నిన్నంతా ఎడతెరిపి లేని మంచువాన కురిసింది. ఇళ్లను, రోడ్లను పూర్తిగా మంచుతో కప్పేసింది. ఎటు చూసినా శ్వేత వర్ణమే.
ఇంట్లోంచి బయటికొచ్చిన పిల్లలు మంచు ముద్దలు తీసుకొని బాల్స్ చేసి ఆడుకుంటున్నారు.
ఈ రోజు హిమపాతం లేదు. వీకెండ్ కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి. చెట్ల కొమ్మలు తెల్లటి పూత పూసినట్లుగా కొత్త అందాలు ఒలకబోస్తుంటే… వాటిపై పడిన సన్నని బంగారు వర్ణ కాంతి రేఖలు వింత సోయగాలు అద్దుతున్నాయి. వెచ్చని కాఫీ గొంతులోకి దిగుతుంటే విండో లోంచి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నది నిష్కల. నిన్న మొన్నటి వరకు నిండా కాయలు పండ్లతో అలరించిన అంజీర చెట్టు ఇప్పుడు మోడువారి పోయింది. ఆ మోళ్ళపై మంచుపూలు పూశాయి. ఆ మంచు కరిగిపోతే మళ్ళీ మోడై..
ఉహు.. చిగురిస్తుంది. మళ్ళీ చిగురిస్తాను అనే ఆశతో ఈ నాటి గడ్డు పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటూ నిటారుగా నిలబడింది.
రేపనేది లేదనుకుంటే ఎలా ఉంటుంది ?
ఆలోచిస్తున్న నిష్కల మదిలోకి తన క్లయింట్ గీత వచ్చి చేరింది. ‘నాకు రేపనేది లేకుండా పోయింది’ అన్న గీత మాట చుట్టూ తిరుగుతున్నాయి నిష్కల ఆలోచనలు.
అతను లేనంత మాత్రాన ఆమెకు రేపు లేకుండా పోవడం ఏంటి ? చదువుకుని దేశం కాని దేశంలో అడుగుపెట్టి ఉద్యోగం చేస్తున్నా ఆ ఆలోచనలు మారవా.. అదే బేలతనమా..?
చిన్నప్పటి నుంచి ఆమెని వ్యక్తిగా కాకుండా బొమ్మగా చూస్తున్నారు. అదే ఆమె బుర్రలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. జీన్స్ ప్యాంటు , స్లీవ్ లెస్ టాప్ , హై హీల్స్ వేసుకుని మేం ఆధునికం అయ్యాం అనుకుంటున్నారు. కానీ, బుర్రనిండా బూజు పట్టిన భావనలే .. ఎప్పటికి బూజు దులుపుకుంటారో.. .. విసుక్కుంది నిష్కల.
గీత గురించి ఆలోచిస్తుంటే ఆమె చెప్పిన ఆమె నేపథ్యం గుర్తొచ్చింది
*** *** ***
అమ్మానాన్నల గారాల పట్టి గీత. పెళ్ళైన పదిహేనేళ్లకు పుట్టిన గీతను అపు రూపంగా పెంచుకున్నారు. అడగక ముందే అన్నీ ఆమె ముందుండేవి. గీత పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకుంది. కూతుర్ని వదిలి ఉండడం కష్టమైనా ఆమె అభీష్టం మేరకు అమెరికా పంపారు ఆమె తల్లిదండ్రులు. . చదువైన వెంటనే అమెరికాలోనే ఉద్యోగంలో చేరిన గీతకి పెళ్లి చేయాలనీ మాట్రిమోనిలో రిజిస్టర్ చేశారు. చాలా సంబంధాలు వచ్చాయి.
