అనిల్ డ్యానీ-ఎ స్పెల్లింగ్ మిస్టేక్
(A complete reading from me)
– గీతా వెల్లంకి
విజయవాడలో అనిల్ నాకు ఈ పుస్తకం ఇచ్చినపుడు నా పుత్రికా రత్నం అందుకుంది కదా అని ఒక్క కవితైనా చదవమని అడిగాను… మొదటి కవితే దానికి యమ బాగా నచ్చింది! నేనూ ఇలా రాస్తా ఎప్పుడో అని ముఖం వెలిగించుకుంది కాసేపు.
*ఆ కవిత… వాడూ-నేనూ!
అది పట్టుమని పది లైన్ల కవిత.. కానీ పిల్లలకీ పిల్లల్లాంటి మనసున్న పెద్దవాళ్ళకీ నచ్చుతుంది. రాసింది కూడా అంత చక్కటి మనసున్న అనిల్ కదా మరి!
*ఊరేగింపు రెండో కవిత.. ఒక మరణానంతర సాగనంపు గురించి! ఇది చదివిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దృశ్యం కళ్ళ వెనుక కదలాడుతుంది.
నాకు బాగా నచ్చిన ఇంకో కవిత *నేను-బొమ్మ…
పిల్లల మనసు ఎలా ఉంటుందో వారి బొమ్మలపై ఎంత ప్రేమ ఉంటుందో, ఏ ఫీలింగ్ వచ్చినా బొమ్మలతోనే ఎలా పంచుకుంటారో చాలా బాగా చెప్పిన కవిత ఇది! ఇలాంటి అనుభవాలు పిల్లలని ప్రేమించే, పిల్లలతో ఆడుకునే ప్రతి నాన్నకీ, అమ్మకీ తప్పనిసరిగా ఉండి తీరుతాయి అనడంలో సందేహం లేదు.
*శిలాస్వప్నం గురించి…
చివుక్కుమనే మాటల చివర వగరు మనిషి వాసన వేయటం, మట్టి పలక మీద ఊరి అక్షరాలను దిద్దటం.. చిగురు వేయవలసిన అదునులో గుల్లబారిపోయి పునాదులు కదిలిపోయిన ప్రాచీనతను కలవరించడం.. ఊపిరి సలపనితనం…. అనిల్ రాసిన ప్రతి ఫీల్ చదువరి తప్పనిసరిగా ఫీల్ అవుతాడంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.
*వంగపండు రంగుచీర…
ఫుల్ రొమాంటిక్ ఎండింగ్ లైను… దీని గురించి ఎక్కువ రాయను! చదివి ఫీల్ అవాల్సిన కవిత… అంతే!
*వాతావరణ హెచ్చరిక…
రెండేళ్ళ కిందట ఈ కవితని గుడివాడలో ఉన్నప్పుడు చదివి ఏదో వచ్చీరాకుండా ఒక చిన్నపాటి విశ్లేషణ రాసి పడేశాకా.. అనిల్ నాతో మొదటిసారి మాట్లాడాడు.. మత్స్యకారుల కష్టాల మీద రాసినది.. వాతావరణ హెచ్చరిక చేసి సముద్రం మీదకి పోవద్దనటం వారికి ఊపిరి తీసుకోవద్దనే వినిపిస్తుందేమో నిజంగా!
*వంతెన మీద…
తామరాకు నీటిబొట్ల పై నడవటం, అర చేతుల్లో పాదాల్ని మోసిన మనుషులు, కంటి చూపుకి దొరకని కాలం చెరువులో చందమామలా దాక్కోవడం, ఆవలి తీరానికి పోవడానికి నడి మధ్య మజిలీలో ఉండి కూడా ఎలాంటి హృదయాల్ని హత్తుకోవాలో ఆలోచిస్తూ నాకు నేను నన్నులా రాసుకున్న నిఘంటువును అంటాడు ఈ కవితలో!
*డ్రాయింగ్ రూం…
ఇందులో స్విచ్ బోర్డుకి ఒంటరిగా వేలాడుతున్న ఛార్జర్ లాంటి జీవితాలలో అవసరం ఉంటే తప్ప పలకరింపులు కూడా ఉండవని తేల్చి చెప్పాడు.
