వ్యాధితో పోరాటం-1
–కనకదుర్గ
వేపచెట్టు నీడ, గానుగ చెట్టు క్రింద చెక్క మంచం వేసుకుని నానమ్మ పడుకునేది. మేము అంటే, అమ్మలుఅక్క, చిట్టి, నేను, చింటూ తమ్ముడు, ఎదురింటి నేస్తాలు పద్మ, శ్రీను, అను, బుజ్జి అందరం కలిసి వేప కాయలు, వేప పండ్లు కోసుకుని, క్రింద పడినవి ఏరుకొని చిన్న చిన్న అట్ట డబ్బాలపైన పేర్చి కూరల కొట్టు, పళ్ళ కొట్టు పెట్టుకుని ఆడుకునేవారం. ఎంత సేపు ఆడుకున్నా అలసిపోయేవారం కాదు. ఒకోసారి కుర్చీలన్నీ వరసగా పెట్టి అదే బస్ లా కాసేపు, రైలులా కాసేపు ఆడుకునేవారం. డ్రైవర్ గా ఎప్పుడూ మా తమ్ముడు చింటూనే వుండాలి, ఎవరికి అవకాశం ఇచ్చేవాడు కాదు. కండక్టర్ గా ఒకరు మిగతావారంతా ప్రయాణికులు, ఒకోసారి బస్ కేవలం సిటీలోనే తిరిగితే మరోసారి వేరు వేరు ఊళ్ళకి వెళ్ళేది. బుర్ర్ బుర్ర్ మంటూ నోటితో చప్పుడు చేస్తూ చింటూ బస్ కానీ కూ చుక్, చుక్,చుక్ మంటూ రైలు నడిపేవాడు. ఎవరైతే కండక్టరో వారు రైట్, రైట్ అనేవారు టికెట్లు ఇచ్చిన తర్వాత.
బీప్, బీప్ బీప్ బీప్ అని ఐ.వి డ్రిప్ మెషిన్ ఆగకుండా చప్పుడు చేస్తుంటే గబుక్కున కళ్ళు తెరిచాను. నర్స్ కోసం బటన్ నొక్కాను. ఐ.వి బ్యాగ్ మొత్తం అయిపోయింది నర్స్ వచ్చి మరోటి ఆ స్టాండ్ కే తగిలించి వున్న మరో ఐ.వి బ్యాగ్ తగిలించి వెళ్తుంది.
మనసులో దిగులు, ఆందోళన, ఈ జబ్బు త్వరగా తగ్గుతుందా లేదా అనే ఆలోచన్లు వచ్చినపుడు, పెయిన్ కిల్లర్స్ సైడ్ ఎఫెక్ట్స్ తో భయం భయంగా అనిపించినపుడు, నిద్ర చ్పట్టనపుడు, చిన్నప్పుడు సంతోషంగా తోబుట్టువులతో, తోటి స్నేహితులతో కల్సి ఆడుకున్న విషయాలు గుర్తుచేసుకుంటాను. కొద్దిగా రిలీఫ్ గా అనిపిస్తుంది.
నర్సులు ఖాళీగా వుంటే వెంటనే వస్తారు, లేదా వేరే పేషంట్ తో వుంటే అక్కడ పని అయ్యాక వస్తారు. ఈ లోపు నర్స్ కి సాయం చేసే టెక్ చూస్తే వచ్చి ఆ సౌండ్ రాకుండా ఆపి నర్స్ వచ్చి బ్యాగ్ మారుస్తుంది అని చెప్పి వెళ్తుంది. టీ.వీ వైపు దృష్టి సారించాను. ఎలెన్ షో వస్తుంది. ప్రతి రోజు ఎలెన్ షో, ఆ తర్వాత ఓప్రా షో చూస్తుంటాను. ఎలెన్ షో బాగా పాపులర్ అయ్యింది. నవ్వుతూ, నవ్విస్తూ, సెలబ్రిటీస్ ని సరదాగా ఇంటర్వ్యూ చేస్తూ, జోక్స్ చెపుతూ, చేస్తుంది షో ఎలెన్. ఆ హస్పిటల్ లో వుంటే ఆ రోజు ఏ రోజో కూడా తెలియకుండా రోజులు గడిచిపోతుంటాయి. టీ.వీ క్రింద ఒక తెల్ల బోర్డ్ వుంది. దాని పైన ఆ రోజు డేట్, జనవరి 22, 2000, నన్ను చూసే డాక్టర్ పేరు డా. రిచర్డ్, రోజుకి ముగ్గురు నర్సులు మారుతుంటారు, ఉదయం నుండి 3 గంటల వరకుండే నర్స్ పేరు మెరిడిత్, టెక్ పేరు మరియా అని రాసి వున్నాయి. అది షేర్డ్ రూమ్, నా ప్రక్కన బెడ్ ఖాళీగా వుంది. నర్స్ తలుపు తీసుకుని వచ్చింది.
