పరిస్తితుల్లో ఆ ఇల్లాలి మనసు ఎంత గా అల్లకల్లోలమై వుంటుంది? మరింత గా భీతిల్లితుంది  కదూ? ఆమె కన్నీళ్ళు మాట్లాడగలిగితే..ఎంత బావుణ్ణు!!

మొగుడు వొద్దంటే పుట్టింట్లో వుంటమేనా? 

సహజం గా ఈ మాటే అంటారు చుట్టుపక్కల వాళ్ళు.  పెనిమిటి  దగ్గరే వుండాలి పెళ్ళాం.  అప్పుడే ‘కాపురం’ నిలుస్తుంది అని.

మంచి మాటలు చెప్పి పిల్లను దింపి రావడం, గోడక్కొట్టిన బంతిలా ఆమె పుట్టింటికి తిరిగిరావడం.. మనం చూస్తుంటాం!  

ఈ భార్య కూడా కాపురాన్ని నిలుపుకునే ప్రయత్నమే చేస్తుంది. నలుగురిలో  పంచాయితీలూ జరుగుతాయి. ఫలితం శూన్యం.

అసలు భార్యా భర్తలు కలిసి కాపురం చేయడం లో ఒక పెద్ద రహస్యం దాగుంటుంది.   అదెమిటంటే ఆమె ఇష్టాఇష్టాలతో సంబంధం లేకపోయినా అతను ‘కాపురం’  చేయొచ్హ్చు.  కానీ అతను విముఖుడైనప్పుడు, తనకి వొద్దంటూ భార్యని   తోసేసినప్పుడు..ఆమె ఉనికినే భరించలేనంటూ  ద్వేషాన్ని వెళ్ళ గక్కినప్పుడు.. ఇక ఆమె ఆ ‘కాపురం’ చేయలేదు. 

గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం..అనే సామెత చందాన..ఆ దంపతులని పడక గది వరకు తీసుకెళ్ళ గలరే తప్ప..బలవంతం గా కాపురం చేయించగలరా? అసంభవం! ఇక్కడొక సత్యాన్ని చెప్పాలి. ఇదే మాట ఆ భార్య భర్త తో అంటే..మన ఆడవాళ్ళంతా ఏమంటారు? గడ్డి పెడతారు. దాంపత్య జీవితం లో భర్త సమర్ధుడు కాకపోయినా గట్టి గా చెప్పే ధైర్యం ఏ ఇల్లాలికీ లేదు. కానీ అదే మగాదైతే ..ఏదో ఒక నెపాన..(తప్పు తనదైనా..) ఆమె పై నేరాన్ని మోపి..ఇంట్లోంచి వెళ్ళ గొట్టి..అపనిందలు మోపి..అవమానించి..శారీరకం గా హింసించి..పిల్లల భారాన్ని కూడా ఆమెపై మోపి..కొత్త పెళ్ళికొడుకై సంబరాలు చేసుకుంటున్నాడు.  

  తను చేయని తప్పు కి ఆ ఇల్లాలు జన్మంతా శిక్ష అనుభవించాల్సిందేనా? ఎంత అవమానం! త్రేతా యుగం లో సీతమ్మను కాదన్న రాముని మాట వెనకైనా ఒక అర్ధం, పరమార్ధం దాగుందేమో కానీ, ఈ  ఆధునిక యుగం లో అకారణం గా భార్య ని బలవంతం గా వదిలించుకునే పురుష దౌత్యాహంకారాల వెనక మాత్రం కేవలం మృగత్వమే కానొస్తోంది. ఆటవిక తే కొట్టొస్తోంది.

 పెళ్ళాం తో కాపురం ఇష్టం లేదని ఊసేందుకు ఆ స్త్రీ  రుచి లేని  కూడు లాంటిదా ? కట్టున్నాక నచ్చలేదని విప్పిపడేసే  డ్రెస్ లాంటిదా? ఇల్లు మార్చినట్టు ఇల్లాల్ని మార్చడానికి..ఆమె ఏమన్నా ప్రాణం లేని బొమ్మనా?  మాట్లాడని రాతి గోడనా? ఏమని..ఇంత అన్యాయం చేస్తున్నాడు మగాడు? 

