నారి సారించిన నవల-30
వి.ఎస్. రమాదేవి-1
-కాత్యాయనీ విద్మహే
వి.ఎస్. రమాదేవి నవలా రచయిత అని 2000 వరకు నాకు తెలియకపోవటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతకు ముప్ఫయేళ్ల ముందు నుండే నేను నవలలు అందు లోనూ స్త్రీల నవలలు బాగా చదువుతుండేదాన్ని. పత్రికలలో సీరియల్స్ గా రాకపోవటం వల్లనో ఏమో ఆమె నవలలు నా దృష్టికి రాలేదు. స్త్రీవాద చైతన్యం స్త్రీల సాహిత్య సేకరణ , మదింపు లక్ష్యంగా చేసుకోవలసినవి అన్న ఆవగాహన ఇచ్చాక ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తుంటే వి. ఎస్ రమాదేవి నవలలు తటస్థ పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గా , భారత ఎన్నికల కమీషన్ అధికారిగా అత్యున్నత పదవులు నిర్వహించిన ఆమెపట్ల, ఆమె రచనల పట్ల ఆసక్తి పెరిగింది. 2003 లో కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కళాశాల తెలుగు విభాగం పక్షాన “జెండర్ స్పృహ – ఆధునిక సాహిత్యంలో ప్రతిఫలనాలు” అనే అంశం మీద నిర్వహించిన రెండురోజుల జాతీయ సెమినార్ ప్రారంభ సభకు ఆమెను ముఖ్య అతిధిగా ఆహ్వానించాం. ఆమెతో వేదిక పంచుకొనటం నాకొక మంచి జ్ఞాపకం. ఆ సదస్సులో ఆమె తొలి నవలలు మూడింటి పైన నా పరిశోధక మిత్రురాలు ఒక పత్రం సమర్పించింది కూడా. ఆ తరువాత అందుబాటులో ఉన్నంతవరకు ఆమె నవలలు సేకరించాను. ఇన్నాళ్లకు వాటిని పరిచయం చేసే అవకాశం వచ్చింది.
వి.ఎస్. రమాదేవి 1934 జనవరి 15 న పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలులో పుట్టింది. తల్లి వెంకట రత్నమ్మ , తండ్రి సుబ్బయ్య. ఏలూరులో చదువు కొని 1958 నాటికి హైదరాబాద్ చేరింది. ఆలిండియా రేడియోలో అనౌన్సర్ గా చేరింది. 1959 మే లో తాను హైదరాబాద్ రేడియో ఉద్యోగంలో చేరేనాటికి రమాదేవి అక్కడ పనిచేస్తున్నదని తనకు ఎన్నో విషయాలలో సలహాలు ఇచ్చి సహాయం చేసిందని చెప్పుకొన్నది శారదా శ్రీనివాసన్. అంతే కాదు ఆవిడ ఎమ్ ఎ , బి. ఎల్ , ఎమ్. ఎల్. ఎల్ ఆలిండియా రేడియోలో పనిచేస్తుండగానే చేసిందని అనౌన్సర్ విధులు నిర్వర్తిస్తూనే పాటకు,పాటకు మధ్య విరామకాలంలో కూడా చదువుకోగలిగిన రమాదేవి ఏకాగ్రతకు అబ్బురపడింది కూడా. ఏ కార్యక్రమంలోనైనా మాట్లాడవలసిన వాళ్ళు రాని విపత్కర పరిస్థితులలో అప్పటికప్పుడు ఆ విషయం మీద అనర్గళంగా టాక్ ఇయ్య గలిగిన ఆమె సామర్ధ్యాన్ని అభిమానంగా తలచుకొన్నది. ( నా రేడియో అనుభవాలు- జ్ఞాపకాలు, 2011). చివరకుమిగిలేది నవల, అనేక కథలు, నాటకాలు, వ్యాసాలు వ్రాసిన బుచ్చిబాబు అప్పుడు హైదరాబాద్ ఆలిండియా రేడియోలోనే ఉన్నాడు. నాటకాలు వ్రాయటం , ప్రొడ్యూస్ చేయటం ఆయన ప్రధానమైన పని. ఆయన డైరీలలో రమాదేవి ప్రస్తావనలు కనబడతాయి. 1959 డైరీలో ఏప్రిల్ 28 న ఆత్మవంచన రమాదేవి తో కలిసి పూర్తి చేసాను అని వ్రాసుకొన్నాడు. అదే సంవ త్సరం నవంబర్ 25 న ‘పని సులువు’ హాస్య రచన మహిళా కార్యక్రమంలో స్టాఫ్ రమాదేవి, సావిత్రి, దుర్గ తదితరులు పాత్రలుగా ప్రొడ్యూస్ అయింది అని పేర్కొన్నాడు. ఈ రెండూ ఆయన వ్రాసినవే. ఈ రెండింటిలో రమాదేవి పాత్ర ఉండటం గమనించవచ్చు. రేడియో నాటకాలలో ఆమె వాచకాభినయాన్ని, దానితో పాటు రంగస్థలంపై ఆమె ప్రదర్శించే ఆహార్య ఆంగిక సాత్విక అభినయాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోనుచేసేవి అని కాంతం కాపురం, ఆత్మవంచన నాటకాలలో ఆమె అభినయ కౌశలం అద్భుతం అని శ్రీ వాత్సవ ఆమెను ప్రశంసించాడు. (అందరూ మనుషులే నవలకు వ్రాసిన ముందుమాట, 2004)