“సారీ, డియర్, ఈ రోజు కొత్త పేషంట్స్ వచ్చారు నర్సులు కొంతమందే వున్నాము…’’ అని మాట్లాడుతూనే అయిపోయిన ఐ.వి బ్యాగ్ తీసి క్రొత్త బ్యాగ్ తీసి పెట్టింది.
“ఇట్స్ ఓకే. ప్రక్కన ఎవ్వరూ లేరు కదా! ఎవరైనా వుంటే వాళ్ళకి డిస్ట్రబ్ అయ్యి విసుక్కునే వాళ్ళు,” అన్నాను.
“నువ్వెలా వున్నావు? నొప్పిగా వుందా? నీకేమైనా కావాలా?” అని దగ్గరగా వచ్చి అడిగింది.
“ఐ యామ్ ఓకే,” అన్నాను నిట్టూరుస్తూ.
“నీకు పాప గుర్తొస్తుంది, కదూ! ఈ రోజు వస్తున్నారా చూడటానికి? ఐ నో, యూ మస్ట్ బి మిస్సింగ్ దెమ్ సో మచ్. నీకు నొప్పి కొంచెం కంట్రోల్ లోకి వచ్చేస్తే నిన్ను ఇంటికి పంపించేస్తారు. అపుడు నీ పిల్లలతో చక్కగా టైమ్ గడపొచ్చు.”
అంటూ నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని, “డోంట్ వర్రీ, ఎవ్విరీధింగ్ విల్ బి ఆల్రైట్,” స్నేహంగా నొక్కి వదిలేసింది.
“మెరిడిత్, నీ కోసం డా. జాన్ ఫోన్ చేసారు. త్వరగా వెళ్ళు…” అంటూ వచ్చింది మరియా.
మెరిడిత్ పరిగెత్తింది బయటకు. మరియా, “ఏంటీ ఢల్ గా వున్నావు?” అని దగ్గరగా వచ్చింది.
కళ్ళు తుడుచుకోవడం చూసేసింది, “అయ్యో, ఏడుస్తున్నావా? నొప్పి ఎక్కువగా వుందా? పెయిన్ ఇంజెక్షన్ తీసుకు రమ్మననా నర్స్ ని?” అని కంగారుగా అడిగింది.
నేను, “లేదు, ఇంకా ఇంజెక్షన్ టైం అవ్వలేదు…”
” ఓ! ఇల్లు, పిల్లలు, మీ హజ్బెండ్ గుర్తొచ్చారా?” అంటూ నా మంచం చివర కూర్చుంది.
“రోజుల పిల్లను వదిలి వచ్చాను. నా మనసంతా పిల్లల మీదే. నా దగ్గర పాలు త్రాగేది. ఈ మందులు తీసుకుంటూ పాలు ఇవ్వొద్దన్నారు. బాటిల్ అలవాటు చేయాల్సి వచ్చింది. పాపం తను కూడా నన్ను మిస్ అవుతుంది కదా! నేను తనను వదిలి వెళ్ళిపోయానని అనుకుంటుందా? నన్ను మర్చిపోతుందా? నేనంటే కోపంగా ఉంటుందా? అస్సలు నా దగ్గరకు వస్తుందా? నేను వచ్చాకే స్నానం పోస్తానని చెప్పాను. అస్సలు వుండాలనిపించటం లేదు, కానీ ఈ నొప్పితో కూడా తనకి ఏం చేయలేకపోతున్నాను. నాకు ఇక్కడ వుండాలని లేదు.” అన్నాను కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా.
