రుద్రమదేవి-5 (పెద్దకథ)
-ఆదూరి హైమావతి
కొద్ది రోజుల్లోనే డుమ్మడు మెల్లి మెల్లిగా నౌకరీకి అలవాటు పడసాగాడు . మాణిక్యం సంతోషం పట్టతరంకాలేదు. ఆ సంతోషంలో సుబ్బుల్ని బాగా చూసుకోసాగింది. మామగారికీ సరైన సమయానికి అన్నం పెట్టడం వంటివన్నీ స్వయంగానే చూడసాగింది. లేకపోతే రుద్రకు కోపంవచ్చి తమ్ముడి నౌకరీ తీయించే స్తుందేమోని ఆమె భయం. డుమ్మడుకూడా చేతినిండా పని ఉండటంతో ఇహ సుబ్బులు జోలి కెళ్ళకుండా ఆమె కనిపించినా తల వంచుకుని పక్కగా వెళ్ళసాగాడు.
సుబ్బులు “రుద్రా! నీవేనే నిజమైన స్నేహితురాలివంటే! నీ ఋణం ఎలా తీర్చుకోను?” అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకుంది రుద్ర చేతులుపట్టుకుని.
“నా సమస్య ఎంత సులువుగా పరిష్కరించావు! ఇప్పుడు వాడు నావైపైనా చూడటంలేదు, వాడిపనేమో వాడేమో! పూర్తిగా మారిపోయాడు. మా వదిన కూడా ఎంత మారిందే రుద్రా! మా నాయనగారిని ఎంత బాగా చూసుకుంటున్నదో! నన్ను ఒక్కమాట అనటంలేదు తెల్సా?” అంటూ సంబరపడి పోయింది.
“సుబ్బూ! ఎవరికైనా పని చేసే బలం ఉండి, తగినపని దొరక్క పోతే ఇలాంటి వెధవ్వేషాలు వేస్తారు. ‘పని లేని మెదడు దయ్యాల కొంప‘ అవుతుంది. అందుకే వాడి రోగానికి తగిన మందు ‘పనే‘ అనుకున్నా. సమయానికి మా నాయనగారు ఒక పని వాని కోసం వెతుకుతున్నందున నా పనిసులువైంది. ఇక హాయిగా చదివి ఇంటర్ పూర్తిచేయ్.” అంటూ సుబ్బులుకు ధైర్యం చెప్పి పంపింది రుద్ర. .
“ఏయ్ రుద్రా ! నీకో కొత్తవార్త!” అంటూ ఉరుకులు పరుగులతో వచ్చిన వరం రుద్రని పట్టుకుని ఊపసాగింది..
“స్థిమిత పడు వరమ్మా! ఏంటంత కంగారు?” ఆశ్చర్యంగా అడిగింది రుద్ర.
“నీకు మరోసంస్కరణ పని పెడుతున్నాను. “ఆ రామప్పంతులు కసలు చదవనే లేదట! ఒక మోసగాడు ఆపల్లెలో బడిపెట్టి చదువురాని వీడికిమంచి దుస్తులు, తల పాగా కట్టి, అమాయకులైన ఆ పిల్లల తల్లి తండ్రులను మోసంచేస్తూ వారివద్ద దమ్మిడీలు ఫీజుగా తీసుకుంటూ పిల్లలచేత పని చేయింకుంటూ హాయిగా గడుపుతున్నాడు, తన జీతం 5రూకలని అసత్యం చెప్పాడు. ఆ అసలు పంతులు సగం తీసుకుని, మిగిలిన సగం ఈ నకిలీ గురువుకు ఇస్తున్నాట్ట !వాడేమో ఎక్కడో మంచి లాభదాయక మైన వ్యాపారం చేసుకుంటునాట్ట.!” అని గబగబా చెప్పి అలసట తీర్చుకోను ఆగింది వరం.
“ఓహ్! వాని వాలకం చూసి ఆరోజే మనం అనుకోలేదూ!. నోరు విప్పితే కంపుకొట్టే వీడేంపంతులని? సరే పదవాని పనిపట్టివద్దాం.” అంటూ,” అమ్మా! కొద్ది సేపట్లో వస్తాము” అంటూ సైకిలు పైన వరాల్ని ఎక్కించుకుని బయల్దేరింది రుద్ర.