పైగా ఫొటోల్లోనే నవ్వుతూ ఉంటామనీ, ఎవరి గుండెల్లో వాళ్ళు సొంత గదులు కట్టుకున్నాక అందరూ ఒకే గదిలో ఎలా ముచ్చటించుకుంటారనీ, అందుకే ఏ ఇంట్లో చూసినా ఎప్పుడో నవ్విన ఫొటోలే ఉంటాయనీ.. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకునేలా చేస్తాడు.
*ఏ రూపాయీ నీది కాదు…
దేహాన్ని పని గుంజకి కట్టేయాలి, తీసుకెళ్ళిన ప్రతి పనిముట్టూ కాలుతూనే ఉంటుంది కడుపుతో సహా అంటాడు. నాకే ఆకలేసినట్లనిపిస్తోందే ఇది చదివితే! ఇందులో చాలా లైన్లు నచ్చాయి… రేపటిని కలగంటూ దండెం మీద ఆరుతున్న చొక్కా, ఇల్లు ఆకలిగా ఎదురుచూడటం, చివరికి ఏ రూపాయీ నీది కాదనేసి.. వేరే కవితలోకి తీసికెళతాడు.
*నొప్పి…
కట్టుబట్టలతో ఇంట్లోవాళ్ళు కప్పబడిన దేహంతో అంబులెన్సు బయలుదేరుతుంది అని చదవగానే గుండె కలుక్కుమంటుంది కదా! పరామర్శకి వచ్చినవాళ్ళు మాత్రం ఇంకోచోటకి వెళ్ళకపోయారా అన్నప్పుడు గుండె నుంచి నొప్పి మెదడుకి పాకుతుంది….
*బహిరంగ రహస్యం…
యవ్వనం పాదరసం-ఏదో తెలియని దాన్ని పొందాలనే కాంక్ష (యవ్వనం దాటేసిన పొగమంచు వయసులోనూ.. అంతా తెలిసిన తర్వాత కూడా కొత్త కొత్త శరీరాలని వెతుక్కునే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారని తెలియదూ?)
సహజీవనం అంటే కోరిక తీరనితనం కాదు.. నిజాయితీ అంటే నీకు నువ్వు నీ పరిశుద్ధతని అప్పచెప్పు కోవడమే తప్ప గుడ్డ కాల్చి ఇంకొకరి ముఖం మీద వేయడం కాదు (ఈ కవిత నాకు బాగా గుర్తుంది.. జగద్ధాత్రి గారు మరణించినపుడు రాసినదిది).
*అయినా…….
తనింకా రాలేదనీ.. ఎంతకాలమో ఇలా ఆకాశాన్ని మోస్తూ తిరగడం అనీ విరహపు మాటలు రాశాడు. చేతులనిండా లేఖ లోని అక్షరాలు తేనెలా కారుతున్న ఊహని ఒక్క వాట్సప్ మెసేజ్ తరిమేస్తుంది, కాలం కొత్త చొక్కా తొడుక్కుంది, తనిప్పుడు ఆన్ లైన్లోకి వస్తుందిట.. నేనైన ప్రేమలేఖ నన్ను దీనంగా చూస్తోందని ఫీలై మనల్ని కూడా ఉత్తరాలు రాసుకునే కాలాన్ని గుర్తు చేసుకుని నిట్టూర్చమంటాడు.
*ఆకుపచ్చని కన్నీరు….
దీనికి రాధేయ పురస్కారం వచ్చింది 2019 లో. 33 వేల ఎకరాల అమరావతి రైతుల వెత!
*ద్వీపం….
నీకు కావలసింది వాడికి తెలియదు కదా, ముసుగు తీసెయ్ ఒక్కసారైనా…
ఏది మెరక, ఏది పల్లం అంతా ఒకే ప్రవాహం…ఒడ్డు మీద కాలు మోపాక రెండు దారుల్లో రెండు కళ్ళు, రెండు జతల కాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతాయి!
ఈసారి ముసుగు లేకుండా మళ్ళీ రమ్మని పిలుస్తుంది నది తపనపడుతూ!
*స్పెల్లింగ్ మిస్టేక్ ….
