రాగో
భాగం-21
– సాధన
దల్సు ఇంట్లో నిండు గ్రహణం పట్టినట్టుంది. బట్ట పొట్టకు కరువులేని ఇంట్లో బుక్కెడు అంబలికే పూట పూట గండమవుతూంది. నూకల జావ తప్ప మరొకటి ఎరగని దల్సు ఇంట్లో నూకల వూసే లేదు సరికదా జొన్న అంబలి, జొన్న గటుక పుట్టడమే గగనమవుతూంది.
రాగో ఉంటే జొన్నగడ్డ కూలికి పోయి జొన్నలన్నా తెచ్చేదని, పొయ్యి దగ్గరికి పోయినప్పుడల్లా తల్లీ, కూచీ సణుగుతూనే ఉన్నారు. గిన్నె (పళ్ళెం) దగ్గర కూచున్న ప్రతిసారి తండ్రికీ, కాకకూ కూడా అదే గుర్తుకొస్తుంది.
ఉప్పు, మిరం వూట పూర్తి కొనడానికే బెంగాలోనికి ఇచ్చి ఇచ్చి ఉన్న ఇప్పపూలు, గారె కాయ కూడా ఒడిసాయి. ఓ పూట డికాషన్ తాగే అలవాటు పేరు లేకుండా పోయింది.
తల పట్టుకు కూచున్న దల్సుకు ఏం తోచడం లేదు. కాళ్ళు జాపి వాకిట్లో వెల్లకిలా పడి పొర్లుతూ పొట్ట చూపి ఏడ్చే కుక్కను చూసి దల్సు మనసు చెరువైపోతూంది.
ఆ పూర్త విత్తనాలుంటే ముల్లెకట్ట విప్పి భూమిల అలికిండు. మూడేండ్ల కెల్లి వానలు ఎటమటం అవుతుంటే బీడుపడ్డ పొలమే దినం దినం పెరుగుతుంది. ఈయేడు అట్లనే అయితే ముందటికి ఇత్తనం కూడ పుట్టదని అందరి లాగనే దల్సు కూడ ఫికరు చేస్తున్నాడు.
చుట్టుపట్ల ఏ పనీలేదు. కూలినాలికి పిలిచేటోడు లేడు. వానాకాలం అని ఉన్న రోడ్డు పని కాస్తా ఆగిపోయింది. ఆకులమీద నూరో, ఇన్నూరో వస్తే వానాకాలం గాసానికి వెళ్ళేది. మూడేండ్ల సంది టేకపట్టి సర్కారోడే ఉంచుకోబట్టి ఉన్న రేటు కూడా ఇయ్యక సంపే (సమ్మె) జరగబట్టే. ఇంకో రెన్నెళ్ళు పోయి దీపావళి వస్తే గాని బొగ్గుపని షురు కాదు. దీర్ఘంగా శ్వాస వదిలిన దల్సు మనసు కకావికలమైంది.
గొట్టోళ్ళు చేసుకునే పెద్ద పండుగ నొవ్వ పోల్వ. పండుగనాడు వచ్చినోనికి లేదనకుంట మానెడో, తవ్వెడో పుట్టినింట్ల వచ్చినోని ముఖం చూసుకుంట లేదనాల్సి వస్తుంది. ఎన్నడూ కడపదాటి ఇంకొకరిని నోరిడిసి అడగనోనికి ఇవాళ పూట పూర్తి బదులు పుట్టించుక రావడం ఇజ్జతు పోయినంత పనే అవుతుంది. లేవబోతున్న దల్సుకు నెత్తిమీద గుల్లలతో వాకిట్ల అడుగుపెడుతున్న యారాళ్లిద్దరు కంటపడ్డారు.
“బాల్ అద్ (అదేంటిది)” – దల్సు.
“ఓసో బాతల్ మంత జర్మతవే” (ఇంకేముంది మామూలే) – నంటూ భార్య ఎడంచేత్తో గుల్ల దించి కింద పడేసింది. తోటికోడలు గుల్లకూడ బరువుగా ఏమీ లేదు.