” ఎవరికయినా చంటిపిల్లలను వదిలిపెట్టాలని ఎందుకుంటుంది చెప్పు! నీకు ఈ నొప్పి లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? ఇప్పుడు నొప్పి తగ్గిపోతే పంపించేస్తారు త్వరగానే. కానీ ఈ నొప్పి మళ్ళీ రాకుండా వుండాలంటే ఏం చేయాలో అన్నీ రకాల పరీక్షలు చేస్తున్నారు కదా! అది తెలిస్తే నువ్వు ఇంట్లోనే వుండి ట్రీట్మెంట్ తీసుకోవొచ్చు… అలా బాధ పడకు. హాయిగా రెస్ట్ తీసుకుంటూ, చక్కగా టీ.వీ చుస్తూ సమయం గడిపేసేయ్. నీకు ఇంటికెళ్తే మళ్ళీ తీరికగా కూర్చునే అవకాశం వుంటుందా చంటిపిల్ల ఇంట్లో వుంటే?”
“ఎలెన్ షో లో ఎవరొచ్చారు ఈ రోజు?” అని మాట మార్చి కాసేపు సరదాగ కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది మరియా.
ఎలెన్ షో చూస్తూ ఆలోచిస్తున్నాను. ఈ నొప్పేంటీ ఇలా పట్టుకుంది నన్ను? అసలు తగ్గుతుందా? పాప కడుపులో వున్నప్పుడు కూడా చాలా విసిగించింది. ప్రెగ్నెంట్ కాకముందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ని, గైనకాలజిస్ట్ ని ఎంతగా అడిగింది. ప్రెగ్నెంసీలో ఈ నొప్పి వచ్చే అవకాశం వుందా? ఒకవేళ వస్తే ఎలా ట్రీట్ చేస్తారు? మీరు ఇంతకు ముందు ఎవరికైనా వైద్యం చేసారా? అని. ’ఏం పరవాలేదు, ఒకోసారి డెలివరీ తర్వాత ఈ నొప్పి మళ్ళీ రాకుండా తగ్గిపోయే అవకాశం వుంది.’ అన్నారు.
అసలు ఈ నొప్పి అమెరికాకి రాకమునుపే మొదలయ్యింది. కానీ ఇక్కడికొచ్చాక ప్రదేశం మార్పో, కుటుంబలో వున్న కొన్ని సమస్యలకు దూరంగా వుండడమో తెలీదు నొప్పి ఎక్కువగా రాలేదు. కొద్ది కొద్దిగా తినడం, మెల్లిగా బరువు పెరగడం మొదలు పెట్టింది. చూడడానికి కొంచెం ఆరోగ్యంగా అయ్యాను.
ఈ నొప్పి మొదలైన రోజు తల్చుకుంటే ఇప్పటికీ గుండె దడ దడలాడ్తుంది. హైద్రాబాద్ లో వున్నపుడు 1994 లో భర్త శ్రీని కాన్పూర్ లో ఆఫీస్ పని వుండి వెళ్తుంటే ఉత్తర భారతదేశంలో ఏ ప్రదేశాలు చూడలేదని నేను, బాబు చైతు కూడా బయల్దేరాము. భర్త కొలీగ్ సురేష్ కుటుంబం, భార్య శోభ లెక్చరర్ గా పని చేస్తుంది, పాప సుమ, చైతు కంటే పది రోజులు చిన్నది, వాళ్ళు కూడా వచ్చారు. ఫ్రెండ్స్ తో వెళితే సరదాగా వుంటుంది అని వెళ్ళాం. వాళ్ళు కూడా మేముండే అపార్ట్మెంట్స్ లోనే వుంటున్నారు. పిల్లలు కల్సి ఆడుకుంటారు. నేనూ, శోభ కూడా మంచి స్నేహితులమయ్యాము.