దేహాన్ని ఒదిలిపోతున్నపుడు ఆత్మని ఏ ట్రాఫిక్ సిగ్నల్ ఆపలేదు!
పిల్లలే చనిపోతున్నపుడు కుక్క పిల్లలకి సానుభూతి నేరం!
కార్పొరేట్ బడులలో సమాధి అయిపోతున్న బాల్యానికి నిరసనగా రాసిన కవిత కాబోలు ఇది!
*కొండకింద ఊరు…..
రాతెండి గిన్నెలో తిన్న గొడ్డుకారపు రాగిసంకటి సత్తువ ఆరురెట్ల బరువైన గడ్డిమోపుని ఎత్తుకోనిచ్చింది..
ఊరు ఎండిపోయిన చెట్టైందిరా… ఊరు విలాంబరమైందిరా అని విలపించిన కవిత… (ప్రకాశం జిల్లా-వెలిగొండ ప్రాజెక్ట్ కోసం ఖాళీ అవుతున్న గ్రామానికి)
*ఒకానొక ఎండవేళ…..
ఇక్కడ ఇలా నీ ఇంటి నిట్టాడి కింద వెన్నుపూసని జార్చేసుకుని మొరుగుతున్న బాధ్యతల చుట్టూరా.. ఎవరు లాక్కొస్తే ఇక్కడ పడ్డావని … తనని తానే ప్రశ్నించుకుంటాడు.
తెల్లారే పుట్టడానికి గడ్డిపువ్వు అర్హత కూడా లేని వాడివి, నీకు నువ్వు దొరకవు చూసుకో, ఎప్పుడో రాత్రి రాల్చేసిన పక్కలో రాలిపోయి ఉంటావు. అసామాన్య ప్రపంచ కళేబరంలో ఏదో ఒక అంగాన్ని అంటిపెట్టుకుని ఉండే సూక్ష్మక్రిమివి .. అంటాడు అనిల్ ! ఇప్పుడు ఈ కరోనా రోజుల్లో నిజంగా మనిషికన్నా వైరస్ గొప్పదని తెలుస్తూనే ఉంది కదా! ఈ కవితలో లాస్ట్ లైన్ అల్టిమేట్!
*అడ్డం 18 నిలువు 21….
ఇది ప్రణయ్ హత్య తర్వాత రాసినది! చదువుతుంటే అదంతా ఇప్పుడే జరిగినట్లు అనిపించింది.
*స్వేచ్ఛా గీతిక…
ఇది వరవరరావుకీ, సాయిబాబా కీ సంఘీభావంగా రాసిన కవిత.
*మనకేం తెలుసు….
ఇరవై మూడు అడుగుల చదును నేల, అక్కడి మట్టికి చక్కిలిగింతలు పెడుతూ నీరు పారిన స్పర్శ తెలుసు, ఇప్పుడదొక మైదానం బొమ్మ… ఆట ముగిశాక పండటం ఒక్కటే తెలిసిన నేల పాతిన కర్రలకి వేర్లని మొలిపించిందిట! అదీ నేల రహస్యం… (అమరావతి)
*ఎండపడగ…..
మట్టితో చేయబడ్డ మనిషికి ఆదికాండంలో అంటుకున్న శాపం చెమట చుక్కై నేల రాలుతోంది, ఆకు చాటున గాలి దాక్కుంది అని అనిల్ రాస్తే మనం ఊహించుకుంటాం వెంటనే! కానీ అందదు.
తరతరాలుగా సామాజిక ఉష్ణాన్ని మోస్తున్న దేహాల వేడి తీరాలంటే ఎక్కడో ఒకచోట మరలా భూమిని మండించే వేడి పుట్టాల్సిందే (ఇది కొంచెం బైబిల్ రిలేటెడ్ పోయెం అని రాసుకున్నాడు)
*మనాది…
ఇప్పుడు ఉక్కునగరం డాల్ఫిన్ ముక్కున చేపపిల్ల అంటూ విశాఖ నగరం గురించి రాస్తూ..ఒక్క లైట్ హౌసైనా పాతండి ఈ సముద్రం ఆరిపోయేలోపు ఒక్క మనిషైనా కనబడతాడు అంటూ ముగిస్తాడు.