ఒక గుల్లలో కంక కక్కులు, పుట్టకొక్కులు, మరో గుల్లలో చెన్నగడ్డలు ఉన్నాయి.
“పూటకు లేదని నానని గడ్డలు తెచ్చి వండుకుంటే లేని బీమారీలతో చావుదల కచ్చేట్టున్నది.”
“ఇంగో” (అవును) అంటూనే మరదలు నాలుగు రోజులుగా పారే నీళ్ళల్ల నానబెట్టిన గడ్డలు గుల్ల నుండి తీసుకొని ఉడుకపెట్టనీకి పోయింది. నాలుగు సార్లు ఉడకబెట్టి ఆ నీళ్ళు పారబోస్తేగాని చేదు (విషం) పోదు. ఏమైనా పూటకింత విషం మింగినట్లే ఉన్నది అని ఆవిడ మనసులో లేకపోలేదు.
అడవికి పోయిన గొడ్లను తిరిగి తిరిగి పొద్దూకేవరకు దొరికించుకొని అప్పుడే రామ కడపల్లో అడుగు పెట్టినాడు. అమ్మంగ, చావంగ మిగిలిన రెండావుల్లోనూ రామడు బక్కావునే తెచ్చేవరకు దల్సు నొసలు చిట్లించాడు.
“ఇంకొకటి ఏమైందిరా, దొరకలేదా” – దల్సు ఆతృత ఆగలేదు.
“ఇంగో” (అవును) అంటు నిదానంగా పంపుల దగ్గరికి నడిచాడు రామ. నీళ్ళు తోడి కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని నీళ్ళు ముఖంపై చల్లుకున్నాడు.
అడవి పాలు అయిన ఆవు గూర్చి నిట్టూర్పు విడిచిన దల్సులో అది మామూలే అన్నట్టుంది తప్ప ఆందోళనే లేదు.
* * *
తమ్ముణ్ని లేపుకొని ఉన్నాక్కావును పట్టుకొని, దల్సు రోడ్డుమీది కొచ్చేసరికి భళ్ళున తెల్లారింది. బత్తెం కట్టుకొని, అంచుకు చిల్లికొట్టిన గంజుకు తాడు కట్టుకొని చెరో జబ్బకు వేసుకుని అన్నదమ్ములు నడుస్తున్నారు. నడుమ ఒక నిద్ర చేస్తేగాని వారు అంగడి చేరుకోలేరు. నాటి కాలములైతే ఎవరింట్ల ఆగినా ఆ పూటకు అర్సుకునేవారు. ఈ కరువు గొట్టు రోజుల్లో మిక్కుటానికి వస్తే అంబలి దొరకాలన్నా అడిగేటోనికే నోరు రాకుండా ఉంది. ఉండి ఉండి అప్పుడోటి ఇప్పుడోటి పొడి పొడి మాటలే తప్ప అన్నదమ్ముల మధ్య ముచ్చట సాగడం లేదు.
ఆ రాత్రి నిద్రకు ఆగిన ఖేడినార్ పటేల్ దల్సుకు దూరపు బంధువు. ఆ చుట్టుపట్ల పేరున్న పటేలే. ఈ నడుమ పటేల్ తనం పోయింది. అన్నగాండ్లకు బువ్వ పెట్టాడనీ, సంఘపోల్లను పట్టి ఇవ్వలేదనీ నౌఖరీ ఊడబీకిండ్రు పోలీసులు. ఇదే నయమని ఆ పటేల్ మొత్తంగానే సంఘంలో తిరుగుతుండు.
“దల్సు! ఆవునమ్ముతావురా” – పటేలు.
“ఇంగో (అవును) కోళ్ళు, మేకలు ఐపోంగ గిదొక్కటే మిగిలింది. నొవ్వ పండుగ ముందరుండే. పూట పూటకు కటకటయితంది దాదా” అంటూ నిదానంగా పడుకొనే జవాబు చెప్పాడు.