అమెరికాలో రెసిడెన్సీ చేస్తున్న వినోద్ సంబంధం వాళ్లకు అన్ని విధాలా నచ్చింది. వినోద్ కుటుంబానికి కూడా గీత నచ్చింది. ఇరువైపుల పెద్దలు కలిసి మాట్లాడుకున్నారు. ఒకే కులం కాబట్టి ఆచార వ్యవహారాల్లో చిన్న చిన్న ప్రాంతీయ వ్యత్యాసాలు తప్ప అంతా కలిసిపోతాయి అనుకున్నారు.
ఇండియాలో ఉన్న ఒకే కులానికి చెందిన రెండు కుటుంబాల పెద్దలు తమ ఆస్తిపాస్తుల కొలతలు , కట్నకానుకలు లెక్కలు చూసుకున్నారు. జాతకాల చిట్టాలు తెరచి సరి చూసుకున్నారు.
పంచాయితీ రాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేసిన వ్యక్తి ఏకైక కూతురు. ఆస్తిపాస్తులు బాగానే జమేసి ఉంటారు. అమ్మాయి కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది మంచి సంబంధం అని అబ్బాయి వాళ్ళు అనుకున్నారు .
అబ్బాయి అందగాడు. డాక్టర్. అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నాడు. అత్తమామలు , ఆడపడుచుల ఆరళ్ళు ఉండవు. కుటుంబ ఆర్ధిక పరిస్థితి పర్వాలేదు కాబట్టి వాళ్ళు కష్టపడి అక్కడి నుంచి పంపవలసిన అవసరం లేదు. కూతురు సుఖపడుతుంది.
పురుళ్ళు పుణ్యాలకు రెండువైపుల సహకారం ఉంటుంది కాబట్టి కూతురికి పిల్లల పెంపకం పెద్ద సమస్య కాదని ఆలోచించారు గీత తల్లిదండ్రులు. ఇరుకుటుంబాల వాళ్ళు ఒకరింటికి ఒకరు వెళ్లి పరిస్థితిని చూసి అంచనా వేసుకున్నారు. ఆ తర్వాత పిల్లలిద్దరినీ మాట్లాడుకొమ్మని ఒకరి నంబర్ ఒకరికి ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత గీత వినోద్ ల పరిచయం జరిగింది.
అబ్బాయి అమ్మాయి మొదట ఆన్లైన్ లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆఫ్ లైన్ లో మాట్లాడుకున్నారు. వారి ఒడ్డుపొడుగు , రూపురేఖలు ఒకరికొకరు నచ్చాయి. అమెరికాలో వైద్య వృత్తిలో ఉండడం అంటే గొప్ప సంపాదపరుడే అని గీత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గీత అందచందాలు, ఒదిగి ఉండే గుణం, ఆమె సంపాదన వినోద్ కి నచ్చాయి. దాంతో పెద్దలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కలిసి ఒకరికొకరు ఇష్టపడ్డారు. పెళ్ళికి అంగీకారం తెలిపారు .
రెసిడెన్సీ అయిపోతుంది కానీ సూపర్ స్పెషాలిటీ కి ప్రిపేర్ అవుతున్నట్లు , సూపర్ స్పెషలిటీ లో సీటు వచ్చాక పెళ్లి అన్నాడతను. మహా అయితే ఏడాది. ఆ.. ఏడాది అంటే ఏముందిలే అని సరే అన్నారు గీత పెద్దలు.
ఈ లోగా ప్రేమికుల్లా తిరగడం మొదలు పెట్టారు. వారాంతం వస్తే అతను గీత దగ్గర వాలేవాడు. అల్లరి చేస్తూ కవ్వించేవాడు. నవ్వించేవాడు. సరదాలు , షికార్లు లేదంటే చాటింగులు ..
గంటలు , రోజులు క్షణాలుగా దొర్లించేస్తున్నారు. భుజంపై భుజం వేసుకుని , చేతిలో వేసుకుని తిరుగుతుంటే ఆమెకు అతనితో జీవితంపై గొప్ప నమ్మకం , భరోసా కలిగేవి .
