‘ప్రజ్వలిత’ అవార్డ్ ‘సి.మృణాళిని’ గార్కి వచ్చిన సందర్భంలో….
-డా. శిలాలోలిత
మృణాళిని కేవలం ఒక వ్యక్తి కాదు. ఒక సమూహం. ఒక శక్తి. బహుముఖ ప్రజ్ఞ ఆమె సొతుత. ఇప్పటి వరకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘బెస్ట్ టీచర్ అవార్డ్’, ‘గృహలక్ష్మి స్వర్ణకంకణ అవార్డ్ (2007) తెలుగు యూనివర్సిటీ వాళ్ళిచ్చే అబ్బూరి ఛాయాదేవి అవార్డ్, వాసిరెడ్డి సీతాదేవి అవార్డ్, తురగా జానకీరాణి అవార్డ్, యద్దనపూడి సులోచనారాణి అవార్డ్, బెస్ట్ ట్రాన్స్ లేటర్ అవార్డ్ (మాల్గుడి డేస్కి), విమర్శకు ఆవంత్స సోమసుందర్ అవార్డులు వచ్చాయి. 1940 నుంచి చందమామలోని బేతాళ కథలను 25 కథల వరకూ తీసుకొని రేడియోకి నాటకాలు రాసి మృణాళిని ప్రొడ్యూస్ చేసింది ‘బెస్ట్ ఇండోనేషియన్ షో’ అవార్డులు మూడు వచ్చాయి. నిజంగా ప్రతిభ ఎక్కడ ఉంటే గౌరవం దానికదే వచ్చి చేరుతుందనిపిస్తుంది. మృణాళిని లాంటి అపురూపమైన మిత్రురాలు ఉన్నందుకు చాలా సంతోషం అన్పిస్తుటుంది.
రీసెర్చ్ ఆర్టికల్స్తో పాటు అద్భుతమైన వ్యక్తిగా కూడా ఆమె పేరుకు అదనంగా వచ్చి చేరింది. అమెరికా (4 సార్లు), లండన్, మారిషస్ (6 సార్లు), మలేషియా, నార్వే, చైనాలలో కూడా అద్భుతమైన ప్రసంగాలు వినిపించింది. 2006 నుంచి 2009 వరకు ‘వరల్డ్ స్పేస్ రేడియో’ కి డైరెక్టర్ గా పనిచేసింది. ఆమె చేసిన అన్ని ఉద్యోగాల్లోకి ఇదెంతో ఆత్మతృప్తి ఇచ్చిందనేది. తెలుగు విభాగానికి మూడేళ్లుపాటు కృషి చేసింది.
2000 లకి పైగా రేడియో ప్రోగ్రమ్స్ ఇచ్చింది. హిందీ పాత పాటలంటే ప్రాణం. పాటలురాసే ‘స్వరార్చనం’ పేరిట ‘సిడీ’ కూడా తీసుకొచ్చింది. సురేఖామూర్తి పాడేరు. ఆమె వాగ్ధాటికీ, స్పాంటేనిటీకి, వ్యంగ్యోక్తికీ చమత్కారాల మేళవింపుతో ప్రవాహంలా కొనసాగే ఆమె ఉపన్యాసాలు వినడానికి చాలామంది ఇష్టపడతారు.
అంత ఆకర్షణ శక్తి, విద్వత్తు, మాటల ప్రవాహశిల గుణం ఉన్నాయి. సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్ కూడా తెలుగు యూనివర్సిటీలో కంపారిటివ్ స్టడీస్ లో డైరెక్టర్ గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యింది.