“అంగడికి నేను కూడ వస్తే. మేక పోరగాండ్లు మిగిలినయి. పట్టుకస్తా! కోడి పోరగాండ్లకు ఇచ్చిన ధరకూడ ఇస్తలేరు” అన్నాడు నీరసంగా పటేలు.
“హి… హి… హి…” అంటూ నవ్వి నడుం వాల్చాడు రామ.
“రాగో కనబడిందిరా! మొన్న మా ఊరికి వచ్చిన దళంలో ఉంది.” అంటూ రహస్యం చెబుతున్నట్టు మెల్లగా గొణిగాడు పటేల్.
రాగో పేరు విన్న అన్నదమ్ములిద్దరూ గభాలున లేచి కూచున్నారు, ఇంకేం చెప్పుతాడో అని ఎదురుచూస్తూ.
“మంచిగానే ఉంది” అని మాత్రం అన్నాడు పటేల్.
జాముకో మాట, పూటకో ముచ్చట గాకుండా అదేదో గబగబ చెప్పితే బాగుండునని ఇద్దరూ లోలోనే గింజుకుంటున్నారు. చివరకు రామే ధైర్యం చేసి,
“ఓసో బాతల్ ఇత్త! (ఇంకేం అన్నది) దాదా” అన్నాడు. దాంతో “ఏం ఉంటది, ఏమీ చెప్పలేదు” అని పటేల్ ఒత్తిగిల్లాడు. ఇద్దరు నీరసపడి మళ్ళీ నడుములు వాల్చారు.
ఆ నోటా, ఈ నోటా ఈ కబురు వింటూనే ఉన్నాడు రామడు. “ఒక్కసారి ఇంటి దాక వచ్చి పొమ్మను” అని ఎన్నోసార్లు రామడు కబురు చెప్పంపాడు కూడా. “బిడ్డకి మా కబురందిందో లేదో మరి!” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.
రాగో అదే పనిగా గుర్తుకు వచ్చిన దల్సుకు ఇక ఆ రాత్రి కునుకే పట్టలేదు.
అంగట్లో హడావిడి బొత్తిగా లేదు. అసలే కరువు అందులో వర్షాలు. బేరగాళ్ళు పెద్దగా రావడం లేదు. వీలున్నప్పుడల్లా ఆ రైతులు ఊరువచ్చి ఉన్నదేదో అమ్ముకొని అక్కడుండే షావుకార్ల నుండి కావల్సింది కొనుక్కుంటున్నారు. గిరాకి లేని బేరగాళ్ళు ఈగలు కొట్టుకుంటూ గుణుక్కుంటూ కూచున్నారు. ఎవనికి ఉద్దెర ఇచ్చినా గ్యారంటీ లేని కాలం. మనుషుల మీద నమ్మకం లేకుండా పోతుంది. నూర్పిళ్ళ కాలంలో ఊరూరు తిరిగి రైతుల నుండి బోరాల్లో వడ్లు నింపుకొచ్చిన కాలం పోయిందని షావుకార్లు వుసూరు మంటున్నారు. నగదు మిత్తికిస్తే అడగపోను గుండె చాలకుండా ఉంది ఊర్లల్ల..
“ఏడికొస్తే గాడికేనాయె. గీడికొచ్చినోనికే సున్నం పెట్టుదాం” అని గల్లాపెట్టి ముందు కూసున్న షావుకార్లకు చేతినిండ దంద లేదు. షావుకార్ల నక్కజిత్తుల ముందు నిలువలేని రైతులు దక్కిందే చాలని పైసలు చేతులో వేసుకుపోతున్నారు.
