నా జీవన యానంలో- రెండవభాగం- 16
-కె.వరలక్ష్మి
రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; వనితాజ్యోతి లో ‘ప్రతిధ్వని’ కవిత ; 83 లో ఆంధ్రజ్యోతి వీక్లీ లో ‘యువకుల్లో ధీశక్తి‘ వ్యాసం; 85లో ఉగాది వ్యాసరచన పోటీ లో బహుమతి పొందిన వ్యాసం; 85జూన్ స్వాతి మంత్లీ లో ‘అంతా మన మంచికే’ స్కెచ్ మొదలైనవి ప్రచురించబడ్డాయి. 85 నవంబర్ లో ‘కలువబాల’ లో ‘ప్రశాంతి’ నవలిక; 85 డిసెంబర్ లో ‘బాలజ్యోతి’ లో ‘ప్రజల విద్య కథ’ 86 జూలై లో ‘కలువబాల’ లో ‘అందమైన మొద్దబ్బాయి’ కథ; మే 86 ‘వనిత’ లో ‘నా పదహారేళ్ళ వయసులో’ వ్యాసం; 86 జూలై ‘ఆంధ్రజ్యోతి’ డైలీ లో లో ‘లేపాక్షీ నోట్ బుక్స్’ వ్యాసం; 86 ఆగష్టు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ లో అపురూప హర్మ్యం’ కవిత; అక్టోబర్ 86 లో ‘జ్యోతి’ మంత్లీ లో ‘ఉషోదయం’ నవలిక; (ఈ నవలిక 2005 ‘రాగసంగమ’ కన్నడ పత్రిక లో ‘శుభోదయం’ పేరుతో వచ్చింది.) 87 ఏప్రిల్, మే ‘కలువబాల’ ల్లో ‘భువన్’ , ‘పేరులోనేమున్నది’ కథలు; 87 అక్టోబర్ లో వినాయక చవితి పోటీలో బహుమతి పొందిన కథ ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ లో ‘సృష్టి కి మూలం కథ’ 87 అక్టోబర్ లోనే వేరువేరు తేదీల ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ ల్లో ‘సర్వపరిష్వంగం’ , ‘కాపురుషులు’ కథలు ; 87 అక్టోబర్ లో ఆంధ్రపత్రిక-భారతి సారస్వతానుబంధం లో ‘ప్రశ్న’, ‘నిరంకితం’ కవితలు; 87 జూలై, ఆగష్టు ల్లో ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ లో ఈ వారం కవితలు ‘బడి-అమ్మఒడి’ , ‘నగరం లో అజ్ఞాని’ వచ్చాయి.
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్టు పగలంతా స్కూలు, ఇంటి పనుల్లో గడిచినా రాత్రులు మేల్కొని రాస్తూ ఉండేదాన్ని, ఓ పక్క పుస్తక పఠనం తో బాటు మరో పక్క బాలమురళీకృష్ణ గారు, శ్రీ రంగం గోపాలరత్నం గారు లాంటి సీనియర్ గాయకుల్తో బాటు అప్పటి యువ గాయకులు బాలకృష్ణప్రసాద్ లాంటి వారి లలిత గీతాలు సేద తీరుస్తూ ఉండేవి.
మన్యం ప్రాంతాల్లోంచి ప్రయాణం చేసి అడవుల ప్రాంతాల్ని చుడుతూ తంటికొండ, కోరుకొండ ప్రాచీన ఆలయాల్ని, గోదావరి నదిని, రాజమండ్రి పేపర్ మిల్లును చూపించానోసారి స్కూలు పిల్లలకి. నా దగ్గర స్కూల్లో టీచర్స్ అంతా పేద-దిగువ మధ్య తరగతి అమ్మాయిలే. పిల్లల్తో బాటు వాళ్ళు కూడా ఆ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేసేవారు. అందరూ టిఫిన్ బాక్సుల్లో రకరకాల ఐటెమ్స్ తెచ్చుకుని తినే వేళకి అంతా పంచుకుని తినేవాళ్ళు. కృష్ణవేణి అనే ఒకేఒక బ్రాహ్మల అమ్మాయి మాత్రం ఎవరితో పంచుకునేది కాదు, ఎవరిచ్చినా తీసుకునేది కాదు, తను పెళ్ళై జగ్గంపేటలోనే స్థిరపడి, కూతురి పెళ్లి కూడా చేసింది. ఆ మధ్య ఓసారి వాళ్ళింట్లోనే పేరంటానికెళ్తే అల్లుడికి హైదారాబాద్ లో ఉద్యోగమనీ, నెలనెలా తన కూతురు మెన్సెస్ అయ్యే వేళకి హైదారాబాద్ వెళ్ళి వండిపెట్టి నాలుగో రోజు తిరిగి వస్తానని చెప్పింది. ఓహ్! అనుకున్నాను నేను.