*తప్పిపోదాం రండి….
జాతరా, పూనకం గురించి వర్ణించి, అక్కడికి పోయి పిల్లలూ తప్పిపోదాం రండి అంటూ పిలిస్తే… తప్పిపోయిన పెద్దవాళ్ళు తిరిగి ఊళ్ళకి చేరుతారనే ఆశ ఈ కవితలో.
*మరోమాట….
నూనె నిండిన దీపంలా ఉన్నా, ఒక్కసారి వత్తి వెలిగించి దీపపు వాసనైపోవూ.. ఇది చదవగానే దీపం వాసన వేస్తుంది మనకి. ఈ కవి డిఫరెంట్ గా ఆలోచన చేసి మనల్ని అందులోకి లాక్కెళతాడు!
*జీఎస్టీ…
మోహం గుడ్డిది, ఎవరి దేహమైనా దేవాలయమేనని ఎప్పటికీ గుర్తు రాదు, అంతర్నేత్రం మూసుకుపోయి… గురి మొత్తం ఆమె రంగురంగుల దేహం పైనే! తెర మీద తోలు బొమ్మలాట పేరు జీఎస్టీ అంటాడు. God, Sex and Truth is GST!
*ఆమె పేరు నది….
నది పారుతుంది అంటే విలపిస్తుందనీ, కళ్ళు నగ్నంగా పారే దేహాలనే చూస్తాయి, నది నిశ్శబ్దంగా పగిలిపోతూనే ఉంది, నదిలాగే ఆమె ఇప్పుడొక వ్యాపార వస్తువు అనీ ఇందులో రాసుకున్నపుడు స్త్రీ పట్ల సానుభూతి కనిపిస్తుంది.
*మెరుపులు….
అనవసర పటాటోపాలు పోయి ఏర్పాటు చేయబడ్డ ఫంక్షన్లలో మనం ఎలా ఉంటామో తెలుసా అచ్చం ఇలాగే!
అక్కడ వినపడే సంగీతం మనకోసం కాదు.. ఎవరైనా ఏమైనా అనుకుంటారనే అన్నీ అలా అమర్చబడతాయి!
చివరికి మన ఇంటి వంతు వచ్చేసరికి మనమూ అంతే!
*బోధి….
యుద్ధం శరణం గచ్ఛామి అని పలవరిస్తున్నఅనేక రంగుల మహాశూన్యానికి తెల్లరంగు ఎలా పూయడం ?
*నీ కీర్తి నీదే….
కీర్తి కాంక్ష బలీయమైనది అంటూ మనిషి కీర్తి కాంక్ష లేనినాడు నిజంగా కీర్తిమంతుడౌతాడని … అప్పుడు నువ్వు మనిషి వాసనేస్తావు.
అలా తల పక్కకి తిప్పి చూడు నీ పక్కనే ఎవడో మనిషున్నట్టు లేదూ .. అని ప్రశ్న సంధిస్తాడు కవి.
*మనుషుల కథ….
అసలు మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండాలని అనిల్ డానీ కోరుకుంటాడో అలా అస్సలు ఉండరేమో, మరీ ఎక్కువగా ఆశించకూడదు అని అనిపిస్తుంది.
*ఊరిలోపల….
ఈ కవితలో సోంబువ్వ ఉడికేలాంటి పండుగ వాతావరణంతో మొదలై.. తెల్లావు భుజాల మీద ఎక్కి దిగడం లేదంటూ… అది సారాయి భూతమైనా, రాజకీయ భూతమైనా సరే! కవిత..ఇప్పుడు రోజూ తినే సోంబువ్వ కన్నీళ్ళకి ఉడకటం లేదనే బాధతో ముగుస్తుంది.
*డబ్బు పూచే కాలం….
పండగలొస్తే చాలు అడ్వర్టయిజ్ మెంట్లు జనాల్ని పీల్చి పిప్పి చేసి డబ్బులన్నీ ఖర్చు చేయించి ఒదులుతాయనే సెటైరికల్ కవిత..
*విగ్రహవాక్యం….
ఐదువేళ్ళు కలవని ఐక్యత గురించీ, రాజకీయం నిదానంగా దేశంలోకి ఇంకిపోవడం గురించీ.. రకరకాల రాజకీయ పరిస్థితుల గురించీ రాసిన కవిత.