1960 నాటికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో న్యాయవాదిగా కొత్త వృత్తి జీవితంలోకి ప్రవేశించింది రమాదేవి. ఆ తరువాత కొద్దికాలానికి గ్రూప్ ఏ ఆఫీసర్ గా కేంద్రప్రభుత్వ సర్వీసులలోకి ప్రవేశింది.భారత న్యాయసేవా రంగంలో వివిధ హోదాలలో పనిచేసింది. 1990 లలో ఎన్నికల కమీషనర్ గా మలుపు తీసుకొన్న ఉద్యోగ జీవితంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా సేవలందించి వరుసగా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా 2002 వరకు ఆమె పనిచేసింది. హైదరాబాదు లో స్థిరపడింది. ఆమె భర్త రామావతార్ . పిల్లలు ముగ్గురు.అత్యున్నత పాలనా బాధ్యతలలో తలమునకలు అవుతున్నా మరొకవైపు ఆమె రచనా వ్యాసంగం కొనసాగుతూనే వచ్చింది. నిశి అన్న మారు పేరుతో ప్రకటితమైన రచనలు కూడా ఉన్నాయి. నవలలు కాక కథలు, నాటకాలు, వ్యాసాలూ చట్టపరమైన రచనలు అనేకం చేసింది. పాలనా రంగంలో సాహిత్య కళా రంగాలలో ఆమె చేసిన కృషికి గౌరవ డాక్టరేట్ డిగ్రీ ఇచ్చి సత్కరించింది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. 2013 ఏప్రిల్ 17 న మరణించింది.
1
డా. వి. ఎస్. రమాదేవి తొలి నవల పంకజం. 1958 లో గోల్కొండ పత్రికలో అచ్చు అయింది. ఈ నవలకు మునిమాణిక్యం నరసింహారావు వ్రాసిన పరిచయం ఉంది. ఆయన 1973 ఫిబ్రవరి 4 న మరణించాడు కనుక అంతకుముందే ఎప్పుడో ఇది పుస్తక రూపంలో వచ్చివుంటుంది. 1961 లో వ్రాయబడిన నవల తల్లీబిడ్డలు. నవలలు రాసే నవలా !అనే శీర్షికతో శ్రీవాత్సవ వ్రాసిన ముందుమాట సెప్టెంబర్ 62 నాటిది కనుక అందరూ మనుషులే నవల మూడవది అవుతుంది. పంకజం నవల తోపాటు ప్రచురించబడిన జీవిత సాఫల్యం కథ అని రచయిత్రి పేర్కొన్నది కానీ స్వరూప స్వభావాలు రెంటి రీత్యా అది నవల అనదగినదే. అది 1971 నాటి రచన అని , ఆంధ్రజ్యోతి లో ప్రచురించబడింది అని పంకజం ముందుమాటలో ఆమె చెప్పింది. 1979 లో వ్రాసిన రాజీ నవల తరువాతది. పాతిక సంవత్సరాల తరువాత మలుపులు, మజిలీ , అనంతం అనే మూడునవలలు 2004 లో వచ్చాయి. 2004 లోనే దారితప్పిన మానవుడు అనే మరొక నవల ప్రచురించబడినట్లు తెలుస్తున్నది.ఇవన్నీ రమ్య ప్రచురణలు గా 2004 ఆగష్టు లో వచ్చాయి. 2006 జులై లో సంసార సాగరాలు ‘చతుర’ నవలగా వచ్చింది. ఒక స్త్రీగా తోటి స్త్రీల అంతరంగాలను అర్ధం చేసుకోగల సున్నితత్వం, ఉన్నత విద్యావంతురాలుగా ఉన్న జ్ఞాన చైతన్యాలు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు అధికార పదవులు నిర్వహించుకువచ్చిన లోకానుభవం కలిసి రమాదేవి నవలలను మేధో ప్రధానమైన రచనలుగా రూపొందించాయి.