రాయలసీమలోని రత్నమామె. అందుకే అన్ని జిల్లాల పర్యటనలా కాకినాడ, విశాఖ, తిరుపతి, కావలి, హైదరాబాద్ లలో చదువుల యాత్ర కొనసాగింది. ‘అసమర్ధుని జీవనయాత్ర’, ‘అల్పజీవి’, ‘అతడు–ఆమె’, ‘ఊబిలో దున్న’ పై ఎం.ఫిల్ చేసింది. అలాగే ‘సాంఘిక నవల కథన శిల్పంపై పిహెచ్.డి. చేసింది. పుస్తకరూపంలోనూ వచ్చింది. చుట్టూ ఉన్న మిత్రులందరూ కవులే ఎక్కువగా ఉండటంతో, నేను కూడా వారిలాగా కవిత్వమే రాయాలని అనుకునే వారిని కాదేమో, కథ, నాటకం, సంగీతాల వైపు దృష్టి సారించింది. డిగ్రీ చదివే రోజుల్లో కాలేజ్ మ్యాగజైన్ లో కథ రాయడంతో రచనా వ్యాసంగం మొదలైంది. ఆ తర్వాత రేడియో కోసం ‘కిటికీ’ అనే పేరుతో గల్పిక రేడియా లో సిరీస్ గా వచ్చింది. తెలుగు భాష మీద ఎక్కువగా రాసింది. ‘నిర్ణయం’ అనే మొదటి కదా 1979లో ‘‘‘వనిత’ లో ప్రచురింపబడింది. 1985 నుంచి ‘ఉదయం’ దినపత్రికలో ఉద్యోగ జీవితం మొదలైంది. అప్పుడెక్కువగా అనువాద కథలు రాసింది. 10 కథలకు పైగానే రాసింది. పుస్తకం వెయొచ్చుకదా అని ప్రశ్నించిన వాళ్ళకు ఆమె చిరునవ్వుతో వెతుకుతున్న దొరకట్లేదు అనేస్తుంది. గ్రీకు భారతీయ పురాణాల్లో స్త్రీల గురించి ‘నిశ్శబ్ద విప్లవాలు’, ‘ప్రతిధ్వని’ అనే వ్యాససంకలనం, ‘ఇతిహాసం’ – ఇది అద్భుతమైన రచన. మొత్తం మీద 20కి పైగానే ఆమె రచనలుంటాయి.
2000 సంవత్సరంలో వచ్చిన ‘కోమలి గాంధారం’ ఆమె హాస్యోక్తికి నిదర్శనం. నేను బుక్ షాప్ లో 10 పుస్తకాలు కొని, ఫ్రెండ్స్ కి గిఫ్టుగా ఇచ్చాను. ‘శ్రీదేవి’ అనే ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా దాచుకుందట. మొత్తం చదివేస్తే అయిపోతుందని వారానికొకటి చొప్పున చదువుకొని నవ్వుల్ని వాయిదా పద్ధతుల్లో అనుభవించేదట. అప్పుడ మృణాళిని అన్నమాటలు గుర్తొచ్చాయి. ‘మాల్గుడీడేస్’ను తెలుగులో చేస్తే, ‘కాళీపట్నం రామారావు’గారు బాగా మెచ్చుకున్నారట. ‘ఆ ఇంగ్లీషు నాకు సరిపడదు కానీ, ఇది చాలా బాగుంది. చిన్న పిల్లాడికి లడ్డూ ఇస్తే దాచుకుని దాచుకుని తిన్నట్లు కొద్దికొద్దిగా చదువుతున్నాను’ అన్నారంది. నాకొచ్చిన అవార్డుల కంటే పెద్దది ఇది అని మురిసిపోయింది కూడా.
2008లో వచ్చిన ‘తాంబూలం’ కూడా మంచి సోషల్ సెటైర్. మృణాళిని ఇంకో అనుభవాన్ని కూడా నాతో పంచుకుంది. ఒకసారి ‘ఓలా క్యాబ్’ లో వెళ్తుంటే డ్రైవర్ మీరు మృణాళిని గారా అని అడిగాడట. టీవీ ప్రోగ్రామ్స్ లో చూసి ఉంటాడనుకుందట. ‘తాంబూలం’ రైటర్ మృణాళిని గారు మీరేనాండి అన్న అతని మాటలు ప్రశ్న ఆశ్చర్యనాందాలకు గురు చేసిందన్నది. మనకు తెలియని ఒక అపరిచిత వ్యక్తి అలా హఠాత్తుగా అభిమానాన్ని వ్యక్తీకరించడం ఆనందాన్నిచ్చిందన్నది.