అన్యాయం చేసినవాడు ఏ బాయ్ ఫ్రెండో, నమ్మించి మోసం చేసిన ప్రియుడో అయితే ..’నీ చేతులారా చేసుకున్న ఖర్మ, అనుభవించు  ‘ అని ఆడపిల్లని తిట్టొచ్చు. కానీ ‘నాతి చరామి 

..’అంటూ, అగ్ని సాక్షిగా పది మంది ముందు తాళి కట్టి, పెళ్ళాడిన  మగడే  ఆమె పట్ల ఇంత అధర్మానికి ఒడిగడితే, ఇంట్లోంచి తరిమేస్తే ‘ఇది తన తల రాత ‘ అని సరిపెట్టుకోవాలా? 

‘ఆ వెధవ వొద్దన్నంత మాత్రన బ్రతుకు సమాప్తమైపోతుందా? ధైర్యం గా బ్రతుకు. ఎదిరించి బ్రతుకు. చదువుకో. ఉద్యోగం లో వర్క్ మీద కాన్సెంట్రేట్ చేయి. పిల్లాడి భవిష్యత్తు ఆలోచించు. మంచి హాబీస్ నేర్చుకో. టెన్నిస్? గార్డెనింగ్? రైటింగ్? మ్యూజిక్? ఏదో ఒకదాంట్లో మునిగిపో..మెడిటేషన్నేర్చుకో. మంచి థెరపీ లా పనిచేస్తుంది..లేదంటే టూరిజం బెస్ట్..’

‘ ఇలా ఎన్నో చెబుతారు..చుట్టూ వున్నవాళ్ళు ఓదార్పుగా.

కానీ..నిజంగా ఇవన్నీ గాయానికి పై పూతలు మాత్రమే. అసలైన గాయం జ్ఞాపకాలతో రేగుతూనే వుంటుంది. ‘మనసుకొక్క గాయమైనా..మాసి పోదు చితిలో అయినా’ అని అంటాడు మనసు కవి. ఇందుకు కారకుడైన వాని మీద కోపం..ద్వేషం..పగ..శతృత్వం..యుధ్హ్దం లో గెలిచిన అన్యాయం..ఓడిన తన నిజాయితీ తనం..అన్నీ గుర్తే మనసుకి. అదొక మరణ యాతన.

ఇఫ్ డైవోర్స్ ఈజ్ లైక్ డెత్, దెన్ ఈజ్ నొట్ ద పెర్పెట్రేషన్ ఆఫ్ డైవోర్స్ అ కైండ్ ఒఫ్ మర్డర్? అని అంటాడు ప్రముఖ రచయిత ఆంథోనీ మరైస్. 

అందుకేనేమో విడాకుల సమస్యకి ఓ కొత్త పరిష్కారాన్ని సూచిస్తూ..

కథలో ఈ ఇల్లాలు కూడా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది..

కథ చదివాకా ఈ స్త్రీ పాత్ర లోని  ఔన్నత్యం మరింతగా ద్విగుణీకృతమౌతుందనడం లో ఎలాటి అతిశయోక్తి లేదు.  

***

ఉత్తమ  కథని అందించిన రచయిత  శ్రీ రాజేందర్ జింబో గారికి నెచ్చెలి తరపున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. 

***

ముగింపు: 

నెచ్చెలి పాఠకులందరూ ఈ కథ చదివి, పత్రికతో..రచయితతో మీ అమూల్యమైన  హృదయస్పందనలను పంచుకోవాల్సిందిగా  కోరుతున్నాం!

అందరికీ శుభాకాంక్షలతో..వచ్చేనెల మరో కథా మధురం తో కలుసుకుంటాను.