1950కి పూర్వం కోస్తా జిల్లాలలో పెళ్లి అయి సంసారం ఉన్న మోతుబరి పురుషులు పెళ్లితో సంబంధం లేకుండా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకొనటం వాళ్లకు ఇల్లూ వాకిలి అమర్చి, సంతానాన్ని కనటం ,రాకపోకలు సాగించటం ఊరందరికీ తెలిసే జరుగుతుండే ఒక జీవన సరళిని గమనించిన రమాదేవి ఆ నేపధ్యం లో వ్రాసిన నవల పంకజం. పెళ్లి లేకపోవటం వలన ‘ఉంచుకొన్నది’ గానో , ‘ఫలానా వారి ఇలాకా’ గానో చెప్పబడుతూ సామాజిక గౌరవానికి నోచుకోక , విలాసవతులుగా ముద్రపడ్డ ఆ స్త్రీల జీవితం లోని ఒంటరి విషాదాన్ని చిత్రించిన నవల పంకజం.
వేశ్య కులంలో పుట్టిన పంకజం తల్లి తన ముప్ఫయ్యవ ఏట నుండి బుచ్చిరెడ్డి అనే మోతుబరికి కట్టుబడి జీవించింది. ఆయన ఆమెకు ఒక మేడ కట్టించి పోషణ బాధ్యత తీసుకొన్నాడు. వాళ్లకు పుట్టినబిడ్డ పంకజం. తల్లీదండ్రీ గారాబంగా పెంచారు. తండ్రి మంచివాడిని చూసి కూతురికి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకోవాలనుకొన్నాడు. కానీ పంకజానికి పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి చనిపోయాడు. తల్లి పెళ్లి చేద్దామని ప్రయత్నించి సరైన వాడు రాక ‘ఎవడో అసమర్దుడిని కట్టుకొని భార్యగా పడి ఉండే కంటే మంచివాడి ప్రాపకంలో ఉంటేనే బాగు’ అన్న నిర్ణయానికి వచ్చి బుచ్చిరెడ్డి అక్క కొడుకు వీరపరెడ్డి తో కన్నెరికం జరిపించింది. మూడేళ్లకు తల్లి చనిపోయింది.చిన్నపటి నుండి ఇంటిపనిలో సహాయంగా ఉన్న కాంతమ్మ తల్లిపాత్ర ను కూడా తీసుకున్నది. ఈ భూమిక పై నిర్మించబడిన అసలు కథ పంకజం అంతరంగ ప్రపంచపు ఆలోచనలకు, ఆకాంక్షలకు, మానసిక సంఘర్షణకు సంబంధించింది.
పంకజం జీవితంలో వీరప రెడ్డికి తనకు ఉన్న సంబంధాన్ని గురించిన విచికిత్స, తన ఎదురింటి గృహస్థు నారాయణ పై కలిగిన ఆకర్షణ, అది పెట్టె తొందర – రెండు ప్రధానాంశాలు.