మృణాలిని చిరునవ్వు నాకిష్టం ఆమె విజయాలన్నీ ఆ చిరునవ్వులోనే దాగున్నాయనిపిస్తుంది. ఎంత అందమైన, ఆత్మీయమైన నవ్వో అది. అందర్నీ అదే ఆత్మీయమైన చిరునవ్వుతో పలకరిస్తుంది. అదే చిరునవ్వుతో నచ్చని వాళ్ళని వాళ్ళ హద్దుల్లోనే ఉంచగలిగే ప్రతిభ కూడా ఆ చిరునవ్వు లోనే వుంది. నిర్మలమైన, స్వచ్ఛతనిండిన, చుట్టూ వాతావరణాన్ని సైతం, ఆహ్లాదపరచగల చిరునవ్వది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసపు చిరునవ్వది. ఏనాడు ఆమె బలహీన పడినట్లు, ఆగినట్లు కన్పించదు. నిత్య చలన శీలి ఆమె.
‘ధృతి’ మృణాళిని మనువరాలు. నిజంగానే బంగారుకొండ. ఆమె దగ్గర హాయిగా, సంతోషంగా, స్వేచ్ఛగ, ఇష్టంగా ఎట్లా బతకొచ్చో నేర్చుకోవచ్చు. ప్రతిక్షణం లోనూ జీవనానందాన్ని పొందాలనుకునీ ఆమె స్వభావం పట్ల కూడా ఆరాధన నాకు. ఒక సారెప్పుడో అంది. విజయాల కోసం మనం పరిగెత్తడం కాదు. మన కృషే విజయాన్ని తెచ్చిపెడుతుందని. ఆమె రాసిన నాటకాలకు సైతం ‘నేషనల్ అవార్డ్’ వచ్చింది.
మృణాళిని బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు. ఆమె గురించి ఎంత మురిపెంగా చెబ్తుండేదో, ఒకసారి మృణాళిని పరిచయమైతే చాలు ఆమె స్నేహసౌరభం అందర్నీ ఆకర్షిస్తుంది. గల గలా అందర్తో మాట్లాడే ఆ మాటల వెనుకున్న ఆత్మీయతా స్పర్శ హాయిగా ఉంటుంది. జర్నలిజానికి రాతలు నేర్పింది.
‘ప్రసేన్ బెల్లంకొండ’ – మృణాళినికి సన్మానపత్రం రాశారు. ఎంత అద్భుతంగా ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. ‘ప్రజ్వలిత’ అవార్డ్ సందర్భంలో రాసిన పత్రమది. ‘మృణాళిని ఓ సర్వనామము’ అని. ఆమెకు కీర్తిప్రతిష్టలు పర్యాయపదాలయ్యాయి. అది పేరు మాత్రమే కాదు సర్వనామము. అందుకే ఈ పురస్కారం.
మృణాళిని
ఆ పేరంటే తామరతూడు అని నిఘంటువు చెప్పే
అర్థమంతా అబద్ధం
అసలు నిజమేమిటంటే
నెర్రెలిచ్చిన పూల వనాలకు వరాలిచ్చే నవ్వు,
ప్రసరించిన మేర వెన్నెలై ప్రవహించే చూపు
తిరుగాడిన చోట కుప్పలు తెప్పలుగా
పరుచుకునే ఆత్మీయ పరిమళం
మనసునే మాటలు చేసి తేనె పాటల తీపిరాగాల పలకరింత
కట్టెదుట కదలాడే నిలువెత్తు విద్యుల్లత, విద్వల్లత
మానవరూప దేవత
ఇది నిజం.. ఇదే నిజం
ఇవే ఆ పేరుకు అసలు అర్థాలు
ఆ పేరులో అక్షరాలన్నీ గొట్టులే కావచ్చు
కానీ, అర్థం మాత్రం సున్నితం, నవనీతం
అక్షరాలన్నీ మెలికలే కావొచ్చు అర్థం మాత్రం
గురితప్పని బాణం… ఎప్పటికీ గెలిచే రణం.
ఇలా ప్రసేద్ మృణాళిని పట్లగల అపురూపమైన గౌరవాన్ని వ్యక్తీకరించారు.
