ఎదురుచూస్తున్నా…!

-సుభాషిణి ప్రత్తిపాటి

అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..
నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,
ఆ దృష్టి దోషం తగలకుండా..
భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…
అవతరించాను అమ్మగా!
 
అడుగడుగునా ఆంక్షలముళ్ళు,
గుచ్చే దాహపుచూపుల రెక్కలు
కత్తిరించే అనలాయుధంగా …
అక్షరాన్ని ఆరాధిస్తూ 
ఆకాశమంత ఎదిగాను.
 
కఱకురాతి పయనం దాటి….
సహధర్మచారిణిగా సహగమించాను,
ఊడలమఱ్ఱి లా పాతుకుపోయిన
ఆ అహం ముందు
రాలని నా దుఃఖాశ్రువుల లెక్క తేల్చలేను,
నా మరోసగం మరమనిషని..
అర్థమైనా వెనుతిరుగలేని సనాతనం నా ప్రత్యణువులో…నిరతాగ్నిగా వెలుగుతోంది!!
 
అయినా…
అద్వైతం కోసం, 
కంచెలు లేని కలలసాకారం కోసం,
జ్వలించని,  కన్నీటి కడలిని మోయని కలికి కనుల కోసం,
కళ్ళు విప్పని నాటి నా ఆశయం కోసం…
ఆశల వాకిలి ముంగిట ఆశాజీవిగా…
కర్తవ్య దీపకళికనై
ఎదురు చూస్తున్నా!!
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.