ఆ బడి వద్దకు రాగానే మెల్లిగా సైకిలు స్టాండు వేసి లోపలికి వచ్చారిద్దరూ. పిల్లలంతా తాటాకులతో నిశ్శబ్దంగా ఏవో బొమ్మలు చేసుకుంటున్నారు. రామప్ప ప్పంతులుగారు నిద్రలోకి జారుకునిఉన్నారు. ఇద్దరు తాటాకుల విసినకర్రతో విసురు తుండగా మరోఇద్దరు ఆయన కాళ్ళుపడుతున్నారు. ఆ దృశ్యం చూసిన రుద్ర రౌద్రమూర్తే ఐంది.
పసిపిల్లలను బానిసలులాగా పనిచేయించు కోడమేకాక పువ్వుల్లాంటి వారి జీవితాలను చదువుకు దూరంచేసి ఇలా వారిబాల్యాన్ని వృధాచేస్తున్న రామప్పంతులు పై విపరీతమైన కోపం వచ్చింది. స్కూల్ కిటికీ వద్దకట్టి ఉన్నగంట గణగణా పెద్దగా మోగించింది. పిల్లలంతా గబగబా బయటికి పరుగు తీయగా , రామప్ప ప్పంతులు మాత్రం కంగారుగా కళ్ళుతెరచి లేచి” ఎవర్రాది? నేను చెప్పకుండానే గంట కొట్టింది? చేతులు జాపండి” అంటూ పేంబెత్తం తీసుకుని లేచాడు.
రుద్ర తన రెండు చేతులూ చాపి నిల్చుంది కొట్టమన్నట్లు. అక్కడ పిల్లలెవ్వరూ లేకపోడం రుద్ర, వరాలు మాత్రం ఉండటం చూసి కంగారుగా” ఏమయిన్రీ గుంట ఎదవలంతా!? నాకు తెలీకండానే గంట కొట్టిందెవుర్రా! రేపురాటంతోనే మీపనై పోతుండుండండ్రా! ఇయ్యాలింటి కెల్లిపోతార్రా! ఏవమ్మా యమ్మలూ! ఏటైంది వచ్చినారుమల్లా!?” అంటూ జారిపోతున్న పంచె పైకిలాక్కుంటూ ఇటూ అటూ చూడసాగాడు.
“ఏంలేదు పంతులుగారు! మాకు కాస్త ఒక లేఖ రాసిపెట్టాలి. మాకు అంతగా ఆంగ్లం రాదుకదా! మీరు దొరలకు తెలిసినవారు. పైగా వారివద్ద మంచి పలుకుబడి ఉన్నవారు. మావాడ పిల్లలకు ఒక బడి భవనం కట్టించమని ఆంగ్లంలో ఒకలేఖ రాసివ్వండి” అంటూ ఒక కాయితం, కలంతీసి బల్లపై పెట్టింది. వరం వచ్చే నవ్వు నాపుకుంటూ ముఖం పక్కకు తిప్పుకుని లోలోన నవ్వుకో సాగింది.
రామప్పంతులు కంగారుగా! “ఇప్పుడు ఎలా రాయను ..” అని అటూ ఇటూ ఇబ్బందిగా కదలసాగాడు.
“ఏఒ ఫరవాలేదు ఎంతో సమయం కాదుగదా? మీకు మేము విసినికర్రతో విసురుతుంటాం.” అంటూ విసినికర్ర తీసుకుంది రుద్ర. .
“ఇదుగోండి ఇలా కూర్చుని రాసిపెట్టరూ! పంతులుగారూ!” అంటూ వరాలు కుర్చీ బల్ల దగ్గరకు లాగింది.
రామప్పంతులు గజగజా వణుకుతూ” అమ్మాయమ్మలూ! నాకు ఆంగ్లబాష అంతగా రాదమ్మాయమ్మలూ! ” అంటూ తప్పించుకోబోయాడు.” పోనీ మీకొచ్చిన బాషలోనే రాయండి, లేకపోతే దొరలకు నే వెళ్ళి చెప్పుకుంటాను మీకు ఆంగ్లం రానే రాదని” అంది రుద్ర విసినికర్రతో ఆయన ముఖమ్మీదికి విసురుతూ.