ఇక మహమ్మద్ ఖదీర్ బాబు కూడా మృణాలని గారి పట్ల గల అపూర్వమైన గౌరవాన్ని ఇలా చెప్పారు.
తెలుగులో వ్యంగ్య రచనలు చేయగలిగిన అతి కొద్దిమంది స్త్రీలలో ఒకరు మృణాళిని. అజాతశత్రువామె. తనకు తానుగా నిలబెట్టుకున్న వ్యక్తి. తానే ఒక కొంగ అయినప్పటికీ చావగలిగిన ప్రతి గడ్డిపోచ ఎదుట వినమృరాలు కాగలిగే ఔన్నత్యం ఉన్నవారు. అన్నింటినీ మించి హాయిగా నవ్వగలిగే శుభ్రమైన అంతరంగంవున్న వ్యక్తి. ‘కొంతమంది బహుముఖప్రజ్ఞాశాలి అంటారు మృణాళిని గారిని శతముఖ ప్రజ్ఞాశాలి అంటాను’ ఆమె చేసే ‘ఐగ్రీమ్’ ఇంటర్వ్యూలు కాలక్షేపం కోసం చేసేవి కావు. ఈ సిరీస్, సాహితీ సమాజం ఒక ఆధారంగా దాచుకోదగ్గ సాహితీ ఇంటర్యూలు. ఒక తరం మాటనూ, పలుకునూ రికార్డు చేసి భావితరాలకు అందించే పని ఇది. రేడియో టీవీలలో తెలుగువారి ఆత్మీయ సెలబ్రిటీ కాగలిగారు. ఇన్ని పనుల్తోపాటు ఆమె ఆపకుండా చేసిన పని అకాడమిక్ చదువును కొనసాగించడం. బోర్ కొట్టినప్పుడల్లా ఒక డిగ్రీ చేసారామె. ఆమె చదివిన డిగ్రీలు తెలిస్తే గుండెలు బీజారవుతాయి.
గూగుల్, వికీ మనకు ఇవాళ తెలుసు. కానీ మొన్న మొన్నటి వరకు చాలా సాహితీ సర్కిళ్ళకు తెలిసిన ఏకైక గూగుల్, వికీ మృణాళిని గారు. పురాణాలు తెలుసు. పురిపండా….. విశ్వనాథల సాహితీ కబుర్లు తెలుసు. ప్రాచీన సాహిత్యపు సొబగు తెలుసు. ఇండియన్ ఇంగ్లీష్ రైటర్లు ఏం రాశారో తెలుసు. మామ్, ఉడ్ హౌస్ ల రాత రాత వరస తెలుసు. సాలూరి వారి బాణీ తెలుసు. ఖయ్యం హార్మనీ మెట్ల మెరుపు తెలుసు. తెలియదంటూ లేదు తెలిసినట్టు కనిపించడం ఆమెకు రాదు. ఎన్నో పుస్తక సభలు ఆమె చేతుల మీద నడిచాయి. ఎందరో రచయితలు ఆమె మాట్లాడటం వల్ల గొప్పవారిగా చలామణి అయ్యారు. ఆమె ఇంగ్లీష్ లో రాయడం వల్ల బయటి వారికి పరిచయం కాగలిగారు. గుల్జార్ కథలు కూడా అనువాదం చేశారు.
తన వ్యక్తిత్వంతో ఒక పెద్ద గీతగీసి విరాట్ రూపంతో నిలిచినందు ఎక్కువ ఇష్టం.
ఖదీర్ బాబు లా మనందరికీ కూడా ఆమంటే ఎంతో ఇష్టం. గొప్ప సెలబ్రిటీగా మన ముందు నిలిచిన మృణాళికి మరోసారి అభినందనలు తెలుపుతున్నాను.
*****
1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది.
తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే రిటైరయ్యారు.
కవితా సంపుటులు :
పంజరాన్నీ నేనే, పక్షినీ నేనే(1999), ఎంతెంత దూరం(2005), గాజునది(2013), The Inner Courtyard (Prof. Suneetha Rani Translation ; Published Web version in Amazon Books Series)2017