కొత్త అడుగులు – 28
ఇది జవాబులు వెదుకుతున్న కాలం
– శిలాలోలిత
సలీమ 2009 నుంచి కవిత్వం రాస్తున్న కవి. ఉద్యమ కారిణి. పరిశోధకురాలు. ‘భారత స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర’ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్.డి. చేస్తోంది. యస్.ఎఫ్.ఐ లో చురుగ్గా పాల్గొనేది. ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ ని ఎంతో ఇష్టంగా చేసింది. ప్రశ్నించడమే, జ్ఞానాన్ని పెంచుతుందనీ, జవాబులు అప్పుడే దొరుకుతాయని బలంగా నమ్మే, నడిచే వ్యక్తి. అందుకే కవిత్వ పుస్తకానికి కూడా ‘జవాబు కావాలి’ అని పేరు పెట్టి సమాజాన్ని నిలదీసింది.
చిన్నప్పటి నుంచీ ‘అమ్మ మస్తాన్‌బీ’ పెంపకంలో ‘ఐద్వా’లో భాగస్వామి కావడం వల్ల సమాజాన్ని చూసే దృష్టి కోణంలో బలాన్ని తెచ్చుకుంది. అమ్మ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఐద్వా కమిటీలో కార్యదర్శివర్గ సభ్యురాలిగా వుంది. అలా సలీమకు తల్లి ఆది గురువుఐంది.
నాన్న అబ్దుల్లా సలీమ 3వ ఏటనే చనిపోవడం వల్ల, ఆయన రూపు రేఖలుగానీ, సాన్నిహిత్యము గానీ లేకుండా పోయాయి.
ఇక ఆమె జీవన సహచరుడు మహేష్. అభ్యుదయ భావాలు గల వ్యక్తి. వీళ్ళిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు. వాళ్ళ ప్రేమ చిగురు సమైర.
మహేష్ సలీమ కలిసి ‘నేను మలాలా’ పేరుతో హిందీ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. బాగా గుర్తింపు, పేరు వచ్చిన అనువాదం అది. వీళ్ళిద్దరూ ఇలా అనువాదాలు ఎన్నో చేయాలని నా కోరిక.
గుంటూరు జిల్లాలో పుట్టిన సలీమ ప్రస్తుతం హైదరాబాద్లో ‘నవతెలంగాణ’లో స్త్రీల పేజీ ‘మానవి’ బాధ్యతలు చూస్తుంది. డేటుడే లైలో జరుగుతున్న అనేక విషయాలు, రాజకీయాలు, చర్చలతో మంచి పేరు తెచ్చుకుంది.
మొదట్నించీ ‘రంగనాయకమ్మ’ రచనలు ఇష్టంగా చదువుకొనేది. కవిత్వంలో ఐతే కె.శివారెడ్డి గారి కవిత్వం బాగా నచ్చుతుందంది.
కవిత్వం నువ్వు తప్పక రాయాలి అని ప్రోత్సహించే మహేష్. ఇది ఆమె పరిచయ నేపథ్యం. ఇక ఆమె కవిత్వం పుస్తకంలోకి అడుగిడితే…
‘మా తుఝా సలామ్’ – అంటూ కవిత్వ జెండాను పట్టుకుంది. ఈ లోకానికి పరిచయం చేసిన తల్లిని గర్వంగా తలుచుకుంటుంది.
‘ఈ దుష్ట సమాజాన్ని ఎదిరించే హిమ్మతిని
నీ చనుబాలతో కలిపి పట్టించావు
కమ్మని గోరు ముద్దలతో పాటే
కాటేసే కర్కశకులను
ఎదుర్కొనే రాస్తాను చూపించావు
మా తుఝ సలామ్
సాంప్రదాయ సంకెళ్ళు తెంచుకొని
నా బంగరు భవితకు బాటలు వేసావు
గోర్కి ‘అమ్మ’ నాకు ఆదర్శమైతే
నువ్వు నాకు ఆధారమయ్యావు
మా తుయ సలామ్” – అంటూ తనకువున్న మాతృభక్తిని ఉద్వేగంతో రాసింది. ఉద్యమంలో వున్న కారణంగా కొన్ని చోట్ల తన కవిత్వం నినాదమై ధ్వనిస్తుంది. అదొక స్టేట్మెంట్, వాస్తవంలా, సూటిగా తాకేట్టుగా వుంటుంది.
