బసవేశ్వరుని జీవితంలో ఆప్త మహిళలు
-రాజేశ్వరి దివాకర్ల
బసవేశ్వరుడు తలపెట్టిన, సామాజిక,ఆర్థిక, ధార్మిక ప్రగతికి ఆతని ఇల్లే కార్యక్షేత్రం అయింది. ఆతని ఆశయ సిద్ధికి, భార్యలైన గంగాంబిక, నీలాంబిక, ఆతని సోదరి అక్క నాగమ్మ అండగా నిలిచారు. ఆనాటి విప్లవ నాయకుని జీవితంలో ఈ మూవురు మహిళలు పోషించిన పాత్ర అసమానమైనది.
బసవేశ్వరుడు శరణులకు సమకూర్చిన “మహామనె” (మహాగృహం)లో ప్రతి రోజు లక్షా తొంభై ఆరువేల జంగములకు సత్కారం జరిగేది. వారికి పై ముగ్గురు వండి వడ్డించే వారంటే అది సామాన్య విషయం కాదు. అంతేకాక వారు సాహిత్య సృజనలో పాలుపంచుకోవడం మరొక విశేషం. వీరు ముగ్గురూ తమ వ్యక్తిగత జీవితాన్ని గురించి తమకు సంబంధించిన వ్యక్తులను గురించి అరమరిక లేక చెప్పుకున్నారు. వాస్తవాంశాల కు రమణీయ భావకల్పన కావించారు.
గంగాంబిక కలచూరి బిజ్జలుని మహామంత్రి బలదేవుని కుమార్తె. నీలాంబిక బిజ్జలుని సoరక్షణ భారాన్ని వహించిన సిద్దరసుని కుమార్తె. బలదేవుడు, సిద్దరసుడు,ఇరువురూ బసవేశ్వరుని తల్లి మాదలాంబికకు సోదరులు. బసవన్నకు మేనమామలు. గంగాంబిక, నీలాంబికలు సంపన్న గృహాల నుండి వచ్చిన యువతులైనా అహంభావమన్నది లేక పతిభక్తిని సంపూర్ణంగా పండించుకొన్నారు. పతి నిర్దేశించిన “కాయకమే కైలాసం ” అన్న సూక్తిని ఆచరణలో చూపించారు. గంగాంబిక, నీలాంబికలు, సవతులవలెకాక అక్కా చెల్లెళ్ళ వలె మెలిగారు.
గంగాంబిక నీలాంబికలలో గంగాంబిక సాహస గుణం కలిగినది. ఆమె పతికి ఉద్యమ సాధనలో వెన్ను దండగా నిలిచింది. నీలాంబిక అపారమైన దైవభక్తిని కలిగి “నిజభక్తి నీలాంబికగా” ప్రసిద్ధురాలయింది. నీలాంబిక అద్భుత సౌందర్య రాశి. సంగీత నిష్ణాతురాలు. బసవన్న తన వచనంలో “పృధ్వికగ్గళదచె
గంగాంబికకు సంతానం కలుగలేదు. స్త్రీ సహజమైన మాతృ కాంక్షను వెలిబుచ్చిన గంగాంబికను బసవన్న ఊరడించి, జ్ఞాన నిధియైన చెన్న బసవన్నను బిడ్డవలె చూసుకోమంటాడు. గంగాంబిక భర్త కార్య నిర్వహణా సామర్థ్యాన్ని తన వచనంలో “సాంద్రంగా హరగణ భక్తి నాచరిస్తాడని, మహాప్రసాద న్యాయాన్ని” నిర్వహిస్తాడని, ప్రశంసించింది. “ఆమె వచనాలు గంగా ప్రియ కూడల సంగమదేవ” మకుటంతో ఉన్నాయి. త్రికాలలింగ పూజా నిష్టను కలిగిన గంగాంబిక భక్తికి మెచ్చి,శివుడు ఆమె చేతిలోని ఇష్టలింగంలోనే సాక్షాత్కరించాడట.
కల్యాణ నగరంలో జరిగిన కులాంతర వివాహం వల్ల హింసాకాండ జరిగింది. దానికి విరక్తుడై బసవన్న కూడల సంగమానికి తరలి పోయాడు. తాను లింగైక్యాన్ని పొందే ముందు తన పత్నులను పిలుచుకొని రమ్మని హడపద అప్పన్నను పంపించాడు. అప్పటికి బిజ్జలుని వైరిగణం చంపేసారు. శరణులకు ప్రాణాపాయస్థితి కలిగింది. పతి పిలుపును మన్నించి అతని వద్దకు వెళ్ళడం సతిగా ఆమె కర్తవ్యం. కాని గురువాణి నాలించి ఆమె శరణుల రక్షణకు పూనుకొంది . తాను బాల్యంలో నేర్చిన యుద్ధ విద్యల నుపయోగించి శరణుల రక్షణకు పూనుకొని తన నిర్ణయాన్ని పతికి అందజేసింది. శరణుల రక్షణకు గాను వారితో కల్యాణం నుండి “ఉళివెకు ” పోతుండగా మలప్రభా నదీ తీరంలో ని “కాతరవళ్ళి ” సమీపంలో శత్రువులతో జరిగిన యుద్ధంలో వీర స్వర్గాన్ని పొందింది.
