నెట్టింట్ల గాదు, నట్టింట్ల
-డా. కొండపల్లి నీహారిణి
మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో
ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల !
అరాచక క్రియా విధ్వంసకాల్లో
అరచేతి అందాలబొమ్మగా గాదు
మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా!
నెట్టింట్లగాదు నట్టింట్ల ! మనోమందిర ప్రాంగణాన ,
మానవమాన తీరంపై నిలిచిన నావ సంసారసాగరానిదే గనక అయితే
మెత్తటిమాటై, గట్టి నిర్ణయమై
శక్తియుక్తుల నాన్నవై , వెరవని పనివై
నెరసిన తలలకు తల్లీదండ్రివై , ఈ నిరాదరణ అలల రాపిళ్ళనెదిరీదే
ఆదరణవూనీవై , తరగని అమ్మతనమూ నీవై,
ఇంటిగుట్టును రచ్చచేయని గోప్యమే నీవై,
ఏకాంతనిరీక్షణలకు వెన్నెల తాపడమై,
నలుగురినోళ్ళల్లో నానని మాటవై,
అభిమాన శరమువూ నీవై,
సమస్త యుద్ధభేరీ నాదమై,
ముప్పూటలతిండివై , పరిపూర్ణ శక్తివై,
అనురక్తివై, ఆదర్శమై,
ఓటమెరుగని ఓర్పువై,
చిటికెలపందిళ్ళ మగరాయుని మొరటునం తా
చిటికెనవేలున తొలగిస్తూ
చిరునవ్వులు వెలిగిస్తూ,
ఆత్మసంయోజన యోజనాలలో
కొలువలేని నాదానివై, కొలువగలిగే దూరానివై,
భార్యాభర్తలు, తల్లితండ్రులు ద్వంద్వ పదాల ఉభయపదార్థ ప్రాధాన్యానివై,
యుగాలన్నీ పొగడగలిగే మానస సరోవరానివై, ఊహాప్రవాహానికి అందంగా కట్టిన ఆనకట్టపై పొగడపూ చెట్టువై, పొన్నపూబుట్టవై,
నీ పిల్లలకు ఎల్లల్లా ఉల్లముల్లసిల్లే
వాక్కువూ నీవై ,రాయాల్సిన కావ్యానివై,
కుటుంబ పరిషత్తుకు స్వర్ణోత్సవానివిగా!!
ఇన్నీ నీవైన నీవు,
ఇంటినుండి బయటికెళ్ళాల్సిన
నీ బిడ్డకు చెప్పని పాఠానివీ గా !
పరాయి స్త్రీని పరమ నీచంగా చూసే
నీ పుత్రుడికి చెప్పాల్సిన గుణపాఠాని వీ గా!
పొసగని మాటవుగావు
పొసగే ఘాటు ప్రశ్నవు గా!!
ఆనందాలు దోచేసి, కృత్రిమత్వాన్ని అంటించే
నెట్టింట్లగాదు నట్టింట్ల
వెలుగువిగా
*****
నట్టింట్లో మనో మందిర ప్రాంగణాన ….వెలుగువు కావాలి…
నైస్ పోయెమ్ మేడం