గొడ్డుతో దల్సు, దల్సు తమ్ముడు రాము, మేకలతో పటేల్ అంగట్లకు వచ్చే సరికి సైకిల్ మీద కోళ్ళతో వచ్చిన సంఘం పాండు కలిసిండు. జోరలతో అంగడికి వస్తున్న రైతులు ఒకరొకరే మెల్ల మెల్లగా చేరుకుంటున్నారు. కలసినోల్లందరికి మీటింగ్ చేద్దాం ఉండమని సంఘం పాండు కబురు ఇస్తున్నాడు.
పొద్దు తిరిగింది. టైం రెండయిపోయింది.
అంగట్ల పని ముగించుకున్న రైతులు ఒకరొకరే నెమ్మదిగా ఒంటిమామిడి దగ్గరికి చేరుకుంటున్నారు. సంఘం పాండు అందరికన్నా ముందే అక్కడ చేరుకున్నడు. చీకటి గాకముందే ఊర్ల పడాలని రైతులందరూ తొందరపడుతున్నారు. ఆ తొందర గమనించి పాండు మీటింగ్ ప్రారంభించాడు.
“ఇంగో” అంటూ మొదలు పెట్టిన సంఘం పాండు జేబులో నుండి పొగ డబ్బీ తీసి అది ఖాళీగా ఉండేసరికి “పారీ” (బావా) అంటూ దల్సు వైపు చేయి జాపబోయాడు. అతని చేతిలో కూడా ఖాళీ డబ్బీ కనబడడంతో ఇద్దరూ ఒక నవ్వు నవ్వారు. రామడు అందించిన పొగాకు దౌడకు తోస్తూ అసలు విషయంలోకి దిగాడు పాండు.
“మూడేండ్ల నుండు కరువుంది. యేటింత యేటింత ఎక్కువై నెత్తిమీదికి వచ్చింది. ఆదుకునేటోడు లేకుండా పోయిండు. అప్పులిచ్చేటోడు పుట్టకుండా అయ్యిండు. ఏమన్న ఇంత ఉన్నోడు ఊళ్ళె ఉంటే మెల్ల మెల్లగా వాడు మన తీరే అయితుండు. ఈ కరువుల వెలసిపోకుండా ఉన్నోళ్ళు అంటే ఏమన్నగీ షావుకార్లే. నిరుడు సవాయి (వడ్డీ) లేకుండ తెచ్చుకున్న వడ్ల అప్పు పంట రాక ఎవరు కట్టనే లేదు. నొవ్వపోల్వకు ఉపాసం ఉండే రోజులొచ్చాయి. ఈ ఊర్లలో షావుకార్లు మాత్రం చెక్కుచెదరకుండ ఉన్నారు. గొడ్లు, మేకలు, కోళ్ళు హరొకటి ఈళ్ళకాడికే చేరుతున్నాయి. గంప నెత్తిల పెట్టుకొని మన ఊరూరు తిరిగిన ఈ షావుకార్లు ఇయ్యాల బలసిపోయిండ్రు. మనల్నే నమ్మకుంటయిండ్రు.
కూటికి లేకుండా, బట్టకు లేకుండా పోరగాండ్లు గొడగొడ ఏడ్వంగ రోజు గడవాలంటే గండం ఉన్నది. మొన్న కోడెకస దగ్గర ఉపాసం ఉండలేక ఆకలై ఇప్పకల్లు తాగిన లాలుమామ సొలగి బెరడు (నది)ల పడి చచ్చిపోయిండు. చెన్న గడ్డలు పడక కక్కుడేర్గుడు పెట్టి రిమ్మచ్చినోనికి రిమ్మవస్తే, పోయెటోని ప్రాణమే పోతుంది.
ఇట్ల చూసుకుంట ఉంటే కలువదని అందరం జమై బరిపోయి ఆర్జీ ఇచ్చినం. అదీజూసి వచ్చినోడు లేడు. అడిగినోడు లేడు. ఈ సర్కారోడేమన్న ఆదుకుంటడంటే “బుడ్డను నమ్మి ఈతకు పడ్డట్టయితుంది.” ఇగ మనమే విచారం చేయాలె.