-ఆదర్శమంటూ లేని మనిషి తెడ్డు లేని పడవ వంటి వాడు – గాంధీజీ
-మన బ్రతుక్కి ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం కల్పించబడితే గాని అది జీవితమనిపించుకోదు – రాషెల్
-మానవ హృదయాలకు ప్రేమ పువ్వులకు సూర్యరశ్మి వంటిది – స్వామి చిన్మయానంద
-ఎప్పుడూ బలహీనతలు, తప్పులు గురించి ఆలోచిస్తూ కూర్చోకు, సదాశయంతో, నమ్మకం తో ఒక లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నించు. ఆ లక్ష్యమే నీవద్దకు వస్తుంది. – అరవింద మహర్షి
ఇలాంటి కొటేషన్లు డైరీ లో రాసుకుంటూ తరుచుగా మననం చేసుకుంటూ జీవితాన్ని ఒక పథం లో తీర్చి దిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. నా జీవిత భాగస్వామికి అదంతా ఎగతాళి గా ఉండేది. నాకు తెలీకుండా నా డైరీల్ని చదవడమే కాదు “మొగుడి మాట వినకుండా స్వతంత్రంగా బతకాలనుకునే ఆడదానికి బడితపూజే సరైన మందు” అనీ; “ఆడది పక్కలో ఫ్రిజిడ్ గా ఉన్న కొద్దీ, భర్త నిరంకుశుడూ, స్వార్ధపరుడూ అవుతాడు. చితక్కొడతాడు. అతన్ని తృప్తి పరిస్తే దాసుడౌతాడు” అంటూ నా డైరీలో తను కొటేషన్లు రాస్తూ ఉండేవాడు. చదువు అతనికి కొంచెమైనా సంస్కారం ఇవ్వలేదు, రాయడమే కాదు, అంత కఠినంగా వ్యవహరించేవాడు. ‘ఇలాంటి విషయాలు కూడా పబ్లిక్ గా రాసుకోవాలా’ అంటారు కొందరు. అవును రాసుకోవాలి, రాసుకోకపోతే మనుషుల్లో కొన్ని మృగాలు ఉంటాయని ఎలా తెలుస్తుంది? ఫోటోల కోసం భుజాల మీద చేతులేసి ఫోజులివ్వడం, నలుగుర్లో కౌగలించుకోవడాలు చేసే మగవాళ్ళు రాత్రికి క్రౌర్యాన్ని ప్రదర్శిస్తారని ఎందరికి తెలుసు? ఆర్ధికంగా సహరించడు, దేనికీ నేనున్నానని ఆదుకోడు- అలాంటి మగవాడితో స్త్రీ ఫ్రిజిడ్ అయిపోకపోతే ఏమౌతుంది ?
NTR హయాం లో ప్రైవేట్ స్కూల్స్ మీద ఒత్తిడి పెరిగింది. రికగ్నైజ్ చేయించని స్కూల్స్ ఉండనీయరని తెలిసింది. నాకేమో గవర్నమెంటుకి సంబంధించిన ఏ రూల్సూ రెగ్యులేషన్సూ తెలీవు. మోహన్ ని అడిగితే “రికగ్నైజేషన్ వద్దు. వాళ్ళు మాటిమాటికీ ఇన్స్పెక్షన్ అని వస్తారు. నువ్వు వాళ్ళెదురుగా నిలబడ లేవు” అని భయపెట్టేడు. ఆ రోజుల్లో నా పని తేనె లో పడిన ఈగ లాగా అయిపోయింది.
“ఆత్మ అనేది అందరు మనుషులకు ఉండే అవయవం కాదు. చేతుల్తో భౌతిక వస్తువుల్ని ఎలా పట్టుకుంటామో ఆత్మతో అభౌతికతను అలా పట్టుకోవడం ఆత్మ ఉన్న వాళ్లకే సాధ్యం” అంటారు శేషేంద్ర ఒకచోట.
