కథా మధురం
కిరణ్ విభావరి
తాను వెలుగుతూ..వెలిగిస్తూ.. దీపం లా బ్రతకమంటున్నకిరణ్ విభావరి ‘తప్పంటారా ?’ కథ!
-ఆర్.దమయంతి
ముందుకెళ్తున్న ఈ సమాజం – ఎంత వెనకబడి ఆలోచిస్తోందంటే.. స్త్రీ వస్త్రధారణ లోని లోటుపాట్లను ఇంకా లెక్కించడం లోనే మునిగిపోయుంది. ‘ స్త్రీ ఒంటి నిండా వస్త్రాన్ని ధరించడం ‘ అంటే, అది తప్పనిసరిగా చీరే అయి వుండాలన్న అపోహ నించి మనమింకా ఒక్క ఇంచ్ అయినా కదల్లేదేమో అని అనిపిస్తుంది. పైగా ధరించిన దుస్తులను బట్టి ఆ స్త్రీ పవిత్రురాలా?, కాదా? అని కూడా నిర్ణయించి, ఆమె కారెక్టర్ మీద స్టాంప్ వేస్తున్నారు కొందరు. – ఈ పోకడ ఎంతవరకు సమంజసమంటారు?
‘ఏయ్ అమ్మాయి. చేతుల్లేని జాకెట్టేమిటీ? బాక్ బటన్సెందుకు పెట్టించావూ? ఒంటి పొర పైట వేయకు. కుచ్చిళ్ళు నేలూడుస్తున్నాయి. పల్చబాటివి కడితే ఒళ్ళంతా బయటేసుకున్నట్టు లేదూ? కొంగు అలా వదిలేయకు. వెనకనించి ..ఆ..అలా చుట్టి..చీరకట్టులో దోపు. పక్కనించి పొట్టంతా కనిపిస్తోంది.చూసుకోలా? బయటకెళ్ళేటప్పుడు నైలాన్లు వొద్దు..జరీచీర కట్టమన్నానా లేదా? అయినా, బయట వాళ్ళకి చూపించుకోవడం అంటే నీకు మహ సరదాలే..’ ఈడ్చి చెంప మీద కొట్టినట్టు, చీర కట్టు లో సైతం స్త్రీని రాచిరంపాన పెట్టిన సంగుతులెన్నో వున్నాయి.
చీరలో కాకుండా ఏ ఆధునిక, మోడర్న్ దుస్తులు ధరించినా… ‘ఆమె శీలాన్ని సంశయించాల్సిందే ‘ అనే జ్ఞానాంధులకు, అవాకచవాకుల రమణీ మణులకు ఓ గట్టి పాఠం చెప్పే కథ – ‘తప్పంటారా?’
***
అసలు కథేమిటంటే :
దేవి తన దైన పంథాలో బ్రతుకుతుంటుంది. తన ఇద్దరి పిల్లల్ని వాస్తవ రీతులకు దగ్గరగా పెంచుతుంది. ఆడపిల్ల కి బయట పనులు, మగపిల్లాడికి ఇంటి పనులు నేర్పుతుంది. ఆమె ఇంటా బయటా పాంట్స్ టీ షర్ట్స్ ని ధరిస్తుంది. సరిగ్గా ఈ పోకడలే ఆమె మీది కథలు కథలు గా వైరల్ అవుతాయి. ‘ అందుకే కామోసు మొగుడొదిలేసాడు ‘ అనే లేబుల్ అతికించి మరీ చెప్పుకుంటున్న అమ్మలక్కల బాణాల్లాంటి మాటలు ఆమెని బాధిస్తాయి. వాళ్ళ దృష్టిలో ఆమె ఒక అనుమానితురాలు. అది సహించుకోలేని దేవి వాళ్ళముందు తనని తాను ఆవిష్కరించుకుంటూ..తెలిపే కథే – ‘తప్పంటారా!’
కథలో దేవి పాత్ర స్వభావ స్వరూపాలు :
పెళ్ళి నాటి వరకు దేవి ఓ మావూలు సాధారణ స్త్రీ. పెళ్ళైన కొత్తల్లో భర్త హజం అదో మేల్ ఇజం అని భ్రమిస్తుంది. కొన్నాళ్ళు సర్దుకుపోవడం లో మరి కొన్నాళ్ళు ఓర్పు పట్టడం లో..ఆ తర్వత కాలాన్ని ‘భరించడం’ లో రోజులు వెళ్లదీస్తుంది కానీ, రానురాను అతని శాడిజాన్ని తట్టుకునే శక్తి ఆమెలో పూర్తిగా నశిస్తుంది.