*****

ఆమె కోరిక ! (కథ) 

-జింబో (రాజేందర్) 

నిజామాబాద్ లో జాయిన్ అయి వారం రోజులు దాటుతుంది. చాలా కేసులు పెండింగ్‌లో వున్నాయి. భార్యా భర్తల మధ్య వున్న కేసులు కూడా ఎన్నో చాలా సంవత్సరాల బట్టి విచారణలో వున్నాయి. ఆస్తి తగాదాల కేసులు, క్రిమినల్ కేసులు వేరు. భార్యాభర్తల మధ్య వున్న కేసులు వేరు. రెండు జీవితాల వ్యవహారం. రెండు జీవితాలే కాదు ఆ రెండు జీవితాలలో మరెన్నో జీవితాలు ముడిపడి వుంటాయి‌.

ఆ కేసుల వైపు నా దృష్టిని కేంద్రీకరించాను. ఆ కేసులని సత్వరం పరిష్కరిస్తే వాళ్ళు మరో వివాహం చేసుకోవడమో లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికో అవకాశం చిక్కుతుంది. యవ్వనంలో వున్న వాళ్ళ కేసులని ఆలస్యంగా పరిష్కరిస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టుగా వుంటుంది.

విడాకుల కోసం కోర్టులకి వస్తున్న వ్యక్తులు ఎందరో. ఎందుకిలా జరుగుతుంది.?

ఏమో. మారిన జీవన సరళి, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత స్వాతంత్ర్యం, సున్నిత మనస్తత్వం ఇట్లా ఎన్నో కారణాలు. ఆలోచనలు ఎగురుతూ వున్నాయి.

ఆ రోజు శనివారం. కోర్టు పని వుండదు. ఆఫీసు పని వుంటుంది. కేసు ఫైళ్ళు చదువుకోవడం, తీర్పులు చెప్పడం ఇలాంటి పనులని శనివారం చేస్తూ వుంటాం.

సోమవారం వాదనల కోసం వున్న ఓ నాలుగు ఫైళ్ళని నా ముందు పెట్టాడు బెంచ్  క్లర్క్.

వాటిని తీసి చదవడం మొదలుపెట్టాను. చాలా కాలంగా విచారణ లో వున్న ఫైలుని తీసి చదవడం మొదలుపెట్టాను‌.

సాక్ష్యాలను పరిశీలించాను‌.

భర్త విడాకుల కోసం కేసు దాఖలు చేశాడు. అయిదు సంవత్సరాలు దాటింది కేసు వేసి. భార్య దాన్ని వ్యతిరేకిస్తోంది. 

వాళ్ళిద్దరూ గత 25 సంవత్సరాలుగా వేరుగా వుంటున్నారు. మరి భార్య ఎందుకు వ్యతిరేకిస్తుందీ? – అతన్ని సాధించడానికని అన్పించింది.

ఫైలుని క్షుణ్ణంగా చదివేశాను. మంగళవారం ఆ కేసు తీర్పు చెప్పాలని అనుకున్నాను.  

 ఇరు పక్షాల వాదనలని విని, తీర్పు ప్రకటించడమే మిగిలి వుంది.

సోమవారం నాడు ఆ కేసుని పిలవగానే ఆమె వచ్చి నిల్చుంది. అతనూ వచ్చాడు.

మధ్యాహ్నం రెండు గంటలకి తమ న్యాయవాది వచ్చి వాదనలని చెబుతాడని ఆమె కోర్టు కి విన్నవించింది. తమ న్యాయవాది కూడా మధ్యాహ్నమే వస్తాడని అతనూ కోర్టు కు చెప్పాడు.

లంచ్ తరువాత ముందుగా వారి కేసు వాదనలనే వింటానని చెప్పాను.

ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు.

