నువ్వెక్కడ

-లావణ్యసైదీశ్వర్

సమానత్వం మాట అటు ఉంచు
చట్టసభలో కాలుమోపేందుకైనా నీకిక్కడ అనుమతి పత్రం దొరకదు
నువ్వెంత గొంతు చించుకున్న హుక్కులు తగిలించుకున్న కాగితపు ముక్కలనుండి నీ ధిక్కారస్వరం బయటకు వినపించదు..
 
చూపుడువేలు మీది సిరాచుక్కలో నిన్ను కోల్పోయిన నీ నీడ లింగవివక్ష వలలో చిక్కుకుపోలేదా..
సాధికారతకు అర్దం చెరిపిన నిఘంటువులో నిన్ను నిన్నుగా ఖైదు చేయలేదా..
 
రాజకీయం ఎప్పటిలాగానే రంగులు మార్చుకుంటూ పాత ఎజెండాల మీద పల్చగా పరుచుకుంటుంది..
దరిలేని ప్రవహామది
నిస్సహాయంగా కరిగిపోతున్న 
నీ పేరిక్కడ ఏవ్వరి తుది తీర్పులోనూ వినిపించదు..
అసంకల్పితంగా కొన్ని చేతులు మాత్రం చప్పట్లు చరుస్తుంటాయి…
 
ఏ దాపురికమూ లేదు
ముందు నుండి ఆ ముందు నుండి నీ భాగమెపుడూ కురచగానే చింపబడుతుంది..
శోధించడానికి ఇక్కడ ఎవరూ సుముఖత చూపరు..
చుట్టూ ఎప్పుడూ కనిపించని ఆ నాలుగు గోడలే
చదరంగపు ఆటలో నిన్ను చుట్టుముడుతుంటాయి..
కాదు కూడదని ఎంతగా కూల్చేసినా
ప్రతీ గడి ఎత్తుగడలతో కట్టడి చేసి ఖద్దరు చొక్కాల గద్దెల  మీద ముద్దెరలేసుకుంటాయి..
 
కాని ఇప్పుడు ఈ ఆధునిక భారతంలో మొదట నువ్వు కాలు మోపాల్సింది గుడిలో కాదు
సమనాయ్యం తేలేని చట్టసభల్లో..
నీ చుట్టూ గిరిగీసిన పరిపాలనలో…..

*****

Please follow and like us:

One thought on “నువ్వెక్కడ (కవిత)”

  1. చాలా బాగా వ్రాసారు. ఏమి చేస్తే సమానత్వం వస్తుంది. అసలు సమానత్వం ఎవరూ ఇచ్చేది కాదు. మనం చేతనైతే తోటి స్త్రీకి సాయం చేసి, మన చుట్టూ వున్న ప్రపంచాన్ని బాగు చేయాలి.
    ఏది ఎవరూ ఇచ్చేది కాదు, మనకి చేతనైయ్యింది మనం చేసి చూపించాలి. గుర్తింపు అనవసరం.
    ఎందరో మహిళలు సాధించి చూపించారు, వారే మనకి ఆదర్శం. మన
    కలం, మన కాళ్ళు, మన కాలం మనకు ఇచ్చే అవకాశాలతో మనకి చేతనయింది చేస్తే అదే సమానత్వానికి నాంది పలుకుతుంది.
    I liked your article.

Leave a Reply

Your email address will not be published.