అతని నిజ స్వరూపం తెలిసొచ్చేసరికి ఆమె ఇద్దరి పిల్లల తల్లి అయిపోతుంది.
సరిగ్గా ఇలాటి పరిస్థితిలో చిక్కుకున్న దేవి లాటి స్త్రీలను చూసి ‘ తొందరపడి పిల్లల్ని కన్నది. లేకపోతే వాణ్ణి వొదిలేసే పనే..’ అంటూ కొందరు మాటలు విసురుతుంటారు.
ఆమె మాత్రం ముందుగా ఊహించిందా ఈ విపత్తుని? పిల్లలు పుట్టకుండా అరికట్టడానికా? అయినా అందుకు ఆమె ఒక్కర్తినే బాధ్యురాలు చేయడానికి సిగ్గేయదెందుకు?
పిల్లలు పుట్టాక అయినా మొగుడు మారతాడనుకుని వుండొచ్చు..లేదా..పిల్లలు పుట్టాక అతను మరింత శాడిస్ట్ గా మారి ఉండొచ్చు కదా? ఇలా అనుకుని ఆలోచించదెందుకు ఈ లోకం?
కట్టుకున్న వాడు కాలయముడని అనుభవపూర్వకం గా తెలుస్తున్నా కూడా ఒక పట్టాన నమ్మనీయని అమాయకత్వం ఆడదాన్ని నిలువునా ఆవహిస్తుందంటే -అందుకు బలమైన కారణం – వివాహ వ్యవస్థ మీద ఆమెకున్న అపారమైన నమ్మకం.
పుట్టింటి వాళ్ళు, అత్తింటివాళ్ళు, రక్త సంబంధీకులు, బంధువులు, స్నేహితులు.. అటువైపు వారు ఇటువైపు వారు ..అబ్బ..ఎంతపెద్ద పరివారమో! ఎంత బలగమో ఆడపిల్లకి.
ఇదంతా పెళ్ళి పందిరి వరకే పరిమితం.
కానీ, పెళ్ళి ఇలా ప్రాణాంతకమైనప్పుడు ..ఊహు. ఎవరూవుండరు. ఈ ఊబిలోంచి అమాంతం లాగిపడేసేందుకు ఒక్కరూ ముందుకు రారు. ఆమె ఒకర్తే.. ఒంటరి పోరాటం చేయాల్సిందే..తప్పదు.
కనులున్నందుకు కలలు తప్పవు. కలలున్నపుడు పీడ కలలు తప్పవు అంటాడు కవి.
ఆడపిల్ల కైనా అంతే. అమ్మాయి గా వున్నప్పుడు అందమైన ఊహలే కాదు.. అనూహ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒంటరి పోరాటమూ తప్పదు. అని చెబుతుంది దేవి పాత్ర.
‘ఇతను తన జీవన నావికుడు ‘ అని నమ్మిన మొగుడు రోజుకో ప్రళయాన్ని సృష్టిస్తుంటే ఎటు దూకాలి? సముద్రం లోకా? ఒడ్డు వైపుకా? అనే జీవన్మరణ ప్రశ్న ఎదురైనప్పుడు – దేవి – ఒడ్డునే ఎంచుకుంది. పిల్లలతో సహా కాలువ చెరువుల్లో దూకి ప్రాణాలు తీసుకుందామనుకునే అభాగినీలకు కొండంత ధైర్యాన్ని నూరిపోస్తుంది. పిచ్చి తల్లుల్లారా ఇకనైనా..పిల్లల తో కలిసి చావడం కాదు, బ్రతకడం నేర్చుకోమ్మంటూ దగాపడ్డ తల్లులకు సందేశానిస్తుంది – దేవి.
మగాడు శాడిస్ట్ గా మారడం వెనక మనకు తెలీని, వెలుగు చూడని అనేక కారణాలు పేనుకునుంటాయి. తల్లి, తండ్రి పెంపకం లో సంస్కార లోపం, ‘నువ్వు మగాడివి..ఏం చేసినా చెల్లుతుందీ అనే ధోరణిని నరనరానకెక్కించడం..ఇంటి వాతావరణం..ప్రేమ రాహిత్యం తో బాటు ముఖ్యం గా బాధ్యతలను నేర్పకపోవడం..కష్టం అంటే ఏమిటో తెలియనీయకపోవడం.. బంధాల విలువల పట్ల, కుటుంబ ప్రాధాన్యత పట్ల అవగాహనా జ్ఞానం శూన్యమైపోవడం..నేర ప్రవృత్తికి అలవాటుపడిపోవడం..వొంటి మందాన బద్ధకం.. పని దొంగలా మారడం..తాగుడు, జూదం, పరస్త్రీ వ్యామోహం వంటి విలాసాలకి మరిగి ఇంట్లో బంగారం..డబ్బు దోచుకెళ్ళడం.. సర్వనాశనం చేయడం..ఇవ్వనంటే హింసించడం.. ఇలా జరుగుతుంది.