నీలాంబిక వచనాలు భావ గీతికల వంటివి. ఆమె కన్నడ భాషలో మొట్టమొదట శోక గీతికలను పలికిందని విమర్శకులు వింగడించారు. ఆమె “మనసును సమాధానపరచు కోవాలని ,భోగాది భొగాలన్నీ సంగయ్య ఆధీనంలోనివని” తన హృదయ వేదనను అర్ద్రంగా వ్యక్తీకరించింది. బసవన్నను ఆరాధించిన ఆమె అతడు లింగైక్యు డయ్యాడని “అట్టడవియలి బిట్టు హోదిరి శివా,” నట్టడవిలో వదిలి వెళ్ళావు కదా అని శోకించింది. అతనిని ఆకులు రాలి స్తబ్దమైన చెట్టుతో పోల్చింది. సృష్టి చలన గతిలో సుప్త జీవన రీతిని మృదుభావ శబలత్వంతో పరికించింది. తమవివాహ బంధం అశదృశ మైనదని తామిరువురు శిశువుల వలె పరస్పర వాత్సల్యాన్నను భవించామని తన వచనంలో చెప్పింది. “కాయంలేని పుష్పకాన్ని చూసాడు, మా బసవయ్య పూల రథమెక్కాడు, అని తన వియోగాన్ని అనుభావంతో తెలిపింది. తన పత్నులను తీసుకొని రమ్మని బసవన్న చెప్పినప్పుడు, తన చేతిలో ఉన్న ఇష్ట లింగంలోనే బసవన్నను చూసుకొన్న నీలాంబిక ‘అక్కడకు రమ్మని చెప్పి పంపారు, ఇక్కడ తాను లేడా? సంగయ్య అంటూ తానున్న చోటనే ఐక్యమొందినట్లుగా ఒక ఐతిహ్యం తెలుపుతుంది.
సముద్రంలో ,నీటి బుడగలు, ఆకాశంలో చైతన్యం అణగినట్టు నీలాంబిక శివైక్యాన్ని పొందింది.
12 వ శతాబ్ది శివశరణు రాండ్రలో నీలాంబికకు అగ్రస్థానం ఉంది. ఆమె తది తరులపై చూపిన వాత్సల్యానికి, అమెను తల్లిగా “నీలవ్వ” అని పిలిచారు. అక్కమహాదేవి తన వచనంలో “నీలవ్వ మోహద మగళు నాను ” నీలవ్వకు ప్రీతి పాత్రురాలనైన పుత్రికను అని చెప్పింది. నీలాంబిక వచనాలను , “సంగయ్య బసవ ” నామాంకితం చేసింది .
బసవన్నకూ, తనకూ, భావ భేదమే లేదని చెప్పిన సోదరి అక్క నాగమ్మ. ఆమె చెన్న బసవన్నకు తల్లి. లింగమే పతి అని తలచిన అక్క నాగమ్మ తాను “అధవ “నని సూచించింది. ఆమె సామాజికమైన కట్టుబాట్లు క్షుల్లకమైనవని ఎంచింది. బసవన్న ఆదర్శాలకు ఆతని జీవిత కాలంలోనూ ,తదుపరి కూడా అండగా నిలిచింది. “అన్నా శశి ధరునంటిన మణివి నీవు,లింగైక్యుడవైతే నీతో పాటే భక్తి పోయిందికదా! పంచ పురుష మూర్తి బసవన్నా ‘అని విలపించింది.
బసవన్నకు ఆప్తులైన మహిళలు ఆతని జీవితకాలంలోనే ,అతని ఉన్నతిని గుర్తించారు. మానవతామూర్తులుగా ఆత్మ గౌరవంతో బ్రతికారు. వచన కల్పనతో సాహిత్య భండారానికి పరి పుష్టిని కలిగించారు.
*****
డా రాజేశ్వరీ దివాకర్ల బెంగళూరు విశ్వ విద్యాలయంలో “తెలుగులో ప్రబంధ రూపము నొందిన సంస్కృత నాటకాలు “విషయాంశాన్ని గురించి Ph.D పట్టా ను పొందిన తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల బెంగళూరు లో తెలుగు విభాగానికి అధ్యక్షులుగా ,ఉపన్యాసకులుగా వృత్తిని నిర్వహించారు. అనేక జాతీయ చర్చా సదస్సులలో. క సమ్మేళనాలలో పాల్గొని ప్రశంసలను పొందారు.