***

లంచ్ తర్వాత మళ్ళీ బేంచి మీదకు వచ్చాను. ఆ కేసులోని భార్యభర్తలూ , వాళ్ళ న్యాయవాదులూ లేచి నించున్నారు. హైదరాబాద్ మాదిరిగా కాదు. జిల్లాల్లో న్యాయవాదులు ఎప్పుడూ రెడీగా వుంటారు. చెప్పిన టైంకి మరీనూ.

వాదనలు మొదలు పెట్టమని భర్త న్యాయవాదిని కోరాను.  

అతని న్యాయవాది తన వాదనలని మొదలు పెట్టాడు. ఇద్దరూ విడిపోయి 25 సంవత్సరాలు దాటింది. ‌రెండు మూడు సార్లు పంచాయతీ లు అయినవి. కానీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఎలాంటి కారణం లేకుండా ఆమె అతని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళకి సంతానం ఒక్కడే.‌ అతనూ అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆకారణంగా ఆమె వెళ్ళిపోయింది, వారి వివాహం భావోద్వేగం లేకుండా చచ్చిపోయింది. అందుకని విడాకులని మంజూరు చేయాలని అతని ‌న్యాయవాది కోర్టు ని కోరాడు.

అతని వాదనలు విన్న తరువాత వాళ్ళిద్దరి వైపు నిశితంగా చూశాను. ఆమెకు యాభై అయిదు సంవత్సరాలుంటాయి. మనిషి చాలా గంభీరంగా వుంది. వినయంగా నిల్చోనుంది. అతనికి అరువై సంవత్సరాలుంటాయనుకుంటాను. ఈ మధ్యే పదవీ విరమణ చేశాడు. తెల్లటి దుస్తులు వేసుకొని వచ్చాడు. అతనూ వినయంగా నిల్చొని వున్నాడు. విడాకులు త్వరగా మంజూరు చేస్తే బాగుంటుంది అన్నట్టు వున్నాయి అతని చూపు లు.

25 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరుగా వుంటున్నారు. ఆ విషయంలో ఎలాంటి వివాదం లేదు. వారి వివాహం భావోద్వేగం లేకుండా చచ్చిపోయింది. విడాకులు మంజూరు చేయకపోయినా వాళ్ళిద్దరూ కలిసి జీవించే పరిస్థితి కన్పించడం లేదు. అతని న్యాయవాది వాదనలు వినిపిస్తున్నప్పుడు, వివరం గా చెబుతున్నప్పుడు అతని సాక్ష్యాన్ని గమనిస్తే అదే అనిపించింది.

అతని ‌న్యాయవాది వాదనలు పూర్తి అయిన తరువాత ఆమె ‌న్యాయవాది వైపు చూసి అతని వాదనలని క్లుప్తంగా చెప్పమని కోరాను.

తన వాదనలని పూర్తి చేయడానికి ఓ గంట టైం పడుతుందని అతను ముందుగా నే విన్నవించాడు. 

సమయం మూడవుతుంది. ఇంకా రెండు కేసుల్లో వాదనలని వినాలి.

ఆ న్యాయవాది వైపు చూశాను. దాదాపు డెబ్బై అయిదు సంవత్సరాలు వుంటాయి. ఆ వయస్సులో కూడా గంటసేపు వాదనలని వినింపించేదుకు తాను సిద్ధం గా వున్నానని  అనడం ఆశ్చర్యాన్ని  కలిగించింది.

‘ 25 సంవత్సరాలుగా వారు వేరువేరుగా వుంటున్నారు. వారి వివాహం లో భావోద్వేగం లేదు. అది చచ్చిపోయింది. ఆమె టీచర్‌గా పని చేస్తుంది. కొడుకు అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఆ కేసులో వాదనలు ఏం వుంటాయి!  అనవసర కాలయాపన తప్ప ‘ అని అన్పించింది.