చివరకి ఆతని శాడిజం ఎంత వరకు దిగజారుతుందంటే భార్యని హింసించకపోతే క్షణమైనా ఊపిరాడని రాక్షసత్వానికి దిగజారిపోయేంతలా! ఈ లక్షణాల చేతే కొందరు రేపిస్ట్ లు గా మారడం, స్త్రీ శరీర భాగాలను బ్లేడ్ తో చెక్కడం, చాకుతో గీరడం, కట్ చేయడం, సున్నిత ప్రదేశాల మీద సిగరెట్టు తో కాల్చడం..యాసిడ్ దాడులకు పాల్బడటం వంటి అతి కిరాతకమైన హింసలకు తెగబడతారు.
అందుకే అంటుంది దేవి, ప్రతి తల్లీ మగపిల్లాణ్ణి మరింత శ్రధ్ధ గా.. తనలా పెంచితే స్త్రీని మగాడి హింసలనించి రక్షించవచ్చు అని మనవి చేస్తుంది.
మగ పిల్లాడికి ఇంటిపనులు, వంట పనులు, ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతికి, ఆరేసి, మడతలు పెట్టడం, హౌస్ మేనేజ్ మెంట్ తో బాటు..ముఖ్యం గా ఆడపిల్లలని గౌరవించి మాట్లాడం నేర్పాలహో అంటూ లోకానికి చాటి చెబుతుంది. చాటింపు వేసి మరీ చెబుతుంది.
ఈ రోజుల్లో ఆడపిల్లకి భద్రత లేదు. పుట్టిన పసికందు నించి ..పండు ముదుసలి వరకూ స్త్రీకి భద్రత లేని కీడు రోజులొచ్చిపడ్డాయి. అందుకే స్త్రీ తాను బ్రతికున్నంత కాలమూ తనని తాను రక్షించుకునే శిక్షణ నివ్వడం ఎంతో అవసరమంటూ.. హెచ్చరిస్తుంది.
ఈ ప్రపంచం లో ఇవి ‘ఆడపనులు’..ఇవి ‘మగపనులంటూ’ వుండవు. ఇద్దరి పనులూ ఇద్దరికీ ఖచ్చితం వచ్చి వుండాలి. వాటిని నేర్పాల్సిన బాధ్యత ముఖ్యం గా తల్లి మీద వుందంటూ అది తను నిర్వర్తిస్తున్నట్టు చెబుతున్నప్పుడు దేవిలో ఒక ఆదర్శ మాతృమూర్తి కనిపిస్తుంది.
ఇక తాను ధరించే దుస్తుల గురించి ఏ మొహమాటమూ లేకుండా నిజాలను వెళ్ళ గక్కుతుంది.
చీరలు తప్ప తను అన్ని రకాల డ్రెస్సులూ ధరిస్తానంటుంది. చూసే వారికెలా వుంటానో అనే సందేహం కన్నా, తన సదుపాయమే తనకు ముఖ్యమని నిర్మొహమాటం గా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది.
అసలివన్నీ ఎందుకు చెబుతున్నట్టు ?
ఇంత ధైర్యవంతురాలు అయిన దేవి, ‘ చుట్టూ వున్న వాళ్ళకి భయపడాలా? జవాబు దారి కావాలా? అవసరం లేదు. నా జీవితం నా ఇష్టం. నా పిల్లల పెంపకం నా ఇష్టం. ఇష్టముంటే మాట్లాడండి. లేకపోతే ఫొండి. ఐ డోంట్ కేర్..’ అని దేవి ఎందుకు అనుకోలేక పోయిందంటే –
మనిషి సంఘ జీవి. తనని, తన జీవన సిద్ధాంతాలని సమాజం చిన్న చూపు చూసినప్పుడు తట్టుకోలేడు. ఎలా అయినా సమాజం చేత అంగీకరించబడాలని గాఢం గా విశ్వసిస్తాడు. అందునా, తరతరాల చాందస మూఢభావాలను అణగ దొక్కి, ఒక ఆధునిక జీవన విధానాన్ని తన ద్వారా ప్రవేశపెడుతున్నప్పుడు ఆ వ్యక్తి పదిమంది సమ్మతిని పొందడం, అంగీకరించడం, మెప్పుపొందడం అనేది – అదొక నైతిక విజయం.