ఆమె ఉద్యోగంలో వచ్చిన సమస్యలకు ఆమె చెక్ పెట్టే విధంగా ఆమెకు ధైర్యం ఇచ్చేవాడు. అంత అర్ధం చేసుకుని, సహకరించే అతను దొరకడం తన అదృష్టం అనుకునేది గీత.
నలుగురు మిత్రులతో కలిసి ఉంటున్న గీతని అపార్ట్మెంట్ తీసుకో అని అతని సలహా. రేపు పెళ్ళయ్యాకైనా తప్పదుగా .. అనుకున్న గీత. ఆ మేరకు వేరే అపార్టుమెంటు కి మారిపోయింది. తల్లిదండ్రులు కూడా కూతురుపై నమ్మకంతో, ప్రేమతో ఏమనలేక పోయారు. అతని రాకపోకలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు ఆమెతో పాటు ఆ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాడు. పెద్దల సమక్షంలో ఏడడుగులు వేయలేదు. మెడలో తాళికట్టలేదు కానీ మేమిద్దరం భార్యాభర్తలం అనుకునేది గీత. అతను కూడా అట్లాగే ప్రవర్తించేవాడు.
ఇద్దరు కల్సి విషయం పెద్దల దృష్టికి వెళితే బాగుండదు అతను మొదటే చెప్పడంతో గీత తల్లిదండ్రుల దగ్గర ఆ ప్రస్తావన తేలేదు.
అయితే , ఆ అమ్మానాన్నలకు తరచూ కలుస్తారని తెలుసు. కానీ సన్నిహిత శారీరక బంధం గురించి తెలియదు. బహుశా అటువైపు; తెలిసే అవకాశం లేదు .
అయినా ఎలా చెబుతారు.. మేము పెళ్ళికి ముందే ఏకమయ్యామని అదే అతనికి వరమైంది. ఆమెకు శాపమైంది!
రెండేళ్లు గడిచాయి . పెద్దల నుండి ముఖ్యంగా గీత తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసేద్దామని వత్తిడి పెరిగింది. ఇలా ఉండడం ఏదో తప్పు చేస్తున్నట్లు ఉంది పెళ్లి చేసుకుందామని గీత తరచు అనడం మొదలైంది.
వినోద్ తల్లిదండ్రులు కూడా తొందర పడుతున్నారు. ఆమ్మాయివాళ్ళు పిల్ల పెళ్లి కుదిరిందని వాళ్ళ వాళ్ళందిరికి చెప్పుకున్నారు . ఎప్పుడు పెళ్లి బంధువులు అడుగుతుంటే సమాధానం చెప్పడం ఇబ్బంది అవుతున్నదని గోల పెడుతున్నారు . వీలు చూసుకుని వస్తే శుభకార్యం కానిచ్చేద్దాం అని కొడుక్కి చెబుతున్నారు.
తన మనసులో ఏముందో ఎవరికీ ఏమి చెప్పలేదు. క్రమంగా రాకపోకలు తగ్గడం మొదలైంది. సూపర్ స్పెషలిటీ ఎంపిక అయిపొయింది. కానీ అతను అనుకున్న , కోరుకున్న కార్డియాలజీ లో సీటు రాలేదు. న్యూరో లో వచ్చింది. అందుకతను బాధలో ఉన్నాడని అనుకుంది గీత . అతన్ని ఓదారుస్తూ మెస్సేజ్ పెట్టేది . రెస్పాన్స్ సరిగా ఉండేది కాదు. ఏమైనా అంటే పని వత్తిడి అని చెప్పి రాకపోకలు తగ్గించాడు వినోద్
సరిగ్గా అదే సమయంలో కోవిడ్ ప్రపంచ దేశాల్ని కుదిపేయడం మొదలైంది. వైద్యులకు వృత్తిపరమైన వత్తిడి పెరిగింది. వినోద్, గీత ల మధ్య దూరం పెరిగింది. మొదట్లో పని వత్తిడిలో ఉన్నానని , చాలా అలసటగా ఉన్నానని మాట్లాడేవాడు కాదు . పొట్టి మెసేజ్ లు ఇచ్చేవాడు . ఆ తర్వాత ఫోన్ సమాచారాలు , చిట్టి పొట్టి మెసేజ్ లు కూడా లేకుండా పోయాయి .