అందుకే ఆ  సీనియర్ అడ్వకేట్ ని ఉద్దేశిస్తూ  – 

“వాళ్ళిద్దరి మధ్య భావోద్వేగం లేదు. 25 సంవత్సరాలుగా వేరుగా వుంటున్నారు. కలిసి వుండే అవకాశం కూడా లేదు. ఇంకా ఏమి వాదనలు వుంటాయి సార్!” అన్నాను..

” మీరన్నది నిజమే యువరానర్! అయితే, మా క్లయింట్ తన వాదనలని మీకు విన్పించమని కోరింది. మా వాదనలు విని మీరు ఎలాంటి తీర్పు చెప్పినా పర్వాలేదు. కానీ మా వాదనలని పూర్తిగా చెప్పనివ్వండి సార్!” అన్నాడు చాలా వినయంగా.

ఆమె కూడా తన అభ్యర్ధన కూడా అదే అన్నట్టు  చూసింది నా వైపు.

సీనియర్ న్యాయవాది అలా అన్న తరువాత నేను కాదని అనడానికి ఏముంటుంది?

‘సరే సార్ చెప్పండి’ అన్నాను.

మిగతా రెండు కేసుల్లో ఒక కేసు వాయిదా వేశాను.

ఆ సీనియర్ న్యాయవాది తన వాదనలని మొదలు పెట్టాడు.

“వీళ్ళిద్దరూ టీచర్లు. హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అయ్యింది. రెండు సంవత్సరాలు‌‌ మాత్రమే వాళ్ళు కలిసి జీవించారు. ఆమె గర్భవతి అయిన తరువాత ప్రసవాని కి తన తల్లిగారింటికి వెళ్ళింది. ఓ పిల్లవాడికి జన్మనిచ్చింది. నామకరణానికి వచ్చిన భర్త  అంటి ముట్టనట్టుగా వుండి పోయాడు. రెండు మాసాలు గడిచినా కూడా ఒక్కసారి కూడా వాళ్ళని చూడటానికి మళ్ళా రాలేదు. ఆమెనూ కొడుకునీ తీసుకొని వెళ్ళలేదు. చూసి చూసి..చివరికి ఆమె తల్లిదండ్రులే వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ఆమె భర్త ఇంట్లో వదిలి వెళ్ళారు. ఆమెతో ముభావంగా వుండటం మొదలు పెట్టాడు. మా క్లయింట్ ఎంత అడిగినా అతను ఏ కారణమూ చెప్పలేదు. 

వాళ్ళ అబ్బాయి కి గ్రహణం కారణంగా మూతి మీద మొర్రి ఏర్పడింది అందుకే భర్త ముభావం గా  వుంటున్నాడని ఆమె అనుకొని ఓ ఆరు నెలలు  అలాగే భరించింది. ఆ తరువాత వాళ్ళ స్కూల్లో పని చేస్తున్న మరో టీచర్ తో ప్రేమలో పడ్డానని మా క్లయింట్ కి తెల్సింది. రోజూ సాయంత్రాలు ఆమె ఇంటికి వెళ్ళడం, తన ఇంటికి ఆలశ్యంగా రావడం మొదలుపెట్టాడు.

ఓ రోజు మా క్లయింట్‌ అతన్ని నిలదీసింది. గొడవ పడింది. ఇలా చేయడం న్యాయమా.. అని ప్రశ్నించింది.

” నేను ఇలాగే వుంటాను. నీకు ఇష్టం అయితే వుండు లేకపోతే మీ ఇంటికి ఫో ..”  అన్నాడు.  అయినా కొంతకాలం భరించింది. అతను ఇంటికి రావడమే మానేశాడు. భరించలేక చివరకి ఆమె తన తల్లిగారింటికి వచ్చి వుండటం ప్రారంభించింది.

 ఆ తరువాత పెద్దవాళ్ళు పంచాయతీ పెట్టారు. ఆమె అంటే తనకిష్టం లేదని తేల్చి చెప్పాడు.  విడాకులు కావాలని అన్నాడు. అది మా క్లయింట్‌ కి ఇష్టం లేదు. పోలీసు కేసు కూడా పెట్టింది. కేసు పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అతను రెండో వివాహం చేసుకున్నాడనడానికి సాక్ష్యాలు కానీ,  వరకట్న డిమాండ్ కానీ లేదని చెబుతూ ఆ కేసుని కోర్టు కొట్టివేసింది.  నిజమే!