చెబుతున్న పాఠం విద్యార్ధులందరకీ అర్ధమైతే ఆ టీచర్ పొందే ఆనందం ఎలాటిదో.. తన చుట్టూ వున్న వారికి తన నూతన విధానాల పట్ల అవగాహన కల్పించడంలో కూడా అంతే ఆనందం వుంటుంది వ్యక్తికి.
ఏదేని కొత్త మార్పు ని వివరిస్తే – జనం విని వదిలేయొచ్చు. ప్రదర్సిస్తే చూసి మరచిపోవచ్చు. కానీ, ఒక ప్రయోగాత్మక విధానం ద్వారా మైండ్ సెట్ లో మార్పు తేగలిగితే విజయం సాధించినట్టే!
దేవి కూడా సరిగ్గా ఆకోవకి చెందిన స్త్రీ గా మనకిక్కడ కనిపిస్తుంది.
మహా భారతం లో అయినా, మన భారతం లో నైనా జీవితంలో మనిషికి యుద్ధం తప్పదు. గెలిచినా ఓడినా సమరం లో పాల్గొనాల్సిందే.
దేవి కూడా యుద్ధం చేసింది. గెలిచింది. కానీ, కొందరు మన గెలుపు ని ఓ తప్పిదమైన ఆట గా ప్రచారం చేస్తారు. అలాటి వారిని ఉపేక్షించకు..నిన్ను నువ్వు నిరూపించుకో మని హితవు చెబుతుంది – దేవి.
నిజమే. నిన్ను నువ్వు గౌరవించుకుంటే..పదిమంది చేత గౌరవింపబడతావ్..అనే కొటేషన్ కి నిలువెత్తు అర్ధం లా..అద్దం లా నిలిచే పాత్ర లో దర్శనమిస్తుంది దేవి.
అయితే సత్య నిరూపణలో సైతం ఆమె తనదైన పంథానే అనుసరిస్తుంది.
అదేమిటో కథ చదివి తెలుసుకోవాల్సిందిగా మనవి.
రచయిత్రి గురించి :
కిరణ్ విభావరి ఆలోచన్ల్లో కొత్తదనం కొట్టొస్తూ కానొస్తుంది. నూతన కథాంశాలతో రొటీన్ కి భిన్నంగా కథలు రాస్తున్న కిరణ్ విభావరి ప్రస్తుతం తాను చదవడం లో బిజీగా వున్నానంటారు. ‘సాహిత్యాన్ని ఎంతో చదవాలి..మరెంతో నేర్వాలి ‘ అనే తపన ఒక తపస్సు లాంటిది. కిరణ్ తపస్సు ఫలించి మధురమైన స్కథా ఫలాలను అందించాలని అభిలషిస్తున్నాను.
అడిగిన వెంటనే కథనందచేసినందుకు నెచ్చెలి తరఫున రచయిత్రికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ.. వచ్చే నెల మరో కథా మధురంతో మీ ముందుంటాను. సరేనా!?
అందరకీ శుభాకాంక్షలతో..
– ఆర్.దమయంతి.
*****
తప్పంటారా!!
– కిరణ్ విభావరి
బట్టలు ఆరేయడానికి ఢాబా మీదకు వెళ్ళిన దేవి ఎవరివో మాటలు వినిపిస్తుంటే, గోడ చాటున ఆగి, చెవులు రిక్కించి వింటోంది. అస్పష్టంగా ఉన్నా ఆ మాటల మధ్యలో ఆమె పేరు మాటమాటకీ వినిపిస్తుంటే, జాగ్రత్తగా వింటూ, దగ్గరగా జరిగింది.
“ఏంటండీ మరీ పైత్యం కాకపోతే, మగపిల్లాడితో అన్ని పనులూ చేయిస్తుంది. వాడు టాయిలెట్స్ క్లీన్ చేస్తాడు. ఆవిడ బట్టలు ఆరవేస్తాడు. ఇల్లు తుడుస్తాడు. తల్లీ కూతుళ్ళు మాత్రం బయట పనులు చేసుకుంటూ మగరాయుళ్ళా బతుకుతారు. వాడ్ని ఆడంగి వెదవని చేసి పడేశారు. కూతుర్ని మగ రాయుడులా పెంచుతున్నాది. మొన్న మా వాడి చెయ్యి పొరపాటున ఆ పిల్లకు తాకిందని ఇంటికొచ్చి నానా యాగీ చేసి పోయింది. ఎవరైనా ఆడపిల్లను అలా పెంచుతారా?”