87 ఏప్రిల్ లో జ్యోతి మంత్లీ లో వచ్చిన ‘ఉషోదయం’ నవలను టెలీఫిల్మ్ గా తీయాలనుకొంటున్నామని హైదరాబాద్ హేమలతా మూవీవెంచర్స్ నుంచి 87అక్టోబర్ లో ఉత్తరం వచ్చింది. నా గందరగోళాల్లో పడి వాళ్ళకు రిప్లై కూడా ఇవ్వలేదు. కొందరు ప్రసిద్ధ రచయితలు సైతం నా కథలు చదివి ‘బావున్నాయి’ అని రాయడం నేను రచయితగా నిలదొక్కుకోడానికి దోహదపడింది. ‘ఆంధ్రజ్యోతి వీక్లి’ ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు “మీ రచనలు ఆసక్తి గా చదువుతున్నాను. మంచి రచనాశక్తి, శైలి, కుదురు మీ కలానికి ఉన్నవి. రాస్తూనే ఉండండి” అంటూ రాసిన ఉత్తరం నాకు గొప్ప బలాన్నిచ్చింది. 87నవంబర్ లో గీత రాసిన ‘ఎగిరే వాహనాల చరిత్ర’ వ్యాసం ఆలిండియా రేడియో-విశాఖ ఎగ్రీ చేసినట్టు ఉత్తరం వచ్చింది. నాకు అదో విజయం. మన విజయం కన్నా మన పిల్లల విజయమే ఎక్కువ ఆనందాన్నిస్తుందని అప్పుడే తెలిసింది నాకు.
ఇంకోపక్క ఆనందాల్ని అడ్డుకుంటూ మోహన్ రోజూ తాగి రావడం మొదలు పెట్టేడు. సేలరీ వచ్చిన రోజు క్లబ్ లోనే ఉండిపోయి అయిపోయేవరకూ పేకాడి ఉత్తచేతుల్తో ఇంటికొచ్చేవాడు. మా కజిన్ (మా పెద్ద తాత మనవడు) ఒకాయన మా అమ్మ వాళ్ళింటికి ఎదురుగా ఇల్లు కట్టుకున్నాడు. ఇంచుమించు మాతండ్రి వయసు వాడు. సహజంగానే వాళ్ళకి మా మీద కొంత ఓర్వలేనితనం ఏదో ఉండేది. మా అమ్మ హైదారాబాద్ నుంచి జగ్గంపేట వస్తే స్కూల్ నడిచే టైంలో వాళ్ళింటికెళ్ళి కూర్చునేది. నేను రెంట్ సరిగ్గా ఇస్తున్నానా లేదా అని ఆరాలు తీసేవారట. ఇంటి ఆడపడుచుకి ఇల్లు ఇచ్చేసారు. వాళ్ళాయన చూస్తే స్థిరమైనోడు కాదు. రేపు ఖాళీ చేయం అంటే ఏం చేస్తారు?” అని భయపెట్టేవారట. ‘మా లక్ష్మి అలాంటిది కాదు’ అని మా అమ్మ అంటూ ఉండేదట, అయినా వినగా వినగా మాటల ప్రభావం పనిచేస్తుంది కదా! మా అమ్మ హైదరాబాద్ వెళ్లిపోయాక “మీ అమ్మ చూడు ఏం అంటుందో! సొంతకూతురివని కూడా చూడకుండా. వద్దంటే వినకుండా మా అబ్బాయిలు వీళ్ళకి అద్దెకి ఇచ్చేశారు. స్కూలు కావడం వల్ల ఇల్లంతా పాడైపోతుంది” అందని నాతో చెప్పేవాళ్లు.
నమ్మడం నమ్మకపోవడం వేరే సంగతి. నా బిజీ జీవితంలో ఇదొక తలనొప్పిలా ఉండేది.