అది ఆమె హృదయాన్ని భారం చేసింది. అతని స్పర్శ కోసం ఆమె శరీరం తపించి పోతున్నది. అతను రావడం కుదరకపోతే తనే వెళదామని ఐదు గంటల పైనే డ్రైవ్ చేసుకుంటూ అప్స్టేట్ న్యూయార్క్ లో అతను పనిచేసిన హాస్పిటల్ కి వెళ్ళింది .
తీరా వెళ్ళాక అక్కడ అతను లేడు. అతను ఆ హాస్పిటల్ వదిలి ఆరు నెలలు అయిందని తెలిసి అవాక్కయింది.
ఇప్పుడెక్కడున్నాడో తెలియదు. ఎలా..? ఏమి చెయ్యాలి? అర్ధం కాలేదు.
తనకు పరిచయం అయిన వినోద్ మిత్రులకు ఫోన్ చేసింది. ఆచూకీ తెలియలేదు.
ఆలోచించి అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వాళ్ళు తమకి ఏ విషయం తెలియదన్నారు. పని వత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇదివరకటిలాగా మాట్లాడడం లేదని చెప్పారు .
అతని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నదేమో .. అతను అతని వృత్తి ధర్మంలో తలమునకలై ఉన్నాడు. ఈ సమయం ఎంతో విలువైనది. ఒక వైద్యుడిగా అతని ధర్మం అతను నిర్వహిస్తున్నాడు. ఇప్పుడతని అవసరం సమాజానికి ఉంది. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే పనిలో ఉన్నాడు . అతని పనికి అతనికి ఇబ్బంది కలిగించ కూడదని తన మనసుకు నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది గీత .
అతని నుండి ఒక చిన్న సమాచారం వస్తుందేమోనని ఎన్నో రాత్రులు ఎదురు చూసింది. ఏ రాత్రి ఆమెకు సమాధానం ఇవ్వలేకపోయింది. బరువెక్కిన గుండె ఆ దూరాన్ని తట్టుకోలేక పోతున్నది. అప్పుడప్పుడు అతని తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నది. వాళ్ళ నుండి ఎటువంటి సమాచారము లేదు. అక్కడున్న నీకెంత తెలుసో ఇక్కడున్న మాకు అంతే తెలుసు అంటున్నారు.
అతని ఆరోగ్యం బాగులేదట అన్నారు ఓ సారి. అతను నంబర్ పనిచేయడం లేదు. అతనికి కరోనా సోకిందేమోనని ఆందోళన పడింది గీత. ఏమైందో వాళ్ళు చెప్పరు . అతనెక్కడున్నాడో తెలిస్తే వెళ్లి చూసుకుంటానని అతని నంబర్ కోసం ప్రయత్నించింది. అతని తల్లి దండ్రులు పాత నంబర్ ఇచ్చారు. కానీ అతన్ని విసిగించ వద్దని, పెళ్లి గురించి అస్సలు మాట్లాడొద్దని చెప్పారు.
కరోనా కాలంలో ఎట్లాగూ రాలేరు. ఇన్నాళ్లు ఆగినదానివి ఇంకా కొద్ది కాలం ఆగు పరిస్థితులు సద్దుమణుగుతాయి అని నచ్చచెప్పేవారు. మీకు రావడానికి కుదరకపోతే అక్కడ పెళ్లి చేసేసుకోండి. మేం ఇక్కడి నుండి చూసి అక్ష్ణతలు వేసి తృప్తి పడతాం అని గీత తల్లిదండ్రుల పోరు. మధ్యలో గీత నలిగిపోతున్నది. చాల వత్తిడికి లోనవుతుంది. భయాందోళనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. నచ్చ చెప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆమెలోకి తొంగి చూసిన కొన్ని ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి.