కాన్పూర్ లో కాన్ఫ్రెన్స్ అపుడు, మొగవాళ్ళిద్దరూ కాన్ ఫ్రెన్స్ కి వెళ్ళగానే పిల్లలకి ఏదైనా తినిపించి హోటల్ ప్రక్కనే చిన్న పార్క్ వుంటే అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆడుకునేవారు. పిల్లలిద్దరికీ 3 ఏళ్ళు, ఇద్దరు కల్సి బాగానే ఆడుకునేవారు,ఒకోసారి ఒకటే బాల్ కోసమో, బొమ్మ కోసమో కొట్టుకునేవారు. వారిని విడిపించి కాసేపు దూరంగా వుంచితే మళ్ళీ కలిసి చక్కగా ఆడుకునేవారు. కాన్పూర్ వూరికి కొంచెం దూరంగా వుంది ఆ హోటల్, కాన్ ఫ్రెన్స్ అక్కడే కాబట్టి అందులోనే వున్నారు. ఆ పార్క్ లో నెమళ్ళు కనిపించాయి. పిల్లలు ముందు భయపడ్డా ఆ తర్వాత వాటిని పట్టుకోవడానికి పరుగులు పెట్టేవారు. జనవరి నెల కావడంతో చలి బాగానే వుంది. స్వెట్టర్లు, పిల్లలకి టోపీలు, సాక్స్,షూస్ అన్నీ వేసి తీసికెళ్ళినా చల్లగానే అనిపించేది.
కాన్ ఫ్రెన్స్ అవ్వగానే డిల్లీకి వెళ్ళి ఎర్రకోట, కుతుబ్ మినార్ చూసాము. ఆకలిగా వుంటే మేమున్న హోటల్ దూరం కావడంతో అక్కడ పక్కనే చిన్న హోటల్ లో రొట్టె, వేడి వేడి ఫ్రెష్ పప్పు తినేసి తిరిగాము ఆ రోజు. శోభకి సెలవు అయిపోవడంతో వాళ్ళు హైద్రాబాద్ వెళ్ళారు. మేము ఉండి ఆగ్రా, మధుర ట్రిప్ వెళ్ళి వచ్చాము. ఆగ్రాలో వున్నపుడు సన్నగా కడుపులో నొప్పి మొదలయ్యింది. తిండి తిని చాలా సేపయ్యింది కదా అందుకేమో అని ఆగ్రాలో దొరికే స్వీట్స్ గుమ్మడి కాయతో చేసిన పేట, పళ్ళు తీసుకొస్తే తిని నీళ్ళు తాగాను. రాత్రి కూడా కాస్త నొప్పి అనిపించింది. తిండిలో మార్పు, అలసట వల్ల అలా అవుతుందనుకున్నాము.
ఆ తర్వాత, హైద్రాబాద్ వెళ్ళాము. భర్త ఆఫీస్ కి, చైతు ప్రీ స్కూల్ కి వెళ్ళారు. అప్పటి దాక మామూలుగానే వున్నాను. ప్రయాణ బడలిక తీరలేదు. నీరసంగా ఉంటే కాసేపు మంచం పై నడుం వాల్చాను. పది నిమిషాలు నిద్ర పట్టింది, సడన్ గా కొట్టినట్టుగా మెలుకువ వచ్చింది. కడుపులో విపరీతమైన నొప్పి, కడుపులో కత్తి పెట్టి మెలిపెట్టి తిప్పుతున్నట్టుగా ఆగకుండా నొప్పి లేచి బరాల్గన్ వేసుకున్నాను. వేసుకున్న కాసేపటికే నొప్పి మరింతెక్కువైంది. కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. నైటీలో వున్నాను. మెల్లిగా అతి కష్టం మీద బట్టలు మార్చుకుని పర్స్ తీసుకుని, ఇంటికి తాళం పెట్టి మెల్లిగా మెట్లు దిగి కాస్త దూరం నడిచానో లేదో నొప్పి అతిభయంకరంగా మెలిపెట్టేస్తుంటే అతి కష్టం మీద మరో నాలుగడుగులు వేసి పిల్లలు ఆడుకునే పార్క్ లో గట్టు మీద కూర్చుండిపోయాను కడుపు పట్టుకుని. అపార్ట్మెంట్స్ కి అటు వైపు ఒక డాక్టర్ క్లినిక్ వుంది. అక్కడికి వెళ్ళాలని నా ప్రయత్నం. ఆ అపార్ట్మెంట్స్ లోనే వుండే డిల్లీ నుండి కొత్తగా వచ్చిన జంట, వాళ్ళ రెండేళ్ళ పాప చాలా ముద్దుగా వుంటుంది. అనితా, ఆమె బయటకు వెళ్ళి వస్తూ నన్ను చూసి దగ్గరగా వచ్చి, “క్యా బాత్ హై? ఆప్ టీక్ హో?” అని అడిగింది. ఆ నొప్పి భరించలేక కన్నీరు ఉబికి వస్తుండగా కడుపు గట్టిగా పట్టుకుని చూపించాను. ఆమె ప్రక్కన కూర్చుంది. “అరే, ఘబ్రానా నహీ! సబ్ టీక్ హో జాయెగా. హమ్ క్లినిక్ కో జాయెంగె.” అంది నన్ను దగ్గరకు తీసుకుంటూ. నేను లేవబోయాను. “నహీ..నహీ.. ఏక్ మినిట్ రుకియే మై రిక్షా లేకే ఆవుంగీ.” అపుడే ఒకరింట్లో ఆయాగా పని చేసే ఆవిడ పాపని పార్క్ లో ఆడించడానికి తీసుకువచ్చింది.