గబుక్కునలేచి రుద్ర చేతులు పట్టుకుని” అమ్మాయమ్మలూ! తప్పైపోయింది, చమించెయ్! ఛమించెయ్! నాకసలు సదువేరాదు. ఏదో కాత్తంత సదువుకొన్నోరు దగ్గర ఇన్నమాటలు అతి కస్తంమ్మీద గుర్తులోంచుకుని ఇలా సులువుగా మోసం చేసి పైసలు సంపాదిత్తన్నా తప్పైపో నాది మన్నించమ్మాయమ్మా! ఆడు నే ఎంత సెపుతున్నా నాకు బయమేత్తుండాదంటున్న పరవాలే పరవాలే అని గడుపుతన్నడు , నే ఎల్లిపోత ఉండ నింక” అంటూ కాళ్ళబేరాని కొచ్చాడు.
“ఏమి పనిది? మనవారినే మనం మోసం చేయవచ్చా? ఆబిడ్డలకు చదువు చెప్పక పోగా కూలిపని చేసుకు బతికేవారి నుండీ దమ్మిడీలు దోచుకుంటావా? నీవీ ఊరువదలి వెళ్ళు . లేదా మాతోవచ్చి వాడలో మేం నడిపే బళ్ళో మేంచెప్పిన పనల్లాచేయి. నీ ఇష్టం ఈ బడి మాత్రం మూసేయాల. వీరిని మోసం చేస్తే ఇహమేం సహించం.” అనిబెదిరించాక “అమ్మా! ఈ చనమే బడిడిచి, కాదుకాదు ఈ ఊరిడిచి పందిళ్ళపల్లి కెల్లిపోతా మన్నించమ్మా! అమ్మాయమ్మలూ ఎవ్వురికీ సెప్పమాక. సంపేత్తరు.” అని ఆపాక వదలి వెళ్ళాడు.
రుద్ర అక్కడే కూర్చుని పంచాయితీ అధికారులకు ఆ ప్రాంతంలో ఉన్నపిల్లలకు ఒక స్కూలు ప్రారంభించమని ఒక లేఖ వ్రాసింది, వాళ్ళ నాయనగారితో కలసి స్పందన సభ్యులంతాచేరి ఆపల్లె వాసుల సంతకాలు సేకరించి, పంచాయితీ అధికారులకు ఇచ్చారు.
ఆ లేఖ సారాంశం తెల్సుకుని అక్కడ ఒక పాఠశాలను పంచాయితీ అధికారులు తెరిచి అక్కడి అమాయకులైన కూలివారి పిల్లలకు విద్యావకాశం కల్పించారు. అంతేకాక పాఠశాల ప్రారంభంరోజున వాడ లోను బడిప్రాముఖ్యతను , అక్కడి ప్రజల అవసరాలనూ గురించి తమ ‘స్పందన‘ సభ్యులందరితో కల్సివెళ్ళి పంచాయితీ అధికారులకు వివరించి వాడలోను ఒక బడి మొదలయ్యేలా చేయడంతో రుద్రకు కొంత వెసులుబాటు దొరికింది. అలా రుద్ర సమాజ సేవ చేస్తూనే కాలేజీ లో చేరిడిగ్రీ పూర్తి చేసింది.
“వరాలక్కా! వరాలక్కా! అమ్మ ఏడుస్తోంది. నీవిక్కడే ఉంటావని వచ్చాను. రాక్కా త్వరగా!” అంటూ చమటలు కక్కుతూ వచ్చాడు వరాలు తమ్ముడు వాసు.
“ఏంటిరా! అమ్మ ఏడవడమేంటి?” ఆదుర్దాగా అడిగింది తమ్ముడ్ని వరాలు.
“ఆ! అత్త ఏడుస్తోందా? ఎందుకువసూ! మీ నాయనగారు ఇంటలేరా?” అడిగింది రుద్ర.