*దారి చూడు….
సాయంకాలానికి కలిసి వచ్చే గేదెలు, ఆవులు వైశాల్యాల హద్దులు చెరిపేస్తుంటే మనుషుల మధ్యన ఎప్పుడు చెరిగిపోతాయా అని చూస్తున్నా… అని రాసుకుంటాడు.
*సవరణ….
పేరు రాయబడిన గింజలన్నీ రాబందులకే రాసి ఉంటాయిట! ఒక్క మీట నొక్కండి అంటూ ఓటింగ్ సిస్టమ్ ని దుమ్ము దులిపేసినట్లు కనపడుతుంది.
*అబ్బాయే కావాలి…..
అడుసు తొక్కగానే బొ్మ్మ తయారవదు.. ఈ మాటల్లో ఎంత అర్థం ఉందో గమనించారా? ఇది ఆడ శిశువుల రక్షణ గురించిన కవిత
పగిలిన బొమ్మలన్నీ పోయాక, ఒకే ఒక్కటైనా నిలబడి ఆమె తనాన్ని ఈ ప్రపంచానికి చెబుతుంది..
*రెల్లుపూల సాయంత్రం….
హృదయం నీరు మిగల్చని ఎండిన పాత్ర…
నిద్రపట్టని పరాధీనత.. ముసలి రేడియో పాత పాటలెన్నింటినో త్యాగం చేయడం, ఆకాశవాణి అలసిపోవడం ఇందులో ఉంటాయి.
*అక్వేరియం….
చూడ ముచ్చటైన తోకంత జీవితాలు, ఎటు అదిలింంచినా అక్కడక్కడే.. మనం కూడా అంతే! చేపల్ని చూసి రాసుకున్నా.. మనుషుల జీవితాలు కూడా ఏమంత గొప్పగా లేవు కదా!
*అంతా పాతదే…
రక్తం.. హింస.. అంతా పాతదే అనిపించినపుడు
కళ్ళు మూసుకున్నా కనపడుతూనే ఉంటుంది….
*ఆకుపచ్చటి నడుము మీద….
ఇదొక పచ్చటి కవిత.. చదువుకోవాల్సిందే!
*ఎప్పటిలానే..
అరచేయంత పాత్ర, నాచుపట్టిన నీటి తెరల సాంగత్యంలో చుట్టుకునే ఆక్టోపస్‌లు, దిగులు ధూపమై, ఒలికిపోయిన చమురంతా నా గుండెలోని గానం.. ఈ కవితలోని ఫీల్ అంతా ఆక్టోపస్ లా మనల్ని చుట్టుకుంటుంది…
*పన్నెండొకట్ల పన్నెండు…..
ప్రతి జీతం వచ్చే వాడికీ, ప్రతి మధ్యతరగతి వాడికీ మాత్రమే అర్ధమయ్యే గుండె ఘోష ఇది… శేషం శూన్యం వస్తే లెఖ్ఖ సరిపోతుంది…. అదంతే!
*సాల్విన్ కోల్డ్….
జీవితం డబ్బులతో ముడిపడి ఉందని…. చలికాలంలోనైనా కలిసి వేడన్నం తిందామనే ప్రతిపాదనని ఓవర్ టైమ్ బలి తీసుకుంటుంది…..
*సందర్భం….
ఇది పిల్లల మెడల్లో నో తెలుగు బోర్డులు వెలవడం, భాష కనుమరుగయ్యే బాధ రాయించిన కవిత.
*చివర్లో మూడు తెలుగు కవితలకి ఇంగ్లీష్ అనువాదాలు ఉన్నాయి.
రెండు కవితలు యామినీ కృష్ణ, ఒక కవితని ఎలనాగ గారు అనువదించారు.
అన్నీ బాగున్నాయి.
*అనిల్ కి హ్యూమన్ వేల్యూస్ మీద ఆపేక్ష ఎక్కువ.
చాలా సున్నితమైన మనసున్నవాడు.. అదంతా ఈ కవిత్వంలో ప్రతిఫలిస్తుంది.
****
ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ ని! కవిత్వం ప్రవృత్తి!