హైవేకి అవతల మేం పునాది కట్టుకున్న ప్రాంతానికి శ్రీరామ్ నగర్ అని పేరు పెట్టేరు. ఆ ప్రాంతమంతా ఇళ్ళస్థలాలు చేసి అమ్మేయడం వల్ల ఇక పంటలు వెయ్యడం మానేశారు. మా ఇంటి పునాదికి ఎదురుగా ఉన్న పెద్ద ఖాళీ స్థలాన్ని చదును చేసి షటిల్ కోర్టుగా తయారు చేసారట. అక్కడికి బేంక్ ఉద్యోగులు, డాక్టర్లు, కాలేజిపిల్లలు లాంటి వాళ్ళు ఆడడానికి వెళ్ళేవారట. మా అబ్యాయి కూడా అక్కడికి వెళ్తుండే వాడు. చాలామంది ‘పునాది అలా వదిలేసారేంటి, ఇల్లెప్పుడు కడతారు?” అని అడిగేవాళ్ళట. ఆమాట నాకు చెప్తూ “మనం ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామమ్మా” అని అడిగేడు. ‘నాఒక్కదాని వల్లా ఏమౌతుందిరా, మీ తండ్రి కలిసిరానిదే” అన్నాను నేను.
“ఆయన్తో పెట్టుకుంటే మనకి అయినట్టే. అయినా, అందరూ ఇద్దరూ సంపాదిస్తేనే ఇల్లు కట్టుకుంటున్నారా? రాణత్తా వాళ్ళింట్లో సుబ్బారావు మావయ్యగారొక్కరేగా సంపాదిస్తున్నారు. అయినా మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా లోన్ పెట్టి కట్టుకోవాల్సిందేగా. అదేదో ఇప్పుడే చెయ్యొచ్చుగా” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. పిల్లలు ఎంతలో ఎదుగుతారు! వాడు పెద్దాపురం కాలేజ్ లో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. నిజమే కదా అన్పించింది నాకు. కానీ, నాకొచ్చే ఆదాయానికి అది సాహసమేమో అన్పించసాగింది. ఆ ఆలోచనల్లో రాత్రులు నిద్రపట్టడం మానేసింది.
తాపీమేస్త్రికి పునాది చూపించి ఎస్టిమేషన్ వేయించుకొచ్చేడు మా అబ్బాయి రవి. లక్ష రూపాయలు, కేవలం తాపీపనికి. వాళ్ళ ఎస్టిమేషన్ కి డబుల్ అవుతుంది అన్నారు కొందరు. లక్ష అనే మాట విని నాకు కళ్ళు తిరిగాయి. తాపీ పనితో అయిపోదుగా, మిగతా పనులకి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నారు ఇంకొందరు. బుర్రలోకి ఇల్లు అనే ఒక రూపం వచ్చేక ఇక స్థిమితం పోయింది. అది 1988 జనవరి మొదటివారం. అప్పట్నుంఛీ ఊళ్ళో ఉన్న స్టేట్ బేంక్, ఆంధ్రాబేంక్, కోఆపరేటివ్ బేంకుల్లో వివరాలు కనుక్కోవడం. మధ్యలో పండగ సెలవులు. జనవరి 20 కి తెలిసింది ఏమిటంటే నాది ప్రైవేటు స్కూలు కాబట్టి ఎవరూ అప్పు ఇవ్వరు, మోహన్ ది గవర్నమెంటు ఉద్యోగం కనుక ఇస్తారు. కానీ, అతని జీతం లోంచి కట్టైపోతుందేమోనని అతను ఒప్పుకోవడం లేదు. ఆ తలనొప్పులన్నీ నాకు అనవసరం. కావాలంటే నువ్వే ఆ పాట్లన్నీ పడు అంటున్నాడు. నేను నెలనెలా ఇచ్చేస్తానని, తన పేరు మాత్రమే ఉపయోగించుకోనిమ్మనీ బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. రోజూ పేపర్లు క్షుణ్ణంగా పరిశీలించడమే పనైపోయింది లోన్ ఇచ్చే సంస్థల కోసం. హఠాత్తుగా జనవరి 23న H.D.F.C వాళ్ళ యాడ్ కన్పించింది. హైదరాబాద్ వెళ్ళాలి. వెంటనే 24కి మోహన్ కి , నాకు రిజర్వేషన్ చేయించుకున్నాం. పండక్కి వచ్చి మా అమ్మ మాయింట్లోనే ఉంది కాబట్టి ఇల్లు మా అమ్మ కి అప్పగించి గౌతమీ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరాం, మా పెద్ద తమ్ముడికి ఫోన్ చేసి చెప్పి.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.