ఆమె ఇంటి నుంచి తనకు తానుగా వెళ్ళలేదు. తన భర్త మరో అమ్మాయి తో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆమె వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా అతనితో కలిసి వుండటానికి ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో పంచాయతీ లు జరిగాయి. కానీ ప్రతి పంచాయతీ లో విడాకులనే కోరాడు. ఆమె భర్త కూడా  క్లయింట్ ని కాపురానికి తీసుకెళ్ళాలని  ఎప్పుడూ అనుకోలేదు.

చివరికి ఆమె తన దురదృష్టానికి చింతిస్తూ,  తన ఉద్యోగం తాను చేసుకుంటూ కొడుకుని బాగా చదివించి, అమెరికా కు పంపించగలిగింది. ఇప్పుడతను అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని చదువు కోసం, పోషణ కోసం ప్రతివాది ఇచ్చిన డబ్బులు నామమాత్రమే. అబ్బాయి కి గ్రహణం మొర్రి అన్న కారణంగా కొడుకుని చిన్న చూపు చూశాడు. ఏ నాడూ ప్రేమ గా పలకరించలేదు.

ఇప్పుడు నా క్లయింట్ భర్త కి ఇద్దరు పిల్లలు.. రెండవ భార్య తో. ఒకరికి వివాహం కూడా చేశాడు. సుఖంగా వుంటున్నాడు‌. ఇప్పుడు నా క్లయింట్ వాళ్ళతో ఎమీ గొడవ పడటం లేదు. పంచాయతీ లు పెట్టడం లేదు.

ఆమె జీవితం ఆమె కొనసాగిస్తుంది. తన జీతం డబ్బు లతో తాను బతుకుతుంది. తన జీవితం తాను కొనసాగిస్తున్నాడు ఆమె భర్త. ఈ విడాకుల దరఖాస్తు ఎందుకు పెట్టాడో అర్థం కాని విషయం యువరానర్!

ఒక్క నిమిషం ఆగి‌ మళ్ళీ తన వాదనని ఇలా కొనసాగించాడు.

“యువరానర్! నేను చెప్పిన విషయాలు అన్నీ సాక్ష్యాలతో వచ్చాయి‌. భర్త తప్పిదం వల్లే ఆమె వేరుగా వుంటుంది తప్ప తనకు తానుగా ఆమె వెళ్ళిపోలేదు. 

ఈ 25 సంవత్సరాలలో ఆమె కు వేదనే మిగిలింది తప్ప సంతోషం లేదు. తన కొడుకును బాగా చదివించుకున్నానన్న తృప్తి తప్ప ఈ వివాహం వల్ల ఆమెకు ఏమి లభించలేదు. అయినా ఆమె విడాకుల కోసం ఎప్పుడూ కోర్టుకి రాలేదు. విడాకులని కోరుకోలేదు. ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. అతని జీవితం లో ఆమె జొరబడలేదు.  ఆమె జీవితం లో అతని జోక్యం లేదు. ఈ పరిస్థితుల్లో అతనికి విడాకులు ఎందుకో అర్థం కావడం లేదు యువరానర్!

కేసు సాక్ష్యాల ప్రకారం అతని తప్పిదం వుంది. ఆమె తప్పిదం లేదు. అందుకని అతను విడాకులు కోరడానికి అవకాశం లేదు. కోరినా మంజూరు చేయడానికి ఎలాంటి యోగ్యతా లేదు. అందుకని అతను విడాకుల కోసం పెట్టుకున్న దరఖాస్తు ని డిస్మిస్ చేయమని కోరుతున్నాను యువరానర్!