“నా కూతురే కానీ అలా ఉంటే కాళ్ళు విరగొట్టి ఇంట్లో కూచో పెడతా. అంతే గాని మగ పిల్లల మధ్యలోకి పొట్టి బట్టలు వేసి పంపిస్తామా ఏంటి? ” అని ఒక బొంగురు గొంతు వినిపించింది.
ఆమెకు వంత పాడుతూ మరో ఆడమనిషి, “మరే.. ఆవిడ వాటం చూసారా? జుట్టు విరబోసుకుని , లెగ్గిన్లు, కుర్తాలు వేసుకుని బయటకు పోతుంది. ముఖాన బొట్టు గానీ, చేతికి గాజులు కానీ ఉండవు. అసలావిడ చీర కట్టడం నేనెప్పుడూ చూడలేదు. ఒక వ్రతం ఉండదు.. పూజలుండవు. పేరుకు మాత్రమే దేవి. చేసే చేష్టలు దెయ్యానివి…” మళ్ళీ పెద్దగా నవ్వులు.
“ఇలాంటి బాగోతాలు పడలేకే మొగుడు వదిలేసి ఉంటాడు. అయినా ఇలాంటి వాళ్ళకి మొగుడుతో పనేంటిలే? బయట మొగుళ్ళు వుంటారుగా” మరో మనిషి కంఠం వినిపించింది.
దేవికి వొంటి మీద తేళ్లు, జేర్రెలు పాకుతున్నట్టు ఉంది. ఇలాంటి ద్వంద్వ వైఖరి మనుషుల మధ్యనా తాను ఉంటోంది అని మధన పడింది. మనసంతా చేదుగా అయిపోయి, వాళ్ళని చూస్తే కోపాన్ని అదుపు చేసుకోలేనేమో అని వెనుదిరుగుతుంటే, ఒక మాట విని చప్పున ఆగిపోయింది.
“నువ్వు కూడా మొగుడ్ని వదిలెయ్యవే’ అని సలహా ఇచ్చిందమ్మ! నేనేం మాటాడకుండా గమ్మున వచ్చేశాను.” అంటోంది ఓ గొంతు. ఎవరది? ఇదేదో బాగా పరిచయం ఉన్న కంఠమే కదూ?. .. ‘ ఆ! పనిమనిషి దుర్గ కదూ!’ గుర్తుపట్టింది. ఎంత ప్రేమగా ఉంటుంది తనతో. ‘అసలు అమ్మగోరు ..అమ్మగారూ.. మా సచ్చినోడు రాత్రి బాగా తాగొచ్చి..’ అంటూ తన చుట్టే తిరుగుతూ, ఆ విషయం ఈ విషయం అన్నీ ఊదేసే దుర్గ కూడా తన వెనుక ఇలా మాట్లాడుతుందా!!’ – జీర్ణించుకోలేక పోయింది.
మనుషులంటే విరక్తి చెందిన ఆమె మనసు, వీళ్ళ మాటలు విని ఏవగించింది.
అంతలోనే తనని తాను నిభాయించుకుంటూ..అయినా ఇలాంటి వాళ్ళ మాటలకు భయపడి తానెందుకు కుమిలిపోవాలని అనుకుంటూ.. ఏమీ ఎరగనట్టు వాళ్ళ ముందు నుంచి వెళ్ళి, తడి బట్టలు ఆరేసుకునే పనిలో పడింది.
హఠాత్తుగా ఆమెను చూసి వాళ్ళు ఖంగు తిన్నారు. తమ మాటలు గానీ విందేమో అనే సంశయంలో పడిన ఆ నలుగురూ కుక్కిన పెనుల్లా అవాక్కయి చూస్తున్నారు.
పనిమనిషి దుర్గ తేరుకుని, “ఇటివ్వండి అమ్మగారు, నేను ఆరబెడతానని ” దేవి చేతిలోని బట్టలు తీసుకుంది. దేవి కూడా ఏమీ ప్రతిఘటించలేదు. దుర్గకు బట్టలిచ్చి, మిగతా వారిని చిరునవ్వుతో పలకరించింది.