వీరపరెడ్డి పంకజం భర్త కాడు. కన్నెరికం చేసి పోషిస్తున్నమోతుబరి. అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమెను ఒక్క రోజు వదిలి ఉండటం కూడా అతనికి బాధ గానే ఉంటుంది. పంకజానికి అలా అనిపించదు. అతని మీద తనకు ప్రేమలేకపోవటం వల్లనా అని తర్కించుకొంటుంది కూడా. పదిహేడవ ఏట ఏర్పడిన సంబంధంలోని అలవాటు, మరీ ఒంటరి కాకుండా ఒక తోడు అతను.అంతే ఆమెకు. అయితే ప్రేమలేకుండా అతని తో సంబంధం కూడా ఆమెకు ఇష్టమైనదేమీ కాదు. ప్రేమలేనప్పుడు అతనిని తనదగ్గర ఉండనీయటం ఎందుకు ? అన్న ప్రశ్న కూడా ఆమెకు కలిగింది. అతనే తనను పోషిస్తున్నాడు కదా అని ఒక క్షణం అనుకోని కూడా అతను లేకపోతే తన పోషణ గడవదా అని ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచిస్తుంది. ఇలాంటి ఆలోచనలు ఆమెలో ఎప్పటినుండి ప్రారంభం అయ్యాయో కానీ వీరపరెడ్డి తండ్రి వచ్చి నాలుగేళ్లుగా పంకజం దగ్గరే ఉండిపోయిన కొడుకు చేసుకొన్న భార్యను ఇంటికి తెచ్చుకోలేదని, ఆపిల్ల కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తున్నదని చెప్పి వెళ్ళినప్పుడు అతనిని వెళ్ళమనటానికి ఆమెకు అవకాశం దొరికింది. . ఆరాత్రే వీరపరెడ్డికి అతని ఇంటికి వెళ్లి కుటుంబజీవితం గడపమని చెప్పింది. తనకు అతని మీద ప్రత్యేకమైన ప్రేమ లేకపోవటం వల్లనే అలా చెప్పగలిగింది. రెడ్డి తనను పెళ్లిచేసుకోలేదు, ఉంచుకొన్నాడు అన్న తలపే ఆమెకు అసహ్యం అనిపిస్తుంది. పోషణ కోసం ప్రేమ లేని చోట శారీరక సంబంధం ఏ స్త్రీ కయినా అసహ్యకరమైనదే. అగౌరవకరమైనదే. వేశ్య అయినా, ఇల్లాలు అయినా గత్యంతరం లేకనే వాటిలో మగ్గుతుంటారు. ఇల్లాలికి కుటుంబ మర్యాద, పిల్లల బాధ్యత మొదలైనవి మనసులో మాట బయటకు చెప్పటానికి అవరోధం అవుతాయేమో కానీ వెలయాలకి అలాంటి అవరోధాలు లేవు. అందుకే పంకజం పోషణకోసం వీరపరెడ్డిని తనఇంటికి కట్టేసుకోవాలనుకోలేదు. పంకజం సలహా విని, బహుశా ఆమె మీద పెంచుకున్న ప్రేమవల్లే కావచ్చు ‘ఎప్పుడేది చెయ్యాలో నాకు తెలుసు’ అని అతను ఉద్రేక పడితే అతని తండ్రి చెప్పి వెళ్లిన మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తుండగా “లేదులే …. నాలుగేళ్లయింది కదూ నాకూ విసుగ్గానే వుంది .” అన్న మాటతో అతనితో సంబంధం తనకు అవసరం లేనిదే అని సులభంగా అనెయ్యగలిగింది. దానితో అహం దెబ్బతిని వీరపరెడ్డి వెళ్ళిపోయాడు.
వేశ్యలకు లేదా పోషణ కోసం ఒక పురుషుడికే కట్టుబడి ఉన్న స్త్రీ లకు ద్రవ్యాకర్షణ ప్రధాన లక్షణమని పురుషులను ఆకట్టుకొని వాళ్ళ సంపదలు హరించి వాళ్ళ ఇళ్ళు గుల్ల చేసి వదలటమే లక్ష్యమని చెప్పే మాటలు స్త్రీలను వేశ్యలుగా , ‘ఉంపుడు కత్తెలు’ గా చేసిన నేరం నుండి పురుషు లను తప్పించి బాధితులనే బాధ్యులుగా చేసే అధికార రాజకీయాల అభివ్యక్తీకరణ. మునిమాణిక్యం నరసింహారావు వంటి రచయితలు తమకు తెలిసి గానీ తెలియక గానీ ఆ అధికార రాజకీయాల లో భాగంగానే మిగిలిపోవటం ఈ నవలకు వ్రాసిన ముందుమాటలోని ‘జుగుప్సను కలిగించే వేశ్యాజీవితం’ , ‘పుట్టుకచేత వేశ్య అయిన పంకజం నారాయణ వంటి సద్గృహస్థుని ప్రేమించటం, అవాంఛనీయం, జుగుప్సాకరం’ వంటి అభిప్రాయార్ధక వాక్యాలు సూచిస్తున్నాయి. ఆ రకమైన గతానుగతిక సంస్కృతి పై అతి సున్నితంగా విమర్శ పెట్టటమే ఈ నవలలో రమాదేవి చేసిన పని. ప్రధాన స్రవంతి భావజాల దృష్టి నుండి కాక వాళ్ళను వాళ్ళదైన అనుభవకోణం నుండి చూడాలని ఒక స్త్రీగా ఆమెకు 1958 నాటికే అనిపించటం విశేషం.