కొంచెం సేపు తర్వాత ఆ సీనియర్ న్యాయవాది-   మళ్ళీ  తన వాదనలని కొనసాగించాడు 

25 సంవత్సరాలుగా వీరు వేరుగా వున్నంత మాత్రాన అతను విడాకులు పొందడానికి అవకాశం లేదు. వారి వివాహం కోర్టు వారు చెప్పినట్టు చచ్చిపోయింది నిజమే!

ఆ కారణంగా కోర్టు విడాకులు మంజూరు చేయదని నాకు తెలుసు యువరానర్! ఎందుకంటే అలా చేయడం చట్ట వ్యతిరేకం.

ఒకవేళ కోర్టు అలాంటి భావనకి వచ్చి విడాకులు మంజూరు చేద్దామని భావిస్తే నేను చెప్పే ఈ మాటలు విన్న తరువాత నిర్ణయానికి రావాలని ప్రార్థిస్తున్నాను యువరానర్!

ఈ వయస్సులో అతను విడాకులు తీసుకొని సాధించేది ఏమీలేదు. అమెను సాధించడం తప్ప. అతను మరో అమ్మాయి ని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. బహుశా మనుమడు కూడా వున్నాడనుకుంటాను.

మా క్లయింట్ కోరుకునేది ఒకటే యువరానర్! ఆమె అతనితో జీవిస్తానని అనడం లేదు. దాంపత్య జీవనాన్ని కూడా ఆమె కోరుకోవడం లేదు. ఒక్క విడాకులు మాత్రమే వద్దని కోరుతోంది. 

25 సంవత్సరాలుగా ఒక రకమైన జీవితాన్ని ఆమె అనుభవించింది. వాని భార్య గా ఈ సమాజంలో చలామణి అయ్యింది. అతను ఆమెకు అన్యాయం చేసినా, ఆమె కొడుక్కీ అన్యాయం చేసినా ఆమె అట్లాగే తన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది.

చివరగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను యువరానర్!

మొదటి విషయం-  అతను  అంటే మా క్లయింట్ భర్తకి హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు పొందే అర్హత లేదు. ఇక రెండవ విషయం- నా క్లయింట్ తన శేష జీవితాన్ని డైవోర్స్ గా అంటే విడాకులు పొందిన మహిళగా జీవించదలుచుకోలేదు యువరానర్!

ఏకబిగిన ఆవేశ పడకుండా, కూల్ గా,  అనర్గళంగా తన వాదనలని విన్పించి తన సీట్లో కూర్చున్నాడు ఆ సీనియర్ న్యాయవాది.

వాదనలని వినిపిస్తున్న క్రమంలో, అతను చెప్పిన విషయాలన్నీ సాక్ష్యాలలో చూపించాడు. 

వాడికి అతని రెండవ భార్య ద్వారా పుట్టిన పిల్లల సర్టిఫికెట్లని చూపించాడు. అందులో తండ్రి గా అతని పేరే వుంది.

అతని వాదనలు విన్న తరువాత అనుకోకుండా ఆమె వైపు చూశాను. ఆయన వాదనలు సంతృప్తి కరంగా ఆమెకు అన్పించాయి. ఆమె ముఖంలో సంతోష ఛాయలు కన్పించాయి.

వాదనలు విన్న తరువాత తెల్లవారి తీర్పు అని చెబుతూ కేసు వాయిదా వేశాను.

నమస్కారాలు చేస్తూ అందరూ వెళ్ళిపోయారు. మరోకేసు వాదనలని విని నేనూ బేంచి దిగి వెళ్ళిపోయాను.

****

మర్నాడు ఉదయం స్టెనో బంగ్లాకి వచ్చాడు. ఆ కేసులో తీర్పు ని డిక్టేట్ చేశాను.

లంచ్ సమయానికి చాంబర్లోని నా టేబుల్ మీద తీర్పు ప్రతిని టైప్ చేసి వుంచాడు స్టెనో.