ఉత్పత్తిలో సమభాగమైన
మహిళా లోకాన్ని
ఈ అకృత్యాల నుండి
విముక్తి చేద్దాం – అనే నమ్మకం ఆమె ప్రతి కవితా ప్రతిధ్వనే. ఐనా, బలహీనపడ లేదు ఎక్కడా, అవగాహనా రాహిత్యమూ లేదు. ఒక స్పష్టమైన అవగాహనే మనం కవిత్వం నిండా గమనించొచ్చు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గమనించినా, అణచివేతకు గురౌతున్న స్త్రీల సంఖ్యే ఎక్కువ. ముస్లిం స్త్రీలపై హింస ఇంకా ఎక్కువ. ఈ కవయిత్రుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరము వుంది. ‘షాజహానా’ లాంటి మందుగుండంతటి శక్తి సంపన్నులు రావాలి. షంషాద్ బేగం, షహనాజ్, జరీనా బేగం, షహనాజ్ ఫాతిమా, నస్రీన్ ఖాన్, మహెజబీన్ వంటి వారి కవిత్వం దిక్చూచిలా మనముందున్నాయి. వేదన ఎక్కువై, వివక్షకు మరింత గురై ప్రశ్న-జవాబుల తూనికరాళ్ళను ఛేదిస్తున్నారు.
‘నిర్భయ’ గురించి రాసిన కవితలో – ‘ఏ ఆడపిల్లా అత్యాచారానికి గురికాని/ అసమానతలను రూపుమాపే | మరో ప్రపంచం సాధిస్తాం’ – అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఆత్మ విశ్వాసంతో పలుకుతుంది. ‘కష్మకష్ కూడా మంచి కవిత. “
….. నల్లని గుడ్డలో / బలవంతంగా చుట్టేయబడ్డ దేహం / మనసనే ఓ పదార్థం / తనలోనే వుందని మరిచింది. అంటూ సాగిన ఈ కవిత చివరికి ‘ఊహలను కప్పేసిన ఈమేలి ముసుగును పక్కకు నెట్టేసిందని స్వేచ్ఛను చేరుకుందని చెప్పింది.
‘సిద్ధం’ కవితలో కూడా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నానని గుర్తించలేక పోయాను – అమ్మాయిని ఆడపిల్లగా కాదు / ఆడ పులిలా పెంచాలని / ఈ దుష్ట సమాజాన్ని ఎదిరించడం నేర్పాలని / ఎవడైనా జోలికొస్తే / తలదించడం కాదు / వాడి గల్ల పట్టి నిలదీయాలని / అవసరమైతే యుద్ధానికి సిద్ధం కావాలని అంటుంది.
వివాహ వ్యవస్థలోని లొసుగుల్ని ‘ఎన్నో ఎన్నెన్నో’ కవితలో అద్దంలో చూపించినట్లు చూపించింది. ‘ఖబూల్ కియా’, తలాక్ ల నడుమ చెరుకు పిప్పిలా నలుగుతున్న స్త్రీల జీవితాల్ని ఎత్తి చూపింది.
‘ప్రశ్నిస్తున్నాను’ కవితలో – ‘తరాలు మారినా బంధనాలు వీడనన్నాయి / పోరాడకుంటే / సంకెళ్ళు తెగనన్నాయి. సంకెళ్ళకు నిజాల్ని చెప్పి, మారాల్సిన స్థితిని ఇలా చెప్పింది.
‘నన్ను నన్నుగా గుర్తించే
ఓ అందమైన లోకాన్ని నిర్మిస్తాను
ఆమెను ఆమెగా / ఓ మనిషిగా చూడగలిగే
సమాజం కోసం
అవిరామంగా / కొనసాగుతూనే వుంది.
సప్తవ్యసనాలను / గొయ్యి తీసి పాతిపెట్టి ఆమె మనసెరిగి మసిలే
మనిషి కావాలిప్పుడు.
ఇలా ఆలోచింపజేసే కవితా వాక్యాలను ఈ కవిత్వంలో తనలో ఇముడ్చుకొంది. రంగురంగుల అందమైన గాజుల్ని తయారుచేసే అమ్మాయిల అరిచేతుల్ని, జీవితాల్ని చూపించి కన్నీటి చుక్కలా మారింది సలీమ. బతుకమ్మ మీద, సంక్రాంతి మీద మంచి కవితల్ని రాసింది. ‘మా చేతుల్లో / మెరుగులు దిద్దుకున్న / ఆ రంగు రాళ్ళ వలె / మా బతుకులు ఎప్పుడు వెలుగుతాయో..? అని ప్రశ్నిస్తున్న ముఖాలు కనబడ్డాయక్కడ. ఆడపిల్లగా వివక్షకు గురైన బతుకుల్ని విప్పి చూపింది చాలా చోట్ల.