“వంట అయ్యిందా అక్కయ్య గారు.. ” అంటూ తన కూతురు చితగొట్టిన యువకుడి తల్లిని పలకరించింది. “హా! అయ్యింది దేవి! ఇదిగో ఈ బట్టలు పని అయిపోతే కొంచెం సేపునడుం వాలుస్తా.” అని సమాధానం ఇచ్చిందామె.
“అవునా.. మీ పనులు అయిపోతే ఒకసారి మా ఇంటికి వస్తారా? మీతో ఓ ముఖ్యమైన సంగతి చెప్పాలి. మీరూ వస్తారు కదూ” అని అక్కడున్న ఆడవాళ్ళందరినీ ఆహ్వానించి తన గడప వైపు అడుగులేసుకుంటూ వెళ్ళింది.
‘ఎందుకు పిలిచిందబ్బా? ఇంట్లోకి పిలిచి మొహం వాచేలా నాలుగు చివాట్లు పెట్టి పంపించదు కదా? అసలు విని వుండదులే. వింటే అంత కూల్ గా ఎలా మాట్లాడుతుందని? ఇలా తర్జనభర్జనలాడుకుని.. కొంతసేపటికి ఆమె అడిగినట్టే అందరూ కట్టకట్టుకుని కలిసి వచ్చారు.
****
వచ్చిన వారిని కూర్చోబెట్టి శీతల పానీయాలు అవీ ఇచ్చి, ఇక అసలు విషయం మొదలు పెట్టాలని, గది తలుపు వేసింది.
ఆమె తలుపు వేసి ఏం చేస్తుందో అని గుటకలేసారు. కొంచెం బెరుకుగా కొంచెం ఆశక్తిగా చూస్తున్న ఆ ఆడవాళ్ళు ఆమె చర్యకి కెవ్వుమనబోయి ఆగారు.
ఆమె తను వేసుకున్న నైటీ ని విప్పేసింది వొంటి మీద కేవలం బ్రా, పాంటీ మాత్రమే వున్నాయి. అలా చూసే సరికి స్థాణువౌతూ.. “ఏంటి దేవి ఏం చేస్తున్నావ్? ” అని అడిగారు కంగారుగా అడిగారు.
“మీకు నిజాల్ని చూపిస్తున్నా అక్క. నా జీవితంలో జరిగిన దారుణాలను చూపిస్తున్నా. స్త్రీ అంటే ద్వితీయ శ్రేణి ప్రాణి అనే చులకన అనే భావానికి పెద్ద సాక్ష్యాన్ని చూపిస్తున్నా.. జాగ్రత్తగా చూడండి. ఇవిగో! ఈ తొడల మీద నల్లని సిగరెట్ మచ్చలు. స్థనాల మీద, బొడ్డు కింద సున్నిత ప్రదేశాలను చూపిస్తొ..’ఇవి పదునైన బ్లేడ్ గాట్లతో అతడు పొందిన పైశాచిక ఆనందానికి గుర్తులు. వికృతమైన రీతిలో అతని కోరిక తీర్చలేదని ఇదిగో చూడండి. నా వీపు మీద అతడు అగ్గిపుల్లనంటించి పెట్టిన వాతలు.. చూడండి..” అంది ఆవేశం, ఆవేదనా, దుఃఖం కలిసిన గొంతుతో!
వాళ్ళు నోళ్ళు తెరుచుకుని చూస్తుండిపోయారు భీతి నిండిన కళ్ళతో!
“నా బిడ్డలు వాడి బారిన పడకుండా రక్షించుకోవడం కోసం వదిలేసాను. ఆ ఉన్మాదిని ఎదిరించి, వదిలేసాను. అతన్ని పోలీసులకు అప్పగించి వచ్చాను. అది నేను చేసిన తప్పంటారా? చెప్పండి. దేవి సూటిగా ప్రశ్నించింది.
అక్కడున్న ఆ నలుగురు మూగ బోయి, సిగ్గుతో తల దించుకున్నారు. మళ్ళీ ఆమెనే చెప్పడం మొదలు పెట్టింది.
“నా కొడుకు కూడా తన తండ్రిలా మారకూడదు అని, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం లేదనీ, ఇద్దరూ సమానమే అని, స్త్రీని గౌరవించడం నేర్పిస్తున్నాను. ఇది తప్పంటారా?
ఇంటి పనులు అంటే ఆడదే చేయాలని, మగాడు చేస్తే నామోషీ అని, చేస్తే వాడు ఆడంగి అనే అపోహలకు తావివ్వకుండా..స్వతంత్రంగా జీవించడం నేర్పించడం నా తప్పంటరా?