“ఏమయ్యిందమ్మా?” అని కంగారుగా అడిగింది.
“ఆప్ దో మినిట్ ఇన్ కే పాస్ భైటియే ప్లీజ్, మై రిక్షా లేకే ఆవుంగీ… “, అని చెప్పింది అనితా, చాలా పొడుగ్గా వుంటుంది.
” హా..నేనుంటాను.. ఆప్ జావ్,” అంది ఆయా.
పాప కూడా నన్నే చూస్తుంది. ఆమె నా ప్రక్కన కూర్చొని,”ఏమ్మా నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరకు వెళితే మందుఇస్తే తగ్గుతుంది. భయమేమి లేదమ్మా..”
అనితా నిజంగానే రెండు నిమిషాల్లో రిక్షా పట్టుకొచ్చింది.
వాళ్ళిద్దరూ కల్సి నన్ను రిక్షాలో కూర్చోపెట్టి అనితా కూడా నా ప్రక్కన కూర్చుంది.
ఆయా, ” జాగ్రత్తమ్మా!” అని అన్నది.
రిక్షా అతను నడుచుకుంటే క్లినిక్ కి తీసుకెళ్ళాడు. దిగి నేను పర్స్ తీస్తుంటే, “నహీ నహీ, భయ్యా హమ్ కో ఫిర్ అపార్ట్మెంట్స్ మే ఛోడ్నా డాక్టర్ దెక్నేకే బాద్. ఆప్ థోడి ధేర్ రుకేంగే క్యా?,” అని అడిగింది అనితా.
రిక్షా అతను. “అచ్చా అమ్మా! మీరెల్లి రండి. నేనీడే వుంటా.” అన్నాడు.
అనితా నా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళింది.
డాక్టర్ ఇంకా రాలేదు. పేషంట్స్ కూడా ఎవ్వరూ లేరు. ఒక ఆయా వుంది.
అనితా ఆమెకి నా పరిస్థితి చెబితే ఆయా వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది.
అయిదు నిమిషాల్లో డాక్టర్ వచ్చి నన్ను టెస్ట్ చేసి,” నొప్పి ఎక్కువగా వుంది కదా! నేను పేయిన్ ఇంజెక్షన్ ఇస్తాను. కొన్ని టెస్ట్స్ చేస్తే ఎందుకు ఇంతగా నొప్పొస్తుందో తెలుస్తుంది.” అని ఇంజెక్షన్ ఇచ్చింది.
ఏం టెస్ట్స్ చేయించుకోవాలో రాసి ఇచ్చింది. “సాయంత్రం ఒకసారి మీ ఇంట్లో వారెవరయినా వచ్చి నొప్పి ఎలా వుందో చెప్పమనండి.”
అనితా డాక్టర్ తో మాట్లాడింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలా? అంతలా నొప్పి ఎందుకొచ్చింది? అని.
“ఇంజెక్షన్ తో నొప్పి తగ్గుతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు,” అని చెప్పింది.
డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి రిక్షాలో మా అపార్ట్మెంట్ కి వెళ్ళాం. నన్నుఅనితా జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి, తాళం తీసి ఇంట్లోకి వెళ్ళాక నన్ను కుర్చీలో కూర్చోబెట్టి, లోపలకు వెళ్ళి గ్లాస్ లో మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది.
నేను తనకు చాలా థ్యాంక్స్ చెప్పాను. ఆమె నన్ను పడుకోమని తను అక్కడే వుంటానని అన్నది.