ఎందుకో తెలియదు ఈ మధ్య వినోద్ తల్లిదండ్రుల సమాధానం చెప్పే తీరులో మాట్లాడే మాటలో ఏదో తేడా ఉన్నట్లు ఫీలయింది గీత.
అదినిజమా .. తన అనుమానమా అని లోలోన మదన పడేది. రోజులు, నెలలు గడిచాయి. అతని నుండి ఎటువంటి సమాధానం లేదు . గీత మాత్రం ప్రతి రోజు ఒక మెయిల్ చేస్తూనే ఉంది . మెసేజ్ పెడుతూనే ఉంది. అతని ఫోన్ మార్చేశాడు .
అంతా కావాలనే చేస్తున్నట్లు రూఢి అయిపొయింది. కావాలనే అతని తల్లిదండ్రులు కూడా తమను మభ్యపెడుతున్నారని అర్ధమైంది.
బహుశా వేరే బంధంలోకి అడుగు పెట్టాడేమో .. అని అనుమానం తొలిచి వేస్తుండగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ ఒక సుదీర్ఘమైన మెయిల్ చేసింది.
ఆ తర్వాత వారం పదిరోజులకు లాయరు నుంచి వచ్చిన లెటర్ చూసి నివ్వెరపోయింది.
డేటింగ్ లో ఉన్న ఆమె ప్రవర్తన తనకి నచ్చలేదని , ఇద్దరి అభిప్రాయాలూ కలవవని , కానీ ఆమె తనని పెళ్లి చేసుకొమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నదని , లేదంటే తన సంగతి చూస్తానని బెదిరిస్తున్నదని ఆమె నుండి తనకు రక్షణ కావాలని అతను కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు.
ఎంత అన్యాయం .. ఎంత మోసం అని ఆవేశపడింది గీత. తర్వాత సారా సహకారంతో నిష్కల సలహా సూచనల కోసం వచ్చింది. ఏ మేరకు సహాయం అందించ గలదు.
మొదట కొంత ఇబ్బంది పడినప్పటికీ త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అని తనకు తాను చెప్పుకున్న గీత అతని మాటల్లో మాయలో పూర్తిగా పడిపోయింది.
ఆమెను వాడుకున్నన్ని రోజులు శారీరకంగా వాడుకున్న అతను ప్లేట్ ఫిరాయిస్తే అందుకు బాధ్యులు ఎవరు? బాధ్యత ఎవరు తీసుకోవాలి? అతని తల్లిదండ్రులు చేతులు ఎత్తేయడం ఏంటి? చట్టం , కోర్టులు పరిధి ఎంత?
గీత కోరుకున్న న్యాయం జరుగుతుందా ? యూస్ అండ్ త్రో ప్రపంచంలో ఆమెను వస్తువుని చేసి వాడుకుని ఎంజాయ్ చేసి అవతలి విసిరేశాడు. అది తెలిసి నమ్మడానికి ఆమె మనసు ఒప్పుకోవడంలేదు .
తన సర్వస్వము మనసా వాచా కర్మణా అతనికి అర్పించాను . అతడే నా భర్త . అంటుందామె. అతనికి శిక్ష పడడం కాదు ఆమె కోరేది అతనితో బంధం పునరుద్ధరణ కోసం ఆమె పట్టు, ప్రయత్నం.
అతనిపై ప్రేమ కంటే నవ్వులపాలవుతానని ఆమె భయం కనిపిస్తున్నది. కట్టు బానిసను చేసి మూఢత్వంలో ముంచి అవమానించినా గీత ఇంకా ఆ ప్రబుద్ధుడితోనే జీవించాలని కోరుకోవడం నిష్కలకి మింగుడు పడడం లేదు.