ఇప్పుడు నా కొడుకు నేను లేకున్నా తన పని తాను హాయిగా చేసుకుంటూ బతకగలడు. పెళ్ళయ్యాక భార్యని అర్ధం చేసుకుని, ఇంటి పనులను పంచుకుని చేయగలడు..నా కోడలికి మంచి భర్త కాగలడు అనే నిశ్చింత నాకుంది. మీకుందా? మీ పిల్లలు ఎంత మంది అలా ఉన్నారు? మా వాడు పై చదువులకోసం అమెరికా వెళ్తున్నాడు. వాడి తిండి గురించి, ఆరోగ్యం గురించి నాకిప్పుడు ఏ బెంగా లేదు. ఇలా పెంచడం తప్పంటారా?
మగరాయుడు అంటూ మీరు పిలుస్తున్న నా కూతురు నాలాగా హింసలు , అకృత్యాలు సహిస్తూ, ఆడదంటే సహన శీలి అని కాకుండా ఆడదంటే ఆడపులి అని తెలిసేలా పెంచుతున్నా. ఇది తప్పంటారా? చిన్న చిన్న ఎలెక్ట్రికల్ రిపైర్స్ నించి కారు మెకానీజం వరకు దానికి నాలెడ్జ్ వుంది. వ్యాయమంతో బాటు స్వయంరక్షణ లో భాగంగా కరాటేలో శిక్షణ ఇప్పించాను. స్పోర్ట్స్ గాల్. ఏ రాత్రి అయినా అది ఇంటికి సురక్షితంగా రాగలదు. ఇలా పెంచడం తప్పంటారా ఆడపిల్లని?
తమతో అసభ్యంగా ప్రవర్తించిన వారి పని పట్టి, మక్కెలిరగదన్నే దమ్ము..ధైర్యం ఆడపిల్లకు నేర్పిస్తున్నా..తప్పంటారా?
పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో ఆడ మగ తేడా ఏమిటి?
దేవి కన్నీళ్ళ పర్యంతం అవుతూ సూటిగా ప్రశ్నించింది.
వాళ్ళేం మాట్లాడలేకపోయారు.
“ఇక నా దుస్తల విషయానికొస్తాను. ఏం, ఎందుకు ఆడవారికే మాత్రమే వారి వస్త్ర ధారణ మీద ఇన్ని ఆంక్షలు? పెళ్ళైతే చీరలే కట్టాలా? చీరల కన్నా కుర్తీలే శరీర భాగాలను పూర్తి గా కప్పేసేవే కాదా? అయినా నాకు సౌకర్యంగా.. ఉండే బట్టలు నేను వేసుకోవడం తప్పంటారా? – నా కంఫర్ట్ నాకు ముఖ్యం. కాదంటారా చెప్పండి. దాని గురించి కూడా మీ హేళనలు, విమర్శలు అవసరం అంటారా?
కొన్ని శతాబ్దాలుగా ‘ ఆడదంటే ఇలా ఉండాలి… అలా ఉండాలి ‘అనే కట్టుబాట్ల మధ్యలోనే బతికేసాం. కాదు. మగ్గాం. ఇప్పుడిప్పుడే స్వేఛా గాలులను ఆస్వాదిస్తున్నాం. మనం ఆడవాళ్ళం. మరి మనకు మనమే అండగా లేకుండా.. కువిమర్శలు చేసుకుంటూ ఉంటుంటే, భవిష్యత్తు మాటేమిటి? ముందు తరానికి ఏ సందేశమివ్వగలం అంటారు?
వారికీ ఇదే నేర్పిద్దామా?
నువ్వు ఆడదానివి కాబట్టి అణిగిమణిగి ఉండాలి. నువ్వు మగవాడివి కాబట్టి నీ ఇష్టా రాజ్యంగా ఆడవారితో ప్రవర్తించవచ్చు అని..మనకి మనం అన్యాయం చేసుకుందామా?
ఒకవేళ నా స్థానంలో మీ బిడ్డలు ఉంటే , నాకు జరిగినట్టే వారికీ జరిగితే ఏం చేస్తారు. మన పిల్లలకి ఆడ, మగ అనే భేదం లేకుండా పెంచితే , వివక్షను రూపుమాపడం సాధ్యం కాదంటారా?