“మా నాయనగారూ బాధపడుతున్నారు రుద్రక్కా! ఏదో టెలిగ్రాం వచ్చింది. అది చూడగానే ఇద్దరూ బాధపడుతున్నారు. నాకేమీతోచక నీకోసంవచ్చాను. రా వరాలక్కా! వెళదాం “అంటూ వరాలు చేయి పట్టి లాగసాగాడు వాసు.
‘అమ్మ ఏడుస్తున్న‘ దనేమాట వినగానే వరాలు మ్రాన్పడిపోయి ఏమీ మాట్లాడలేక పోయింది. అది గ్రహించిన రుద్ర,” పదండి వెళదాం! నేనూ వస్తాను మీతో, అమ్మా! అత్తను పలకరించి విషయం తెల్సుకు వస్తాను” అంటూ సైకిలు మీద ముందు వాసును, వెనుక వరాన్నీ ఎక్కించుకుని వేగంగా తొక్కుతూ బయల్దేరింది రుద్ర.
వరాలు ఇంటికెళ్ళే సరికి ముందు వసారాలో అరుగుపై కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్నది వరాలు తల్లి అరుంధతి. వరాలు నాయనగారు చెన్నకేశ్వరుడు చెక్క కుర్చీ పై కూర్చుని కళ్ళుమూసుకుని మూగగా రోదిస్తున్నారు. ఆయన కళ్ళ వెంటా నీరు వస్తున్నది. వారిద్దరినీ చూసిన రుద్ర, వరాలు గబగబా దగ్గర కెళ్ళారు . వరాలు తల్లి భుజాలు పట్టుకుని ఎదురుగా కూర్చుని “ఏమైందమ్మా?” అని అడుగగా, రుద్ర చెన్నకేశ్వరయ్య వద్దకెళ్ళి చేతులుపట్టుకుని” మామా! ఏమైంది? చెప్పండి..” అని అడగ్గా ఇద్దరూ బావురు మన్నారు ఒక్కసారిగా.
మగమనిషి అలా ఏడవటం చూసిన రుద్రకూ కన్నీరు తిరిగింది, ఎలాగో అపుకుని” మామా! చెప్పండి ఏమైందో తెలీక మాకు చాలాభయంగాఉంది, చెప్పండి మామా!” అంటూ ఆయన భుజాలుపట్టికుదిపింది.
“అమ్మా! రుద్రా!ఘోరంజరిగి పోయిందమ్మా ! ఘోరం జరిగిపోయింది. మీఅత్త అక్క పెద్ద కూతుర్ని ఘోరంగా చంపేశారమ్మా! వింటేనే గుండెపగిలిపోతున్నది.” అంటూ ఘొల్లున పెద్దగా ఏడ్వసాగాడు చెన్నకేశ్వరయ్య.
“నెమ్మదించి చెప్పండి మామా! ఎవరు? ఎవరు చంపారు?” అంది గాభరాగా రుద్ర.
“రుద్రా! నీకూ తెల్సుకదమ్మా! పెద్దత్త కూతురు ముత్యాలు, పెళ్ళికాక ముందు ఉగాది పండుక్కి వాళ్ళ తమ్ముడు ఇద్దరు చెల్లాయిలతో కలిసి ఇక్కడకు వచ్చి ఒక నెల పాటుండి వెళ్ళింది. వరాలంటే దానికెంత ఇష్టమో! అది నిన్నూ ఎంతో ఇష్టపడేది.’ ఆడపిల్లైనా ఎంత ధైర్యంగా ఉంది, అలా ఉండాలని నాకెంతో ఇష్టం చిన్నాయనా! కానీ ఇప్పుడు మారలేనుగా!’ అందమ్మా ముత్యాలు నిన్నుచూసి.” అని మళ్ళీ ఏడ్వసాగాడు చెన్నకేశ్వరయ్య.
“అసలేమైంది మామా! ఎవరు చంపారు ముత్యాల్ని? ఆమెకు క్రితం శ్రావణంలో పెళ్ళని మీరంతా వెళ్ళి వచ్చారు కదా! ఇంతా ఏడాదికానేలేదు? చెప్పండి మామా! ఎవరీ అకృత్యానికి పాల్బడ్డారు?” చెన్నకేశ్వరయ్య చేతులుపట్టి కుదుపుతూ అడిగింది రుద్ర. .
****
(ఇంకా ఉంది)
నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.