మనుషుల మధ్య ఇంత సంక్లిష్టమైన బంధాలు ఎట్లా ఏర్పడతాయి.. ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్న భయం లేదు అప్పుడు. వాళ్ళది ప్రేమ అనుకోవడానికి లేదు. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు కాబట్టి స్త్రీ పురుష ఆకర్షణతో, దేన్నీ ఆలోచించ నివ్వని కోరికతో ఒక్కటయ్యారా .. ఆ కోరిక పరచుకుని ఉక్కిరిబిక్కిరి చేసేసిందేమో .. బహుశా అంతే అయుండొచ్చు. లేదా డాక్టరు కాబోయే అతనితో ఖరీదైన జీవితం, విలాసవంతమైన జీవితం ఊహించుకున్న జీవితం భళ్ళున పగిలిపోయిందనా ..
కెరీర్ వెంట పరుగులు పెట్టే ఇరుకై పోయిన జీవితంలో స్వార్ధం తప్ప, పైకి మెట్లు ఎక్కే ఆలోచన తప్ప ఇతరుల గురించి ఆలోచించడం ఉండదా .. అందుకే అతను అలా ప్రవర్తించాడా .. అతన్ని మాత్రమే అనుకోవడానికి లేదు. అతని తల్లిదండ్రులది కూడా తప్పేనేమో ..
అతనికి నొప్పి తగిలితే .. అతనికో అతని అక్కకో , చెల్లికో అటువంటి ఇబ్బంది ఎదురైతే అప్పుడు ఆలోచిస్తాడేమో .. చిచ్చి .. ఇట్లా ఆలోచిస్తున్నానేమిటి ..
తన అవసరం తీర్చుకోవడం, వాడగలిగినన్నాళ్లు వాడి అవతల పడేయడం.. అంతే .. అతను అదే చేసాడని స్పష్టంగా అర్ధమవుతున్నది.
బహిరంగంగా ప్రేమని ప్రదర్శించని భారతీయ సమాజం నుండి వచ్చిన గీత, ఇద్దరూ కలసి బతుకుతామని నిర్ణయించుకున్నాక అతనితో గడపడం తప్పేలా అవుతుంది? మాతృదేశంలో ఉండి ఉంటే .. పరిస్థితి భిన్నంగా ఉండేదేమో?!
ఆడమగ పక్కపక్కన నడిస్తేనే ఆ ఇద్దరి సంబంధం గురించి ఊహించే మనుషులున్న సమాజం .. ఎన్నో కథలు అల్లే సమాజం నుండి వచ్చారు ఇద్దరూ .. కాబట్టి చుట్టు పక్కల వాళ్ళ గురించి , కుటుంబ పరువు ప్రతిష్ట గురించి, సమాజం గురించి ఆలోచించేదేమో?!
తరతరాలుగా భారతీయ మహిళ తన భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకుంటూనే ఉన్నది అంటే అందుకు కారణం సమాజంలో ఉన్న నియమ నిబంధనలు. అవి తయారు చేసింది మగవాళ్లే .. ఆమె నడవడికను , భావాల్ని నియంత్రించేది వాళ్లే.
స్త్రీలకు ఏమి తెలవదని అనుకుంటారు. కుటుంబ ఆస్తిపాస్తుల్ని , కుటుంబ సభ్యుల్ని , కుటుంబ గౌరవాన్ని రక్షించే బాధ్యత తమదే అనుకుంటారు. కుటుంబంలోని ఆడవాళ్ళని తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటారు. అటువంటి కుటుంబం నుంచే వచ్చిన వినోద్ .. అమెరికా వచ్చాక తన సామజిక పద్ధతులు , కుటుంబ కట్టుబాట్లు అన్నీ వదిలేశాడా .. అనుకున్నట్లుగా రెండేళ్ల కిందటే పెళ్ళయితే ఇలాగే చేసేవాడా ..
ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవంతో పాటు వారి నమ్మకాలను గౌరవించడం వదిలేశాడా .. లేక వాళ్ళ మద్దతు అతనికి ఉందా ..? ఎన్నెన్నో ప్రశ్నలు నిష్కలలో
ఆధునికత , ఆధునిక సాంకేతికత పరికరాలు వాడుతూ, సొషల్ మీడియా లో చురుకుగా ఉంటూ ఉన్నా ఆలోచనల విషయంలో మార్పు ఉండదు . కానీ ఆ వెనక దాగిన ఆమెకు విలువ లేదు ఈ సమాజంలో..
చదువుకుని ఇక్కడిదాకా వచ్చిన గీత చేతిలో ఆటబొమ్మయ్యింది. ఆమె చదువు ఆమెకేమిచ్చింది ? ఇచ్చిన జ్ఞానం ఇదేనా ..? అక్షరాలూ నేర్చుకున్నది ఉద్యోగం కోసమేనా.. ఉద్యోగం చేసేది డబ్బు సంపాదన కోసమేనా .. వాళ్ళ అమ్మకి , అంతకు ముందు తరం అమ్మమ్మ , నాన్నమ్మలకి గీతకి మార్పు లేదా .. దేశాంతరాలు రావడమే మార్పా .. సాంప్రదాయ వస్త్రధారణ దాటి పాశ్చాత్య వస్త్ర ధారణలోకి మారడం, లేదా పిజ్జాలు , బర్గర్లు తినడం అదేనా ఆమె సాధించిన మార్పు ..
అతన్ని నమ్మడం తప్పు కాదు. అతను ఓ మోసగాడు అని అర్ధమయ్యాక కూడా అతని వెనక పడుతున్నది .. అది , అది నచ్చడంలేదు నిష్కలకు. సాంప్రదాయ సంకెళ్లు అంటే ఇవేగా..
ఇప్పటి వరకు ఎవరూ తాకని అమ్మాయిని మగవాళ్ళు కావాలనుకుంటారని మాటల్లో వినోద్ చాలాసార్లు చెప్పినట్లు గీత అన్నది. మరి గీతను రెండేళ్లు వాడుకుని విసిరేస్తే ఎవరు ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారు . పెళ్లిళ్ల మార్కెట్ లో ఎవరూ తాకని వాళ్లకు ఉన్న డిమాండ్ గీత లాంటి వాళ్ళకి ఉంటుందా .. గీత తప్పా .. ఒప్పా ..అని నేను ఆలోచించడంలేదు. అతని కోసం వేలాడడం మాత్రం ఖచ్చితంగా తప్పు నిర్ణయమే అని ఫీలవుతున్నాను.
యుక్తవయసులోకి వచ్చిన ఆడ మగ ఒకరినొకరు పరిచయం అయ్యాక, ఒకరికొకరు అర్ధమయ్యాక, మానసికంగా దగ్గరయ్యాక శారీరకంగా పరస్పర గౌరవంతో, సమానతతో ఎటువంటి అమ్మకాలు కొనుగోళ్ల బేరాలు లేకుండా కలసి బతికే సహజీవనం పేరే పెళ్లి లేదా విహాహం. అప్పుడు వాళ్ళ మధ్య ఉండేది ప్రేమ, పరస్పర అవగాహనా, సహకారం. దాన్నే నాన్నమ్మ లాంటి వాళ్ళు బరితెగించిన తనం అంటుంటారు. తన విషయం తెలిస్తే నాన్నమ్మ ఏమంటుంది ? ఒక క్లయింట్ ఆలోచిస్తున్నావు .. నీ గురించి నువ్వెందుకు ఆలోచించుకోవు .. ప్రశ్నించింది ఆమె లోపలి మనిషి.
నిజమే .. తన బంధం అంకిత్ తో పలచబడింది?
తమ బంధం చిక్క బరుచుకోలేనిదా.. ?
మేలిమి బంగారు కిరణాల తాకిడికి కరుగుతున్న మంచును చూస్తూ ఆలోచనలో పడింది నిష్కల