‘జాగ్రత్త’ – లో తనది మాత్రం దేహం కాదా | తనకు మాత్రం హృదయం లేదా / పిల్లి పులవుతుంది | లేడి సింహమౌతుంది /
జాగ్రత్త…. అని హెచ్చరికను జారీ చేస్తుంది. శ్రీనాధుడు రాసిన ‘క్రీడాభిరామం’లో వర్ణించిన ఆటలెన్నెన్నో… అది ఠక్కున గుర్తొచ్చాయి. ‘నిత్యపరిమళం’ చదివితే బాల్యంలో ఆడుకున్న పేర్లను చూడగానే
అప్పటి వరకూ ఆమెదనుకున్న ఇల్లు, పరాయిదైపోవడాన్ని మించిన విషాదమేముంటుంది అంటుందొక చోట.
‘కరోనా’ మీద 4, 5 కవితలు రాసింది. కరోనా కంటే భయంకరమైంది మద్యం వైరస్సు ఆమెను బలి చేస్తోంది అంటుంది.
పారిశుద్ధ్య కార్మికుల మీద ‘చేతులకు ప్రణామం’ అనే మంచి కవిత రాసింది.
‘ఆషా వర్కర్ల సేవల్ని గుర్తు చేస్తూ రాసింది ఇంకొక కవిత ‘నిరంతర శ్రామిక’ ఇల్లాలు మిగిలిపోయిన రీతిని తలుచుకుందొక చోట.
‘ప్రశ్న మొదలయింది’ – ఆలోచనాత్మకమైన కవిత. ఈమె ప్రతిభ ఈ కవితలో బాగా కనబడింది… వయసు పెరిగే కొద్దీ | తన కోసమే రచించబడ్డ | పరిమితులు పెట్టిన పాత్రలో ఇమడలేక అలసిపోయింది | ఏండ్లుగా గడ్డు కట్టిన కన్నీరిపుడు | కరిగి ఏరులై ప్రవహిస్తోంది / మూగబోయిన స్వర పేటిక / కాస్త సవరించి తనకేం కావాలో / ప్రశ్నించేందుకు సిద్ధమైంది | ప్రశ్న మొదలవగానే , తన అసలైన పాత్రను / తనే రచించుకొంటుంది / తరతరాలుగా / అతని హుకుంలకు భయపడి / జీ హుజూర్ అన్న ఆమె / మనిషిగా బతకడం / ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది.
తన కవిత్వోద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా చెప్తూనే వస్తోంది. సమాజం హాయిగా వుండాలంటే, సమానత్వం ఇరువురి భావనల్లో ఉన్నప్పుడే జీవితాలు బాగుంటాయన్న నిజాల్ని ఎలా కవిత్వీకరించిందో చూడండి.
ఇప్పటికైనా మనసుతో
ఆమెనూ మనిషిగా గుర్తించండి
ఆమె ఉంటేనే మీ మనుగడ
తెలుసుకోండి!
ఆమె ఒంటరి పోరాటానికి
చేయూత నివ్వండి
కాపాడుతూ
మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
చివరిగా ఇలా అంటుంది కదా! ఏనాటికైనా నిన్నూ / ఓ మనిషిగా మార్చేందుకు / యుద్ధం చేస్తున్నాం .
కవిత్వ ప్రారంభంలో ‘నేను’తో ప్రారంభమైనా, చివరికి వచ్చే సరికి మనంగా మారడం స్పష్టంగా కనిపించే ప్రయాణం. సలీమ కవిత్వంలో కవిత ప్రారంభంలో విషయాన్ని మొదలుపెట్టి చివరికొచ్చేసరికి తాను చెప్పినది ఎంత వాస్తవమో తెలుసుకోండి అన్నట్లుగా ముగుస్తుంది. ఈ శైలిని ఆమె ప్రత్యేకతగా గుర్తించొచ్చు. తానెన్నుకున్న జీవన మార్గంలో కవిత్వపు పాదాలతో మనముందు కొచ్చిన ఆమె నిజాయితీని, నిర్భీతిని, నిష్కల్మశత్వాన్ని, పోరాట పఠిమను ఎంతో గౌరవిస్తున్నాను. ఇలాంటి కవిత్వం రాసే వాళ్ళు మనకు ఇప్పుడు ఎంతో అవసరం. మనుషులతత్వాన్ని, మానవత్వాన్ని మేల్కొల్పాల్సిన సమయమిది. మానసిక పరివర్తనకు సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా కవిత్వం ఆ విషయంలో ముందుంటుంది.
సలీమా! నువ్విలాగే కవిత్వాలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెన్నో అడ్డంకుల్ని దాటుకుంటూ మహేష్ నువ్వు కవితా మార్గంలో పయనించాలని ఆశిస్తూ…
*****
1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది.
తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే రిటైరయ్యారు.
కవితా సంపుటులు :
పంజరాన్నీ నేనే, పక్షినీ నేనే(1999), ఎంతెంత దూరం(2005), గాజునది(2013), The Inner Courtyard (Prof. Suneetha Rani Translation ; Published Web version in Amazon Books Series)2017