నేను, “అభీ టీక్ హూ. మై సో జావుంగి. ఆప్ జాయియే, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ హెల్పింగ్ మి టుడే!”
“ఎనీ టైమ్! ఆర్ యూ ష్యూర్? మై యహా భైటుంగీ..యు కెన్ రెస్ట్..”
“ఐ యామ్ ష్యూర్. అగర్ ముఝే హెల్ప్ చాహియె థో మై ఆప్ కో బులావుంగి.”
” అచ్చా టీక్ హై. టేక్ రెస్ట్.” అని నన్ను దగ్గరకు తీసుకుని, “టేక్ కేర్,” అని చెప్పి వెళ్ళింది.
నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎంత మంచి మనిషి. ఆమె లేకపోతే తనేమై పోయేదో.
బెడ్ రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాను. వెంటనే నిద్ర పట్టేసింది.
2.30 కి కాలింగ్ బెల్ ఆగకుండా మ్రోగుతుంటే మెలుకువ వచ్చింది.
బాబు ప్రీ స్కూల్ నుండి వచ్చినట్టున్నాడు, ఆటో డ్రైవర్ వాడిని పైకి తీసుకొచ్చాడు. రోజూ నేనే వాడి కోసం బయట ఎదురు చూస్తూ వుండేదాన్ని.
తలుపు తీయగానే,” ఏమ్మా పానం బాగలేదా? రోజు బయట నిలబడేటోళ్ళు. చానాసేపట్నుండి బెల్ కొడ్తున్నా,” అని అడిగాడు ఆటో డ్రైవర్.
“ఆ.. కొంచెం బాగాలేదు. పడుకున్నాను. సారీ!”
“అయ్యో పరవాలేదమ్మా! జర పయిలమమ్మా!” అని స్కూల్ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
చైతు లోపలికి వచ్చి షూస్ తీసి పడేసి నన్ను గట్టిగా పట్టుకున్నాడు.
“స్కూల్ లో ఏం చేసావు కన్నా ఈ రోజు!”
“ఎందుకమ్మా పడుకున్నావు? ఇవాళ బయట నిల్చోలేదేంటీ?” అని అడుగుతూనే తనకిష్టమయిన బస్ బొమ్మతో బుర్ బుర్ అని చప్పుడు చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టాడు.
“నాకు బొజ్జలో నొప్పి వచ్చింది కన్నా! పార్క్ దగ్గర ఒక పొడుగు ఆంటీ వుంటుంది కదా! తనే నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఇంజెక్షన్ ఇచ్చింది,” అని చెబుతూనే వాడికి బట్టలు మార్చి స్కూల్లో సరిగ్గా తినడని ఇంటికి రాగానే కాస్త అన్నం కలుపుతుంటే, ” అమ్మో ఇంజెక్షనా? ఇచ్చినపుడు నొప్పి లేచిందా?” “కొద్దిగా లేచింది. నా కడుపు నొప్పి తగ్గాలంటే తీసుకోవాలి కదా మరి!” అన్నం తినేసి ఆవలించడం మొదలుపెట్టాడు, చేతులు కడిగి పక్క మీద పడుకోబెట్టి, నీరసంగా వుంటే తనూ అలాగే పక్కనే పడుకుంది. రోజూ ఓ గంట పడుకుని లేచాక పార్క్ కి తీసుకెళుతుంది. అక్కడ వీడి వయసు వాళ్ళతో మూడు చక్రాల సైకిల్ వేసుకుని పార్క్ చుట్టూ తిరుగుతాడు, కాసేపు పార్క్ లో ఆడుకుంటాడు.
మళ్ళీ కాలింగ్ బెల్ ఆగకుండా మ్రోగుతుంటే గబుక్కున లేచి వెళ్ళి తలుపు తీసింది.
బయట చీకటవుతుంది. శ్రీని ఆఫీస్ నుండి వచ్చేసాడు.
*****
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
చాలా బాగా రాసిన వు ,ఇది నీ రియల్ లైఫ్ స్టోరీ , నాకు తెలుసు , నువు ఎంత కష్టపడ్డా వూ. పెన్ వల్ల , తెలుస్తుంది.
Thanks Azra! There is so much coming in the coming months. చదివినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్! ప్రతి నెల చదువుతావని ఆశిస్తున్నాను.