టైపు తప్పులని దిద్ది, లంచ్ తరువాత బెంచ్  కి వెళ్ళాను.

వాళ్ళ కేసుని  క్లర్క్ పిలిచాడు.

అటెండర్ గట్టిగా వాళ్ళని పిలవకముందే వాళ్ళు కోర్టు హాల్లో కి వచ్చి నిల్చున్నారు.

ఎలాంటి తీర్పు వస్తుందోనన్నట్టు వాళ్ళిద్దరూ నిల్చోన్నారు.

తీర్పు ని ప్రకటించాను.

భర్త దాఖలు చేసిన విడాకుల కేసు ని కొట్టివేస్తూ తీర్పు ని చెప్పాను. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

సంతోషం తో ఆమె మొఖం వెలిగిపోయింది. రెండు చేతులతో కోర్టు కు దండం పెట్టింది. సంతోషమో, బాధో తెలియదు గానీ ఆమె కళ్ళల్లో నీళ్ళు ఉప్పొంగాయి.

కేసు లోని యోగ్యత ప్రకారమే ఆమెకు అనుకూలంగా తీర్పు ని ప్రకటించాను.

ఆ సీనియర్ న్యాయవాది చెప్పిన ముగింపు మాటల వల్ల ..కేసు లో ఆమె వైపు యోగ్యత లేకున్నా అదే తీర్పు ని ప్రకటించి వుండేవాడినేమోనని అన్పించింది.

******

అతనిలో భావోద్వేగం లేదు. అయినా ఆ వివాహం చనిపోలేదు. ఆమె వివాహ బంధం లో ఏదో తెలియని.. విడదీయరాని పవిత్ర బంధం వుందని అన్పించింది.

తీర్పు విన్న ఆమె ముఖంలో కూడా అదే భావం కన్పించింది.

******

రచయిత పరిచయం:

మంగారి రాజేందర్ “జింబో”కి  కవిత్వం, కథలు  ఉచ్ఛ్వాస నిశ్వాసలు! ‘అందరికీ న్యాయం..’ అందాలన్నది అయన అభిమతం. జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా  తన సామాజిక బాధ్యత ‘నిరంతరం’ అని విశ్వసించే వ్యక్తి. 

“మా వేములవాడ కథలు”, “జింబో కథలు” తో  కథా సాహిత్యం మీద తనదైన  చెరగని ముద్ర వేసారు. “రూల్ ఆఫ్ లా ” కథల సంపుటి నేర న్యాయవ్యవస్థ గురించి ఆలోచింప చేస్తుంది. “కథలకి ఆవల” అనువాద కథలు, అదేవిధం గా “ఓ చిన్న మాట” చిన్న కథలు – జీవితం పైన ఆశ కలిగిస్తుంది. ఎంతో స్ఫూర్తినిస్తుంది.  

 రాబోయే కథా సంపుటాలు “ఫైలు శ్వాస”  “మావేములవాడ కథలు -2”  ప్రచురణకు సిధ్ధం గా వున్నాయి.

‘హాజిర్ హై..’  అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ స్పృశించని అంశాలను మన ముందు పరిచారు. కవి సాహసం బహు ప్రశంసనీయం. అలాగే –  లోపలివర్షం, రెండక్షరాలు కవిత్వం లో సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే , “చూస్తుండగానే “లో –  ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కళ్ళకి కట్టినట్టు కవిత్వీకరించారు. ఇటీవల వెలువరించిన కవితా సంపుటి “ఒకప్పుడు..” పలువురి ప్రశంసలను అందుకుంది.   

 రచయిత గురించి మరిన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలుసుకోవాలనుకునే వారికోసం.. ఇంటర్వ్యూ లింక్ ని అందచేస్తున్నాం!

           *****     

Please follow and like us:

One thought on “కథా మధురం- జింబో కథ “ఆమె కోరిక””

Leave a Reply

Your email address will not be published.