నాకు సాధ్యమే! అలా నా పిల్లల్ని పెంచుతున్నందుకు నాకు గర్వం గానే వుంది. కానీ.. మీ భాషలో బరితెగించిన దానిలా మీ ముందు ఇలా ..నిలబడి, మీరు వేసుకునే కుళ్ళు జోకుల్లో భాగం అవుతున్నాను..చూడండి..ఇదే విషాదం! అందుకు బాధ పడుతున్నాను.
నరం లేని నాలుక ఎన్నయినా మాట్లాడుతుంది. కానీ మనకు మనస్సాక్షి అనేది ఉంది కదా అక్క.. ఇప్పుడు చెప్పండి..నేను చేసింది తప్పంటారా??
ఆమె దుఃఖాన్ని ఆపుకోలేని దానిలా రెండు చేతుల్లో ముఖం దాచుకుంది.
రాళ్ళల్లో కూడా నీళ్ళుంటాయి అన్న చందాన దేవిని ఆ పరిస్థితిలో చూసిన వాళ్ళ మనసులు కరిగాయి. తమ అపోహలకి, అబాంఢాలకి, కుసంస్కార మాటలకి సిగ్గుపడ్డారు. వెంటనే కదిలి, ఆమెని అక్కున చేర్చుకుని, ఓదార్చారు. తమను క్షమించమని అడిగారు.
ఆమె అనుసరిస్తున్న విధానాలలో ఎలాటి తప్పు లేదని, ఆమె ధైర్యాన్ని పొగుడుతూ.. తమకీ ఒక దారి దొరికిందనీ అని ప్రశంసించారు.
తన తెగింపు వారిలో మార్పు తేవడంతో, దేవి మనసూ కుదుట పడింది.
***
కిరణ్ విభావరి పరిచయం :
నా గురించి నేను :
నా అసలు పేరు కిరణ్. విభావరి నా కలం పేరు.
నేను ఇప్పటి వరకూ 30 కథలూ, 4 కవితలూ రాశాను.
నేను రాసినవి నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావిస్తాను. అందులో ణాటా, ణాట్శ్, జాషువా కవితా పురస్కారాలను ప్రముఖంగా చెప్పుకోవాలి.
కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, సినీ వాలి పత్రిక పోటీలో మరియు విశాలాక్షి, కథా మంజరి, సాహో పోటీలో ప్రథమ బహుమతి, మొం’స్ప్రెస్సొ mom’spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను.
నా కథలు పలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన ‘కాఫీ పెట్టవూ’ కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, ప్రముఖ ఎఫ్ ఎం రేడియో, అల్ ఇండియా రేడియో లో ప్రసారం అవడం ఒక మరపురాని అనుభవం. అపూర్వ జ్ఞాపకం.
నా అభిమాన రచయితలంటూ ఎవ్వరూ లేరు. బట్ ఇష్టమైన రచనలు చాలా ఉన్నాయి. అయితే సాహిత్యం కోసం విశిష్ట కృషి చేసిన కొందరు రచయితలు అంటే చాలా అభిమానం. కారా మాష్టారు, అట్టాడ అప్పల నాయుడు గారు, కుప్పిలి పద్మగారు అంటే ఓ ప్రత్యేకాభిమానం.
రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కథలు అంటే చాలా ఇష్టం. ప్రాణం.
ప్రస్తుతం కొత్త కథాంశాలను అన్వేషిస్తున్నాను. సాహిత్య పఠనం లో నిమగ్నమై వున్నానని చెప్పాలి.
ఇదీ క్లుప్తంగా నా గురించి, నా రచనా వ్యాసాంగం గురించీ!
***
ఆర్.దమయంతి
పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడమూ మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశంవుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.
కథ కాని కథ, ఈ కథ ఎందుకు నచ్చిందంటే, నేను చదివిన కథ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు.
ప్రస్తుతం ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.
వీక్షణం (బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ0, తెలుగు జ్యోతి (న్యూజెర్సీ ) వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.
రచయిత్రి ప్రస్తుతం – నార్త్ కరొలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.
కిరణ్ విభావరి గారు ఇప్పుడే సాహిత్యంలో పైకి వస్తున్న యువ రచయిత్రి. సమస్య ను సమస్యలా చూపించగల నేర్పు, చొరవా రెండూ ఉన్నాయి. ఇంకా మంచి కథలు అందించాలని అభిలషిస్తూ.. చక్కని విశ్లేషణ తో పరిచయం చేసిన దమయంతి గారికి,రచయిత్రి కి అభినందనలు.
thanksamDi suneeta gaaru.
Thank you సునీత గారూ ❤️❤️