అక్కడక్కడ ఉన్నోని ఇంట్ల మెత్తు తీయకుండా గుమ్ములల్ల విత్తులున్నాయి. ఇగ మందిని ముంచి పెద్దగయిన ఈ షావుకార్లు ఉన్నారు. పోరగాండ్లు, పెద్దాళ్ళు ఆకలికి చావడం మంచిది కాదు. గీ ఉన్న నా కొడుకులు ఎట్ల ఇయ్యరో చూడాలె. అడుగుదాం. ఇస్తే మంచిదే. లేకుంటే మనకు చాతనయినట్టు మనం కొంటపోతనే బతుకుతం. ఇది నా ఒక్కని విచారమే గాదు. మన అన్నలు గూడ ‘గంతే అయితది’ అంటుండ్రు.
మళ్ళీ అంగడి అంటే వచ్చేవారమే. ఈ వారం రోజులల్ల మనం మన పట్టిలున్న ఊర్లల్ల గట్టిగా ఉండేటోల్లందరికి కబురు ఇయ్యాలె. అందరం జమ కావాలె. ఎవరెటుపోకటో, ఏం చేసుడో ఆనాడే మాట్లాడుకుని పోదాం . ఇగ మీరే మంటరో చెప్పుండి” అంటూ ముగించాడు పాండు.
అక్కడ కూచున్న జనాల్లో “అందులో తప్పేముంది” “అలాగే చెయ్యాలి” అన్నట్లే ఉంది. ‘ఆకలికి మాడి మనం ఉత్త పున్నేనికి చావడం, ఉన్నోడేమో సుఖంగ ఉండుడు. ఇది మంచిదిగాద’నే అందరికి అర్థమైంది. ‘రెక్కలిర్సుకొని కష్టం చేసినా గిదే బతుకాయె. తిండి లేక హరిగోసాయె ఇగ ఏం చేసుడు’ అన్నదే వారందరి మనస్సులో మెదులుతుంది. గుసగుసలు ప్రారంభమైనయి. దగ్గరి దగ్గరి ఊర్లకు నువ్వు అంటే నువ్వు అని కబురు ఇచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా ఊర్లల్ల ఉన్నోళ్ళ లిస్టు, ఆ పట్టీలున్న షావుకార్ల లిస్టు చకచకా మొదట్లోకి ఎక్కుతుంది అందరికి బాధ్యతలు అప్పగించాడు పాండు. ముగ్గురు యువకులు లేచివచ్చి పాండు సరసన నిలబడ్డారు. ‘ఇది పోలీసు రాజ్యం లేచి అందరూ దారి పట్టారు.
దల్సు, రామ కాస్తా వెనుక బడ్డట్టున్నారు. పాండు దారికి ఎక్కేసరికి “మేమూ అటే” అంటూ వెంట నడిచారు.
అన్నలకు పాండు దగ్గరివాడని స్పష్టంగా అర్థమైన దల్సు మెల్లగా కదిలించాడు.
“దాడికి అన్నలొస్తరా – పారీ” (బావ లేదా వియ్యంకుడు)
“చెప్పుడు కష్టమే. మనం గట్టిగ ఉండాలెగాని ప్రతిదానికీ అన్నలే రావాలంటే ఎట్ల – అయినా మీ ఊరి వాళ్ళందరిని తెస్తరుకద మీరు” అన్న పాండు జవాబుతో తనకు కావలసింది లేదని దల్సు ఉసురుమన్నాడు. అన్నలు వస్తే బిడ్డ కలుస్తుందని ఆశ.
‘అది కాదు బావ. రాగో ఎట్లుంది” – అంటూ రామ అసలు విషయం లోనికి గుంజాడు.
“దాని రంధి విడిచి పెట్టుండ్రోయ్. దానికేం డోకాలేదు. ఏమైన అది గట్టిదే. పార్టీలోకి పోవడం మంచి పని చేసింది. లోకుల కోసం నిలబడుతుంది” అన్న పాండు మాటలతో దల్సు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.