పంకజానికి శరీరం ఉంది. శరీరానికి ఆకలి ఉంటుంది. అది వీరపరెడ్డి వల్ల తీరుతున్నది. పంకజం మనిషికదా ! హృదయం ఉంటుంది. అది అనుభవాన్ని కోరుతుంది. వీరపరెడ్డి సాంగత్యంలో లైంగిక అవసరం తీరవచ్చు కానీ అది హృదయాన్ని తాకే అనుభవంగా పరిణమించలేదు. పంకజానికి మెదడు ఉంది కనుక ఆ వెలితి గురించిన చింతనలో పడింది. ఆ సమయంలో ఎదురింటి నారాయణ నవ్వు , నడక , నిలబడే తీరు అన్నీ ఆమె హృదయాన్ని తాకి ఎప్పుడో మోహంలో పడవేశాయి. వీరపరెడ్డి ని పంపించివేశాక ఇక ఆమె యాతన , ప్రయత్నమూ అంతా నారాయణకు తన హృదయం తెలియపరచాలనే , తనను అర్పించుకోవాలనే. సినిమాపని మీద అతను మద్రాసు వెళ్లాడని తెలిసి సినిమాలలో నటిస్తున్న పెద్దమ్మ కూతురి దగ్గరకని మద్రాసు వెళ్ళింది. నారాయణ రావు కోసం వెతుకులాట ఫలించినా అతను తన గురించి ఏమనుకొంటాడో అని బాధపడింది. పిలిస్తే ఇంటికి వచ్చాడు గానీ తన అభిప్రాయం గ్రహించనట్లే వెళ్ళిపోయాడు. అక్క పెళ్ళిలో కానుకగా ఉంగరం ఇస్తే తన హృదయం గ్రహిస్తాడనుకొంటే , నీ హృదయం నాకు తెలుసు కానీ అది ఇద్దరికీ శ్రేయస్కరం కాదని వ్రాసి ఉంగరం తిప్పి పంపాడు. సామాజిక కట్టుబాట్లకు, కౌటుంబిక బంధాలకు బద్ధుడైన అతను స్నేహ సంబంధం కూడా కొనసాగించలేనని చెప్పి తప్పుకొనటం ఆమెకు పెద్ద ఆశాభంగమే. అది ఆమె జబ్బుపడటానికి దారితీసింది.
జబ్బుపడ్డప్పుడు చూడటానికి వచ్చిన వీరారెడ్డి నిన్ను ద్వేషించాలన్నా ద్వేషించలేకపోతున్నాను, నిజంగా నేనంటే నీకు విసుగు పుట్టిందా అని అడిగినప్పుడు అతనంటే తనకు ఇష్టమే కానీ అది అతని ఇష్టం లాంటిది కాదు అంటుంది. అతని ఇష్టంలో పంకజం శరీరం పై ఇష్టం ఉంది. ఆమె ఇష్టం దానిని మినహాయించినది. ప్రాణస్నేహం అంటుంది.ఆమె మాటలలో స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన ఒక ఉదాత్త సంబంధం గురించిన ధ్వని గ్రహింపుకు వచ్చిన క్షణాన వీరపరెడ్డిలో ఇన్నాళ్లు ఆమె ఇష్టాన్ని, ప్రేమను గురించి ఆలోచించని తన అపరాధం తెలిసివచ్చింది. అది సాధారణమైన మగవాదీని సున్నితమైన మానవుడుగా మార్చటం ఈ నవలలో చూస్తాం.
స్త్రీపురుషుల మధ్య సహజ సుందరమైన ఆకర్షణ, మొహం, ప్రేమ, లైంగిక ఆసక్తులు సామాజిక కౌటుంబిక నియామాల నియంత్రణలో రూపు చెడి అవమానకరంగా, బాధాకరంగా మారుతూ స్త్రీలను జబ్బులకు గురిచేస్తూ మగవాళ్ళను హృదయం లేనివాళ్లను చేస్తున్న ఒకా నొక పరిస్థితిని ఈ నవలలో చూపించిన రమాదేవి దీనిని అందరి మంచికి మార్చుకొనటం ఎలాగో ఆలోచించమని చెప్పినట్లయింది. ఈ నవలను ఆమె చెల్లి వీణాదేవికి – మరిది దొరస్వామికి , మరొక చెల్లి విజయలక్ష్మి – మరిది శ్రీనివాస్ కు అంకితం ఇచ్చింది.
( ఇంకా ఉంది)
*****
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Very nice andi.